పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : చతుర్థ 323 - 390

ధ్రువయక్షుల యుద్ధము

(323) ఘనశౌర్యోన్నతి తోడ సర్వ కకుభాకాశంబు లందుం బ్రతి¯ ధ్వనులోలిన్ నిగుడంగ శంఖము మహోద్యల్లీలఁ బూరింపఁ ద¯ న్నినదంబున్ విని యక్షకాంతలు భయాన్వీతాత్మలై రుగ్ర సా¯ ధనులై యక్షభటుల్ పురిన్ వెడలి రుత్సాహంబు సంధిల్లగన్. (324) ఇట్లు వెడలి యా ధ్రువునిం దాఁకిన. (325) కరము మహారథుండు భుజగర్వ పరాక్రమశాలియున్ ధను¯ ర్ధరుఁడును శూరుఁడౌ ధ్రువుఁడు దన్ను నెదిర్చిన యక్షకోటిఁ జె¯ చ్చరఁ బదుమూఁడువేల నొకచీరికిఁ గైకొన కొక్కపెట్ట భీ¯ కరముగ మూఁడు మూఁడు శితకాండములం దగ గ్రువ్వనేసినన్ (326) వారు లలాటముల్ పగిలి వారక సోలియుఁ దేఱి యమ్మహో¯ దారు పరాక్రమప్రకట ధైర్యముఁ దత్కర లాఘవంబుఁ బ¯ ల్మాఱు నుతించుచుం గుపితమానసులై పదతాడితప్రదు¯ ష్టోరగకోటిఁ బోలెఁ జటులోగ్ర భయంకర రోషమూర్తులై. (327) ఆ రథికోత్తముం దొడరి యందఱు నొక్కటఁ జుట్టుముట్టి పెం¯ పారఁగ బాణషట్కముల నంగములం బగులంగనేసి వి¯ స్ఫార గదా శరక్షురిక పట్టిసతోమర శూలఖడ్గముల్¯ సారథియుక్తుడైన రథిసత్తముపైఁ గురిపించి రేపునన్. (328) అట్లు గురియించిన నతండు. (329) పెంపఱి యుండెను ధారా¯ సంపాతచ్ఛన్నమైన శైలము భంగిన్¯ గుంపులు కొని యాకసమునఁ¯ గంపించుచు నపుడు సిద్ధగణములు వరుసన్. (330) హాహాకారము లెసఁగఁగ¯ "నోహో యీ రీతి ధ్రువపయోరుహహితుఁడు¯ త్సాహము చెడి యిటు దైత్య స¯ మూహార్ణవమందు నేఁడు మునిఁగెనె యకటా!" (331) అని చింతించు సమయంబున. (332) తామాతని గెలిచితి మని¯ యా మనుజాశనులు పలుక నట నీహార¯ స్తోమము సమయించు మహో¯ ద్దా ముండగు సూర్యుఁ బోలి తద్దయుఁ దోఁచెన్. (333) అట్లు దోఁచిన. (334) అరి దుఃఖావహమైన కార్ముకము శౌర్యస్ఫూర్తితోఁ దాల్చి భీ¯ కర బాణావళిఁ బింజపింజఁ గఱవంగా నేసి ఝంఝానిలుం¯ డురు మేఘావళిఁ బాఱఁదోలుగతి నత్యుగ్రాహితక్రూరబం¯ ధుర శస్త్రావళి రూపుమాపె విలసద్దో ర్లీల సంధిల్లఁగన్. (335) మఱి యపు డమ్మహాత్ముఁ డసమానబలుండు మహోగ్రబాణముల్¯ గఱిగఱిఁ దాఁక నేసి భుజగర్వ మెలర్ప విరోధి మర్మముల్¯ పఱియలు చేసి యంగములు భంగమునొందఁగఁజేసె వ్రేల్మిడిన్¯ గిఱికొని పర్వతంబుల నొగిం దెగఁ గొట్టెడు నింద్రు కైవడిన్. (336) అయ్యవసరంబున. (337) అలఘు చరిత్రుఁ డమ్మనుకులాగ్రణిచే వికలాంగు లైనవా¯ రల సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సము¯ జ్జ్వల మణికంకణాంగద లసద్భుజవర్గముచేత సంగర¯ స్థల మతిరమ్యమై తనరె సంచిత వీరమనోహరాకృతిన్. (338) అంత హతశేషులు. (339) వరబలుఁడగు మను మనుమని¯ శరసంఛిన్నాంగు లగుచు సమరవిముఖులై¯ హరిరాజముఁ గని పఱచెడు¯ కరిబృందముఁ బోలెఁ జనిరి కళవళపడుచున్. (340) అప్పుడు రాక్షసమాయలు¯ గప్పిన ధ్రువుఁ డసురవరుల కార్యం బెఱుఁగం¯ జొప్పడక, వారిఁ బొడగన¯ దెప్పర మగుటయును సారథిం గని, యంతన్. (341) “తలపోయఁగ, భువి మాయా¯ వుల కృత్యంబెఱుఁగనెవరువోలుదు” రనుచుం¯ బలుకుచుఁ, దత్పురిఁజొరఁగాఁ¯ దలఁపఁగ, నదిగానరాక తద్దయు మానెన్ (342) అట్లు పురంబున కరుగుట మాని చిత్రరథుండైన యా ధ్రువుండు సప్రయత్నుం డయ్యును బరప్రతియోగశంకితుండై యుండె; నయ్యెడ మహాజలధి ఘోషంబు ననుకరించు శబ్దంబు వినంబడె; నంత సకల దిక్తటంబుల వాయుజనితం బయిన రజః పటలంబు దోఁచె; దత్క్షణంబ యాకాశంబున విస్ఫురత్తటిత్ప్రభా కలిత గర్జారవయుక్త మేఘంబు లమోఘంబులై భయంకరాకారంబులై తోఁచె; నంత. (343) అనయంబున్ ధ్రువుమీఁద దైత్యకృతమాయాజాలమట్లేచి, బో¯ రన మస్తిష్కపురీష మూత్ర పల దుర్గంధాస్థి మేదశ్శరా¯ సన నిస్త్రింశ శరాసి తోమర గదా చక్రత్రిశూలాది సా¯ ధన భూభృద్భుజగావళిం గురిసె నుద్దండక్రియాలోలతన్. (344) మఱియు, మత్తగజ సింహవ్యాఘ్ర సమూహంబులును, నూర్మి భయంకరంబై సర్వతః ప్లవనం బయిన సముద్రంబును గానంబడియె; వెండియుం గల్పాంతంబునందుంబోలె భీషణంబైన మహాహ్రదంబునుం దోఁచె; నవ్విధంబున నానా విధంబులు ననేకంబులు నవిరళ భయంకరంబులు నయిన యసురమాయలు గ్రూర ప్రవర్తునులగు యక్షుల చేత సృజ్యమానంబులై యడరె; నా సమయంబున. (345) అనయంబును నయ్యక్షుల¯ ఘనమాయ నెఱింగి మునినికాయము వరుసన్¯ మనుమనుమని మను మను మని¯ మనమునఁ దలఁచుచును దత్సమక్షంబునకున్. (346) చనుదెంచి యా ధ్రువుం గని యిట్లనిరి. (347) "అనఘాత్మ లోకు లెవ్వని దివ్య నామంబు¯ సమత నాకర్ణించి సంస్మరించి¯ దుస్తరంబైన మృత్యువు నైన సుఖవృత్తిఁ¯ దరియింతు; రట్టి యీశ్వరుఁడు పరుఁడు¯ భగవంతుఁడును శార్ఙ్గపాణియు భక్తజ¯ నార్తిహరుండును నైన విభుఁడు¯ భవదీయ విమతులఁ బరిమార్చుఁగా"కని¯ పలికిన మునుల సంభాషణములు (347.1) విని కృతాచమనుఁడయి మావిభుని పాద¯ కమలముఁ దలంచి రిపుభయంకరమహోగ్ర¯ కలిత నారాయణాస్త్రంబుఁ గార్ముకమునఁ¯ బూనఁ దడవఁ దదీయ సంధానమునను. (348) కడఁగి గుహ్యక మాయాంధకార మపుడు¯ వెరవుచెడి దవ్వుదవ్వుల విరిసిపోయె¯ విమలమైన వివేకోదయమునఁ జేసి¯ సమయు రాగాదికంబుల సరణి నంత. (349) వరనారాయణ దేవతాస్త్ర భవ దుర్వారప్రభాహేమపుం¯ ఖ రుచిస్ఫార మరాళ రాజసిత పక్షక్రూరధారాపత¯ చ్ఛర సాహస్రము లోలి భీషణ విపక్షశ్రేణిపై వ్రాలె భీ¯ కరరావంబునఁ గానఁ జొచ్చు శిఖిసంఘాతంబు చందంబునన్. (350) అట్లేసిన. (351) ఖరనిశితప్రదీప్త ఘన కాండపరంపర వృష్టిచేఁ బొరిం¯ బొరి వికలాంగులై యడరి పుణ్యజనుల్ పృథుహేతిపాణులై¯ గరుడునిఁ జూచి భూరిభుజగప్రకరంబు లెదిర్చి పేర్చి చె¯ చ్చెర నడతెంచు చందమునఁ జిత్రరథున్ బలుపూని తాఁకినన్. (352) వారలఁ జండతీవ్ర శరవర్గము చేత నికృత్తపాద జం¯ ఘోరు శిరోధరాంబక కరోదర కర్ణులఁ జేసి యోగి పం¯ కేరుహమిత్ర మండల సకృద్భిద నెట్టి పదంబుఁ జెందు నా¯ భూరిపదంబునం బెలుచఁ బొందఁగఁ బంపె భుజావిజృంభియై. (353) ఇవ్విధంబున నా చిత్రరథుండగు ధ్రువునిచేత నిహన్యమానులును నిరపరాధులును నయిన గుహ్యకులం జూచి యతని పితామహుండైన స్వాయంభువుండు ఋషిగణ పరివృతుం డై చనుదెంచి ధ్రువునిం జూచి యిట్లనియె “వత్సా నిరపరాధులైన యీ పుణ్యజనుల నెట్టి రోషంబున వధియించితి, వట్టి నిరయహేతువైన రోషంబు చాలు; భ్రాతృవత్సల! భ్రాతృవధాభితప్తుండవై కావించు నీ యత్నం బుడుగుము. (354) అనఘా! మనుకులమున కిది¯ యనుచిత కర్మంబ; యొకనికై పెక్కండ్రి¯ ట్లని మొనఁ ద్రుంగిరి; యిది నీ¯ కనయంబును వలవ; దుడుగు మయ్య! కుమారా! (355) అదియునుం గాక, దేహాభిమానంబునం బశుప్రాయులై భూతహింస గావించుట హృషీకేశానువర్తను లైన సాధువులకుం దగదు; నీవ సర్వభూతంబుల నాత్మభావంబునఁ దలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండును నైన విష్ణుని పదంబులఁ బూజించి తత్పరమపదంబును బొందితి; వట్టి భగవంతుని హృదయంబున ననుధ్యాతుండవు, భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు మఱియు సాధువర్తనుండ వన నొప్పు నీ వీ పాపకర్మం బెట్లు చేయ సమకట్టితి? వే పురుషుండైననేమి మహాత్ముల యందుఁ దితిక్షయు, సముల యందు మైత్రియు, హీనుల యందుఁ గృపయు, నితరంబులగు సమస్త జంతువుల యందు సమత్వంబును గలిగి వర్తించు వానియందు సర్వాత్మకుం డైన భగవంతుడు ప్రసన్నుం డగు; నతండు ప్రసన్నుం డయిన వాఁడు ప్రకృతి గుణంబులం బాసి లింగశరీరభంగంబు గావించి బ్రహ్మానందంబునుం బొందు; నదియునుం గాక, కార్య కారణ సంఘాత రూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్కాంత సన్నిధానంబు గలిగిన లోహంబు చందంబున వర్తించు; నందు సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగాఁ బరిభ్రమించు; నట్టి యీశ్వరుని మాయా గుణ వ్యతికరంబున నారబ్ధంబు లైన పంచభూతంబుల చేత యోషిత్పురుషవ్యవాయంబు వలన యోషిత్పురుషాదిరూప సంభూతి యగు; నివ్విధంబునఁ దత్సర్గంబుఁ దత్సంస్థానంబుఁ దల్లయంబు నగుచు నుండు; నిట్లు దుర్విభావ్యం బైన కాలశక్తిం జేసి గుణక్షోభంబున విభజ్యమాన వీర్యుండు ననంతుండు ననాదియు నై జనంబులచేత జనంబులం బుట్టించుచుండుటం జేసి యాదికరుండును, మృత్యుహేతువున జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును, ననాది యగుటంజేసి యవ్యయుండును నైన భగవంతుండు జగత్కారణుం డగుం; గావున నీ సృష్టి పాలన విలయంబులకుం గర్తగానివాని వడుపున దానిఁ జేయుచుండు; నిట్లు మృత్యరూపుండును బరుండును సమవర్తియు నైన యీశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు; కర్మాధీనంబులైన భూతసంఘంబులు రజంబు మహావాయువు ననుసరించు చాడ్పున నస్వతంత్రంబు లగుచు నతని ననువర్తించు; నీశ్వరుండును జంతుచయాయు రుపచయాపచయ కరణంబులం దస్పృష్టుండును నగు జీవుండు గర్మబద్ధుం డగుటంజేసి కర్మంబ వానికి నాయురుపచయాపచయంబులం జేయుచుండు; మఱియు సర్వజగత్కర్మసాక్షి యగు సర్వేశ్వరుని. (356) కొందఱు స్వభావ మందురు, ¯ కొందఱు కర్మం బటండ్రు, కొందఱు కాలం¯ బందురు, కొందఱు దైవం¯ బందురు, కొంద ఱొగిఁ గామ మండ్రు మహాత్మా! (357) ఇట్టు లవ్యక్తరూపుండును, నప్రమేయుండును, నానాశక్త్యుదయ హేతుభూతుండును నైన భగవంతుండు చేయు కార్యంబులు బ్రహ్మరుద్రాదు లెఱుంగ రఁన నతని తత్త్వంబు నెవ్వ రెఱుంగ నోపుదురది గావునఁ బుత్రా! యిట్లుత్పత్తి స్థితి లయంబులకు దైవంబు కారణం బై యుండ నీ ధనదానుచరులు భవదీయ భాతృహంత లగుదురే? భూతాత్మకుండు, భూతేశుండు, భూతభావనుండు, సర్వేశ్వరుండుఁ, బరాపరుండు నగు నీశుండ మాయాయుక్తుండై స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులం జేయు; నైన ననహంకారంబునం జేసి గుణకర్మంబులచే నస్పృశ్యుం డగుచు వర్తించు; నదియునుం గాక, యీ ప్రజాపతులు విశ్వసృణ్ణామంబుల నియంత్రితు లై ముకుద్రాళ్ళు పెట్టిన పశువులుం బోలె నెవ్వని యాజ్ఞాధీనకృత్యులై వర్తింతు రట్టి దుష్టజన మృత్యువును, సుజనామృత స్వరూపుండును, సర్వాత్మకుండును, జగత్పరాయణుండును నైన యీశ్వరుని సర్వప్రకారంబుల శరణంబుఁ బొందు; మదియునుం గాక. (358) అనఘాత్మ! నీవు పంచాబ్ద వయస్కుండ¯ వై పినతల్లి నిన్నాడినట్టి¯ మాటల నిర్భిన్నమర్ముండ వగుచును¯ జనయిత్రి దిగనాడి వనము కేగి¯ తప మాచరించి యచ్చపు భక్తి నీశ్వరుఁ¯ బూజించి మహితవిభూతి మెఱసి¯ రమణఁ ద్రిలోకోత్తరంబైన పదమును¯ బొందితి, వది గాన భూరిభేద (358.1) రూప మైన ప్రపంచంబు రూఢి నే మ¯ హాత్మునందుఁ బ్రతీతమై యలరు నట్టి¯ యగుణుఁ డద్వితీయుండును నక్షరుండు¯ నైన యీశ్వరుఁ బరమాత్ము ననుదినంబు. (359) కైకొని శుద్ధంబు గతమత్సరంబును¯ నమలంబు నగు హృదయంబునందు¯ సొలయ కన్వేషించుచును బ్రత్యగాత్ముండు¯ భగవంతుఁడును బరబ్రహ్మమయుఁడు¯ నానందమాత్రుండు నవ్యయుఁ డుపపన్న¯ సకలశక్తియుతుండు సగుణుఁడజుఁడు¯ నయిన సర్వేశ్వరునం దుత్తమంబైన¯ సద్భక్తిఁ జేయుచు సమత నొప్పి (359.1) రూఢి సోహమ్మమేతి ప్రరూఢ మగుచు¯ ఘనత కెక్కు నవిద్యయన్ గ్రంథి నీవు ¯ ద్రెంచివైచితి; కావున ధీవరేణ్య! ¯ సర్వశుభహాని యైన రోషంబు వలదు. (360) విను రోషహృదయు చేతను¯ ననయము లోకము నశించు; నౌషధములచే¯ ఘనరోగములు నశించిన¯ యనువున; నది గాన రోష మడఁపు; మహాత్మా! (361) అనఘ! నీదు సహోదరహంత లనుచుఁ¯ బెనఁచి యీ పుణ్యజనులఁ జంపితి కడంగి¯ పరఁగ నిదియె సదాశివ భ్రాత యైన¯ యర్థవిభునకు నపరాధ మయ్యెఁ గాన. (362) నతి నుతులచేత నీ విపు¯ డతనిఁ బ్రసన్నునిఁగఁ జేయు మని మనువు దయా¯ మతిఁ జెప్పి ధ్రువునిచే స¯ త్కృతుఁడై నయ మొప్పఁ జనియె ఋషియుక్తుండై. (363) అంత. (364) యక్షచారణసిద్ధ విద్యాధరాది¯ జనగణస్తూయమానుఁడై ధనదుఁ డంతఁ¯ బుణ్యజన వైశస నివృత్తు భూరిరోష¯ రహితుఁ డైనట్టి ధ్రువునిఁ జేరంగ వచ్చె (365) చనుదెంచి వెసఁ గృతాంజలి యైన ధ్రువుఁ జూచి¯ తివుట నిట్లనియె క్షత్రియకుమార! ¯ తగ భవదీయ పితామహాదేశంబు¯ నను దుస్త్యజంబైన ఘనవిరోధ¯ ముడిగితి! వటు గాన నొనరంగ నిపుడు నీ¯ యందుఁ బ్రసన్నుండనైతి, భూత¯ జనన లయంబుల కనయంబుఁ గాలంబె¯ కర్త యై వర్తించుఁగాన యుష్మ (365.1) దనుజుఁ జంపినవార లీ యక్షవరులు¯ గారు! తలపోయ నీ యక్షగణము నిట్లు¯ నెఱి వధించిన వాఁడవు నీవు గావు¯ వినుతగుణశీల! మాటలు వేయునేల! (366) అదియునుం గాక, యే బుద్ధింజేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహాత్మానుసంధానంబునం జేసి సంభవించు, నట్టి యహంత్వమ్మను నపార్థజ్ఞానంబు స్వప్నమందుంబోలెఁ బురుషునకుం దోఁచు; నదిగావున సర్వభూతాత్మవిగ్రహుండును, నధోక్షజుండును, భవచ్ఛేదకుండును, భజనీయ పాదారవిందుండును, ననంతామేయశక్తి యుక్తుండును, గుణమయి యగు నాత్మమాయచే విరహితుండును నైన యీశ్వరుని సేవింపుము; నీకు భద్రం బయ్యెడు; భవదీయ మనోగతం బైన వరంబుఁ గోరుము; నీ వంబుజనాభ పాదారవింద సేవనంబుఁ దిరంబుగఁ జేయుదు వని యెఱుంగుదు” నని రాజరాజుచేత నట్లు మహామతియు, భాగవతోత్తముండునైన ధ్రువుండు ప్రేరేపింపంబడి “యే హరిస్మరణంబు చేత నప్రయత్నంబున దురత్యయంబైన యజ్ఞానంబుఁ దరియింతు రట్టి హరిస్మరణం బచలితం బగునట్లొసంగు” మని యడగిన “నట్లగాక” యని యంగీకరించి యంతం గుబేరుండు సంప్రీత చిత్తుండయి, ధ్రువునికి శ్రీహరిస్మరణం బట్ల యనుగ్రహించి యంతర్థానంబు నొందె; నంత ధ్రువుండు యక్ష కిన్నర కింపురషగణ సంస్తూయమాన వైభవుం డగుచు నాత్మీయ పురంబునకు మరలి చనుదెంచి. (367) గణుతింప భూరిదక్షిణల చేఁ గడునొప్పు¯ యజ్ఞముల్ చేయ నయ్యజ్ఞ విభుఁడు ¯ ద్రవ్యక్రియా దేవతాఫల రూప స¯ త్కర్మఫలప్రదాత యయి యొప్పు¯ పురుషోత్తముని నర్థిఁ బూజించి మఱియు స¯ ర్వోపాధివర్జితుఁ డుత్తముండు¯ సర్వాత్మకుఁడు నగు జలజాక్షునందుఁ దీ¯ వ్రంబై ప్రవాహరూపంబు నైన (367.1) భక్తి సలుపుచు నఖిల ప్రపంచమందు¯ నలరఁ దనయందు నున్న మహాత్ము హరినిఁ¯ జిదచిదానందమయుని లక్ష్మివరుఁ బరము¯ నీశ్వరేశ్వరుఁ బొడఁ గనె నిద్ధచరిత!

ధ్రువక్షితిని నిలుచుట

(368) ఇట్లు సుశీలసంపన్నుండును, బ్రహ్మణ్యుండును, ధర్మసేతురక్షకుండును, దీనవత్సలుండు నయి యవని పాలించు ధ్రువుండు దన్నుఁ బ్రజలు దండ్రి యని తలంప నిరువదియాఱువే లేండ్లు భోగంబుల చేతం బుణ్యక్షయంబును, నభోగంబులైన యాగాదులచేత నశుభ క్షయంబునుం జేయుచు బహుకాలంబు దనుకఁ ద్రివర్గ సాధనంబుగా రాజ్యంబుచేసి కొడుకునకుఁ బట్టంబుగట్టి యచలితేంద్రియుండై యవిద్యారచిత స్వప్నగంధర్వ నగరోపమం బయిన దేహాదికం బగు విశ్వంబు భగవన్మాయారచితం బని, యాత్మం దలంచుచు వెండియు. (369) మను నిభుఁ డంత భృత్యజన మంత్రి పురోహిత బంధు మిత్ర నం¯ దన పశు విత్త రత్న వనితా గృహ రమ్యవిహార శైల వా¯ రినిధి పరీత భూతల హరిద్విప ముఖ్య పదార్థ జాలముల్¯ ఘనమతిచే ననిత్యములుగాఁ దలపోసి విరక్తచిత్తుఁడై. (370) పురము వెల్వడి చని పుణ్యభూ బదరికా¯ ఘన విశాలానదీకలిత మంగ¯ ళాంబుపూరంబుల ననురక్తిమైఁ గ్రుంకి¯ కమనీయ పరిశుద్ధ కరణుఁ డగుచుఁ¯ బద్మాసనస్థుఁడై పవనుని బంధించి¯ నెలకొని ముకుళితనేత్రుఁ డగుచు¯ హరిరూపవైభవ ధ్యానంబు చేయుచు¯ భగవంతు నచ్యుతుఁ బద్మనేత్రు (370.1) నందు సతతంబు నిశ్చలమైన యట్టి¯ భక్తిఁ బ్రవహింపఁ జేయుచుఁ బరమమోద¯ బాష్పధారాభిషిక్తుండు భవ్యయశుఁడుఁ¯ బులకితాంగుండు నగుచు నిమ్ములఁ దనర్చి. (371) మఱియు; విగత క్లేశుండును, ముక్తలింగుండునునై, ధ్రువుండు తన్నుఁదా మఱచి యుండు సమయంబున దశదిక్కుల నుద్యద్రాకానిశానాయకుండునుం బోలె వెలింగించుచు నాకాశంబున నుండి యొక్క విమానంబు చనుదేర నందు దేవశ్రేష్ఠులును, జతుర్భుజులును, రక్తాంబుజేక్షణులును, శ్యామవర్ణులును, గదాధరులును, సువాసులును, గిరీటహారాంగదకుండలధరులును, కౌమారవయస్కులును, నుత్తమశ్లోక కింకరులు నయిన వారల నిద్దఱం గని; సంభ్రమంబున లేచి మధుసూదను నామంబులు సంస్మరించుచు వారల భగవత్కింకరులంగాఁ దలంచి దండప్రణామంబు లాచరించినం గృష్ణపాదారవింద విన్యస్తచిత్తుండుఁ, గృతాంజలియు, వినమితకంధరుండు నైన ధ్రువునిం గనుంగొని పుష్కరనాభభక్తు లైన సునందనందులు ప్రీతియుక్తులై మందస్మితు లగుచు నిట్లనిరి. (372) "ఓ నృప! నీకు భద్ర మగు; నొప్పగుచున్న మదీయవాక్యముల్¯ వీనులయందుఁ జొన్పుము; వివేకముతో నయిదేండ్లనాఁడు మే¯ ధానిధివై యొనర్చిన యుదాత్త తపోవ్రతనిష్ఠచేతఁ దే¯ జోనయశాలి యైన మధుసూదనుఁ దృప్తి వహింపఁ జేయవే! (373) అట్టి శార్ఙ్గపాణి యఖిల జగద్భర్త¯ దేవదేవుఁ డతుల దివ్యమూర్తి¯ మమ్ముఁ బనుప మేము మాధవపదమున¯ కర్థి నిన్నుఁ గొనుచు నరుగుటకును. (374) వచ్చితిమి; ఏ పదంబు నేని సూరిజనంబులు సర్వోత్తమం బని పొందుదురు; దేనిఁ జంద్ర దివాకర గ్రహ నక్షత్ర తారాగణంబులు ప్రదక్షిణంబుగాఁ దిరుగుచుండు; మఱియు నీదు పితరులచేతను నన్యులచేతను ననధిష్ఠితంబును, జగద్వంద్యంబును, నభక్తజనాతిదుర్జయంబును నయిన విష్ణుపదంబుం బొందుదువు రమ్మిదె విమానశ్రేష్ఠం; బుత్తమశ్లోకజన మౌళిమణియైన శ్రీహరి పుత్తెంచె; దీని నెక్క నర్హుండ"వనిన నురుక్రమ ప్రియుం డయిన ధ్రువుండు తన్మధుర వాక్యంబులు విని కృతాభిషేకుం డయి యచ్చటి మునులకుఁ బ్రణమిల్లి తదాశీర్వాదంబులు గైకొని, విమానంబునకుం బ్రదక్షిణార్చనంబులు గావించి హరిపార్షదులైన సునందనందులకు వందనం బాచరించి భగవద్రూపవిన్యస్త చక్షురంతః కరణాదికుం డగుచు విమానాధిరోహణంబు గావించుటకు హిరణ్మయ రూపంబు ధరియించె; నప్పుడు. (375) సురదుందుభి పణ వానక¯ మురజాదులు మొరసె; విరుల ముసురు గురిసె; గి¯ న్నెర గంధర్వుల పాటలు¯ భరితములై చెలఁగె నపుడు భవ్యచరిత్రా! (376) అట్టి సమయంబున ధ్రువుండు దుర్గమంబగు త్రివిష్టపంబునకు నేగువాఁ డగుచు "దీన యగు జననిం దిగనాడి యెట్లు వోవుదు?"నని చింతించు వానిం బార్షదు లవలోకించి యగ్రభాగంబున విమానారూఢ యై యేగుచున్న జననిం జూపిన సంతుష్టాంతరంగుం డగుచు. (377) జనని సునీతిని మును కనుఁ¯ గొని యవల విమాన మెక్కి గొనకొని విబుధుల్¯ దనమీఁదఁ బుష్పవర్షము¯ లనయముఁ గురియింప ధ్రువుఁడు హర్షముతోడన్. (378) చనిచని వెస గ్రహమండల¯ మును ద్రైలోక్యంబు సప్తమునిమండలమున్¯ ఘనుఁ డుత్తరించి యవ్వలఁ¯ దనరెడు హరిపదము నొందెఁ దద్దయుఁ బ్రీతిన్. (379) అది మఱియు నిజకాంతిచేతం ద్రిలోకంబులం బ్రకాశింపంజేయుచు నిర్దయాగమ్యంబును శాంతులు సమదర్శనులు శుద్దులు సర్వ భూతానురంజనులు నచ్యుతభక్తబాంధవులు నయిన భద్రాచారులకు సుగమ్యంబును నయి గంభీరవేగంబు ననిమిషంబు నగు జ్యోతిశ్చక్రంబు సమాహితంబై గోగణంబు మేధి యందుం బోలె నెందుఁ బరిభ్రమించుచుండు నట్టి యచ్యుతపదంబునుం బొంది, విష్ణుపరాయణుండైన ధ్రువుండు త్రిలోకచూడామణియై యొప్పుచుండె; నప్పుడు భగవంతుండైన నారదుండు ధ్రువుని మహిమం గనుంగొని ప్రచేతస్సత్త్రంబునందు వీణ వాయించుచు. (380) "పతియె దైవంబుగా భావంబులోపలఁ¯ దలఁచు సునీతినందను తపః ప్ర¯ భావము క్రియ ధర్మభవ్య నిష్ఠలఁ బొందఁ¯ జాలరు బ్రహ్మర్షి జనము లనిన ¯ క్షత్రియకులు నెన్నఁగా నేల? యెవ్వఁడు¯ పంచసంవత్సర ప్రాయమునను¯ సురుచి దురుక్త్యుగ్ర శరభిన్న హృదయుఁడై¯ మద్వాక్యహిత బోధమతిఁ దనర్చి (380.1) వనమునకు నేగి హరిభక్తి వశత నొంది¯ యజితుఁ డగు హరిఁ తన వశుఁడై చరింపఁ¯ జేసి వెసఁ దత్పదంబును జెందె, నట్టి¯ హరిపదంబును బొంద నెవ్వరికిఁ దరము?" (381) అని పాడె"ననుచు విదురున¯ కనఘుఁడు మైత్రేయుఁ డనియె నంచిత భక్తిన్¯ వినుతోద్దామయశస్కుం¯ డనఁగల యా ధ్రువుని చరిత మార్యస్తుత్యా! (382) మహితసత్పురుష సమ్మతమును ధన్యంబు¯ స్వర్గప్రదంబు యశస్కరంబు¯ నాయుష్కరంబుఁ బుణ్యప్రదాయకమును¯ మంగళకర మఘమర్షణంబు¯ సౌమనస్యముఁ బ్రశంసాయోగ్యమును బాప¯ హరమును ధ్రువపదప్రాపకంబు¯ నై యొప్పు నీ యుపాఖ్యానంబుఁ దగ నీకు¯ నెఱిఁగించితిని; దీని నెవ్వఁడేని (382.1) తివుట శ్రద్ధాగరిష్ఠుఁడై తీర్థపాద¯ చరణ సరసీరుహద్వయాశ్రయుఁడు నైన¯ భవ్యచరితు దినాంత ప్రభాతవేళ¯ లను సినీవాలి పూర్ణిమ లందు మఱియు. (383) ద్వాదశినిఁ బద్మ బాంధవ వాసరమున ¯ శ్రవణ నక్షత్రమున దినక్షయమునందుఁ¯ బరఁగ సంక్రమణవ్యతీపాత లందు¯ సభల భక్తిని వినునట్టి సజ్జనులకు. (384) క్లేశనాశనంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాది గుణంబులును గలుగు; మఱియుఁ దేజఃకామునకుఁ దేజంబును, మనః కామునకు మనంబును, నిష్కామునకుఁ దత్త్వవిజ్ఞానంబును గలుగు; దీని వినిపించువారికి దేవతానుగ్రహంబు గలుగు: నిట్టి యుపాఖ్యానంబు నీ కెఱింగించింతి” నని మైత్రేయుండు విదురునకుఁ జెప్పిన క్రమంబున శుకయోగి పరీక్షితున కెఱింగించిన తెఱంగున సూతుండు శౌనకాదులకు వినిపించి వెండియు నిట్లనియె "నట్లు చెప్పిన మైత్రేయునిం గని విదురుం డిట్లనియె. (385) "అనఘాత్మ! నారదమునిపతి ధ్రువ చరి¯ త్రము ప్రచేతసుల సత్త్రంబునందు¯ నర్థిమై గీర్తించె నంటి; ప్రచేతసు¯ లన నెవ్వ? రెవ్వరి తనయు? లెట్టి¯ వంశజుల్? సత్త్ర మె వ్వల నను జేసి? ర¯ ధ్వరమందు నిజకుల ధర్మశీలు¯ రగు ప్రచేతసులచే యజియింపఁగాఁ బడె¯ యజ్ఞపూరుషుఁ డెట్టు లచ్యుతాంఘ్రి (385.1) భక్తియుక్తుఁడు విదిత సద్భాగవతుఁడు¯ దివిరి హరిపాదసేవా విధిప్రయుక్త¯ దేవదర్శనుఁ డగు నట్టి దివ్యయోగి¯ నారదుం డెట్లు గొనియాడె శౌరికథలు? (386) నా కిపు డెఱిఁగింపుము సు¯ శ్లోకుని చరితామృతంబు శ్రోత్రాంజలులం¯ బైకొని జుఱ్ఱియుఁ దనివిం¯ గైకొనకున్నది మనంబు గరుణోపేతా!" (387) అని యడిగిన విదురునిఁ గనుఁ¯ గొని మైత్రేయుండు పలికె "గొనకొని ధ్రువుఁడున్¯ వనమునకుఁ జనిన నాతని¯ తనయుం డగు నుత్కళుండు దళితాఘుండై. (388) చతురుఁ డాజన్మ ప్రశాంతుండు నిస్సంగుఁ¯ డును సమదర్శనుండును ఘనుండు¯ నై యాత్మయందు లోకావళి, లోకంబు¯ లందు నాత్మను జూచు చనఘమైన¯ యనుపమయోగక్రియా పావకాదగ్ధ¯ కర్మ మలాశయ కలనఁ బేర్చి¯ జడుని కైవడిఁ జీఁకు చందంబునను మూఢు¯ పగిది నున్మత్తుని భంగిఁ జెవిటి (388.1) వడువునను గానఁబడుచు సర్వజ్ఞుఁడై ప్ర¯ శాంతకీల హుతాశను సరణిఁ బొల్చి¯ సతత శాంతంబు నంచిత జ్ఞానమయము¯ నైన బ్రహ్మస్వరూపంబు నాత్మఁ దలఁచి. (389) తనకంటె నితర మొక టెఱుఁ¯ గని కతమున సార్వభౌమకశ్రీఁ బొందన్¯ మనమునఁ గోరక యుండుటఁ¯ గని కులవృద్ధులును మంత్రిగణములు నంతన్. (390) అతని నున్మత్తునింగాఁ దెలసి తదనుజుం డైన వత్సరునికిఁ బట్టంబు గట్టిరి; ఆ వత్సరునికి సర్వర్థి యను భార్య యందుఁ బుష్పార్ణుండును, జంద్రకేతుండును, నిషుండును, నూర్జుండును, వసువును, జయుండును నన నార్వురు తనయులు గలిగిరి; అందుఁ బుష్పార్ణుం డనువానికిఁ బ్రభయు దోషయు నను నిద్దఱు భార్య లైరి; అందుఁ బ్రభ యనుదానికిం బ్రాతర్మధ్యందిన సాయంబు లను సుతత్రయంబును, దోష యను దానికిం బ్రదోష నిశీథ వ్యుష్టు లనువారు ముగ్గురును బుట్టిరి; అందు వ్యుష్టుం డనువానికిఁ బుష్కరిణి యను పత్ని యందు సర్వతేజుం డను సుతుండు పుట్టె; వానికి నాకూతి యను మహిషి వలనఁ జక్షుస్సంజ్ఞుం డయిన మనువు జనియించె; వానికి నడ్వల యను భార్య యందుఁ బురువును, గుత్సుండును, ద్రితుండును, ద్యుమ్నుండును, సత్యవంతుండును, ఋతుండును, వ్రతుండును, నగ్నిష్ఠోముండును, నతిరాత్రుండును, సుద్యుమ్నుండును, శిబియును, నుల్ముకుండును నను పన్నిద్ధఱు తనయులు గలిగిరి; అందు నుల్ముకునికిఁ బుష్కరిణి యనుదాని వలన నంగుండును, సుమనసుండును, ఖ్యాతియుఁ, గ్రతువును, నంగిరసుండును, గయుండును నను నార్వురు గొడుకులు పుట్టిరి; అందు నంగునికి సునీథ యను ధర్మపత్నివలన వేనుం డను పుత్రుం డుదయించిన.