పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 848 - 903

కన్యకానవక వివాహంబు

(848) అని పలికి యమ్మరీచిం¯ గని యుద్వాహార్థ మునిచి కమలజుఁ డంతం¯ దన నందను లగు నారద¯ సనకాదులఁ గూడి యాత్మసదనము కరిగెన్. (849) అంత; నా కర్దముండు గమలసంభవ చోదితుం డగుచు యథోచితంబుగా నాత్మీయ దుహితుల వివాహంబు సేయం దలంచి మరీచికిం గళ యను కన్యకను; నత్రికి ననసూయను; నంగిరసునకు శ్రద్ధను; బులస్త్యునకు హవిర్భువును; బులహునకు గతిని; గ్రతువునకుఁ గ్రియను; భృగునకు ఖ్యాతిని; వసిష్ఠునకు నరుంధతిని; నధర్వునకు శాంతినింగా నిజ కులాచార సరణిం బరిణయంబు గావించిన వారును గృత దాన పరిగ్రహులును గర్దమ కృత సంభావనా సంభావితు లగుచు నతని చేత ననుజ్ఞాతులై జాయాసహితు లగుచు నిజాశ్రమ భూములకుం జని; రంతం గర్దముండు దేవోత్తముం డగు విష్ణుండు దన మందిరంబున నవతరించి వసించి యుంటం దన చిత్తంబున నెఱింగి; వివిక్త స్థలంబునకుం జని యచ్చటఁ గపిలునికి వందన బాచరించి యిట్లనియె. (850) "చతురాత్మ! విను మాత్మ కృతము లైనట్టి య¯ మంగళ భూత కర్మంబు లనెడి¯ దావాగ్ని శిఖలచే దందహ్యమాను లై¯ నట్టి జీవులు దుదముట్టలేక¯ పాయక సంసారబద్ధులై యుందురు¯ తద్భవహేతుభూతంబు లయిన¯ సకల దేవతలుఁ బ్రసన్నులు నగుదురు¯ బహుజన్మ పరిచిత ప్రాప్త యోగ (850.1) చిరసమాధి తపోనిష్ఠచే వివిక్త¯ దేశముల యోగిజనములు ధృతుల నే మ¯ హానుభావు విలోకింతు రట్టి దివ్య¯ పురుషరత్నంబ! నా యింటఁ బుట్టి తీవు. (851) మఱియు; సంసారచక్ర పరిభ్రామ్యమాణుల మగుచు గ్రామ్యుల మయిన మా వర్తనంబులను గణింపక మదీయ గృహంబునం బూర్వంబునం బ్రతిశ్రుతంబు లైన భవదీయ వాక్యంబులు దప్పకుండ ననుగ్రహింప నుదయించి"తని; వెండియు నిట్లనియె. (852) "తలపోయఁగ నప్రాకృత¯ బలయుక్త చతుర్భుజాది భవదవతారం¯ బులు నీ కనురూపములై¯ పొలుపొందుం గాదె పరమపురుష! మహాత్మా! (853) అదియునుం గాక. (854) అనయము భవదీయాశ్రిత¯ జనసంరక్షణముకొఱకు సమ్మతితోఁ దా¯ ల్చిన మానవ రూపంబులు¯ ననురూపము లయ్యెఁ గాదె హరి! నీకెపుడున్. (855) సుమహిత తత్త్వజ్ఞానా¯ ర్థము విద్వజ్జనగణంబు దవిలి నమస్కా¯ రము లోలిఁ జేయు పదపీ¯ ఠము గల నినుఁ బొగడవశమె ఠవణిల్లంగన్. (856) సమధిక షడ్గుణైశ్వర్య కారణుఁడవు¯ పరమేశ్వరుండవు ప్రకృతిపురుష¯ మహదహంకార తన్మాత్ర తత్క్షోభక¯ హేతుకాలాత్మ విఖ్యాత ధృతివి¯ జగదాత్మకుఁడవు చిచ్ఛక్తివి నాత్మీయ¯ జఠర నిక్షిప్త విశ్వప్రపంచ¯ మును గల సర్వజ్ఞమూర్తివి స్వచ్ఛంద¯ శక్తి యుక్తుండవు సర్వసాక్షి (856.1) వగుచుఁ గపిలాఖ్య దనరారు నట్టి నీకు¯ ననఘ మ్రొక్కెదఁ బుత్రుండ వగుచు నీవు¯ నాకుఁ బుట్టిన కతన ఋణత్రయంబు¯ వలనఁ బాసితి నిఁక భక్తవరద! నేను. (857) మానితవ్రత యోగసమాధి నియతి¯ చెంది భవదీయ పాదారవింద యుగము¯ డెందమునఁ జేర్చి శోకంబు లందుఁ దొలఁగి¯ సంచరించెద నంచిత స్థలము లందు." (858) అని యిట్లు విన్నవించిన¯ మునిపుంగవుఁ డైన కర్దముని వచనంబుల్¯ విని భగవంతుం డగు న¯ య్యనఘుఁడు కపిలుండు పలికె నర్మిలిదోఁపన్. (859) "నాచేతఁ బూర్వంబునం బ్రతిశ్రుత మైన¯ వచనముల్ దప్పక వరమునీంద్ర¯ నీ యింటఁ బుట్టితి నిర్హేతుకస్థితి¯ భూరి దయాగుణంబున నవాప్త¯ సకల కాముఁడ నేను సన్మునివేషంబు¯ ధరియించు టెల్ల నాకొఱకుఁ గాదు¯ విను మహాత్మకు లైన మునులకుఁ బరమాత్మ¯ గురు సద్వివేకంబు నరసి చూపు (859.1) తత్త్వబోధంబుకొఱకును దాల్పఁబడిన¯ యంచితవ్యక్తమార్గమై నట్టి దేహ¯ మని తలంపుము మత్పదధ్యానభక్తి¯ ధీపరాయణ మహిమంబు దేజరిల్లు. (860) సమధిక నిష్ఠం గృతయో¯ గమునన్ సన్న్యస్త సకలకర్ముఁడవై మో¯ హముఁ బాసి భక్తిచే మో¯ క్షముకై భజియింపు నను వికారరహితుఁడై. (861) ననుఁ బరమేశుఁ బరంజ్యో¯ తిని ననఘు ననంతు దేవదేవు సకలభూ¯ తనికాయగుహాశయు నా¯ ద్యుని నజు నాద్యంతశూన్యు దురితవిదూరున్. (862) తిరముగ భవదీయాంతః¯ కరణసరోజాత కర్ణికాతలమున సు¯ స్థిరుఁ జేసి యింద్రియంబుల¯ నిరసించి మనోంబకమున నెఱిఁ గను మనఘా! (863) అట్లేని. (864) తనరిన మోక్షము నొందెద¯ వని పలికినఁ గర్దముండు నమ్మునికులచం¯ ద్రుని వలగొని వందనములు¯ ఘనముగ నతిభక్తిఁ జేసి గౌతుక మలరన్."

కర్దముని తపోయాత్ర

(865) మునిగణ సేవిత మగు వన¯ మునకుం జని యందు మౌనమున నిస్సంగుం¯ డును వహ్నిరహితుఁ డనికే¯ తనుఁడై యాత్మైకశరణ తత్పరు డగుచున్. (866) పరబ్రహ్మంబుఁ జిత్తంబున నిల్పి యహంకారంబు విడిచి మమత్వంబు నిరసించి దయాగుణంబునం జేసి సకల భూతంబు లందు సమత్వంబు భజియించి శాంతశేముషీ గరిష్ఠుం డగుచు నిస్తరంగం బగు వార్థి చందంబున ధీరుండై నిఖిల ప్రపంచంబును వాసుదేవమయంబుగా దలంచుచు భక్తియోగంబున భాగవత గతిం బొందె"నని చెప్పి; వెండియు, మైత్రేయుండు విదురునిం గనుంగొని "కర్దముండు వనంబునకుం జనిన యనంతరంబ మాతృవత్సలుం డయిన కపిలుండు బిందుసరంబున వసియించి యుండ దేవహూతి తత్త్వమార్గ ప్రదర్శకుం డైన సుతునిం గనుంగొని బ్రహ్మవచనంబులు దలంచుచు నిట్లనియె.

కపిల దేవహూతి సంవాదంబు

(867) "అసదింద్రియ ఘర్షణమున¯ వసుమతి నిర్విణ్ణ నగుచు వనరెడి నా కీ¯ యసదృశమోహతమో విని¯ రసనం బనఘాత్మ! యే వెరవున ఘటించున్. (868) పటు ఘననీరంధ్ర తమః¯ పటల పరీవృత జగత్ప్రపంచమునకు నె¯ క్కటి లోచనమై మహితో¯ త్కటరుచి వెలుగుదువు భానుకైవడి ననఘా! (869) భూరి మదీయ మోహతమముం బెడఁబాప సమర్థు లన్యు లె¯ వ్వారలు నీవకాక నిరవద్య! నిరంజన! నిర్వికార! సం¯ సారలతాలవిత్ర! బుధసత్తమ! సర్వశరణ్య! ధర్మవి¯ స్తారక! సర్వలోకశుభదాయక! నిత్యవిభూతినాయకా! (870) నిను శరణంబు జొచ్చెద ననింద్యతపోనిధి! నన్నుఁ గావవే"¯ యని తను దేవహూతి వినయంబున సన్నుతిసేసి వేడఁగా¯ ననుపమసత్కృపాకలితుఁ డై కపిలుం డనురాగ మొప్ప స¯ జ్జన నిచయాపవర్గ ఫలసాధనమై తగు తల్లివాక్యమున్. (871) విని మందస్మిత లలితా¯ ననకమలుం డగుచు నెమ్మనమునఁ బ్రమోదం¯ బనయంబు గడలుకొన నిజ¯ జననికి నిట్లనియెఁ బరమశాంతుం డగుచున్. (872) "విను జీవుని చిత్తము దా¯ ఘన భవబంధాపవర్గకారణ మది యే¯ చినఁ ద్రిగుణాసక్తం బయి¯ నను సంసృతిబంధకారణం బగు మఱియున్. (873) అదియు నారాయణాసక్త మయ్యెనేని¯ మోక్షకారణ మగు"నని మునికులాబ్ధి¯ చంద్రుఁ డన నొప్పు కపిలుండు జననితోడ¯ నర్థి వినఁ జెప్పి మఱియు నిట్లనియెఁ బ్రీతి. (874) "మఱియుఁ, జిత్తం బహంకార మమకార రూపాభిమానజాతంబు లగు గామలోభాది కలుష వ్రాతంబులచేత నెప్పుడు విముక్తంబై పరిశుద్ధం బగు; నప్పుడు సుఖదుఃఖ వివర్జితంబు నేకరూపంబు నై ప్రకృతి కంటెఁ బరుండును, బరమ పురుషుండును, నిర్భేదనుండును, స్వయంజ్యోతియు, సూక్ష్మస్వరూపుండును, నితరవస్త్వంతరా పరిచ్ఛిన్నుండును, నుదాసీనుండును నైన పరమాత్మునిం దన్మయంబును హతౌజస్కంబు నైన ప్రపంచంబును జ్ఞాన వైరాగ్య భక్తి యుక్తం బగు మనంబుచేఁ బొడగాంచి; యోగిజనులు పరతత్త్వసిద్ధికొఱకు నిఖిలాత్మకుం డైన నారాయణు నందు నియుజ్యమానం బయిన భక్తిభావంబువలన నుదయించిన మార్గంబునకు నితరమార్గంబులు సరి గావండ్రు; విద్వాంసులు సంగం బింద్రియా ర్థాద్యసద్విషయంబుగ నొనరింపబడి జీవునకు నశిధిలం బగు బంధంబునకుఁ గారణం బగు ననియు; నదియె సద్విషయం బైన నంతఃకరణ సంయమన హేతుభూతం బగుచు సాధుజనులకు ననర్గళ మోక్షద్వారం బగు ననియుఁ దెలియుదురు; సహనశీలురు సమస్త శరీరధారులకు సుహృత్తులును బరమశాంతులును గారుణికులును నై పరిత్యక్త కర్మఫల స్వభావులును విసృష్ట స్వజన బంధుజనులును నై మత్పదాశ్రయులును, మద్గుణధ్యానపారీణులును, మత్కథాప్రసంగ సంభరిత శ్రవణానందులును నగుచు మదీయ కథల నొడువుచు వినుచునుండు పరమ భాగవతోత్తముల నాధ్యాత్మికాది తాపత్రయంబు దపింప జాల; దట్టి సర్వసంగవివర్జితు లగు పరమభాగవతజనుల సంగం బపేక్షణీయం; బది సకలదోష నివారకం బగు; నట్టి సత్సంగంబున సర్వప్రాణి హృత్కర్ణరసాయనంబు లగు మదీయ కథా ప్రసంగంబులు గలుగు; మద్గుణాకర్ణనంబునం జేసి శ్రీఘ్రంబుగఁ గ్రమంబునం గైవల్య మార్గదంబు లగు శ్రద్ధాభక్తు లుదయించు; నదియునుం గాక యే పురుషుం డైననేమి మద్విరచిత జగత్కల్పనాది విహారచింతచే నుదయించిన భక్తింజేసి యింద్రియసుఖంబు వలనను దృష్ట శ్రుతంబు లైన యైహి కాముష్మికంబుల వలనను విముక్తుం డగుచుఁ జిత్తగ్రహణార్థంబు ఋజువు లైన యోగమార్గంబులచే సంయుక్తుం డగునట్టి యోగి ప్రకృతిగుణ సేవనంబుచేత వైరాగ్యగుణ విజృంభితం బైన జ్ఞానయోగంబుచేతను మదర్పిత భక్తియోగంబుచేతను బ్రత్యగాత్మకుండ నైన నన్ను నంతఃకరణ నియుక్తునిం గావించు"నని చెప్పిన విని దేవహూతి గపిలున కిట్లనియె. (875) "ఏ భక్తి భవద్గుణపర¯ మై భవపాపప్రణాశమై ముక్తిశ్రీ¯ లాభము రయమునఁ జేయునొ¯ యా భక్తివిధంబుఁ దెలియ నానతి యీవే. (876) అదియునుం గాక భవదుదితం బయిన యోగంబును దదంగంబులును దద్గత తత్త్వావబోధంబును సాకల్యంబుగ మందబుద్ధి నైన నాకు స్ఫుటంబుగాఁ దెలియ నానతి"మ్మనినఁ గపిలుం డిట్లనియె. (877) "జనయిత్రి! విను మఱి సకల పదార్థప¯ రిజ్ఞానతత్త్వపారీణ మైన¯ యామ్నాయ విహితకర్మాచారములు గల్గి¯ తివుటమై వర్తించు దేవగణము¯ పూని నైసర్గికంబైన నిర్హేతుక¯ మగు భగవత్సేవ మిగుల ముక్తి¯ కంటె గరిష్ఠంబు గావున నదియు భు¯ క్తాన్నంబు జీర్ణంబు నందఁ జేయు (877.1) దీప్త జఠరాగ్నిగతి లింగదేహనాశ¯ కంబు గావించు నదియునుగాక విష్ణు¯ భక్తి వైభవములఁ దేటపఱతు వినుము¯ సద్గుణవ్రాత యోగలక్షణసమేత (878) అమలినభక్తిఁ గొందఱు మహాత్ములు మచ్చరణారవింద యు¯ గ్మము హృదయంబునన్ నిలిపి కౌతుకులై యితరేత రానులా¯ పముల మదీయ దివ్యతనుపౌరుషముల్ కొనియాడుచుండి మో¯ క్షము మదిఁ గోర నొల్ల రనిశంబు మదర్పిత సర్వకర్ములై. (879) పరికింపఁ గొందఱు భాగవతోత్తముల్¯ ఘనత కెక్కిన పురాతనము లైన¯ చారు ప్రసన్న వక్త్రారుణలోచన¯ ములు గల్గి వరదాన కలితములుగఁ¯ దనరు మద్దివ్యావతార వైభవములు¯ మదినొప్పఁ దమ యోగమహిమఁ జేసి¯ యనుభవించుచుఁ దదీయాలాపములు సన్ను¯ తించుచుఁ దివుటఁ దద్దివ్య విలస (879.1) దవయవోదార సుందర నవవిలాస¯ మందహాస మనోహర మధుర వచన¯ రచనచే నపహృత మనఃప్రాణు లగుచు¯ నెలమి నుందురు నిశ్శ్రేయసేచ్ఛ లేక. (880) కణఁకన్ వారలు వెండి మోక్షనిరపేక్షస్వాంతులై యుండి తా¯ మణిమాద్యష్టవిభూతి సేవితము నిత్యానంద సంధాయియున్¯ గణనాతీతము నప్రమేయము సమగ్రశ్రీకమున్ సర్వల¯ క్షణయుక్తంబును నైన మోక్షపదవిం గైకొందు రత్యున్నతిన్. (881) ఇట్లువొంది. (882) తనరుదు రప్పుణ్యాత్ములు¯ జనయిత్రి! మదీయ కాలచక్రగ్రసనం¯ బును నొందక నిత్యం బగు¯ ననుపమ సుఖవృత్తి నుందు రది యెట్లన్నన్. (883) సముఁడై స్నేహముచే సుతత్వమును విశ్వాసంబుచేతన్ సఖి¯ త్వముఁ జాలన్ హితవృత్తిచేతను సుహృత్త్వంబున్ సుమంత్రోపదే¯ శముచేతన్ నిజదేశికుం డనఁగ నిచ్చల్ పూజ్యుఁ డౌ నిష్ఠదై¯ వమునై వారికిఁ గాలచక్రభయముల్ వారింపుదుం గావునన్." (884) అని యిట్లు దెలుపుచు మఱియు నిట్లనియె. (885) "విను మదిగాక యీ భువిఁ దివిం బలుమాఱుఁ జరించు నాత్మ దా¯ ధన పశు పుత్ర మిత్ర వనితాతతిపైఁ దగులంబు మాని న¯ న్ననఘుని విశ్వతోముఖు ననన్యగతిన్ భజియించెనేని వా¯ నిని ఘనమృత్యురూప భవనీరథి నేఁ దరియింపఁ జేయుదున్. (886) రూఢిఁ బ్రధానపూరుషనాయకుండను¯ భగవంతుఁడను జగత్ప్రభుఁడ నైన¯ నాకంటె నన్యులఁ గైకొని తగిలిన¯ యాత్మలు భవభయం బందుదు రది¯ గావున నా యాజ్ఞఁ గడవంగ నోడుట¯ జేసి వాయువు వీచు శిఖి వెలుంగు¯ నినుఁడు దపించుఁ దా నింద్రుఁడు వర్షించు¯ భయ మంది మృత్యువు పరువు పెట్టుఁ (886.1) గాన విజ్ఞాన వైరాగ్యకలిత మైన¯ భక్తియోగంబునం జేసి పరమపదము¯ కొఱకు నయ్యోగివరులు మచ్చరణభజను¯ లగుచుఁ జరియింపుదురు నిర్భయాత్ము లగుచు. (887) గురుభక్తిం జిత్తము మ¯ త్పరమై విలసిల్లు నంతపర్యంతము స¯ త్పురుషుల కిహలోకంబునఁ¯ జిరతర మోక్షోదయంబు సేకుఱుచుండున్." (888) అని యిట్లు సన్మునీంద్రుఁడు¯ జననికి హరిభక్తియోగ సంగతి నెల్లన్¯ వినిపించుచు వెండియు ని¯ ట్లనియెన్ సమ్మోదచిత్తుఁ డగుచుఁ గడంకన్. (889) "అవ్వా! యివ్విధంబున భక్తియోగప్రకారంబు సెప్పితి; నింక దత్త్వలక్షణంబు వేఱువేఱ యెఱింగింతు నే తత్త్వగుణంబుల నెఱింగి నరులు ప్రకృతి గుణంబులవలన విముక్తు లగుదురు; హృదయగ్రంథి విచ్ఛేదకంబు నాత్మదర్శనరూపంబు నగు నా జ్ఞానం బాత్మనిశ్శ్రేయస కారణంబు కావున దాని నెఱింగింతు;నందు నాత్మస్వరూపం బెట్టి దనిన; ననాదియుఁ, బురుషుండును, సత్త్త్వాది గుణశూన్యుండును, బ్రకృతిగుణ విలక్షణుండును, బ్రత్యక్స్వరూపుండును, స్వయంప్రకాశుండును మఱియు నెవ్వనితోడ నీ విశ్వంబు సమన్వితం బగు నతండు గుణత్రయాత్మత్వంబు నవ్యక్తంబును భగవత్సంబంధియు నగు ప్రకృతి యందు యదృచ్ఛచే లీలావశంబునం బ్రవేశించిన నా ప్రకృతి గుణత్రయమయంబైన స్వరూపం బయిన ప్రజాసర్గంబుఁ జేయం గనుంగొని; యప్పుడు మోహితుం డయి విజ్ఞాన తిరోధానంబునం జేసి గుణత్రయాత్మకం బయిన ప్రకృత్యధ్యాసంబున నన్యోన్యమేళనం బగుటయు నంతం బ్రకృతిగుణంబుఁ దన యందు నారోపించుకొని క్రియామాణంబు లగు కార్యంబులవలనం గర్తృత్వంబు గలిగి సంసార బద్ధుండై పారతంత్ర్యంబు గలిగి యుండు; కర్తృత్వశూన్యుం డగు నీశ్వరుండు సాక్షి యగుటం జేసి యాత్మకుం గార్యకారణ కర్తృత్వంబులు ప్రకృత్యధీనంబు లనియు; సుఖదుఃఖ భోక్తృత్వంబులు ప్రకృతి విలక్షణుం డయిన పురుషుని వనియు నెఱుంగుదు"రని చెప్పిన విని దేవహూతి కపిలున కిట్లనియె "బురుషోత్తమా! ప్రకృతి పురుషులు సదసదాత్మక ప్రపంచంబునకుఁ గారణభూతులు గావున వాని లక్షణంబు సదసద్వివేక పూర్వకంబుగా నానతిమ్ము;"ననిన భగవంతుం డిట్లనియె. (890) "క్రమమునఁ ద్రిగుణము నవ్య¯ క్తము నిత్యము సదసదాత్మకము మఱియుఁ బ్రధా¯ నము ననఁగాఁ బ్రకృతివిశే¯ షము లదియు విశిష్ట మనిరి సద్విదు లెలమిన్. (891) అందుఁ బ్రకృతి చతుర్వింశతితత్త్వాత్మకంబై యుండు;నది యెట్లనినం బంచమహాభూతంబులును, బంచతన్మాత్రలును, జ్ఞానకర్మాత్మకంబు లయిన త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులు వాక్పాణి పాదపాయూపస్థంబులు నను దశేంద్రియంబులును, మనోబుద్ధి చిత్తాహంకారంబు లను నంతఃకరణచతుష్టయంబును నను చతుర్వింశతి తత్త్వాత్మకం బైన సగుణబ్రహ్మ సంస్థానంబు సెప్పితి; నిటమీఁదఁ గాలం బను పంచవింశకతత్త్వంబుసెప్పెద;నది గొందఱు పురుషశబ్దవాచ్యుం డైన యీశ్వరుని పౌరుషంబు గాలశబ్దంబునఁ జెప్పబడు నందురు; యందు నహంకార మోహితుండై ప్రకృతి వొంది జీవుండు భయంబుఁ జెందు; ప్రకృతిగుణసామ్యంబునం జేసి వర్తించి నిర్విశేషుం డగు భగవంతుని చేష్టా విశేషంబు దేనివలన నుత్పన్నం బగు నదియ కాలం బని చెప్పంబడు; నదియు జీవరాశ్యంతర్గతం బగుటంజేసి పురుషుండనియు వాని బహిర్భాగ వ్యాప్తిం జేసి కాలం బనియుఁ జెప్పం బడు;నాత్మ మాయం జేసి తత్త్వాంతర్గతుం డయిన జీవునివలన క్షుభితం బయి జగత్కారణం బగు ప్రకృతి యందు పరమపురుషుడు దన వీర్యంబు పెట్టిన నా ప్రకృతి హిరణ్మయం బైన మహత్తత్త్వంబు పుట్టించె;నంత సకల ప్రపంచబీజభూతుడును లయవిక్షేప శూన్యుండును నగు నీశ్వరుండు దన సూక్ష్మవిగ్రహంబు నందు నాత్మ గతం బైన మహదాది ప్రపంచంబుల వెలిగించుచు స్వతేజోవిపత్తిం జేసి యాత్మప్రస్వాపనంబు సేయు నట్టి తమంబును గ్రసించె"నని చెప్పి; వెండియు నిట్లనియె. (892) "దివ్యమగు వాసుదేవా¯ దివ్యూహచతుష్టయంబు త్రిజగము లందున్¯ సేవ్యం బని చెప్పంబడు¯ భవ్యగుణా! దాని నెఱుఁగ బలికెద నీకున్. (893) సత్త్వప్రధానమై స్వచ్ఛమై శాంతమై¯ యూర్మిషట్కంబుల నోసరించి¯ సురుచిర షాడ్గుణ్య పరిపూర్ణమై నిత్య¯ మై భక్తజన సేవ్యమై తనర్చి¯ వలనొప్పుచుండు నవ్వాసుదేవవ్యూహ¯ మంత మహత్తత్త్వ మందు నోలి¯ రూఢిఁ గ్రియాశక్తిరూపంబు గల్గు న¯ హంకార ముత్పన్న మయ్యె నదియ (893.1) సరవి వైకారికంబుఁ దైజసముఁ దామ¯ సంబు నా మూఁడు దెఱఁగుల బరగు నందుఁ¯ దనరు వైకారికము మనస్సునకు నింద్రి¯ యములకును గగనముఖ భూతముల కరయ (894) అది దేవతారూపంబుల నుండు దైజసాహంకారంబు బుద్ధి ప్రాణంబులుం గలిగి యుండు తామసాహంకారం బింద్రియ మేళనంబున నర్థమాత్రం బై యుండు; మఱియును. (895) అట్టి యహంకార మం దధిష్టించి సా¯ హస్రఫణామండలాభిరాముఁ¯ డై తనరారు ననంతుఁడు సంకర్ష¯ ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు¯ మహిత భూతేంద్రియ మానస మయుఁడు నై¯ కర్తృత్వ కార్యత్వ కారణత్వ ¯ ప్రకట శాంతత్వ ఘోరత్వ మూఢత్వాది¯ లక్షణ లక్షితోల్లాసి యగుచు (895.1) నుండు నమ్మేటి రెండవ వ్యూహ మనఁగ¯ ఘనవికారంబుఁ బొందు వైకారికంబు¯ వలన వినుము మనస్తత్వ మెలమిఁ బుట్టె¯ మఱియు వైకారికంబును మాత! వినుము.

బ్రహ్మాండోత్పత్తి

(896) అది యెట్టు లంటేని సామాన్యచింతయు విశేషచింతయు ననందగు సంకల్ప వికల్పంబులం జేసి కామసంభవం బనంబడు నెద్ది, యనిరుద్ధాఖ్యం బయిన వ్యూహం బదియ హృషీకంబులకు నధీశ్వరం బయి సకల యోగీంద్ర సేవ్యం బగుచు శరదిందీవర శ్యామం బయి యుండు; వెండియుం దైజసంబువలన బుద్ధితత్త్వంబు పుట్టె; దాని లక్షణంబులు ద్రవ్యప్రకాశం బైన జ్ఞానంబును, నింద్రియానుగ్రహంబును, సంశయంబును, మిథ్యాజ్ఞానంబును, నిద్రయు, నిశ్చయంబును స్మృతియు ననందగి యుండు; మఱియుఁ దైజసాహంకారంబు వలన జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులును గ్రియాజ్ఞానసాధనంబులును గలిగి యుండుఁ; బ్రాణంబునకుం గ్రియాశక్తియు బుద్ధికి జ్ఞానశక్తియు నగుటం జేసి యింద్రియంబులకుఁ దైజసత్వంబు గలిగి యుండు; భగద్భక్తి ప్రేరితం బయిన తామసాహంకారంబువలన శబ్ద తన్మాత్రంబు పుట్టె; దానివలన నాకాశంబును నాకాశంబువలన శ్రోత్రింద్రియంబును పుట్టె; శ్రోత్రంబు శబ్దగ్రాహి యయ్యె; శబ్దం బర్థంబునకు నాశ్రయంబై శ్రోతకు జ్ఞానజనకం బయ్యె మఱియు శబ్దతన్మాత్రంబువలన నాకాశం బయి యా యాకాశంబు భూతంబులకు బాహ్యాభ్యంతరంబుల నవకాశం బిచ్చటయు నాత్మ ప్రాణేంద్రియాదులకు నాశ్రయం బగుటయు నను లక్షణంబులు గలిగి యుండు కాల గతిచే వికారంబు నొందు; శబ్దతన్మాత్ర లక్షణం బగు నభంబువలన స్పర్శంబును స్పర్శంబువలన వాయువును వాయువుచే స్పర్శగ్రాహియైన త్వగింద్రియంబును బుట్టె; మృదుత్వంబును గఠినత్వంబును శైత్యంబును నుష్ణత్వంబును నను నివి స్పర్శంబునకు స్పర్శత్వం బని చెప్పంబడు; మఱియు వాయువునకుఁ జాలనంబును పరస్పర విభాగకరణంబును దన్మేళనంబును ద్రవ్యశబ్దనేతృత్వంబు నగు;నందు గంధవంతం బగు ద్రవ్యంబును ఘ్రాణేద్రియంబు నొందించుట ద్రవ్యనేతృత్వంబు దూరస్థం బగు శబ్దంబును శ్రోత్రేంద్రియ గ్రాహ్య మగు; నట్లొనరించుట శబ్దనేతృత్వంబు సర్వేంద్రియాత్మకత్వంబు ననునవి లక్షణంబులై యుండు; దైవప్రేరితంబై స్పర్శ తన్మాత్ర గుణకం బగు వాయువువలన రూపంబును దానివలనఁ దేజంబును బుట్టె; రూపంబు నేత్రేంద్రియ గ్రాహకం బయ్యె నేత్రగతం బయిన రూపంబునకు నుపలంభకత్వంబును ద్రవ్యాకారసమత్వంబును ద్రవ్యంబునకు నుపసర్జనం బగుటయు ద్రవ్యపరిణామ ప్రతీతియు నివి రూపవృత్తు లనంబడు; తైజసంబునకు సాధారణంబు లగు ధర్మంబులు ద్యోతం బనఁ బ్రకాశంబు పచనం బనఁ దండులాదుల పాకంబు పిపాసా నిమిత్తం బైన పానంబు క్షున్నిమిత్తం బైన యోదనంబు హిమమర్దనం బగు శోషణంబు ననునివి వృత్తులై యుండు; రూపతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబు నొందు తేజస్సు వలన రసతన్మాత్రంబు పుట్టె; రసతన్మాత్రంబువలన జలంబు పుట్టె; జిహ్వ యను రసనేంద్రియంబు రసగ్రాహకం బయ్యె; నా రసం బేకంబై యుండియు భూతవికారంబునం జేసి కషాయ తిక్త కట్వామ్ల మధురాది భేదంబుల ననేక విధం బయ్యె; వెండియు సాంసర్గిక ద్రవ్యవికారంబునంజేసి యార్ద్రం బగుటయు ముద్దగట్టుటయుఁ దృప్తి దాతృత్వంబును జీవంబును దద్వైక్లబ్య నివర్తనంబును మృదూకరణంబును దాపనివారణంబును గూపగతం బయిన జలంబు దివియ మఱియు నుద్గమించుటయు ననునివి జలవృత్తు లనంబడు; రసతన్మాత్రంబువలన దైవచోదితంబై వికారంబునం బొందిన జలంబు వలన గంధతన్మాత్రంబు పుట్టె; దానివలనం బృథ్వియు గలిగె ఘ్రాణంబు గంధగ్రాహకం బయ్యె;నందు గంధం బేకం బయ్యు వ్యంజనాదిగతం బయి హింగ్వాది నిమిత్తం బయిన మిశ్రమగంధంబును కరంభంబును గృంజనాదిగతం బయిన పూతిగంధంబును; ఘనసారాది నిమిత్తం బయిన సుగంధంబును శతపత్రాదిగతం బగు శాంత గంధంబును లశునాదిగతం బైన యుగ్రగంధంబును బరుష్యిత చిత్రాన్నాది గతం బయిన యామ్లగంధంబును ద్రవ్యావయవ వైషమ్యంబునం జేసి యనేకవిధంబై యుండు; నదియునుం గాక ప్రతిమాదిరూపంబులం జేసి సాకారతాపాదనం బగు భావంబును, జలాది విలక్షణ త్రయాంతర నిరపేక్షం బయిన స్థితియు జలాధ్యాధారత యను ధారణంబును, నాకాశాద్యవచ్ఛేదకత్వంబును, సకలప్రాణి పుంస్త్వాభి వ్యక్తీకరణంబును ననునివి పృథ్వీవృత్తు లనంబడు"నని చెప్పి వెండియు నిట్లనియె "నభో సాధారణగుణ శబ్దవిశేషగ్రాహకంబు శ్రోత్రంబును, వాయ్వ సాధారణగుణ విశేషగ్రాహకంబు స్పర్శంబును, దేజో సాధారణగుణ విశేషగ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభో సాధారణగుణ విశేషగ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్య సాధారణగుణ విశేషగ్రాహకంబు ఘ్రాణేంద్రియంబును, నాకాశాది గుణంబులగుచు శబ్దాదికార్యంబు లగు వాయ్వాదు లందుఁ గారణాన్వయంబు ననన్నిఁటికిం బృథ్వీ సంబంధంబు గలుగుటంజేసి భూమి యందు శబ్దస్పర్శరూపరసగంధంబులు గలుగుట మహదాదిపృథివ్యంతంబు లగు నీ యేడు తత్త్వంబులు పరస్పర మిళితంబు లై భోగాయతనం బగు పురుషునిం గల్పింప సమర్థంబులై యున్నం జూచి కాలాదృష్టసత్వాదులం గూడి జగత్కారణుండును ద్రైగుణ్యవిశిష్టుండును నశేష నియామకుండును నిరంజనాకారుండును నగు సర్వే శ్వరుం డందు బ్రవేశించు; నంత నన్యోన్యక్షుబితంబు లై మిళితంబు లైన మహదాదుల వలన నధిష్ఠాతృచేతన రహితం బగు నొక యండంబు పుట్టె; నందు. (897) గురుశక్తియౌ విరాట్పురుషుండు సంభవం¯ బయ్యె నయ్యండంబు నర్థిఁ బొదవి¯ యంబు ముఖావరణంబు లొక్కొకటికి¯ దశగుణితంబులై తవిలి యావ¯ రణములై యుండును గ్రమమున లోకంబు¯ నకు మేలుకట్ల పోలికఁ దనర్చి¯ పంకజోదరుని రూపము విలసించును¯ లోలత జలములోఁ దేలుచున్న (897.1) హేమమయ మైన యండంబులో మహాను¯ భావుఁ డభవుండు హరి దేవదేవుఁ డఖిల¯ జేత నారాయణుఁడు ప్రవేశించి యపుడు¯ విష్ణుపద భేదనంబు గావించి యందు.

విరాట్పురుష ప్రకారంబు

(898) కరమొప్పఁగా విరాట్పురుషుండు వెలుఁగొందు¯ నా విరాట్పురుషుని యాననంబు¯ వలనను వాణియు వాణితో వహ్నియు¯ నాసంబువలనఁ బ్రాణములఁ గూడి ¯ ఘ్రాణేంద్రియం బయ్యె ఘ్రాణంబువలనను¯ వాయువులును బ్రాణవాయువులును¯ నందు నక్షులు చక్షు వందు సూర్యుండును¯ నందభిధ్యానంబు నర్థిఁ జేయఁ (898.1) గర్ణములు జాత మయ్యెఁ దత్కర్ణసమితి¯ వలన శ్రోత్రేంద్రియంబు దిక్కులును గలిగెఁ ¯ ద్వక్కుచే శ్మశ్రు రోమ వితానకములు¯ నోషధివ్రాతమును భవ మొందె; మఱియు. (899) దానివలనను మేఢ్రంబు గానఁబడియెఁ¯ బరఁగ రేతంబువలన నాపంబు పుట్టె¯ గుదమువలన నపానంబు నుదయ మయ్యె¯ దానివలనను మృత్యువు దగ జనించె. (900) కరములవలనను బలమును¯ నిరవుగ నా రెంటివలన నింద్రుఁడుఁ బాదాం¯ బురుహంబులవలన గతియు¯ నరుదుగ నా రెంటివలన హరియును గలిగెన్. (901) ఘన నాడీ పుంజమువల¯ నను రక్తము దానివలన నదులును జఠరం¯ బున నాకఁలియును దప్పియుఁ¯ ననయము నా రెంటివలన నబ్దులు పుట్టెన్. (902) విను హృదయమువలనను మన¯ మును మనమునఁ దుహినకరుఁడు బుద్ధియుఁ జిత్తం¯ బున బ్రహ్మయు క్షేత్రజ్ఞుం¯ డును గలిగిరి యవ్విరాజుఁడుం బూరుషతన్. (903) మఱియు; విరాట్పురుషు నం దుదయించిన వ్యష్టిరూపంబు లగు నాకాశాది భూతంబులును శబ్దంబు మొదలగు భూతతన్మాత్రంబులును వాగాదీంద్రియ జాతంబును దదధిదేవతలును దమంతన సమిష్టిరూపుం డగు క్షేత్రజ్ఞుం బ్రవృత్తి ప్రవక్తకుం జేయ నసమర్థంబు లయ్యె; నెట్లనిన దేవాధిష్ఠితంబు లగు నింద్రియంబులు దాము వేర్వేఱ యయ్యీశ్వరుం బ్రవృత్తున్ముఖుం జేయనోపక క్రమంబునం దత్తదధిష్ఠానాదుల నొందె; నందు నగ్ని వాగింద్రియంబుతోడ ముఖంబు నొంది ప్రవర్తించిన విరాట్కార్యం బగు వ్యష్టి శరీరజాతం బనుత్పన్నం బయ్యె; నంత నాసయు ఘ్రాణేంద్రియంబుతోడ వాయువుం గూడిన నట్టిది యయ్యె; నాదిత్యుఁడు చక్షురింద్రియంబుతోడ నేత్రంబులు నొందిన వృథాభూతం బయ్యె; దిగ్దేవతాకం బగు కర్ణంబు శ్రోత్రేంద్రియంబుతోఁ గూడిన విరాట్కార్య ప్రేరణాయోగ్యం బయ్యె ఓషధులు రోమంబులం ద్వగింద్రియంబుఁ జెంది విఫలం బయ్యె; నద్దైవం బగు మేఢ్రంబు రేతంబు నొందినఁ దత్కార్యకరణాదక్షం బయ్యెఁ; బదంపడి గుదంబు మృత్యువు తోడ నపానేంద్రియంబుఁ జేరిన నది హైన్యంబు నొందె; విష్ణు దేవతాకంబు లగు చరణంబులు గతితోఁ గూడిన ననీశ్వరంబు లయ్యెఁ; బాణీంద్రియంబు లింద్రదైవతంబు లగుచు బలంబు నొందిన శక్తిహీనంబు లయ్యె; మఱియు నాడులు సనదీకంబులై లోహితంబు వొందిన నిరర్థకంబు లయ్యె; నుదరంబు సింధువుల తోడఁ జేరి క్షుత్పి పాసలం బొందిన వ్యర్థం బయ్యె; హృదయంబు మనంబు తోడం జంద్రు నొందిన నూరక యుండె; బుద్ధి బ్రహ్మాది దైవతంబై హృదయంబు నొందిన నిష్ఫలం బయ్యెఁ జిత్తం బభిమానంబుతో రుద్రునిం జెందిన విరాట్కార్య జాతం బనుభూతం బయ్యె; నంతఁ జైత్యుం డగు క్షేత్రజ్ఞుండు హృదయాధిష్ఠానంబు నొంది చిత్తంబు తోడం బ్రవేశించిన విరాట్పురుషుండు సలిల కార్యభూత బ్రహ్మాండంబు నొంది ప్రవృత్యున్ముఖక్షముం డయ్యె; సుప్తుం డగు పురుషునిం బ్రాణాదులు దమ బలంబుచే భగవదప్రేరితంబు లగుచు నుత్థాపనా సమర్థంబు లగు చందంబున నగ్న్యాదులు స్వాధిష్ఠాన భూతంబు లగు నిద్రియంబులతోడ దేవాది శరీరంబుల నొందియు నశక్తంబు లయ్యె"నని మఱియు "నవ్విరాట్పురుషుని ననవరతభక్తిం జేసి విరక్తులై యాత్మల యందు వివేకంబు గల మహాత్ములు చింతింపుదు రనియుఁ బ్రకృతిపురుష వివేకంబున మోక్షంబును బ్రకృతి సంబంధంబున సంసారంబును గలుగు"ననియుఁ జెప్పి మఱియు నిట్లనియె.