పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 422 - 530

విధాత వరాహస్తుతి

(422) అట్టి యజ్ఞపోత్రిమూర్తిం జూచి కమలాసన ప్రముఖు లిట్లని స్తుతియించిరి. (423) "దేవ! జితం జితంతే పరమేశ్వర!¯ సితయజ్ఞభావన! శ్రుతిశరీర! ¯ కారణసూకరాకారుండ వగు నీకు¯ నతిభక్తి మ్రొక్కెద మయ్య వరద! ¯ భవదీయ రోమకూపము లందు లీనంబు¯ లై యుండు నంబుధుఁ లట్టి యధ్వ¯ రాత్మక మై తనరారు నీ రూపంబు¯ గానంగరాదు దుష్కర్మపరుల (423.1) కట్టి నీకుఁబ్రణామంబు లాచరింతు¯ మఖిలజగదేకకీర్తి! దయానువర్తి! ¯ భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర! ¯ చిరశుభాకార! యిందిరాచిత్తచోర!" (424) అని వెండియు నిట్లు స్తుతియించిరి. (425) "త్వక్కున నఖిల వేదములు రోమంబుల¯ యందును బర్హిస్సు నక్షు లందు¯ నాజ్యంబు పాదంబు లందుఁ జాతుర్హోత్ర¯ కలితంబు లగు యజ్ఞకర్మములును ¯ స్రుక్కు తుండంబున స్రువము నాసికను ని¯ డాపాత్ర ముదరకోటరము నందుఁ ¯ శ్రవణాస్య బిలములఁ జమస ప్రాశిత్రముల్¯ గళమున నిష్ఠిత్రికంబు జిహ్వఁ (425.1) దగుఁ బ్రవర్గ్యము నగ్నిహోత్రములు నీదు¯ చర్వణంబును సభ్యావపధ్యు లుత్త¯ మాంగ మసువులు చయనము లగుఁ గిటీశ!"¯ యనుచు నుతియించి రత్తఱి యజ్ఞవిభుని. (426) వెండియు "ముహుర్ముహుర్భవ దావిర్భావంబు దీక్షణీయేష్టి యగు; నీదు దంష్ట్రలు ప్రాయణీయం బను దీక్షానంతరేష్టియు, నుదయనీయం బను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు ప్రాతస్సవనాదులు; నీదు త్వజ్మాంసాది సప్తధాతువు లగ్నిష్ఠోమాత్యగ్నిష్ఠోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు లను సంస్థాభేదంబులును, ద్వాదశాహాదిరూపంబులైన బహు యాగ సంఘాత రూపంబులు నగు; సర్వసత్త్రంబులు భవదీయ శరీరసంధులు; ససోమాసోమంబు లగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును నీవు యజనబంధనంబులచే నొప్పుచుందువు; అదియునుం గాక. (427) హవరూపివి హవనేతవు¯ హవభోక్తవు నిఖిలహవఫలాధారుఁడవున్¯ హవరక్షకుఁడవు నగు నీ¯ కవితథముగ నుతులొనర్తు మయ్య; ముకుందా! (428) సత్త్వగుణమున సద్భక్తి సంభవించు¯ భక్తియుతముగఁ జిత్తంబు భవ్య మగును¯ హృదయపద్మంబునం దోలి నెఱుఁగఁబడిన¯ యట్టి నీకు నమస్కారమయ్య; వరద! (429) అరవిందోదర తావకీనసితదంష్ట్రాగ్రావ లగ్నక్షమా¯ ధరనద్యబ్ధినదాటవీయుత సమిద్ధక్ష్మాతలంబొప్పె భా¯ సురకాసారజలావతీర్ణమదవచ్ఛుండాలరాడ్దంతశే¯ ఖరసంసక్త వినీలపంకజమురేఖంబొల్పు దీపింపఁగన్ (430) మఱియును. (431) చతురామ్నాయ వపుర్విశేష ధర! చంచత్సూకరాకార! నీ¯ సిత దంష్ట్రాగ్ర విలగ్నమై ధరణి రాజిల్లెం గులాద్రీంద్ర రా¯ జత శృంగోపరిలగ్న మేఘము గతిం జాలం దగెన్ సజ్జనాం¯ చిత హృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా! (432) సమధిక స్థావర జంగమాత్మక మైన¯ వసుమతీచక్ర మవక్ర లీల¯ నుద్ధరించితి కరుణోపేత చిత్తుండ¯ వగుచు నస్మన్మాత యయ్యె ధరణి¯ మాత యౌటెట్లని మదిఁ దలంచెద వేనిఁ¯ జర్చింప మాకు విశ్వమున కీవు¯ జనకుఁడ వగుట యుష్మత్పత్ని భూదేవి¯ యగుటఁ మాకును దల్లి యయ్యె నిపుడు (432.1) ధరకు నీతోడఁ గూడ వందన మొనర్తు¯ మరణి యందును యాజ్ఞికుఁ డగ్ని నిలుపు¯ కరణి నీ తేజమీ ధరాకాంత యందు¯ నిలుప ధరణి పవిత్రయై నెగడుఁ గాన. (433) తలఁప రసాతలాంతరగతక్షితిఁ గ్రమ్మఱ నిల్పినట్టి నీ¯ కలితన మెన్న విస్మయము గాదు సమస్త జగత్తు లోలి మై¯ గలుగఁగఁ జేయు టద్భుతము గాక మహోన్నతి నీ వొనర్చు పెం¯ పలరిన కార్యముల్ నడప నన్యులకుం దరమే? రమేశ్వరా! (434) సకల జగన్నియామక విచక్షణలీలఁ దనర్చు నట్టి నం¯ దకధర! తావకస్ఫుర దుదారత మంత్రసమర్థుఁ డైన యా¯ జ్ఞికుఁ డరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ¯ టకుఁ దలపోసి యా క్షితిఁ దృఢంబుగ నిల్పితి వయ్య; యీశ్వరా! (435) సలలిత వేదశాస్త్రమయ సౌకరమూర్తిఁ దనర్చుచున్ రసా¯ తలమున నుండి వెల్వడు నుదారత మేను విదుర్పఁ దత్సటో¯ చ్ఛలితము లైన బిందువుల సాధు తపోజన సత్యలోక వా¯ సుల మగు మేము దోఁగి పరిశుద్ధి వహించితి మయ్య; మాధవా! (436) విశ్వభవస్థితిప్రళయ వేళల యందు వికారసత్త్వమున్¯ విశ్వము నీవ యై నిఖిల విశ్వము లోలి సృజింతు విందిరా¯ ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ¯ శాశ్వతలీల లిట్టి వని సన్నుతిసేయఁగ మాకు శక్యమే? (437) పంకజోదర! నీ వపారకర్ముండవు¯ భవదీయకర్మాభ్ది పార మరయ¯ నెఱిఁగెద నని మది నిచ్చగించిన వాఁడు¯ పరికింపఁగా మతిభ్రష్టు గాఁక¯ విజ్ఞానియే చూడ విశ్వంబు నీ యోగ¯ మాయాపయోనిధి మగ్న మౌటఁ¯ దెలిసియుఁ దమ బుద్ధిఁ దెలియని మూఢుల¯ నే మన నఖిలలోకేశ్వరేశ! (437.1) దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు¯ వితత కరుణాసుధాతరంగితము లైన¯ నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ¯ జూచి సుఖులను జేయవో సుభగచరిత!" (438) అని బ్రహ్మవాదు లగు స¯ న్మునివర్యులు భక్తియోగమున వినమితులై¯ మనమున మోదము ముప్పిరి¯ గొనఁ బొగడిరి ఖురవిదళితగోత్రిం బోత్రిన్. (439) అంతట లీలఁబోలె జగదాత్ముఁడు యజ్ఞవరాహమూర్తి య¯ త్యంత గభీర భీషణ మహార్ణవతోయ సమూహమున్ ఖురా¯ క్రాంతముఁ జేసి క్రమ్మఱ ధరాతలమంబులమీద నిల్పి వి¯ శ్రాంతి వహింపఁ జేసి గుణశాలి దిరోహితుఁ డయ్యె నయ్యెడన్. (440) మంగళమైన యీ కథ సమంచితభక్తి బఠింప విన్నవా¯ రిం గరుణార్ద్రదృష్టిఁ గని శ్రీహరి సాల బ్రసన్నుఁ డౌను స¯ త్సంగతుఁ డైన విష్ణుఁడు ప్రసన్నుఁడు దా నగునేని వారికిన్¯ మంగళముల్ లభించు ననుమానము లే దదిగాక వెండియున్. (441) హరి నిజదాసకోటికిఁ దదాశ్రయులై రమియించు నట్టి స¯ త్పురుషుల కిష్ట వస్తు పరిపూర్ణ మనోరథసిద్ధి గల్గు సు¯ స్థిర మగుచున్న ముక్తియును సిద్ధముగాఁ జెలువారు నన్న న¯ స్థిరతర తుచ్ఛ సౌఖ్యములు సేకురుటల్ మఱి చెప్పనేటికిన్. (442) కాన సరోజలోచన జగత్త్సవనీయ కథాసుథారసం¯ బానిన యట్టి జిహ్వ యసదన్యకథాలవణోదకంబులం¯ బానముసేయఁ జూచునె సుపర్వ మహీజ మరందపాన లా¯ భానుభవంబు నొందు మధుపంబునుఁ బోవునె వేపచెట్లకున్." (443) అని మైత్రేయమునీంద్రుం¯ డనఘుఁడు విదురునకుఁ జెప్పి నట్టి తెఱంగ¯ ర్జునపౌత్రునకున్ వ్యాసుని¯ తనయుఁడు వినిపించి మఱియుఁ దగ నిట్లనియెన్. (444) "అని చెప్పిన మైత్రేయుని¯ గనుగొనిఁ విదురుండు పల్కు ఘనతర మగు నా¯ దనుజకులాంతకు చరితము¯ విని తనియదు నామనంబు విమలచరిత్రా! (445) సవనవరాహమూర్తికథ సర్వము నీ దయ వింటి వెండియున్¯ వివరముగా వినం బలుకవే గుణసాంద్ర! మునీంద్రచంద్ర! మా¯ ధవ గుణకీర్తనామృత వితానముఁ గర్ణపుటాంజలిన్ వెసం¯ జవిఁగొన కేల మాను జన సంతతికిన్ భవతాపవేదనల్. (446) కావున. (447) శ్రీహరి యజ్ఞవరాహ రూపముఁ దాల్చి¯ మించి హిరణ్యాక్షుఁ ద్రుంచె ననుచు¯ నప్పుడు మునినాథ చెప్పితి నాతోడ¯ నవ్వరాహంబు దంష్ట్రాగ్రమునను¯ ధరణి నెబ్భంగిని ధరియించె హరికి హి¯ రణ్యాక్షుతోడ వైరమున కేమి¯ కారణ మసుర నే గతి సంహరించెఁ దా¯ నింతయు నెఱిఁగింపు మిద్ధచరిత!" (447.1) యనిన మైత్రేయముని విదురునకు ననియె¯ "హరికథాకర్ణనమునఁ బెంపార నీకు¯ జన్మఫలసిద్ధి యగుటకు సందియంబు¯ వలదు హరిమాయ విధికైన వశమె తెలియ? (448) అనఘాత్మ నన్ను నీ వడి¯ గిన యీ కథ ధ్రువుఁడు విష్ణుకీర్తనపరతం¯ దనరిన నారదు నడుగ న¯ తని కతఁ డెఱిఁగింప హరికథాశ్రవణమునన్ (449) దండధరుఁ బెల్చ డాకాలఁ దన్ని ధ్రువుఁడు¯ నిందు నందును వాసికి నెక్కె నట్టి¯ విష్ణుసంకీర్తనం బరవిందభవుఁడు¯ దివిజులకుఁ జెప్పె నది నీకుఁ దేటపఱతు.

దితికశ్యప సంవాదంబు

(450) ఆకర్ణింపుము. (451) బలిసి దక్షప్రజాపతితనూభవ దితి¯ సంతానరుచి మానసమునఁ బొడమ¯ నొకనాడు పుష్పసాయకశరనిర్భిన్న¯ భావ యై విరహతాపమున వచ్చి¯ పతిసమాగమవాంఛ ప్రభవింప నిజనాథు¯ సన్నిథి నిలిచి యస్ఖలితనియతి¯ నగ్నిజిహ్వుండును యజురధీశుండును¯ నగు విష్ణుఁ దన చిత్తమందు నిలిపి (451.1) తగఁ బయస్సున నగ్నిహోత్రంబు సేసి¯ కమలహితుఁ డస్తశైలసంగతుఁడు గాఁగ¯ హోమశాలాంగణమునఁ గూర్చున్న విభునిఁ¯ గశ్యపునిఁ గాంచి విమలవాక్యముల ననియె. (452) "గజవిభుఁ డుద్ధతిన్ననఁటికంబములన్ విదళించు లీలఁ జి¯ త్తజుఁడు ప్రసూనసాయకవితానముచేత మదీయచిత్తమున్¯ గజిబిజి సేసి నెవ్వగలఁ గాఱియవెట్టఁగ నాథ! నీ పదాం¯ బుజములఁ గానవచ్చితి బ్రభుత్వమెలర్పఁగ నన్నుఁ గావవే! (453) అదియునుం గాక నా తోడిసవతు లెల్లను భవత్కృపావిశేషంబున గర్భాదానంబులు వడసి నిర్భరానందంబున నుండం జూచి శోకవ్యాకులితచిత్త నై యున్న నన్ను రక్షించుట పరమ ధర్మంబు నీవు విద్వాంసుడవు నీ యెఱుంగని యర్థంబు గలదే? నీ వంటి మహానుభావు లయిన సత్పురుషు లార్తులైన వారి కోర్కులు వ్యర్థంబులు గాకుండఁ దీర్చుట ధర్మం"బని; వెండియు నిట్లనియె. (454) "పతిసమ్మానము వడసిన¯ సతులకు నభిమతపదార్థసంసిద్ధియు నూ¯ ర్జిత యశముఁ గలిగి లోక¯ స్తుత మై చెలువారుచుండు జువ్వె, మహాత్మా! (455) తన ధర్మపత్నివలనను¯ మునుకొని తాఁ బుత్రరూపమున నుదయించున్¯ విను దీప మందు ముట్టిం¯ చిన దీపము రెండు గావె శిఖి యొకటయ్యున్. (456) కావున నీ యర్థమ యా¯ త్మావై పుత్ర యని వేద తతులం దోలిన్¯ వావిరిఁ బలుకఁగ వినవే¯ ధీవర! నను గావు మధికదీనన్ కరుణన్. (457) వర కరుణామతిన్ దుహితృ వత్సలతం దనరారు నట్టి మ¯ ద్గురుఁ డొకనాడు మమ్ముఁ దన కూతుల నందఱఁ బిల్చి మీ మనో¯ హరునెఱిఁగింపుఁ డిత్తుఁ గమలాననలార! యటన్న నందులోఁ¯ బురుషవరేణ్య! యేము పదమువ్వుర మర్మిలినిన్ వరింపమే." (458) దితి యీగతిఁ గామవిమో¯ హితమతి బహువచనముల హృదీశునిఁ బలుకన్¯ ధృతిఁ గృపణఁ బతివ్రత నిజ¯ సతిఁ గని కశ్యపుఁడు పలికె సల్లాపమునన్. (459) "నీవు చెప్పిన యట్ల పురుషులకు నంగనలవలన ధర్మార్థకామంబులు సిద్ధించు; కర్ణధారుఁడు నావచేతం బయోధిఁ గడచు చందంబున వ్యసనార్ణవంబు దరియింపం జేయు భార్య పురుషునందు నర్దంబు; భార్యయందు సకల గృహకార్య భారంబునుం జేర్చి పురుషుండు నిశ్చింతుండై సుఖియించుచుండు; మఱియు నితరాశ్రమ దుర్జయంబు లైన యింద్రియ శత్రువర్గంబుల భార్యాసమేతుం డైన గృహస్థుండు దుర్గాధిపతి యైన రాజు శత్రు సంఘంబుల జయించు చందంబున లీలామాత్రంబునం జయించు; ఇట్టి కళత్రంబునకుం బ్రత్యుపకారంబు సేయ సకలగుణాభిరాము లగు సత్పురుషులు నూఱేండ్లకును జన్మాతరంబులకు నైన సమర్థులుగారు; అనిన మము బోటివారలు సేయ నోపుదురే? ఐన నీ మనంబుంనం గల దుఃఖంబు దక్కు"మని, యిట్లనియె. (460) "తరలలోచన! నీవు సంతానవాంఛఁ¯ జేసి వచ్చితి వౌఁ గుల శీల వర్త¯ నములు గల భార్యమనమున నమరు కోర్కిఁ¯ దవిలి తీర్చుట పతికిఁ గర్తవ్య మరయ.

కశ్యపుని రుద్రస్తోత్రంబు

(461) తరుణీ! యొక్క ముహూర్త ముండు మిది సంధ్యాకాల మిక్కాల మం¯ దరయన్ భూతగణావృతుం డగుచుఁ గామారాతి లీలన్ వృషే¯ శ్వర యానంబున సంచరించుట నభావ్యం బయ్యె నీ యుగ్రవే¯ ళ రమింపంగ నిషిద్ధకర్మ మగు నేలా ధర్మమున్ వీడఁగన్? (462) అరవిందానన! వీఁడె నీ మఱఁది లీలాటోపరుద్రక్షమా¯ చరఝంఝానిలధూతపాంసుపటలచ్ఛన్నుండు ధూమ్రైకదు¯ ర్భరవిద్యోతితకీర్ణభీషణజటాబద్ధుండు భస్మావలి¯ ప్తరుచిస్ఫారసువర్ణవర్ణుఁ డగుచున్ భాసిల్లు నత్యుగ్రుఁ డై. (463) అనల సుధాకర రవి లో¯ చనముల వికసింపఁ జేసి సమధికరోషం¯ బునఁ జూచుచున్నవాఁ డదె¯ వనితా! బంధుత్వ మరయ వలవదు సుమ్మీ. (464) అతనికిఁ దలపోయ హితా¯ హితులును సమ్మాన్యులును విహీనులు నతిగ¯ ర్హితులును లే రీశుఁడు సమ¯ మతియును నిఖిలైకభూతమయుఁ డై యుండన్. (465) కావున, మద్భ్రాత భవ¯ ద్దేవరుఁ డని తరుణి! నీ మదిం జూడకుమా¯ దేవాదిదేవుఁ ద్రిజగ¯ త్పావను నిఖిలైకనేత భగవంతు హరున్. (466) ఏమును సత్పురుషులైన విజ్ఞానవంతులును భుక్తభోగంబై దురతోన్యస్తం బైన పుష్పమాలికయునుం బోలె నమ్మహాత్ముని చరణారవింద వందనాభిలాషిణి యైన యవిద్యాదేవి ననుసరించి వర్తింతు; మదియునుంగాక. (467) ఎవ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాల¯ వరు లాత్మపద వైభవములఁ దనరి¯ రెవ్వని యాజ్ఞ వహించి వర్తించును¯ విశ్వనేత్రి యగు నవిద్య యెపుఁడు¯ నెవ్వని మహిమంబు లిట్టివట్టివి యని¯ తర్కింప లేవు వేదంబు లయిన¯ నెవ్వని సేవింతు రెల్ల వారును సమా¯ నాధికరహితుఁ డై యలరు నెవ్వఁ (467.1) డట్టి దేవునిఁద్రిపురసంహారకరుని¯ నస్థిమాలాధరుండు బిక్షాశనుండు¯ భూతిలిప్తాంగుఁ డుగ్రపరేతభూమి¯ వాసుఁ డని హాస్య మొనరించు వారు మఱియు. (468) ధర శునకభోగ్యమును నిహ¯ పరదూరము నైన తనువు పాథేయముగా¯ నెఱి నమ్మి వస్త్ర మాల్యా¯ భరణంబు లలంకరించు పామర జనులన్ (469) ఘన నిర్భాగ్యులుగా మదిఁ¯ గను" మని యీరీతిఁ బ్రియకుఁ గశ్యపుఁ డెఱిగిం¯ చిన దితి గ్రమ్మఱఁ బలికెను¯ మనసిజసాయకవిభిన్నమానస యగుచున్.

దితి గర్భంబు ధరించుట

(470) మునుకొని లజ్జావనత వ¯ దన యై ప్రాణేశు కొంగుఁ దాలిమి దూలం¯ బెనఁగొనియె వారకామిని¯ యనువున వినిషిద్ధకర్మ మందభిముఖి యై. (471) ఇట్లు సేసిన భార్యా నిర్బంధంబునకుం దొలంగ నేరక, యీశ్వరునకు నమస్కారం బొనరించి యేకాంతంబున నిజకాంతాసంగమంబు దీర్చి సంగమానంతరంబున వార్చి స్నాతుం డై ప్రాణాయామం బొనర్చి విరజంబును సనాతనంబును నైన బ్రహ్మగాయత్రి జపియించె నంత. (472) దితియును నిషిద్ధకర్మ¯ స్థితి కై మదిలోన సిగ్గు చిట్టాడఁగ నా¯ నతవదన యగుచు నా పశు¯ పతివలని భయంబు గల్గి పరమప్రీతిన్. (473) కశ్యపు గనుంగొని యిట్లనియె "సమస్తభూతపతి యైన పరమేశ్వరుండు నా చేసిన యపరాధంబు సహించి మద్గర్భ పరిపాలనంబు సేయుంగాక; రుద్రుండును, మహాత్ముండును, స్వయంప్రకాశుండును, నలఘ్యుండును, సకామజన ఫలప్రాపకుండును, దుష్టశిక్షకుండును, బరమాత్ముండును, జగదంతర్యామియు, నిర్గుణుడును, నిష్కాముండును, భక్తసులభుండును, భగవంతుండును నగు నప్పరమేశ్వరునకు నమస్కరించెద; మఱియు, షడ్గుణైశ్వర్య సంపన్నుండును, జగద్భర్తయు, మహానుగ్రహశీలుండును, నిర్దయాపరిపాల్యవధూ రక్షకుండును, సతీదేవిపతియు నైన యా పరమేశ్వరుండు నన్ను రక్షించుగాత"మని సన్నుతించి. (474) అర్భకులు లేని దగుటను¯ గర్భము నిజనాథువలనఁ గమలానన కా¯ విర్భూత మైనఁ గర్మవి¯ నిర్భరపరితోష మాత్మ నెలకొని యుండెన్. (475) అంతఁ గశ్యపుండు దత్కాల సముచిత సంధ్యావందనంబులు దీర్చి. (476) ఆ చెలికి గర్భచిహ్నము¯ లేచినఁ బరితోషమాత్మ నేపారగ మా¯ రీచుండు నిజతలోదరిఁ¯ జూచి యకర్మమున కాత్మ స్రుక్కుచుఁ బలికెన్. (477) "సతి నీ వేగతి నిందకోడక మనోజాతేక్షు కోదండ ని¯ ర్గత నారాచపరంపరాహత వికీర్ణస్వాంతు వై పాపసం¯ గతి లజ్జాభయ ధర్మముల్ విడిచి దుష్కాలంబు నందే రమిం¯ చితి బల్మిన్ వెలయాలి కైవడిని దుశ్శీలక్రియాలోలతన్. (478) అట్లగుటం జేసి. (479) సతి విను భూతగణప్రే¯ రితులై రుద్రానుచరులు పృథుశక్తిసమ¯ న్విత లుగ్రకర్ము లతిశౌ¯ ర్యతములు భద్రానుభద్రులను నామములన్ (480) పరఁగిన దర్పోద్ధతు లి¯ ద్దఱు గొడుకులు నీకుఁ బుట్టి ధరణికి వ్రేఁగై¯ నిరతము బుధజనపీడా¯ పరులై వర్తింతు రాత్మ బలగర్వమునన్. (481) అట్టి దుష్కర్ములకును మహాత్ము లలిగి¯ విశ్వవిదుఁ డైన హరికిని విన్నవింప¯ నతఁడు కోపించి హరి కులిశాయుధమున¯ గిరుల నఱకినగతి వారిఁ ధరణి గూల్చు." (482) అని కశ్యపుఁ డెఱిఁగించిన¯ విని దితి భయ మంది చాల విహ్వలమతి యై¯ తన హృదయేశు ముఖాబ్జముఁ¯ గనుగొని యిట్లనియె విగతకౌతుక యగుచున్. (483) "ధర సుజనాపరాధు లగు తామసచిత్తుల కెందు నాయువున్¯ సిరియు నశించిపోవు మృతి సేకుఱు శత్రులచేత నింత యౌ¯ నరయఁగ నిక్కువంబు భవదాత్మజు లార్యుల కెగ్గు సేసినం¯ గరుణను వారు వారి మదిఁ గైకొని కావ ననుగ్రహింపరే." (484) అనవుడుఁ గశ్యపుండు గమలానన కిట్లను "నింతి! నీవు చే¯ సిన విపరీతకర్మమునఁ జేకుఱె నిట్టి యవస్థ దీనికిన్¯ మనమునఁ దాప మొందకుము మాధవుపాదసరోజయుగ్మచిం¯ తనమునఁ జేసియున్ నను ముదంబునఁ గొల్చుట జేసియుం దగన్. (485) రమణి! నా సుతు లందు హిరణ్యకశిపు¯ వలన నుదయించువారి లోపల ముకుంద¯ పదసరోజాత విన్యస్తభావుఁడైన¯ తనయుఁ డుదయింపగలఁ డతిధార్మికుండు. (486) మఱియును. (487) ఘనపుణ్యుఁడు నన్వయపా¯ వనుఁ డగు నప్పుణ్యతముని వరకీర్తిలతల్¯ వనజభవాండోదర మె¯ ల్లను నిండఁగ బర్వు బుధలలాముం డగుటన్. (488) వామలోచన! వినుము, దుర్వర్ణహేమ¯ మగ్నిపుటమునఁ బరిశుద్ధమై వెలుంగు¯ నట్లు దుష్టాత్మసంభవుఁ డయ్యు వంశ¯ పావనుం డగు హరిపాదభక్తుఁ డగుట. (489) అంచి తాష్టాంగయోగక్రియాకలాపు¯ లైన యోగీశ్వరులు నమ్మహానుభావు¯ నతులశీలస్వభావవిజ్ఞానసరణిఁ¯ దాముఁ జరియింప నాత్మలఁ దలతు రెపుడు. (490) ఆ మహితాత్మకుండు సుగుణాంబుధి భాగవతోత్తముండు ల¯ క్ష్మీమహిళాధినాథుఁ దులసీదళదాముఁ బరేశు నాత్మహృ¯ త్తామరసంబు నందుఁ బ్రమదంబున నిల్పి తదన్యవస్తువుం¯ దా మదిలో హసించు హరిదాస్యవిహారవినిశ్చితాత్ముఁడై. (491) అట్టి నీ పౌత్రుండు. (492) మహిత దేహాద్యభిమానంబు దిగనాడి¯ చిరతరాలంపటశీలుఁ డగుచుఁ¯ బరసమృద్ధికి నాత్మఁ బరితోష మందుచుఁ¯ బర దుఃఖమునకుఁ దాపమును బొందు¯ నీ విశ్వ మంతయు నే విభుమయ మని¯ యెవ్వని కరుణచే నెఱుఁగ నయ్యె¯ నట్టి యీశ్వరునిఁ దా నాత్మసాక్షిగ మోద¯ మడరంగఁ జూచు ననన్యదృష్టి (492.1) నతి నిదాఘోగ్ర సమయంబు నందు నిఖిల¯ జంతు సంతాప మడఁగించు చంద్రుమాడ్కి¯ నఖిల జగముల దుఃఖంబు లపనయించు¯ రూఢి నాతఁ డజాతవిరోధి యగుచు. (493) మఱియు, హరిధ్యాననిష్ఠాగరిష్ఠుం డగు నమ్మహాభాగవతాగ్రగణ్యుండు. (494) విమలాంతరంగ బహిరం¯ గములను స్వేచ్ఛానురూపకలితుం డగు నా¯ కమలాధీశ్వరు కుండల¯ రమణీయ ముఖంబుఁ జూచుఁ బ్రమదం బెసఁగన్. (495) మఱియు నీ విశ్వ మా హరిమయము గాఁగ¯ మనములోపలఁ దలచు నమ్మనునిభుండు¯ మను మహాత్ములలోన నీ మనుమఁ డధికుఁ¯ డనఁగ నుతికెక్కు"నంచుఁ గశ్యపుఁడు పలుక (496) విని తన తనయులు మధుసూ¯ దనుచే హతు లగుదు రనుచుఁ దన మనుమఁడు స¯ జ్జననుత భాగవతుం డగు¯ ననుచు మదిం జాల దుఃఖ హర్షము లొదవన్. (497) ఉండు నంత; నా దితియుఁ గశ్యపవీర్యసంభృతం బైన గర్భంబు దుర్భర తేజోభిరామంబును నన్య తేజోవిరామంబును దినదిన ప్రవర్థమానంబును నై నివ్వటిల్ల నిజోదరస్థితు లైన కుమారులమరదమను లై వర్తింపఁ గలరని చింతించుచు గర్భంబు శతవర్షంబులు ధరియించి యున్న యనంతరంబ.

దితిగర్భప్రకారంబుజెప్పుట

(498) ఆ దితిగర్భ మందు రుచిరాకృతితో నొక తేజ మన్యతే¯ జోదమ లీల వెల్వడి వసుంధరయున్ గగనంబు నిండి సం¯ ఛాదిత పద్మబాంధవ నిశాకర దీప్తులు గల్గి సూచికా¯ భేద మహోగ్ర సంతమసభీషణ మైన భయాకులాత్ము లై. (499) అమరగణంబు లెల్ల గమలాసను పాలికి నేఁగి తత్పదా¯ బ్జములకు మ్రొక్కి యంజలులు ఫాలములం గదియంగఁ జేర్చి చి¯ త్తముల భయంబు సంభ్రమముఁ దార్కొన నిట్లని విన్నవించి "రో¯ యమరకులాగ్రగణ్య! దురితార్ణవతారణ! సృష్టికారణా! (500) నీవు చరాచరప్రచయనేతవు, ధాతవు, సర్వలోకపా¯ లావళిమౌళిభూషణుఁడ, వంచితమూర్తివి, దేవదేవ! వా¯ ణీవర! యీ యజాండమున నీవు నెఱుంగని యర్థ మున్నదే? ¯ భావమునం దలంపుము విపన్నుల మమ్ము భవత్ప్రపన్నులన్. (501) దేవా కార్యరూపం బగు చేతనాచేతనాత్మక ప్రపంచంబునకుఁ గారణుండ వైన నీచేత సమస్త భువనంబులును సృజియింపఁ బడియె; నీవు సర్వభూతాత్మ భావవిదుండవు, లోకనాథ శిఖామణిభూతుండవు, విజ్ఞానవీర్యుండ, వవిద్యం జేసి యిట్టి స్రష్టరూపంబు నొందితి; గృహీత రజోగుణుండవు నీ యందుఁ బ్రపంచంబు లీనంబై యుండు; సుపక్వ యోగంబు నొంది నిష్కాములై ధ్యానంబున నిన్నరయుచు నిర్జిత శ్వాసేంద్రియాత్ము లై భవత్ప్రసాదంబు వడసిన వారలకుం బరాభవంబు లెక్కడివి; ఎవ్వని వాగ్జాలంబుచేఁ బాశబద్ధంబులైన పశువుల చందంబున నిఖిల జీవులు వర్తింతు; రట్టి నీకు నమస్కరించెదము; అహోరాత్ర విభాగాభావంబున లుప్తకర్మంబు లగు లోకంబులకు సేమంబు గావింపుము; శరణాగతులమైన మమ్ము నతిశయ కరుణారసపరిపూర్ణంబు లగు కటాక్షంబుల నీక్షించి రక్షింపుము; కశ్యప వీర్యంబు దితిగర్భంబున నుండి సకల దిగ్వలయంబు నాక్రమించి దారువందువహ్ని చందంబున లీనంబై ప్రవృద్ధం బగుచున్నది;"అని విన్నవించిన బృందారక సందోహంబులకు నానందంబు గందళింప నరవిందనందనుం డిట్లనియె.

సనకాదుల వైకుంఠ గమనంబు

(502) "గీర్వాణులార! యుష్మ¯ త్పూర్వజు లాత్మీయసుతులు పుణ్యులు విచర¯ న్నిర్వాణులు సనకాదులు¯ సర్వంకషశేముషీవిచక్షణు లెందున్. (503) వారలు నిస్పృహు లగుచు న¯ వారణ భువనంబు లెల్ల వడిఁ గ్రుమ్మరుచున్¯ ధీరు లొకనాఁడు భక్తిన్ ¯ శ్రీరమణీశ్వరపదాబ్జసేవానిరతిన్. (504) చనిచని కాంచిరంత బుధసత్తము లంచిత నిత్య దివ్యశో¯ భన విభవాభిరామముఁ బ్రపన్నజనస్తవనీయ నామమున్¯ జనన విరామమున్ సుజన సన్నుత భూమము భక్తలోకపా¯ లన గుణధామముం బురలలామముఁ జారువికుంఠధామమున్. (505) ఆ మహనీయ పట్టణము నందు వసించెడు వార లాత్మఁ ని¯ ష్కామఫలంబె సత్ఫలముగాఁ దలపోసి ముముక్షుధర్ము లై¯ శ్రీమహిళాధిపాంఘ్రిసరసీరుహ పూజ లొనర్చుచున్ మహో¯ ద్ధామఁ దదీయ రూపములఁ దాల్చి సుఖించుచు నుందు రెప్పుడున్. (506) విగతరజస్తమోగుణుఁడు విశ్రుతచారుయశుండు శుద్ధస¯ త్త్వగుణుఁ డజుం డనాదిభగవంతుఁ డనంతుఁ డనంతశక్తియున్¯ నిగమచయాంతవేద్యుఁడు వినిశ్చల నిర్మల ధర్మమూర్తియు¯ న్నగు హరిపేరఁ బెంపెసఁగున న్నగరోపవనమ్ము లిమ్ములన్. (507) మఱియుఁ గైవల్యంబు మూర్తీభవించిన తెఱంగునం బొలుపారుచు "నైశ్శ్రేయస"నామంబున నభిరామంబై సతతంబును సకలర్తుధర్మంబులు గలిగి యర్థిజనంబుల మనంబుల ఘనంబులుగ నీరికలెత్తిన కోరికలు సారికలుగొన నొసంగుచు నితరతరు రహితంబులును గామదోహన సహితంబులును బుష్పఫల భరితంబులును నై తనర్చు సంతాన వనసంతానంబులును, సమంచిత సౌభాగ్య సంపదభిశోభిత వాసంతికా కుసుమ విసర పరిమళ మిళిత గళిత మకరంద లలితామోద ముదిత హృదయు లై యఖండ తేజోనిధి యగు పుండరీకాక్షు చరిత్రంబు లుగ్గడింపలేక ఖండితజ్ఞాను లయ్యును నిరతిశయ విషయసుఖానుభవ కారణం బగుట నిందిరాసుందరీరమణ చరణసేవా విరమణకారియై యున్న దని తలంచి; తద్గంధ ప్రాపక గంధవహునిం దిరస్కరించి నారాయణ భజనపరాయణు లై చరియించు సుందరీ యుక్తు లైన వైమానికులును, వైమానిక మానసోత్సేకంబుగం బారావత హంస సారస శుక పిక చాతక తిత్తిరి మయూర రథాంగముఖ్య విహంగ కోలాహల విరామంబుగా నరవిందనయన కథాగానంబు లనూనంబుగా మొరయ మదవదిందిందిర సందోహ కలిత పుష్పవల్లీమతల్లికలును, నకుంఠిత చరిత్రుం డైన వికుంఠనిలయుని కంఠంబునం దేజరిల్లు విలసిత తులసీ దామంబుం గనుంగొని యీ తులసీదామంబు హరి మంగళగళ విలగ్నంబై యుండు సౌభాగ్యంబు వడయుట కేమి తపంబు గావించెనో యని బహూకరించు చందంబున నొప్పు చందన మందార కుందారవింద పున్నాగ నాగ వకుళాశోక కురవకోత్పల పారిజాతాది ప్రసూన మంజరులును, మంజరీ పుంజ రంజిత నికుంజంబుల యందు నుత్తుంగ పీనకుచభారాకంపిత మధ్యంబులుఁ గటితట కనకఘటిత మేఖలాకలాప నినదోపలాలిత నీల దుకూల శోభిత పృథు నితంబ భరాలసయాన హసిత కలహంస మయూర గమనంబులు నసమశర కుసుమశర విలసితంబు నపహసించు నయనకమలంబులుం గలిగిన సుందరీ సందోహంబులం దగిలి కందర్పకేళీ విహారంబుల నానందంబు నొందక ముకుంద చరణారవింద సేవాపరిలబ్ధ మరకత వైడూర్య హేమమయ విమానారూఢు లై హరిదాసులు విహరించు పుణ్యప్రదేశంబులును, నిందిరాసుందరి త్రైలోక్య సౌందర్యఖని యైన మనోహరమూర్తి ధరియించి రమణీయ రణిత మణినూపుర చరణారవింద యై నిజహృదయేశ్వరుం డైన సర్వేశ్వరుని మందిరంబునం జాంచల్య దోషరాహిత్యంబుగ వర్తింపం గరకమల భ్రమణీకృత లీలాంబుజాత యై తన నీడ కాంచనస్ఫటికమయ కుడ్యప్రదేశంబులం బ్రతిఫలింప శ్రీనికేతనుని నికేతన సమ్మార్జన కైంకర్యంబ పరమధర్మం బని తెలుపు చందంబునం జూపట్టుచు నిజవనంబునం దనరు సౌరభాభిరామంబు లగు తులసీదళదామంబుల నాత్మనాయకుని చరణారవిందంబుల నర్పించుచు నొసలి మృగమదపు టసలున మసలుకొని తుంపెసలాడు కురులును, లలిత తిలప్రసూన రుచిరాభ నానం దనరు మోముఁదామర విమల సలిలంబులఁ బ్రతిబింబింప నిజమనోనాయకుచేతం జుంబితం బగుటగాఁ దలంచి లజ్జావనతవదన యై యుండంజేయు ప్రవాళ లతికాకులంబు లైన కూలంబులు గల నడబావులును గలిగి పుణ్యంబునకు శరణ్యంబును, ధర్మంబునకు నిర్మలస్థానంబును, సుకృతమూలంబునకు నాలవాలంబును నయి పొలుపొందుచుండు. (508) హరివిముఖాత్ము లన్యవిషయాదృత చిత్తులుఁ బాపకర్ములున్¯ నిరయనిపాత హేతువును నింద్యచరిత్రము నైన దుష్కథా¯ నిరతిఁ జరించువారలును నేరరు పొందఁగ నిందిరామనో¯ హర చరణారవింద భజనాత్మకు లుండెడు గొంది నారయన్. (509) వెండియు. (510) హరిఁ బరమేశుఁ గేశవు ననంతు భజింపఁగ ధర్మతత్త్వధీ¯ పరిణతసాధనం బగు స్వభావముఁ దాల్చిన యట్టి మర్త్యులా¯ సరసిజనేత్రు మాయను భృశంబుగ మోహితు లై తదంఘ్రిపం¯ కరుహములర్థిమైఁ గొలువఁ గానమిఁ బొందరు తత్పదంబునన్. (511) మఱియు సరోరుహోదరుని మంగళదివ్యకథానులాప ని¯ ర్భర పరితోష బాష్ప కణ బంధుర చారు కపోల గద్గద¯ స్వర పులకాంకితాంగు లగువారలు నిస్పృహచిత్తు లత్యహం¯ కరణవిదూరు లుందురు సుకర్ములు యుండెడి పుణ్యభూములన్. (512) అందు. (513) వరవైకుంఠము సారసాకరము దివ్యస్వర్ణశాలాంక గో¯ పుర హర్మ్యావృతమైన తద్భవన మంభోజంబు తన్మందిరాం¯ తర విభ్రాజిత భోగి గర్ణిక తదుద్యద్భోగ పర్యంకమం¯ దిరవొందన్ వసియించు మాధవుఁడు దా నేపారు భృంగాకృతిన్ (514) అంత. (515) హరిచేఁ బాలితమైన కాంచన విమానారూఢ మైనట్టి స¯ త్పురుషానీకముచేఁ దనర్చి విభవాపూర్ణప్రభావోన్నతిం¯ గర మొప్పారు తదీయ ధామము జగత్కల్యాణమూర్తుల్ మునీ¯ శ్వరు లర్థిన్ నిజయోగశక్తిఁ బరితుష్టస్వాంతులై చెచ్చెరన్. (516) డాయంజని.

సనకాదుల శాపంబు

(517) మరకతరత్న తోరణ సమంచిత కుడ్య కవాట గేహళీ¯ విరచిత షట్సుకక్ష్య లరవిందదళాక్ష విలోకనోత్స వా¯ దరమతి నన్యముం గనక దాఁటి యనంతరకక్ష్య యందు ని¯ ద్ధఱను దదీయపాలుర నుదార సమాన వయో విశేషులన్. (518) కాంచన నవరత్న కటకాంగుళీయక¯ హార కేయూర మంజీర ధరులఁ¯ గమనీయ సౌరభాగత మత్త మధుకర¯ కలిత సద్వనమాలికా విరాజి¯ తోరస్థ్సలుల గదాయుతులను ఘనచతు¯ ర్భాహుల నున్నతోత్సాహమతుల¯ నారూఢ రోషానలారుణితాక్షుల¯ భ్రూలతా కౌటిల్య ఫాలతలుల (518.1) వేత్రదండాభిరాముల వెలయు నమ్ము¯ కుంద శుద్దాంత మందిరాళింద భూమి¯ నున్న యిద్దఱన్ సనకాది యోగివరులు¯ సూచుచును వృద్దు లయ్యు నాసుభగమతులు. (519) ధీరతఁ బంచాబ్దముల కు¯ మారకు లై కానఁబడుచు మనమున శంకం¯ గూరక చతురాత్మకు లని¯ వారిత గమనముల డాయవచ్చిన నెదురన్. (520) శ్రీలలనేశ్వరదర్శన¯ లాలసు లై యేఁగు బుధలలాముల నతి దు¯ శ్శీలతఁ దద్వచనప్రతి¯ కూలమతిం బోవకుండఁ గుటిలాత్మకు లై. (521) వారించిన వారలు బృం¯ దారకు లీక్షించుచుండ దారుణ పటు రో¯ షారుణితాంబకులై రొద¯ వారించుచు వారు నచటివారును వినగన్. (522) ఇట్లనిరి. (523) "పరము ననంతు భక్తపరిపాలు సుహృత్తము నిష్ఠు నీశ్వరే¯ శ్వరు భజియింపఁ గోరి యనివారణ నిం దరుదేర నిచ్చలున్¯ భరితముదాత్ములై కొలువఁ బాయక తద్భజనాంతరాయ త¯ త్పరమతి మాకు నిప్పు డరిపడ్డ దురాత్ముల నేఁడు గంటిరే." (524) అని మఱియు; సనకసనందనాదులు జయవిజయులం జూచి యిట్లనిరి "మీ మనంబుల స్వామి హితార్థం బై నిష్కపటవర్తనుల మైన మాబోఁటులఁ గుహకవృత్తి గల యితర జనంబులు భగవత్సదనంబుఁ బ్రవేశింతురో యను శంకం జేసి కొందఱం బ్రవేశింపఁజేయుటయుఁ; గొందఱ వారించుటయు; దౌవారిక స్వభావం బని వారింప దలఁచితిరేని బ్రశాంత దివ్యమంగళవిగ్రహుండును, గతవిగ్రహుండును, భగవంతుడును, విశ్వగర్భుండును నైన యీశ్వరుండు ప్రాప్యంబును, బ్రాపకంబును, బ్రాప్తియు నను భేదశూన్యుండు గావున మహాకాశంబు నందు ఘటపటాద్యాకాశంబులు వేఱులేక యేకంబై తోఁచు చందంబున విద్వాంసు లగు వా రమ్మహాత్ముని సకలాత్మ భేదరహితునింగాఁ బొడ గందురు; అదియునుంగాక లోకంబు నందు రాజులు సాపరాధులైన కింకర జనంబుల నాజ్ఞాపించు చందంబున నీశ్వరుండు దండించునో యను భయంబునం జేసి వారించితి మని తలంచితిరేని భూసురవేషధారుల మైన మాకును వైకుంఠనాయకుండైన సర్వేశ్వరునకును భేదంబు లేకుండుటం జేసి శంకసేయం బనిలేదు; ఇట్లగుట యెఱింగి మందబుద్దులరై మమ్ము వారించిన యనుచితకర్ములగు మీరలు మదీయశాపార్హు లగుదురు; గావున భూలోకంబునం గామ క్రోధ లోభంబులను శత్రువులు బాధింపం బుట్టుం"డని పలికిన. (525) వారలు విని తమ మనములు¯ భూరిస్ఫుట చండకాండపూగంబులచే¯ వారింపరాని భూసుర¯ దారుణవాక్యముల కులికి తల్లడపడుచున్. (526) పరితాపంబును బొందుచు¯ సరసిజలోచనుని భటులు సనకాది మునీ¯ శ్వరుల పదాంబుజములకుం¯ గర మర్థిన్ మ్రొక్కి నిటలఘటితాంజలు లై. (527) ఇట్లనిరి. (528) "వరయోగీశ్వరులార! మమ్ము మది నొవ్వన్ మీర లిట్లన్న ని¯ ష్ఠుర వాక్యంబుల కింక మా మనములన్ శోకింపగా రాదు స¯ త్పురుషశ్రేణిఁ బరాభవించిన వృథాభూతాత్ములన్ మమ్ము మా¯ దురితం బింతకుఁ దెచ్చె మీఁద శుభముం దూకొందు మే మారయన్. (529) అది యెట్లంటిరేని. (530) మీ కరుణావలోకన సమేతులఁగా మముఁ జేయుఁ జిత్తముల్¯ దూకొనెనేని మాచనువుఁ ద్రోయక యీఁదగుఁ గామ లోభముల్¯ కైకొని పుట్టు చోట నవకంజదళాక్షుని నామవిస్మృతిం¯ బైకొనకుండ దాననె శుభం బగు మీఁది మదీయ జన్మముల్."