పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 531 - 630

శ్రీహరి దర్శనంబు

(531) అను సమయంబున. (532) హరి సర్వేశుఁ డనంతుఁ డా కలకలం బాలించి పద్మాలయా¯ సరసాలాపవినోద సౌఖ్యరచనల్ చాలించి శుద్ధాంత మం¯ దిర మాణిక్య సుగేహళుల్ గడచి యేతెంచెం బ్రపన్నార్తి సం¯ హరుఁడై నిత్యవిభూతిశోభనకరుండై మానితాకారుఁడై. (533) మఱియును. (534) శరనిధికన్యకామణియు సంభ్రమ మొప్పఁగఁ దోడరా మనో¯ హర నిజ లీలమైఁ బరమహంస మునీశ్వర వంద్య పాదపం¯ కరుహములన్ వినూత్న మణికాంచన నూపుర మంజు ఘోషముల్¯ వరుసఁ జెలంగ నార్యజనవంద్యుఁడు యోగిజనైకసేవ్యుఁడై. (535) కర మణి హేమ కంకణ నికాయ ఝణంకృతు లుల్లసిల్ల న¯ చ్చర లిడు హంసపక్ష సితచామర గంధవహోచ్చలత్సుధా¯ కర రుచి రాతపత్ర సుభగప్రవిలంబిత హారవల్లరీ¯ సరస గళత్తుషార కణజాల విరాజిత మంగళాంగుడై. (536) మఱియును. (537) నిఖిల మునీంద్ర వర్ణిత సస్మితప్రస¯ న్నాననాంబుజముచే నలరు వాఁడు¯ విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజ భక్త¯ జన గుహాశయుఁ డనఁ దనరు వాఁడు¯ మానిత శ్యామాయమాన వక్షమున నం¯ చిత వైజయంతి రాజిల్లు వాఁడు¯ నతజనావన కృపామృత తరంగితములై¯ భాసిల్లు లోచనాబ్జముల వాఁడు (537.1) నఖిల యోగీంద్రజన సేవ్యుఁ డైన వాఁడు¯ సాధుజనముల రక్షింపఁ జాలు వాడు¯ భువన చూడా విభూషయై భూరిమహిమ¯ మించు వైకుంఠపురము భూషించు వాఁడు. (538) కటి విరాజిత పీతకౌశేయశాటితో¯ వితత కాంచీగుణ ద్యుతి నటింప¯ నాలంబి కంఠ హారావళి ప్రభలతోఁ¯ గౌస్తుభరోచులుగ్రందుకొనఁగ¯ నిజకాంతి జిత తటిద్వ్రజ కర్ణ కుండల¯ రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ¯ మహనీయ నవరత్నమయ కిరీటప్రభా¯ నిచయంబు దిక్కుల నిండఁ బర్వ (538.1) వైనతేయాంస విన్యస్త వామహస్త¯ కలిత కేయూర వలయ కంకణము లొప్ప¯ నన్యకరతల భ్రమణీకృతానుమోద¯ సుందరాకార లీలారవింద మమర. (539) మఱిఁయుఁ; జరణారవింద మంజు కింజల్కపుంజప్రభా రంజిత తులసీ మరంద బందుర గంధానుబంధ సుగంధి గంధవహాస్వాద కలిత సేవాతత్పరులై చనుదెంచు యోగీంద్రులకు మానసానందకారియు బహిఃకరణాంతఃకరణ పరితోషప్రకీర్ణ రోమాంచ రుచిదాయకంబును ప్రభాపూర్తియుక్తంబును నగు మూర్తితోడ నిజ సౌందర్య వర కళావినిర్జిత శ్రీరమణీ సౌందర్య భాసమానుం డగుచుఁ; బాదచారి యై; యఖిల విశ్వగురుం డైన సర్వేశ్వరుండు వేంచేసె నప్పుడు. (540) స్థిర శుభలీల నట్లరుగుదెంచిన యవ్విభు విద్రుమారుణా¯ ధర నవపల్లవస్ఫురదుదంచిత కుంద రుచిస్మితైక సుం¯ దర వదనారవిందము ముదంబునఁ దప్పక చూచి యమ్మునీ¯ శ్వరులు నిజాత్మలం దనివిసాలక వెండియుఁ జూచి రిమ్ములన్. (541) సునిశిత భక్తిఁ దన్ముఖముఁ జూచిన చూడ్కులు ద్రిప్పలేకయుం¯ గనుఁగొని రెట్టకేలకు నకల్మష భక్త విధూత ఖేదముల్¯ మునిజన చిత్తమోదములు ముక్తినివాస కవాట భేదముల్¯ వినుత వి నూత్న నూపురిత వేదము లమ్మహనీయు పాదముల్. (542) కని నఖ పద్మరాగమణి కాంతివిభాసిత పాదపద్మము¯ ల్మనముల యందుఁ గీల్కొలిపి లబ్దమనోరథ యుక్తు లై పునః¯ పునరభివందనంబులు విభూతి దలిర్ప నొనర్చి యోగమా¯ ర్గనిరత చిత్తులున్ వెదకి కానఁగలేని మహానుభావునిన్. (543) మానసమున నిలిపిరి త¯ ద్ధ్యానాస్పదుఁడైన వానిఁ దత్త్వజ్ఞులకుం¯ గాన నగువాని భక్తజ¯ నానందకరైక మూర్తి నలరిన వానిన్.

సనకాదుల హరి స్తుతి

(544) మఱియుం; జక్షురింద్రియగ్రాహ్యం బగు దివ్యమంగళవిగ్రహంబు ధరియించి యున్న పురుషోత్తము నుదాత్తతేజోనిధిం జూచి సనకాదు లిట్లని స్తుతియించిరి. (545) "వనజదళాక్ష! భక్తజనవత్సల! దేవ! భవత్సుతుండు మ¯ జ్జనకుఁడు నైన పంకరుహజాతుడు మాకు రహస్య మొప్పఁ జె¯ ప్పిన భవదీయ మంగళగభీరపరిగ్రహ విగ్రహంబు మే¯ మనయముఁ జూడఁ గంటిమి కృతార్థులమై తగ మంటి మీశ్వరా! (546) దేవ! దుర్జనులకు భావింప హృదయ సం¯ గతుఁడవై యుండియుఁ గానఁబడవు¯ కడఁగి నీ దివ్యమంగళవిగ్రహంబున¯ జేసి సమంచితాశ్రితుల నెల్లఁ¯ జేఁకొని సంప్రీతచిత్తులఁగాఁజేయు¯ దతిశయ కారుణ్యమతిఁ దనర్చి¯ కమలాక్ష! సర్వలోకప్రజాధిప! భవ¯ త్సందర్శనాభిలాషానులాప (546.1) విదిత దృఢభక్తియోగ ప్రవీణు లగుచు¯ నర్థిమై వీతరాగు లైనట్టి యోగి¯ జనమనః పంకజాత నిషణ్ణమూర్తి¯ వని యెఱుంగుదురయ్య! నిన్నాత్మ విదులు. (547) యుక్తిం దలఁప భవద్వ్యతి¯ రిక్తము లైనట్టి యితర దృఢకర్మంబుల్¯ ముక్తిదము లయిన నీ పద¯ భక్తులు తత్కర్మములను బాటింప రిలన్. (548) కావున గీర్తనీయ గతకల్మష మంగళ తీర్థ కీర్తి సు¯ శ్రీవిభవప్రశస్త సుచరిత్రుఁడ వైన భవత్పదాబ్జ సే¯ వా విమలాంతరంగ బుధవర్గ మనర్గళభంగి నన్యమున్¯ భావమునం దలంచునె కృపాగుణభూషణ! పాపశోషణా! (549) పరమతపో విధూత భవపాపులమై చరియించు మాకు నేఁ¯ డరయ భవత్పదాశ్రితుల నల్గి శపించిన భూరి దుష్కృత¯ స్ఫురణ నసత్పథైక పరిభూతులమై నిజధర్మహానిగా¯ నిరయము నొందఁగావలసె నేరము వెట్టక మమ్ముఁ గావవే. (550) కరమనురక్తి షట్పదము గమ్రసుగంధమరందవాంఛచేఁ¯ దరమిడి శాతకంటకవృతస్ఫుటనవ్యతరప్రసూనమం¯ జరులను డాయు పోల్కిని భృశంబగు విఘ్నములన్ జయించునీ¯ చరణసరోజముల్గొలువ సమ్మతి వచ్చితిమయ్య కేశవా! (551) అలరు భవత్పదాంబుజ యుగార్పితమై పొలుపొందునట్టి యీ¯ తులసి పవిత్రమైనగతిఁ దోయజనాభ! భవత్కథాసుధా¯ కలితములైన వాక్కుల నకల్మషయుక్తిని విన్నఁ గర్ణముల్¯ విలసిత లీలమై భువిఁ బవిత్రములై విలసిల్లు మాధవా! (552) మహిత యశోవిలాసగుణమండన! సర్వశరణ్య! యింద్రియ¯ స్పృహులకుఁ గానరాక యతసీ కుసుమద్యుతిఁ నొప్పుచున్న నీ¯ సహజ శరీర మిప్పుడు భృశంబుగఁ జూచి మదీయ దృక్కు లిం¯ దహహ కృతార్థతం బొరసె నచ్యుత! మ్రొక్కెద మాదరింపవే." (553) అని సనకాదులు దత్పద¯ వనజములకు మ్రొక్కి భక్తివశమానసులై¯ వినిపించిన గోవిందుఁడు¯ మునివరులం జూచి పలికె ముదితాత్ముండై.

బ్రహ్మణ ప్రశంస

(554) "ఈ యిరువురు జయవిజయాభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు వీరు మిమ్ముం గైకొనక మదీయాజ్ఞాతిక్రమణు లయి చేసిన యపరాధంబునకుఁ దగిన దండంబు గావించితిరి; అది నాకు నభిమతం బయ్యె; అదియునుం గాక భృత్యు వర్గంబు సేయు నపరాధంబు స్వామిదియ; కాన యీ తప్పునకు మాననీయుండ నైన నన్ను మన్నించి ప్రసన్ను లగుదురు గాక"యని వెండియు నిట్లనియె. (555) "తనువునఁబుట్టినట్టి బెడిదంబగు కుష్టుమహాగదంబుచే¯ వనరి తదీయచర్మము వివర్ణతనొందినరీతి భృత్యులొ¯ ప్పనిపనిసేసినన్ విభులు బంధురచారుయశంబుఁబేరుఁబెం¯ పునుజెడిపోయి దుర్యశముబొందుచునుందురు విష్టపంబులన్ (556) అలవడ నాకు మీవలన నబ్బిన తీర్థ సుకీర్తనీయ స¯ ల్లలిత వినిర్మలామృత విలాస యశో విభవాభిరామమై¯ వెలయు వికుంఠనామ మపవిత్ర మనశ్శ్వపచాధమాది లో¯ కుల చెవి సోఁకఁ దత్క్షణమ కోరి పవిత్రులఁ జేయు వారలన్. (557) అట్టి నేను దలంప మీ యట్టి సాధు¯ జనుల కపకార మర్థిఁ జేసిన మదీయ¯ బాహుసము లైనఁ ద్రుంతు నుత్సాహలీల¯ నన్న నితరుల మీ మ్రోల నెన్న నేల? (558) ధరణిసురోత్తమసేవా¯ పరిలబ్ధం బయిన యట్టి పాతక నాశం¯ కర నిఖిలభువన పూత¯ స్ఫురితాంఘ్రిసరోజ తోయములు గల నన్నున్. (559) అలఘమతి విరక్తునిఁగాఁ¯ దలఁపక నిజ శుభ కటాక్ష దామక కలితా¯ ఖిల సంపద్విభవశ్రీ¯ లలనారత్నం బురస్థలంబును జెందెన్. (560) క్రతువులు సేయుచో శిఖిముఖంబున వేలుచు నట్టి తద్ఘృత¯ ప్లుత చరుభక్షణన్ ముదముఁ బొందదు నిస్పృహధర్మమార్గ సం¯ గతుఁడగు భూసురోత్తము ముఖంబున వేడ్క భుజించు నయ్యవి¯ స్త్రృతకబళంబునన్ మనము తృప్తి వహించినరీతి నిచ్చలున్ (561) సతతంబు నప్రతిహత యోగమాయా వి¯ భూతిచేఁబ్రఖ్యాతిఁ బొందు నేను¯ నే మహీసురుల సమిద్ధ నిర్మలపాద¯ నలిన రజోవితానములు భక్తి¯ హాటకనవరత్నకోటీరమునఁ దాల్తు¯ నట్టి నా చరణాంబుజాంబువులను¯ దవిలి ధరించి సద్యఃపవిత్రాత్ము లై¯ రర్థిఁ జంద్రావతం సాది దేవ (561.1) చయము లెవ్వాఁడు బ్రాహ్మణజనులు దమకు¯ నపకృతుల్ సేసిరేని మాఱలుగఁ డతఁడు¯ విప్రులను నన్నుఁగాఁగ భావించు నతఁడు¯ ధర్మపద్ధతి నా ప్రియతముఁడు వాఁడు. (562) గోవితతిన్ ధరాదివిజకోటిని నన్నును దీనవర్గమున్¯ వావిరి భేదబుద్ధిఁ గనువార లధోగతిఁ బొంద నందు నా¯ శీవిషరోషవిస్ఫురణజెంది కృతాంత భటుల్ మహోగ్ర గృ¯ ధ్రావలివోలెఁ జంచువుల నంగము లుద్ధతిఁ జింతు రెప్పుడున్. (563) ధరణిసురోత్తముల్ బహువిధంబులఁ దమ్ముఁ బరాభవించినన్¯ దరహసితాస్యులై యతి ముదంబున నిచ్చలుఁ బూజసేయుచున్¯ సరస వచోవిలాసముల సన్నుతిసేయుచుఁ దండ్రి నాత్మజుల్¯ కర మనురక్తిఁ బిల్చుగతిఁ గైకొని పిల్చిన వారు నా సముల్. (564) వినుఁ డయ్యనఘచరిత్రుల¯ కనయముఁ బ్రియతముఁడ నగుచు నమ్ముడువోదున్¯ మును నన్ను భృగువు దన్నినఁ¯ గనలక పరితోషవృత్తి గైకొంటిఁ గదే. (565) పొలుచు నా మానసాంభోజాత భావంబు¯ దెలియంగలేక యుద్వృత్తు లగుచుఁ¯ గడఁగి నా యానతిఁ గడచినఁ దద్దోష¯ ఫలము వీరలకు సంప్రాప్త మయ్యె¯ మునులార! నా చిత్తమున నున్న నీతియు¯ నిట్టిద భూమిపైఁ బుట్టి వీర¯ లచిరకాలమున నా యంతికంబున కోలి¯ నరుదెంచునట్లుగా ననుమతింప (565.1) వలయు"నని యమ్ముకుందుడు వలుకుటయును¯ విని మనంబున సనకాది మునివరేణ్యు¯ లమ్మహాత్ముని మృదుల భాషామృతంబుఁ¯ దవిలి క్రోలియు రోష సందష్టు లగుచు. (566) మునివరుల్ తమచిత్తములఁ దృప్తిఁబొందక¯ పంకజాతాక్షుఁడు వలికినట్టి¯ పరిమిత గంభీర బహుళార్థ దురవగా¯ హములను విస్ఫుర దమృతతుల్య¯ మాధుర్య సుగుణ సమన్వితమ్ములు విని¯ ర్గత శబ్దదోష నికాయములును¯ నైన వాక్యములకు నాత్మలఁ బరితోష¯ మంది యుల్లముల నెయ్యమున మనిచె (566.1) నొడయఁ డిప్పుడు నందించియో తలంప¯ నర్థి నిందించియో మత్కృతైకదండ¯ మునకు సంకోచ మొందియో యనుచు సంశ¯ యాత్ము లగుచు వివేకించి యంతలోన. (567) నలినాక్షుఁడు దమదెసఁ గృప¯ గలిగిన భావంబుఁ దెలిసి కౌతుకమొలయం¯ బులకాంకితాంగులై యు¯ త్కలికన్ హర్షించి నిటలఘటితాంజలులై. (568) భరిత నిజ యోగమాయా¯ స్ఫురణం దనరారు నతివిభూతియు బలముం¯ బరమోత్కర్షముఁ గల యీ¯ శ్వరునకు నిట్లనిరి మునులు సద్వినయమునన్. (569) "పొలుపు దీపింప నిత్యవిభూతి నాయ¯ కుడవు భగవంతుడవు ననఘుడవు నీవు¯ మత్కృతంబిప్డు నీకభిమత మటంటి¯ వీశ భవదీయ చారిత్ర మెఱుఁగఁ దరమె. (570) దేవగణాళి కెల్లఁ పరదేవతలై తనరారు నట్టి వి¯ ప్రావలి కాత్మనాయకుఁడవై పెనుపొందిన నీకు నీ ధరా¯ దేవత లెల్ల నెన్న నధిదేవత లైరఁట యెట్టి చోద్యమో? ¯ దేవ! సమస్తపావన! సుధీజనతావన! విశ్వభావనా! (571) కమలదళాక్ష! నీవలన గల్గిన ధర్మము దావకావతా¯ రముల సురక్షితం బగుఁ దిరం బగు నీశ్వర! నిర్వికారత¯ త్వమునఁ దనర్చు నిన్నరయఁ దత్ఫలరూపముఁ దత్ప్రధానగో¯ ప్యము నని పల్కుచుందురు కృపామయలోచన! పాపమోచనా! (572) మహిఁ దలపోయ నెవ్వని సమగ్ర పరిగ్రహమున్ లభింప ని¯ స్పృహమతులై మునీశ్వరులు మృత్యు భయంబునఁ బాతు రట్టి స¯ న్మహిత వివేకశాలి! గుణమండన! నీ కిల నన్య సత్పరి¯ గ్రహ మది యెట్టి చోద్యము జగత్పరిపాలన! నిత్యఖేలనా! (573) సతతంబు నర్థార్థిజన శిరోలంకార¯ పదరేణువులు గల పద్మ నేడు¯ జలజ కింజల్క నిష్యంద మరందలో¯ భాగత భ్రమరనాయకుని పగిది¯ ధన్యజనార్పితోదంచిత తులసికా¯ దామంబునకు నిజధామ మగుచు¯ భాసిల్లు భవదీయ పాదారవిందముల్¯ విలసితభక్తి సేవించు చుండి (573.1) కమలనయన! కృపావలోకనము లొలయ¯ నర్థిఁ బొడసూపు భాగవతానురక్తిఁ¯ జేసి భవదీయ మహిమంబు చిత్ర మరయ¯ చిరశుభాకార! యిందిరాచిత్తచోర! (574) చిరభాగ్యోదయ! దేవదేవ! లలితశ్రీవత్సలక్ష్మాంగ! యీ¯ వరవిప్రానుపదైక పుణ్యరజ మే వర్ణింప నీ మేని కా¯ భరణం బంటివి సర్వలోకులకు విప్రశ్రేణి మాహత్య మీ¯ వెఱుగం జెప్పుటకై ధరించితి గదా యెన్నం బవిత్రాకృతిన్. (575) అదియునుం గాక. (576) ధర్మమూర్తివి జగత్కర్తవు నగు నీవు¯ ప్రోవంగఁ దగువారిఁ బ్రోవవేని¯ నవిరళ వేదోక్త మగు ధర్మమార్గమ¯ సన్మార్గ మగుఁ గాన సత్త్త్వగుణ వి¯ శిష్టుండ వగుచు నీ జీవసంఘముసేమ¯ మరసి రక్షింతు నీ దైన శక్తి¯ చేతను ధర్మవిఘాతుల దండించు¯ నీకు సంచిత మైన నిగమధర్మ (576.1) మార్గ నాశక విధములు మదికి నింపు¯ గావు విప్రుల యందు సత్కరుణ మెఱసి¯ ఘనతఁ బలికిన వినయవాక్యములు నీకు¯ యుక్త మగు చుండు సతతంబు భక్తవరద! (577) అట్లయినఁ బరుల యెడ వినయంబులు వలికిన బ్రాభవహాని యగు నని తలంచితివేని. (578) విశ్వమున కెల్లఁ గర్తవు విశ్వనిధివి¯ విశ్వసంరక్షకుండ వై వెలయు నీకుఁ¯ గడగిఁ బ్రాభవహాని యెక్కడిది దలఁప¯ వినయములు నీకు లీలలై వెలయుఁ గాన. (579) మునుల మగు మమ్ము నతి మోదమునను నీవు¯ సత్కరించుట లెల్ల సజ్జన పరిగ్ర¯ హార్థమై యుండుఁ గాదె మహాత్మ! యొకటి¯ విన్నవించెద మీ జయవిజయులకును. (580) అలిగి యేము శపించితి మంతకంటె¯ బెడిద మగు నాజ్ఞసేయ నభీష్టమేని¯ జేయు మదికాక సమధికశ్రీ దనర్పఁ¯ జేసి రక్షించెదేని రక్షింపు మీశ! (581) అట్లయిన మాకుం బ్రియం బగుం గావున ననపరాధులు నతి నిర్మలాంతఃకరణులు నైన వీరలకు ననృతంబులు పలికితి మేని మమ్మయినం జిత్తంబు కొలది నాజ్ఞాపింపు"మని కరకమలంబులు మొగిచి కృతాంజలులై యున్న మునులం గరుణార్ద్ర దృష్టిం గనుంగొని. (582) అనఘుఁడు భగవంతుం డి¯ ట్లనియెన్ "మునులార! వీర లలరన్ భువికిం¯ జని యచట నసురయోనిన్¯ జనియింతురు లోభ మోహ సంగతు లగుచున్. (583) దేవజనావళి కుపహతిఁ¯ గావించుచు నిఖిల భువనకంటక వృత్తిన్¯ జీవించుచు నా యెడ సం¯ భావిత వైరానుబంధ భావులు నగుచున్. (584) ఆహవముఖమున నను నతి¯ సాహసమున నెదిరి పోరి చక్రనిశితధా¯ రాహతిఁ దెగి వచ్చెదరు¯ త్సాహ మెలర్పంగ నాదు సన్నిధి కంతన్. (585) అదియునుం గాక. (586) నను వైరంబున నైనను¯ మనమునఁ దలఁచుటను నా సమక్షమున మదా¯ నన మీక్షించుచు నీల్గుట¯ ననఘాత్మకులై వసింతు రస్మత్పదవిన్. (587) వినుఁ డిలమీదఁ ని కెన్నఁటి¯ కిని బుట్టువు లేదు వీరికిని మీరలు ప¯ ల్కినయట్ల నాదు చిత్తము¯ నను దలఁతుం గాన మీ మనంబుల నింకన్ (588) దీనికిఁ జింతఁ దక్కుఁడు సుధీజనపుంగవు!"లన్నఁ బ్రీతులై¯ యా నలినాసనాత్మజు లనంతుని భావము దా మెఱింగి పెం¯ పూనిన వేడ్కఁ దేలి తెలివొందిన చిత్తములన్ నుతించి రం¯ భోనిధిశాయి! నార్తజనపోషణ భూషణుఁ! బాపశోషణున్ (589) మఱియును. (590) ఆ సనకాదు లంతఁ బులకాంకురముల్ ననలొత్త బాష్పధా¯ రా సుభగాక్షులై మునిశరణ్యవరేణ్యు నగణ్యు దేవతా¯ గ్రేసరు దివ్యమంగళశరీరముఁ జారు తదీయ ధామమున్¯ భాసుర లీలఁ జూచి నవపద్మదళాక్షునకున్ వినమ్రులై. (591) తమ పలికిన భాషణములు¯ కమలోదరు భాషణములుగా దలఁచుచు నె¯ య్యమునన్ వైష్ణవలక్ష్మిం¯ బ్రమదంబునఁ బ్రస్తుతించి పరమేశ్వరుచేన్. (592) ఆమంత్రితులై తగ నిజ¯ ధామములకుఁ జనిరి వారు దడయక లక్ష్మీ¯ కాముడు జయవిజయుల నభి¯ రామంబుగఁ జూచి పలికె రయ మొప్పారన్. (593) "మీ రసురయోని యం దని¯ వారితులై జనన మందవలసెను నే దు¯ ర్వార బలాఢ్యుడ నయ్యును¯ వారింపగనోప విప్రవచనము లెందున్. (594) అదిగాన దనుజయోనిం¯ బదపడి జనియించి మద్విపక్షులరై మీ¯ మది నెపుడు నన్నె తలఁచుచు¯ వదలక నా చేతఁ జచ్చి వచ్చెద రిటకున్. (595) పొం"డని యానతిచ్చి హరి ఫుల్లసరోరుహపత్రనేత్రుఁ డా¯ ఖండలముఖ్య దిగ్వరనికాయకిరీట లసన్మణిప్రభా¯ మండిత పాదపీఠుఁడు రమారమణీమణితోడ నేగుదే¯ నిండిన వేడ్క నేఁగె నిజనిర్మలపుణ్యనివాసభూమికిన్. (596) అంత. (597) నిజ తేజో హానిగ జయ¯ విజయులు ధరఁ గూలి రపుడు విహ్వలు లగుచుం¯ ద్రిజగముల సురవిమాన¯ వ్రజముల హాహారవంబు గ్రందుగఁ జెలగన్. (598) వారలె యా దితిగర్భా¯ గారంబున నున్నవారు గడగి తదీయో¯ దార ఘన తేజ మిపు డని¯ వారణ మీ తేజ మెల్ల వమ్ముగఁ జేసెన్. (599) ఇంతకు మూల మా హరి రమేశ్వరుఁ డర్థి నొనర్చు కార్యముల్¯ వింతలె సర్వభూత భవ వృద్ధి వినాశన హేతుభూతుఁ డా¯ ద్యంత వికార శూన్యుఁడు దయానిధి మీ యెడ మేలుసేయు నీ¯ చింత దొఱంగి వేచనుఁడు చేకుఱు మీకు మనోరథార్థముల్." (600) అని వనజాసనుఁ డాడిన¯ విని తద్వృత్తాంత మెఱిఁగి విబుధులు నాకం¯ బున కేఁగిరి దితి నిజనా¯ థుని మాటలు దలఁచి యపరితోషముతోడన్.

హిరణ్యకశిప హిరణ్యాక్షుల జన్మ

(601) ఇంతి "తన సుతుల్ సురలఁ గారింతు"రనుచుఁ¯ దలచుఁచుండగ నంత వత్సర శతంబు¯ సనఁగ నటమీదఁ గనియెఁ గశ్యపునిదేవి¯ యఖిలలోకైక కంటకు లైన సుతుల. (602) అయ్యవసరంబున, (603) ధరణి గంపించెఁ గులపర్వతములు వడఁకె¯ జలధులు గలంగెఁ దారకావళులు డుల్లె¯ గగన మగలెను మ్రొగ్గె దిక్కరులు దిశల¯ మిడుఁగుఱు లెగసెఁ బిడుగులు పుడమిఁ బడియె. (604) హోమానలంబుల ధూమంబు లడరెను¯ బ్రతికూలవాయువుల్ బలసి వీచెఁ¯ దరువు లెల్లెడ విటతాటంబులై కూలె¯ గ్రహతారకావళి కాంతి మాసె¯ బెరసి మొగిళ్లు నెత్తురు వాన గురిసెను¯ మెఱుఁగులు దెసల మిర్మిట్లు గొలిపె ¯ స్వర్భాను డొగి నపర్వమున భానునిఁ బట్టె¯ గైకొని చిమ్మ చీకట్లు పర్వె (604.1) మొనసి కుక్కలు మొఱిఁగెను మోరలెత్తి¯ పగలు నక్కలు వాపోయె ఖగము లార్త¯ రవము లిచ్చెను దేవతాప్రతిమ లొరగెఁ¯ గన్నులను నశ్రుకణములు గ్రందుకొనగ. (605) మొదవులు నెత్తురుఁ జీమును¯ బిదికెన్ గార్దభరవంబు భీషణ మయ్యెన్¯ మద ముడిగెఁ గరుల కటములఁ¯ బొదివెఁ దురంగముల వాలముల నిప్పు లొగిన్. (606) గుహలు రొద లిచ్చెఁ బాప¯ గ్రహమిత్రతఁ జెంది వక్రగతులను సౌమ్య¯ గ్రహములు వర్తించెను దు¯ స్సహ తేజో దితితనూజ సంభవ వేళన్. (607) భయదప్రక్రియ నట్లుదోచిన మహోత్పాదంబు లీక్షించి సం¯ క్షయకాలం బని కాని సాధు హననోగ్రక్రూర దేవాహి తో¯ దయ సంక్షోభముగా నెఱుంగఁగ సమస్తప్రాణి సంఘాతము¯ ల్భయ మందెన్ సనకాది యోగిజనముల్దక్కన్ బుధేంద్రోత్తమా! (608) అట్లావిర్భవించిన యనంతరంబ. (609) కులశైలాభ శరీరముల్ తనర రక్షోనాథు లత్యుగ్ర దో¯ ర్బల మొప్పం బదఘట్టనన్ ధర చలింపన్ రత్న కేయూర కుం¯ డల కాంచీ కటకాంగుళీయక కిరీటస్వర్ణమంజీర ని¯ ర్మల కాంతుల్ దులగింప నాత్మరుచిచే మందీకృతార్కాంశులై. (610) ఉన్న సమయంబునం గశ్యపుండు నిజ తనూభవులఁ జూడం దలంచి దితిమందిరంబునకుం జనుదెంచి; సుతులం గనుంగొని; వారలకు నామకరణంబు సేయం దలంచి. (611) దితి జఠరంబు నందుఁ దన తేజము మున్నిడి నట్టి పుత్రు న¯ ద్భుత చరితున్ "హిరణ్యకశిపుం" డను పేరఁ బ్రసూతివేళ నా¯ దితి మును గన్న పట్టి రవితేజునిఁ "గాంచనలోచనుండు"నా¯ హితమతిఁ బేరువెట్టి చనియెన్ నిజ నిర్మల పుణ్యభూమికిన్.

హిరణ్యాక్షుని దిగ్విజయము

(612) అయ్యవసరంబున, నతుల తేజోవిరాజితుం డైన హిరణ్యకశిపుండు హిరణ్యగర్భ వరదాన గర్వంబునను; దుర్వార పరిపంథి గర్వ నిర్వాపణాఖర్వ భుజావిజృంభణంబునను; నిఖిల లోకపాలాదుల జయించి స్వవశం బొనర్చి సంతుష్టాంతరంగుం డై యెందునుం దనకు మృత్యుభయంబు లేక నిర్భయుండై సుఖం బుండెఁ; దత్సోదరుం డైన హిరణ్యాక్షుండు ప్రతిదినంబుఁ జండవేదండశుండాదండమండిత భుజాదండంబున గదాదండంబు ధరియించి తన్ను నెదిరి కదనంబు సేయం జాలిన యరివీరునిం గానక; భూలోకం బెల్లఁ గ్రుమ్మరి దివంబునకు దాడి వెట్టి; యందు సమర విముఖులయిన బర్హిర్ముఖులం గనుంగొని వనజాసన వరప్రదానంబుఁ జింతించి; హితులు సెలంగ నహితులు గలంగ మహిత వైజయంతికాదామం బభిరామంబై వెలుంగం జరణంబుల మణినూపురంబులు మొరయ; నిజదేహద్యుతి దిక్కులం బిక్కటిల్లం జనుదెంచు వానిం గని; భీతచిత్తు లయి దేవతాగణంబులు గరుడునిం గని పఱచు నురగంబులుంబోలె నిజనివాసంబు లర్కనివాసంబులు గాంచనావాసంబులుంగా నొనర్చి యెక్కడికేనిం జనిన. (613) శౌర్యము వోవఁదట్టి నిజసాధనముల్ దిగనాడి విక్రమౌ¯ దార్యపరాక్రమక్రమము దప్పఁగ భీతిలి పాఱి రక్కటా¯ కార్యముఁ దప్పి నాకులని గైకొని యార్చి సుమేరుపర్వత¯ స్థైర్యుఁడు వార్థిఁ జొచ్చె నతి దర్పిత భూరి భుజావిజృంభియై. (614) ఇట్లు సొచ్చిన. (615) వరుణుని బలములు దనుజే¯ శ్వరుతేజముఁ దేఱి చూడజాలక శౌర్య¯ స్ఫురణము సెడి యెందేనిని¯ బఱచెం దజ్జలధి మధ్యభాగము నందున్. (616) అమరారి విపుల నిశ్శ్వా¯ సములం బ్రభవించి నట్టి జలనిధి కల్లో¯ లములను విపుల గదాదం¯ డంబునఁ బోనడచె నతి దృఢం బగు శక్తిన్. (617) మఱియును నమ్మహాజలధి మధ్యమునన్ సురవైరి పెక్కు వ¯ త్సరములు గ్రీడసల్పి రిపు సైన్య విదారణ శౌర్యఖేలనా¯ పరతఁ జరించి యవ్వరుణపాలిత మైన లసద్విభావరీ¯ పురమున కేఁగి యందుఁ బరిపూర్ణత నున్న పయోధినాథునిన్. (618) మఱియునున్ (619) యాదోగణాధీశుఁ డగుచుఁ బాతాళభు¯ వన పరిపాలుఁ డై తనరుచున్న¯ వరుణునిఁ గనుగొని పరిహసితోక్తుల¯ నిట్లను "విశ్వ మం దెన్నఁగలుగు¯ సకల లోకైకపాలకులలో నతిబలా¯ ధికుఁడని జగము నుతింపఁదగిన¯ శూరుండ విపుడు నీ పౌరుష మొప్పంగఁ¯ గదనరంగమున నన్నెదిరి చూడు (619.1) నీ భుజావిక్రమంబును బ్రాభవంబు¯ నడఁతు"నని పల్కుటయు విని యబ్ధివిభుఁడు¯ పగతు జయమును వృద్ధియు బలము నాత్మ¯ బలము దలపోసి దనుజుతో బవరమునకు. (620) సమయము గాదని తన చి ¯ త్తమునం గల రోషవహ్నిఁ దాలిమి యను తో¯ యములం దగనార్చుచు నుప¯ శమితోక్తులఁ బలికె దనుజసత్తముతోడన్. (621) "మనమున శాంతిఁ బూని నియమంబున సంగర ముజ్జగించి యే¯ ననయము నున్నవాఁడని పుడాహవకేళిఁ జరింపరాదు నీ¯ ఘన భుజ విక్రమస్ఫురిత గాఢ విజృంభణమున్ జయింపఁ జా¯ లిన ప్రతివీరు లెవ్వరును లేరు ముకుందుడు దక్క నెక్కడన్. (622) గొనకొని యమ్మహాత్ముఁడు వికుంఠపురంబున నున్నవాడు దా¯ ననిమొనఁ బెక్కుమాఱు లభియాతుల నోలి జయించి శక్తి పెం¯ పున సడిసన్నవీరు డని భూజనకోటి నుతించు నందు వే¯ చను మత డిచ్చు నీకు నని సర్వము దీఱెడు నంతమీదఁటన్. (623) నిందకునోర్చి యాజిమొన నిల్వఁగనోపక వీఁగిపాఱు నీ¯ పందల వెంటఁబడ్డ మగపంతమె సర్వశరణ్యుఁడైన గో¯ విందుఁడు దీర్చు నీపని వివేకవిహీన! చనంగనోపుదే¯ నందుల కేఁగు మాతఁ డమరారులఁ బోర జయించు నిచ్చలున్. (624) అదియునుం గాక. (625) పురుషాకృతిఁ బ్రతియుగమునఁ¯ బురుషోత్తముఁ డవతరించి భూరిభుజా వి¯ స్ఫురణన్ దుష్టనిశాటుల¯ హరియించుచు నుండు మునిగణార్చితపదుఁడై. (626) కావున నా విభుం దొడరి కయ్యము దయ్య మెఱుంగఁ జేసి ర¯ క్షోవర నీ భుజాబలము సొంపఱి మేదినిఁ గూలి సారమే¯ యావళి కాశ్రయం బగుదు వచ్చటి కిప్పుడ యేఁగుదేని నీ¯ చేవయు లావు నేర్పడును జెప్పఁగ నేటికి మీఁది కార్యముల్." (627) అని వరుణుండు వల్కిన దురాగ్రహ మెత్తి హిరణ్యలోచనుం¯ డనయము మానసంబున భయం బొక యించుక లేక సంగరా¯ వని నెదిరింతు నేఁ డమరవర్ధను దుష్టవిమర్దనున్ జనా¯ ర్దను ననుచున్ వికుంఠనగరస్ఫుట నంచితమార్గవర్తియై. (628) చను నవసరమున నారద¯ మునివరుఁ డెదు రేఁగుదెంచి ముదము దలిర్పన్ ¯ "దనుజేంద్ర! యెందుఁ బోయెద"¯ వని యడిగిన నారదునకు నతఁ డిట్లనియెన్. (629) "సరసిరుహోదరుం దొడరి సంగరమే నొనరించి యిందిరా¯ వరుని ననంతుఁ ద్రుంచి సురవైరికులంబుల కెల్ల మోద వి¯ స్ఫురణ ఘటింపఁ జేయుటకుఁ బూని వికుంఠపథానువర్తి నై¯ యరిగెద"నన్న నమ్మునికులాగ్రణి దానవనేత కిట్లనున్. (630) "గురుభుజుఁ డమ్మహాత్ముఁడు వికుంఠపురంబున నేడు లేఁడు భూ¯ భరము వహింప నాదికిటి భావముఁ దాల్చి రసాతలంబునం¯ దిరవుగ నున్నవాఁ డచటి కేఁగఁగనోపుదువేని నేఁగు మం¯ దరయఁగ గల్గు నీకు నసురాంతకుతోడి రణం బవశ్యమున్."