భాగవతము పారాయణ : తృతీయ 991 - సంపూర్ణం
గర్భసంభవ ప్రకారంబు
(991) "కైకొని మఱి పూర్వకర్మానుగుణమున¯ శశ్వత్ప్రకాశకుం డీశ్వరుండు¯ ఘటకుండు గావునఁ గ్రమ్మఱ జీవుండు¯ దేహసంబంధంబుఁ దివిరి తాల్ప¯ దొరఁకొని పురుషరేతోబిందుసంబంధి¯ యై వధూగర్భంబు నందుఁ జొచ్చి¯ కైకొని యొకరాత్రి గలిలంబు పంచరా¯ త్రముల బుద్బుదమును దశమ దివస (991.1) మందు గర్కంధు వంత యౌ నంతమీఁదఁ¯ బేశి యగు నంతమీఁదటఁ బేర్చి యండ¯ కల్ప మగు నొక్క నెల మస్తకమును మాస¯ యమళమైనను గరచరణములుఁ బొడము (992) మఱియు; మాసత్రయంబున నఖ రోమాస్థి చర్మంబులు లింగచ్ఛిద్రంబులు గలిగి నాలవ మాసంబున సప్తధాతువులును బంచమ మాసంబున క్షుత్తృష్ణలును గలిగి షష్ట మాసంబున మావిచేతం బొదువం బడి తల్లి కుక్షిని దక్షిణభాగంబునం దిరుగుచు మాతృభుక్తాన్న పానంబులవలనఁ దృప్తి బొందుచు నేధమానధాతువులు గల్గి జంతు సంకీర్ణంబగు విణ్మూత్రగర్తం బందుఁ దిరుగుచుఁ క్రిమిభక్షిత శరీరుండై మూర్ఛలం బొందుచుఁ దల్లి భక్షించిన కటుతిక్తోష్ణ లవణ క్షారామ్లాద్యుల్బణంబు లైన రసంబులచేత బరితప్తాంగుం డగుచు జరాయువునఁ గప్పంబడి బహిప్రదేశంబు నందు నాత్రంబులచేత బద్ధుండై కుక్షి యందు శిరంబు మోపికొని భుగ్నం బైన పృష్టగ్రీవోదరుండై స్వాంగ చలనంబు నందు నసమర్దుం డగుచుఁ బంజరంబందుండు శకుంతంబు చందంబున నుండి దైవకృతంబైన జ్ఞానంబునం బూర్వజన్మ దుష్కృతంబుల దలంచుచు దీర్ఘోచ్ఛ్వాసంబు సేయుచు నే సుఖలేశంబునుం బొందక వర్తించు; అంత నేడవ నెల యందు లబ్ధజ్ఞానుండై చేష్టలు గలిగి విట్క్రిమి సోదరుండై యొక్క దిక్కున నుండక సంచరించుచుం బ్రసూతి మారుతంబులచేత నతి వేపితుం డగుచు యోచమానుండు దేహాత్మదర్శియుఁ బునర్గర్భ వాసంబునకు భీతుండు నగుచు బంధనభూతం బగు సప్తధాతువులచే బద్ధుం డై కృతాంజలి పుటుండు దీనవదనుండు నై జీవుండు దా నెవ్వనిచే నుదరంబున వసియింపఁబడె నట్టి సర్వేశ్వరుని నిట్లని స్తుతియించు. (993) అనయమును భువనరక్షణ¯ మునకై స్వేచ్ఛానురూపమునఁ బుట్టెడి వి¯ ష్ణుని భయవిరహిత మగు పద¯ వనజయుగం బర్థిఁ గొల్తు వారని భక్తిన్. (994) అదియునుం గాక; పంచభూత విరహితుఁ డయ్యుం బంచభూత విరచితం బైన శరీరంబు నందుఁ గప్పంబడి యింద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుం డైన నేను. (995) ఎవ్వఁడు నిఖిల భూతేంద్రియమయ మగు¯ మాయావలంబున మహితకర్మ¯ బద్ధుఁడై వర్తించు పగిది దందహ్యమా¯ నంబగు జీవ చిత్తంబు నందు¯ నవికారమై శుద్ధమై యఖండజ్ఞాన¯ మున నుండు వానికి ముఖ్యచరితు¯ నకు నకుంఠితశౌర్యునకుఁ పరంజ్యోతికి¯ సర్వజ్ఞునకుఁ గృపాశాంతమతికిఁ (995.1) గడఁగియుఁ బ్రకృతిపురుషుల కంటెఁ బరముఁ¯ డయిన వానికి మ్రొక్కెద నస్మదీయ¯ దుర్భరోదగ్ర భీకర గర్భనరక¯ వేదనలఁ జూచి శాంతిఁ గావించు కొఱకు." (996) అనవుడు సుతునకు జనని యిట్లనుఁ "దగ¯ మహితాత్మ! యెవ్వని మహిమచేత¯ ఘనమోహులై గుణకర్మనిమిత్త సాం¯ సారికమార్గ సంచారములను¯ ధృతిసెడి యలసి యేదిక్కు నెఱుంగక¯ హరిపాద ధ్యానంబు నాత్మ మఱచి¯ యుండు వారలకు నే యుక్తియు నమ్మహా¯ పురుషు ననుగ్రహబుద్ధి లేక (996.1) తద్గుణధ్యాన తన్మూర్తి దర్శనములు¯ గోచరించుట యెట్లు నాకునుఁ బ్రబోధ¯ కలితముగఁ బల్కు"మనవుడుఁ గపిలుఁ డనియె¯ నంబతోడను సుగుణకదంబతోడ. (997) "అట్టి యీశ్వరుండు గాలత్రయంబు నందును జంగమ స్థావరాంత ర్యామి యగుటంజేసి జీవకర్మ మార్గంబులం బ్రవర్తించు వారు తాపత్రయ నివారణంబు కొఱకు భజియింతురు"అని చెప్పి మఱియు నిట్లనియె. (998) "జనయిత్రి! గర్భ మందును¯ ఘన క్రిమి విణ్మూత్ర రక్త గర్తము లోనన్¯ మునుఁగుచు జఠరాగ్నిని దిన¯ దినమును సంతప్యమానదేహుం డగుచున్. (999) దీనవదనుఁ డగుచు దేహి యీ దేహంబు¯ వలన నిర్గమింపఁ దలఁచి చనిన¯ నెలల నెన్నికొనుచు నెలకొని గర్భంబు ¯ వలన వెడలఁ ద్రోయువారు గలరె?' (1000) అని తలంచుచు "దీనరక్షకుం డయిన పుండరీకాక్షుండు దన్ను గర్భనరకంబువలన విముక్తునిం జేయ నమ్మహాత్మునికిఁ బ్రత్యుపకారంబు సేయలేమికి నంజలి మాత్రంబు సేయందగునట్టి జీవుండ నైన నేను శమదమాది యుక్తం బైన శరీరంబు నందు విజ్ఞానదీపాంకురంబునం బురాణపురుషు నిరీక్షింతును"అని మఱియు (1001) "నెలకొని బహు దుఃఖములకు నాలయ మైన¯ యీ గర్భనరకము నేను వెడలఁ¯ జాల బహిఃప్రదేశమునకు వచ్చిన¯ ననుపమ దేవమాయా విమోహి¯ తాత్ముండనై ఘోరమైనట్టి సంసార¯ చక్ర మందును బరిశ్రమణశీలి¯ నై యుండవలయుఁ దా నదిగాక గర్భంబు¯ నందుండు శోకంబు నపనయించి (1001.1) యాత్మ కనయంబు సారథి యైన యట్టి¯ రుచిర విజ్ఞానమునఁ దమోరూపమైన¯ భూరి సంసారసాగరోత్తారణంబు¯ సేసి యీ యాత్మ నరసి రక్షించుకొందు. (1002) మఱియును. (1003) పరఁగుచు నున్న దుర్వ్యసనభాజనమై ఘన దుఃఖమూలమై¯ యరయఁగ బెక్కుతూంట్లు గలదై క్రిమిసంభవ మైనయట్టి దు¯ స్తర బహు గర్భవాసముల సంగతి మాన్పుటకై భజించెదన్¯ సరసిజనాభ భూరి భవసాగరతారక పాదపద్మముల్." (1004) అని కృతనిశ్చయుఁ డయి యే¯ చిన విమలజ్ఞాని యగుచు జీవుఁడు గర్భం¯ బున వెడల నొల్లకుండం¯ జనియెడు నవమాసములును జననీ! యంతన్. (1005) దశమమాసంబున వాని నధోముఖుం గావించిన నుచ్ఛ్వాస నిశ్శ్వాసంబులు లేక ఘన దుఃఖభాజనుండు విగత జ్ఞానుండు రక్తదిగ్భాగుండు నై విష్టాస్థక్రిమియుం బోలె నేలంబడి యేడ్చుచు జ్ఞానహీనుం డై జడుడునుం బోలె నుండి; యంత నిజ భావానభిజ్ఞు లగు నితరుల వలన వృద్ధిం బొందుచు నభిమతార్థంబులం జెప్పనేరక; యనేక కీటసంకులం బయిన పర్యంకంబు నందు శయానుండై; యవయవంబులు గండూయమానంబు లైనఁ గోఁకనేరక యాసనోత్థాన గమనంబుల నశక్తుండై; తన శరీరచర్మంబు మశక మత్కుణ మక్షికాదులు పొడువ గ్రిములచే వ్యధంబడు క్రిమియుంబోలె దోదూయమానుండై రోదనంబు సేయుచు విగతజ్ఞానుండై మెలంగుచు; శైశవంబునం దత్త త్క్రియానుభవంబుఁ గావించి పౌగండ వయస్సునఁ దదనురూపంబు లగు నధ్యయనాది దుఃఖంబు లనుభవించి; తదనంతరంబ యౌవనంబు ప్రాప్తం బైన నభిమతార్థ ఫలప్రాప్తికి సాహసపూర్వకంబు లగు వృథాగ్రహంబులు సేయుచుఁ గాముకుండై; పంచమహాభూతారబ్దం బగు దేహం బందుఁ బెక్కుమాఱు లహంకార మమకారంబులం జేయుచుఁ దదర్థంబులైన కర్మంబు లాచరించుచు సంసారబద్ధు డగచు దుష్పురుష సంగమంబున శిశ్నోదరపరాయణుండై వర్తించుచు నజ్ఞానంబునం జేసి వర్దిష్యమాన రోషుం డగుచుఁ; దత్ఫలంబు లగు దుఃఖంబు లనుభవించుచుఁ గాముకుండై నిజనాశంబునకు హేతువు లగు కర్మంబులం బ్రవర్తించు చుండు; మఱియును. (1006) జనయిత్రి! సత్యంబు శౌచంబు దయయును¯ ధృతియు మౌనంబు బుద్ధియును సిగ్గు ¯ క్షమయును యశమును శమమును దమమును¯ మొదలుగాగల గుణంబులు నశించు¯ జనుల కసత్సంగమున నని యెఱిఁగించి¯ > వెండియు నిట్లను వినుము, మూఢ¯ హృదయులు శాంతి విహీనులు దేహాత్మ¯ బుద్ధులు నంగనా మోహపాశ (1006.1) బద్ధ కేళీమృగంబుల పగిదిఁ దగిలి¯ పరవశస్వాంతముల శోచ్యభావు లైన¯ వారి సంగతి విడువంగ వలయు నందు¯ నంగనాసంగమము దోష మండ్రు గాన. (1007) దీని కొక్క యితిహాసంబు గలదు; 'తొల్లి యొక్కనాడు ప్రజాపతి దన కూఁతు రయిన భారతి మృగీరూపధారిణి యై యుండం జూచి తదీయ రూపరేఖా విలాసంబులకు నోటువడి వివశీకృతాంతరంగుండును విగత త్రపుండును నై తానును మృగరూపంబు నొంది తదనుధావనంబు హేయం బని తలంపక ప్రవర్తించెం;' గావున నంగనాసంగమంబు వలవ; దస్మదీయ నాభికమల సంజాత చతుర్ముఖ నిర్మిత మరీచ్యాద్యుద్భూత కశ్యపాది కల్పిత దేవ మనుష్యాదు లందు మాయా బలంబునం గామినీజన మధ్యంబున విఖండిత మనస్కుండు గాకుండఁ బుండరీకాక్షుండైన నారాయణఋషికిం దక్క నన్యులకు నెవ్వరికిం దీరదు"అని వెండియు నిట్లనియె. (1008) రూఢి నా మాయ గామినీరూపమునను¯ బురుషులకు నెల్ల మోహంబుఁ బొందజేయుఁ¯ గాన పురుషులు సతులసంగంబు మాని¯ యోగవృత్తిఁ జరించుచు నుండవలయు. (1009) ధీరతతో మత్పదసర¯ సీరుహసేవానురక్తిఁ జెందినవారల్¯ నారీసంగము నిరయ¯ ద్వారముగా మనము లందు దలఁపుదు రెపుడున్. (1010) హరిమాయా విరచితమై¯ తరుణీరూపంబుఁ దాల్చి ధరఁ బర్విన బం¯ ధుర తృణపరివృత కూపము¯ కరణి నదియు మృత్యురూపకం బగు మఱియున్. (1011) ధన పశు మిత్ర పుత్ర వనితా గృహకారణభూత మైన యీ¯ తనువున నున్న జీవుఁడు పదంపడి యట్టి శరీర మెత్తి తా¯ ననుగతమైన కర్మఫల మందకపోవఁగరాదు మింటఁ బో¯ యిన భువిఁ దూరినన్ దిశల కేగిన నెచ్చట నైన డాగిఁనన్. (1012) అట్టి పురుషరూపంబు నొందిన జీవుండు నిరంతర స్త్రీసంగంబుచే విత్తాపత్య గృహాదిప్రదం బగు స్త్రీత్వంబు నొందు; ఈ క్రమంబున నంగనా రూపుం డగు జీవుండు మన్మాయచేఁ బురుషరూపంబు నొంది ధనాదిప్రదుం డగు భర్తను నాత్మబంధకారణం బగు మృత్యువునుగ నెఱుంగ వలయు; మఱియు జీవోపాధిభూతం బగు లింగదేహంబుచే స్వావాస భూతలోకంబున నుండి లోకాంతరంబు నొందుచుం బ్రారబ్ద కర్మఫలంబుల ననుభవించుచు; మరలం గర్మాదులందాసక్తుఁ డగుచు మృగయుండు గాననంబున ననుకూల సుఖప్రదుం డైనను మృగంబునకు మృత్యు వగు చందంబున జీవుండు భూతేంద్రియ మనోమయం బైన దేహంబు గలిగి యుండు; అట్టి దేహనిరోధంబె మరణంబు; ఆవిర్భావంబె జన్మంబునుం; గాన సకల వస్తువిషయ జ్ఞానంబు గలుగుటకు జీవునకు సాధనంబు చక్షురింద్రయం బగు ద్రష్టదర్శనీయ యోగ్యతాప్రకారంబున జీవునకు జన్మమరణంబులు లేవు; గావున భయకార్పణ్యంబులు విడిచి సంభ్రమంబు మాని జీవప్రకారంబు జ్ఞానంబునం దెలిసి ధీరుండై ముక్తసంగుం డగుచు యోగ వైరాగ్యయుక్తం బైన సమ్యగ్జ్ఞానంబున మాయావిరచితం బైన లోకంబున దేహాదులం దాసక్తి మాని వర్తింప వలయు"నని చెప్పి; వెండియు నిట్లనియె.
చంద్రసూర్యపితృ మార్గంబు
(1013) "గృహ మందు వర్తించు గృహమేధు లగువారు¯ మహిత ధర్మార్థకామముల కొఱకు¯ సంప్రీతు లగుచుఁ దత్సాధనానుష్ఠాన¯ నిరతులై వేదనిర్ణీత భూరి¯ భగవత్సుధర్మ తద్భక్తి పరాఙ్ముఖు¯ లై దేవగణముల ననుదినంబు¯ భజియించుచును భక్తిఁ బైతృక కర్మముల్¯ సేయుచు నెప్పుడు శిష్టచరితు (1013.1) లగుచుఁ దగ దేవ పితృ సువ్రతాఢ్యు లయిన¯ కామ్యచిత్తులు ధూమాదిగతులఁ జంద్ర¯ లోకమును జెంది పుణ్యంబు లుప్త మయిన¯ మరలి వత్తురు భువికి జన్మంబు నొంద. (1014) అదియునుం గాక. (1015) ప్రవిమలానంత భోగితల్పంబు నందు¯ యోగనిద్రాళువై హరి యున్న వేళ¯ నఖిల లోకంబులును విలయంబు నొందు¯ నట్టి సర్వేశ్వరునిగూర్చి యలఘుమతులు. (1016) పరికింపన్ నిజభక్తి యుక్తిగరిమం బాటిల్లు పంకేరుహో¯ దరవిన్యస్త సమస్త ధర్మముల శాంతస్వాంతులై సంగముం¯ బరివర్జించి విశుద్ధచిత్తు లగుచుం బంకేజపత్రేక్షణే¯ తర ధర్మైక నివృత్తులై సతతమున్ దైత్యారిఁ జింతించుచున్. (1017) మఱియు, నహంకార మమకార శూన్యులై¯ యర్థి వర్తించుచు నర్చిరాది¯ మార్గగతుండును మహనీయచరితుండు¯ విశ్వతోముఖుఁడును విమలయశుఁడు¯ జగదుద్భవస్థానసంహారకారణుం¯ డవ్యయుం డజుఁడుఁ బరాపరుండుఁ¯ బురుషోత్తముఁడు నవపుండరీకాక్షుండు¯ నైన సర్వేశ్వరు నందు బొంది (1017.1) మానితాపునరావృత్తి మార్గమయిన ¯ ప్రవిమలానంద తేజోవిరాజమాన¯ దివ్యపదమున సుఖియించు ధీరమతులు¯ మరలిరారెన్నఁటికిని జన్మములఁ బొంద (1018) మఱియుఁ, బరమేశ్వరదృష్టిచే హిరణ్యగర్భు నుపాసించువారు సత్యలోకంబున ద్విపరార్థావసానం బగు ప్రళయంబు దనుకఁ బరుండగు చతురాననుం బరమాత్మరూపంబున ధ్యానంబు సేయుచు నుండి పృథి వ్యాప్తేజోవాయ్వాకాశ మానసేంద్రియ శబ్దాది భూతాదుల తోడం గూడ లోకంబును బ్రకృతి యందు లీనంబుసేయ సర్వేశ్వరుండు సకల సంహర్త యగు సమయంబున గతాభిమానంబులు గలిగి బ్రహ్మలోకవాసు లగు నాత్మలు బ్రహ్మతోడం గూడి పరమానందరూపుండును సర్వోత్కృష్టుండును నగు పురాణపురుషుం బొందుదురు; కావున నీవు సర్వభూత హృదయపద్మ నివాసుండును శ్రుతానుభావుండును నిష్కళంకుడును నిరంజనుండును నిర్ద్వంద్వుండును నగు పురుషుని భావంబుచే శరణంబు నొందు"మని చెప్పి మఱియు నిట్లనియె. (1019) "సకలస్థావర జంగమప్రతతికిం జర్చింపఁ దా నాఢ్యుఁడై¯ యకలంకశ్రుతిగర్భుఁడుం బరముఁడున్నైనట్టి యీశుండు సే¯ వకయోగీంద్రకుమారసిద్ధమునిదేవశ్రేణియోగప్రవ¯ ర్తకమై తన్ను భజింపఁజూపు సగుణబ్రహ్మంబు లీలాగతిన్ (1020) అట్టి సర్వేశ్వరుం డయ్యయి కాలంబు¯ లందును దద్గుణ వ్యతికరమున¯ జనియించు చుండు నీ చాడ్పున ఋషిదేవ¯ గణములు దమతమ కర్మనిర్మి¯ తైశ్వర్య పారమేష్ఠ్యము లందుఁ బురుషత్వ¯ మునఁబొంది యధికారములు వహించి¯ వర్తించి క్రమ్మఱ వత్తురు మఱికొంద¯ ఱారూఢకర్మానుసార మైన (1020.1) మనములను జాల గలిగి ధర్మముల యందు ¯ శ్రద్ధతోఁ గూడి యప్రతిసిద్ధమైన¯ నిత్యనైమిత్తికాచార నిపుణు లగుచుఁ¯ దగి రజోగుణ కలిత చిత్తములు గలిగి. (1021) సకాములై యింద్రియజయంబు లేక పితృగణంబుల నెల్లప్పుడుఁ బూజించుచు గృహంబుల యందు వర్తించి హరిపరాఙ్ముఖు లగు వారు త్రైవర్గిక పురుషు లని చెప్పంబడుదురు. (1022) వినుతగుణోత్తరుండు నురువిక్రముఁ డైన హరిన్ భజించి త¯ న్మనన లసత్కథామృతము మానుగఁ గ్రోలుట మాని దుష్కథల్¯ విని ముద మందుచుందురు వివేకవిహీనత నూరఁబంది యా¯ త్మను మధురాజ్యభక్ష్యములు మాని పురీషము కేగు చాడ్పునన్. (1023) అలవడ ధూమమార్గగతులై పితృలోకముఁ బొంది పుణ్యముం¯ బొలిసినవారు దొంటి తమ పుత్రులకుం దగఁ దాము పుట్టి వి¯ హ్వలమతి గర్భగోళపతనాది పరేతధరాగతాంతమై¯ వెలసిన కర్మ మిం దనుభవింతురు గావున నీవు భామినీ! (1024) విను, సర్వ భావములఁ బర¯ ముని ననఘు ననంతు నీశుఁ బురుషోత్తము స¯ న్మనమున భజియింపుము ముద¯ మున బునరావృత్తి లేని ముక్తి లభించున్." (1025) అనిచెప్పి; వెండియు నిట్లనియె "భగవంతుం డగు వాసుదేవుని యందు బ్రయుక్తం బగు భక్తియోగంబు బ్రహ్మసాక్షాత్కార సాధనంబు లగు వైరాగ్య జ్ఞానంబులం జేయు; అట్టి భగవద్భక్తి యుక్తం బైన చిత్తం బింద్రియవృత్తులచే సమంబు లగు నర్థంబు లందు వైషమ్యంబును బ్రియాప్రియంబులును లేక నిస్సంగంబు సమదర్శనంబు హేయోపాదేయ విరహితంబునై యారూఢంబైన యాత్మపదంబు నాత్మచేఁ జూచుచుండు జ్ఞానపురుషుండును బరబ్రహ్మంబును బరమాత్ముండును నీశ్వరుండును నగు పరమపురుషుం డేకరూపంబు గలిగి యుండియు దృశ్యద్రష్టృ కరణంబులచేతం బృథగ్భావంబు బొందుచుండు; ఇదియ యోగికి సమగ్రం బగు యోగంబునం జేసి ప్రాప్యంబగు ఫలంబు; కావున విషయ విముఖంబు లగు నింద్రియంబులచేత జ్ఞానరూపంబును హేయగుణ రహితంబును నగు బ్రహ్మంబు మనోవిభ్రాంతిం జేసి శబ్దాది ధర్మం బగు నర్థరూపంబునం దోఁచు; అది యెట్టు లర్థాకారంబునం దోఁచు నని యడిగితివేని నహంకారంబు గుణరూపంబునం జేసి త్రివిధంబును భూతరూపంబునం బంచవిధంబును నింద్రియరూపంబున నేకాదశవిధంబును నై యుండు; జీవరూపుం డగు విరాట్పురుషుండు జీవవిగ్రహం బైన యండం బగు జగంబునం దోఁచుచుండు; దీని శ్రద్ధాయుక్తం బయిన భక్తిచేత యోగాభ్యాసంబునం జేసి సమాహితమనస్కుం డై నిస్సంగత్వంబున విరక్తుం డైనవాడు పొడగనుచుండు; అది యంతయు బుధజనపూజనీయ చరిత్రవు గావున నీకుం జెప్పితి; సర్వ యోగ సంప్రాప్యుం డగు నిర్గుణుండు భగవంతుం డని చెప్పిన జ్ఞానయోగంబును మదీయభక్తి యోగంబును నను రెండు నొకటియ యింద్రియంబులు భిన్నరూపంబులు గావున నేకరూపం బయిన యర్థం బనేక విధంబు లగు నట్లేకం బగు బ్రహ్మం బనేక విధంబులుగఁ దోఁచు; మఱియును. (1026) అంబ! నారాయణుం డఖిలశాస్త్రములను¯ సమధికానుష్ఠిత సవన తీర్థ¯ దర్శన జప తపోధ్యయన యోగక్రియా¯ దానకర్మంబులఁ గానఁబడక¯ యేచిన మనము బాహ్యేంద్రియంబుల గెల్చి¯ సకల కర్మత్యాగసరణి నొప్పి¯ తలకొని యాత్మతత్త్వజ్ఞానమున మించి¯ యుడుగక వైరాగ్యయుక్తిఁ దనరి (1026.1) మహిత ఫలసంగరహిత ధర్మమునఁ దనరు¯ నట్టి పురుషుండు దలపోయ నఖిల హేయ¯ గుణములనుఁ బాసి కల్యాణగుణ విశిష్టుఁ¯ డైన హరి నొందుఁ బరమాత్ము ననఘుఁ డగుచు (1027) అదిగావున, నీకుం జతుర్విధ భక్తియోగప్రకారంబుఁ దేటపడఁ నెఱింగించితి; అదియునుం గాక, కామరూప యగు మదీయ గతి జంతువుల యందు నుత్పత్తి వినాశ రూపంబుల నుండు నవిద్యా కర్మ నిర్మితంబు లైన జీవునిగతు లనేక ప్రకారంబులై యుండు; అదియు జీవాత్మ వాని యందుం బ్రవర్తించి యాత్మగతి యిట్టిదని యెఱుంగక యుండు"నని చెప్పి, మఱియు నిట్లనియె "ఇట్టి యతి రహస్యం బగు సాంఖ్యయోగ ప్రకారంబు ఖలునకు నవినీతునకు జడునకు దురాచారునకు డాంబికునకు నింద్రియలోలునకుఁ బుత్ర దారాగారాద్యత్యంతాసక్త చిత్తునకు భగవద్భక్తిహీనునకు విష్ణుదాసుల యందు ద్వేషపడు వానికి నుపదేశింప వలవదు; శ్రద్ధాసంపన్నుండును, భక్తుండును, వినీతుండును, నసూయారహితుండును, సర్వభూత మిత్రుండును, శుశ్రూషాభిరతుండును, బాహ్యార్థజాత విరక్తుండును, శాంతచిత్తుండును, నిర్మత్సరుండును, శుద్ధాత్ముండును, మద్భక్తుండును, నగు నధికారికి నుపదేశింప నర్హంబగు; ఈ యుపాఖ్యానం బే పురుషుండేనిఁ బతివ్రత యగు నుత్తమాంగన యేని శ్రద్ధాభక్తులు గలిగి మదర్పితచిత్తంబునన్ వినుఁ బఠియించు నట్టి పుణ్యాత్ములు మదీయ దివ్యస్వరూపంబుఁ బ్రాపింతు"రని చెప్పెను"అని మైత్రేయుండు విదురునకు వెండియు నిట్లనియె "ఈ ప్రకారంబునం గర్దమదయిత యైన దేవహూతి గపిలుని వచనంబులు విని నిర్ముక్తమోహ పటల యగుచు సాష్టాంగ దండప్రణామంబు లాచరించి తత్త్వవిషయాంకిత సాంఖ్యజ్ఞానప్రవర్తకం బగు స్తోత్రంబుసేయ నుపక్రమించి కపిలున కిట్లనియె. (1028) "అనయంబు విను, మింద్రియార్థ మనోమయం¯ బును భూతచయ మయంబును నశేష¯ భూరి జగద్బీజభూతంబును గుణప్ర¯ వాహ కారణమును వలనుమెఱయు¯ నారాయణాభిఖ్యనాఁ గల భవదీయ¯ దివ్యమంగళమూర్తిఁ దేజరిల్లు¯ చారు భవద్గర్భసంజాతుఁ డగునట్టి¯ కమలగర్భుండు సాక్షాత్కరింప (1028.1) లేక మనమునఁ గనియె ననేక శక్తి¯ వర్గములు గల్గి సుగుణప్రవాహరూప¯ మంది విశ్వంబు దాల్చి సహస్రశక్తి¯ కలితుఁడై సర్వకార్యముల్ కలుగఁజేయు. (1029) అంత. (1030) అతుల భూరి యుగాంతంబు నందుఁ గపట¯ శిశువవై యొంటి కుక్షినిక్షిప్త నిఖిల¯ భువననిలయుండవై మహాంభోధి నడుమ¯ జారు వటపత్రతల్పసంస్థాయి వగుచు. (1031) లీల నాత్మీయ పాదాంగుళీ వినిర్గ¯ తామృతము గ్రోలినట్టి మహాత్మ! నీవు¯ గడఁగి నా పూర్వభాగ్యంబు కతన నిపుడు¯ పూని నా గర్భమున నేడు పుట్టితయ్య! (1032) అట్టి పరమాత్ముండ వయిన నీవు. (1033) వరుస విగ్రహపారవశ్యంబునను జేసి¯ రఘురామ కృష్ణ వరాహ నార¯ సింహాది మూర్తు లంచితలీల ధరియించి¯ దుష్టనిగ్రహమును శిష్టపాల¯ నమును గావించుచు నయమున సద్ధర్మ¯ నిరతచిత్తులకు వర్ణింపఁ దగిన¯ చతురాత్మతత్త్వ విజ్ఞానప్రదుండవై¯ వర్తింతు వనఘ! భవన్మహత్త్వ (1033.1) మజున కయినను వాక్రువ్వ నలవిగాదు¯ నిగమజాతంబు లయిన వర్ణింప లేవ¯ యెఱిఁగి సంస్తుతి చేయ నే నెంతదాన¯ వినుత గుణశీల! మాటలు వేయునేల? (1034) అదియునుం గాక. (1035) ధీమహిత! భవన్మంగళ¯ నామస్మరణానుకీర్తనము గల హీనుల్¯ శ్రీమంతు లగుదు రగ్ని¯ ష్టోమాదికృదాళికంటె శుద్ధులు దలఁపన్. (1036) అదియునుం గాక. (1037) నీ నామస్తుతి శ్వపచుం¯ డైనను జిహ్వాగ్ర మందు ననుసంధింపన్¯ వానికి సరి భూసురుఁడుం¯ గానేరఁడు చిత్రమిది జగంబుల నరయన్. (1038) ఈ విధ మాత్మలం దెలిసి యెప్పుడు సజ్జనసంఘముల్ జగ¯ త్పావనమైన నీ గుణకథామృత మాత్మలఁ గ్రోలి సర్వ తీ¯ ర్థావళిఁ గ్రుంకినట్టి ఫలమందుదు రంచు సమస్త వేదముల్¯ వావిరిఁ బల్కుఁ గావునను వారలు ధన్యులు మాన్యు లుత్తముల్. (1039) అదిగావునఁ; బరబ్రహ్మంబవును, బరమపురుషుండవును, బ్రత్యఙ్మనో విభావ్యుండవును, సమస్తజన పాపనివారక స్వయంప్రకాశుండవును, వేదగర్భుండవును, శ్రీమహావిష్ణుడవును నగు నీకు వందనంబు లాచరించెదను"అని స్తుతించినం బరమపురుషుండును, మాతృ వత్సలుండును నగు కపిలుండు గరుణారసార్ద్రహృదయకమలుం డై జనని కిట్లనియె. (1040) "తవిలి సుఖరూపమును మోక్షదాయకంబు¯ నైన యీ యోగమార్గమే నంబ! నీకు¯ నెఱుఁగ వివరించి చెప్పితి నిది దృఢంబు¯ గాఁగ భక్తి ననుష్ఠింపు కమలనయన! (1041) జీవన్ముక్తి లభించుం¯ గావున నేమఱక తలఁపు కైకొని దీనిన్¯ వావిరి నొల్లని వారికి¯ దావల మగు మృత్యుభయము దవ్వగు సుఖమున్." (1042) అని యిట్లు దేవహూతికి¯ మనమలరఁగ గపిలుఁ డాత్మమార్గం బెల్లన్¯ వినిపించి చనియె"నని విదు¯ రునకున్ మైత్రేయముని వరుం డెఱిఁగించెన్.
దేవహూతి నిర్యాణంబు
(1043) అట్లు కపిలుం డేఁగినఁ బిదప దేవహూతియుం బుత్రుండు సెప్పిన యోగమార్గంబున విజ్ఞానంబు గలిగి యుండియుం బెనిమిటి యైన కర్దమునిం దనయుం డైన కపిలునిం బాసి నష్టవత్స యగు గోవు చందంబునం దల్లడిల్లుచుఁ గపిలమహామునిం దలంచుచుం గర్దమ తపస్సామర్థ్యంబున నైనయట్టి. (1044) మానిత సౌరభప్రసవ మంజుల పక్వ ఫలప్రవాళ భా¯ రానత చూతపోత విటపాగ్ర నికేతన రాజకీర స¯ మ్మాని సుఖానులాప పరిమండిత కర్దమ తాపసాశ్రమో¯ ద్యా నవనప్రదేశ కమలాకర తీర నికుంజ పుంజముల్. (1045) వెండియు. (1046) అంచిత స్ఫటికమయస్తంభ దీప్తిచేఁ¯ గొమరారు మరకతకుడ్యములను¯ సజ్జాతివజ్రాలసజ్జాలరుచులచే¯ భాసిల్లు నీలసోపానములును¯ దీపించు చంద్రకాంతోపలవేదుల¯ విద్రుమగేహళీవిలసితముల¯ హాటకరత్నకవాటశోభితముల¯ నలరిన సౌధశాలాంగణముల (1046.1) వర పయఃపేనపటలపాండుర కరీంద్ర¯ దంతనిర్మిత ఖట్వాంగధవళపట్ట¯ రచిత శయ్యాళులును జతురంతయాన¯ కనకపీఠాది వస్తుసంఘముల నెల్ల. (1047) మఱియు; వికచకమల కుముద సౌగంధిక బంధుర గంధానుబంధి గంధవహ శోభితంబును; యరవిందనిష్యంద కందళిత మరందరస పాన మదవదిందిందిర సందోహ ఝంకార సంకులంబునునై చెలువారు బావులు గలిగి; పురందరసుందరీ వందితం బైన కర్దమాశ్రమంబుఁ బరిత్యజించి కుటిలంబు లైన కుంతలంబులు జటిలంబులుగా ధరియించి సరస్వతీ బిందుసరోవరంబులం ద్రిషవణస్నానంబు గావించుచు; నుగ్ర తపోభారంబునం గృశీభూత శరీర యై; నిజ కుమారుండును బ్రసన్న వదనుండును గపిలనామధేయుండును నగు నారాయణుని సమస్త న్యస్తచింతలచే ధ్యానంబు సేయుచుఁ; బ్రవాహరూపంబైన భక్తి యోగంబునను నధికవైరాగ్యంబునను యుక్తానుష్ఠానజాతంబై బ్రహ్మత్వాపాదకం బగు జ్ఞానంబును విశుద్ధమనంబును గలిగి. (1048) అనయంబు నాత్మనాయకుఁడును విశ్వతో¯ ముఖుఁ డనంతుఁడు పరముఁడు నజుండు¯ చతురుండు నిజపరిజ్ఞానదీపాంకుర¯ మహిమ నిరస్త సమస్త భూరి¯ మాయాంధకారుఁ డమేయుఁ డీశ్వరుఁ డగు¯ నా పరబ్రహ్మంబు నం దవిరత¯ బద్ధతత్త్వజ్ఞానపరతచే నిర్ముక్త¯ జీవభావమున విశిష్టయోగ (1048.1) భవ్యసంప్రాప్త నిర్మల బ్రహ్మభావ¯ ములను గలిగి సమాధిచే నెలమిఁ దనరు¯ నపునరావృత్త మగు త్రిగుణప్రధాన¯ తత్త్వముల నొప్పి సంతతోదార నియతి. (1049) కలనఁ దోఁచిన వస్తుసంఘముల మేలు¯ కొని కనుంగొనలేని మనుజులపోల్కిఁ¯ బొలతి దనయాత్మ మఱచి యిమ్ముల నధూమ¯ మైన పావకుగతి నుండె నంతలోన. (1050) గురు యోగశక్తిచే నం¯ బరతలమున కెగసి సత్కృపామయుఁ డగు నా¯ వ రవాసుదేవు చరణాం¯ బురుహయుగన్యస్త చిత్తమును గల దగుచున్.
కపిలమహాముని తపంబు
(1051) ఇట్లు కపిలోక్తమార్గంబున దేవహూతి శ్రీహరి యందుఁ గలసె; అయ్యంగనారత్నంబు మోక్షంబునకుం జనిన క్షేత్రంబు సిద్ధిపదం బను పేరం బరఁగి ప్రసిద్ధి వహించె; అంత నక్కడఁ గపిలుండు తల్లిచేత ననుజ్ఞాతుం డై సిద్ధ చారణ గంధర్వాప్సరో ముని నివహ సంస్తూయమానుం డగుచు; సముద్రునిచేత దత్తార్హణ పూజానికేతంబులు వడసి సాంఖ్యాచార్యాభిష్టుతం బగు యోగంబు నవలంబించి; లోకత్రయశాంతి కొఱకు సమాహితుండై; స్వపితాశ్రమంబు విడిచి యుదగ్భాగంబునకు జనియె"అని మైత్రేయమహాముని విదురున కిట్లనియె "తండ్రీ యీ యుపాఖ్యానంబు నాకు గోచరంచినరీతి నీకుం జెప్పితి; ఇది "కపిల దేవహూతి సంవాదం"బత్యంత పావనంబు కపిల ప్రణీతంబు నయిన యోగంబు దీనిం బరమ భక్తియుక్తుండై యెవ్వండు పఠించు; నెవ్వండు విను; నట్టి పుణ్యాత్ములు విగతపాపులై గరుడధ్వజుండైన పుండరీకాక్షుని శ్రీచరణారవిందంబులం బొందుదు"రని మైత్రేయుండు విదురున కెఱింగించిన విధంబున శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకుం జెప్పెను"అని సూతుండు సెప్పిన విని ప్రహృష్ట హృదయులై "మునికులోత్తమా! భవద్వాక్పూరం బగు భగవత్కథామృతంబు గ్రోలుచుండ మా మానసంబులు దనివోవ వింకను దరువాతి వృత్తాంతంబులు మాకు విశదంబులుగ వినిపింప నీవ యర్హుండ"వని యడుగుటయు.
పూర్ణి
(1052) జనకసుతా మనో విమల సారస కోమల చంచరీక! చం¯ దన శరదిందు కుంద హర తార మరాళ పటీర చంద్రికా¯ వినుత యశోవిశాల! రఘువీర! దరస్మిత పద్మపత్ర లో¯ చన! నిటలాంబకప్రకటచాపవిఖండన! వంశమండనా! (1053) పరమపావన! విశ్వభావన! బాంధవప్రకరావనా! ¯ శరధిశోషణ! సత్యభాషణ! సత్కృపామయ భూషణా! ¯ దురితతారణ! సృష్టికారణ! దుష్టలోక విదారణా! ¯ ధరణిపాలన! ధర్మశీలన! దైత్యమర్దన ఖేలనా! (1054) దివిజగణశరణ్యా! దీపితానంతపుణ్యా! ¯ ప్రవిమల గుణజాలా! భక్తలోకానుపాలా! ¯ భవ తిమిర దినేశా! భానుకోటిప్రకాశా! ¯ కువలయహితకారీ! ఘోరదైత్యప్రహారీ! (1055) ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతంబయిన శ్రీమహాభాగవతం బను మహాపురాణంబు నందు విదురనీతియు విదురుని తీర్థాగమనంబును యుద్ధవ సందర్శనంబును కౌరవ యాదవ కృష్ణాది నిర్యాణంబును గంగాద్వారంబున విదురుండు మైత్రేయునిం గనుగొనుటయు విదుర మైత్రేయ సంవాదంబును జగదుత్పత్తి లక్షణంబును మహదాదుల సంభవ ప్రకారంబును మహదాదులు నారాయణు నభినందించుటయు విరాడ్విగ్రహ ప్రకారంబును శ్రీమహాభాగవత భక్తి కారణంబగు పద్మసంభవు జన్మప్రకారంబును బ్రహ్మతపంబును బరమేష్టికిఁ బుండరీకాక్షుండు ప్రత్యక్షంబగుటయు బ్రహ్మకృతం బైన విష్ణుస్తోత్రంబును గమలసంభవుని మానససర్గంబును బరమాణువుల పుట్టువును భూర్భువస్సురాది లోకవిస్తారంబును గాల దివస మాస వత్సరాది నిర్ణయంబును నాయుఃపరిమాణంబును జతుర్యుగ పరిమాణంబును బద్మసంభవు సృష్టిభేదనంబును సనకాదుల జన్మంబును స్వాయంభువమనువు జన్మంబును శ్రీహరి వరాహావతారంబును భూమ్యుద్ధరణంబును సూకరాకారుండైన హరిని విధాత స్తుతించుటయు దితి కశ్యప సంవాదంబును గశ్యపుండు రుద్రుని బ్రశంసించుటయుఁ గశ్యపువలన దితి గర్భంబు ధరించుటయుఁ దత్ప్రభావంబునకు వెఱచి దేవతలు బ్రహ్మసన్నధికిం జని దితిగర్భప్రకారంబు విన్నవించుటయు సనకాదులు వైకుంఠంబున కరుగుటయు నందు జయవిజయుల కలిగి సనకాదులు శపించుటయు శ్రీహరిదర్శనంబును సనకాదులు హరిని నుతించుటయు బ్రాహ్మణ ప్రశంసయు హిరణ్యకశిపు హిరణ్యాక్షుల జన్మప్రకారంబును హిరణ్యాక్షుని దిగ్విజయంబును సవనవరాహ హిరణ్యాక్షుల యుద్ధంబును బ్రహ్మస్తవంబును హిరణ్యాక్ష వధయు నమరగణంబులు శ్రీహరి నభినందించుటయు హరి వరాహావతార విసర్జనంబు సేయుటయును దేవ తిర్యఙ్మనుష్యాదుల సంభవంబును గర్దమమహాముని తపంబునకు సంతసించి శ్రీహరి ప్రత్యక్షంబగుటయుఁ గర్దముండు స్వాయంభువమనుపుత్రి యైన దేవహూతిం బరిణయం బగుటయు దేవహూతి పరిచర్యలకు సంతసిల్లి కర్దముండు నిజయోగ కలితం బగు విమానంబు నందు నిలిచి సహస్రదాసీపరివృత యైన దేవహూతింగూడి భారతాది వర్షంబులు గలయంగ్రుమ్మరుటయు దేవహూతి గర్దమునివలనఁ గన్యకానవకంబును గపిలుని గనుటయు దత్కన్యకావివాహంబులును గర్దముని తపోయాత్రయుఁ గపిల దేవహూతి సంవాదంబును శబ్దాదిపంచతన్మాత్రల జన్మప్రకారంబును బ్రహ్మాండోత్పత్తియు విరాట్పురుష కర్మేంద్రియ పరమాత్మ ప్రకారంబును బ్రకృతిపురుష వివేకంబును నారాయణుని సర్వాంగస్తోత్రంబును సాంఖ్యయోగంబును భక్తియోగంబును జీవునకైన గర్భసంభవ ప్రకారంబును జంద్ర సూర్య మార్గంబును బిత్రుమార్గంబును దేవహూతి నిర్యాణంబును గపిలమహాముని తపంబునకు జనుటయు నను కథలు గల తృతీయస్కంధము సంపూర్ణము.