పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : చతుర్థ 467 - 562

భూమిని బితుకుట

(467) “ఏమి నిమిత్తమై భూమి గోరూపిణి¯ యయ్యె? దానికి వత్స మయ్యె నెద్ది? ¯ గొనకొని దోహనమునకు నర్హంబైన¯ పాత్ర మెయ్యది? దలఁపంగ దోగ్ధ¯ యైన యా పృథువే పదార్థముల్ పిదికెను?¯ బరికింప నవని స్వభావమునను¯ విషమమై యుండియు వెలయంగ నే రీతి¯ సమగతిఁ జెందెను జంభవైరి? (467.1) క్రతుహయంబును గొనిపోవఁ గార్య మెద్ది? ¯ ధీరనిధి యాతడు సనత్కుమారు వలనఁ¯ గలిత విజ్ఞానుఁ డగుచు నే గతినిఁ బొందె? ¯ ననఘచారిత్ర! మైత్రేయ! యదియుఁగాక. (468) మఱియుఁ; బరబ్రహ్మంబును, భగవంతుండును, బుణ్యశ్రవణ కీర్తనుండును, సర్వనియామకుండును నగు కృష్ణుని యవతారాంతరాశ్రయం బగు దివ్యకథలను భగవంతుం డైన పుండరీకాక్షుండు పృథ్వవతారంబు ధరియించి గోరూపిణి యగు పృథివిం బిదికినది మొదలగు కథ లన్నియు నీకు నథోక్షజునకు దాసుండ నయిన నాకు నెఱింగింపు;” మనిన వాసుదేవ కథా సంప్రీత చేతస్కుం డగు విదురుం బ్రశంసించి మైత్రేయుం డిట్లనియె “నట్లు బ్రాహ్మణ జనంబులచేత రాజ్యంబు నందభిషిక్తుం డగుచు సకలప్రజాపాలన నియుక్తుండై పృథువు రాజ్యంబు చేయుచుండు నంత నీరస యగు ధరిత్రియం దన్నరహితు లగుచుం బ్రజలు క్షుత్పీడాక్షీణ దేహులై వైన్యునిం జూచి యిట్లనిరి. (469) "అరయఁగ నేము బుభుక్షా¯ పరిపీడం బడితి మయ్య! పై కొని తరు కో¯ టర జనిత వహ్నిచేతను¯ దరికొను వృక్షములుఁ బోలె ధరణీనాథా! (470) శరణ శరణ్యుఁడ వగు నిను¯ శరణము వేఁడెదము; మాకు సత్కృప నన్నం¯ బరసి కృపచేసి ప్రోవుము¯ నరనాయక!” యనుచుఁ బ్రజలు నతులై పలుకన్. (471) విని దానికి సదుపాయము¯ జననాయకుఁ డాత్మఁ దలఁచి సక్రోధుండై¯ ధనువున బాణముఁ దొడిగెను¯ ఘనరౌద్రుండైన త్రిపుర ఘస్మరు పగిదిన్. (472) ఇట్లు దొడిగిన. (473) మహిపతి నప్పుడు గనుఁగొని¯ మహి గోరూపమునఁ గంప్యమానయు నగుచున్¯ గుహకుం డగు లుబ్దకుఁ గని¯ గహనంబునఁ బాఱు హరిణికైవడిఁ బాఱెన్. (474) ఇట్లు ధరణి పాఱిన నతండు కుపితారుణేక్షణుండై వెంటం దగిలి దిక్కులను విదిక్కులను భూభాగ నభోభాగంబుల నెక్కడఁ జనియె, నక్కడికి వెనుదగిలి యుద్యతాయుధుండై చనుచుండ నవ్వైన్యునిం గని మృత్యుగ్రస్తులగు ప్రజల చందంబున ననన్యశరణ్యయై యతిభయంబునం బరితప్యమానహృదయ యగుచు “వైన్యా! ధర్మవత్సలుండవును, నాపన్నరక్షకుండవును, మహాత్ముండవును, సకలప్రాణి పరిపాలనావస్థితుండవును నయిన నీ వీ దీనయుం బాపరహితయుం గామినియు నగు నన్ను వధియింపం బూని యేల వెనుదగులుచున్న వాఁడవు? ధర్మతత్త్వం బెఱుంగువారు సతీజనంబులు గృతాపరాధ లైనం దీనవత్సలతం జేసి వధింప"రని పలికి మఱియు నా ధరణీదేవి పృథుచక్రవర్తి కిట్లనియె. (475) “జననాథచంద్ర! యీ భూ¯ జనకోటికి యాన పాత్ర సదృశస్థితితో¯ ఘనదృఢశరీర యగు నే¯ ననయము నాధారభూత నగుచుఁ జరింతున్. (476) ఇట్టి నన్నుఁ గృపామతి యెడలి యిటు వి¯ పాటనము చేసి త్రుంచెదు? ప్రజలు నీట¯ మునుఁగకుండంగ నే రీతి ననఘచరిత! ¯ యరసి రక్షింతు” వన నతం డవని కనియె. (477) “ధరిత్రీ! మదీయాజ్ఞోల్లంఘనంబు చేయుచున్న దాన; వదియునుం గాక, నీవు యజ్ఞంబు లందు హవిర్భాగంబుల ననుభవించుచు ధాన్యాదికంబుల విస్తరింపం జేయక గోరూపంబు ధరియించి యనయంబుఁ దృణభక్షణంబు చేయుచుఁ బాలం బిదుకక నీ యంద యడంచికొంటివి; నీ యందున్న యోషధీ బీజంబులు బ్రహ్మచేతం బూర్వంబునందె కల్పింపంబడిన యవి; వానిని నీ దేహంబునంద యడంచికొని యిప్పు డీయక మూఢహృదయవు, మందమతివియు నై యపరాధంబు చేసిన దురాత్మురాల వగు; నిను నా బాణంబులచే జర్జరీ భూతశరీరం జేసి వధియించి నీ మేని మాంసంబునం జేసి క్షుద్బాధితులు దీనులు నగు నీ ప్రజల యార్తి నివారించెద; నీవు కామిని నంటివి; స్త్రీ పురుష నపుంసకులలో నెవ్వరేని భూతదయ లేక స్వమాత్ర పోషకు లగుచు నిరనుక్రోశంబుగ భూతద్రోహులై వర్తింతురు; వారిని రాజులు వధించినన్ వధంబు గాదు; గాన దానఁ బాపంబు వొరయదు; నీవు కామిని వైనను దుర్మదవు స్తబ్దవు నగుచు మాయాగోరూపంబునం బాఱిపోవుచున్న నిన్నుఁ దిలలంతల ఖండంబులు చేసి నా యోగమహిమం బ్రాణికోటి నుద్ధరించెద;"నని పలికి రోషభీషణాకారంబు ధరియించి దండధరుని వడువున వర్తించు పృథునిం జూచి వడంకుచు మేదిని ప్రాంజలియై యిట్లని నుతియింపం దొడంగె. (478) “ఓనాథ! పరమపురుషుఁడ¯ వై నిజమాయా గుణంబు లందిన కతనన్¯ నానావిధ దేహములం¯ బూనుదు సగుణండ వగుచు బుధనుతచరితా! (479) అట్టి నీవు. (480) నను సకల జీవతతికిని¯ మును నీ వాధారభూతముగ నిర్మింపన్¯ విను నా యందుఁ జతుర్విధ¯ ఘన భూతవిసర్గ మర్థిఁ గైకొన వలసెన్. (481) అట్లయి యుండ. (482) నను నుద్యతాయుధుఁడవై¯ మనుజేంద్ర! వధింపఁ బూని మసలెదు; నీకం¯ టెను నన్యుని నెవ్వని నే¯ ఘనముగ శరణంబు జొత్తుఁ గరుణాభరణా! (483) అదియునుం గాక. (484) అనఘ! స్వకీయంబునై యతర్కితమునై¯ మహిమ నొప్పిన భవన్మాయచేత¯ సకల చరాచర సర్గంబు నిర్మించి¯ ధర్మార్థపరుఁడవై తనరు దీశ! ¯ నీవిక్రమము నవనీరజలోచన!¯ సకల లోకులకు దుర్జయము; దలఁపఁ¯ దగు నట్టి నీవు స్వతంత్రుఁడ వగుటను¯ బ్రహ్మఁ బుట్టించి యా బ్రహ్మచేత (484.1) సకల జగములఁ జేయింతు సమతఁ బేర్చి; ¯ యేక మయ్యు మహాత్మ! యనేక విధము¯ లగుచు వెలుగొందు చుందు వీ యఖిలమందుఁ¯ జారుతరమూర్తి! యో! పృథుచక్రవర్తి! (485) మఱియు మహాభూతేంద్రియ కారక చేతనాహంకారంబులను శక్తులం జేసి యీ జగంబుల కుత్పత్తి స్థితి లయంబులఁ గావించుచు సముత్కట విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్కరించెద; నట్టి పరమ పురుషుండ వయిన నీవు నిజనిర్మితంబును భూతేంద్రియాంతఃకరణాత్మకంబును నైన యీ విశ్వంబు సంస్థాపింపం బూని. (486) ఆదివరాహంబవై యా రసాతల¯ గతనైన నన్ను నక్కటికతోడ¯ నుద్ధరించితి; వట్టి యుదకాగ్ర భాగంబు¯ నం దర్థి నున్న నే ననెఁడి నావ¯ యందున్న నిఖిల ప్రజావళి రక్షింపఁ¯ గోరి యీ పృథురూపధారి వైతి; ¯ వట్టి భూభరణుండ వైన నీ విపుడు ప¯ యో నిమిత్తంబుగా నుగ్రచరుఁడ (486.1) వగుచు నన్ను వధించెద ననుచు బుద్ధిఁ¯ దలఁచుచున్నాఁడ; విది విచిత్రంబుగాదె? ¯ విశ్వసంపాద్య! నిరవద్య! వేదవేద్య! ¯ భవ్యగుణసాంద్ర! వైన్య భూపాలచంద్ర! (487) కావున నీశ్వరగుణ సర్గరూపంబైన మాయచే మోహితాంతఃకరణుల మైన మా వంటి వారలచేత హరిభక్తుల చేష్టితం బెఱుంగఁబడదన్న హరి చేష్టితం బెట్లెఱుంగంబడు? నట్టి జితేంద్రియ యశస్కరు లయిన వారలకు నమస్కరింతు” ననుచు నివ్విధంబునం గోపప్రస్ఫురితాధరుం డైన పృథుని నభినుతించి ధైర్యం బవలంబించి వెండియు నిట్లనియె. (488) విమలాత్మ! నాకు నభయము¯ సమకూరెడు నట్లుగాఁగ సన్మతి నీ క్రో¯ ధము నుపశమించి కరుణిం¯ పుము; నా విన్నపము వినుము పురుషనిధానా! (489) ధర విరులు గందకుండఁగ¯ సరసగతిం బూవుఁదేనెఁ జవిగొను నిందిం¯ దిరవిభు కైవడి బుధుఁడగు¯ పురుషుఁడు సారాంశ మాత్మఁబూని గ్రహించున్. (490) వినవయ్య! తత్త్వదర్శనులైన యట్టి స¯ న్మునులచే నైహికాముష్మికంబు¯ లైన ఫలప్రాప్తి కర్థిఁ గృష్యాద్యగ్ని¯ హోత్రాద్యుపాయంబు లుర్విమీఁద¯ దృష్టంబులును నాచరితములు నగుచుఁ దా¯ నెనయఁదగు నుపాయ మెవ్వఁ డాచ¯ రించును వాఁడు ప్రాపించుఁ ద త్ఫలమును¯ విద్వాంసుఁ డైనను వెలయ దీని (490.1) నాదరింపక తనయంత నాచరించె¯ నేని నాయాసమే యగుఁ గాని తత్ఫ¯ లమును బొందఁడు బహుళకాలమునకైన¯ వినుతగుణశీల! మాటలు వేయునేల? (491) అని మఱియు మహి యిట్లనియె. (492) “జలరుహగర్భుచేత మును చాల సృజింపఁగఁబడ్డ యోషధుల్¯ కలుషమతిన్ ధృతవ్రతులుగాని యసజ్జనభుజ్యమానమై¯ వెలయుటఁ జూచి యే నృపతివీరులు మాన్పమిఁ జోరబాధలన్¯ బలుమఱుఁ బొంది యే నపరిపాలితనై కృశియించి వెండియున్. (493) అనుపమ మఖకర్మక్రియ¯ లనయము లేకుంట నే ననాదృత నగుచున్¯ జననాయక! యీ లోకము¯ ఘనచోరీభూత మగుటఁ గనుఁగొని యంతన్. (494) సవనాది సిద్ధి కొఱకై¯ తవిలి తదీయౌషధీ వితతులను ధరణీ¯ ధవ! యే నపుడు గ్రసించితి¯ నవియును నా యందు జీర్ణమయ్యెఁ గడంకన్. (495) విను వాని నొక యుపాయం¯ బునఁ గ్రమ్మఱఁ బడయవచ్చు భూవరచంద్రా! ¯ విను మది యెఱిఁగించెద నీ¯ కును వత్సలురాల నగుట గురుతరచరితా! (496) అనయము నా కొక వత్సము¯ ననురూప సుదోహనమ్ము ననురూపక దో¯ గ్ధను గల్పింపుమ యట్లయి¯ నను నీ భూతముల కవనినాయక! దానన్. (497) పరఁగ నభీప్సితములు బల¯ కరములు నగు నన్న దుగ్ధ కలితము లగు భా¯ సురకామంబులఁ బిదికెద¯ నరనాయకచంద్ర! వినుము నావచనంబుల్. (498) మనుజవరేణ్య! యేను విషమస్థలినై యిపు డున్నదాన; నొ¯ య్యన జలదాగమోదిత పయః ప్రకరంబు తదాగమంబు వో¯ యినను దదంబువుల్ పుడమి నింకక యంతట నిల్చునట్లుగా¯ మనునిభ; నన్ను నిప్పుడు సమస్థలినై పెనుపొందఁ జేయవే.” (499) అని యివ్విధమున నా భూ¯ వనితామణి పలుకు మధుర వచనంబులు దా¯ విని యనురాగము దన మన¯ మునఁ గడలుకొనంగ రాజముఖ్యుం డంతన్. (500) మనువును దూడఁ జేసి గరిమన్ నిజపాణితలంబు లీల దో¯ హనముగఁ జేసి యందు సకలౌషధులం బిదికెం గ్రమంబునం¯ దనరఁగఁ దద్విధంబునను దత్పృథు వత్సలయైన భూమియం¯ దనయము వారువారును బ్రియంబగు కోర్కులు వొంది రున్నతిన్. (501) బలసి ఋషుల్ బృహస్పతి వత్సకంబుగా¯ నర్థించి తమ యింద్రియంబు లందు¯ నంచితచ్ఛందోమయక్షీరమును దేవ¯ తలు సురరాజు వత్సంబు గాఁగఁ¯ గనక పాత్రము నందుఁ దనరు నోజోబల¯ వీర్యామృతంబునై వెలయు పయసు¯ దైత్య దానవులు దైత్యశ్రేష్ఠుఁ డగు గుణ¯ శాలిఁ బ్రహ్లాదు వత్సంబుఁ జేసి (501.1) ఘన సురాసవ రూప దుగ్ధంబు వరుస¯ నప్సరోజన గంధర్వు లలరి యపుడు¯ దనర విశ్వావసువు వత్సమునుగఁ జేసి¯ పద్మమయ నిర్మితంబైన పాత్రమందు (502) మాధుర్య సౌందర్య సహిత గాంధర్వక్షీరంబును బిత్రుదేవతలు సూర్య వత్సకంబుగా నామ పాత్రంబునందుఁ గవ్యం బను దుగ్ధంబును, సిద్ధులు గపిల వత్సకంబుగా నాకాశ పాత్రమందు సంకల్పనారూపాణిమాది సిద్ధి యను క్షీరంబును, విద్యాధరాదులు తద్వత్సకంబును దత్పాత్రకంబునుంగా ఖేచరత్వాది వ్యాపారరూప క్షీరంబును, గింపురుషాదులు మయవత్సకంబును నాత్మ పాత్రంబునుంగా సంకల్పమాత్ర ప్రభవంబు నంతర్ధానాద్భుతాత్మ సంబంధియు నగు మాయ యను క్షీరంబును, యక్షరక్షోభూత పిశాచంబులు భూతేశ వత్సకంబుఁ గపాల పాత్రంబునుంగా రుధిరాసవం బను క్షీరంబును, నహిదందశూక సర్ప నాగంబులు దక్షకవత్సంబును బిలపాత్రంబునుంగా విషరూప క్షీరంబును, బశువులు గోవృషవత్సకంబు నరణ్య పాత్రంబునుంగాఁ దృణం బను క్షీరంబును, గ్రవ్యాదమృగంబులు మృగేంద్ర వత్సకంబును నాత్మ కళేబర పాత్రకంబునుంగాఁ గ్రవ్యం బను దుగ్ధంబును, విహంగంబులు సుపర్ణవత్సకంబుగా నిజకాయ పాత్రంబునుంగాఁ గీటకఫలాదికం బను దుగ్ధంబును, వనస్పతులు వటవత్సకంబుగా భిన్నరోహరూప పయస్సును, గిరులు హిమవద్వత్సకంబును నిజసాను పాత్రకంబునుంగా నానాధాతువులను, దుగ్ధంబునుంగా నివ్విధంబున సమస్త చరాచర వర్గంబు స్వముఖ్యవత్సకంబును స్వస్వపాత్రకంబునుంగా భిన్నరూపంబు లైన క్షీరంబులం బిదికె” నని చెప్పి మఱియును. (503) క్రమమున నిటు పృథ్వాదులు¯ దమతమ కామితము లనఁగఁ దగు భిన్నక్షీ¯ రము దోహన వత్సక భే¯ దమునం దగఁ బిదికి; రంత ధరణీధవుఁడున్. (504) సముచితానందమును బొంది సర్వకామ¯ దుఘ యనం దగు భూమిని దుహితఁగాఁగఁ¯ గోరి కైకొని నిజధనుఃకోటిచేత¯ భూరిగిరి కూటములఁ జూర్ణములుగఁ జేసి. (505) చండ దోర్దండలీల భూమండలంబు¯ సమతలంబుగఁ జేసి శశ్వత్ప్రసిద్ధి¯ నొంది యవ్విభుఁ డీ లోకమందు నెల్ల ¯ ప్రజకుఁ దండ్రియు జీవనప్రదుఁడు నగుచు. (506) అక్క డక్కడఁ బూర్వంబునందు లేని ¯ గ్రామ పట్టణ దుర్గ ఖర్వట పుళింద¯ ఖేట శబరాలయవ్రజ వాట ఘోష¯ వివిధ నిలయము లర్థిఁ గావించె నంత. (507) వారును భయవిరహితులై¯ బోరనఁ దత్తన్నివాసముల యందు సుఖ¯ శ్రీరుచి నొప్పుచు నుండిరి¯ వారక యా పృథునిఁ బొగడ వశమె ధరిత్రిన్?

పృథుని యజ్ఞకర్మములు

(508) అని చెప్పి మునినాథుఁ డైన మైత్రేయుఁ డ¯ వ్విదురున కిట్లను వేడ్కతోడ¯ "ననఘాత్మ! రాజర్షి యైన వైన్యుం డశ్వ¯ మేధశతంబు సన్మేధతోడఁ¯ గావింతు నని దీక్ష గైకొని వ్రతనిష్ఠఁ¯ దివిరి బ్రహ్మావర్త దేశమందు¯ నలరు మనుక్షేత్ర మందు సరస్వతీ¯ నది పొంతఁ దా మహోన్నతి నొనర్చు (508.1) సవన కర్మ క్రియకు నతిశయ విశేష¯ ఫలము గలిగెడి నని బుద్ధిఁ దలఁచి యచట¯ వరుసఁ గావించు నతిశయాధ్వర మహోత్స¯ వము సహింపక యుండె న య్యమరవిభుఁడు. (509) అట్టి యధ్వర కర్మమందు సాక్షాద్భగ¯ వంతుఁడు హరి రమేశ్వరుఁడు లోక¯ గురుఁడును సర్వాత్మకుండును విభుఁడును¯ నీరజభవ భవాన్వితుఁడు లోక¯ పాలక నిఖిల సుపర్వానుగుండును¯ యజ్ఞాంగుఁ డఖిలాధ్వరాది విభుఁడు¯ గంధర్వ ముని సిద్ధగణ సాధ్య విద్యాధ¯ రాప్సరో దైత్య గుహ్యాళి దాన (509.1) వాది జేగీయ మానుఁ డత్యలఘుయశుఁడు ¯ ప్రకట నందసునందాది పార్షదుండు¯ కపిల నారద సనకాదికప్రముఖ్య¯ మహిత యోగీంద్ర సంస్తూయమానుఁ డజుఁడు. (510) మఱియుం బరమ భాగవత సేవితుండును నారాయణాంశ ప్రభవుండును నైన పృథుచక్రవర్తికి భూమి హవిరాదిదోగ్ధ్రి యయ్యును సర్వకామదుఘయై సమస్త పదార్థంబులం బిదుకుచుండె; మఱియుఁ దరువులు ఘనతరాకారంబులు గలిగి మకరంద స్రావు లగుచు నిక్షుద్రాక్షాది రసంబులును దధిక్షీరాజ్య తక్ర పానకాదికంబులును వర్షింప నవి యెల్ల నదులు వహించె; సముద్రంబులు హీరాది రత్న విశేషంబుల నీనుచుండె; పర్వతంబులు భక్ష్య భోజ్య లేహ్య చోష్యంబు లను చతుర్విధాన్నంబులు గురియుచుండె; లోకపాల సమేతులైన సకల జనంబులు నుపాయానంబులు దెచ్చి యిచ్చుచుండి; రిట్టి పరిపూర్ణ విభవాభిరాముండై యధోక్షజసేవాపరాయణుండగు పృథుచక్రవర్తి యేకోనశతాశ్వమేధంబులు సన్మేధంబునం గావించి నూఱవ యాగంబునందు యజ్ఞపతి యైన పుండరీకాక్షుని యజించుచుండం దదీయ పరమోత్సవంబు సహింపం జాలక. (511) అమరేంద్రుఁడు ఘనరోషో¯ ద్గముఁడై పాషండ వేషకలితతిరోభా¯ వమునం దన్మఖపశువుం¯ గ్రమమేది హరించి చనియె గగనంబునకున్. (512) అట్లు చను నప్పుడు. (513) అనఘుం డగు నత్రి మహా¯ ముని చోదితుఁ డగుచుఁ బృథుని పుత్రుఁడు బాణా¯ సనతూణీర ధరుండై¯ యనిమిషపతి వెనుకఁ జనియె నతిదర్పమునన్. (514) అట్లు చనిచని ముందట. (515) యజ్ఞ సాధన పశుహరణుని వధియించు¯ ధర్మంబునందు నధర్మ మనెడి¯ బుద్ధిఁ బుట్టఁగఁ జేయ భూరి మాయా వేష¯ ధారియై యరుగు సుత్రాముఁ గదిసి¯ నిలు నిలు మని యార్చి నిజగుణధ్వని చేసి¯ ఘన జటాభస్మాస్థి కలిత మయిన¯ మూర్తిఁ గనుంగొని మూర్తీభవించిన¯ ధర్మంబ కా బుద్ధిఁ దలఁచి యమర (515.1) నాయకుని మీఁద సాయక మేయఁ జాల¯ కున్నఁ గనుఁగొని యత్రి విద్వన్నుతుండు¯ వైన్యజునకనె వాసవు వలను చూపి¯ మనములోపల రోషంబు మల్లడింప. (516) “విను మితఁడు యజ్ఞహంతయు¯ ననిమిషనికరాధముండు నగు నింద్రుఁడు గా¯ వున నితని జయింపుము నీ”¯ వని ముమ్మా ఱుచ్చరింప నవ్వైన్యజుఁడున్. (517) విను వీధిం జను దేవవల్లభునిపై వీరుండు గ్రోధాంతరం¯ గ నిరూఢిన్ మృగరా ట్కిశోరము మహాగంధద్విపేంద్రంబు మీఁ¯ దను లంఘించు విధంబునం బడిన నాతం డశ్వ చౌర్యైక సా¯ ధన రూపంబుఁ దదశ్వమున్ విడిచి యంతర్ధానముం బొందినన్. (518) వీరుఁడు పృథు భూపాలకు¯ మారుఁడు నిజ యజ్ఞపశువు మరలం గొని దు¯ ర్వారబలుఁ డగుచు జనకుని¯ భూరి సవనరాజపుణ్యభూమికి వచ్చెన్. (519) అయ్యవసరంబున నచ్చట నున్న పరమర్షిపుంగవు లతని యద్భుత కర్మంబు గనుంగొని యాశ్చర్యంబు నొంది యతనికి ‘జితాశ్వుం"డను నన్వర్థ నామంబు పెట్టి యున్న సమయంబున. (520) మఱియును దేవతాపతి తమః పటలంబు జనింపఁ జేసి యె¯ వ్వరుఁ దనుఁ గానకుండ ననివారణఁ గాంచనపాశ బద్ధ మై¯ సురుచిరయూపదారు పరిశోభితమైన హయంబుఁ గొంచుఁ జె¯ చ్చెర వినువీధి నేగఁగ ఋషిప్రవరుం డగు నత్రి చెప్పినన్. (521) విని పృథు భూవర తనయుఁడు¯ ఘన బలమునఁ జని కపాలఖట్వాంగము లో¯ లిని ధరియించి రయంబునఁ¯ జను నింద్రునిఁ గాంచి నొంపఁజాలక యంతన్. (522) క్రమ్మఱ నత్రిచేఁ దెలుపఁగాఁబడి వైన్యతనూభవుండు రో¯ షమ్మునఁ దోఁకఁ ద్రొక్కిన భుజంగమపుంగవుఁ బోలి యుగ్రుఁడై¯ యమ్మరిఁబోసినం గని సురాధిపుఁ డెప్పటి యట్లఁ బాఱె న¯ శ్వమ్మును రూపమున్ విడిచి చాలఁ దిరోహితుఁడై రయంబునన్. (523) అట్లు చనినం బశువుం గొని మరలి యవ్వీరోత్తముండు పితృ యజ్ఞ శాలకుం జనుదెంచె; నంత. (524) హరిహయుం డధ్వర హయ హరణార్థమై¯ మించి కైకొని విసర్జించి నట్టి¯ భూరి యమంగళ భూత మాయారూప¯ ములను ధరించిరి మూఢజనులు; ¯ పాషండ చిహ్నముల్ పఱఁగుట వారలు¯ జగతిపై నగ్నవేషములు గలుగు¯ జైనులు భూరి కాషాయ వస్త్రంబులు¯ ధరియించు బౌద్ధులుఁ దగ జటాస్థి (524.1) భస్మధారులు నయిన కాపాలికాదు¯ లనఁగ వెలసిరి లోకంబులందుఁ జాలఁ¯ దలఁప ధర్మోపమం బనఁదగు నధర్మ¯ మందు నభిరతి వొడమిన యజ్ఞజనులు. (525) తదీయ చిహ్నంబులు పారంపర్యంబుగా ధరియింపం దొడంగిరి; తద్వృత్తాంతంబు భగవంతుం డయిన పృథుచక్రవర్తి యెఱింగి కుపితుండై యుద్యతకార్ముకుం డగుచు నింద్రుని మీఁద బాణంబుఁ నేయ నుద్యమించిన ఋత్విక్కులు శక్రవధోద్యుక్తుండు నసహ్య రంహుండు నయిన పృథు చక్రవర్తిం గనుంగొని యిట్లనిరి. (526) "జననాయక! యజ్ఞములం¯ దనుపమ విధిచోదితంబు లనఁదగు పశు బం¯ ధన హింసల కా కితరుల¯ ఘనదీక్షితునకు వధింపఁ గాదండ్రు బుధుల్. (527) కావున నీ విపు డింద్రవధోద్యోగం బుపసంహరింపుము; భవదీయ ధర్మవిరోధి యైన యట్టి యింద్రుని. (528) జనపాల! వీర్యవంతము¯ లనఁదగు మంత్రములచేత నాహ్వానము చే¯ సిన నతఁ డిచటికి వచ్చును¯ జనుదెంచిన యమరవిభుని సరభసత దగన్. (529) ధృతి చెదరఁ బట్టి శిఖి కా¯ హుతిఁగా వేల్చెదము; దాన నుర్వీవర! నీ¯ వితత మహో హత వీర్యో¯ న్నతుఁడై చెడిపోవు నమరనాథుం డంతన్." (530) అని పృథుని వారించి ఋత్విగ్జనంబులు గుపితస్వాంతులై హస్తంబుల స్రుక్సువంబులు ధరియించి వేల్చు సమయంబునం జతుర్ముఖుండు చనుదెంచి ఋత్విజులం గనుంగొని యిట్లనియె “యజ్ఞంబు లందు యజింపంబడు దేవత లెవ్వని యంశంబు; లెవ్వండు యజ్ఞ నామకంబగు భగవదంశంబగు, నట్టి యింద్రుండు మీచేత వధార్హుండు గాఁ డితండు భగవదంశ సంభవుం డగుట నీ యజ్ఞకర్మవిధ్వంసనేచ్చుం డయి కావించు ధర్మవ్యతికరంబులు చూచుచుండవలయుం గాని ప్రతీకారంబులు గర్తవ్యంబులు గా; వీ పృథుకీర్తి యగు నీ పృథునకు నేకోనశతంబగు నధ్వరప్రయోగ ఫలంబు సిద్ధించుం గాక"యని పృథు చక్రవర్తి కిట్లనియె. (531) “మనుజేంద్ర! మోక్షధర్మము నెఱింగిన నీకు¯ సవనముల్ చేయుట చాలు మఱియు¯ నే విధంబున నైన దేవేంద్రు మనమునఁ¯ గైకొని రోషంబు గదురకుండ¯ వర్తింప వలయును; వాసవుండును నీవుఁ¯ బూని సుశ్లోకులు గాన మీకు¯ మంగళం బగుఁ గాక; మానవనాథ! నీ¯ చిత్తంబులోపలఁ జింతఁ దొఱఁగి (531.1) మించి మద్వాక్యముల నాదరించి వినుము¯ దైవ హతమగు యజ్ఞంబుఁ దగిలి చేయు¯ కొఱకు భవదీయ చిత్తంబు గుంది రోష¯ కలుషితంబైన నజ్ఞాన కలిత మగును. (532) భవదీయ యజ్ఞహననార్థం బశ్వహరణుం డైన యింద్రుండు దేవతల లోనన్ దురాగ్రహుం డగుటం జేసి యతనిచేత నిర్మింపంబడి చిత్తాకర్షకంబులైన యీ పాషాండ ధర్మంబుల చేత ధర్మ వ్యతికరంబు గలుగుం గాన యీ యజ్ఞంబు చాలింపు;” మని మఱియు నిట్లనియె. (533) "అది గాక వినుము; వేనాపచారంబునఁ¯ బూని విలుప్తంబు లైన యట్టి¯ యలఘు నానా సమయానుధర్మంబులఁ¯ బరిపాలనము చేయఁ బరఁగి వేను¯ దేహంబు వలనను దివిరి జనించి యు¯ న్నాడవు; నారాయణాంశజుఁడవు; ¯ గావున నీ నరకలితలోకంబునఁ¯ బుట్టిన తెఱఁగు నీ బుద్ధిఁ దలఁచి (533.1) యెవరిచే నేమిటికి సృజియింప బడితి¯ వట్టి యా బ్రహ్మసంకల్ప మవనినాథ! ¯ తప్పకుండంగఁ బాలింపు ధర్మగతినిఁ¯ జారుశుభమూర్తి! యో! పృథుచక్రవర్తి!" (534) అని మఱియు నిట్లనియె “నుపధర్మ మాతయుం బ్రచండ పాషండ మార్గంబు నైన యీ యింద్రకృతం బగు మాయను జయింపు” మని వనజసంభవుం డానతిచ్చినం బృథుచక్రవర్తియుఁ దదాజ్ఞాపితుండై దేవేంద్రునితోడ బద్ధ సఖ్యుం డయ్యె; నంత నవభృథానంతరంబున. (535) సురుచిర లబ్ధ దక్షిణల సొంపునఁ బొంపిరిపోయి భూసురుల్¯ వరుసను బెక్కు దీవన లవారణ నిచ్చిరి; సర్వదేవతల్¯ భరిత ముదంతరంగములఁ బాయనివేడ్క వరంబు లిచ్చి రా¯ నరవరుఁ డైన వైన్యునకు నందిత కీర్తికిఁ బుణ్యమూర్తికిన్. (536) అంత నచ్చటి జనంబు లిట్లనిరి. (537) "అనఘ! నీ చేత నాదృతు లైరి సర్వ¯ జనులు మఱి దానమానోపచారములను¯ బితృ సుదేవర్షి మానవ వితతి పూజ¯ నొంది సంచిత మోదంబు నొందె నయ్య!" (538) అని పలుకు సమయంబున యజ్ఞభోక్తయు యజ్ఞవిభుండును భగవంతుండును నైన సర్వేశ్వరుం డింద్ర సమేతుండై యచ్చటికిం జనుదెంచి యా పృథున కిట్లనియె. (539) “జనవర! భవదీయంబై¯ జననుతమగు నశ్వమేధ శతమున కిపు డీ¯ యనిమిషపతి భంగము చే¯ సిన కతన క్షమాపణంబు చేసెడిఁ గంటే. (540) కావున నితని క్షమింపుము; సత్పురుషు లగువారు దేహాభిమానులు గాకుండుటం జేసి భూతంబుల యెడ ద్రోహం బాచరింప; రట్లగుటం జేసి నీ వంటి మహాత్ములు దేవమాయా మోహితులై పరోపతాపంబులు చేసిరేని దీర్ఘతరంబైన వృద్ధజనసేవ వ్యర్థంబు గాదె; యదియునుం గాక, యీ శరీరం బవిద్యా కామకర్మంబుల చేత నారబ్ధం బని తెలిసిన పరమజ్ఞాని యీ దేహంబు నందు ననుషక్తుండు గాకుండుట సహజం బన, దేహోత్పాదితంబులైన గృహదారాదులయందు మమత్వంబు లేకుండుటం జెప్ప నేల? యిట్టి దేహంబు నందున్న యాత్మ యేకంబును, శుద్ధ స్వరూపంబును, స్వయంజ్యోతియు, నిర్గుణంబును, గుణాశ్రయంబును, వ్యాప్య వ్యాపకంబును, నసంవృతంబును, సాక్షిభూతంబును, నిరాత్మకంబును నగు; దీని దేహంబుకంటె వేఱుగా నెవ్వండు తెలియు వాఁడు మత్పరుడగుటం జేసి దేహధారియై యుండియుఁ దద్గుణంబులం బొరయక వర్తించు; మఱియు నెవ్వండేని స్వధర్మాచార పరుండును, నిష్కాముండును, శ్రద్ధాయుక్తుండునై నన్నెల్లప్పుడు భజియించు నట్టివాని మనంబు క్రమంబునం బ్రసన్నంబగు; నట్లు ప్రసన్న మనస్కుండును, ద్రిగుణాతీతుండును, సమ్యగ్దర్శనుండును నైన యతండు మదీయ సమవస్థాన రూపశాంతి నొందు; నదియ కైవల్యపదంబనంబడు; కూటస్థం బైన యీ యాత్మ యుదాసీన భూతం బైనను దీని ద్రవ్యజ్ఞాన క్రియామనంబులకు నీశ్వరుంగా నెవ్వండు దెలియు, వాఁడు భవంబు నొందకుండు; నీ సంసారంబు ద్రవ్య క్రియా కారక చేతనాత్మకం బగుటంజేసి ప్రభిన్న దేహోపాధికంబు; గావునఁ బ్రాప్తంబు లైన యాపత్సంపదలయందు మత్పరులైన మహాత్ములు వికారంబు నొందరు; కావున నీవు సుఖదుఃఖంబుల యందు సమచిత్తుండవును, సమానోత్తమ మధ్యమాధముండవును, జితేంద్రియాశయుండవునునై వినిష్పాదితాఖి లామాత్యాది సంయుతుండవై, యఖిలలోక రక్షణంబు చేయు” మని వెండియు నిట్లనియె. (541) పార్థివోత్తములఁకుఁ బ్రజల రక్షించుట¯ పరమ ధర్మం బగు నరవరేణ్య! ¯ ధరణీశులకుఁ బ్రజాపరిపాలనంబునఁ¯ బూని లోకులు చేయు పుణ్యమందు¯ షష్ఠాంశ మర్థిని సంప్రాప్త మగు నట్లు¯ ప్రజలఁ బ్రోవని రాజు ప్రజలచేత¯ నపహృత సత్పుణ్యుఁడై వారు గావించు¯ ఘనపాప ఫలముఁ దా ననుభవించు (541.1) కాన నీవును విప్రవరానుమతము¯ సాంప్రదాయిక విధమునై జరగు ధర్మ¯ మహిమఁ జేపట్టి యర్థకామముల యందు¯ సమత నమ్మూఁటి యందు నాసక్తి లేక. (542) ఇవ్విధంబున. (543) జనులకు ననురక్తుఁడవై¯ జననాయక! నీవు ధరణి సమచిత్తుఁడవై¯ యనయముఁ బరిపాలించిన¯ సనకాదులఁ గాంతు వాత్మ సదనము నందున్. (544) భూవర! యోగ తపో మఖంబుల చేతఁ¯ గైకొని సులభుండఁ గాని యేను¯ సమచిత్తు లైన సజ్జనుల చిత్తంబుల¯ వర్తించుచుండెడివాఁడ నగుటఁ¯ జేసి తావక శమ శీల విమత్సర¯ కీర్తనముల వశీకృతుఁడ నైతి; ¯ నే నీకు నొక వరం బిచ్చెద వేఁడుము”¯ నావుడు విని మేదినీ వరుండు (544.1) లోకగురుఁ డైన యప్పుండరీక నయనుఁ¯ డానతిచ్చిన మృదులలితామృతోప¯ మానవాక్యము లాత్మీయ మస్తకమునఁ¯ దాల్చి సమ్మోదితాత్ముఁడై ధరణి విభుఁడు. (545) తన పాదములకు భక్తిన్¯ వినతుండై యాత్మకర్మ వితతికి లజ్జం¯ దనరుచు నున్న సురేంద్రునిఁ¯ గనుఁగొని సత్ప్రేమ మొదవఁ గౌఁగిటఁ జేర్చెన్. (546) ఇట్లు గౌఁగిటం జేర్చి గతద్వేషుండై యున్న యనంతరంబ. (547) భగవంతుండును విశ్వరూపకుఁడునై భాసిల్లు నవ్విష్ణుఁ డా¯ జగతీనాథకృతార్చనా నతులచే సంప్రీత చేతస్కుఁడున్¯ నిగృహీతాంఘ్రి సరోరుహద్వయుఁడునై నిల్చెం బ్రయాణాభిము¯ ఖ్యగరిష్ఠాత్మకుఁ డయ్యు నా పృథునిపైఁ గారుణ్య మేపారఁగన్. (548) ఇట్లు దనమీఁది యనుగ్రహంబునం జేసి విలంబితుం డగుటయు నయ్యాదిరాజన్యుం డైన పృథుచక్రవర్తి యమ్ముకుంద సందర్శనానంద బాష్పజలబిందు సందోహ కందళిత నయనారవిందుండై యవ్విభుమూర్తిం గనుంగొని కనుంగొన లేక గద్గదకంఠుండై పలుకలేక యుండియు నెట్టకేలకుఁ దన హృదయంబున నద్దేవుని నుపగూహనంబు గావించి తన్మూర్తి ధరియించి కన్నులం దొరఁగు నానంద బాష్పంబులు దుడిచికొని విలోకనంబు చేయుచు, నతృప్తదృగ్గోచరుండును, గరుడ స్కంధ విన్యస్త హస్తుండును, వసుధాతలస్థిత పాదకమలుండును నై యొప్పు నద్దివ్యపురుషున కిట్లనియె.

పృథుండు హరిని స్తుతించుట

(549) “వరదా! యీశ్వర! నిను స¯ త్పురుషుఁడు దేహాభిమాన భోగములకు నై¯ వరమెట్లు గోరు నిహసుఖ¯ వరములు నారకుల కైన వఱలవె చెపుమా. (550) ఘన మగు దేవ! యీ వరమె కాదు మహాత్మక వాగ్వినిర్గతం¯ బనఁదగు తావకీన చరణాంబుజ చారు మరందరూపమై¯ తనరిన కీర్తియున్ విని ముదంబును బొందఁగ లేని మోక్ష మై¯ నను మదిఁ గోర నొల్ల నఘనాశ! రమేశ! సరోజలోచనా! (551) అదిగాన పద్మలోచన! ¯ సదమల భవదీయ ఘనయశము వినుటకునై¯ పదివేల చెవులు కృప ని¯ మ్మదియే నా యభిమతంబు నగును ముకుందా! (552) అనఘ! మహాత్మ వాగ్గళితమైన భవత్పద పంకజాత సం¯ జనిత సుధాకణానిలవశంబున విస్మృత తత్త్వ మార్గవ¯ ర్తను లగు దుష్టయోగులకుఁ గ్రమ్మఱఁ దత్త్వముఁ జూపఁజాలు ని¯ ట్లొనరుట దక్క నన్య వర మొల్లఁ బయోరుహపత్రలోచనా! (553) వినుత మంగళ యశోవిభవ! సర్వేశ్వర!¯ యిందిర గుణసంగ్రహేచ్ఛఁ జేసి¯ యే నీదు శివతరం బైన సత్కీర్తిని¯ నర్థిమై వరియించె నట్టి కీర్తి¯ కలిత సత్పురుష సంగమము గల్గుచు నుండ¯ ధృతినెవ్వఁడేని యాదృచ్ఛికతను¯ జేసియునొకమాటు చెవులార విన్నవాఁ¯ డనయంబును గుణజ్ఞుఁ డయ్యెనేని (553.1) విరతి నేరీతి బొందును ధరణిఁ బశువుఁ¯ దక్కఁ దక్కిన తజ్ఞుండు దనుజ భేది¯ గాన యుత్సుకమతి నైన యేను లక్ష్మి¯ కరణి నిన్ను భజింతు; నో! పరమపురుష! (554) ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన యిందిరయు నేను నేక పదార్థాభిలాషం జేసి స్పర్ధమానుల మగుచున్న మా యిద్దఱకును బర్యాయసేవం జేసి కలహంబు లేకుండని;మ్మట్లు గాక భవదీయ చరణ సరోరుహ సేవాసక్త మనోవిస్తారుల మగుటం జేసి యేనయేన మున్ను భజియింతు నను తలంపులం గలహం బయిననుం గానిమ్ము దేవా;” యని వెండియు నిట్లనియె. (555) “జగదీశ! దేవ! యుష్మత్పద కైంకర్య¯ పరతఁ దనర్చు సాగరతనూజ¯ కృత్యంబునందు నకిల్బిష బుద్ధి నేఁ¯ బ్రీతిఁ గోరుట జగన్మాత యైన¯ యా రమాసతితోడి వైర మవశ్యంబుఁ¯ గల్గు నైనను దయాకార! నీవు¯ దీనవత్సలుఁడవు గాన స్వల్పం బైన¯ నధికంబు చేయుదు! వట్లుగాన (555.1) భవ్యచరిత! నిజస్వరూపంబునందు¯ నభిరతుఁడ వైన నీవు నన్నాదరించు¯ పగిది నిందిర నాదరింపవు మహాత్మ! ¯ భక్తజనలోక మందార! భవవిదూర! (556) ఇట్లగుటం జేసి సత్పురుషు లైనవారలు నిరస్తమాయాగుణ సముదయంబు గల నిన్ను భజియింతురు; వారలు భవత్పాదానుస్మరణ రూపంబయిన ప్రయోజనంబు దక్క నితర ప్రయోజనంబుల నెఱుంగరు; దేవా! సేవక జనంబులను వరంబులు వేఁడు మని జగద్విమోహనంబు లైన వాక్యంబులు పలుకుదువు; యట్టి భవదీయ వాక్యతంత్రీనిబద్ధులు లోకులు గాకుండిరేని ఫలకాములై కర్మంబుల నెట్టు లాచరింతురు; యీశా! భవదీయ మాయావిమోహితులై జను లేమి కారణంబున నీకంటె నితరంబులఁ గోరుచుందు? రిట్లగుటం జేసి తండ్రి దనంతన బాలహితం బాచరించు నట్లు మాకు నీవ హితాచరణం బాచరింప నర్హుండ"వని పలికిన నాదిరాజర్షి యైన పృథుచక్రవర్తి యర్థవంతంబు లయిన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె “మహారాజా! దైవప్రేరితుండవై నా యెడ నిట్టి బుద్ధి గలుగుటం జేసి యచలాచలం బగు భక్తి వొడము; దానిచే దుస్తరం బగు మదీయమాయం దరింతువు; నీవు నాచే నాదిష్టం బగు కృత్యం బప్రమత్తుండ వగుచు నాచరించిన సకల శుభంబులం బొందుదువు; మదీయ భక్తజనంబులు స్వర్గాపవర్గనరకంబులం దుల్యంబులుగా నవలోకింతురు; గావున నీ యధ్యవసాయంబు నట్టిదియ; మఱియు మదీ యాదేశంబున దుస్త్యజం బగు రోషంబును ద్యజించి నా యెడ భక్తి సలిపితివి గాన యదియె నాకుఁ బరమహర్షదం బగు” నని యభినందించి యనుగ్రహించి యతండు గావించు పూజలు గయికొని గమనోన్ముఖుం డయ్యె; నయ్యవసరంబున. (557) నర సిద్ధ చారణ సుర ముని గంధర్వ¯ కిన్నర పితృ సాధ్య పన్నగులును¯ నఖిల జనంబులు హరిపార్శ్వవర్తులు¯ నానంద మగ్నాంగు లగుచు; వేడ్క¯ యజ్ఞేశ చింతనుం డైన యా పృథువుచే¯ సత్కారములఁ బొంది; సమ్మదమునఁ¯ జనిరి నిజాధివాసములకు; భగవంతుఁ¯ డైన నారాయణుం డచ్యుతుండు (557.1) దగ నుపాధ్యాయ సహితుఁడై తనరు పృథుని¯ విమలమతు లయి చూచుచు నమరవరులు¯ దన్ను జయజయ కలిత శబ్దములఁ బొగడఁ¯ జనియె నప్పుడు వైకుంఠ సదనమునకు. (558) అంతఁ బృథుచక్రవర్తియు నింద్రియాగోచరుం డయ్యును దర్శితాత్ముండును దేవదేవుండును నయిన వాసుదేవునకు నమస్కరించి నిజపురంబునకుం జనుదెంచు సమయంబున మౌక్తిక కుసుమ మాలికా దుకూల స్వర్ణతోరణాలంకృతంబును, లలిత సుగంధ ధూప విలసితంబును, రత్నమయ రంగవల్లికా విరాజితంబును, ఫలపుష్ప లాజాక్షత దీపమాలికా స్తంభ పూగపోతాభిరామ ప్రతిగృహ ప్రాంగణంబును, మృగమద ఘనసార చందనాగరు వాఃపూర సంసిక్త రథ్యావళీ విభాసితంబును, దరుపల్లవాభిశోభితంబును నైన పురంబుఁ బ్రవేశించి రాజమార్గంబునం జనుదేర మండిత రత్నకుండలమణి మరీచులు గండఫలకంబులం దాండవంబులు సలుపం, బురకామినులు గనక పాత్ర విరచితంబు లయిన యశేష మంగళ నీరాజనంబుల నివాళింప, శంఖ దుందుభి ప్రముఖ తూర్యఘోషంబులును ఋత్విఙ్నికాయాశీర్వచనంబులును జెలంగ, వందిమాగధ జన సంస్తూయమానుం డగుచు విగత గర్వుండై యంతఃపురంబుం బ్రవేశించి; యనంతరంబ. (559) సమధికమతిఁ బౌరజన జానపదులచేఁ¯ దనరారు వివిధ పూజనము లొంది¯ రాజు సంతుష్టాంతరంగుండుఁ బ్రియవర¯ ప్రదుఁడునై వారల బహువిధములఁ¯ బూజించె; నివ్విధంబున మహత్తరములై¯ నట్టి కర్మంబుల నాచరించు¯ చును నిరవద్య చేష్టుండై మహత్తముఁ¯ డన నొప్పు నా పృథు మనుజవిభుఁడు (559.1) మించి భూమండలంబుఁ బాలించి విశద¯ యశము సర్వధరాచక్రమందు నిలిపి¯ చారు శుభమూర్తి రాజన్యచక్రవర్తి¯ పరమ మోదమునఁ బరమ పదము నొందె." (560) అని మైత్రేయ మహాముని¯ యనఘుఁడు విదురునకుఁ జెప్పె” నని శుకుఁ డభిమ¯ న్యుని సుతునకుఁ జెప్పిన తెఱఁ”¯ గని సూతుఁడు చెప్పె శౌనకాదుల తోడన్. (561) అట్లెఱింగించి వెండియు నిట్లనియె "నివ్విధంబున నశేష గుణ విజృంభితంబును, నిర్దోషంబును, సత్పురుష సత్కృతంబును నగు పృథుచక్రవర్తి యశంబును బ్రకటంబుగాఁ జేయంజాలు మైత్రేయునిం జూచి మహా భాగవతుం డైన విదురుం డిట్లనియె. (562) "మునినాథ; విను పృథు జనపాలచంద్రుండు¯ సొబఁగొప్ప మేదినీసురులచేత¯ రాజ్యాభిషేక సంపూజ్యుఁడై దేవతా¯ గణముచే లబ్ధార్హ గుణుఁడు నగుచు¯ వైష్ణవతేజంబు వలనొప్ప ధరియించి¯ యర్థి నేయే కర్మ మాచరించె¯ నది నాకు నెఱిఁగింపు మనఘాత్మ; భూమి యే¯ రూఢి గవాకృతి రూఢ యెవని (562.1) విక్రమోద్దీప్తమై యొప్పి వెలయునట్టి¯ కర్మమున నిప్డు రాజన్య గణము బ్రతుకు¯ నట్టి పృథుకీర్తి ధరలోన నతి వివేకి¯ దవిలి యెవ్వఁడు వినకుండు ధన్యచరిత;