పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : చతుర్థ స్కంధము - 1 - 55


పోతన తెలుగు భాగవతం
చతుర్థ స్కంధము

ఉపోద్ఘాతము

(1) శ్రీ విలసితధరణీతన¯ యావదన సరోజ వాసరాధిప! సిత రా¯ జీవదళనయన! నిఖిల ధ¯ రావర నుత సుగుణధామ! రాఘవరామా! (2) మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యానవైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; “అట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

స్వాయంభువు వంశ విస్తారము

(3) "జననాథ! విను విదురునకును మైత్రేయ¯ మునినాథచంద్రుఁ డిట్లనియె "మరల ¯ స్వాయంభువున కర్థి శతరూపవలనను¯ గూఁతులు మువ్వు రాకూతి దేవ¯ హూతి ప్రసూతులు నొనరఁ బ్రియవ్రతో¯ త్తానపాదులు నను తనయయుగము¯ జనియింప నం దగ్రసంభవ యైన యా¯ కూతిని సుమహిత భ్రాతృమతినిఁ (3.1) దనకు సంతాన విస్తరార్థంబు గాఁగఁ¯ బుత్రికాధర్మ మొంది యా పువ్వుఁబోఁడిఁ ¯ బ్రకటమూర్తి రుచిప్రజాపతికి నిచ్చె¯ మనువు ముదమొంది శతరూప యనుమతింప. (4) అట్లు వివాహంబైన రుచిప్రజాపతి బ్రహ్మవర్చస్వియుఁ బరిపూర్ణగుణుండును గావునఁ జిత్తైకాగ్రతంజేసి యాకూతియందు శ్రీవిష్ణుండు యజ్ఞరూపధరుం డగు పురుషుండుగను జగదీశ్వరి యగు నాదిలక్ష్మి యమ్మహాత్మునకు నిత్యానపాయిని గావునఁ దదంశంబున దక్షిణ యను కన్యకారత్నంబుగను మిథునంబు సంభవించె; నందు స్వాయంభువుండు సంతుష్టాంతరంగుం డగుచుఁ బుత్రికాపుత్రుండును, వితతతేజోధనుండును, శ్రీవిష్ణుమూర్తి రూపుండును నగు యజ్ఞునిఁ దన గృహంబునకుఁ దెచ్చి యునిచె; రుచియుఁ గామగమన యైన దక్షిణ యను కన్యకాలలామంబును దన యొద్దన నిలిపె; అంత సకలమంత్రాధిదేవత యగు శ్రీయజ్ఞుండు దనుఁ బతిఁగంగోరెడు దక్షిణ యను కన్యకం బరిణయం బయ్యె; వార లాదిమిథునంబు గావున నది నిషిద్ధంబు గాకుండె"నని చెప్పి మైత్రేయుండు వెండియు నిట్లనియె. (5) "ధీమహిత! యంత వారల¯ యామాఖ్యలు గలుగు దేవతావళి గడఁకన్¯ వేమఱు నభినందించుచు¯ నా మిథునమువలనఁ బుట్టె నతి బలయుతమై. (6) వారు తోషుండును బ్రతోషుండును సంతోషుండును భద్రుండును శాంతియు నిడస్పతియు నిధ్ముండును గవియు విభుండును వహ్నియు సుదేవుండును రోచనుండును ననం బన్నిద్దఱు సంభవించిరి; వారలు స్వాయంభువాంతరంబునం దుషితు లను దేవగణంబులై వెలసిరి; మఱియు మరీచి ప్రముఖులైన మునీశ్వరులును యజ్ఞుండును దేవేంద్రుండును మహాతేజస్సంపన్ను లయిన ప్రియవ్రతోత్తాన పాదులునుం గలిగి పుత్రపౌత్ర నప్తృవంశంబులచే వ్యాప్తంబయి యా మన్వంతరంబు పాలితంబగుచు వర్తిల్లె; మనువు ద్వితీయపుత్రి యైన దేవహూతిం గర్దమున కిచ్చి తద్వంశ విస్తారంబు గావించె నని మున్న యెఱింగించితి; వెండియు నమ్మనువు మూఁడవచూలైన ప్రసూతి యను కన్యకను బ్రహ్మపుత్రుం డగు దక్షప్రజాపతికి నిచ్చె; ఆ దక్షునకుఁ బ్రసూతివలన నుదయించిన ప్రజాపరంపరల చేత ముల్లోకంబులు విస్తృతంబు లయ్యె; మఱియుఁ గర్దమపుత్రికా సముదయంబు బ్రహ్మర్షిభార్య లగుటం జేసి వారివలనం గలిగిన సంతాన పరంపరల వివరించెద.

కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

(7) ఘనుఁడౌ మరీచికిఁ గర్దమాత్మజ యగు¯ కళ యను నంగనవలనఁ గశ్య¯ పుం డను కొడుకును బూర్ణిమ యను నాఁడు¯ బిడ్డయుఁ బుట్టిరి పేర్చి వారి¯ వలనఁ బుట్టిన ప్రజావళి పరంపరలచే¯ భువనంబు లెల్ల నాపూర్ణ మగుచు¯ జరగెను; బూర్ణిమ జన్మాంతరంబున¯ హరిపదప్రక్షాళితాంబువు లను (7.1) గంగ యను పేరఁ బుట్టిన కన్య దేవ¯ కుల్య యను దాని నొక్కతె గూఁతు నఖిల¯ విష్టపవ్యాపకుం డగు విరజుఁ డనెడి¯ తనయు నొక్కనిఁ గాంచె మోదంబుతోడ. (8) అనఘుం డత్రిమహాముని¯ యనసూయాదేవివలన నజ హరి పురసూ¯ దనుల కళాంశంబుల నం¯ దనులను మువ్వురను గాంచెఁ దద్దయుఁ బ్రీతిన్." (9) అనవుడు విదురుఁడు మైత్రే¯ యునిఁ గనుఁగొని పలికె "మునిజనోత్తమ! జగతిన్¯ జననస్థితిలయకారణు¯ లన వెలసిన పద్మగర్భ హరి హరు లెలమిన్. (10) ఏమి నిమిత్తం బత్రి మ¯ హాముని మందిరమునందు ననసూయకు ను¯ ద్దామగుణు లుదయమై"రన¯ నా మైత్రేయుండు పలికె నవ్విదురునితోన్. (11) "సుచరిత్ర! విను విధిచోదితుండై యత్రి¯ దప మాచరింపఁ గాంతా సమేతుఁ¯ డయి ఋక్షనామ కులాద్రి తటంబున¯ ఘుమఘుమారావ సంకుల విలోల¯ కల్లోల జాల సంకలిత నిర్వింధ్యా న¯ దీజల పరిపుష్ట రాజితప్ర¯ సూన గుచ్ఛస్వచ్ఛ మానితాశోక ప¯ లాశ కాంతారస్థలమున కెలమి (11.1) నరిగి యచ్చట నిర్ద్వంద్వుఁ డగుచుఁ బ్రాణ¯ నియమమున నేక పదమున నిలిచి గాలిఁ¯ దివుటఁ గ్రోలి కృశీభూతదేహుఁ డగుచుఁ¯ దపముఁ గావించె దివ్యవత్సరశతంబు. (12) ఇట్లతి ఘోరం బైన తపంబు సేయుచుఁ దన చిత్తంబున. (13) ఏ విభుఁడు జగదధీశ్వరుఁ¯ డా విభు శరణంబు సొత్తు నతఁ డాత్మసమం¯ బై వెలసిన సంతతిని ద¯ యావరమతి నిచ్చుఁగాక' యని తలఁచు నెడన్. (14) మునుకొని యత్తపోధనుని మూర్ధజమైన తపః కృశాను చే¯ తను ద్రిజగంబులుం గరఁగి తప్తము లైనను జూచి పంకజా¯ సన మురశాసనత్రిపురశాసను లచ్చటి కేఁగి రప్సరో¯ జన సుర సిద్ధ సాధ్య ముని సన్నుత భూరియశోభిరాములై. (15) అట్లు మునీంద్రు నాశ్రమంబు డాయం జను నవసరంబున. (16) అనఘతపోభిరాముఁ డగు నత్రి మునీంద్రుఁడు గాంచెఁ దప్తకాం¯ చన ఘన చంద్రికా రుచిర చారుశరీరుల హంస నాగసూ¯ దన వృషభేంద్ర వాహుల నుదారకమండలు చక్ర శూల సా¯ ధనుల విరించి విష్ణు పురదాహుల వాక్కమలాంబికేశులన్. (17) మఱియుఁ గృపావలోకన మందహాస సుందర వదనారవిందంబులు గల మహాత్ముల సందర్శించి; యమందానంద కందళిత హృదయార విందుండై సాష్టాంగ దండప్రణామంబు లాచరించి పుష్పాంజలి గావించి నిటలతట ఘటిత కరపుటుం డై దుర్నిరీక్ష్యంబైన తత్తేజోవిశేషంబు దేఱి చూడంజాలక ముకుళితనేత్రుండై తత్పదాయత్త చిత్తుం డగుచు సర్వలోక గరిష్ఠంబు లైన మృదుమధుర గంభీర భాషణంబుల నిట్లని స్తుతియించె. (18) "ప్రతి కల్పమందు సర్వప్రపంచోద్భవ¯ స్థితి వినాశంబులఁ జేయునట్టి¯ మహిత మాయాగుణమయ దేహములఁ బొల్చు¯ నజ వాసుదేవ శివాభిధాన¯ ములు గల్గు మీ పాదజలజాతములకు నే¯ నతిభక్తి వందనం బాచరింతు; ¯ నఖిల చేతన మానసాగమ్య మన నొప్పు¯ మూర్తులు గల్గు మీ మువ్వురందుఁ (18.1) బరఁగ నాచేతఁ బిలువంగఁ బడిన ధీరుఁ¯ డెవ్వఁడే నొక్కరునిఁ బిల్వ నిపుడు మీరు¯ మువ్వు రేతెంచుటకు నాదు బుద్ధి విస్మ¯ యంబు గదిరెడిఁ జెప్పరే యనఘులార! (19) అదియునుం గాక, సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తంబున ధరియించిన మహాత్ముం డొక్కరుండ” యనిన నమ్మువ్వురు విబుధశ్రేష్ఠులు నతనిం గనుంగొని సుధామధురంబు లయిన వాక్యంబుల నిట్లనిరి. (20) "విను మేము ముగుర మయ్యును¯ ననుపమమతిఁ దలఁప నేకమై యుందుము; నీ¯ మన మందు నేమి గోరితి¯ వనయము నా కోర్కి సఫల మయ్యెడుఁ జుమ్మీ. (21) మా మువ్వుర యంశంబుల¯ ధీమంతులు సుతులు పుట్టి త్రిభువనములలో¯ నీ మంగళగుణకీర్తిన్¯ శ్రీమహితము చేయఁగలరు; సిద్ధము సుమ్మీ." (22) అని మునిచంద్రుఁడు దన మన¯ మునఁ గామించిన వరంబు బుధవరులు ముదం¯ బున నొసఁగి యతనిచేఁ బూ¯ జనములఁ బరితృప్తు లగుచుఁ జనిరి యథేచ్ఛన్. (23) ఆ సుచరిత్ర దంపతు లుదంచితలీలఁ గనుంగొనంగ న¯ బ్జాసను నంశమందు నమృతాంశుఁడు, విష్ణుకళన్ సుయోగ వి¯ ద్యాసుభగుండు దత్తుఁడుఁ, బురాంతకు భూరికళాంశమందు దు¯ ర్వాసుఁడు నై జనించి రనవద్య పవిత్ర చరిత్రు లిమ్ములన్. (24) అంగిరసుఁ డనెడు మునికిఁ గు¯ లాంగన యగు శ్రద్ధ యందు నంచిత సౌంద¯ ర్యాంగులు గూఁతులు నలువురు¯ మంగళవతు లుదయమైరి మాన్యచరిత్రా! (25) వారు సినీవాలి యనఁ గు¯ హూ రాకానుమతు లనఁగ నొప్పిరి; మఱియుం¯ గోర సుత యుగము గలిగెను ¯ స్వారోచిషమనువు వేళ శస్తఖ్యాతిన్. (26) వార లెవ్వ రనిన, భగవంతు డగు నుచథ్యుండును బ్రహ్మనిష్ఠుం డగు బృహస్పతియు ననం బ్రసిద్ధి వహించిరి; పులస్త్యుండు హవిర్భుక్కను నిజభార్య యందు నగస్త్యునిం బుట్టించె; నా యగస్త్యుండు జన్మాంతరంబున జఠరాగ్ని రూపంబై ప్రవర్తించె; వెండియు నా పులస్త్యుండు విశ్రవసునిం గలిగించె; ఆ విశ్రవసునకు నిలబిల యను భార్యవలనం గుబేరుండును, గైకసి యను దానివలన రావణ కుంభకర్ణ విభీషణులునుం బుట్టిరి; పులహునకు గతి యను భార్యవలనఁ గర్మశ్రేష్ఠుండును వరీయాంసుండును సహిష్ణుండును నను మువ్వురు గొడుకులు జనియించిరి; మఱియుఁ గ్రతువునకుఁ గ్రియ యను భార్య యందు బ్రహ్మతేజంబున జ్వలించుచున్న షష్టిసహస్ర సంఖ్యలుగల వాలఖిల్యు లను మహర్షులు గలిగిరి; వశిష్ఠుం డూర్జ యను భార్య యందుఁ జిత్రకేతుండును సురోచియు విరజుండును మిత్రుండును నుల్బణుండును వసుభృద్ధ్యానుండును ద్యుమంతుండును నను సప్తఋషులను, భార్యాంతరంబున శక్తి ప్రముఖ పుత్రులనుం బుట్టించె; అథర్వుం డనువానికిఁ జిత్తి యను భార్య యందు ధృతవ్రతుండు నశ్వ శిరస్కుండు నయిన దధ్యంచుండు పుట్టె; మహాత్ముండగు భృగువు ఖ్యాతి యను పత్ని యందు ధాతయు విధాతయు నను పుత్రద్వయంబును, భగవత్పరాయణ యగు "శ్రీ"యను కన్యకం బుట్టించె; ఆ ధాతృవిధాతృలు మేరు వనువాని కూఁతు లైన యాయతి నియతు లను భార్యలవలన మృకండ ప్రాణులను కొడుకులం బుట్టించిరి: అందు మృకండునకు మార్కండేయుండును, బ్రాణునకు వేదశిరుం డను మునియుం బుట్టిరి ;భార్గవునకు నుశన యను కన్యయందుఁ గవి యనువాఁడు పుట్టె; ఇట్లు కర్దమదుహితలయిన కన్యకా నవకంబు వలనఁ గలిగిన సంతాన పరంపరలచేత సమస్తలోకంబులుఁ బరిపూర్ణంబు లయ్యె; అట్టి సద్యః పాపహరంబును శ్రేష్ఠతమంబును నైన కర్దమదౌహిత్రసంతాన ప్రకారంబు శ్రద్ధాగరిష్ఠచిత్తుండ వగు నీకుం జెప్పితి: ఇంక దక్షప్రజాపతి వంశం బెఱింగింతు వినుము.

దక్షప్రజాపతి వంశ విస్తారము

(27) వనజజునివలన భవ మం¯ దిన యా దక్షప్రజాపతికి మను నిజ నం¯ దన యగు ప్రసూతి సతి యం¯ దనఘా! పదియార్వు రుదయ మందిరి కన్యల్. (28) ఇట్లావిర్భవించిన కన్యకలందు శ్రద్ధయు, మైత్రియు, దయయు, శాంతియుఁ, దుష్టియుఁ, బుష్టియుఁ, బ్రియయుఁ, నున్నతియు, బుద్ధియు, మేధయుఁ, దితిక్షయు, హ్రీయు, మూర్తియు నను నామంబులు గల పదుమువ్వురను ధర్మరాజున కిచ్చె; ఒక్క కన్యక నగ్నిదేవునకును నొక్కతెం బితృదేవతలకును నొక్కతె జన్మమరణాది నివర్తకుం డగు నభవునకుం బెండ్లి చేసె; అంత నా ధర్ముని పత్నుల యందు శ్రద్ధవలన శ్రుతంబును, మైత్రివలనఁ బ్రసాదంబును, దయవలన నభయంబును, శాంతివలన సుఖంబునుఁ, దుష్టివలన ముదంబునుఁ, బుష్టివలన స్మయంబునుఁ, బ్రియవలన యోగంబును, నున్నతివలన దర్పంబును, బుద్ధివలన నర్థంబును, మేధవలన స్మృతియుఁ, దితిక్షవలన క్షేమంబును, హ్రీవలనఁ బ్రశ్రయంబును, మూర్తివలన సకలకల్యాణగుణోత్పత్తి స్థానభూతు లగు నరనారాయణు లను ఋషు లిద్దఱును సంభవించిరి; వారల జన్మకాలంబున. (29) గంధవాహుఁడు మందగతి ననుకూలుఁడై¯ వీచె; నల్దిక్కులు విశద మయ్యె; ¯ నఖిలలోకంబులు నానందమును బొందెఁ¯ దుములమై దేవదుందుభులు మ్రోసెఁ; ¯ గరమొప్ప జలధుల కలఁక లడంగెను¯ మించినగతిఁ బ్రవహించె నదులు; ¯ గంధర్వ కిన్నర గానముల్ వీతెంచె¯ నప్సరోజనముల నాట్యమొనరె (29.1) సురలు గురియించి రందంద విరులవాన; ¯ మునిజనంబులు సంతోషమునఁ జెలంగి¯ వినుతు లొనరించి; రవ్వేళ విశ్వ మెల్లఁ¯ బరమమంగళమై యొప్పె భవ్యచరిత! (30) ఆ సమయంబున బ్రహ్మాది దేవత లమ్మహాత్ములకడకుఁ జనుదెంచి యిట్లని స్తుతించిరి. (31) "గగనస్థలిం దోఁచు గంధర్వనగరాది¯ రూప భేదము లట్లు రూఢి మెఱసి¯ యే యాత్మయందేని యేపార మాయచే¯ నీ విశ్వ మిటు రచియింపఁబడియె¯ నట్టి యాత్మప్రకాశార్థమై మునిరూప¯ ముల ధర్ముగృహమునఁ బుట్టినట్టి¯ పరమపురుష! నీకుఁ బ్రణమిల్లెద; మదియుఁ¯ గాక యీ సృష్టి దుష్కర్మవృత్తి (31.1) జరగనీకుండు కొఱకునై సత్త్వగుణము¯ చే సృజించిన మమ్మిట్లు శ్రీనివాస¯ మైన సరసీరుహప్రభ నపహసించు¯ నీ కృపాలోకనంబుల నెమ్మిఁ జూడు." (32) అని యిట్లు దేవగణములు¯ వినుతింపఁ గృపాకటాక్షవీక్షణములచేఁ¯ గని వారు గంధమాదన¯ మున కేగిరి తండ్రి ముదము ముప్పిరిగొనఁగన్. (33) ధరణీభర ముడుపుట కా¯ నరనారాయణులు భువి జనన మనయము నొం¯ దిరి యర్జున కృష్ణాఖ్యలఁ¯ గురుయదువంశముల సత్త్వగుణయుతు లగుచున్. (34) మఱియు నగ్నిదేవునకు దక్షపుత్రియైన స్వాహాదేవి యను భార్య యందు హుతభోజనులగు పావకుండును బవమానుండును శుచియు నను మువ్వురు గొడుకులు గలిగిరి; వారివలనం బంచచత్వారింశత్సంఖ్యలం గల యగ్ను లుత్పన్నంబు లయ్యె; నిట్లు పితృపితామహ యుక్తంబుగా నేకోనపంచాశత్సంఖ్యలు గల యగ్నులు బ్రహ్మవాదులచే యజ్ఞకర్మంబులం దగ్నిదేవతాకంబు లైన యిష్టులు దత్తన్నామంబులచేతఁ జేయంబడుచుండు; ఆ యగ్ను లెవ్వరనిన నగ్నిష్వాత్తులు బర్హిషదులు సౌమ్యులు బితలు నాజ్యపులు సాగ్నులు నిరగ్నులు నన నేడు దెఱంగులై యుందురు; దాక్షాయణి యగు స్వధ యను ధర్మపత్ని యందు వారలవలన వయునయు ధారిణియు నను నిద్దఱు కన్య లుదయించి జ్ఞానవిజ్ఞానపారగ లగుచు బ్రహ్మనిష్ఠ లయి పరఁగిరి; వెండియు.

ఈశ్వర దక్షుల విరోధము

(35) దక్షప్రజాపతి తనయ యా భవుని భా¯ ర్యయు ననఁ దగు సతి యను లతాంగి¯ సతతంబుఁ బతిభక్తి సలుపు చుండియుఁ దనూ¯ జాతలాభము నందఁ జాలదయ్యె; ¯ భర్గుని దెసఁ జాలఁ బ్రతికూలుఁ డైనట్టి¯ తమ తండ్రిమీఁది రోషమునఁ జేసి¯ వలనేది తా ముగ్ధవలె నిజయోగ మా¯ ర్గంబున నాత్మదేహంబు విడిచె;" (35.1) నని మునీంద్రుఁడు వినిపింప నమ్మహాత్ముఁ¯ డైన విదురుండు మనమున నద్భుతంబు¯ గదురఁ దత్కథ విన వేడ్క గడలుకొనఁగ¯ మునివరేణ్యునిఁ జూచి యిట్లనియె మఱియు. (36) "చతురాత్మ! దుహితృవత్సలుఁడైన దక్షుండు¯ దన కూఁతు సతి ననాదరము చేసి¯ యనయంబు నఖిలచరాచర గురుఁడు ని¯ ర్వైరుండు శాంతవిగ్రహుఁడు ఘనుఁడు¯ జగముల కెల్లను జర్చింప దేవుండు¯ నంచితాత్మారాముఁ డలఘుమూర్తి¯ శీలవంతులలోన శ్రేష్ఠుండు నగునట్టి¯ భవునందు విద్వేషపడుట కేమి (36.1) కారణము? సతి దా నేమి కారణమున¯ విడువరానట్టి ప్రాణముల్ విడిచె? మఱియు ¯ శ్వశుర జామాతృ విద్వేష సరణి నాకుఁ¯ దెలియ నానతి యిమ్ము సుధీవిధేయ!" (37) అని యడిగిన నవ్విదురునిఁ¯ గనుఁగొని మైత్రేయుఁ డనియెఁ గౌతుక మొప్పన్¯ "విను మనఘ! తొల్లి బ్రహ్మలు¯ జన నుతముగఁ జేయునట్టి సత్రముఁ జూడన్. (38) సరసిజగర్భ యోగిజన శర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు¯ క్పరమ ఋషిప్రజాపతులు భక్తిఁ మెయిం జనుదెంచి యుండ న¯ త్తరణిసమాన తేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సదస్యు లా¯ దరమున లేచి; రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్. (39) చనుదెంచిన యా దక్షుఁడు¯ వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్¯ తన కిచ్చిన పూజలు గై¯ కొని యర్హాసనమునందుఁ గూర్చుండి తగన్. (40) తన్నుఁ బొడగని సభ్యు లందఱును లేవ¯ నాసనము దిగనట్టి పురారివలను¯ గన్నుఁ గొనలను విస్ఫులింగములు సెదరఁ¯ జూచి యిట్లను రోషవిస్ఫురణ మెఱయ. (41) "వినుఁడు మీరలు రొదమాని విబుధ ముని హు¯ తాశనాది సురోత్తములార! మోహ¯ మత్సరోక్తులు గావు నా మాట"లనుచు¯ వారి కందఱ కా పురవైరిఁ జూపి. (42) "పరికింప నితఁడు దిక్పాలయశోహాని¯ కరుఁ డీ క్రియాశూన్యపరుని చేతఁ¯ గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషి¯ తం బయ్యె; నెన్న గతత్రపుండు¯ మహితసావిత్రీ సమానను సాధ్వి న¯ స్మత్తనూజను మృగశాబనేత్ర¯ సకల భూమీసుర జన సమక్షమున మ¯ ర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ (42.1) జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మఁ¯ దలఁచి ప్రత్యుద్గమాభివందనము లెలమి¯ నడపకుండిన మాననీ; నన్నుఁ గన్న¯ నోరిమాటకుఁ దన కేమి గోరువోయె. (43) అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన¯ హీనుఁడు మర్యాదలేని వాఁడు¯ మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం¯ బరుఁడు భూతప్రేత పరివృతుండు¯ దామస ప్రమథ భూతములకు నాథుండు¯ భూతిలిప్తుం డస్థిభూషణుండు¯ నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట¯ హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ ని (43.1) కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి¯ యయిన యితనికి శివనాముఁ డను ప్రవాద¯ మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి¯ యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటులు. (44) ఇతనికి నస్మత్తనూజను విధిప్రేరితుండనై యిచ్చితి.” (45) అని యిట్టులు ప్రతికూల వ¯ చనములు దక్షుండు పలికి శపియింతును శ¯ ర్వుని నని జలములు గొని కర¯ మున నిలిపి యిటులనె రోషమున ననఘాత్మా! (46) "ఇతఁ డింద్రోపేంద్ర పరీ¯ వృతుఁడై మఖసమయమున హవిర్భాగము దే¯ వతలం గూడఁగ మహిత ని¯ యతిఁ బొందక యుండుఁగాక యని శపియించెన్." (47) ఇట్లు దక్షుండు పల్కిన గర్హితవాక్యంబులు వినిందితంబు లగుం గాని యాథార్థ్యంబున వాస్తవంబు లగుచు భగవంతుండగు రుద్రునందు ననిందితంబులై గాక స్తుతి రూపంబున నొప్పెఁ; దదనంతరంబ రుద్రునకు శాపం బిచ్చిన కారణంబున దక్షుండు సదస్యముఖ్యులచే 'నకృత్యం' బని నిషేధింపబడి ప్రవృద్ధంబయిన క్రోధంబుతోడ నిజనివాసంబునకుం జనియె; అంత గిరిశానుచరాగ్రేసరుం డగు నందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపియించిన శాపంబు, నతనిఁ బల్కిన యనర్హ వాక్యంబులును విని కోపారుణితలోచనుండై యిట్లను “నీ దక్షుండు మర్త్యశరీరంబు శ్రేష్ఠంబు గాఁ దలఁచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శియై యపరాధంబుఁ గావించె; ఇట్టి మూఢాత్ముండు దత్త్వ విముఖుం డగు; మఱియుం గూటధర్మంబు లయిన నివాసంబుల గ్రామ్యసుఖకాంక్షలం జేసి సక్తుండై యర్థవాదంబు లైన వేదంబులచేత నష్టమనీషం గలిగి కర్మతంత్రంబు విస్తృతంబు చేయు; వెండియు దేహాదికంబు లుపాదేయంబులు గాఁ దలఁచుచు బుద్ధిచేత నాత్మతత్త్వంబు మఱచి వర్తించుచుఁ బశుప్రాయుండై స్త్రీకాముండు నగు; నిదియునుం గాక దక్షుం డచిరకాలంబున మేషముఖుం డగు"నని మఱియు. (48) "అనయంబుం దన మానసంబున నవిద్యన్ ముఖ్యతత్త్వంబు గాఁ¯ గని గౌరీశుఁ దిరస్కరించిన యసత్కర్మాత్ము నీ దక్షుని¯ న్ననువర్తించినవాఁరు సంసరణకర్మారంభుఁలై నిచ్చలున్¯ జననం బందుచుఁ జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్. (49) అదియునుం గాక యీ హరద్వేషులైన ద్విజు లర్థవాద బహుళంబు లైన వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబుచేత విమోహిత మనస్కులై కర్మాసక్తు లగుదురు; మఱియును భక్ష్యాభక్ష్య విచారశూన్యులై దేహాది పోషణంబుకొఱకు ధరియింపఁ బడిన విద్యా తపోవ్రతంబులు గలవారలై ధన దేహేంద్రియంబుల యందుఁ బ్రీతిం బొంది యాచకులై విహరింతురు;” అని నందికేశ్వరుండు బ్రాహ్మణజనంబుల శపియించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపి యింపం బూని యిట్లనియె. (50) "వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు¯ వారి కనుకూలు రగుదు రెవ్వారు వారు¯ నట్టి సచ్ఛాస్త్ర పరిపంథు లైన వారు¯ నవనిఁ బాషండు లయ్యెద"రని శపించె. (51) "సకల వర్ణాశ్రమాచార హేతువు, లోక¯ మునకు మంగళమార్గమును, సనాత¯ నముఁ, బూర్వఋషిసమ్మతము, జనార్దనమూల¯ మును, నిత్యమును, శుద్ధమును, శివంబు, ¯ నార్యపథానుగం బగు వేదమును విప్ర¯ గణము నిందించిన కారణమున¯ నే శివదీక్ష యందేని మధ్యమ పూజ్యుఁ¯ డై భూతపతి దైవ మగుచు నుండు (51.1) నందు మీరలు భస్మజటాస్థిధార¯ ణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు¯ లై నశింతురు పాషండు లగుచు"ననుచు¯ శాప మొనరించె నా ద్విజసత్తముండు. (52) ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గల వారలగుటం జేసి నాశంబు నొందరైరి; అట్టి యెడ విమనస్కుం డగుచు ననుచర సమేతుం డై భవుండు చనియె నంత. (53) అనఘాత్మ! యే యజ్ఞమందు సర్వశ్రేష్ఠుఁ¯ డగు హరి సంపూజ్యుఁడై వెలుంగు¯ నట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున స¯ హస్ర వత్సరములు నజుఁ డొనర్చెఁ¯ గరమొప్ప నమర గంగాయమునా సంగ¯ మావనిఁ గలుగు ప్రయాగ యందు¯ నవభృథస్నానంబు లతిభక్తిఁ గావించి¯ గతకల్మషాత్ములై ఘనత కెక్కి (53.1) తగ నిజాశ్రమభూములఁ దలఁచి వార¯ లందఱును వేడ్కతోఁ జని రనుచు"విదురు¯ నకును మైత్రేయుఁ డను మునినాయకుండు¯ నెఱుఁగ వినిపించి వెండియు నిట్టు లనియె. (54) “అంత శ్వశురుండగు దక్షునకు జామాత యైన భర్గునకు నన్యోన్య విరోధంబు పెరుఁగుచుండ నతిచిరంబగు కాలం బరిగె; నంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది యైనను శర్వుతోడి పూర్వ విరోధంబునను బరమేష్ఠి కృతంబైన సకల ప్రజాపతి విభుత్వగర్వంబు ననుం జేసి బ్రహ్మనిష్ఠులగు నీశ్వరాదుల ధిక్కరించి యరుద్రకంబుగా వాజపేయ సవనంబు గావించి తదనంతరంబ బృహస్పతిసవన నామకం బైన మఖంబు చేయ నుపక్రమించిన నచ్చటికిం గ్రమంబున. (55) కర మనురక్తి నమ్మఖముఁ గన్గొను వేడుక తొంగలింపఁగాఁ¯ బరమమునిప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్ సభార్యులై¯ పరువడి వచ్చి యందఱు శుభస్థితి దీవన లిచ్చి దక్షుచేఁ¯ బొరిఁబొరి నచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్.