పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : చతుర్థ 236-322

ధ్రువుండు తపంబు చేయుట

(236) నిజధర్మపరిశోభితంబైన యేకాగ్రచిత్తంబున నిలిపి సేవింపు; మమ్మహాత్ముని కంటె నీ దుఃఖం బపనయించువాఁ డన్యుం డొక్కరుండు గలండే?" యని పలికినఁ బరమార్థ ప్రాప్తి హేతుకంబులైన తల్లివాక్యంబులు విని తన్నుఁ దాన నియమించుకొని పురంబు వెడలి చను నవసరంబున నారదుండు తద్వృత్తాంతం బెఱింగి, యచ్చటికిం జనుదెంచి, యతని చికీర్షితంబు దెలిసి, పాపనాశకరం బైన తన కరతలంబు నా ధ్రువుని శిరంబునం బెట్టి "మానభంగంబునకు సహింపని క్షత్రియుల ప్రభావం బద్భుతంబు గదా? బాలకుం డయ్యుఁ బినతల్లి యాడిన దురుక్తులు చిత్తంబునం బెట్టి చనుచున్నవాఁ" డని మనంబున నాశ్చర్యంబు నొంది “యో బాలక! సకల సంపత్సమృద్ధం బగు మందిరంబు దెగడి యొంటి నెందు నేగెదవు? స్వజన కృతం బగు నవమానంబుచే నిను సంతప్తుంగాఁ దలంచెద” ననిన ధ్రువుం డిట్లనియె; సపత్నీమాతృ వాగిషుక్షతం బగు వ్రణంబు భగవద్ధ్యానయోగ రసాయనంబున మాపి కొందు"ననిన విని ధ్రువునికి నారదుం డిట్లనియె. (237) "విను పుత్రక! బాలుఁడవై¯ యనయంబును గ్రీడలందు నాసక్తమనం¯ బునఁ దిరిగెడు నిక్కాలం¯ బున నీ కవమానమానములు లే వెందున్. (238) కాన మనమునఁ దద్వివేకంబు నీకుఁ¯ గలిగెనేనియు సంతోషకలితు లయిన¯ పురుషు లాత్మీయకర్మ విస్ఫురణఁ జేసి¯ వితత సుఖదుఃఖము లనుభవింతు రెపుడు. (239) కావున వివేకంబు గల పురుషుండు దనకుం బ్రాప్తంబు లగు సుఖ దుఃఖంబులు దైవవశంబులుగాఁ దలంచి తావన్మాత్రంబునం బరితుష్టుం డగు; నీవును దల్లి చెప్పిన యోగమార్గ ప్రకారంబున సర్వేశ్వరానుగ్రహంబుఁ బొందెద నంటివేని. (240) అనఘాత్మ! యోగీంద్రు లనయంబు ధరఁ బెక్కు¯ జన్మంబు లందు నిస్సంగమైన¯ మతినిఁ బ్రయోగ సమాధినిష్ఠలఁ జేసి¯ యైనను దెలియ లే రతని మార్గ; ¯ మది గాన నతఁడు దురారాధ్యుఁ డగు నీకు¯ నుడుగుము నిష్ఫలోద్యోగ మిపుడు¯ గాక నిశ్శ్రేయస కాముఁడ వగుదేనిఁ¯ దండ్రి! వర్తించు తత్కా లమందుఁ (240.1) బూని సుఖదుఃఖములు రెంటిలోన నెద్ది¯ దైవవశమునఁ జేకుఱు దానఁ జేసి¯ డెందమునఁ జాల సంతుష్టి నొందువాఁడు¯ విమలవిజ్ఞాని యన భువి వెలయుచుండు. (241) మఱియు గుణాఢ్యుం డగువానిం జూచి సంతోషించుచు నాభాసుం డగు వానిం జూచి కరుణించుచు సమానుని యెడ మైత్రి సలుపుచు వర్తించుచున్నవాఁడు తాపత్రయాదికంబులం దొఱంగు"నని నారదుండు పలికిన విని ధ్రువుం డిట్లనియె; “ననఘా! యీ శమంబు సుఖదుఃఖ హతాత్ము లగు పురుషులకు దుర్గమం బని కృపాయత్తుండవైన నీ చేత వినంబడె; నట్లయినం బరభయంకరం బగు క్షాత్త్ర ధర్మంబు నొందిన యవినీతుండనగు నేను సురుచి దురుక్తులను బాణంబుల వలన వినిర్భిన్నహృదయుండ నగుట మదీయచిత్తంబున శాంతి నిలువదు; కావునం ద్రిభువనోత్కృష్టంబు ననన్యాధిష్ఠితంబు నగు పదంబును బొంద నిశ్చయించిన నాకు సాధుమార్గంబు నెఱింగింపుము; నీవు భగవంతుం డగు నజుని యూరువు వలన జనించి వీణావాదన కుశలుండవై జగద్ధితార్థంబు సూర్యుండునుం బోలె వర్తింతు;"వనిన విని. (242) నారదుఁ డిట్లను "ననఘ! కు¯ మారక! విను నిన్ను మోక్షమార్గంబునకున్¯ బ్రేరేచినవాఁ డిప్పుడు¯ ధీరజనోత్తముఁడు వాసుదేవుం డగుటన్. (243) నీవు నమ్మహాత్ముని నజస్రధ్యాన ప్రవణ చిత్తుండవై భజియింపుము. (244) పురుషుఁడు దవిలి చతుర్విధ¯ పురుషార్థశ్రేయ మాత్మఁ బొందెద ననినన్¯ ధరఁ దత్ప్రాప్తికి హేతువు¯ హరిపదయుగళంబు దక్క నన్యము గలదే? (245) కావున. (246) వర యమునానదితటమునఁ¯ హరి సాన్నిధ్యంబు శుచియు నతిపుణ్యమునై¯ పరఁగిన మధువనమునకును¯ సరసగుణా! చనుము మేలు సమకుఱు నచటన్. (247) ఆ యమునా తటినీ శుభ¯ తోయములం గ్రుంకి నిష్ఠతో నచ్చట నా¯ రాయణునకును నమస్కృతు¯ లాయతమతిఁ జేసి చేయు యమనియమములన్. (248) మఱియు బాలుండ వగుటం జేసి వేదాధ్యయనా ద్యుచిత కర్మానర్హుండ వయ్యు నుచితంబులగు కుశాజినంబులం జేసి స్వస్తిక ప్రముఖాసనంబులం గల్పించుకొని త్రివృత్ప్రాణాయామంబులచేతం బ్రాణేంద్రియ మనోమలంబు లను చాంచల్య దోషంబులఁ బ్రత్యాహరించి స్థిరం బయిన చిత్తంబున. (249) ఆశ్రిత సత్ప్రసాదాభి ముఖుండును¯ స్నిగ్ధప్రసన్నాననేక్షణుండు¯ సురుచిర నాసుండు సుభ్రూయుగుండును¯ సుకపోల తలుఁడును సుందరుండు¯ హరినీల సంశోభితాంగుండుఁ దరుణుండు¯ నరుణావలోక నోష్ఠాధరుండుఁ¯ గరుణాసముద్రుండుఁ బురుషార్థ నిధియును¯ బ్రణతాశ్రయుండు శోభనకరుండు (249.1) లలిత శ్రీవత్సలక్షణ లక్షితుండు¯ సర్వలోక శరణ్యుండు సర్వసాక్షి¯ పురుష లక్షణ యుక్తుండుఁ బుణ్యశాలి¯ యసిత మేఘనిభశ్యాముఁ డవ్యయుండు. (250) మఱియును. (251) హార కిరీట కేయూర కంకణ ఘన¯ భూషణుం డాశ్రిత పోషణుండు¯ లాలిత కాంచీకలాప శోభిత కటి¯ మండలుం డంచిత కుండలుండు¯ మహనీయ కౌస్తుభమణి ఘృణి చారు గ్రై¯ వేయకుం డానంద దాయకుండు¯ సలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ¯ హస్తుండు భువన ప్రశస్తుఁ డజుఁడు (251.1) కమ్ర సౌరభ వనమాలికా ధరుండు¯ హతవిమోహుండు నవ్యపీతాంబరుండు¯ లలిత కాంచన నూపురాలంకృతుండు¯ నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు. (252) సరసమనోలోచన ము¯ త్కరుఁడును హృత్పద్మ కర్ణికా నివసిత వి¯ స్ఫుర దురునఖ మణిశోభిత¯ చరణ సరోజాతుఁ డతుల శాంతుఁడు ఘనుఁడున్. (253) అయిన పురుషోత్తముఁ బూజించుచు హృదయగతుండును, సాను రాగవిలోకనుండును, వరదశ్రేష్ఠుండును నగు నారాయణు నేకాగ్రచిత్తంబునం ధ్యానంబు చేయుచు బరమ నివృత్తి మార్గంబున ధ్యాతుండైన పురుషోత్తముని దివ్యమంగళస్వరూపంబు చిత్తంబునం దగిలిన మరల మగుడ నేరదు; అదియునుం గాక, యే మంత్రంబేని సప్త వాసరంబులు పఠియించిన ఖేచరులం గనుంగొను సామర్థ్యంబు గలుగు; నట్టి ప్రణవయుక్తం బగు ద్వాదశాక్షర కలితంబును దేశకాల విభాగ వేది బుధానుష్ఠితంబును నయిన ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ యనెడి వాసుదేవ మంత్రంబునం జేసి. (254) దూర్వాంకురంబుల దూర్వాంకురశ్యాము¯ జలజంబులను జారుజలజనయనుఁ¯ దులసీ దళంబులఁ దులసికా దాముని¯ మాల్యంబులను సునైర్మల్య చరితుఁ¯ బత్రంబులను బక్షిపత్రునిఁ గడు వన్య¯ మూలంబులను నాది మూలఘనుని¯ నంచిత భూర్జత్వగాది నిర్మిత వివి¯ దాంబరంబులను పీతాంబరధరుఁ (254.1) దనరు భక్తిని మృచ్ఛిలాదారు రచిత¯ రూపముల యందుఁ గాని నిరూఢమైన¯ సలిలముల యందుఁ గాని సుస్థలము లందుఁ¯ గాని పూజింపవలయు నక్కమలనాభు. (255) ధృత చిత్తుఁడు శాంతుండు ని¯ యత పరిభాషణుఁడు సుమహితాచారుఁడు వ¯ ర్ణిత హరిమంగళ గుణుఁడును¯ మితవన్యాశనుఁడు నగుచు మెలఁగఁగ వలయున్. (256) ఉత్తమశ్లోకుండగు పుండరీకాక్షుండు నిజమాయా స్వేచ్ఛావతార చరితంబుల చేత నచింత్యముగా నెద్దిచేయు నద్ది హృదయగతంబుగా ధ్యానంబు చేయం దగు; మఱియుఁ గార్యబుద్ధిం జేసి చేయంబడు పూజావిశేషంబులు వాసుదేవమంత్రంబున సర్వేశ్వరునికి సమర్పింప వలయు; నిట్లు మనోవాక్కాయ కర్మంబులచేత మనోగతం బగునట్లుగా భక్తి యుక్తంబు లయిన పూజల చేతఁ బూజింపం బడి, సర్వేశ్వరుండు మాయాభిభూతులు గాక సేవించు పురుషులకు ధర్మాది పురుషార్థంబులలోన నభిమతార్థంబు నిచ్చు; విరక్తుం డగువాఁడు నిరంతర భావం బయిన భక్తియోగంబునం జేసి మోక్షంబుకొఱకు భజియించు"నని చెప్పిన విని ధ్రువుండు నారదునకుం బ్రదక్షిణ పూర్వకంబుగా నమస్కరించి మహర్షి జనసేవ్యంబై సకలసిద్ధుల నొసంగుచు భగవత్పాద సరోజాలంకృతం బయిన మధువనంబునకుం జనియె; నంత. (257) పద్మభవ సూనుఁ డుత్తానపాదు కడకు¯ నరిగి యా రాజుచే వివిధార్చనముల¯ నంది సంప్రీతుఁడై యున్నతాసనమున¯ నెలమిఁ గూర్చుండి యాతని వలను చూచి. (258) ఇట్లనియె. (259) "భూనాయక! నీ విపుడా¯ మ్లానాస్యుఁడ వగుచుఁ జాల మదిలోఁ జింతం¯ బూనుట కేమి కతం?"బన¯ నా నారదుతోడ నాతఁ డనియెన్ మరలన్. (260) "మునివర! వివేకశాలియు¯ ననఘుఁడు నైదేండ్ల బాలుఁ డస్మత్ప్రియ నం¯ దనుఁ డదయుఁడ నగు నాచే¯ తను బరిభవ మొంది చనియెఁ దల్లియుఁ దానున్. (261) చని యుగ్రాటవిఁ జొచ్చి యచ్చటఁ బరిశ్రాంతుండు క్షుత్పీడితుం ¯ డును నామ్లాన ముఖాంబుజుండు ననఘుండున్ బాలకుం డైన మ¯ త్తనయున్ ఘోర వృ కాహి భల్ల ముఖ సత్త్వశ్రేణి నిర్జించెనో ¯ యని దుఃఖించెద నాదు చిత్తమున నార్యస్తుత్య! యిట్లౌటకున్. (262) అట్టి యుత్తమబాలు నా యంకపీఠ¯ మందుఁ గూర్చుండనీక నిరాకరించి¯ యంగనాసక్త చిత్తుండ నైనయట్టి¯ నాదు దౌరాత్మ్య మిది మునినాథచంద్ర!" (263) నా విని నారదుండు నరనాథున కిట్లను "నీ కుమారుఁ డా¯ దేవకిరీట రత్నరుచిదీపిత పాదసరోజుఁడైన రా¯ జీవదళాక్ష రక్షితుఁ డశేష జగత్పరికీర్తనీయ కీ¯ ర్తీవిభవప్రశస్త సుచరిత్రుఁడు; వానికి దుఃఖ మేటికిన్? (264) కావున నమ్మహాత్ముఁడు సుకర్మము చేత సమస్త లోకపా¯ లావళి కందరాని సముదంచిత నిత్యపదంబునం బ్రభు¯ శ్రీ విలసిల్లఁ జెందుఁ దులసీదళదాము భజించి; యా జగ¯ త్పావనుఁడైన నీ సుతు ప్రభావ మెఱుంగవు నీవు భూవరా! (265) అదియునుం గాక. (266) నీ కీర్తియు జగముల యం¯ దాకల్పము నొందఁజేయు నంచిత గుణర¯ త్నాకరుఁ డిట కేతెంచును¯ శోకింపకు మతనిఁ గూర్చి సుభగచరిత్రా!" (267) అని నారదుండు పలికిన¯ విని మనమున విశ్వసించి విభుఁడును బ్రియ నం¯ దనుఁ జింతించుచు నాదర¯ మునఁ జూడం డయ్యె రాజ్యమును బూజ్యముగన్. (268) అంత నక్కడ నా ధ్రువుండు. (269) చని ముందటఁ గనుఁగొనె మధు¯ వనమును ముని దేవ యోగి వర్ణిత గుణ పా¯ వనమును దుర్భవ జలద ప¯ వనమును నిఖిలైక పుణ్యవరభవనంబున్. (270) అట్లు గని డాయంజని యమునానదిం గృతస్నానుండై నియతుండును, సమాహిత చిత్తుండును నై సర్వేశ్వరుని ధ్యానంబు చేయుచుం బ్రతిత్రిరాత్రాంతంబునఁ గృత కపిత్థ బదరీఫల పారణుం డగుచు దేహ స్థితి ననుసరించి యిటుల నొక్కమాసంబు హరిం బూజించి, యంత నుండి యాఱేసి దినంబుల కొక్కపరి కృతజీర్ణ తృణ పర్ణాహారుం డగుచు, రెండవ మాసంబున విష్ణుసమారాధనంబు చేసి, యంత నుండి నవరాత్రంబుల కొకమా ఱుదకభక్షణంబు చేయుచు, మూఁడవ మాసంబున మాధవు నర్చించి, యంతనుండి ద్వాదశ దినంబుల కొకమాఱు వాయుభక్షణుం డగుచు, జితశ్వాసుండై నాలవ మాసంబునం, బుండరీకాక్షుని భజియించి, యంతనుండి మనంబున నలయక నిరుచ్ఛ్వాసుండై యేకపదంబున నిలిచి, పరమాత్మఁ జింతించుచు, నచేతనంబైన స్థాణువుంబోలె నైదవ మాసంబును జరిపె; నంత. (271) సకల భూతేంద్రి యాశయ మగు హృదయంబు¯ నందు విషయములఁ జెందనీక¯ మహదాది తత్త్వ సమాజమ్ములకును నా¯ ధార భూతమును బ్రధాన పూరు¯ షేశ్వరుఁ డైనట్టి శాశ్వత బ్రహ్మంబుఁ¯ దనదైన హృదయ పద్మమున నిలిపి¯ హరి రూపమున కంటె నన్యంబు నెఱుఁగక¯ చిత్త మవ్విభునందుఁ జేర్చియున్న (271.1) కతన ముల్లోకములు చాలఁ గంపమొందె; ¯ వెండియును బేర్చి యయ్యర్భకుండు ధరణి¯ నొక్కపాదంబు చేర్చి నిల్చున్నవేళఁ¯ బేర్చి యబ్బాలు నంగుష్టపీడఁ జేసి. (272) వసుమతీతల మర్ధము వంగఁ జొచ్చె¯ భూరిమద దుర్నివారణ వారణేంద్ర¯ మెడమఁ గుడి నొరగఁగ నడు గడుగునకును¯ జలన మొందు నుదస్థిత కలము వోలె. (273) అతఁడు ననన్యదృష్టిని జరాచర దేహిశరీర ధారణా¯ స్థితి గల యీశునందుఁ దన జీవితమున్ ఘటియింపఁ జేసి యే¯ కతఁ గనఁ దన్నిరోధమునఁ గైకొని కంపము నొందె నీశ్వరుం; ¯ డతఁడు చలింప నిజ్జగము లన్నియుఁ జంచల మయ్యె భూవరా! (274) ఆలోకభయంకర మగు¯ నా లోకమహావిపద్దశాలోకనులై¯ యా లోకపాలు రందఱు¯ నా లోకశరణ్యుఁ గాన నరిగిరి భీతిన్. (275) అట్లరిగి నారాయణు నుద్దేశించి కృతప్రణాములై కరంబులు ముకుళించి యిట్లనిరి. (276) "హరి! పరమాత్మ! కేశవ! చరాచర భూతశరీర ధారివై¯ పరఁగుదు వీవు; నిట్టులుగఁ బ్రాణనిరోధ మెఱుంగ మెందు ముం¯ దిరవుగ దేవదేవ! జగదీశ్వర! సర్వశరణ్య! నీ పదాం¯ బురుహము లర్థిమై శరణు బొందెద మార్తి హరించి కావవే!" (277) అని దేవతలు విన్నవించిన నీశ్వరుండు వారల కిట్లనియె “నుత్తానపాదుం డనువాని తనయుండు విశ్వరూపుండ నయిన నా యందుఁ దన చిత్తం బైక్యంబు చేసి తపంబు గావించుచుండ, దానంజేసి భవదీయ ప్రాణనిరోధం బయ్యె; నట్టి దురత్యయం బైన తపంబు నివర్తింపఁ జేసెద వెఱవక మీమీ నివాసంబులకుం జనుం” డని యానతిచ్చిన నా దేవతలు నిర్భయాత్ములై యీశ్వరునకుఁ బ్రణామంబు లాచరించి త్రివిష్టపంబునకుం జనిరి; తదనంతరంబ. (278) హరి యీశ్వరుండు విహంగ కులేశ్వర¯ యానుఁడై నిజభృత్యుఁడైన ధ్రువునిఁ¯ గనుఁగొను వేఁడుక జనియింప నా మధు¯ వనమున కప్పుడు చని ధ్రువుండు¯ పరువడి యోగవిపాక తీవ్రంబైన¯ బుద్దిచే నిజమనోంబురుహ ముకుళ¯ మందుఁ దటిత్ప్రభాయత మూర్తి యటఁ దిరో¯ ధానంబునను బొంది తత్క్షణంబ (278.1) తన పురోభాగమందు నిల్చినను బూర్వ¯ సమధికజ్ఞాన నయన గోచర సమగ్ర¯ మూర్తిఁ గనుఁగొని సంభ్రమమునను సమ్మ¯ దాశ్రువులు రాలఁ బులకీకృతాంగుఁ డగుచు (279) నయనముల విభుమూర్తిఁ బానంబు చేయు¯ పగిదిఁ దన ముఖమునను జుంబనము చేయు¯ లీలఁ దగ భుజములను నాలింగనంబు¯ చేయుగతి దండవన్నమస్కృతు లొనర్చె. (280) ఇట్లు దండప్రణామంబు లాచరించి కృతాంజలి యై స్తోత్రంబు చేయ నిశ్చయించియు స్తుతిక్రియాకరణ సమర్థుండుఁ గాక యున్న ధ్రువునకును సమస్త భూతంబులకు నంతర్యామి యైన యీశ్వరుం డాతని తలంపెఱింగి వేదమయం బయిన తన శంఖంబు చేత నబ్బాలుని కపోలతలం బంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుండును, భక్తిభావ నిష్ఠుండును నగు ధ్రువుండు నిఖిలలోక విఖ్యాత కీర్తిగల యీశ్వరుని భగవత్ప్రతిపాదితంబు లగుచు వేదాత్మకంబులైన తన వాక్కుల నిట్లని స్తుతియించె “దేవా! నిఖిలశక్తి ధరుండవు నంతఃప్రవిష్టుండవు నైన నీవు లీనంబు లైన మదీయ వాక్యంబులం బ్రాణేంద్రియంబులం గరచరణ శ్రవణత్వ గాదులను జిచ్ఛక్తిచేఁ గృపంజేసి జీవింపం జేసిన భగవంతుం డవును, బరమపురుషుండవును నైన నీకు నమస్కరింతు; నీ వొక్కరుండవయ్యు మహదాద్యంబైన యీ యశేష విశ్వంబు మాయాఖ్యం బయిన యా త్మీయశక్తిచేతం గల్పించి యందుం బ్రవేశించి యింద్రియంబు లందు వసించుచుఁ దత్తద్దేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారువు లందున్న వహ్ని చందంబునం బ్రకాశింతు; వదియునుం గాక. (281) వరమతి నార్తబాంధవ! భవద్ఝన బోధసమేతుఁడై భవ¯ చ్చరణముఁ బొంది నట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమం¯ దరయఁగఁ జూచురీతిఁ గనునట్టి ముముక్షు శరణ్యమైన నీ¯ చరణములం గృతజ్ఞుఁడగు సజ్జనుఁ డెట్లు దలంపకుండెడున్? (282) మహితాత్మ! మఱి జన్మమరణ ప్రణాశన¯ హేతు భూతుండవు నిద్ధకల్ప¯ తరువవు నగు నిన్నుఁ దగనెవ్వరే నేమి¯ పూని నీ మాయా విమోహితాత్ము¯ లగుచు ధర్మార్థ కామాదుల కొఱకుఁ దా¯ మర్చించుచును ద్రిగుణాభమైన¯ దేహోపభోగ్యమై దీపించు సుఖముల¯ నెనయంగ మదిలోన నెంతు; రట్టి (282.1) విషయ సంబంధ జన్యమై వెలయు సుఖము¯ వారికి నిరయమందును వఱలు దేవ! ¯ భూరి సంసార తాప నివార గుణ క¯ థామృతాపూర్ణ! యీశ! మాధవ! ముకుంద! (283) అరవిందోదర! తావకీన చరణధ్యానానురాగోల్లస¯ చ్చరితాకర్ణనజాత భూరిసుఖముల్ స్వానందకబ్రహ్మ మం¯ దరయన్ లేవఁట; దండ భృద్భట విమానాకీర్ణులై కూలు నా¯ సురలోకస్థులఁ జెప్పనేల? సుజనస్తోమైక చింతామణీ! (284) హరి! భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై¯ వఱలిన భక్తియుక్తు లగువారల సంగతిఁ గల్గఁజేయు స¯ త్పురుష సుసంగతిన్ వ్యసనదుస్తర సాగర మప్రయత్నతన్¯ సరస భవత్కథామృత రసంబున మత్తుఁడనై తరించెదన్. (285) నిరతముఁ దావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి నె¯ వ్వరి మది వొందఁగాఁ గలుగు, వారలు తత్ప్రియ మర్త్యదేహముం¯ గరము తదీయ దార సుత కామ సుహృద్గృహ బంధు వర్గమున్¯ మఱతురు విశ్వతోముఖ! రమాహృదయేశ! ముకుంద! మాధవా! (286) పరమాత్మ! మర్త్య సుపర్వ తిర్యఙ్మృగ¯ దితిజ సరీసృప ద్విజగణాది¯ సంవ్యాప్తమును సదసద్విశేషంబును¯ గైకొని మహదాది కారణంబు¯ నైన విరాడ్విగ్రహంబు నే నెఱుఁగుఁదుఁ¯ గాని తక్కిన సుమంగళమునైన¯ సంతత సుమహితైశ్వర్య రూపంబును¯ భూరిశబ్దాది వ్యాపార శూన్య (286.1) మైన బ్రహ్మస్వరూప మే నాత్మ నెఱుఁగఁ ¯ బ్రవిమలాకార! సంసారభయవిదూర! ¯ పరమమునిగేయ! సంతతభాగధేయ! ¯ నళిననేత్ర! రమాలలనాకళత్ర! (287) సర్వేశ! కల్పాంత సమయంబు నందు నీ¯ యఖిల ప్రపంచంబు నాహరించి¯ యనయంబు శేషసహాయుండవై శేష¯ పర్యంక తలమునఁ బవ్వళించి¯ యోగనిద్రా రతి నుండి నాభీసింధు¯ జస్వర్ణలోక కంజాత గర్భ¯ మందుఁ జతుర్ముఖు నమరఁ బుట్టించుచు¯ రుచి నొప్పు బ్రహ్మస్వరూపి వైన (287.1) నీకు మ్రొక్కెద నత్యంత నియమ మొప్ప¯ భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర! ¯ చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! ¯ యవ్యయానంద! గోవింద! హరి! ముకుంద! (288) అట్లు యోగనిద్రా పరవశుండ వయ్యును జీవులకంటె నత్యంత విలక్షణుండ వై యుండుదు; వది యెట్లనిన బుద్ధ్యవస్థాభేదంబున నఖండితం బయిన స్వశక్తిం జేసి చూచు లోకపాలన నిమిత్తంబు యజ్ఞాధిష్ఠాతవు గావున నీవు నిత్యముక్తుండవును, బరిశుద్ధుండవును, సర్వజ్ఞుండవును, నాత్మవును, గూటస్థుండవును, నాదిపురుషుండవును, భగవంతుండవును, గుణత్రయాధీశ్వరుండవును నై వర్తింతువు; భాగ్యహీనుండైన జీవుని యందు నీ గుణంబులు గలుగవు; ఏ సర్వేశ్వరునం దేమి విరుద్ధగతులై వివిధ శక్తి యుక్తంబు లైన యవిద్యాదు లానుపూర్వ్యంబునం జేసి ప్రలీనంబు లగుచుం; డట్టి విశ్వకారణంబు నేకంబు ననంతంబు నాద్యంబు నానందమాత్రంబు నవికారంబు నగు బ్రహ్మంబునకు నమస్కరించెద; మఱియు దేవా! నీవ సర్వవిధఫలం బని చింతించు నిష్కాము లయినవారికి రాజ్యాదికామితంబులలోనఁ బరమార్థం బయిన ఫలంబు సర్వార్థరూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబ; నిట్లు నిశ్చితంబ యైనను సకాములయిన దీనులను గోవు వత్సంబును స్తన్యపానంబు చేయించుచు, వృకాది భయంబు వలన రక్షించు చందంబునం గామప్రదుండవై సంసార భయంబు వలన బాపుదు;” వని యిట్లు సత్యసంకల్పుండును, సుజ్ఞానియు నయిన ధ్రువునిచేత వినుతింపంబడి భృత్యానురక్తుం డైన భగవంతుండు సంతుష్టాంతరంగుండై యిట్లనియె. (289) "ధీరవ్రత! రాజన్య కు¯ మారక! నీ హృదయమందు మసలిన కార్యం¯ బారూఢిగా నెఱుంగుదు¯ నారయ నది వొందరాని దైనను నిత్తున్. (290) అది యెట్టి దనిన నెందేని మేధియందుఁ బరిభ్రామ్యమాణ గోచక్రంబునుం బోలె గ్రహనక్ష త్రతారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబు లయిన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును, దారకా సమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదు; రట్టి దురాపంబును ననన్యాధిష్ఠితంబును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నిరువది యాఱువేలేండ్లు చనం బ్రాపింతువు; తత్పద ప్రాప్తిపర్యంతంబు భవదీయ జనకుండు వనవాస గతుండైనం దద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మమార్గంబున జితేంద్రియుండవై చేయుదువు; భవదనుజుం డగు నుత్తముండు మృగయార్థంబు వనంబునకుం జని మృతుం డగు; తదన్వేషణార్థంబు తదాహిత చిత్త యై తన్మాతయు వనంబునకుం జని యందు దావదహన నిమగ్న యగు; వెండియు. (291) అనఘాత్మ! మఱి నీవు యజ్ఞరూపుం డనఁ¯ దగు నన్ను సంపూర్ణ దక్షిణంబు¯ లగు మఖంబులచేత నర్చించి సత్యంబు¯ లగు నిహసౌఖ్యంబు లనుభవించి¯ యంత్యకాలమున నన్నాత్మఁ దలంచుచు¯ మఱి సర్వలోక నమస్కృతమును¯ మహిఁ బునరావృత్తి రహితంబు సప్తర్షి¯ మండలోన్నత మగు మామకీన (291.1) పదము దగఁ బొందఁగల"వని పరమపురుషుఁ¯ డతని యభిలషితార్థంబు లర్థి నిచ్చి¯ యతఁడు గనుఁగొను చుండంగ నాత్మపురికి¯ గరుడగమనుఁడు వేంచేసెఁ గౌతుకమున. (292) అంత ధ్రువుఁడునుఁ బంకేరుహాక్ష పాద¯ కమల సేవోపపాదిత ఘన మనోర¯ థములఁ దనరియుఁ దనదు చిత్తంబులోనఁ¯ దుష్టిఁ బొందక చనియె విశిష్టచరిత!" (293) అని మైత్రేయుఁడు ధ్రువుఁ డ¯ ట్లనయము హరిచేఁ గృతార్థుఁడైన విధం బె¯ ల్లను వినిపించిన విదురుఁడు¯ విని మునివరుఁ జూచి పలికె వినయం బెసఁగన్. (294) "మునినాయక! విను కాముక¯ జనదుష్ప్రాపంబు విష్ణు చరణాంబురుహా¯ ర్చన మునిజన సంప్రాప్యము¯ ననఁగల పంకేరుహాక్షు నవ్యయ పదమున్. (295) పెక్కు జన్మంబులం గాని పొందరాని పదంబు దా నొక్క జన్మంబుననే పొందియుం దన మనంబునం దప్రాప్త మనోరథుండ నని పురుషార్థవేది యైన ధ్రువుం డెట్లు దలంచె” ననిన మైత్రేయుం డిట్లనియె (296) "అనఘ! పినతల్లి దన్నుఁ బల్కిన దురుక్తి¯ బాణవిద్ధాత్ముఁ డగుచుఁ దద్భాషణములు¯ చిత్తమందుఁ దలంచుటఁ జేసి ముక్తిఁ¯ గోరమికి నాత్మలో వగఁ గూరుచుండె. (297) అంత నా ధ్రువుండు. (298) అనఘ! జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందనాదు లెం¯ దనయ మనేక జన్మ సముపార్జిత యోగ సమాధిఁ జేసి యె¯ వ్వని చరణారవిందములు వారని భక్తి నెఱుంగుచుందు; రా¯ ఘనుఁ బరమేశు నీశు నవికారు నమేయు నజేయు నాద్యునిన్. (299) ఏను షణ్మాసంబులు భజియించి తత్పాదపద్మ చ్ఛాయం బ్రాపించియు భేదదర్శనుండ నైతి; నక్కటా! యిట్టి భాగ్యహీనుండనైన యేను భవనాశకుండైన యతనిం బొడఁగనియు నశ్వరంబులైన కామ్యంబు లడిగితి; నిట్టి దౌరాత్మ్యం బెందేనిం గలదే? తమ పదంబులకంటె నున్నత పదంబు నొందుదునో యని సహింపంజాలని యీ దేవతలచేత మదీయ మతి గలుషితం బయ్యెం గాక; నాఁడు నారదుం డాడిన మాట తథ్యం బయ్యె; నతని వాక్యంబు లంగీకరింపక యే నసత్తముండనై స్వప్నావస్థలం బొందినవాఁడు దైవికంబైన మాయంజెంది భిన్న దర్శనుండగు చందంబున నే నద్వితీయుండ నైనను, భ్రాత యను శత్రువుచేఁ బ్రాప్తం బైన దుఃఖంబు నొంది జగదాత్మకుండును, సుప్రసాదుండును, భవనాశకుండును నైన యీశ్వరు నారాధించి తత్ప్రసాదంబు బడసియు నాయుర్విహీనుం డైన రోగికిం బ్రయోగించు నౌషధంబుం బోలె నిరర్థకంబులైన, నశ్వరంబులైన, యీ కామితంబులు గోరితి” నని; వెండియు. (300) "ధనహీనుండు నృపాలుఁ జేరి మిగులన్ ధాటిన్ ఫలీకార మి¯ మ్మని యర్థించినరీతి ముక్తిఫలదుం డై నట్టి పంకేజలో¯ చనుఁ డే చాలఁ బ్రసన్నుఁడైన నతనిన్ సాంసారికం బర్థిఁ గో¯ రిన నావంటి విమూఢమానసులు ధాత్రిం గల్గిరే యెవ్వరున్?"

ధ్రువుండు మరలివచ్చుట

(301) అని యిట్లు చింతించె"ననుచు నమ్మైత్రేయ¯ ముని విదురునకు నిట్లనియెఁ "దండ్రి! ¯ కమనీయ హరిపాద కమల రజోభి సం¯ స్కృత శరీరులును యాదృచ్ఛికముగ¯ సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై¯ వఱలుచు నుండు మీవంటి వారు¯ దగ భగవత్పాద దాస్యంబు దక్కంగ¯ నితర పదార్థంబు లెడఁద లందు" (301.1) మఱచియును గోర నొల్లరు మనుచరిత్ర! ¯ తవిలి యిట్లు హరిప్రసాదంబు నొంది¯ మరలి వచ్చుచునున్న కుమారు వార్తఁ¯ జారుచే విని యుత్తానచరణుఁ డపుడు. (302) మనమున నిట్లని తలంచె. (303) చచ్చిన వారలుఁ గ్రమ్మఱ¯ వచ్చుటయే కాక యిట్టి వార్తలు గలవే? ¯ నిచ్చలు నమంగళుఁడ నగు¯ నిచ్చట మఱి నాకు శుభము లేల ఘటించున్. (304) అని విశ్వసింపకుండియు¯ మనమున నా నారదుఁడు గుమారుఁడు వేగం¯ బునఁ రాఁగలఁ డనుచును బలి¯ కిన పలుకులు దలఁచి నమ్మి కృతకృత్యుండై. (305) తన సుతుని రాక చెప్పిన¯ ఘనునకు ధనములును మౌక్తికపు హారములున్¯ మన మలర నిచ్చి తనయునిఁ¯ గనుఁగొను సంతోష మాత్మఁ గడలుకొనంగన్ (306) వలను మీఱిన సైంధవంబులఁ బూన్చిన¯ కనక రథంబు నుత్కంఠ నెక్కి ¯ బ్రాహ్మణ కుల వృద్ధ బంధు జనామాత్య¯ పరివృతుం డగుచు విస్ఫురణ మెఱసి ¯ బ్రహ్మనిర్ఘోష తూర్యస్వన శంఖ కా¯ హళ వేణు రవము లందంద చెలఁగ¯ శిబిక లెక్కియు విభూషితలై సునీతి సు¯ రుచు లుత్తముండు నారూఢి నడువ (306.1) గరిమ దీపింప నతిశీఘ్రగమన మొప్ప¯ నాత్మనగరంబు వెలువడి యరుగుచుండి¯ బలసి నగరోపవన సమీపంబు నందు¯ వచ్చు ధ్రువుఁ గని మేదినీశ్వరుఁడు నంత. (307) అరదము డిగ్గి ప్రేమ దొలఁకాడ ససంభ్రముఁడై రమామనో¯ హరు చరణారవింద యుగళార్చన నిర్దళితాఖి లాఘు నీ¯ శ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతుం¯ గర మనురక్తి డాసి పులకల్ ననలొత్తఁ బ్రమోదితాత్ముఁడై. (308) బిగియఁ గౌఁగిటఁ జేర్చి నెమ్మొగము నివిరి¯ శిరము మూర్కొని చుబుకంబు చేతఁ బుణికి¯ యవ్యయానంద బాష్ప ధారాభిషిక్తుఁ¯ జేసి యాశీర్వదింప నా చిరయశుండు. (309) జనకుని యాశీర్వచనము¯ లనయముఁ గైకొని ప్రమోదియై తత్పదముల్¯ దన ఫాలతలము సోఁకఁగ¯ వినతులు గావించి భక్తి విహ్వలుఁ డగుచున్. (310) అంత నా సజ్జనాగ్రణి యైన ధ్రువుఁడు¯ దల్లులకు భక్తి వినతులు దగ నొనర్చి¯ సురుచికిని మ్రొక్క నర్భకుఁ జూచి యెత్తి¯ నగు మొగంబున నాలింగనంబు చేసి. (311) కరమొప్ప నానంద గద్గద స్వరమున¯ జీవింపు మనుచు నాశీర్వదించె; ¯ భగవంతుఁ డెవ్వనిపై మైత్రి పాటించు¯ సత్కృపానిరతిఁ బ్రసన్నుఁ డగుచు¯ నతనికిఁ దమయంత ననుకూలమై యుండు¯ సర్వభూతంబులు సమతఁ బేర్చి¯ మహిఁ దలపోయ నిమ్నప్రదేశములకు¯ ననయంబుఁ జేరు తోయముల పగిది (311.1) గాన ఘను నమ్మహాత్ముని గారవించె¯ సురుచి పూర్వంబు దలఁపక సుజనచరిత! ¯ విష్ణుభక్తులు ధరను బవిత్రు లగుట¯ వారి కలుగరు ధరణి నెవ్వారు మఱియు. (312) కావున నుత్తముండును ధ్రువుండును బ్రేమ విహ్వలు లగుచు నన్యో న్యాలింగితులై పులకాంకురాలంకృత శరీరులై యానంద బాష్పముల నొప్పి; రంత సునీతియుం దన ప్రాణంబులకంటెఁ బ్రియుండైన సుతు నుపగూహనంబు చేసి తదవయవ స్పర్శనంబు చేత నానందంబు నొంది విగతశోక యయ్యె; నప్పుడు సంతోష బాష్ప ధారాసిక్తంబులై చనుఁబాలునుం గురిసె నంత. (313) ఉన్నత సంతోష ముప్పతిల్లఁగఁ బౌర¯ జనము లా ధ్రువుతల్లి నెనయఁ జూచి¯ "తొడరిన భవదీయ దుఃఖనాశకుఁ డైన¯ యిట్టి తనూజుఁ డెందేని పెద్ద¯ కాలంబు క్రిందటఁ గడఁగి నష్టుం డైన¯ వాఁడిప్డు నీ భాగ్యవశము చేతఁ ¯ బ్రతిలబ్ధుఁ డయ్యెను; నితఁడు భూమండల¯ మెల్లను రక్షించు నిద్ధమహిమ; (313.1) కమల లోచనుఁ జింతించు ఘనులు లోక¯ దుర్జయం బైన యట్టి మృత్యువును గెల్తు; ¯ రట్టి ప్రణతార్తి హరుఁడైన యబ్జనాభుఁ¯ డర్థి నీచేతఁ బూజితుం డగుట నిజము." (314) అని ప్రశంసించి; రట్లు పౌరజనంబులచేత నుపలాల్య మానుండగు ధ్రువుని నుత్తానపాదుం డుత్తమ సమేతంబుగా గజారూఢునిం జేసి సంస్తూయమానుండును, ప్రహృష్టాంతరంగుండును నగుచుఁ బురాభిముఖుండై చనుదెంచి. (315) స్వర్ణ పరిచ్ఛదస్వచ్ఛకుడ్యద్వార¯ లాలిత గోపురాట్టాలకంబు; ¯ ఫల పుష్ప మంజరీ కలిత రంభా స్తంభ¯ పూగ పోతాది విభూషితంబు; ¯ ఘన సార కస్తూరికా గంధ జలబంధు¯ రాసిక్త విపణి మార్గాంచితంబు; ¯ మానిత నవరత్న మయ రంగవల్లీ వి¯ రాజిత ప్రతి గృహ ప్రాంగణంబు; (315.1) శుభ నదీజల కుంభ సంశోభితంబు; ¯ తండులస్వర్ణలాజాక్షతప్రసూన¯ ఫల బలివ్రాత కలిత విభ్రాజితంబు; ¯ నగుచు సర్వతోలంకృత మైన పురము. (316) ప్రవేశించి రాజమార్గంబునఁ జనుదెంచు నప్పుడు. (317) హరిమధ్యల్ పురకామినీ తతులు సౌధాగ్రంబులందుండి భా¯ స్వర సిద్ధార్థ ఫలాక్షతప్రసవ దూర్వావ్రాత దధ్యంబువుల్¯ కరవల్లీ మణి హేమ కంకణ ఝణత్కారంబు శోభిల్లఁ జ¯ ల్లిరి యా భాగవతోత్తమోత్తమునిపై లీలాప్రమేయంబుగన్. (318) ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణి దీప నీరాజనంబుల నివాళింపం బౌర జానపద మిత్రామాత్య బంధుజన పరివృతుండై చనుదెంచి. (319) కాంచన మయ మరకత కుడ్య మణిజాల¯ సంచయ రాజిత సౌధములను¯ వరసుధాఫేన పాండుర రుక్మ పరికరో¯ దాత్త పరిచ్ఛదతల్పములను¯ సురతరు శోభిత శుక పిక మిథునాళి¯ గాన విభాసి తోద్యానములను¯ సుమహిత వైడూర్య సోపాన విమల శో¯ భిత జలపూర్ణ వాపీచయముల (319.1) వికచ కహ్లార దర దరవింద కైర¯ వప్రదీపిత బక చక్రవాక రాజ¯ హంస సారస కారండవాది జల వి¯ హంగ నినదాభిరామ పద్మాకరముల. (320) మఱియును. (321) చారు బహువిధ వస్తు విస్తార మొప్ప¯ నంగనాయుక్త మగుచుఁ బెం పగ్గలించి¯ యర్థిఁ దనరారు జనకుగృహంబు చొచ్చె¯ నెలమిఁ ద్రిదివంబు చొచ్చు దేవేంద్రు పగిది. (322) ఇట్లు ప్రవేశించిన రాజర్షి యైన యుత్తానపాదుండు సుతుని యాశ్చర్యకరంబైన ప్రభావంబు వినియుం జూచియుం మనంబున విస్మయంబు నొంది ప్రజానురక్తుండును, బ్రజాసమ్మతుండును, నవయౌవ్వన పరిపూర్ణుండును నైన ధ్రువుని రాజ్యాభిషిక్తుం జేసి వృద్ధవయస్కుండైన తన్నుఁదాన యెఱింగి యాత్మగతిఁ బొంద నిశ్చయించి విరక్తుండై వనంబునకుం జనియె; నంత నా ధ్రువుండు శింశుమార ప్రజాపతి కూఁతురైన భ్రమి యను దాని వివాహంబై దానివలనఁ గల్ప, వత్సరు లను నిద్దఱు గొడుకులం బడసి; వెండియు వాయుపుత్రియైన యిల యను భార్య యందు నుత్కల నామకుఁడైన కొడుకు నతి మనోహర యైన కన్యకారత్నంబునుం గనియె; నంత దద్భ్రాత యైన యుత్తముండు వివాహంబు లేకుండి మృగయార్థంబు వనంబున కరిగి హిమవంతంబున యక్షునిచేత హతుండయ్యె; నతని తల్లియుఁ దద్దుఃఖంబున వనంబున కేఁగి యందు గహనదహనంబున మృతిం బొందె; ధ్రువుండు భ్రాతృమరణంబు విని కోపామర్షశోకవ్యాకులిత చిత్తుండై జైత్రంబగు రథంబెక్కి యుత్తరాభిముఖుండై చని హిమవద్ద్రోణి యందు భూతగణ సేవితంబును గుహ్యక సంకులంబును నైన యలకాపురంబు బొడగని యమ్మహానుభాహుండు.