పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 271 - 348

బ్రహ్మ జన్మ ప్రకారము

(271) ఇట్లు భగవత్ప్రోక్తంబును, ఋషిసంప్రదాయానుగతంబునుఁ, బురుషోత్తమ స్తోత్రంబునుఁ, బరమపవిత్రంబును, భవలతాలవిత్రంబును నయిన భాగవతకథాప్రపంచంబు శ్రద్ధాళుండవు భక్తుండవు నగు నీకు నుపన్యసించెద; వినుము. (272) అనఘ! యేకోదకమై యున్నవేళ నం¯ తర్నిరుద్ధానల దారు వితతి¯ భాతిఁ జిచ్ఛక్తి సమేతుఁడై కపట ని¯ ద్రాలోలుఁ డగుచు నిమీలితాక్షుఁ¯ డైన నారాయణుం డంబు మధ్యమున భా¯ సుర సుధాఫేన పాండుర శరీర¯ రుచులు సహస్ర శిరోరత్నరుచులతోఁ¯ జెలమిసేయఁగ నొప్పు శేషభోగ (272.1) తల్పమునఁ బవ్వళించి యనల్ప తత్త్వ¯ దీప్తిఁ జెన్నొందఁగా నద్వితీయుఁ డగుచు¯ నభిరతుం డయ్యుఁ గోర్కుల యందుఁ బాసి ¯ ప్రవిమలాకృతి నానందభరితుఁ డగుచు. (273) యోగమాయా విదూరుఁడై యుగ సహస్ర¯ కాలపర్యంత మఖిల లోకములు మ్రింగి¯ పేర్చి మఱి కాలశక్త్యుపబృంహితమున¯ సమత సృష్టిక్రియాకలాపములఁ దగిలి. (274) తన జఠరములోపలఁ దాఁ¯ చిన లోకనికాయముల సృజించుటకును సా¯ ధన మగు సూక్ష్మార్థము మన¯ సునఁ గని కాలానుగత రజోగుణ మంతన్. (275) పుట్టించెఁ దద్గుణంబునఁ బరమేశ్వరు¯ నాభిదేశము నందు నళిననాళ¯ ముదయించె మఱి య ప్పయోరుహముకుళంబు¯ గర్మబోధితమైన కాల మందుఁ¯ దన తేజమునఁ బ్రవృద్ధంబైన జలముచే¯ జలజాప్తుగతిఁ బ్రకాశంబు నొందఁ¯ జేసి లోకాశ్రయస్థితి సర్వగుణవిభా¯ సితగతి నొప్పు రాజీవ మందు (275.1) నిజ కళాకలితాంశంబు నిలిపి దాని¯ వలన నామ్నాయమయుఁడును వరగుణుండు¯ నాత్మయోనియు నైన తోయజభవుండు¯ సరవిఁ జతురాననుండునా జనన మయ్యె. (276) అతఁడు దత్పద్మకర్ణిక యందు నిలిచి¯ వికచలోచనుడై లోకవితతి దిశలు¯ నంబరంబును నిజ చతురాననములఁ¯ గలయఁ బరికించి చూచుచుఁ గమలభవుఁడు. (277) అలఘు యుగాంతకాలపవనాహత సంచల దూర్మిజాల సం¯ కలిత జలప్రభూత మగు కంజముఁ దద్వనజాత కర్ణికా¯ తలమున నున్న తన్ను విశదక్రియఁ గల్గిన లోకతత్త్వమున్¯ నలిఁ దెలియంగనోపక మనంబునఁ జాల విచార మొందుచున్. (278) ఇట్లని వితర్కించె. (279) "ఈ జలమందు నీ కమల మేగతి నుద్భవ మయ్యె నొంటి యే¯ నీ జలజాతపీఠమున నేగతి నుంటి మదాఖ్య మెద్ది నా¯ కీ జననంబు నొందుటకు నెయ్యది హేతువు బుద్ధిఁ జూడ నే¯ యోజ నెఱుంగలే"నని పయోరుహగర్భుఁడు విస్మితాత్ముడై. (280) ఆ వనజనాళమూలం¯ బా వనములలోన నర్థిఁ నరయుటకొఱకై¯ యావనజాతప్రభవుం¯ డా వనరుహనాళవివర మందభిముఖుఁడై. (281) అతి గంభీర విశాలవారినిధి తోయాంతర్నిమగ్నాంగుఁడై¯ చతురాస్యుం డొగి దివ్యవత్సర సహస్రం బబ్జమూలంబు స¯ న్మతి నీక్షించియుఁ గానలేక భగవన్మాయామహత్త్వంబు వి¯ స్మృతి గావింప విభీతుఁ డై మరలఁ జేరెం దత్సరోజాతమున్.

బ్రహ్మకు హరి ప్రత్యక్ష మగుట

(282) అట్లు గ్రమ్మఱఁ జేరి యయ్యబ్జపీఠ¯ మందు నష్టాంగయోగక్రియానురక్తిఁ¯ బవను బంధించి మహిత తపస్సమాధి¯ నుండి శతవర్షములు సనుచుండ నంత. (283) అట్టి యోగజనిత మైన విజ్ఞానంబు¯ గలిగి యుండి దానఁ గమలనయనుఁ¯ గానలేక హృదయకమలకర్ణిక యందు¯ నున్నవానిఁ దన్నుఁ గన్నవాని. (284) కనియెన్ నిశ్చలభక్తియోగ మహిమం గంజాతగర్భుండు శో¯ భనచారిత్రు జగత్పవిత్రు విలసత్పద్మాకళత్రున్ సుధా¯ శనముఖ్యస్తుతిపాత్రు దానవచమూజైత్రున్ దళత్పద్మనే¯ త్రు నవీనోజ్జ్వలనీలమేఘనిభగాత్రుం బక్షిరాట్పత్రునిన్. (285) మఱియును. (286) అలఘు ఫణాతపత్రనిచయాగ్ర సమంచిత నూత్నరత్న ని¯ ర్మలరుచిచే యుగాంత తిమిరంబు నడంచి యకల్మషోల్లస¯ జ్జలములఁ జేసి యందు నవసారసనాళసితైకభోగముం¯ గలిగిన శేషతల్పమునుఁ గైకొని యున్న మహాత్ము నొక్కనిన్. (287) వర పీతకౌశేయపరిధానకాంతి సం¯ ధ్యాంబుదరుచి నిచయంబుగాఁగఁ¯ గమనీయ నవహేమకలిత కిరీటంబు¯ రమణఁ గాంచనశిఖరంబుగాఁగ¯ మానిత మౌక్తికమాలికారుచి సాను¯ పతిత నిర్ఝర పరంపరలుగాఁగఁ¯ జెలువొందు నవతులసీదామకములు లా¯ లిత తటజౌషధీ లతలుగాఁగ (287.1) వర భుజంబులు నికటస్థ వంశములుగఁ¯ బదము లంగణపాదప ప్రచయములుగ¯ లలితగతి నొప్పు మరకతాచల విడంబి¯ తాత్మదేహంబు గలుగు మహాత్ము; హరిని. (288) మఱియు, నప్పరిచ్ఛిన్నంబును, నిరుపమానంబును, నిఖిలలోక సంగ్రహంబును, నతి విస్తార వర్తులాయామంబును నై వివిధ విచిత్ర దివ్య మణిభూషణంబుల నాత్మీయ నిర్మలద్యుతిచేతం బ్రకాశంబు నొందం జేయు దివ్యదేహంబు దనర; వివిధంబు లగు కామంబు లభిలషించి విశుద్ధం బైన వేదోక్తమార్గంబున భజియించు పురుషశ్రేష్ఠులకుఁ గామధేను వనం దగిన పాదపద్మయుగంబును, నలికఫలక లలితరుచి నిచయంబులకు నోటువడి కృపాపాత్రుండై చంద్రుండు బహురూపంబులఁ బదసరోజంబుల నాశ్రయించె నన నొప్పు పదనఖంబులును, కమలా భూకాంతలకు నుపధాన రూపంబు లనందగి నీలకదళీకా స్తంభంబుల డంబు విడంబించు నూరుయుగళంబును, కనకమణిమయ మేఖలాకలా పాభిరామంబుఁ గదంబ కింజల్క శోభిత పీతాంబ రాలంకృతంబునై విలసిల్లు కటిమండలంబును, శృంగారవాహినీ జలావర్తంబునాఁ బొలుపొందు నాభీవివరంబును, జఠరస్థ నిఖిల బ్రహ్మాండ ముహుర్ముహుఁరుద్భవ కృశీభూతం బనందగు మధ్య భాగంబును, మహిత ముక్తాఫలమాలికా విరచిత రంగవల్లీ విరాజితంబు నవతులసీదామ కిసలయ తల్పంబుఁ గుసుమమాలికాలంకృతంబు ఘనసార కస్తురికా చందన విలిప్తంబుఁ కౌస్తుభరత్నదీప్తి ప్రదీప్తంబు శ్రీవత్సలక్షణ లక్షితంబు నై యిందిరారమణికిఁ గేళీమందిరం బనం బొల్చు వక్షస్థలంబును, సుఖకేళీ సమారంభ పరిరంభ ణాంభోధిరాట్కన్యకా కరాంబుజ కీలిత కనకమణికంకణ నికషంబుల బొలుపారు రేఖాత్రయ విరాజమానం బైన కంధరంబును, సుమహితానర్ఘ దివ్యమణి ప్రభా విభాసిత కేయూర కంకణ ముద్రికాలంకృతంబు లయిన బాహువులును, సకల లోకార్తి నివారక దరహాసచంద్రికా ధవళితంబు లైన కర్ణకుండలమండన మణి మరీచులు నర్తనంబులు సలుంపం దనరి నిద్ధంబు లగు చెక్కుటద్దంబులును, పరిపక్వ బింబఫల ప్రవాళ పల్లవారుణాధరంబును, యఖిల భువన పరిపాలనంబునకు నేన చాలుదు నని నినదించు నయనయుగళంబునకు సీమాస్తంభంబుఁ జంపకప్రసూన రుచి విలసంబు నగు నాసాదండంబును, కమలకుముదంబులకుం బెంపు సంపాదించుచుఁ గరుణామృత తరంగింతాపాంగంబు లై కర్ణాంతవిశ్రాంతంబు లై చెలువొందు నేత్రంబులును, సలలిత శ్రీకారంబునకు నక్షరత్వంబు సార్థకం బయ్యె ననం దగు కర్ణంబులును, నిక్షుచాప చాప ద్వయంబునాఁ జూపట్టు భ్రూయుగళంబును, నపరపక్షాష్టమీ శశాంక శంకాస్పద ఫాలఫలకంబును, నీలగిరీంద్రశృంగ సంగత బాలమార్తాండ మండల విడంబిత పద్మరాగమణిఖచిత కాంచనకిరీటంబునం బొలుపారి సూర్యేందు పవనానల ప్రకాశంబులకు నవకాశంబు సూపక త్రిలోక వ్యాపక సమర్థంబు లగు తేజోవిశేషంబులఁ జెలువొంది సంగర రంగంబుల దానవానీకంబుల హరింపం జాలు సుదర్శనాది దివ్యసాధనంబులచే దురాసదం బగు దివ్యరూపంబును గలిగి; మఱియును. (289) హారకలాప పుష్పనిచయంబులఁ జంచ దనర్ఘరత్నకే¯ యూర కరాంగళీయక మహోజ్జ్వల బాహు సహస్రశాఖ లొ¯ ప్పారఁగఁ జూడ నొప్పి భువనాత్మక లీల నదృష్టమూల వి¯ స్ఫారిత భోగివేష్టిత విభాసిత చందనభూరుహాకృతిన్. (290) విలసత్కుండలిరాజ సఖ్యమున నుర్వీభృత్సమాఖ్యన్ సము¯ జ్జ్వలితోదార శిరోవిభూషణ సహస్రస్వర్ణకూటంబులన్¯ సలిలావాసతఁ జారు కౌస్తుభవిరాజద్రత్నగర్భంబునన్¯ నలినాక్షుండు గనుంగొనంగఁ దగె మైనాకావనీభృద్గతిన్. (291) వితతార్థజ్ఞానజప¯ స్తుతి మకరందప్రహృష్ట శ్రుతిజాత మధు¯ వ్రతగణపరివృతశోభా¯ గతకీర్తిప్రసవమాలికలు గలవానిన్.

బ్రహ్మదేవుని విష్ణుస్తోత్రంబు

(292) కనుఁగొని చతురాననుండు. (293) అనఘ! సర్వేశ్వరు నాద్యంతశూన్యుని¯ ధన్యుని జగదేకమాన్యచరితుఁ¯ దన్నాభిసరసిజోద్భవసరోజంబును¯ నప్పుల ననిలుని నంబరమును¯ మానిత భువననిర్మాణదృష్టినిఁ బొడ¯ గనెఁ గాని యితరముఁ గానలేక¯ యాత్మీయకర్మబీజాంకురంబును రజో¯ గుణయుక్తుఁ డగుచు నకుంఠితప్ర (293.1) జాభిసర్గాభిముఖత నవ్యక్తమార్గుఁ¯ డైన హరి యందుఁ దన హృదయంబుఁ జేర్చి¯ యమ్మహాత్మునిఁ బరము ననంతు నభవు¯ నజు నమేయుని నిట్లని యభినుతించె. (294) "నలినాక్ష మాయాగుణవ్యతికరమునఁ¯ జేసి కార్యంబైన సృష్టిరూప¯ మునఁ బ్రకాశించు నీ ఘనరూపవిభవంబు¯ రూపింప దేహధారులకు దుర్వి¯ భావ్యంబుఁదలపోయ భగవంతుఁడవునైన¯ పద్మాక్ష నీ స్వరూపంబుకంటె¯ నన్యమొక్కటి సత్యమై బోధకంబైన¯ యది లేదుగాన నీ యతులదివ్య (294.1) మైన రూపంబు నాకుఁ బ్రత్యక్ష మయ్యె¯ నదియుఁగాక వివేకోదయమునఁ జేసి¯ వరద! నీ రూప మజ్ఞాన గురుతమో ని¯ వారకం బయ్యె నాకు శశ్వత్ప్రదీప! (295) ఘన సత్పురుషానుగ్రహ¯ మునకై యమితావతార మూలం బగుచుం¯ దనరెడి నీ రూపము శో¯ భనమగు భవదీయ నాభిపద్మమువలనన్. (296) జననం బందిన నాచే¯ ననయము మొదలనె గృహీతమయ్యె జగత్పా¯ వన నీదు సుస్వరూపము ¯ ఘనరుచిరంబై స్వయంప్రకాశక మగుటన్. (297) మఱియు, జ్ఞానానంద పరిపూర్ణమాత్రంబును, ననావృత ప్రకాశంబును, భేదరహితంబునుఁ, బ్రపంచజనకంబును, ప్రపంచవిలక్షణంబును, భూతేంద్రియాత్మకంబును, నేకంబును నైన రూపంబు నొందియు నెందునుఁ బొడగాన నట్టి నిన్ను నాశ్రయించెద; అదియునుంగాక జగన్మంగళ స్వరూపధరుండవై నీ యుపాసకుల మైన మా మంగళంబుకొఱకు నిరంతర ధ్యానంబుచేత నీ దివ్యరూపంబునం గానంబడితివి; ఇట్టి నీవు నిరయభాక్కు లై నిరీశ్వరవాదంబునంజేసి కుతర్కంబులు ప్రసంగించు భాగ్యరహితులచేత నాదృతుండవు గావు; మఱియుం గొందఱు కృతార్థు లైన మహాత్ములచేత భవదీయ శ్రీచరణారవిందకోశగంధంబు వేదమారుతానీతం బగుటంజేసి తమతమ కర్ణకుహరంబులచేత నాఘ్రాణించుచుందురు వారల హృదయకమలంబుల యందు భక్తిపారతంత్ర్యంబున గృహీత పాదారవిందంబులు గలిగి ప్రకాశింతువు; అదియునుం గాక ప్రాణులకు ద్రవ్యాగార సుహృన్నిమిత్తం బయిన భయంబునుఁ దన్నాశనిమిత్తం బయిన శోకంబును ద్రవ్యాది స్పృహయునుం దన్నిమిత్తం బయిన పరిభవంబును, మఱియు నందుఁ దృష్ణయు, నది ప్రయాసంబున లబ్ధం బైన నార్తిమూలం బగు తదీయం బైన వృథాగ్రహంబును, నీ శ్రీపాదారవిందంబు లందు వైముఖ్యం బెంత కాలంబు గలుగు నంతకాలంబు ప్రాప్తంబు లగుం గాని, మానవాత్మనాయకుండ వగు నిన్ను నాశ్ర యించిన భయనివృత్తిహేతు వైన మోక్షంబు గలుగు; మఱియునుం గొందఱు సకలపాపనివర్తకం బయిన త్వదీయ నామస్మరణ కీర్తనంబు లందు విముఖులై కామ్యకర్మ ప్రావీణ్యంబునంజేసి నష్టమతు లై యింద్రియపరతంత్రు లై యమంగళంబు లైన కార్యంబులు సేయుచుందురు; దానంజేసి వాతాది త్రిధాతుమూలం బైన క్షుత్తృడాది దుఃఖంబులచేతను శీతోష్ణ వర్ష వాతాది దుఃఖంబులచేతను నతి దీర్ఘం బైన కామాగ్నిచేతను నవిచ్ఛన్నం బగు క్రోధంబుచేతనుం దప్యమానులగుదురు వారలఁ గనిన నా చిత్తంబు గలంకం బొందు; జీవుండు భవదీయ మాయాపరిభ్రామ్యమాణుం డై యాత్మ వేఱని యెప్పడు దెలియు నంతకాలంబు నిరర్థకంబై దుస్తరంబైన సంసారసాగరంబుఁ దరియింపఁ జాలకుండు; సన్మునీంద్రు లైనను భవదీయ నామస్మరణంబు మఱచి యితర విషయాసక్తు లైరేని, వారలు దివంబు లందు వృథాప్రయత్ను లై సంచరించుచు రాత్రుల యందు నిద్రాసక్తు లై, స్వప్న గోచరంబు లయిన బహువిధ సంపదలకు నానందించుచు శరీరపరిణామాది పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబు లైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు; నిష్కాము లై నిన్ను భజియించు సత్పురుషుల కర్ణమార్గంబులం బ్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోధితం బైన హృత్సరోజకర్ణికాపీఠంబున వసియింతువు; అదియునుంగాక. (298) వరయోగీంద్రులు యోగమార్గముల భావంబందు నే నీ మనో¯ హరరూపంబుఁ దలంచి యే గుణగణధ్యానంబు గావింతు ర¯ ప్పురుషశ్రేష్ఠ పరిగ్రహంబునకునై పొల్పారఁ దద్ధ్యాన గో¯ చరమూర్తిన్ ధరియింతుఁ గాదె పరమోత్సాహుండవై మాధవా! (299) అరయ నిష్కామధర్ము లైనట్టి భక్తు¯ లందు నీవు ప్రసన్నుండ వైనరీతి¯ హృదయముల బద్ధకాములై యెనయు దేవ¯ గణము లందుఁ బ్రసన్నతఁ గలుగ వీవు. (300) అరయ సమస్త జీవహృదయంబుల యందు వసించి యేకమై¯ పరఁగి సుహృత్క్రియానుగుణభాసిత ధర్ముఁడవుం బరాపరే¯ శ్వరుఁడవునై తనర్చుచు నసజ్జన దుర్లభమైన యట్టి సు¯ స్థిర మగు సర్వభూతదయచేఁ బొడగానఁగవత్తు వచ్యుతా! (301) క్రతు దానోగ్రత పస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల¯ వ్రతచర్యాదుల నాదరింప వఖిలవ్యాపారపారాయణ¯ స్థితి నొప్పారెడి పాదపద్మయుగళీసేవాభి పూజా సమ¯ ర్పిత ధర్ముండగు వాని భంగి నసురారీ! దేవచూడామణీ! (302) తవిలి శశ్వత్స్వరూప చైతన్య భూరి¯ మహిమచేత నపాస్త సమస్త భేద¯ మోహుఁడ వఖిల విజ్ఞానమునకు నాశ్ర¯ యుండ వగు నీకు మ్రొక్కెదనో రమేశ! (303) జననస్థితివిలయంబుల¯ ననయంబును హేతుభూతమగు మాయాలీ¯ లను జెంది నటన సలిపెడు¯ ననఘాత్మక! నీకొనర్తు నభివందనముల్ (304) అనఘాత్మ! మఱి భవదవతార గుణకర్మ¯ ఘన విడంబన హేతుకంబు లయిన¯ రమణీయ మగు దాశరథి వసుదేవకు¯ మారాది దివ్యనామంబు లోలి¯ వెలయంగ మనుజులు వివశాత్ములై యవ¯ సానకాలంబున సంస్మరించి¯ జన్మజన్మాంతర సంచిత దురితంబుఁ¯ బాసి కైవల్యసంప్రాప్తు లగుదు (304.1) రట్టి దివ్యావతారంబుల వతరించు¯ నజుఁడ వగు నీకు మ్రొక్కెద ననఘచరిత! ¯ చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! ¯ భక్తమందార! దుర్భవభయవిదూర! (305) జననవృద్ధివినాశ హేతుక సంగతిం గల యేను నీ¯ వును హరుండు ద్రిశాఖలై మనువుల్ మరీచిముఖామరుల్¯ ఒనర నందుపశాఖలై చెలువొంద నింతకు మూలమై¯ యనయమున్ భువనద్రుమాకృతివైన నీకిదె మ్రొక్కెదన్. (306) పురుషాధీశ! భవత్పదాబ్జయుగళీపూజాది కర్మక్రియా¯ పరతం జెందని మూఢచిత్తునిఁ బశుప్రాయున్ మనుష్యాధమున్¯ జరయున్ నాశము నొందఁ జేయు నతి దక్షంబైన కాలంబు త¯ ద్గురు కాలాత్ముఁడ వైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్. (307) సర్వేశ! కల్పాంతసంస్థిత మగు జల¯ జాత మం దేను సంజనన మంది¯ భవదీయ సుస్వరూపముఁ జూడ నర్థించి¯ బహువత్సరములు దపంబుఁ జేసి ¯ క్రతుకర్మములు పెక్కు గావించియును నినుఁ¯ బొడగానఁగాలేక బుద్ధి భీతిఁ¯ బొందిన నాకు నిప్పుడును నిర్హేతుక¯ కరుణచే నఖిలలోకైకవంద్య (307.1) మాన సతత ప్రసన్న కోమల ముఖాబ్జ¯ కలిత భవదీయ దివ్యమంగళవిలాస¯ మూర్తి దర్శింపఁ గలిగె భక్తార్తిహరణ¯ కరణ! తుభ్యంనమో విశ్వభరణ! దేవ! (308) అమర తిర్యఙ్మనుష్యాది చేతన యోను¯ లందు నాత్మేచ్ఛచేఁ జెందినట్టి¯ కమనీయ శుభమూర్తి గలవాడ వై ధర్మ¯ సేతు వనంగఁ బ్రఖ్యాతి నొంది¯ విషయసుఖంబుల విడిచి సంతత నిజా¯ నందానుభవ సమున్నతిఁ దనర్తు¯ వదిగాన పురుషోత్తమాఖ్యఁ జెన్నొందుదు¯ వట్టి నిన్నెప్పుడు నభినుతింతు (308.1) నర్థి భవదీయపాదంబులాశ్రయింతు¯ మహితభక్తిని నీకు నమస్కరింతు¯ భక్తజనపోష! పరితోష! పరమపురుష! ¯ ప్రవిమలాకార! సంసారభయవిదూర! (309) తలకొని పంచభూతప్రవర్తకమైన¯ భూరిమాయాగుణస్ఫురణఁ జిక్కు¯ వడక లోకంబులు భవదీయ జఠరంబు¯ లో నిల్పి ఘనసమాలోల చటుల¯ సర్వంకషోర్మి భీషణ వార్థి నడుమను¯ ఫణిరాజభోగతల్పంబు నందు¯ యోగనిద్రారతి నుండగ నొకకొంత¯ కాలంబు సనఁగ మేల్కనిన వేళ (309.1) నలఘు భవదీయనాభితోయజమువలనఁ¯ గలిగి ముల్లోకములు సోపకరణములుగఁ¯ బుట్టఁ జేసితి వతుల విభూతి మెఱసి¯ పుండరీకాక్ష! సంతతభువనరక్ష! (310) నిగమస్తుత! లక్ష్మీపతి! ¯ జగదంతర్యామి వగుచు సర్గము నెల్లం¯ దగు భవదైశ్వర్యంబున¯ నగణిత సౌఖ్యానుభవము నందింతు గదే. (311) జలజాక్ష! యెట్టి విజ్ఞానబలంబునఁ¯ గల్పింతు వఖిలలోకంబు లోలి¯ నతజనప్రియుఁడవు నా కట్టి సుజ్ఞాన¯ మర్థిమైఁ గృపసేయు మయ్య వరద! ¯ సృష్టినిర్మాణేచ్ఛఁ జెంది నా చిత్తంబుఁ¯ దత్కర్మకౌశలిఁ దగిలి యుండి¯ యునుఁ గర్మవైషమ్యమునుఁ బొందు కతమున¯ దురితంబుఁ బొరయక తొలగు నట్టి (311.1) వెఱవు నా కెట్లు కలుగు నవ్విధముఁ దలచి¯ కర్మవర్తను నను భవత్కరుణ మెఱసి¯ తగఁ గృతార్థునిఁ జేయవే నిగమవినుత! ¯ సత్కృపామూర్తి! యో దేవచక్రవర్తి! (312) భవ దుదరప్రభూత మగు పద్మము నందు వసించి యున్న నే¯ నవిరళ తావకీన కలితాంశమునం దనరారు విశ్వముం¯ దవిలి రచించుచున్ బహువిధంబులఁ బల్కెడి వేదజాలముల్¯ శివతరమై ఫలింపఁ గృపసేయుము భక్తఫలప్రదాయకా!" (313) అని యనుకంపదోఁప వినయంబునఁ జాఁగిలి మ్రొక్కి చారులో¯ చన సరసీరుహుం డగుచు సర్వజగత్పరికల్పనా రతిం¯ దనరిన నన్నుఁ బ్రోచుటకుఁ దా నిటు సన్నిధి యైన యీశ్వరుం¯ డనయము నాదు దుఃఖము దయామతిఁ బాపెడు నంచు నమ్రుడై (314) వనరుహసంజాతుఁడు నె¯ మ్మనమున హర్షించె ననుచు"మైత్రేయమహా¯ ముని ఘనుఁడగు విదురునకున్¯ వినయంబున నెఱుఁగజెప్పి వెండియుఁ బలికెన్. (315) "వనజాతప్రభవుండు కేవలతపోవ్యాసంగుఁ డై పద్మలో¯ చను గోవిందు ననంతు నాఢ్యుఁ దన వాక్ఛక్తిన్ నుతింపన్ సుధా¯ శనవంద్యుండు ప్రసన్నుఁ డై నిఖిల విశ్వస్థాపనాలోకనం¯ బునఁ జూచెన్ విలయప్రభూత బహువాఃపూరంబులన్ వ్రేల్మిడిన్. (316) అట్లు వొడగని యార్తుఁ డైనట్టి పద్మ¯ భవుని వాంఛిత మాత్మఁ దీర్పగఁ దలంచి¯ యతని మోహనివారక మైన యట్టి¯ యమృతరసతుల్య మధురవాక్యముల ననియె. (317) "తలకొని నీ యొనర్చు పనిదప్పి మదిం దలపోయు దుఃఖముం¯ దలఁగుము నాదు లీలకుఁ బ్రధానగుణం బగు సృష్టికల్పనం¯ బలవడఁ జేయు బుద్ధి హృదయంబునఁ జొన్పి తపస్సమాధి ని¯ ష్ఠల నతిభక్తులన్ ననుఁ బ్రసన్నునిఁ జేయుము చెందు కోరికల్. (318) నీ వొనరించు తపోవి¯ ద్యావిభవ విలోకనీయ మగు నీ సృష్టిం¯ గావింపుము లోకంబుల¯ లో వెఁలిగెడి నన్నుఁ గందు లోకస్తుత్యా! (319) నాలోని జీవకోటులు¯ వాలాయము నీకుఁ గానవచ్చు నిపుడు నీ¯ వాలోకింపుము దారువి¯ లోల హుతాశనునికరణి లోకస్తుత్యా! (320) నలువొంద నఖిలజీవుల యందుఁ గల నన్నుఁ¯ దెలిసి సేవింపుము నలినగర్భ! ¯ భవదీయ దోషముల్ వాయును భూతేంద్రి¯ యాశ్రయ విరహిత మై విశుద్ధ¯ మైన జీవుని విమలాంతరాత్ముఁడ నైన¯ నను నేకముగఁ జూచు నరుఁడు మోక్ష¯ పదమార్గవర్తి యై భాసిల్లు బ్రహ్మాండ¯ మందును వివిధకర్మానురూప (320.1) పద్ధతులఁ జేసి పెక్కురూపముల నొందు ¯ జీవతతి రచియించు నీ చిత్త మెపుడు¯ మత్పదాంబుజయుగళంబు మరగి యున్న¯ కతన రాజసగుణమునఁ గలుగ దనఘ! (321) విను మదియుఁ గాక ప్రాణుల¯ కనయము నెఱుఁగంగరాని యనఘుఁడఁ దేజో¯ ధనుఁడఁ బరేశుఁడ నీచే¯ తను గానంబడితి నిదె పితామహ! కంటే. (322) మఱియు, భూతేంద్రియగుణాత్ముం డనియు జగన్మయుం డనియు నన్ను నీ చిత్తంబు నందుఁ దలంపుము; తామరసనాళవివర పథంబు వెంటం జని జలంబులలోనం జూడం గోరి నట్టి మదీయ స్వరూపంబు. (323) నీ కిప్పుఁడు గానంబడె¯ నాకులకును నురగపతి పినాకులకైనన్¯ వాకొనఁగం దలపోయను¯ రాకుండు మదీయ రూపరమ్యత్వంబుల్. (324) కావున మచ్చారిత్ర క¯ థా విలసిత మైన సుమహితస్తవము జగ¯ త్పావనము విగతసంశయ¯ భావుఁడ వై బుద్ధినిలుపు పంకజజన్మా! (325) సగుణుఁడ నై లీలార్థము¯ జగములఁ గల్పింపఁ దలచు చతురుని నన్నున్¯ సగుణునిఁగా నుతియించితి¯ తగ సంతస మయ్యె నాకుఁ దామరసభవా! (326) ఈ మంజుస్తవరాజము¯ నీ మనమునఁ జింతఁ దక్కి నిలుపుము భక్తిన్¯ ధీమహిత! నీ మనంబునఁ¯ గామించిన కోర్కు లెల్లఁ గలుగుం జుమ్మీ. (327) అనుదినమునుఁ ద్రిజగత్పా¯ వనమగు నీ మంగళస్తవంబుఁ బఠింపన్¯ వినినను జనులకు నేఁ బొడ¯ గనఁబడుదు నవాప్తసకలకాముఁడ నగుచున్. (328) వన తటా కోపనయన వివాహ దేవ¯ భవన నిర్మాణ భూమ్యాదివివిధదాన¯ జప తపోవ్రత యోగ యజ్ఞముల ఫలము¯ మామక స్తవఫలంబు సమంబు గాదు. (329) జీవావలిఁ గల్పించుచుఁ¯ జీవావలిలోనఁ దగ వసించుచుఁ బ్రియవ¯ స్త్వావలిలోపలఁ బ్రియవ¯ స్త్వావలి యై యుండు నన్ను ననిశముఁ బ్రీతిన్. (330) తలఁపుము మత్ప్రీతికి నై¯ కలిగించితి నిన్ను భువనకారణ! నాలో¯ పల నడగి యేకమై ని¯ శ్చలగతి వసియించి యున్న జగముల నెల్లన్. (331) తగ నహంకారమూలతత్త్వంబు నొంది¯ నీవు పుట్టింపు"మనుచు రాజీవభవుఁడు¯ వినఁగ నానతి యిచ్చి యవ్వనజనాభుఁ¯ డంత నంతర్హితుం డయ్యె ననఘచరిత!"

బ్రహ్మ మానస సర్గంబు

(332) అని చెప్పిన మైత్రేయునిఁ¯ గనుఁగొని విదురుండు పలికెఁ గడు ముదమొప్పన్¯ "జననుత! నలినదళాక్షుఁడు¯ సనినం బద్మజుఁడు దేహసంబంధమునన్. (333) మానససంబంధంబును¯ బూనిన యీ సర్గ మెట్లు పుట్టించె దయాం¯ భోనిధివై నా కింతయు¯ మానుగఁ నెఱిఁగింప వయ్య మహితవిచారా! " (334) అనవుడు, నమ్మునివరేణ్యుండు విదురున కిట్లనియెఁ "బుండరీకాక్ష వరదాన ప్రభావంబునం బంకజాసనుండు శత దివ్యవత్సరంబులు భగవత్పరంబుగాఁ దపంబుఁ గావించి, తత్కాలవాయువుచేఁ గంపితం బగు నిజనివాసం బయిన పద్మంబున వాయువును జలంబులను గనుంగొని, యాత్మీయ తపశ్ఛక్తిచేత నభివృద్ధిం బొందిన విద్యాబలంబున వాయువులు బంధించి తోయంబులతోడ నొక్క తోయంబు సమస్తంబునుం గ్రోలి, యంత గగనవ్యాప్తి యగు జలంబును గనుంగొని. (335) వారిజసంభవుండు బుధవంద్యుఁడు చిత్తమునం దలంచె దై¯ త్యారిఁ బయోవిహారి సముదంచితహారి నతాఖిలామృతా¯ హారి రమాసతీహృదయహారి నుదారి విదూరభూరిసం¯ సారి భవప్రహారి విలసన్నుతసూరి నఘారి నయ్యెడన్. (336) అట్లు దలఁచి సరోజజుం డంబుజమును¯ గగనతలమునఁ జూచి యా కమలకోశ¯ లీనమై యున్న లోకవితానములను¯ నొయ్యఁ బొడఁగని హరిచే నియుక్తుఁ డైన. (337) వానిఁగాఁ దన్నుఁ దలఁచి యవ్వనరుహంబు¯ లోపలికిఁ బోయి మున్నందులోన నున్న¯ ముజ్జగంబులఁ జూచి యిమ్ముల సృజించె¯ మఱి చతుర్దశ భువనముల్ మహిమఁ జేసి. (338) పరఁగ సుధాశన తిర్య¯ ఙ్నర వివిధస్థావరాది నానాసృష్టి¯ స్ఫురణ నజుం డొనరించెం¯ బరువడి నిష్కామధర్మఫలరూపమునన్. (339) ఇట్లు భువనంబులఁ బద్మజుండు గల్పించె"నని మైత్రేయుండు విదురున కెఱింగించిన. (340) విదురుఁడు దురితావనిభృ¯ ద్భిదురుఁడు మునివరునిఁ జూచి ప్రియము మనమునం¯ గదురఁగ నిట్లని పలికె "న¯ తి దురంతం బయిన విష్ణుదేవుని మహిమన్. (341) అమరె భువనంబు లతని కాలాఖ్యతయును¯ గణుతిసేయు తదీయ లక్షణము లర్థి¯ నాకు నెఱిఁగింపు మయ్య వివేకచరిత!"¯ యనిన మైత్రేయుఁ డవ్విదురునకు ననియె. (342) "ఆద్యంతశూన్యంబు నవ్యయం బై తగు¯ తత్త్వ మింతకు నుపాదాన మగుట¯ గుణవిషయములు గైకొని కాలమును మహ¯ దాదిభూతములు దన్నాశ్రయింపఁ¯ గాలానురూపంబుఁ గైకొని యీశుండు¯ దన లీలకై తనుఁదా సృజించె¯ గరమొప్ప నఖిల లోకము లందుఁ దా నుండుఁ¯ దనలోన నఖిలంబుఁ దనరుచుండుఁ (342.1) గాన విశ్వమునకుఁ గార్యకారణములు¯ దాన యమ్మహాపురుషుని తనువువలనఁ¯ బాసి విశ్వంబు వెలియై ప్రభాస మొందె¯ మానితాచార! యీ వర్తమానసృష్టి. (343) తెఱఁ గొప్ప నఖిల విశ్వముఁ¯ బురుషోత్తము మాయచేతఁ బుట్టుం బెరుఁగున్¯ విరతింబొందుచు నుండుం¯ గర మర్థిన్ భూతభావికాలము లందున్. (344) అట్టి సర్గంబు నవవిధం; బందుఁ బ్రాకృత వైకృతంబులు గాల ద్రవ్య గుణంబులను త్రివిధం బగు భేదంబుచేఁ బ్రతిసంక్రమంబు లగుచు నుండు; అందు మహత్తత్త్వంబు ప్రథమసర్గంబు; అది నారాయణ సంకాశంబున గుణవైషమ్యంబునం బొందు; ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంబైన యహంకారతత్త్వంబు ద్వితీయసర్గంబు; శబ్ద స్పర్శ రూప రస గంధంబు లను పంచతన్మాత్ర ద్రవ్యశక్తి యుక్తియుక్తంబైన పృథివ్యాది భూతసర్గంబు మూడవది యై యుండు; జ్ఞానేంద్రియంబు లైన త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులుఁ, గర్మేంద్రియంబు లైన వాక్పాణి పాద పాయూపస్థములు నను దశవిధేంద్రియ జననంబు చతుర్థసర్గంబు; సాత్వికాహంకార జనితం బైన సుమనోగణసర్గం బైదవ సర్గం బై యొప్పు; అది మనోమయంబై యుండు; జీవలోకంబునకు నబుద్ధికృతంబు లైన యావరణవిక్షేపంబులం జేయు తామససర్గం బాఱవ దై యుండు; ఇయ్యాఱు నీశ్వరునకు లీలార్థంబు లయిన ప్రాకృతసర్గంబు లయ్యె; ఇంక వైకృతసర్గంబు లేడవది మొదలుగాఁ గలుగు నవి వినిపింతు వినుము; పుష్పోత్పత్తి రహితంబు లై ఫలించెడు నశ్వత్థోదుంబర పనస న్యగ్రోధాదు లైన వనస్పతులును, బుష్పితంబు లైన ఫలపాకాంతంబు లయిన వ్రీహి యవ ముద్గా ద్యోషధులును, నారోహణానపేక్షంబు లయిన మాలతీ మల్లి కాది లతలును, ద్వక్సారంబు లైన వేణ్వాదులును, గఠినీభూత మూలంబులును, శిఖావిస్తృతంబులు నగు లతా విశేషరూపంబు లైన వీరుధంబులును, బుష్పవంతంబు లయి ఫలప్రాప్తంబు లగు చూతాది ద్రుమంబులును, నవ్యక్తచైతన్యంబులు నూర్ధ్వస్రోతంబులు నంతస్స్సర్గంబులుఁ దమఃప్రాయంబులు నై స్థావరంబు లయిన యీ యాఱు నేడవ సర్గం బయ్యె; ఎనిమిదవ సర్గం బిరువదియెనిమిది భేదంబులు గలిగి శ్వస్తనాది జ్ఞానశూన్యంబు లై యాహారాది జ్ఞానమాత్ర నిష్ఠంబు లయి ఘ్రాణంబువలన నెఱుంగం దగినవాని నెఱుంగుచు హృదయంబున దీర్ఘానుసంధాన రహితంబు లై వర్తించు ద్విశఫంబులు గల వృషభ మహిషాజ కృష్ణ సూకరోష్ట్ర గవయ రురు మేష ముఖర నవకంబును, నేక శఫంబు గల ఖరాశ్వశ్వతర గౌర శరభ చమర్యాది షట్కంబును, బంచనఖంబులు గల శునక సృగాల వృక వ్యాఘ్ర మార్జాల శశ శల్యక సింహ కపి గజ కూర్మ గోధా ముఖ భూచర ద్వాదశకంబును, మకరాది జలచరంబులును, గంక గృధ్ర బక శ్యేన భాస భల్లూక బర్హి హంస సారస చక్రవాక కాకోలూ కాది ఖేచరంబులును, మొదలుగాఁ గలది తిర్యక్సర్గం బయ్యె; అర్వాక్స్రోతం బై యేకవిధం బగు మానుషసర్గంబు రజోగుణ ప్రేరితంబై కర్మకరణదక్షంబై దుఃఖం బందును సుఖంబు గోరును; ఇది తొమ్మిదవ సర్గం బనం దగు; ఈ త్రివిధసర్గంబులు వైకృతసర్గంబు లనంబడు; ఇంక దేవసర్గంబు వినుము; అదియు నెనిమిది తెఱంగులు గలిగి యుండు; అందు విబుధ పితృ సురాదులు మూఁడును, గంధర్వాప్సరస లొకటియు, యక్ష రక్షస్సు లేకంబును, భూత ప్రేత పిశాచంబు లొకటియు, సిద్ధ చారణ విద్యాధరు లేకంబును, కిన్నర కింపురుషు లొకటియుంగా దేవసర్గం బయ్యె; ఇట్టి బ్రహ్మనిర్మితంబు లైన దశవిధసర్గంబులు నెఱింగించితి; ఇంక మనువులం దదంతరంబుల నెఱింగించెద; కల్పాదుల యందు నీ ప్రకారంబున స్వయంభూతుండును, నమోఘసంకల్పుండును నగు నప్పుండరీకాక్షుండు రజోగుణయుక్తుం డై స్రష్ట యగుచు స్వస్వరూపం బయిన విశ్వంబు నాత్మీయ సామర్థ్యంబునం గల్పించె; అ య్యీశ్వరుని మాయావ్యాపారంబులచే నీ సృష్టి యందు నద్యావర్తంబులం బడి భ్రమించుచున్న మహీరుహంబులుం బోలెఁ, బూర్వాపరాభావంబు లెఱుంగంబడకుండ నీ కల్పంబు నందుండు దేవాసురాదులు ప్రతి మన్వంతరంబు నందును నిట్ల నామరూపంబులచే నిర్దేశింపబడుదురు; మఱియు నిందొక్క విశేషం బెఱింగించెదఁ; గౌమారసర్గం బను నది దేవసర్గాంతర్భూతం బయ్యును బ్రాకృత వైకృతోభయాత్మకం బై దైవత్వ మనుష్యత్వ రూపం బైన సనత్కుమారాది సర్గం బనంబడె; అమోఘసంకల్పుం డైన పుండరీకాక్షుండు తనుఁదాన యిట్లు విశ్వభేదంబును గల్పించె;"అని మైత్రేయుండు విదురునకుఁ జెప్పి కాలలక్షణం బెఱింగించువాఁ డై యిట్లనియె.

కాల నిర్ణయంబు

(345) భువిఁ దన కార్యాంశమునకు నంతము నన్య¯ వస్తుయోగంబు నేఁవలన లేఁక¯ ఘటపటాదిక జగత్కార్యంబునకు నిజ¯ సమవాయకారణత్వమునఁ బరగి¯ జాల సూర్యమరీచిసంగతగగనస్థ¯ మగు త్రసరేణు షడంశ మరయఁ¯ బరమాణు వయ్యెఁ దత్పరమాణు వం దర్క¯ గతి యెంత దడవు తత్కాల మగును (345.1) సూక్ష్మకాలంబు విను మది సూర్యమండ¯ లంబు ద్వాదశరాశ్యాత్మకం బనంగఁ¯ గలుగు జగమున నొక యేఁడు గడచి చనినఁ¯ గాల మెం తగు నది మహత్కాల మనఘ! (346) అందుఁ, బరమాణుద్వయం బొక్క యణు వగు; నణుత్రిత్రయం బొక్క త్రసరేణు వగు; అవి మూఁడు గూడ నొక్క తృటి యగు; ఆ తృటి శతం బొక్క వేధ యనం బరఁగు; అట్టి వేధలు మూడు గూడ నొక్క లవం బనఁదగు; అవి మూ డైన నొక్క నిమేషం బనంజను; నిమేష త్రయం బొక్క క్షణం బగు; క్షణ పంచకం బొక్క కాష్ఠ యనందగు; నవి పది యైన నొక్క లఘు వన నొప్పు; అట్టి లఘు పంచదశకం బొక్క నాడి యనంబరఁగు; అట్టి నాడికా ద్వయం బొక్క ముహూర్తం బయ్యె; అట్టి నాడిక లాఱైన నేడైన మనుష్యులకు నొక్క ప్రహరం బగు; అదియ యామం బనంజను; దివస పరిమాణ విజ్ఞేయం బగు నాడికోన్మాన లక్షణం బెఱింగింతు వినుము; షట్ఫల తామ్రంబునం బాత్రంబు రచియించి, చతుర్మాష సువర్ణంబునం చతురంగుళాయ శలాకంబుఁ గల్పించి, దానం దత్పాత్ర మూలంబున ఛిద్రంబుఁ గల్పించి, తఛిద్రంబునం బ్రస్థమాత్ర తోయంబు పరిపూర్ణంబు నొందు నంత కాలం బొక్క నాడిక యగు; యామంబులు నాలుగు సన నొక్క పగ లగు; రాత్రియు నిప్పగిది జరుగు; అట్టి యహర్నిశంబులు గూడ మర్త్యుల కొక దివసం బగు; అవి పదునేనైన నొక్క పక్షం బగు శుక్లకృష్ణ నామంబులం బరఁగిన యప్పక్షంబులు రెండు గూడ నొక్క మాసం బగు అది పితృదేవతలకు నొక్క దివసం బగు; అట్టి మాసంబులు రెండైన నొక్క ఋతు వగు; షణ్మాసం బరిగిన నొక్క యాయనం బగు; దక్షిణోత్తర నామంబులం బరఁగి నట్టి యాయనంబులు రెండు గూడి ద్వాదశ మాసంబు లైన నొక్క సంవత్సరం బగు; అది దేవతలకు నొక్క దివసం బగు; అట్టి సంవత్సర శతంబు నరులకుం బరమాయు వై యుండు; కాలాత్ముండును నీశ్వరుండును నైన సూర్యుండు గ్రహ నక్షత్ర తారా చక్రస్థుండై పరమాణ్వాది సంవత్సరాత్మకం బైన కాలంబునం జేసి ద్వాదశరాశ్యాత్మకం బైన జగంబున సౌర బార్హస్పత్య సావన చాంద్ర నాక్షత్ర మానభేదంబులం గానంబడుచున్నవాఁ డై సంవత్సర పరీవృత్స రేడావత్స రానువత్సర వత్సర నామంబుల సృజ్యం బైన బీజాంకురంబుల శక్తిం గాలరూపం బైన స్వశక్తిచేత నభిముఖంబుగాఁ జేయుచుఁ బురుషులకు నాయురాది వ్యయనంబులం జేసి విషయాసక్తి నివర్తింపం జేయుచుం గోరికలు గల వారికి యజ్ఞముఖంబులం జేసి గుణమయంబు లైన స్వర్గాది ఫలంబుల విస్తరింపం జేయుచు గగనంబునఁ బరువు వెట్టు వత్సర పంచక ప్రవర్తకుం డగు మార్తాండునకుం బూజఁ గావింపుము;"అని మైత్రేయుండు పలికిన విదురుం డిట్లనియె. (347) "నర పితృ సుర పరమాయుః¯ పరిమాణము లెఱుఁగ నాకుఁ బలికితివి మునీ¯ శ్వర యెఱిగింపు త్రిలోకో¯ పరిలోక విలోక నైక పరులగు వారిన్. (348) పూనిన యోగసిద్ధి దగఁ బొందిన నేత్రయుగంబునన్ బహి¯ ర్జ్ఞానము గల్గి యుండి భువనంబులఁ జూచుచునుండు వారికి¯ న్మానుగఁ గల్గు కాలగతి నా కెఱిఁగింపు మునీంద్ర!"నావుడు¯ న్నా నయశాలి యవ్విదురు నాదర మొప్పఁగ జూచి యిట్లనున్.