పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : చతుర్థ 391 - 466

వేనుని చరిత్ర

(391) క్షితినాథోత్తముఁ డాత్మనందనుని దుశ్శీలంబు వీక్షించి దుః¯ ఖితుఁడై యొంటిగఁ దత్పురిన్ వెడలి యేగెన్ వేగ మెందేనిఁ ద¯ ద్గతి వీక్షించి మునీశ్వరుల్గుపితులై దంభోళిసంకాశ వా¯ క్యతతిం జావ శపింప వాఁ డపుడు వీఁకం గూలె, నమ్మేదినిన్ (392) కైకొని యపుడు లోకం బరాజకమైనఁ¯ బ్రజలు దస్కరపీడఁ బల్లటిల్లఁ¯ గనుఁగొని దుఃఖించి మునులు గతాసుఁడై¯ పడిన వేనుని వలపలి భుజంబు¯ నర్థి మథింప నారాయణాంశంబున¯ నాదిరాజన నొప్పునట్టి పృథుఁడు¯ జనియించె ననవుడు విని విదురుఁడు మునిఁ¯ గనుఁగొని పలికె నో యనఘచరిత! (392.1) సాధువు సుశీలనిధియును సజ్జనుండు¯ నలఘు బ్రహ్మణ్యుఁడును నైన యట్టి యంగ¯ ధరణివిభునకు దుష్టసంతాన మెట్లు¯ గలిగె? నయ్యంగపతి యేమి కారణమున (393) విమనస్కుం డగుచుఁ బురంబు విడిచె? ధర్మకోవిదులైన మునులు దండవ్రతధరుండును, రాజును నగు వేనుని యందు నే పాపంబు నిరూపించి బ్రహ్మదండం బొనర్చి రదియునుం గాక లోకంబున రాజులు లోకపాల తేజోధరులు, ప్రజాపాలనాసక్తులుఁ గావునఁ గల్మషంబు గలిగినం బ్రజలచేత నవజ్ఞానర్హులై యుందురు; గావున నా వేనుని చరిత్రంబు శ్రద్ధాగరిష్ఠుండు భక్తుండు నైన నాకుం బరాపరవిదగ్రేసరుండ వయిన నీ వెఱింగింప నర్హుండ"వనిన మైత్రేయుం డతని కిట్లనియె. (394) "అనఘాత్మ! రాజర్షి యైనట్టి యయ్యంగ¯ మేదినీ విభుఁ డశ్వమేధమఖము¯ గావింప ఋత్విఙ్నికాయంబు చేత నా¯ హూత మయ్యును సురవ్రాత మంత¯ నాత్మ హవిర్భాగ మంద రాకుండిన¯ నప్పుడు ఋత్విక్కు లద్భుతంబు¯ నందుచు యజమానుఁడైన యయ్యంగ మ¯ హీవరుఁ జూచి రాజేంద్ర! యిట్లు (394.1) త్రిదశు లిదె పిల్వబడియును దివిరి యాత్మ¯ భాగములఁ బొంద రా రైరి భవ్యచరిత! ¯ యేమి హేతువొ యిది మాకు నెఱుఁగఁబడదు; ¯ కనఁగ హోమంబు దుష్టంబు గాదు మఱియు. (395) శ్రద్ధాయుక్తులై ధృతవ్రతులైన యీ బ్రహ్మవాదులచేత సంప్రయుక్తంబు లైన యీ ఛందస్సులు వీర్యవంతంబులయి యున్న యవి; ఇందు దేవతాపరాధం బణుమాత్రం బయిన నెఱుంగము; ఇట్టిచోటం గర్మసాక్షు లయిన దేవతలు స్వకీయ భాగంబు లంగీకరింపకుండుటకుఁ గతం బెయ్యదియో"యనిన న య్యంగుండు దుఃఖితస్వాంతుండై తన్నిమిత్తంబు సదస్యుల నడుగం దలంచి వారల యనుమతిం బడసి మౌనంబు మాని యిట్లనియె. (396) "అనఘచరితులార! యాహూతు లయ్యు సు¯ పర్వగణము లాత్మ భాగములను ¯ స్వీకరింప? రేను జేసిన యపరాధ¯ మెట్టి” దనిన వార లిట్టు లనిరి. (397) “నరనాథా! యిది యిప్పుడు¯ వొరసిన దుష్కృతము గాదు పూర్వభవమునం¯ బరఁగిన దురితం బిది యా¯ దరమున నెఱిగింతు మింత ధన్యచరిత్రా; (398) నీ వింతవాఁడ వయ్యును¯ భూవర! సంతానలాభమును బొందమి నా¯ దేవతలు యాగభాగము¯ లీ వేళ భుజింప రైరి యిందుకు నీవున్. (399) పుత్రకామేష్టిఁ గావించి పుత్రుఁ బడయు¯ మట్లొనర్చిన దేవత లాత్మభాగ¯ మర్థి నంగీకరింతు; ర య్యజ్ఞ పురుషు¯ హరి భజించిన సకల కార్యములుఁ గలుగు.” (400) అనిన నాతండు సంతానార్థంబు శిపివిష్టదేవతాకం బయిన పురోడాశంబుచే హోమంబుగావించినం దదీయ హోమకుండంబు నందు హేమమాల్యాంబరాభరణుం డయిన పురుషుండు హిరణ్మయ పాత్రంబున సిద్ధపాయసంబు గొనుచు నుదయించిన నప్పుడు విప్రానుమతంబున నా రాజు దత్పాయసంబు నంజలిచే గ్రహించి సంతోష యుక్తుండగుచు భార్య కొసంగె; అంత. (401) కమలదళాక్షి పాయసము గౌతుక మొప్ప భుజించి భర్తృ సం¯ గమమునఁ జేసి తత్క్షణమ గర్భముఁ దాల్చి కుమారుఁ గాంచె న¯ క్కొమరుఁడు నంత మాతృజనకుం డగు మృత్యువుఁ బోలి తా నధ¯ ర్మమునఁ జరించుచుండె గుణమండన! వేనుఁ డనంగ నిచ్చలున్ (402) ఎనయఁగ బాల్యమందుఁ దన యీడు కుమారులఁ గ్రీడఁ బోలె నె¯ మ్మనమున భీతి లేక కృపమాలి పశుప్రకరంబు నొంచు పో¯ ల్కిని నరికట్టి చంపుచును గిల్బిషలుబ్దక వృత్తిమై శరా¯ సనశరముల్ ధరించి మృగజాతి నసాధుగతిన్ వధించుచున్. (403) ఇట్లు మాతామహ దోషంబునం బాపవర్తనుండై చరియించు కొడుకుం జూచి యంగుండు వివిధ శాసనంబుల దండించియు నతని దుశ్చేష్టితంబులు మానుపం జాలక దుఃఖితాత్ముండై మనంబున. (404) అనయము నిట్టి కుపుత్రునిఁ¯ గని పరితాపంబుఁ బొందుకంటెను ధరలో¯ ననపత్యుం డగు టొప్పును¯ వనజాక్షు భజించునట్టి వాఁ డగువాఁడున్. (405) అని వెండియు నిట్లనియె. (406) “జనులకు దుష్పుత్రకునిచేత నపకీర్తి¯ యు నధర్మమును సర్వజనవిరోధ¯ మును మనోవ్యథయును ననయంబు బ్రాపించు¯ నట్టి కుపుత్రుమోహంబు విడువఁ¯ జాలక బహుమాన సంగతిఁ గను నెవ్వఁ¯ డతని గేహంబు దుఃఖాలయంబు¯ నగు నని మఱియు నిట్లను మనుజుండు శో¯ కస్థాన మగు పుత్రుకతనఁ జేసి (406.1) యనుపమక్లేశ భాజనం బయిన గృహము¯ విడుచుఁ గావున నిట్టి వివేకహీనుఁ¯ డగు కుపుత్రు సుపుత్రుఁగా నాత్మఁ దలఁతు¯ ననుచు నా రాజు బహుదుఃఖితాత్ముఁ డగుచు. (407) తగు సుమహైశ్వర్యోదయ¯ మగు గృహమును బ్రజల, నిద్ర నందిన భార్యన్¯ దిగవిడిచి యెక్కడేనియు¯ జగతీశుఁడు చనె నిశీథ సమయము నందున్. (408) అంతఁ దద్వృత్తాంతం బంతయు సుహృద్బాంధవ పురోహితామాత్య ప్రభృతు లయిన ప్రజ లెఱిఁగి దుఃఖించుచున్న సమయంబున భూమి యందెల్ల యెడలఁ దదన్వేషణం బాచరించి గూఢుం డయిన పరమపురుషునిం గానలేని కుయోగి చందంబున నా రాజుం బొడగానలేక విఫలోద్యోగులయి మగిడి పురంబునకు వచ్చిరి; తదనంతరంబ. (409) సమధిక బ్రహ్మనిష్ఠాతిగరిష్ఠులౌ¯ భృగ్వాది మౌనీంద్ర బృంద మపుడు¯ లోకావనై కావలోకనోత్సుకు లైన¯ జనులు స్వరక్షక జనవిభుండు¯ లేమిఁ బశుప్రాయులై మెలంగుటఁ గని¯ యంత వేనుని మాత యగు సునీథ¯ యనుమతి నఖిల ప్రజావళి కప్రియుం¯ డైన న వ్వేనుఁ బట్టాబిషిక్తుఁ (409.1) జేసి; రంతట మహితోగ్రశాసనుఁ డగు¯ వేనుఁ బట్టంబు గట్టుట విని సమస్త¯ తస్కరులు సర్పభీతిచేఁ దలఁగు మూషి¯ కముల కైవడి నడఁగిరి గహనములను. (410) అంత నతండు. (411) పరువడి నష్ట లోకపరిపాలక ముఖ్య విభూతి యుక్తుఁడై¯ పరఁగి నృపాసనంబున విభాసితుఁ డౌట స్వభావసిద్ధమై¯ వఱలు మహావలేపమున వారక సంతత మాననీయ స¯ త్పురుషుల నెల్ల నెందుఁ బరిభూతులఁ జేయుచు నుండె నిచ్చలున్. (412) మఱియు నతండు భూగగనమార్గములం దొకవేళ నొక్కఁడే¯ యరదము నెక్కి క్రుమ్మరు నిరంకుశవృత్తిఁ జరించు మత్త సిం¯ ధురవిభు పోల్కి సత్పురుషదూషిత వర్తన నొప్పుచున్ నిరం¯ తర సుజనాపరాధకృతి తత్పర మానసుఁడై క్రమంబునన్. (413) దివ్యులు వెఱఁగందఁగఁ బృ¯ థ్వీవ్యోమముల గల భేరి వ్రేయించె “న య¯ ష్టవ్య మదాతవ్యమహో¯ తవ్యం విప్రా” యనుచు నుదాత్తధ్వనులన్. (414) అని యిట్టులు భేరీరవ¯ మునఁ జేసి సమస్త ధర్మములు వారింపన్¯ మును లవినీతుం డగు వే¯ నుని దుశ్చరితంబు జనమనోభయ మగుటన్. (415) కని కృపాయత్తు లగుచు నిట్లనిరి యిట్టి¯ రాజచోర భయంబు లీ భూజనులను¯ బలసి యిరువంకలను బాధ పఱుపఁ జొచ్చె¯ దారువందుల వహ్ని చందమునఁ బెలుచ. (416) అరయ నరాజకంబగు మహాభయముం దొలఁగింపఁగోరి యి¯ ట్లెఱుఁగక యీ యనర్హుని మహీపతిఁ జేసిన యట్టి దోషముం¯ బరువడిఁ జెందె దుగ్ధరస పానమునం బరివృద్ధినొందు న¯ య్యురగము భీతి పోషకుని నొందిన రీతి ననర్థహేతువై. (417) అదియునుం గాక. (418) మునుకొని సునీథ గర్భం¯ బున జనియించియు స్వభావమున దుర్జనుఁడై¯ యెనయఁ బ్రజాపాలనమున¯ కును బాల్పడి ప్రజల మన్నిగొనఁ జొచ్చెఁగదే. (419) అదిగాన నీ వేనుండు పూర్వంబున జ్ఞాన సంపన్నులచేత రాజుగాఁ జేయంబడియెఁ; గావున నిట్టివాని మన మందఱమును గూడి ప్రార్థింతము; లోకరక్షణార్థం బగుటఁ దద్దోషంబు మనల స్పృశింపదు; సమీచీనోక్తులం జేసి వీని ననునయింప వాని గ్రహింపకుండెనేని మున్న లోకధిక్కారాగ్నిసందగ్ధుం డగు వీని మన తేజోమహాగ్నిచేత భస్మీ భూతుంజేయుద"మని యాలోచించి గూఢమన్యు లగుచు వేనునిం గదియం జని యతని కిట్లనిరి. (420) "నరపాలక! నీ కాయువు¯ సిరియును బలమును యశంబుఁ జేకఱు వృద్ధిం¯ బొరయుదుగా" కనుచు మనో¯ హరముగ నాశీర్వదించి యతివినయమునన్ (421) ఇట్లనిరి “నరేంద్రా! యే మొక్కటి విన్నవించెద; మవధరింపుము; పురుషులకు వాఙ్మనఃకాయ వృత్తుల వలన నాచరించు ధర్మంబు సమస్త లోకంబులను విశోకంబులం జేయు; నసంగు లయిన వారికి మోక్షంబు నిచ్చును; అట్టి ధర్మంబు ప్రజలకు క్షేమకారణంబు గావున నీ యందుఁ జెడకుండుం గాక"యని పలికి మఱియు "ధర్మంబు నాశంబు నొందిన నైశ్వర్యంబుచే రాజు విడువంబడు” నని చెప్పి వెండియు నిట్లనిరి “దుష్టచిత్తులగు నమాత్యులవలనను దస్కరులవలనను బ్రజలు నాశంబు నొందకుండ రక్షించుచు యథాన్యాయంబుగ వారలచేఁ గరంబు గొనుచు నుండు మహీపతి యిహపరసౌఖ్యంబుల నందు; నదియునుం గాక యెవ్వని రాష్ట్రంబున నే పురంబున యజ్ఞేశ్వరుం డయిన పురుషోత్తముండు నిజవర్ణాశ్రమోచితం బయిన ధర్మంబు గల వారిచేత యజియింపంబడు, నట్టి నిజశాసనవర్తి యగు రాజు వలన సర్వభూతభావనుండును, మహాభాగుండును, భగవంతుండు నగు సర్వేశ్వరుండు సంతుష్టుం డగు; నట్టి సకల జగదీశ్వరుం డైన సర్వేశ్వరుండు సంతోషించిన రాష్ట్రాధిపతికి సర్వసౌఖ్యంబులుఁ బ్రాపించు; లోకపాలకు లగువారు సర్వేశ్వరునికొఱకు బలిప్రదానంబులు చేయుదురు; సమస్తలోకదేవతాయజ్ఞాది సంగ్రహుండును, వేదమయుండును, ద్రవ్యమయుండును, దపోమయుండు నగు నారాయణుని విచిత్రంబులైన యజ్ఞంబులచేత యజనంబుచేసిన నీకు నభయం బగు; మోక్షంబునుం గలుగుం; గావున నీ రాజ్యంబున మఖంబులు చేయు మని యాజ్ఞాపింపుము; నీ దేశంబునఁ జేయంబడిన యజ్ఞంబులచేత హరికళాయుక్తంబు లగు దేవగణంబులు స్విష్టంబులై, తుష్టంబు లగుచు భవదీయవాంఛితార్థంబుల నిత్తురు; గావున దేవతాతిరస్కారంబు నీకు యుక్తంబు గాదు; వేదచోదితంబు లగు ధర్మంబులం దాసక్తుండవు గ"మ్మనిన వేనుం డిట్లనియె. (422) "మునులార! మీర లిప్పుడు¯ నను నీ గతిఁ బడుచుఁదనమునం బలికితి; రై¯ నను నది యధర్మ; మందుల¯ నెనయఁగ ధర్మమనఁ గలదె? యెచ్చటనైనన్. (423) అదియునుం గాక. (424) ఎనయఁగ జారకామిని నిజేశుని మ్రుచ్చిలి జారపూరుషుం¯ దనపతిఁ గాఁ దలంచు గతిఁ దద్దయు మూఢమనస్కులై తన¯ ర్చిన నరపాలరూపము ధరించిన యీశ్వరు నన్నెఱుంగ క¯ న్యుని భజియింప మీ రిహపరోన్నత సౌఖ్యము లంద రెన్నఁడున్.” (425) అని మఱియు నిట్లనియె “యజ్ఞ పురుషుం డన నెవ్వం? డెవ్వని యందు మీకు భక్తి స్నేహంబు లుదయించె? భర్తృస్నేహ విదూర లైన కుయోషి ద్గణంబులు జారు నందుఁ జేయు భక్తి చందంబునఁ బలికెద; రదియునుం గాక. (426) హరి హర హిరణ్యగర్భ¯ స్వరధీశ్వర వహ్ని శమన జలధిపతి మరు¯ న్నరవాహన శశి భూ రవి¯ సురముఖ్యులు నృపశరీర సూచకు లగుటన్. (427) పరికించి నను భజింపుఁడు¯ ధరణీశుఁడు సర్వదేవతామయుఁ డగు; మ¯ త్సర ముడుగుఁడు; నాకంటెను¯ బురుషుఁడు మఱియెవ్వఁ డగ్రపూజార్హుఁ డిలన్? (428) అదిగాన మీరు నాయందు బలివిధానంబులు చేయుం;"డని పాప కర్ముండు, నసత్ప్రవర్తకుండు, నష్టమంగళుండు, విపరీతజ్ఞానుండు నగు వేనుండు పండితమాని యగుచుం బలికి మునుల వచనంబులు నిరాకరించి యూరకున్న; నమ్మునులు భగ్నమనోరథులై తమలో నిట్లని “రీ దారుణకర్ముం డయిన పాతకుండు హతుం డగుం గాక; వీఁడు జీవించెనేని వీనిచేత నీ జగంబులు భస్మంబులు గాఁగల; విది నిశ్చితంబు; దుర్వృత్తుం డగు వీడు మహారాజ సింహాసనంబున కర్హుండు గాఁడు; వీఁడు మున్ను నే సర్వేశ్వరు ననుగ్రహంబున నిట్టి విభూతి యుక్తుం డయ్యె నట్టి యజ్ఞపతి యైన శ్రీవిష్ణుని నిందించుచున్నవాఁడు; గావున నిర్లజ్జుండైన హరినిందకుని హననంబు చేయ వలయు” నని మును లుద్యోగించి యాత్మప్రకాశితంబైన క్రోధంబునం జేసి హుంకారమాత్రంబున నా యీశ్వరనిందాహతుం డగు వేనునిం బొలియించి; రంత. (429) అరసి సునీథయు శోకా¯ తుర యై తన సుతుఁడు దనువుఁ దొఱఁగినఁ దదనం¯ తరమునను యోగశక్తిం¯ బరువడి నిజ తనయు తనువుఁ బరిపాలించెన్. (430) అంత నొక్కనాఁడు. (431) మునివరేణ్యులు భక్తి దనర సరస్వతీ¯ సలిలంబులను గృతస్నాను లగుచు¯ మునుకొని తత్తీరమున నగ్నిహోత్రముల్¯ విలసిల్ల నియతిఁ గావించి యచటఁ¯ దవిలి సత్పురుషకథా వినోదంబులు¯ సలుపుచు నుండంగ సకలలోక¯ భయదంబు లగు మహోత్పాతముల్ దోఁచిన¯ మసలి “లోకంబు లమంగళములు (431.1) వొరయ కుండెడుఁ గా కని బుద్ధిలోనఁ¯ దలఁచుచుండఁగఁ బెలుచ నుదగ్ర మగుచు¯ సర్వ దిశలను బాంసువర్షంబు గురిసెఁ; ¯ దస్కరులు సర్వజనుల విత్తములు గొనిరి. (432) ఇట్టి లోకోపద్రవం బెఱింగి జననాథుం డుపరతుం డగుటం జేసి జనపదంబు లరాజకంబులై యన్యోన్యహింసల నొందుచుం దస్కరబాధితంబు లగుచు నుండుట యెఱింగియుఁ దన్నివారణంబునకు సమర్థు లయ్యును జోరాది బాధలం గనుంగొనుచు మునులు వారింపక యుండిరి; మఱియు సమదర్శనుండు శాంతుండు మననశీలుండు నగు బ్రాహ్మణుండు దీనుల నుపేక్షించిన నతని తపంబు భిన్నభాండగతం బయిన క్షీరంబు చందంబున క్షయించుం; గావున నంగ వసుధాధీశ వంశోద్భవులు హరిపదాశ్రయు లగుటం జేసియు నమోఘ సత్త్వనిష్ఠులగుటం జేసియు వీరల వంశంబు విచ్ఛిత్తి నొందింప ననర్హంబు; గాన స్థాపనీయం బగు నని నిశ్చయించి మృతుండైన వేనుని కళేబరంబు డగ్గఱ వచ్చి తదూరు మథనంబు గావింప; నందు. (433) ఘన కాక కృష్ణ సంకాశ వర్ణుండును¯ హ్రస్వావయవుఁడు మహాహనుండు ¯ హ్రస్వబాహుండును హ్రస్వపాదుండును¯ నిమ్న నాసాగ్రుండు నెఱయ రక్త¯ నయనుండుఁ దామ్రవర్ణశ్మశ్రుకేశుండు¯ నతి దీన వదనుండు నైన యట్టి¯ యొక్క నిషాదకుం డుదయించి యేమి చే¯ యుదు నని పలుకుచునున్నఁ జూచి (433.1) వరమునులు నిషీద యనుచుఁ బలుకుటయును¯ దాన వాఁడు నిషాదాభిదానుఁ డయ్యె; ¯ నతని వంశ్యులు గిరికాననాళి వేను¯ కల్మషముఁ దెల్పుచుండిరి కడఁక మఱియు.

అర్చిపృథుల జననము

(434) కని వార నపత్యుం డగు¯ మనుజేంద్రుని బాహులంత మథియించిన నం¯ దనఘం బగు నొక మిథునము¯ జనియించెను సకల జనులు సమ్మద మందన్. (435) అందు లోకరక్షణార్థంబుగా నారాయణాంశంబున నొక్క పురుషుండును హరికి నిత్యానపాయిని యైన లక్ష్మీకళాకలితయు, గుణంబులను భూషణంబులకు నలంకార ప్రదాత్రియు నగు కామినియు జనియించె; అందుఁ బృథుశ్రవుండును బృథుయశుండు నగుట నతండు ‘పృథు చక్రవర్తి’ యనుపేరం ప్రసిద్ధుండయ్యె; అయ్యంగనయు ’నర్చి’ యను నామంబునం దనరుచు నతని వరియించె; నా సమయంబున. (436) అందంద కురియించి రమరులు మునినాథ!¯ వితతి మోదం బంద విరులవానఁ; ¯ బరమానురక్తి శుంభల్లీలఁ జూపట్టె;¯ సురపతి వీట నచ్చరల యాట; ¯ కర్ణ రసాయన క్రమమున వీతెంచెఁ;¯ బర పైన తేట కిన్నరులపాట; ¯ యనిమిషకరహతం బై చాలఁ జెలఁగెను;¯ విభవోత్సవంబు దుందుభిరవంబు; (436.1) మునినుతి చెలంగె శిఖి గుండముల వెలింగె¯ నంత నచటికి సరసీరుహాసనుండు¯ గరుడ గంధర్వ కిన్నర గణముతోడ¯ నర్థిఁ జనుదెంచె సమ్మోద మతిశయిల్ల. (437) అంత. (438) అరయఁగ వైన్యుని దక్షిణహస్తము నందు రమారమణీసుమనో¯ హరులలితాయుధచిహ్నము లంఘ్రుల యందు సమగ్రహలాంకుశభా ¯ స్వర కులిశధ్వజ చాప సరోరుహ శంఖ విరాజిత రేఖలు వి¯ స్ఫురగతి నొప్పఁ బితామహముఖ్యులు చూచి సవిస్మయులైరి తగన్. (439) ఇతండు నారాయణాంశ సంభూతుండు నితని యంగన రమాంశ సంభూతయుం గానోపుదు; రని తలంచి యయ్యవసరంబున బ్రహ్మవాదు లగు బ్రాహ్మణోత్తము లతనికి విధ్యుక్తప్రకారంబున రాజ్యాభిషేకంబు గావించిరి; తదనంతరంబ. (440) సరిదంభోనిధి ఖగ మృగ¯ ధరణీ సురవర్త్మ పర్వతప్రముఖములై¯ పరఁగిన భూతశ్రేణులు¯ నరవరునకుఁ దగ నుపాయనము లిచ్చె నొగిన్. (441) సమధికఖ్యాతి నా పృథుచక్రవర్తి¯ దేవి యగు నర్చితోఁ గూడ దివ్యవస్త్ర¯ గంధ మాల్య విభూషణ కలితుఁ డగుచుఁ¯ బావకుఁడుఁ బోలె సత్ప్రభాభాసి యయ్యె. (442) రాజరాజా పృథురాజుకు హేమమ¯ యంబైన వీరవరాసనంబు¯ జలపతి జలకణ స్రావకం బగు పూర్ణ¯ చంద్ర సన్నిభ సితచ్ఛత్రము మఱి¯ పవమానుఁ డమలశోభన మగు వాలవ్య¯ జన సమంచిత సితచామరములు¯ ధర్ముండు నిర్మలోద్యత్కీర్తిమయ మగు¯ మహనీయ నవ పుష్ప మాలికయును (442.1) జంభవైరి కిరీటంబు శమనుఁ డఖిల¯ జన నియామక దండంబు జలజభవుఁడు¯ నిగమమయ కవచంబు వాణీలలామ ¯ స్వచ్ఛ మగు నవ్యహార మొసఁగిరి మఱియు. (443) దామోదరుండు సుదర్శన చక్రంబు¯ నవ్యాహతైశ్వర్య మబ్జపాణి¯ చంద్రార్ధధరుఁ డర్థచంద్ర రేఖాంకిత¯ కమనీయ కోశసంకలిత ఖడ్గ¯ మంబిక శతచంద్ర మను ఫలకముఁ జంద్రు¯ డుయమృతమయ శ్వేతహయచయంబుఁ ¯ ద్వష్ట రూపాశ్ర యోదాత్త రథంబును¯ భానుండు ఘృణిమయ బాణములును (443.1) శిఖియు నజగోవిషాణ సంచిత మహాజ¯ గవ మనందగు చాపంబు నవనిదేవి¯ యోగమయమైన పాదుకాయుగము గగన¯ చరులు గీతంబు లిచ్చిరి సంతసమున. (444) వెండియుం; బ్రతిదివసంబు నాకాశంబు పుష్పంబులు గురియింప మహర్షులు సత్యంబులైన యాశీర్వచనంబులు సలుప సముద్రుండు శంఖంబును, నదంబులు పర్వతంబులు నదులును రథమార్గంబు నొసంగెఁ; దదనంతరంబ సూత మాగధ వంది జనంబులు దన్ను నుతియించినం బ్రతాపశాలి యగు నవ్వైన్యుండు మందస్మిత సుందర వదనారవిందుండై చతుర వచనుం డగుచు మేఘగంభీర భాషణంబుల వారల కిట్లనియె. (445) వందిమాగధ సూతవరులార! నా యందుఁ¯ గమనీయగుణములు గలిగెనేని¯ నర్హంబు నుతిచేయ; నవి లేవు నా యందు¯ నది గాన మీ నుతి వ్యర్థ మయ్యె; ¯ నిటమీఁద గుణముల నేపారి యుండిన¯ నపుడు నుతించెద రగుట మీరు¯ సభ్యనియుక్తులై చతురత నుత్తమ¯ శ్లోకుని గుణము లస్తోకభూప్ర (445.1) సిద్ధములు గాన సన్నుతి చేయుఁ డజుని¯ నతని బహువిధ భావంబు లభినుతింప¯ నలవి గాకయె యండుదు; రదియుఁ గాక; ¯ చతుర మతులార! మాగధ జనములార! (446) మఱియు; మహాత్ముల గుణంబులు దనయందు సంభావితంబులు చేయ సామర్థ్యంబులు గలిగిన నందు మహాత్ముల గుణంబులు ప్రసిద్ధంబులు గావునం దత్సమంబుగా నెట్లు నుతింపవచ్చు? నెవ్వండే నొకండు శాస్త్రాభ్యాసంబునం దనకు విద్యా తపో యోగ గుణంబులు గలుగు నని పలికిన వానిం జూచి సభ్యులు పరిహసింతు; రది కుమతి యగు వాఁ డెఱుంగండు; నదియునుం గాక. (447) అతి విశ్రుతులు సులజ్జా¯ న్వితులు మహోదారు లధిక నిర్మలు లాత్మ¯ స్తుతి పరనిందలు దోషము¯ లతి హేయము లని తలంతు రాత్మల నెపుడున్. (448) వంది జనంబులు లోకము¯ లందు నవిదిత వరకర్ము లగు భూపతులన్¯ నందించు టవశ్యంబై¯ నం దగదు నుతింప శిశుజనంబుల పగిదిన్. (449) అన సూత వంది మాగధ¯ జను లా నరనాయకుని వచనములు వినియున్¯ మునిచోదితులై క్రమ్మఱ¯ ననురాగము లుప్పతిల్ల నమ్మనుజేంద్రున్. (450) అమృతోపమానంబు లయిన మధుర వాక్యంబుల నిట్లనిరి. (451) వేనాంగ సంభవుండవు ¯ శ్రీనాథ కళాంశజుఁడవు చిరతరగుణ స¯ మ్మానార్హుండ వతర్కిత¯ మైన భవన్మహిమఁ బొగడ నలవియె మాకున్. (452) అని వెండియు నిట్లని రై¯ నను నొక మార్గంబు గలదు నందింప భవ¯ ద్ఘన చరితామృతపానం¯ బునఁ జేసియు మునులవచనములఁ జేసి తగన్. (453) శ్లాఘ్యంబులైన భవదీయ చరిత్రంబుల స్తుతియించెదము” అని యిట్లనిరి. (454) ఈ వైన్యుఁ డఖిలలోకావళి ధర్మాను¯ వర్తనముల నెప్డు వఱలఁ జేసి¯ ఘనధర్మమార్గ వర్తనులలో ధన్యుఁడై¯ ధర్మ సేతువుఁ బ్రీతిఁ దగిలి ప్రోచు; ¯ ధర్మ శాత్రవులను దండించు నష్ట ది¯ క్పాలకమూర్తి సంకలితుఁ డగుచు; ¯ నయ్యయి కాలంబులందు భాషణదాన¯ ములఁ బ్రజారంజనములఁ దనర్చు; (454.1) సవన సద్వృష్టి కరణాదిసక్తుఁ డగుట¯ నుభయలోకంబులకుఁ బ్రీతి నొదవఁ జేయు; ¯ న్యాయమార్గంబునను భూజనాళి ధనముఁ¯ బుచ్చుకొను నిచ్చు సూర్యుఁడుఁ బోలె నితఁడు. (455) మఱియును. (456) సర్వభూతములకు సముఁడును బర్యతి¯ క్రమమున లోకాపరాధములను¯ నతిశాంతి సంయుక్తుఁడై సహించుచు నార్తు¯ లగు వారి యెడఁ గృపాయత్తుఁ డగుచు¯ నరరూపధారియౌ హరిమూర్తి గావున¯ నింద్రుండు వర్షించి యెల్ల ప్రజల¯ రక్షించుగతిఁ దాను రక్షించు; నమృతాంశు¯ సన్నిభ వదనాబ్జ సస్మితాను (456.1) రాగ మిళితావలోకన రాజిఁ జేసి¯ సకల జనులకు సంప్రీతి సంభవింపఁ¯ జేయు సంతతమును గూఢచిత్తుఁ డగుచు¯ శత్రువరుల కసాధ్యుఁడై సంచరించు. (457) అని వెండియుఁ; “బ్రవేశ నిర్గమ శూన్యమార్గ నిరూఢ కార్యుండును, నపరిమిత మహత్త్వాది గుణగణైక ధాముండును, సముద్రునిభంగి గంభీర చిత్తుండును, సుగుప్తవిత్తుండును, వరుణుండునుబోలె సంవృతాత్ముండును, శాత్రవాసహ్య ప్రతాప యుక్తుండును, దురాసదుండును, సమీపవర్తియయ్యును దూరస్థునిభంగి వర్తించుచు వేనారణిజనిత హుతాశనుండు గావున హుతాశను చందంబున నన్యదుస్స్పర్శనుండును నై, చారులవలన సకలప్రాణి బాహ్యాభ్యంతర కర్మంబులం దెలియుచు, దేహధారులకు నాత్మభూతుండై సూత్రాత్మకుండైన వాయువు భంగి వర్తించుచు, నాత్మస్తుతి నిందలవలన నుదాసీనుం డగుచు, ధర్మపథంబున వర్తించుచు, నాత్మీయ సుహృద్బంధువుల వలనం దప్పు గలిగినను దండించుచు, నాత్మ శత్రువులనైన నదండ్యుల దండింపక ధర్మమార్గగతుం డగుచుఁ, దన యాజ్ఞాచక్రం బప్రతిహతం బగుచు, మానసాచలపర్యంతంబు వర్తింప సూర్యుండు నిజ కిరణంబులచేత నెంత పర్యంతంబు భూమిం బ్రకాశింపంజేయు నంత పర్యంతంబు నిజగుణంబులచేత లోకంబుల రంజిల్లం జేయు; నదియునుం గాక, ప్రకృతి రంజకంబులైన గుణంబులచేత దృఢవ్రతుండును, సత్య సంధుండును, బ్రహ్మణ్యుండును, సర్వభూతశరణ్యుండును, వృద్ధ సేవకుండును, మానప్రదుండును, దీనవత్సలుండును, బరవనితా మాతృభావనుండును, దన పత్ని నర్ధశరీరంబుగాఁ దలంచువాఁడును, నగుచుం బ్రజల యెడఁ దండ్రి వలెఁ బ్రీతి చేయుచు రక్షించుచుండు; మఱియును. (458) తలపోయ బ్రహ్మవిద్యానిష్ఠ జనముల¯ కనయంబుఁ గింకరుం డైనవాఁడు; ¯ నఖిలశరీరగుఁ డాప్త సుహృజ్జన¯ తానంద కరుఁ డన నలరువాఁడు; ¯ సంసారఘనకర్మ సంగహీనుల యందు¯ సంగసంప్రీతుఁడై జరగువాఁడు; ¯ దుర్మార్గమనుజ సందోహంబునకు నుగ్ర¯ దండధరుం డనఁ దనరువాఁడుఁ; (458.1) బ్రకృతి పురుష కావేశుఁడై పరఁగువాఁడు; ¯ భగవదవతారయుక్తుఁడై నెగడువాఁడు; ¯ నగుచు వర్తించు సమ్మోద మతిశయిల్లఁ¯ జారుతరమూర్తి యీ రాజచక్రవర్తి. (459) మఱియుం; ద్ర్యధీశుండుఁ గూటస్థుండుఁ బరమాత్మయు బ్రహ్మకళా రూపుండు నగువాఁడునునై యుదయించెం; గావున నితని యందు నవిద్యారచితం బైన భేదంబు నిరర్థకం బగు” నని పెద్ద లగువారలు చూతురు; మఱియును. (460) ఉదయాద్రి పర్యంత ముర్వీతలం బేక¯ వీరుఁడై రక్షించి వెలయు నీతఁ¯ డొకనాఁడు విజయ యాత్రోత్సవం బేపార¯ సన్నద్ధుఁడై మణి స్యందనంబు¯ నెక్కి చాపముఁ బూని దిక్కుల సూర్యుని¯ పగిదిని శత్రుభూపాలతమము¯ విరియింతు నని చాల వెలుఁ గొందుచును ధరా¯ చక్ర ప్రదక్షిణశాలి యగుచుఁ (460.1) దిరుగునెడ సర్వ దిక్పాలవర సమేత¯ పార్థివోత్తమ నికర ముపాయనంబు¯ లిచ్చి తనుఁ జక్రపాణిని నెనయు నాది¯ ధరణివిభుఁ డని నుతియించి తలఁతు రెదల. (461) ఈ నృపతి ధరాచక్రము¯ ధేనువుగాఁ జేసి పిదుకు ధృతి నఖిల పదా¯ ర్థానీకము విబుధులు స¯ న్మానింపఁగఁ బ్రజకు జీవనప్రదుఁ డగుచున్. (462) అమరవరేణ్యుఁ బోలి యనయంబు నితండును గోత్ర భేదన¯ త్వమునఁ జెలంగుఁ దా నజగవప్రదరాసన శింజినీ నినా¯ దమున విరోధిభూపతులు దల్లడ మంద నసహ్యసింహ వి¯ క్రమమున సంచరించు” నని కౌతుక మొప్పఁగఁ బల్కి వెండియున్. (463) ఇట్లనిరి. (464) “సకలజగన్నుతుం డితఁడు చారుయశోనిధి యశ్వమేధముల్¯ ప్రకటముగా శతంబు దగఁ బావనమైన సరస్వతీతటీ¯ నికటధరిత్రిఁ జేయుతఱి నేర్పున నంతిమ యాగమందుఁ గొం¯ డొక మఖసాధనాశ్వమును జంభవిరోధి హరించు నుద్ధతిన్. (465) ఒకనాఁడు నిజమందిరోపాంత వనముకుఁ¯ జని యందు సద్గుణశాలి యైన¯ ఘనుని సనత్కుమారునిఁ గాంచి యమ్ముని¯ వరు బ్రహ్మ తనయుఁగా నెఱిఁగి భక్తిఁ¯ బూజించి విజ్ఞానమును బొందు నచ్చట¯ బ్రహ్మవేత్తలు మునిప్రవరు వలన¯ మానిత లబ్ధవిజ్ఞానులై వర్తింతు, ¯ రిమ్మహారాజు మహీతలంబు (465.1) నందు విశ్రుతవిక్రముఁ డగుచు మిగులఁ¯ దన కథావళి భూ ప్రజాతతి నుతింప¯ నక్కడక్కడ వినుచు శౌర్యమున నఖిల¯ దిక్కులను గెల్చి వర్తించు ధీరయశుఁడు. (466) ఇట్లు విపాటిత విరోధిమనశ్శల్యుండు, సురాసుర జేగీయమాన నిజవైభవుండు నై ధరాచక్రంబున కీతండు రాజయ్యెడి"నని యివ్విధంబున స్తోత్రంబు చేసిన వంది మాగధ సూత జనంబులం బృథుచక్రవర్తి పూజించి మఱియుం బ్రాహ్మణ భృత్యామాత్య పురోహిత పౌర జానపద తైలిక తాంబూలిక నియోజ్య ప్రము ఖాశేష జనంబులం దత్త దుచిత క్రియలం బూజించె” నని మైత్రేయుండు చెప్పిన విని విదురుం డిట్లనియె.