పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 904 - 990

ప్రకృతి పురుష వివేకంబు

(904) జననుత! సత్త్వరజస్తమో గుణమయ¯ మైన ప్రాకృతకార్య మగు శరీర¯ గతుఁ డయ్యుఁ బురుషుండు గడఁగి ప్రాకృతములు¯ నగు సుఖ దుఃఖ మోహముల వలనఁ¯ గర మనురక్తుండు గాఁడు వికారవి¯ హీనుఁడు ద్రిగుణరహితుఁడు నగుచు¯ బలసి నిర్మలజల ప్రతిబింబితుండైన¯ దినకరుభంగి వర్తించు నట్టి (904.1) యాత్మ ప్రకృతిగుణంబుల యందుఁ దగులు¯ వడి యహంకారమూఢుఁడై దొడరి యేను¯ గడఁగి నిఖిలంబునకు నెల్లఁ గర్త నని ప్ర¯ సంగవశతను బ్రకృతి దోషములఁ బొంది (905) సుర తిర్యఙ్మనుజస్థా¯ వరరూపము లగుచుఁ గర్మవాసనచేతం¯ బరపైన మిశ్రయోనులఁ¯ దిరముగ జనియించి సంసృతిం గైకొని తాన్. (906) పూని చరించుచు విషయ¯ ధ్యానంబునఁజేసి స్వాప్నికార్థాగమ సం¯ ధానము రీతి నసత్పథ¯ మానసుఁ డగుచున్ భ్రమించు మతిలోలుండై. (907) అట్లు గావున. (908) పూని మోక్షార్థి యగు వాఁడు దీని దీవ్ర¯ భక్తియోగంబుచేత విరక్తిబొంది¯ మనము వశముగఁజేసి యమనియమాది¯ యోగమార్గక్రియాభ్యాస యుక్తిఁ జేసి. (909) శ్రద్ధాగరిష్ఠుఁడై సత్య మైనట్టి మ¯ ద్భావంబు మత్పాద సేవనంబు¯ వర్ణిత మత్కథాకర్ణనంబును సర్వ¯ భూత సమత్వమజాతవైర¯ మును బ్రహ్మచర్యంబు ఘన మౌనమాదిగా¯ గల నిజ ధర్మసంగతులఁ జేసి¯ సంతుష్టుఁడును మితాశనుఁడు నేకాంతియు¯ మననశీలుఁడు వీత మత్సరుండు (909.1) నగుచు మిత్రత్వమున గృపఁ దగిలి యాత్మ¯ కలిత విజ్ఞాని యై బంధకంబు లైన¯ ఘన శరీర పరిగ్రహోత్కంఠ యందు¯ నాగ్రహము వాసి వర్తింప నగును మఱియు. (910) జీవేశ్వర తత్త్వజ్ఞానంబునం జేసి నివృత్తం బయిన బుద్ధి దదవస్థానంబునుం గలిగి దూరీభూతేతరదర్శనుండై జీవాత్మజ్ఞానంబునం జేసి చక్షురింద్రియంబున సూర్యుని దర్శించు చందంబున నాత్మ నాయకుం డయిన శ్రీమన్నారాయణుని దర్శించి నిరుపాధికంబై మిథ్యాభూతం బగు నహంకారంబున సద్రూపంబుచేఁ బ్రకాశమానం బగుచుఁ బ్రధాన కారణంబునకు నధిష్ఠానంబును గార్యంబునకుఁ జక్షువుం బోలెఁ బ్రకాశంబును సమస్త కార్యకారణానుస్యూతంబును బరిపూర్ణంబును సర్వవ్యాపకంబును నగు బ్రహ్మంబును బొందు"నని చెప్పి వెండియు నిట్లనియె. (911) "విను మాత్మవేత్తకు విష్ణుస్వరూపంబు¯ నెఱుఁగంగఁ బడునది యెట్లటన్న¯ గగనస్థుఁ డగు దినకరు కిరణచ్ఛాయ¯ జలముల గృహకుడ్యజాలకముల¯ వలన దోఁచిన ప్రతిఫలితంబుచేత నూ¯ హింపగఁ బడిన యయ్యినుని పగిది¯ నర్థి మనోబుద్ధ్యహంకరణత్రయ¯ నాడీప్రకాశమునను నెఱుంగ (911.1) వచ్చు నాత్మస్వరూపంబు వలఁతిగాఁగ¯ జిత్తమునఁ దోచు నంచితశ్రీఁ దనర్చి¯ యమ్మహామూర్తి సర్వభూతాంతరాత్ముఁ¯ డగుచు నాత్మజ్ఞులకుఁ గాననగును మఱియు. (912) జీవుండు పరమాత్మానుషక్తుండై భూతాది తత్త్వంబులు లీనంబులై ప్రకృతి యందు వాసనామాత్రంబు గలిగి యకార్యకరణంబులై యున్న సుషుప్తి సమయంబునం దాను నిస్తంద్రుం డగుచు నితరంబుచేతఁ గప్పబడనివాఁ డై పరమాత్మానుభవంబు సేయుచుండు"నని చెప్పిన విని; దేవహూతి యిట్లనియె. (913) "విమలాత్మ యీ పృథివికిని గంధమునకు¯ సలిలంబునకును రసంబునకును¯ నన్యోన్య మగు నవినాభావసంబంధ¯ మైన సంగతిఁ బ్రకృత్యాత్మలకును¯ సతతంబు నన్యోన్య సంబంధమై యుండు¯ ప్రకృతి దా నయ్యాత్మఁ బాయు టెట్లు¯ దలపోయ నొకమాటు తత్త్వబోధముచేత¯ భవభయంబుల నెల్లఁ బాయు టెట్లు (913.1) చచ్చి క్రమ్మఱఁ బుట్టని జాడ యేది¯ యిన్నియుఁ దెలియ నానతి యిచ్చి నన్నుఁ¯ గరుణ రక్షింపవే దేవగణసుసేవ్య! ¯ భక్తలోకానుగంతవ్య! పరమపురుష!" (914) అనిన భగవంతుం డిట్లనియె "ననిమిత్తం బయిన స్వధర్మంబునను, నిర్మలాంతఃకరణంబునను, సునిశ్చితంబైన మద్భక్తియోగంబునను, సత్కథాశ్రవణసంపాదితంబైన వైరాగ్యంబునను, దృష్ట ప్రకృతిపురుష యాధ్యాత్మంబగు జ్ఞానంబునను, బలిష్ఠం బయి కామానభిష్వంగం బగు విరక్తివలనఁ దపోయుక్తం బయిన యోగంబునను, దీవ్రం బయిన చిత్తైకాగ్రతం జేసి పురుషుని దగు ప్రకృతి దందహ్యమానం బై తిరోధానంబును బొందు; నదియునుం గాక యరణిగతం బైన వహ్నిచే నరణి దహింపఁ బడు చందంబున జ్ఞానంబునను దత్త్వదర్శనంబుననుం జేసి నిరంతరంబు బలవంతంబును దృష్టదోషంబును నగు ప్రకృతి జీవునిచేత భుక్తభోగమై విడువంబడు"నని చెప్పి. (915) "విను ప్రకృతి నైజమహిమం¯ బునఁ దనలో నున్న యట్టి పురుషునకు మహే¯ శునకు నశుభవిస్ఫురణం¯ బనయముఁ గావింపజాల దది యెట్లనినన్. (916) పురుషుఁడు నిద్రవోఁ గలలఁ బొందు ననర్థకముల్ ప్రబోధమం¯ దరయగఁ మిథ్యలై పురుషు నందు ఘటింపని కైవడిం బరే¯ శ్వరునకు నాత్మనాథునకు సర్వశరీరికిఁ గర్మసాక్షికిం¯ బరువడిఁ బొంద వెన్నఁటికిఁ బ్రాకృతదోషము లంగనామణీ!" (917) అని వెండియు నిట్లనియె. (918) "అధ్యాత్మ తత్పరుం డగు వాఁడు పెక్కు జ¯ న్మంబులఁ బెక్కు కాలంబు లందు ¯ బ్రహ్మపదప్రాప్తి పర్యంతమును బుట్టు¯ సర్వార్థవైరాగ్యశాలి యగుచుఁ¯ బూని నా భక్తులచే నుపదేశింపఁ¯ బడిన విజ్ఞానసంపత్తిచేత¯ బరఁగఁ బ్రబుద్ధుఁడై బహువారములు భూరి¯ మత్ప్రసాదప్రాప్తిమతిఁ దనర్చు (918.1) నిజపరిజ్ఞాన విచ్ఛిన్ననిఖిలసంశ¯ యుండు నిర్ముక్తలింగదేహుండు నగుచు¯ ననఘ! యోగీంద్రహృద్గేయ మగు మదీయ¯ దివ్యధామంబు నొందు సందీప్తుఁ డగుచు. (919) మఱియు; నణిమాద్యష్టైశ్వర్యంబులు మోక్షంబున కంతరాయంబులు గావున వాని యందు విగతసంగుండును మదీయ చరణసరోజస్థిత లలితాంతరంగుండును నగు వాడు మృత్యుదేవత నపహసించి మోక్షంబు నొందు"నని చెప్పి; వెండియు "యోగలక్షణప్రకారంబు వినిపింతు విను"మని భగవంతుం డైన కపిలుండు నృపాత్మజ కిట్లనియె. (920) "ధీనిధులై యే యోగవి¯ ధానంబునఁ జేసి మనము దగ విమలంబై¯ మానిత మగు మత్పదముం¯ బూనుదు రా యోగధర్మముల నెఱిఁగింతున్. (921) అది యెట్లనిన, శక్తికొలఁది స్వధర్మాచరణంబును; శాస్త్ర వినిషిద్ధ ధర్మకర్మంబులు మానుటయు; దైవికంబై వచ్చిన యర్థంబువలన సంతోషించుటయు; మహాభాగవత శ్రీపాదారవిందార్చనంబును; గ్రామ్యధర్మ నివృత్తియు; మోక్షధర్మంబుల యందు రతియు; మితం బై శుద్ధం బయిన యాహార సేవయు; విజనం బయి నిర్బాధకం బయిన స్థానంబున నుండుటయు; హింసా రాహిత్యంబును; సత్యంబును; నస్తేయంబును; దన కెంత యర్థం బుపయోగించు నంత యర్థంబ స్వీకరించుటయు; బ్రహ్మచర్యంబును; తపశ్శౌచంబులును; స్వాధ్యాయ పఠనంబును; బరమ పురుషుం డైన సర్వేశ్వరుని యర్చనంబును; మౌనంబును; నాసన జయంబును; దానం జేసి స్థైర్యంబును; బ్రాణవాయు స్వవశీకరణంబును; నింద్రియ నిగ్రహరూపం బైన ప్రత్యాహారంబును; మనంబుచే నింద్రియంబుల విషయంబులవలన మరలించి హృదయ మందు నిలుపటయు; దేహగతం బైన మూలాధారాది స్థానంబులలో నొక్క స్థానంబు నందు హృదయ గతం బయిన మనస్సుతోడంగూడఁ బ్రాణ ధారణంబును; వైకుంఠుం డైన సర్వేశ్వరుండు ప్రవర్తించిన దివ్య లీలాచరిత్ర ధ్యానంబును; మానసైకాగ్రీకరణంబును; బరమాత్మ యగు పద్మనాభుని సమానాకారతయును; నిదియునుం గాక తక్కిన వ్రతదానాదులం జేసి మనోదుష్టం బయిన యసన్మార్గంబును బరిహరించి జితప్రాణుం డై, మెల్లన యోజించి శుచి యైన దేశంబునం బ్రతిష్టించి విజితాసనుం డై, యభ్యస్త కుశాజిన చేలోత్తరాసనం బైన యాసనంబు సేసి, ఋజుకాయుం డై ప్రాణమార్గంబును గుంభక రేచక పూరకంబులం గోశశోధనంబు సేసి, కుంభక పూరకంబుల చేతం బ్రతికూలంబు గావించి, చంచలం బయిన చిత్తంబు సుస్థిరంబు గావించి, తీవ్రం బయిన యమంబునం బ్రతప్తం బయి విగత సమస్త దోషం బగు చామీకరంబు కరణి విరజంబు సేసి, జిత మారుతుం డగు యోగి గ్రమ్మఱం బ్రాణాయామం బను పావకుని చేత వాత పిత్త శ్లేష్మంబులను దోషంబుల భస్మీకరణంబు సేసి, ధారణంబు చేతఁ గిల్బిషంబులను బ్రత్యాహారంబు చేత సంసర్గంబులను దహనంబు సేసి ధ్యానంబుచేత రాగంబుల సత్త్వాదిగుణంబులను నివారించి స్వ నాసాగ్రావలోకనంబు సేయుచు.

విష్ణు సర్వాంగ స్తోత్రంబు

(922) దళ దరవింద సుందర పత్రరుచిరాక్షు¯ సలలిత శ్రీవత్సకలితవక్షు¯ నీలనీరద నీలనీలోత్పలశ్యాము¯ నలికులాకుల మాలికాభిరాముఁ¯ గౌస్తుభకలిత ముక్తాహారయుతకంఠు¯ యోగిమానస పంకజోపకంఠు¯ సతతప్రసన్నసస్మిత వదనాంభోజు¯ దినకరకోటి సందీప్తతేజు (922.1) సలలితానర్ఘ్య రత్న కుండల కిరీట¯ హార కంకణ కటక కేయూర ముద్రి¯ కాతులాకోటి భూషు భక్తప్రపోషుఁ¯ గింకిణీయుత మేఖలాకీర్ణజఘను. (923) మఱియు, (924) కంజాతకింజల్క పుంజరంజిత పీత¯ కౌశేయవాసు జగన్నివాసు¯ శత్రుభీకర చక్ర శంఖ గదాపద్మ¯ విహిత చతుర్భాహు విగతమోహు¯ నుతభక్తలోక మనోనేత్రవర్ధిష్ణు¯ లాలిత సద్గుణాలంకరిష్ణు¯ వరకుమారక వయఃపరిపాకు సుశ్లోకు¯ సుందరాకారు యశోవిహారు (924.1) సకలలోక నమస్కృతచరణకమలు¯ భక్తలోక పరిగ్రహప్రకటశీలు¯ దర్శనీయ మనోరథదాయిఁ గీర్త¯ నీయ తీర్థయశోమహనీయమూర్తి. (925) వెండియు. (926) అనుపమగుణ సంపూర్ణుని¯ ననఘుని సుస్థితుని గతుని నాసీను శయా¯ నుని భక్తహృద్గుహాశయ¯ నుని సర్వేశ్వరు ననంతు నుతసచ్చరితున్. (927) విమలంబై పరిశుద్దమై తగు మనోవిజ్ఞాన తత్త్వప్రబో¯ ధమతిన్ నిల్పి తదీయమూర్తి విభవధ్యానంబు గావించి చి¯ త్తము సర్వాంగ విమర్శనక్రియలకుం దార్కొల్పి ప్రత్యంగమున్¯ సుమహాధ్యానము సేయఁగావలయుఁబో శుద్ధాంతరంగంబునన్. (928) అది యెట్టి దనిన. (929) హల కులిశాంకుశ జలజధ్వజచ్ఛత్ర¯ లాలిత లక్షణలక్షితములు¯ సలలిత నఖచంద్రచంద్రికా నిర్ధూత¯ భక్తమానస తమఃపటలములును¯ సురుచిరాంగుష్ఠ నిష్ఠ్యూత గంగాతీర్థ¯ మండిత హరజటామండలములు¯ సంచిత ధ్యానపారాయణజన భూరి¯ కలుష పర్వత దీపకులిశములును (929.1) దాసలోక మనోరథదాయకములు¯ జారుయోగి మనఃపద్మ షట్పదములు¯ ననగఁ దనరిన హరిచరణాబ్జములను¯ నిరుపమధ్యానమున మది నిలుపవలయు. (930) కమలజు మాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై¯ కమలదళాభనేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పు న¯ క్కమల నిజాంకపీఠమునఁ గైకొని యొత్తు పరేశుజాను యు¯ గ్మము హృదయారవిందమున మక్కువఁ జేర్చి భజింపగా దగున్. (931) చారు విహంగవల్లభు భుజంబులమీఁద విరాజమానసు¯ శ్రీరుచినుల్లసిల్లి యతసీకుసుమద్యుతిఁ జాల నొప్పు పం¯ కేరుహనాభు నూరువుల కిల్బిషభక్తి భజించి మానసాం¯ భోరుహ మందు నిల్పఁదగుఁబో మునికోటికి నంగనామణీ! (932) పరిలంబిత మృదుపీతాం¯ బర కాంచీగుణ నినాదభరితం బగున¯ ప్పురుషోత్తముని నితంబముఁ¯ దరుణీ! భజియింపవలయు దద్దయుఁ బ్రీతిన్ (933) విను భువనాధారత్వం¯ బునఁదగి విధిజననహేతుభూతంబగున¯ వ్వనజాతముచేఁగడుమిం¯ చిన హరినాభీసరస్సుఁజింతింపఁదగున్ (934) దివ్య మరకతరత్న సందీప్త లలిత¯ కుచములను మౌక్తికావళిరుచులఁ దనరి¯ యిందిరాదేవి సదనమై యెసక మెసఁగు¯ వక్షమాత్మను దలపోయవలయుఁ జుమ్ము. (935) నిరతంబున్ భజియించు సజ్జన మనోనేత్రాభిరామైక సు¯ స్థిర దివ్యప్రభ గల్గు కౌస్తుభరుచిశ్లిష్టంబునై యొప్పు నా¯ వర యోగీశ్వరవంద్యమానుఁ డగు సర్వస్వామి లక్ష్మీశు కం¯ ధర మాత్మం గదియించి తద్గుణగణధ్యానంబుసేయం దగున్. (936) ఘన మందరగిరి పరివ¯ ర్తన నికషోజ్జ్వలిత కనకరత్నాంగదముల్¯ దనరార లోకపాలకు¯ లను గలిగిన బాహు శాఖలను దలఁపఁదగున్. (937) మఱియు విమత జనాసహ్యంబులైన సహస్రారంబులు గలుగు సుదర్శనంబును, సరసిజోదరకరసరోరుహం బందు రాజహంస రుచిరం బయిన పాంచజన్యంబును, నరాతిభటశోణిత కర్దమలిప్తాంగంబై భగవత్ప్రీతికారణి యగు కౌమోదకియును, బంధుర సుగంధ గంధానుబంధ మంథర గంధవహాహూయమాన పుష్పంధయ ఝంకార నినద విరాజితం బైన వైజయంతీ వనమాలికయును, జీవతత్త్వం బైన కౌస్తుభమణియును, బ్రత్యేకంబ ధ్యానంబు సేయందగు; వెండియు, భక్త సంరక్షణార్థం బంగీకరించు దివ్యమంగళవిగ్రహంబున కనురూపంబును, మకరకుండల మణి నిచయ మండిత ముకురోపమాన నిర్మల గండమండలంబును, సంతత శ్రీనివాస లోచనపంకజకలితంబును, లాలిత భ్రూలతాజుష్టంబును, మధుకర సమానరుచి చికురవిరాజితంబును నైన ముఖకమలంబు ధ్యానంబు గావింపవలయు; మఱియు, శరణాగతుల కభయప్రదంబు లగుచు నెగడు పాణిపంకేరుహంబుల మనంబునఁ దలఁపవలయు. (938) గురు ఘోరరూపకంబై¯ పరఁగెడు తాపత్రయం బుపశమింపఁగ శ్రీ¯ హరిచేత నిసృష్టము లగు¯ కరుణాలోకములఁ దలఁపఁగాఁదగు బుద్ధిన్. (939) ఘనరుచిగల మందస్మిత¯ మున కనుగుణ మగు ప్రసాదమును జిత్తమునన్¯ మునుకొని ధ్యానముసేయం¯ జను యోగిజనాళి కెపుడు సౌజన్యనిధీ! (940) పూని నతశిరులైనట్టి భూజనముల¯ శోకబాష్పాంబుజలధి సంశోషకంబు¯ నత్యుదారతమము హరిహాస మెపుడుఁ¯ దలఁపఁగావలె నాత్మలోఁ దవిలి వినుము. (941) మునులకు మకరకేతనునకు మోహనం¯ బైన స్వకీయ మాయావిలాస¯ మున రచితం బైన భ్రూమండలంబును¯ ముని మనఃకుహర సమ్మోదమానుఁ¯ డగు నీశ్వరుని మందహాసంబు నవపల్ల¯ వాధర కాంతిచే నరుణ మైన¯ మొల్లమొగ్గల కాంతి నుల్లసం బాడెడు;¯ దంతపంక్తిని మదిఁ దలఁపవలయు (941.1) వెలయ నీరీతి నన్నియు వేఱువేఱ¯ సంచితధ్యాన నిర్మల స్థానములుగ¯ మనములోఁ గను"మని చెప్పి మఱియుఁ బలికె¯ దేవహూతికిఁ గపిలుండు దేటపడఁగ.

సాంఖ్యయోగంబు

(942) "ఈ ప్రకారమున సర్వేశ్వరు నందును¯ బ్రతిలబ్ధ భావసంపన్నుఁ డగుచుఁ¯ జిరతర సద్భక్తిచేఁ బ్రవృద్ధం బైన¯ యతి మోదమునఁ బులకితశరీరుఁ¯ డగుచు మహోత్కంఠ నానందభాష్పముల్¯ జడిగొనఁ బరితోషజలధిఁ గ్రుంకి¯ భగవత్స్వరూప మై భవగుణగ్రాహక¯ మగుచు మత్సంబంధ మనుకరించి (942.1) సుమహితధ్యానమునఁ బరంజ్యోతి యందు¯ మనముఁ జాల నియోజించి మహిమఁ దనరు¯ మోక్షపద మాత్మలోన నపేక్షసేయు¯ ననఘవర్తనుఁ డైన మహాత్ముఁ డెపుడు. (943) అది గావున; ముక్తి నపేక్షించు మహాత్ముం డగు వాని చిత్తంబు విముక్తం బైన భగవద్వ్యతిరిక్తాశ్రయంబు గలిగి విషయాంతర శూన్యంబై విరక్తిం బొందుటంజేసి పురుషుండు శరీరభావంబుల ననన్యభావం బగు నిర్వాణపదంబు సూక్ష్మం బగు తేజంబు దన కంటె నధింకబగు తేజంబు తోడి సమానాకారంబు నగు చందంబున నిచ్చగించు; వెండియు. (944) పురుషుఁడు చరమమై భువి నన్య విషయ ని¯ వృత్తమై తగ నివర్తించు చిత్త¯ వృత్తాదులను గల్గి వెలయంగ నాత్మీయ¯ మగు మహిమ సునిష్ఠుఁడై లభించు¯ సుఖదుఃఖముల మనస్సునఁ దలపక యహం¯ కారధర్మంబులుగాఁ దలంచి¯ యనయంబు సాక్షాత్కృతాత్మతత్త్వము గల్గు¯ నతఁడు జీవన్ముక్తుఁ డండ్రు ధీరు (944.1) లతఁడు నే చందమున నుండు ననిన వినుము¯ తన శరీరంబు నిలుచుటయును జరించు¯ టయును గూర్చుండుటయు నిఁకేమియు నెఱుంగ¯ కర్థి వర్తించు విను తల్లి! యతఁడు మఱియు. (945) మదిరాపానంబునం జేసి మత్తుం డగు వాఁడు దనకు బరిధానంబగు నంబరంబు మఱచి వర్తించు చందంబునఁ, దన శరీరంబు దైవాధీనం బని నశ్వరం బని తలంచి యాత్మతత్త్వనిష్ఠుండై యుపేక్షించు; అదియునుం గాక సమాధియోగంబునం జేసి సాక్షాత్కృతాత్మతత్త్వంబు గలవాడయి స్వాప్నికశరీరంబు చందంబున యావత్కర్మఫలానుభవ పర్యంతంబు పుత్ర దార సమేతం బగు ప్రపంచంబు ననుభవించి; యటమీదఁ బుత్ర దారాది సంబంధంబువలనం బాసి వర్తించు. (946) సుత దార మిత్రానుజులకంటె మర్త్యుండు¯ భిన్నుఁడై వర్తించుచున్నరీతి¯ విస్ఫులింగోల్ముక విపులధూమములచే¯ హవ్యవాహనుఁడు వేఱయినరీతి¯ వలనొప్ప దేహంబువలన నీ జీవాత్మ¯ పరికింప భిన్నరూపమున నుండుఁ¯ దవిలి భూతేంద్రియాంతఃకరణంబుల¯ భాసిల్లుచున్న యీ ప్రకృతిరూప (946.1) బ్రహ్మమున కాత్మ దాఁ బృథగ్భావ మగుచు ¯ ద్రష్టయయి బ్రహ్మ సంజ్ఞచేఁ దనరుచుండు¯ నఖిలభూరి ప్రపంచంబు లందుఁ దన్నుఁ¯ దవిలి తనయందు నఖిల భూతములఁ గనుచు. (947) వెండియు. (948) వరుస ననన్యభావంబునఁ జేసి భూ¯ తావళి యందుఁ దదాత్మకత్వ¯ మునఁ జూచు నాత్మీయ ఘనతరోపాదాన¯ ముల యందుఁ దవిలి యిమ్ముల వెలుంగు¯ నిట్టి దివ్యజ్యోతి యేకమయ్యును బహు¯ భావంబులను దోఁచు ప్రకృతిగతుఁడు¯ నగుచున్న యాత్మయుఁ బొగడొందు దేవ తి¯ ర్యఙ్మనుష్యస్థావరాది వివిధ (948.1) యోనులను భిన్నభావంబు నొందుటయును¯ జాలఁ గల్గు నిజగుణ వైషమ్యమునను¯ భిన్నుఁడై వెల్గుఁ గావున బేర్చి యదియు¯ దేహసంబంధి యగుచు వర్తించుచుండు. (949) భావింప సదసదాత్మక¯ మై వెలయును దుర్విభావ్య మగుచు స్వకీయం¯ బై వర్తించుచుఁ బ్రకృతిని¯ భావమునఁ దిరస్కరించు భవ్యస్ఫూర్తిన్. (950) ఈ యాత్మ నిజస్వరూపంబునం జేసి వర్తించు"నని కపిలుం డెఱింగించిన విని దేవహూతి వెండియు నిట్లనియె "మహాత్మా! మహదాది భూతంబులకుం బ్రకృతి పురుషులకుం గల్గిన పరస్పర లక్షణంబులను దత్స్వరూపంబులను నెఱింగించితి; వింక నీ ప్రకారంబున సాంఖ్యంబు నందు నిరూపింపఁబడు నట్టి ప్రకారంబును, భక్తియోగ మహాత్మ్యంబును, బురుషుండు భక్తియోగంబునం జేసి సర్వలోక విరక్తుం డగునట్టి యోగంబును, బ్రాణిలోకంబునకు సంసారం బనేక విధం బయి యుండుఁ; గావున బరాపరుండవై కాలస్వరూపి వైన నీ స్వరూపంబుు యే నీవలని భయంబునం జేసి జనులు పుణ్యకార్యంబులు సేయుచుండుదురు; మిథ్యాభూతం బైన దేహంబు నందు నాత్మాభిమానంబుసేయుచు మూఢుండై కర్మంబు లందు నాసక్తం బైన బుద్ధిం జేసి విభ్రాంతుం డగుచు సంసార స్వరూపం బగు మహాంధ కారంబు నందుఁ జిరకాల ప్రసుప్తుం డైన జనునిఁ బ్రబోధించుకొఱకు యోగభాస్కరుండవై యావిర్భవించిన పుణ్యాత్ముండవు నీవు; గావున, నాకు నిన్నియుం దెలియ సవిస్తరంబుగా నానతియ్యవలయు"ననిన దేవహూతికి గపిలుం డిట్లనియె.

భక్తియోగంబు

(951) "నలినాయతాక్షి! విను జన¯ ముల ఫలసంకల్పభేదమునఁ జేసి మదిం¯ గల భక్తియోగమహిమం¯ బలవడఁగ ననేకవిధము లనఁదగు నవియున్. (952) వివరించెదఁ దామస రాజస సాత్త్వికాది భేదంబులం ద్రివిధం బై యుండు; నందుఁ దామసభక్తి ప్రకారం బెట్టిదనిన. (953) సతతహింసాతిదంభ మాత్సర్యరోష¯ తమములను జేయుచును భేదదర్శి యగుచుఁ¯ బరఁగ నా యందుఁ గావించు భక్తి దలఁప¯ దామసం బనఁదగు వాఁడు తామసుండు. (954) ఘన విషయప్రావీణ్యము¯ లను సుమహైశ్వర్య యశములను బూజాద్య¯ ర్హుని నను నర్థి భజించుట¯ చను రాజసయోగ మనఁగ సౌజన్యనిధీ! (955) అనుపమ పాపకర్మపరిహారము కై భజనీయుఁ డైన శో¯ భనచరితుం డితం డనుచు భావమునం దలపోసి భక్తిచే¯ ననితర యోగ్యతన్ భగవదర్పణబుద్ధి నొనర్చి కర్మముల్¯ జనహితకారి యై నెగడ సాత్వికయోగమనంగఁ జొప్పడున్. (956) మనుసుత! మద్గుణశ్రవణమాత్ర లభించిన యట్టి భక్తిచే ¯ ననఘుఁడ సర్వశోభనగుణాశ్రయుఁడన్ పరమేశ్వరుండ నై¯ తనరిన నన్నుఁ జెందిన యుదాత్త మనోగతులవ్యయంబులై¯ వననిధిగామి యైన సురవాహినిఁబోలె ఫలించు నిమ్ములన్. (957) హేయగుణరహితుఁ డనఁగల¯ నా యందుల భక్తిలక్షణముఁ దెలిపితి నన్¯ బాయక నిర్హేతుకముగఁ¯ జేయు మదీయవ్రతైక చిరతరభక్తిన్. (958) నిష్కాము లయిన మదీయ భక్తులకు నట్టి భక్తియోగంబు సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్య సాయుజ్యంబులకు సాధనంబు; గావున, మహాత్ము లగు వారు నిజమనోరథఫలదాయకంబు లయిన మదీయ సేవావిరహితం బులయిన యితర కర్మంబు లాచరింప నొల్లరు; దీని నాత్యంతిక భక్తియోగం బని చెప్పుదురు; సత్త్వ రజస్తమోగుణ విహీనుం డయిన జనుండు మత్సమానాకారంబుఁ బొందు"నని చెప్పి మఱియు నిట్లనియె. (959) "నిత్యనైమిత్తిక నిజధర్మమున గురు¯ శ్రద్ధాగరిష్ఠతఁ జతుర పాంచ¯ రాత్రోక్త హరిసమారాధన క్రియలను¯ నిష్కామనంబున నెఱి మదీయ¯ విగ్రహదర్శన వినుతి పూజా వంద¯ నధ్యానసంశ్రవణములఁ గర్మ¯ సంగి గాకుండుట సజ్జనప్రకరాభి¯ మానంబు నొందుట హీను లందు (959.1) జాల ననుకంపసేయుట సముల యందు¯ మైత్రి నెఱపుట యమనియమక్రియాది¯ యైన యోగంబుచేత నాధ్యాత్మికాధి¯ భౌతికాదులఁ దెలియుట పలుకుటయును. (960) మఱియును. (961) హరి గుణ మంగళ కీర్తన¯ పరుఁడై తగ నార్జవమున భగవత్పరులం¯ గర మనురక్తి భజించుట¯ నిరహంకారమున నుంట నిశ్చలుఁ డగుటన్. (962) ఇవి మొదలుగాఁగ గలుగు భ¯ గవదుద్దేశస్వధర్మకలితుం డై వీ¯ నివలనఁ బరిశుద్ధగతిం¯ దవిలిన మది గలుగు పుణ్యతముఁ డెయ్యెడలన్. (963) గురుతరానేక కళ్యాణగుణవిశిష్ఠుఁ¯ డనఁగ నొప్పిన ననుఁ బొందు నండగొనక¯ పవనవశమునఁ బువ్వుల పరిమళంబు ¯ ఘ్రాణమున నావరించినకరణి మెఱసి. (964) అనిశము సర్వభూతహృదయాంబుజవర్తి యనం దనర్చు నీ¯ శు నను నవజ్ఞసేసి మనుజుం డొగి మత్ప్రతిమార్చనా విడం¯ బనమున మూఢుఁడై యుచితభక్తిని నన్ను భజింపఁడేని న¯ మ్మనుజుఁడు భస్మకుండమున మానక వేల్చిన యట్టివాఁ డగున్. (965) అబ్జాక్షి! నిఖిలభూతాంతరాత్ముఁడ నైన¯ నా యందు భూతగణంబు నందు¯ నతిభేదదృష్టి మాయావులై సతతంబుఁ¯ బాయక వైరానుబంధ నిరతు¯ లగువారి మనములఁ దగులదు శాంతి యె¯ న్నఁటికైన నేను నా కుటిలజనుల¯ మానక యెపుడు సామాన్యాధికద్రవ్య¯ సమితిచే మత్పదార్చన మొనర్ప (965.1) నర్థి నాచిత్తమున ముదం బందకుందు"¯ ననుచు నెఱిఁగించి మఱియు నిట్లనియెఁ గరుణఁ¯ గలిత సద్గుణ జటిలుఁ డక్కపిలుఁ డెలమిఁ¯ దల్లితోడ గుణవతీమతల్లితోడ. (966) "తరళాక్షి! విను మచేతన దేహములకంటెఁ¯ జేతన దేహముల్ శ్రేష్ట మందుఁ ¯ బ్రాణవంతంబులై స్పర్శనజ్ఞానంబు¯ గలుగు చైతన్యవృక్షములకంటె¯ ఘనరసజ్ఞానసంకలితచేతను లుత్త¯ ములు రసజ్ఞానంబు గలుగు వాని¯ కంటె గంధజ్ఞానకలితబృందంబులు¯ గడు శ్రేష్ఠములు వానికంటె శబ్ద (966.1) వేదు లగుదురు శ్రేష్ఠమై వెలయు శబ్ద¯ విదులకంటెను సద్రూపవేదు లైన¯ వాయసాదులు శ్రేష్ఠముల్ వానికంటె¯ వరుస బహుపాదు లుత్తముల్ వానికంటె (967) తలఁపఁ జతుష్పదు లధికులు¯ బలకొని మఱి వానికంటెఁ బాదద్వయముం¯ గల మనుజు లలఘుతము లి¯ మ్ముల వారల యందు వర్ణములు నాల్గరయన్ (968) అందు. (969) తలఁప బ్రాహ్మణు లుత్తములు వారికంటెను¯ వేదవేత్తలు, వేదవిదులకంటె¯ విలసితవేదార్థవిదులు, వారలకంటె¯ సమధిక శాస్త్రసంశయము మాన్పు¯ మీమాంసకులు, మఱి మీమాంసకులకంటె¯ నిజధర్మవిజ్ఞాననిపుణు లరయ¯ వారికంటెను సంగవర్జితచిత్తులు¯ దగ వారికంటె సద్ధర్మపరులు (969.1) ధార్మికులకంటె నుత్తమోత్తములు వినుము¯ మత్సమర్పిత సకలధర్మస్వభావ¯ మహిమములు గల్గి యితర ధర్మములు విడిచి¯ సమత వర్తించు నప్పుణ్యతముఁడు ఘనుఁడు. (970) అట్టివాని. (971) కని సకలభూతగణములు¯ మనమున నానందజలధిమగ్నము లగుచున్¯ ఘన బహుమాన పురస్సర¯ మనయముఁ బాటిల్ల వినుతు లర్థిం జేయున్. (972) అంత; నీశ్వరుండు జీవస్వరూపానుప్రవిష్టుండై యుండు నట్టి భగ వంతుం జూచి భక్తియోగంబుననేని యోగంబుననేనిఁ బురుషుండు పరమాత్మఁ బొందు ప్రకృతిపురుషాత్మకంబును దద్వ్యతిరిక్తంబును నైన దైవంబు నై కర్మవిచేష్టితం బగుచు నుండు; అదియ భగవద్రూపంబు; ఇట్టి భగవద్రూపంబు భేదాస్పదం బగుచు నద్భుత ప్రభావంబు గల కాలం బనియుఁ జెప్పంబడు; అట్టి కాలంబు మహదాదిత త్త్వంబులకును మహత్తత్త్వాభిమాను లగు జీవులకును భయాహం బగుటంజేసి సకల భూతములకు నాశ్రయం బగుచు నంతర్గతంబై భూతంబులచేత భూతంబుల గ్రసించుచు యజ్ఞఫలప్రదాత గావున వశీకృతభూతుండై ప్రభుత్వంబు భజియించి విష్ణుండు ప్రకాశించుచుండు; అతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేఁడు; అట్టి విష్ణుండు సకలజనంబుల యందావేశించి యప్రమత్తుఁడై ప్రమత్తు లయిన జనంబులకు సంహారకుండై యుండు; అతని వలని భయంబునంజేసి వాయువు వీచు సూర్యుం డుదయించు, నింద్రుండు వర్షించు, నక్షత్ర గణంబు వెలుంగుఁ, జంద్రుండు ప్రకాశించు, దత్తత్కాలంబుల వృక్ష లతాదులోషధుల తోడంగూడి పుష్ప ఫలభరితము లగు, సరిత్తులు ప్రవహించు, సముద్రంబులు మేరలు దప్పక యుండు; నగ్ని ప్రజ్వలించు, భూమి గిరులతోఁ గూడ బరువునఁ గ్రుంగ వెఱచు, ఆకాశంబు సకల జనంబులకు నవకాశం బిచ్చు, మహత్తత్త్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబు గావున సప్తావరణావృతం బగు లోకం బను స్వదేహంబు విస్తరింపఁ జేయు; గుణాభిమాను లగు బ్రహ్మాదులు సర్వేశ్వరునిచేత జగత్సర్గంబు నందు నియోగింపఁబడి ప్రతిదినంబు నయ్యయి సర్గంబుసేయ నప్రమత్తులై యుండుదురు; పిత్రాదులు పుత్రోత్పత్తిఁ జేయుదురు; కాలుండు మృత్యుసహాయుండై మారకుండై యుండు"అని చెప్పి కపిలుండు వెండియు నిట్లనియె. (973) "నెఱి నిట్టి నిఖలలోకే¯ శ్వరుని పరాక్రమముఁ దెలియ సామర్థ్యంబె¯ వ్వరికినిఁగలుగదు మేఘము¯ గరువలి విక్రమముఁ దెలియఁగా లేని గతిన్. (974) మగువా! విను సుఖహేతుక¯ మగు నర్థము దొరకమికి మహాదుఃఖమునం¯ దగులుదు రిది యంతయు నా¯ భగవంతుని యాజ్ఞఁజేసి ప్రాణులు మఱియున్. (975) పూని యసత్యంబులైన గృహక్షేత్ర¯ పశు ధన సుత వధూ బాంధవాది¯ వివిధ వస్తువులను ధ్రువముగా మది నమ్మి¯ వఱలు దుర్మతి యగువాఁడు జంతు¯ సంఘాత మగు దేహసంబంధమున నిల్చి¯ యర్థి నయ్యై యోను లందుఁ జొరఁగ¯ ననుగమించును వాని యందు విరక్తుండు¯ కాక యుండును నరకస్థుఁ డైన (975.1) దేహి యాత్మీయదేహంబు దివిరి వదల ¯ లేక తన కది పరమసౌఖ్యాకరంబు¯ గాఁగ వర్తించు నదియును గాక యతఁడు¯ దేవమాయావిమోహితభావుఁ డగుచు. (976) ఘనముగఁ బుత్ర వధూపశు¯ ధన గృహరక్షణము నందు దత్తత్క్రియలన్¯ మనమునఁ దలపోయుచు దిన¯ దినమున్ దందహ్యమాన దేహుం డగుచున్. (977) అతి మూఢహృదయుఁ డగుచు దు¯ రితకర్మారంభమునఁ జరించుచుఁ దరుణీ ¯ కృతగోప్యభాషణములను¯ సుతలాలనభాషణములఁ జొక్కుచు మఱియున్. (978) విను, మింద్రియ పరవశుఁడై¯ మునుకొని తత్కూటధర్మములు గల దుఃఖం¯ బనయము సుఖరూపంబుగ¯ మనమునఁ దలపోసి తదభిమానుం డగుచున్. (979) సతతముఁ దమతమ సంపా¯ దిత మగు నర్థములచేత ధృతిఁ బరులకుఁ గు¯ త్సితమతి హింసలు చేయుచు¯ నతి మూఢమనస్కు లగుచు నాత్మజనములన్. (980) పూని రక్షించుచును వారిభుక్తశేష ¯ మనుభవించుచు నంత జీవనమువోకఁ¯ గడఁగి మఱిమఱి యపరార్థకాముఁ డగుచు¯ సత్త్వమెడలి కుటుంబపోషణము నందు. (981) బలిమి సాలక మందభాగ్యుఁడై కుమతి యై¯ పూని యపుడు క్రియాహీనుఁ డగుచు¯ దవిలి వృథాప్రయత్నంబులు సేయుచు¯ మూఢుఁడై కార్పణ్యమునఁ జరించు¯ నట్టి యకించనుఁ డగువానిఁ జూచి త¯ ద్దారసుతాదు లాత్మలను వీఁడు¯ గడు నశక్తుఁడు ప్రోవఁగాఁజాలఁ డితఁ డని¯ సెగ్గింతు రర్థిఁ గృషీవలుండు (981.1) బడుగు ముసలెద్దు రోసిన పగిది నంత¯ నతఁడు నేవెంటలను సుఖం బందలేక¯ తాను బోషించు జనులు దన్ తనరఁ బ్రోవ ¯ బ్రతుకు ముదిమియు మిక్కిలి బాధపఱుప. (982) వెడరూపు దాల్చి బాంధవు¯ లడలఁగ నిర్యాణమునకు నభిముఖుఁడై యి¯ ల్వెడలఁగజాలక శునకము¯ వడువునఁ గుడుచుచును మేను వడవడ వడఁకన్ (983) అతిరోగ పీడితుండై మంద మగు జఠ¯ రాగ్నిచే మిగుల నల్పాశి యగుచు¯ మెఱసి వాయువుచేత మీఁదికి నెగసిన¯ కన్నులు కఫమునఁ గప్పబడిన¯ నాళంబులను గంఠనాళంబునను ఘుర¯ ఘుర మను శబ్దము దొరయ బంధు¯ జనుల మధ్యంబున శయనించి బహువిధ¯ ములఁ దన్ను బిలువంగ బలుకలేక (983.1) చటులతర కాలపాశవశంగతాత్ముఁ¯ డగుచు బిడ్డలఁ బెండ్లాము నరసి ప్రోచు¯ చింత వికలములైన హృషీకములును¯ గలిగి విజ్ఞానమును బాసి కష్టుఁ డగుచు. (984) అంత మరణావస్థం బొందు సమయంబున నతి భయంకరాకారులు సరభసేక్షణులు నగు యమదూత లిద్దఱు దన ముందఱ నిలిచినం జూచి; త్రస్తహృదయుండై శకృన్మూత్రంబులు విడుచుచు; యమపాశంబులచే గళంబున బద్ధుండై శరీరంబువలన నిర్గమించి; యాతనా శరీరంబు నవలంబించి బలాత్కారంబున దీర్ఘంబై దుర్గమం బగు మార్గంబును బొంది; రాజభటులచే నీయమానుం డగుచు; దండనంబున కభిముఖుండై చను నపరాధి చందంబునఁ జనుచుండి. (985) అనయము మూర్ఛ నొందు శునకావళిచేతను భక్ష్యమాణుఁడై¯ యనుపమ కాలకింకర భయంకర తర్జనగర్జనంబులన్¯ మనము గలంగ దేహము సమస్తముఁ గంపము వొందగాఁ బురా¯ తనభవ పాపకర్మసముదాయముఁ జిత్తములోఁ దలంచుచున్. (986) అనుపమ క్షుత్తృష్ణ లంతర్వ్యధలఁ జేయ¯ ఝంఝానిలజ్వలజ్జ్వలన చండ¯ భానుప్రదీప్తి తప్తం బైన వాలుకా¯ మార్గానుగత తప్యమాన గాత్రుఁ¯ డై వీఁపుఁ గశలచే నడువంగ వికలాంగుఁ¯ డగుచు మార్గము నందు నచట నచటఁ¯ జాల మూర్ఛిల్లి యాశ్రయశూన్య మగు నీళ్ళ¯ మునుఁగుచు లేచుచు మొనసి పాప (986.1) రూపమయిన తమముచే నిరూఢుఁ డగుచు¯ వెలయఁ దొంబదితొమ్మిదివేల యోజ¯ నముల దూరంబు గల యమనగరమునకుఁ¯ బూని యమభటుల్ కొంపోవఁ బోవు నంత. (987) ఇట్లు మహాపాపాత్ముం డైనవాఁడు ముహూర్తత్రయ కాలంబునను సామాన్యదోషి యగువాఁడు ముహుర్తద్వయంబునను నేగి యాతనం బొందును; అందు. (988) పట్టుదురు కొఱవులను వడిఁ¯ బెట్టుదు రసిపత్రికలను బెనుమంటల యం¯ దొట్టుదు రొడళ్ళు నలియన్¯ మట్టుదు రప్పాపచిత్తు మత్తుం బెలుచన్. (989) ముంతురు తప్తతోయముల మొత్తుదు రుగ్రగదాసిధారలం¯ దెంతురు పొట్ట ప్రేవులు వధింతురు మీఁద నిభేంద్ర పంక్తి ఱొ¯ ప్పింతురు ఘోర భంగిఁ గఱపింతురు పాములచేత బిట్టు ద్రొ¯ బ్బింతురు మీఁద గుండ్లు దినిపింతురు దేహముఁ గోసి కండలన్. (990) మఱియుఁ గుటుంబపోషణంబునఁ గుక్షింభరుం డగుచు నధర్మపరుం డై భూతద్రోహంబున నతిపాపుండై నిరయంబునుం బొంది నిజ ధనంబులు గోలుపడి మొఱవెట్టు నాపన్నుని చందంబునం బరస్పర సంబంధంబునఁ గల్పింపబడిన తమిస్రాంధతామిస్ర రౌరవాదు లగు నరకంబులం బడి తీవ్రంబు లయిన బహుయాతనల ననుభవించి క్షీణపాపుండై పునర్నరత్వంబునుం బొందు"నని చెప్పి వెండియు నిట్లనియె.