పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 631 - 745

వరహావతారుని ఎదిరించుట

(631) అనవుడు దానవేంద్రుఁడు హుతాశనుకైవడి మండి పద్మలో¯ చను నెదిరించు వేడుకలు సందడిగొల్ప ననల్పతేజుఁడై¯ ఘనగదఁ గేలఁ బూని త్రిజగద్భయదాకృతిఁ దాల్చి వ్రేల్మిడిం¯ జనియె రసాతలంబునకుఁ జండ భుజాబల దర్ప మేర్పడన్. (632) చని జలమధ్యంబున. (633) దివిజారి యెదురఁ దగఁ గనె¯ సవిరళ దంష్ట్రాభిరాము నమరలలాముం¯ గువలయభరణోద్ధామున్¯ సవనమయస్తబ్ధరోము జలదశ్యామున్. (634) అయ్యవసరంబున సూకరాకారుం డైన హరియు. (635) వనజ రుచిసన్నిభము లగు¯ తన లోచనయుగళ దీప్తి దనరఁ దదాలో¯ కనముల దనుజాధీశుని¯ తనుకాంతి హరింపఁజేసెఁ దత్క్షణమాత్రన్. (636) మఱియు నయ్యాదివరాహం బవార్యశౌర్యంబున మాఱులేని విహారంబున జరియించు నట్టియెడ. (637) తుదమొదళ్ళకుఁ జిక్కి దునిసి పాఱఁగ మోరఁ¯ గులశైలములఁ జిమ్ముఁ గొంత దడవు ¯ బ్రహ్మాండభాండంబు పగిలి చిల్లులువోవఁ¯ గొమ్ములఁ దాటించుఁ గొంతద డవు¯ జలధు లేడును బంకసంకులం బై యింక¯ ఖురముల మట్టాడుఁ గొంత దడవు¯ నుడురాజు సూర్యుఁడు నొక్క మూలకుఁ బోవఁ¯ గుఱుచ వాలము ద్రిప్పుఁ గొంత దడవు (637.1) గునియుఁ గుప్పించి లంఘించుఁ గొప్పరించు¯ నెగయు ధరఁ ద్రవ్వు బొఱియఁగా నేపురేగి¯ దానవేంద్రుని గుండెలు దల్లడిల్లఁ¯ బంది మెల్లన రణపరిపంథి యగుచు. (638) మఱియును. (639) కనుఁగవ నిప్పులు రాలఁగ¯ సునిశిత దంష్ట్రాగ్ర యుత వసుంధరుఁ డగుచున్¯ తన కెదురేతేరఁగ నీ¯ వనచర మేరీతి నిపుడు వనచర మయ్యెన్. (640) అని యాశ్చర్య భయంబులు¯ దన మనమునఁ దొంగిలింపఁ దనుజాధిపుఁ డి¯ ట్లనియెన్ భీకరసూకర¯ తనువొంది చరించు దనుజ దర్పావహుతోన్ (641) "ఘనసూకర! మూఢాత్మక! ¯ వనరుహసంభూత దత్త వరదానమునం¯ గనిన రసాతలగత భువి¯ యనయంబును నా యధీనమై వర్తించున్. (642) గొనకొని నీ వీ ధరణిం¯ గొనిపోకుము విడుము కాక కొని యేఁగెదవేఁ¯ గొనియెద నీ ప్రాణముఁ గై¯ కొను మిదె నా మాట నలముగొనవేమిటికిన్. (643) మాయావి వగుచు నిప్పుడు¯ వాయక యీ పుడమిఁ జోరభావంబున నీ¯ వీ యెడఁ గొని పోజూతునె ¯ యాయతభుజబలముచేత నడపక? యనుచున్. (644) అవిరళ యోగమాయాబలంబునఁ జేసి¯ యల్ప పౌరుషమున నలరు నిన్ను¯ నర్థి సంస్థాపించి యస్మత్సుహృద్భృత్య¯ కులుల కెల్లను మోద మొలయఁ జేయఁ¯ జెలువేది మద్గదాశీర్ణుఁడ వగు నిన్నుఁ¯ గనుఁగొని దేవతాగణము లెల్ల¯ నిర్మూలు లై చాల నెఱి నశించెద రన్న"¯ విని యజ్ఞపోత్రియై వెలయుచున్న (644.1) హరి సరోజాత భవ ముఖామరుల కెల్ల¯ వచ్చు దురవస్థ కాత్మలో వంత నొంది¯ నిశిత దంష్ట్తాగ్రలసితమై నెగడు ధరణి¯ దేవితో నొప్పె నా వాసుదేవుఁ డంత. (645) సురరిపు వాక్యాంకుశముల¯ గురు కుపితస్వాంతు డగుచుఁ గొమరారె వసుం¯ ధరతోడ భీతినొందిన¯ కరణిం గల కరికులేంద్రు కరణిం బెలుచన్. (646) నిశిత సిత దంత రోచులు నింగిఁ బర్వఁ¯ గంధి వెడలి భయంకరాకార లీల¯ నరుగు భీషణ మఖవరాహావతార¯ మొనరఁ దాల్చిన పద్మలోచనుని వెనుక. (647) కరి వెనుక దగులు నక్రము¯ కరణిం జని దైత్యవిభుఁడు గదిసి యిటులనున్¯ దురిత పయోనిధి తరికిన్¯ గిరికిన్ ఖురదళిత మేరుగిరికిన్ హరికిన్. (648) "నిందకు రోయక లజ్జం¯ జెందక వంచనను రణముసేసి జయంబుం¯ బొందెద నని తలఁచుచు నిటు¯ పందగతిం బాఱు బంటుపంతమె నీకున్." (649) అని యాక్షేపించినం బుండరీకాక్షుండు గోపోద్ధీపిత మానసుం డై. (650) తోయములమీఁద భూమిన¯ నాయాసత నిల్పి దానికాధారముగాఁ¯ దోయజనాభుఁడు దన బల¯ మాయతమతిఁ బెట్టె సురలు హర్షము వొందన్. (651) కుసుమములఁ వృష్టి బోరనఁ గురిసె నంత¯ విభవ మొప్పార దేవదుందుభులు మొరసెఁ¯ గడఁక వీతెంచె గంధర్వగాన రవము¯ నందితము లయ్యె నప్సరోనర్తనములు. (652) అయ్యవసరంబున నయ్యజ్ఞవరాహమూర్తిధరుం డైన కమలలోచనుండు కనక కుండల గేయూర గ్రైవేయ గటకాంగుళీయక భూషణ రోచులు నింగిపర్వ సమరసన్నద్ధుం డై. (653) ఘనగదఁ గేలఁబూని మణికాంచన నవ్య విచిత్రవర్మమిం¯ పొనరగఁ దాల్చి దానవ నియుక్త దురుక్త నిశాతబాణముల్¯ దన ఘనమర్మముల్ కలఁప దానవహంత నితాంతశౌఁర్యుఁ డై¯ కనలుచు వచ్చు నద్దనుజుఁ గన్గొని రోషవిభీషణాకృతిన్. (654) ఒప్పి నగుచు నిట్లనియె. (655) "వినరా; యోరి! యమంగళాచరణ! యుద్వృత్తిన్ ననున్ నీ మది¯ న్ననయంబున్ వనగోచరం బగు మృగం బంచుం దలం తౌర! నే¯ నెనయన్ వన్యమృగంబ యౌదు బలి యై యేతెంచు నీ బోఁటి యీ¯ శునకశ్రేణి వధింతు నేఁ డని మొనన్ సోఁకోర్చి వర్తించినన్. (656) బలిమి గలదేని నాతోఁ¯ గలనను నెదిరించి పోరఁగడఁగుము నీ కో¯ ర్కులు నేఁడు దీర్తు నూరక¯ తలపోయ వికత్థనంబు దగదు దురాత్మా! (657) విను మదిగాక సంగరవివేకవిశారదు లైన యట్టి స¯ జ్జనములు మృత్యుపాశములఁ జాల నిబద్ధులు నయ్యు నీ వలెన్¯ గొనకొని యాత్మ సంస్తుతులకున్ ముదమందిరె యేల యీ విక¯ త్థనములు బంటుపంతములె దైత్యకులాధమ! యెన్ని చూడగన్. (658) ధృతిఁ బాతాళము నందు నీ వనెడి సందీప్తోగ్రనిక్షేపమే¯ నతి దర్పంబునఁ గొందుఁ జూడు మిదె దేవారాతి! నన్నెన్నెదౌ¯ గతలజ్జుం డన దాఁగి యుండి రణముం గావింతు యుష్మద్గదా¯ వితతద్రావితుఁ డన్న నన్నెదురుమా వేదీర్తు నీ కోరికల్. (659) ఎన్నఁ బదాతియూధముల కెల్ల విభుండవు పోటుబంటవై¯ నన్ను రణోర్వి నేఁ డెదిరినన్ భవదీయ బలంబు నాయువున్¯ మిన్నక కొందుఁ జూడు మిది మేరగ మేదిని వీతదైత్యమై¯ వన్నెకు నెక్కఁ జేసెద నవార్యపరాక్రమ విక్రమంబునన్. (660) నను నెదురంగఁ జాలిన ఘనం బగు శౌర్యము ధైర్యమున్ బలం¯ బును గలవేని నిల్వు రణభూమిని నీ హితులైన వారికిం¯ గనుఁగవ బాష్పపూరములు గ్రమ్మఁగ మాన్పఁగనోపుదేనిఁ జ¯ య్యనఁ జనఁబొమ్ము దానవకులాధమ! యూరక రజ్జులేటికిన్. (661) నను నిట సంస్థాపించెద¯ నని పలికితి వంతవాఁడవౌదువు నీకున్¯ నెనరైన చుట్టములఁ బొడ¯ గని రా యిదె యముని పురికిఁ గాపుర మరుగన్." (662) అని యిబ్భంగి సరోరుహాక్షుఁడు హిరణ్యాక్షున్ విడంబించి ప¯ ల్కిన హాసోక్తుల కుల్కి రోషమదసంఘీభూతచేతస్కుఁ డై¯ కనుఁ గ్రేవన్ మిడుఁగుర్లు సాలఁ బొడమంగాఁ గిన్కమైఁ దోఁకఁ ద్రొ¯ క్కిన కృష్ణోరగరాజు మాడ్కి మదిలోఁ గీడ్పాటు వాటిల్లఁగన్. (663) చలితేంద్రియుఁడై నిట్టూ¯ ర్పులు నిగడించుచును బొమలు ముడుపడ రోషా¯ కులమానసుఁడై గదఁగొని¯ జలజాక్షున కెదురు నడచె సాహసమొప్పన్. (664) అత్తఱి హిరణ్యాక్షుం డతి భయంకరాకారుం డై. (665) గద సారించి మదాసురేంద్రుఁడు సమగ్రక్రోధుఁడై మాధవుం¯ గుదియన్ వ్రేసిన వ్రేటు గైకొనక రక్షోహంత శౌర్యోన్నతిన్¯ గదఁ గేలన్ ధరియించి దానిఁ దునుకల్ కావించినం దైత్యుఁ డు¯ న్మదుఁడై యొండు గదన్ రమావిభుని భీమప్రక్రియన్ వ్రేసినన్. (666) అది దనుఁ దాకకుండ దనుజారి గదారణకోవిదక్రియా¯ స్పద కరలాఘవక్రమముఁ బైకొని చూపి విరోధి పేరురం¯ బదరఁగ వ్రేయ వాఁడు వివశాకులభావము నొంది యంతలో¯ మదిఁ దెలివొంది వ్రేసె రిపుమానవిమర్దను నా జనార్దనున్. (667) ఇట్లు దలపడి; యన్యోన్య జయకాంక్షల నితరేతర తుంగతరంగ తాడితంబు లగు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబునఁ బరస్పర శుండాదండ ఘట్టిత మదాంధ గంధసింధుర యుగంబు చందంబున రోషభీషణాటోపంబులం దలపడు బెబ్బులుల గబ్బున నతి దర్పాతిరేకంబున నెదిర్చి ఱంకెలు వైచు మదవృషభంబుల రభసంబున నసహ్యసింహపరాక్రమంబున విక్రమించి పోరునెడ; హిరణ్యాక్షుండు సవ్యమండల భ్రమణంబునం బరివేష్టించినం బుండరీకాక్షుండు దక్షిణ మండల భ్రమణంబునం దిరిగి విపక్షవక్షం బశనిసంకాశం బగు గదా దండంబునం బగిల్చిన; వాడు దెప్పఱి తెలివొంది లేచి; దనుజ పరిపంథి ఫాలంబు నొప్పించె; నప్పు డమ్మేటి వీరులు శోణితసిక్తాంగు లై పుష్పితాశోకంబులం బురుడించుచుం బాయుచు డాయుచు వ్రేయుచు రోయుచు నొండొరుల రుధిరంబు లాఘ్రాణించుచుఁ దిరస్కార పరిహసోక్తుల నిచ్చుచుఁ బోరు సమయంబున; నమ్మహాబలుల సమరంబుఁ జూచువేడ్కఁ బద్మసంభవుండు నిఖిల మునీంద్ర సిద్ద సాధ్య దేవ గణంబులతోడఁ జనుదెంచి; ధరిత్రీ నిమిత్తంబున నసురవరునితోడం బోరు యజ్ఞవరాహున కిట్లనియె.

బ్రహ్మస్తవంబు

(668) "అంచిత దివ్యమూర్తి! పరమాత్మక! యీ కలుషాత్ముఁ డైన న¯ క్తంచరుఁ డస్మదీయ వరగర్వమునన్ భువనంబు లెల్లఁ గా¯ రించు మదించి యిట్టి విపరీతచరిత్రునిఁ ద్రుంప కిట్లుపే¯ క్షించుటగాదు వీని బలిసేయు వసుంధరకున్ శుభంబగున్. (669) బాలుఁడు గరమున నుగ్ర¯ వ్యాళము ధరియించి యాడు వడుపున రక్షః¯ పాలునిఁ ద్రుంపక యూరక¯ పాలార్చుట నీతియే శుభప్రద! యింకన్. (670) అదియునుం గాక. (671) అనఘా! యీ యభిజిన్ముహూర్తమున దేవారాతి మర్దింపవే¯ ననయంబున్ మఱి దైత్యవేళ యగు సంధ్యాకాల మేతెంచినన్¯ ఘనమాయాబలశాలి యైన దనుజున్ ఖండింపఁగా రాదు గా¯ వున నీవేళన త్రుంపు సజ్జనహితప్రోద్యోగరక్తుండవై." (672) అని సరసిజగఁర్భుడు ప¯ ల్కినవచనము లర్థి విని నిలింపులు గుంపుల్¯ కొనిచూడ సస్మితానన¯ వనజముసెలువొంద నసురవరు కభిముఖుఁడై. (673) పుండరీకాక్షుఁ డయ్యును భూరిరోష¯ నిరతిఁ దరుణారుణాంభోజనేత్రుఁ డగుచు¯ ఘనగదాదండ మెత్తి రాక్షసుని హనువు¯ నుగ్రగతి మొత్తె వాఁడును నోపరించె. (674) పరువడి దితిసుతుఁ డతి భీ¯ కరగదఁ జేబూని చిత్రగతులను బద్మో¯ దరుఁ డాసి చేతిగద సా¯ గరమునఁ బడ నడిచె బాహుగర్వమెలర్పన్. (675) అంత. (676) హరి నిరాయుధుఁడైన సురారి సమర¯ ధర్మ మాత్మను దలఁచి యుద్ధంబుఁ దక్కి¯ నిలిచి చూచుచునుండెను నింగి నమర¯ వరుల హాహా రవంబుల భరిత మయ్యె. (677) సరసిజనేత్రుఁడు దనుజే¯ శ్వరు సంగరధర్మమునకు సమధికశౌర్య¯ స్ఫురణకుఁ దన చిత్తంబున¯ గరమాశ్చర్యంబు నొంది కడఁకదలిర్పన్. (678) కుతలోద్ధర్త మనంబునం దలఁచె రక్షోరాడ్వధార్థంబుగా¯ దితిసంతానకులాటవీమహితసందీప్తప్రభా శుక్రమున్¯ సతతోద్యజ్జయశబ్దసన్ముఖరభాస్వచ్ఛక్రమున్ సంతతా¯ శ్రితనిర్వక్రముఁ బాలితప్రకటధాత్రీచక్రముం జక్రమున్. (679) అదియునుం, బ్రచండమార్తాండమండలప్రభాపటల చటుల విద్యోత మానంబును, పటునటజ్జ్వాలికాపాస్త సమస్త కుపితారాతి బలాఖర్వ దుర్వార బాహాగర్వాంధకారంబును, యసహ్య కహకహ నినదాధరీకృత సాగరఘోషంబును, సకల దేవతాగణ జేగీయమానంబును, ననంత తేజోవిరాజితంబును, నిజ ప్రభాపటలపూరిత బ్రహ్మాండకటాహంబును నై; రయంబునం జనుదెంచి దనుజారి దక్షిణ కరసరోజంబు నలంకరించిన నా శుభాంగుండు రథాంగపాణియై దివంబున నమర గణంబులు జయజయశబ్దంబులు పలుక నసురవిభున కెదురుగా నడచిన. (680) పొడగని దనుజుఁడు పెదవులు¯ దడుపుచుఁ బొలివోని బంటుతనమున బీరం¯ బుడుగక భీషణగదఁ గొని¯ యడిచెన్ మఖమయవరాహు నమితోత్సాహున్. (681) త్రిదశారి దన్ను వ్రేసిన¯ గదఁ బదమునఁ బోవదన్ని కమలాక్షుఁడు పెం¯ పొదవగ మనమున మోదము¯ గదురగ లేనగవు వదనకమలము బొదువన్. (682) ఇవ్విధంబున గదఁ బోవందన్ని యసురవిభునితో నిట్లనియె. (683) "ఘనగదఁ గేలఁబూని భుజగర్వమెలర్పఁగ నన్ను సంగరా¯ వని నెదిరింతు; రార; యనివారణ దైత్యకులేశ్వరాధమా! "¯ యనవుడు వాఁడు నుబ్బి గద నంబుజనాభుని వ్రేసె; వ్రేసినన్¯ దనుజవిభేది పట్టికొనెఁ దార్క్ష్యుఁ డహీంద్రునిఁ బట్టుకైవడిన్. (684) దితిజుఁడు దన బల మప్రతి¯ హతతేజుం డగు సరోరుహాక్షుని శౌర్యో¯ న్నతిమీఁద బెట్టకుండుట¯ మతి నెఱిఁగియుఁ బెనఁగె దురభిమానముపేర్మిన్. (685) అంత. (686) కాలానలజ్వలజ్జ్వాలావిలోల క¯ రాళమై పెంపొందు శూల మంది¯ సురవైరి యజ్ఞసూకరరూపధరుఁ డైన¯ వనజనాభునిమీఁద వైవ నదియు¯ సద్విజోత్తముమీఁదఁ జపలత గావించు¯ నభిచారకర్మంబు నట్ల బెండు¯ పడి పఱితేఁ గని పద్మోదరుడు దానిఁ¯ జక్రధారాహతిఁ జండవిక్ర (686.1) మమున నడమన వడి ద్రుంచె నమరభర్త¯ మహిత దంభోళిచే గరుత్మంతు పక్ష¯ మతిరయంబునఁ ద్రుంచినగతిఁ జెలంగి¯ సురలు మోదింప నసురులు సొంపు డింప. (687) అయ్యవసరంబున నయ్యసురుడు దన శూలంబు చక్రంబుచేత నిహతం బగుటం గని. (688) దితిజుఁడు రోషోద్ధతుఁడై¯ యతి నిష్ఠుర ముష్టిఁ బొడిచె హరి నా లోకో¯ న్నతుఁ డొప్పెఁ గుసుమమాలా¯ హతి దిగ్గజరాజుఁ బోలె నతి దర్పితు డై. (689) హరిమీఁదన్ దితిసంభవుండు ఘనమాయాకోట్లు పుట్టించినన్¯ ధరణీచక్రము భూరి పాంసుపటలధ్వాంతంబునం గప్పె భీ¯ కర పాషాణ పురీష మూత్ర ఘనదుర్గంధాస్థి రక్తావళుల్¯ గురిసెన్ మేఘము లభ్రవీథిని మహాక్షోభక్రియాలోలమై. (690) మఱియును. (691) తవిలి విముక్తకేశపరిధానము లుగ్రకరాళదంత తా¯ లువులును రక్తలోచనములుం గల భూత పిశాచ ఢాకినీ¯ నివహము లంతరిక్షమున నిల్చి నిజాయుధపాణులై మహా¯ రవముగ యక్ష దైత్య చతురంగ బలంబులఁ గూడి తోచినన్. (692) అంత. (693) త్రిసవనపాదుం డగు నా¯ బిసరుహనేత్రుండు లోకభీకర మగు నా¯ యసురాధిపు మాయావిని¯ రసనకరం బైన శస్త్రరాజముఁ బనిచెన్. (694) ఆ చక్రభానుదీప్తి ధ¯ రాచక్రమునందు నిండిరయముననమ్మా¯ యాచక్రమునడఁగించెను¯ నీచక్రముఁడైన యామినీచరు నెదురన్ (695) అంత నిక్కడ. (696) దితి దన విభువాక్యంబుల¯ గతిదప్పద యనుచుఁ దలఁపఁగాఁ జన్నుల శో¯ ణితధార లొలికె రక్షః¯ పతి యగు కనకాక్షుపతనభావము దోఁపన్. (697) అయ్యవసరంబున, నసురవిభుండు దనచేసిన మాయాశతంబులు గృతఘ్నునకుం గావించిన యుపకారంబులుం బోలె హరిమీఁదఁ బనిసేయక విఫలంబు లయినం; బొలివోవని బంటుతనంబునఁ బుండరీకాక్షుఁ జేరం జనుదెంచి బాహుయుగళంబు సాఁచి పూఁచి పొడచి రక్షోవైరి వక్షంబుఁ బీడించిన; నయ్యధోక్షజుండు దప్పించుకొని తలంగినం జెలంగి దైత్యుండు నిష్ఠురం బగు ముష్టిం బొడచిన; నసురాంతకుండు మిసిమింతుడు గాక రోషభీషణాకారాంబున వాసవుండు వృత్రాసురుం దెగటార్చిన చందంబున వజ్రివజ్రసన్నిభం బగు నటచేతం గఱకు టసురకటితటంబుఁ జటులగతి వ్రేసిన నా హిరణ్యాక్షుండు దిర్దిరందిరిగి యుదస్తలోచనుండై సోలి; యెట్టకేలకు నెదుర నిలువంబడె; నంత.

హిరణ్యాక్ష వధ

(698) దిటచెడి లోఁబడె దైత్యుఁడు¯ సటికిన్ దంష్ట్రావిభిన్న శత్రు మహోర¯ స్తటికిన్ ఖరఖురపుటికిం¯ గటితటహత కమలజాండఘటికిం గిటికిన్. (699) ఇట్లు లోఁబడిన. (700) దివి నింద్రాదులు సంతసింప హరి మొత్తెం గర్ణమూలంబునం¯ బవిసంకాశకఠోరహస్తమున శుంభల్లీలమై దాన దా¯ నవలోకేశుఁడు రక్తనేత్రుఁ డగుచున్ దైన్యంబు వాటిల్లగా¯ భువిమీఁదంబడి సోలె మారుతహతోన్మూలావనీజాకృతిన్. (701) బుడబుడ నెత్తురు గ్రక్కుచు¯ వెడరూపముదాల్చి గ్రుడ్లు వెలికుఱుక నిలం¯ బడి పండ్లు గీటుకొనుచును¯ విడిచెం బ్రాణములు దైత్యవీరుం డంతన్. (702) పడిన దనుజేశ్వరునిఁ జూచి పద్మసంభ¯ వాది దివిజులు వెఱగంది రాత్మ లందు¯ నితఁడు వొందుట యెట్లొకో యీ యవస్థ¯ నని తలంచుచు మఱియు నిట్లనిరి వరుస. (703) "వరయోగీంద్రులు యోగమార్గముల నెవ్వానిన్ మనోవీథి సు¯ స్థిరతన్ లింగశరీరభంగమునకై చింతింతు రా పంకజో¯ దరు పాణ్యాహతిఁ దన్ముఖాంబురుహమున్ దర్శించుచుం జచ్చె దు¯ ర్భరితోత్తంసుఁని దైత్య వల్లభుని సౌభాగ్యంబు దా నెట్టిదో. (704) సమమతి వీరు దైత్యకులశాసను పారిషదుల్ మునీంద్ర శా¯ పమున నికృష్టజన్మమునఁ బైకొని పుట్టియు నేఁడు విష్ణుచే¯ సమయుటఁ జేసి మీఁదనగు జన్మమునన్ జలజాక్షు నిత్య వా¯ సమున వసింతు రెన్నటికిఁ జావును బుట్టువు లేవు వీరికిన్." (705) అని వెఱగు నొంది త్రిసవన¯ తను వొందిన యట్టి వికచతామరసాక్షు¯ న్ననిమిష ముని యోగిజనా¯ వనదక్షున్ దనుజకరటివరహర్యక్షున్.

దేవతలు శ్రీహరిని నుతించుట

(706) కనుంగొని. (707) "వనజదళాక్ష! యీ జగతి వారల మర్మము లీ వెఱింగి యీ¯ సునఁ బగబట్టు నీ దివిజసూదనుఁ జంపితి గాన యింక శో¯ భన మగు"నంచు హస్తములు ఫాలములం గదియించి యందఱున్¯ వినమితులై నుతించిరి వివేకవిశాలునిఁ బుణ్యశీలునిన్.

వరహావతార విసర్జనంబు

(708) అంత. (709) సవనవరాహమూర్తి సురశాత్రవుఁ ద్రుంచిన మీఁద భారతీ¯ ధవ ముఖ దేవతాముని కదంబము దన్ను నుతించు నట్టి సం¯ స్తవమున కాత్మలోనఁ బ్రమదంబునుఁ బొంది సమగ్ర మంగళో¯ త్సవము దలిర్ప నందఱఁ బ్రసాదవిలోకన మొప్పఁ జూచుచున్. (710) అరిగె వికుంఠధామమున కమ్మహితోత్సవసూచకంబుగా¯ మొరసె సుపర్వదుందుభు లమోఘములై ధరణీతలంబునం¯ గురిసెఁ బ్రసూనవృష్టి శిఖికుండము లెల్లెడఁ దేజరిల్లె భా¯ స్కరశశిమండలంబులు నిజద్యుతితో వెలుగొందె నత్తఱిన్. " (711) అని యీ పుణ్యచరిత్రము¯ వనరుహసంభవుఁడు త్రిదివవాసులకుం జె¯ ప్పిన యది మైత్రేయుఁడు విదు¯ రున కెఱిఁగించిన విధంబు రూఢము గాఁగన్. (712) శుకయోగి పరీక్షిత్తున¯ కకుటిలమతి నెఱుఁగఁ జెప్పె"నని సూతుఁడు శౌ¯ నక ముఖ్యులైన మునివరు¯ లకుఁ దెలియగఁ జెప్పె మఱియు లాలనమొప్పన్. (713) ఇవ్విధంబున మైత్రేయుండు సెప్పిన విని విదురుండు సంతసిల్లె నని. (714) "అనఘంబగు నీ చరితము¯ వినినఁ బఠించిన లభించు విశ్రుతకీర్తుల్¯ వనజోదరుపదభక్తియు¯ మునుకొని యిహపర సుసౌఖ్యములు జనములకున్." (715) అని చెప్పి; వెండియు సూతుండు మహర్షుల కిట్లనియె "నట్లు పరీక్షిన్నరేంద్రుఁడు శుకయోగీంద్రుం గనుంగొని "మునీంద్రా! హిరణ్యాక్ష వధానంతరంబున వసుంధర సమస్థితిం బొందిన విధంబును; స్వాయంభువమనువుఁ బుట్టించిన యనంతరంబున విరించి దిర్యగ్జాతి జంతుసృష్టి నిమిత్తంబు లైన మార్గంబు లెన్ని సృజించె; మహాభాగవతోత్తముం డయిన విదురుండు గృష్ణున కపకారంబులు దలంచిన పాపవర్తను లగు ధృతరాష్ట్రపుత్రులం బాసి జనకుం డగు కృష్ణద్వైపాయనునకు సముం డగుచుఁ దన మనోవాక్కాయకర్మంబులు గృష్ణునంద చేర్చి భాగవతజనోపాసకుండై పుణ్యతీర్థసేవాసమాలబ్ధ యశో విగతకల్మషుం డగుచు మైత్రేయ మహాముని నేమి ప్రశ్నంబు లడిగె; నవి యెల్లం దెలియ నానతి"మ్మనిన రాజేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. (716) "విమలాత్ముఁ డైన యవ్విదురుండు మైత్రేయ¯ మునివరుఁ జూచి యిట్లనియెఁ బ్రీతిఁ¯ "జతురాత్మ సకలప్రజాపతి యైనట్టి¯ జలజగర్భుఁడు ప్రజాసర్గ మందు¯ మును ప్రజాపతులను బుట్టించి వెండియు¯ జిత్త మం దేమి సృజింపఁ దలఁచె; ¯ మును సృజించిన యట్టి మును లమ్మరీచాద్యు¯ లబ్జజు నాదేశ మాత్మనిలిపి (716.1) యర్థి నెట్లు సృజించిరి యఖిలజగము¯ మెఱసి మఱి వారు భార్యాసమేతు లగుచు¯ నేమి సృజియించి; రదిగాక కామినులను¯ బాసి యేమి సృజించి; రా భద్రయశులు. (717) అందఱుఁ దమలో నైక్యముఁ¯ జెందినచో నేమి దగ సృజించిరి; కరుణా¯ కందళితహృదయ! యిన్నియుఁ¯ బొందుగ నెఱిగింపు మయ్య బుధనుత! నాకున్."

దేవమనుష్యాదుల సృష్టి

(718) అనిన మునీంద్రుఁ డిట్లనియె "జీవాదృష్ట¯ పరుఁడు మాయాయుక్త పురుషవరుఁడుఁ¯ గాలాత్మకుఁడు నను కారణంబున నిర్వి¯ కారుఁ డైనట్టి జగన్నివాసుఁ¯ డాది జాతక్షోభుఁ డయ్యె నమ్మేటి వ¯ లనను గుణత్రయంబును జనించె¯ నా గుణత్రయము నం దయ్యె మహత్తత్త్వ¯ మది రజోగుణహేతువైన దాని (718.1) యం దహంకార మొగిఁ ద్రిగుణాత్మకమునఁ¯ బొడమె మఱి దానివలనఁ బ్రభూత మయ్యె¯ బంచతన్మాత్ర లందు సంభవము నొందె¯ భూతపంచక మీ సృష్టిహేతు వగుచు. (719) అవియును దమలోనఁ బ్రత్యేకంబ భువననిర్మాణకర్మంబునకు సమర్థంబులు గాక యన్నిటి సంఘాతంబునఁ బాంచభౌతికం బైన హిరణ్మయాండంబు సృజియించె; నదియును జలాంతర్వర్తియై వృద్ధిఁ బొందుచుండె; నంత. (720) నారాయణాఖ్య నున్నతి నొప్పు బ్రహ్మంబు¯ సాహస్ర దివ్యవర్షంబులోలి¯ వసియించి యుండె నా వాసుదేవుని నాభి¯ యందు సహస్ర సూర్యప్రదీప్తిఁ¯ దనరుచు సకలజీవనికాయ యుత మగు¯ పంకజాతంబు సంభవము నొందెఁ¯ బరఁగంగ నందులో భగవదధిష్ఠితుం¯ డై స్వరాట్టగు చతురాననుండు (720.1) జనన మొందెను దత్పద్మసంభవుండు¯ నామరూపగుణాది సంజ్ఞాసమేతుఁ¯ డగుచు నిర్మాణ మొనరించె నఖిలజగము¯ వనజజుండు నిజచ్ఛాయవలన మఱియు. (721) తామిస్రమును నంధతామిస్రమును దమ¯ మును మోహమును మహామోహనంబు¯ నను పంచమోహరూపాత్మకమైన య¯ విద్యఁబుట్టించి యవ్వేళఁ దనకు¯ నది తమోమయ దేహ మని ధాత రోసి త¯ త్తనువు విసర్జించె ధాతృముక్త¯ దేహంబు సతత క్షుత్తృష్ణల కావాస¯ మును రాత్రిమయము నయ్యెను దలంప (721.1) నందులో యక్ష రక్షస్సు లన జనింప¯ వారి కప్పుడు క్షుత్తృషల్ వఱలఁ గొంద¯ ఱా చతుర్ముఖు భక్షింతు మనిరి కొంద¯ ఱతని రక్షింతు మని తగవాడి రంత. (722) ఇట్లు పలుకుచు భక్షింతు మనువారలయి ధాత సన్నిధికిం జనిన; నతండు భయవిహ్వలుండై "యేను మీ జనకుండను మీరలు మత్పుత్రులరు నన్ను హింసింపకుం"డనుచు "మా మా జక్షత రక్షత"యను శబ్దంబులు పలుకం దన్నిమిత్తంబున వారలకుం గ్రమంబున యక్ష రక్షో నామంబులు ప్రకటం బయ్యె; వెండియుం బ్రభావిభాసితం బైన యొక్క కాయంబు ధరించి సత్త్వగుణగరిష్ఠులుం, ప్రభావంతులు నగు సుపర్వులం బ్రముఖులంగా సృజియించి; తత్ప్రభామయ గాత్రవిసర్జనంబుసేసిన; నది యహోరూపంబై దేవతావళికి నాశ్రయం బయ్యె; మఱియు జఘనంబు వలన నతి లోలుపులైన యసురులం బుట్టింప వార లతికాముకు లగుటం జేసి; యయ్యజునిం జేరి మిథున కర్మం బపేక్షించిన; విరించి నగుచు నిర్లజ్జు లయిన యసురులు దన వెంటదగులం; బఱచి ప్రపన్నార్తి హరుండును భక్తజనానురూప సందర్శనుండును నైన నారాయణుం జేరి తత్పాదంబులకుం బ్రణమిల్లి యిట్లనియె. (723) "రక్షింపుము రక్షింపు ము¯ పేక్షింపక వినుత నిఖిల బృందారక! వి¯ శ్వక్షేమంకర! విను మిటు¯ దక్షత నీ యాజ్ఞ నేను దలనిడి వరుసన్. (724) ఈ ప్రజాసృష్టి కల్పనం బే నొనర్ప¯ నందుఁ బాపాత్ము లైన యీ యసురు లిపుడు¯ నను రమింపఁగ డాయవచ్చినఁ గలంగి¯ యిటకు వచ్చితి ననుఁ గావు మిద్దచరిత! (725) అదియునుం గాక; లోకంబువారలకుం గ్లేశంబు లొనరింపం గ్లేశంబునం బొందిన వారల క్లేశంబు లపనయింపను నీవ కాక యితరులు గలరే?"యని స్తుతియించినఁ బద్మజు కార్పణ్యం బెఱుంగ నవధరించి వివిక్తాధ్యాత్మదర్శనుం డగుచుఁ "గమలసంభవ! భవద్ఘోరతనుత్యాగంబు సేయు"మని యానతిచ్చిన నతండు నట్ల చేసె;నంత నదియును. (726) నవ్యకాంచనరణన్మణినూపురారావ¯ విలసిత పాదారవిందయుగళ¯ కాంచీకలాపసంకలిత దుకూలవ¯ స్త్రస్ఫారపులిన నితంబ బింబ¯ రాజితాన్యోన్యకర్కశపీనకరికుంభ¯ పృథుకుచభారకంపిత వలగ్న¯ మదిరారసాస్వాద మదవిఘూర్ణిత చారు¯ సిత నవవికచరాజీవనయన (726.1) యపరపక్షాష్టమీ శశాంకాభ నిటల¯ మదవదలికులరుచిరోపమాన చికుర¯ లలితచంపకకుసుమవిలాస నాస¯ హాసలీలావలోకన యబ్జపాణి. (727) అనఁదగి సంధ్యారూపం¯ బున లలనారత్న మపుడు పుట్టిన దానిం¯ గనుఁగొని దానవు లుపగూ¯ హనమొగిఁ గావించి పలికి రందఱు దమలోన్. (728) “ఈ సౌకుమార్య మీ వయ¯ సీ సౌందర్యక్రమంబు నీ ధైర్యంబు¯ న్నీ సౌభాగ్యవిశేషము¯ నే సతులకుఁ గలదు చూడనిది చిత్ర మగున్.” (729) అని వెఱగంది యద్దనుజు లందఱు నిట్లని "రీ తలోదరిం¯ గని మన మంతనుండియును గాముకవృత్తిఁ జరించుచుండగా¯ మన యెడ దీని చిత్తమున మక్కువలేమికి నేమి హేతువో"¯ యని బహుభంగులం బలికి యా ప్రమదాకృతియైన సంధ్యతోన్. (730) ఇట్లనిరి. (731) "ఓ కదళీస్తంభోరువ! ¯ యే కుల? మే జాడదాన? వెవ్వరి సుత? వి¯ ట్లేకాంతంబున నిచ్చట¯ నే కారణమునఁ జరించె? దెఱిఁగింపు తగన్. (732) భవదీయ చారురూప¯ ద్రవిణలసత్పుణ్యభూమిఁ దగు మోహమునం¯ దవిలిన దుర్భలులను మముఁ¯ గవయవు పుష్పాస్త్రుబాధ ఘనమయ్యెఁ గదే! (733) మఱియుఁ దదీయ సౌందర్యం బుగ్గడింప నలవిగాక చింతించుచు. (734) గురు కుచభార సంకుచితావలగ్నంబు¯ దనరారు నాకాశ తలము గాఁగ¯ లలిత పల్లవపాణితలమునఁ జెన్నొందు¯ చెండు పతత్పతంగుండు గాఁగ¯ సలలిత నీల పేశల పృథు ధమ్మిల్ల¯ బంధంబు ఘన తమఃపటలి గాఁగ ¯ ప్రవిమలతర కాంత భావవిలోకన¯ జాలంబు దారకాసమితి గాఁగ (734.1) గడఁగి మైపూఁత సాంధ్యరాగంబు గాఁగఁ¯ నంగనాకృతి నొప్పు సంధ్యావధూటిఁ¯ గదిసి మనముల మోహంబు గడలుకొనఁగ¯ నసురు లందఱు గూడి యిట్లనిరి మఱియు. (735) "వెలయఁగ బద్మం బేక¯ స్థలముననే యొప్పుఁ గాని త్వత్పదపద్మం¯ బిల బహుగతుల ననేక¯ స్థలముల దనరారుఁ గాదె తరుణాబ్జముఖీ!" (736) అని దనుజులు దమ మనముల¯ ననురాగము లుప్పతిల్ల నందఱు నా సం¯ ధ్యను బట్టికొనిరి వనజా¯ సను డప్పుడు హృదయ మందు సంతస మందెన్. (737) సరసిజభవుఁ డయ్యెడఁ దన¯ కరమాఘ్రాణింప నపుడు గంధర్వులు, న¯ ప్సరసలుఁ బుట్టిరి ధాతయుఁ¯ బరువడి నాత్మీయ తనువుఁ బాసిన నదియున్. (738) చంద్రికారూపం బైన దద్గాత్రంబు విశ్వావసు పురోగము లగు గంధర్వాప్సరో గణంబులు గైకొనిరి; వెండియుం గమలగర్భుండు తంద్రోన్మాద జృంభికానిద్రారూపం బైన శరీరంబు దాల్చి; పిశాచ గుహ్యక సిద్ధ భూత గణంబులం బుట్టించిన; వారలు దిగంబరులు ముక్తకేశులు నయినం జూచి; ధాత లోచనంబులు ముకుళించి తద్గాత్రంబు విసర్జనంబు గావించిన నది వారలు గైకొనిరి; వెండియు నజుండు దన్ను నన్నవంతునిగాఁ జింతించి యదృశ్య దేహుం డగుచుం బితృ సాధ్య గణంబులం బుట్టించిన; వారలు దమ్ముఁ బుట్టించిన యదృశ్య శరీరంబునకు గార్యం బగు దేవభాగంబు గైకొనినం దత్కారణంబునం బితృ సాధ్య గణంబుల నుద్దేశించి శ్రాద్ధంబుల హవ్యకవ్యంబు లాచరింతురు; మఱియును. (739) సజ్జనస్తుత! విను చతురతఁ బంకజా¯ సనుఁడు దిరోధానశక్తివలన¯ నర సిద్ధ విబుధ కిన్నరలను బుట్టించి¯ తవిలి వారికిఁ దిరోధాననామ¯ ధేయమై నట్టి యా దేహంబు నిచ్చెను¯ వెండియు భారతీవిభుఁడు దనకుఁ ¯ బ్రతిబింబ మగు శరీరమునఁ గిన్నరులఁ గిం¯ పురుషులఁ బుట్టింపఁ బూని వారు (739.1) ధాత్రు ప్రతిబింబ దేహముల్ దాల్చి వరుస¯ నిద్దఱిద్దఱు గలగూడి యింపులొదవ ¯ బ్రహ్మపరమైన గీతముల్ వాడుచుండి¯ రంతఁ బంకజసంభవుఁ డాత్మలోన. (740) తన సృష్టి వృద్ధిలేమికిఁ¯ గనలుచు శయనించి చింతఁ గర చరణాదుల్¯ గొనకొని కదలింపఁగ రా¯ లిన రోమము లుగ్రకుండలివ్రజ మయ్యెన్. (741) వనజజుఁడు దన్నుఁ గృతకృ¯ త్యునిఁగా భావించి యాత్మఁ దుష్టివహింపన్¯ మనమున నిఖిల జగత్పా¯ వను లగు మనులం ద్రిలోకవరుల సృజించెన్. (742) పుట్టించి వారికిఁ బురుషరూపం బైన¯ తన దేహ మిచ్చినఁ దగిలి వారు¯ గనుఁగొని మున్ను పుట్టినవారిఁ గూడి యా¯ వనజసంభవున కిట్లనిరి "దేవ! ¯ యఖిలజగత్స్రష్ట వైన నీ చేతఁ గా¯ వింపంగఁబడిన యీ వితతసుకృత¯ మాశ్చర్యకరము యజ్ఞాదిక్రియాకాండ¯ మీ మనుసర్గ మం దీడ్యమయ్యెఁ (742.1) దద్ధవిర్భాగములు మాకుఁ దవిలి జిహ్వ¯ లందు నాస్వాదనములు సేయంగఁగలిగె"¯ ననుచు మనముల హర్షంబు లతిశయిల్ల¯ వినుతిసేసిరి భారతీవిభుని మఱియు. (743) వరతపోయోగవిద్యాసమాధి యుక్తుం డగుచు ఋషివేషధరుండును హృషీకాత్ముండును నై ఋషిగణంబులం బుట్టించి సమాధి యోగైశ్వర్య తపోవిద్యా విరక్తి యుక్తం బగు నాత్మీయ శరీరాంశంబు వారికిం గ్రమంబున నొక్కొక్కనికి నిచ్చె"నని మైత్రేయుండు సెప్పిన విని విదురుండు పరమానందంబునం బొంది గోవిందచరణారవిందంబులు డెందంబునం దలంచి వెండియు మైత్రేయునిం జూచి యిట్లనియె. (744) "వరగుణ స్వాయంభువమనువంశం బిలఁ¯ బరమ సమ్మతము దప్పదు తలంపఁ¯ గొనకొని తద్వంశమున మిథునక్రియఁ¯ జేసి ప్రజావృద్ధిఁ జెప్పితీవు¯ అదియునుగాక స్వాయంభువ మనువుకుఁ¯ బూని ప్రియవ్రతోత్తానపాదు¯ లను నందనులు గలరంటివి వారు స¯ ప్తద్వీపవతి యైన ధాత్రినెల్ల (744.1) ధర్మమార్గంబు లేదియుఁ దప్పకుండ¯ ననఘులై యెట్లు పాలించి రయ్య! వారి¯ చరిత మెల్లను సత్కృపా నిరతబుద్ధి¯ నెఱుఁగ వినిపింపు నాకు మునీంద్రచంద్ర! (745) అదియునుగాక; తన్మనుపుత్రియు యోగలక్షణసమేతయు నగు దేవహూతి యను కన్యకారత్నంబును స్వాయంభువుండు గర్దమునకు నే విధంబునం బెండ్లిచేసె; నా దేవహూతి యందు మహాయోగి యయిన కర్దముండు ప్రజల నేలాగునం బుట్టించె; నదియునుం గాక కర్దముండు రుచి యను కన్యను దక్షప్రజాతికి నిచ్చె నని చెప్పితి; వవి యన్నియుఁ దెలియ నానతీయవలయు"నని యడిగిన విదురు నకు మైత్రేయుం డిట్లనియె.