పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : తృతీయ 181-270

విదుర మైత్రేయ సంవాదంబు

(181) ఇట్లు గనుంగొని యమ్మునీంద్రుని పాదంబులకుం బ్రణమిల్లి ముకుళిత హస్తుండై యిట్లనియె "మునీంద్రా! లోకంబున సకల జనంబులు మనంబుల ఘనంబులగు సౌఖ్యంబు లందందలంచి తత్ఫలప్రాప్తి హేతువులైన కర్మంబు లాచరించి దైవోపహతులై తత్కర్మంబులచేత నిష్ఫలారంభు లగుదురు; కర్మంబులు బంధకంబులును దుఃఖ హేతువులునుం గాని సౌఖ్యదాయకంబులై పాపనివృత్తిఁ జేయనోపవు; అదియట్లుండె; భూరి దుఃఖానుసారంబైన సంసారచక్రంబు నందుఁ బరిభ్రమించుచుం గామ విమోహితులై పూర్వకర్మానుగతంబులైన శరీరంబులుఁ దాల్చుచుం జచ్చుచు మరలం బుట్టుచు నెంతకాలంబునకుం బాపనివృత్తిఁ గానక మాతృయౌవనవనకుఠారులై జనియించి వర్తించు మూఢాత్ములం బశుప్రాయుల రక్షించుకొఱకుఁ గాదె నారాయణపరాయణులైన మీవంటి పుణ్యాత్ములు లోకంబునం జరియించుట; అదియునుంగాక. (182) అవివేకానుగతస్వకార్యజలవేలాకీర్ణమై మిత్రబం¯ ధువధూపుత్రజలగ్రహోగ్రయుతమై దుర్దాంతసంసార దు¯ ర్భవపాథోధిఁ దరించువారె? హరిసంబంధక్రియాలోల భా¯ గవతానుగ్రహనావ లేని యధముల్ కారుణ్యసంధాయకా! (183) మునినాథచంద్ర! ననుఁ గై¯ కొని కాచు తలంపు బుద్ధిఁ గూడిన యేనిన్¯ వినుము; మదీప్సిత మది నా¯ చనువునఁ గావింపవయ్య! సజ్జనతిలకా! " (184) అని వెండియు విదురుండు మైత్రేయుం జూచి "మునీంద్రా! త్రిగుణాత్మక మాయానియంత యగు భగవంతుండు స్వతంత్రుం డయ్యు నవతరించి యేయే యవతారంబుల నేయే కర్మంబు లాచరించె? అదియు నిష్క్రియుం డగు నీశుండు మొదలం బ్రపంచంబు నేవిధంబునం గల్పించె? ఏ పగిదిం బాలించె? మఱియు నీ విశ్వంబు నాత్మీయ హృదయాకాశగతముం జేసి నివృత్తవృత్తి యగుచు యోగమాయ యం దెట్లు వసియించె? బ్రహ్మాదిరూపంబులం బొంది బహుప్రకారంబుల నెట్లు క్రీడించె? భూసుర గోసురాదులఁ బరిరక్షించుటకై మత్స్యాద్యవతారంబులు ధరియించి యేయే ప్రయోజనంబులం దీర్చె? పయోరుహగర్భాండకటాహాంతర్గతంబులై లోకపాలసహితంబులైన లోకంబులను, లోకాలోకపర్వతంబులను, బహిర్భాగంబులను నేయే తత్త్వభేదంబుల ముఁ నెత్తఱంగునఁ బుట్టించె? అందుఁ బ్రతీతంబగు జీవకోటి యెవ్వనిం గొల్చి బ్రతుకు? జనులకుఁ గర్మనామరూపభేదంబు లెట్లు నిర్దేశించె? నింతయు సవిస్తారంబుగా వివరింపుము; ఉత్తమశ్లోకమౌళిమండనుండును యోగీశ్వరేశ్వరుండును నైన పుండరీకాక్షుని చరిత్రశ్రవణంబునం గాని జన్మమరణాది సకలదుఃఖకరంబులును దుష్కర్మప్రాప్తంబులును నగు భవబంధంబులు దెగవు;"అని వెండియు నిట్లనియె. (185) "సతతమున్ సరసీరుహోదరసత్కథామృతపూరమున్¯ శ్రుతిపుటాంజలిచేత నిమ్ముల జుఱ్ఱియుం దనివోదు భా¯ రతకథామిష మూని విష్ణుఁ బరాశరప్రియసూతి స¯ న్మతి నుతించిన చోట సన్మునినాథ! నామది నుబ్బుదున్. (186) ఇతర కథావర్ణనముల¯ నతి హేయత నొందె జిత్త మనఘాత్మ! రమా¯ పతి చరితామృతరతి సం¯ సృతివేదన లెల్లఁ బాయఁజేయు మునీంద్రా! (187) భూరివిజ్ఞాననిధు లగు నారదాది¯ నిర్మలాత్ముల కయిన వర్ణింపరాని¯ హరికథామృతపానంబు నందు విసివి¯ యొల్ల ననువాఁడె పో వెఱ్ఱిగొల్లఁ డనఁగ. (188) అదియునుంగాక. (189) అరవిందనాభుని యపరావతారమై¯ జనన మందిన పరాశరసుతుండు¯ చతురవర్ణాశ్రమాచారధర్మంబులు¯ ఠవణింప లోకవిడంబనంబు¯ లగు గ్రామ్యకథలు పెక్కర్థిఁ గల్పించుచు¯ హరికథావర్ణనమందులోన¯ నించుకించుకగాని యేర్పడఁ జెప్పమి¯ నంచిత విజ్ఞాన మాత్మ నిలువ (189.1) కున్నఁ జింతించి మఱి నారదోపదిష్టుఁ¯ డగుచు హరివర్ణనామృత మాత్మఁ గ్రోలి¯ విమలసుజ్ఞాననిధి యన వినుతికెక్కి¯ ధన్యుఁ డయ్యెను లోకైకమాన్యుఁ డగుచు. (190) కావున. (191) సరసిరుహోదరు మంగళ¯ చరితామృత మాత్మఁ గ్రోలు జనుఁ డితర కథా¯ గరళముఁ గ్రోలునె హరిసం¯ స్మరణము జీవులకు నఖిల సౌఖ్యద మనఘా! (192) శ్రీవనితాధిప నామక¯ థావిముఖుల కిహముఁ బరము దవ్వై పిదపం¯ బోవుదురు నరకమునకున్¯ వావిరి నే వారిఁ జూచి వగతు మునీంద్రా! (193) ఏ నరుఁడే నొక నిమిషం¯ బైన వృథావాదగతిని హరిపదకమల¯ ధ్యానానందుఁడు గాడే¯ నా నరునకు నాయు వల్ప మగు మునినాథా! (194) మృదుగతిఁ బువ్వుదేనియ రమించుచుఁ బానముసేయఁ బాఱు ష¯ ట్పదమునుఁ బోలి యార్తజనబాంధవు విశ్వభవస్థితివ్యయా¯ స్పదమహితావతారుఁ డగు పంకరుహోదరు నిత్యమంగళ¯ ప్రదగుణకీర్తనామృతముఁ బాయకఁ గ్రోలెదఁ జెప్పవే దయన్." (195) అని విదురుఁడు మైత్రేయుం¯ డను మునినాయకుని నడిగె నని వేదవ్యా¯ సునితనయుం డభిమన్యుని¯ తనయునకుం జెప్పి మఱియుఁ దగ నిట్లనియెన్. (196) ఇట్లు విదురుండు మైత్రేయు నడిగిన నతం డతనిం గని యతి మృదు మధురవచనరచనుండై యిట్లనియె "అనఘా! కృష్ణకథాశ్రవణ తత్పరుండవై నీవు నన్నడిగితివి గావున భద్రంబయ్యె; నీవు భగవద్భక్తుండవు గావున హరికథాసక్తుండ వగుట విచిత్రంబుగాదు; అదియునుంగాక మాండవ్యుశాపంబున సాత్యవతేయువలన భాతృక్షేత్రంబున శూద్రయోనింబుట్టినట్టి ప్రజాసంయమనుండవగు యముండవు పరమ జ్ఞానసంపన్నుండవు నారాయణునకుం బ్రియతముండవు గావునఁ గృష్ణుండు నిర్యాణకాలంబునం దన సన్నిధికిం జనిన నన్ను డాయంజీరి విజ్ఞానం బెల్ల నుపదేశించి నీకు నెఱింగింపు మని యానతిచ్చుటంజేసి యవశ్యంబును నీకు నెఱింగింతు దత్తావధానుండవై వినుము.

జగదుత్పత్తి లక్షణంబు

(197) వనజాక్షయోగమాయా¯ జనితం బగు విశ్వజననసంస్థానవినా¯ శనముల తెఱఁ గెఱిఁగించుచు¯ ననఘా! విష్ణుని మహత్త్వ మభివర్ణింతున్. (198) సకలజీవుల కెల్లఁ బ్రకట దేహము నాత్మ¯ నాథుండుఁ బరుఁడు నానావిధైక¯ మత్యుపలక్షణమహితుండు నగు భగ¯ వంతుండు సృష్టిపూర్వంబు నందు¯ నాత్మీయమాయ లయంబు నొందిన విశ్వ¯ గర్భుఁడై తాన యొక్కటి వెలుంగు¯ పరమాత్ముఁ డభవుం డుపద్రష్ట యయ్యు వ¯ స్త్వంతర పరిశూన్యుఁ డగుటఁ జేసి (198.1) ద్రష్ట గాకుండు మాయాప్రధానశక్తి¯ నతుల చిచ్ఛక్తి గలవాఁడు నగుచుఁ దన్ను¯ లేనివానిఁగఁ జిత్తంబులోనఁ దలఁచి ¯ ద్రష్ట యగుఁ దన భువననిర్మాణవాంఛ. (199) బుద్ధిఁ దోచిన నమ్మహాపురుషవరుఁడు¯ కార్యకారణరూపమై ఘనతకెక్కి¯ భూరిమాయాభిధాన విస్ఫురతశక్తి¯ వినుతికెక్కిన యట్టి యవిద్య యందు. (200) పురుషాకృతి నాత్మాంశ¯ స్ఫురణము గల శక్తి నిలిపి పురుషోత్తముఁ డీ¯ శ్వరుఁ డభవుం డజుఁడు నిజో¯ దరసంస్థిత విశ్వ మపుడుఁ దగఁ బుట్టించెన్.

మహదాదుల సంభవంబు

(201) ధృతిఁ బూని కాలచోదితము నవ్యక్తంబుఁ¯ బ్రకృతియు నని పేళ్ళఁ బరగు మాయ¯ వలన మహత్తత్త్వ మెలమిఁ బుట్టించె మా¯ యాంశ కాలాది గుణాత్మకంబు¯ నైన మహత్తత్త్వ మచ్యుత దృగ్గోచ¯ ర మగుచు విశ్వనిర్మాణవాంఛ¯ నందుటఁ జేసి రూపాంతరంబునఁ బొందె¯ నట్టి మహత్తత్త్వ మందు నోలిఁ (201.1) గార్యకారణ కర్త్రాత్మకత్వ మైన¯ మహిత భూతేంద్రియక మనోమయ మనంగఁ¯ దగు నహంకారతత్త్వ ముత్పన్న మయ్యెఁ¯ గోరి సత్త్వరజస్తమోగుణక మగుచు. (202) వెండియు; రూపాంతరంబులం బొందుచున్న సాత్త్వికాహంకారంబు వలన మనంబును, వైకారికకార్యభూతంబు లైన దేవతాగణంబులును సంభవించె; నింద్రియాధిష్టాత లైన వాని వలన శబ్దంబు పూర్వంబునఁ బ్రకాశం బగుటం జేసి జ్ఞానేంద్రియంబు లయిన త్వక్చక్షుశ్శ్రో త్ర జిహ్వాఘ్రాణంబులునుఁ, గర్మేంద్రియంబు లయిన వాక్పాణి పాద పాయూపస్థములునుఁ, దైజసాహంకారంబు వలన శబ్దస్పర్శ రూపరస గంధంబు లుదయించె; నందు శబ్దంబు నిజగుణం బయిన శబ్దంబువలన నాకాశంబుఁ బుట్టించె; గగనంబు కాలమాయాంశయోగంబునం బుండరీకాక్షు నిరీక్షణంబున స్పర్శతన్మాత్రంబువలన వాయువుం గలిగించె; పవనుండు నభోబలంబున రూపతన్మాత్రాంశంబు వలన లోకలోచనం బైన తేజంబు నుత్పాదించె; తేజంబు కాలమాయాంశ యోగంబున నుత్తమశ్లోకుని విలోకనంబునఁ బవమాన యుక్తం బగుచు రసతన్మాంత్రంబువలన నంబువులం బుట్టించె; సలిలంబు కాలమాయాంశ యోగంబునం బరమేశ్వరానుగ్రహంబు గలిగి తేజోయుక్తం బైన గంధ గుణంబు వలనం బృథివిఁ గలిగించె; అందు గగనంబునకు శబ్దంబును, వాయువునకు శబ్ద స్పర్శంబులును, తేజంబునకు శబ్దస్పర్శ రూపంబులును, సలిలంబునకు శబ్దస్పర్శ రూపరసంబులును, పృథివికి శబ్దస్పర్శ రూపరస గంధంబులును, గుణంబులై యుండు; కాలమాయాంశ లింగంబులు గలిగి మహదాద్యభిమానంబులు నొందిన దేవతలు విష్ణుకళాకలితు లగుదు; రట్టి మహదాది తత్త్వంబు లైక్యంబు సాలమిం, బ్రపంచంబులు గల్పింప సమర్థంబులుగాక కృతాంజలులై యోగీశ్వరేశ్వరుం డైన నారాయణు నిట్లని స్తుతియించె.

మహదాదులు హరి స్తుతి

(203) శ్రీనాథనాథా! జగన్నాథ! నమ్రైకరక్షా! విపక్షక్షమాభృత్సహస్రాక్ష! నీరేజ పత్రేక్షణా! దేవదేవా! భవద్దాస వర్గానుతాపంబులం బాపఁగా నోపు దివ్యాతపత్రంబునాఁ బొల్చు యుష్మత్పదాంభోజ మూలంబు పుణ్యాల వాలంబుగాఁ బొంది యోగీంద్రు లుద్దామ సంసారతాపంబులం బోవఁగా మీటి వర్తింతురో తండ్రి! ఈశా! సమస్తాఘ నిర్ణాశ! ఈ విశ్వమం దెల్ల జీవుల్ భవోదగ్ర దుర్వార తాపత్రయాభీల దావాగ్నిచేఁ గ్రాగి దుఃఖాబ్ధిలోఁ దోఁగి యేకర్మమున్ ధర్మముం బొందఁగా లేక సంసారచక్రంబు నందుం బరిభ్రామ్యమాణాత్ములై యుందు; రమ్మూఢ చేతస్కులం జెప్పఁగా నేల యో దేవ! విజ్ఞానదీపాంకురం బైన మీ పాదపంకేరుహచ్ఛాయఁ బ్రాపింతు మబ్జాక్ష! సన్మౌని సంఘంబు లైకాంతికస్వాంతతం బేర్చి దుర్దాంత పాపౌఘ నిర్ణాశకాంబుప్రవాహాభ్ర గంగానివాసంబుగాఁ నొప్పు నీ పాద యుగ్మంబు యుష్మన్ముఖాంభోజ నీడోద్గతం బైన వేదాండజశ్రేణిచేతం గవేషించి సంప్రాప్తులై యుందు; రో నాథ! వైరాగ్యశక్తిస్ఫుటజ్ఞాన బోధాత్ములైనట్టి ధీరోత్తముల్ నిత్య నైర్మల్య భవ్యాంతరంగంబు లందే పరంజ్యోతి పాదాబ్జపీఠంబు గీలించి కైవల్యసంప్రాప్తులై రట్టి నిర్వాణమూర్తిం బ్రశంసింతు మింద్రాదివంద్యా! ముకుందా సమస్తంబుఁ గల్పింపఁ బాలింపఁ దూలింపఁగాఁ బెక్కు దివ్యావతారంబులం బొందు నీ పాద పంకేరుహధ్యాన పారీణ సుస్వాంతులై యొప్పు భక్తావళిన్ మోక్షదం బైన నీ పాదకంజాతముల్ కొల్తు; మీశా! రమాధీశ! పుత్రాంగనా మిత్ర సంబంధ బంధంబులం జెంది నిత్యంబు దుష్టక్రియాలోలురై దేహగేహంబులం దోలి వర్తించు దుర్మానవశ్రేణు లందంతరాత్ముండవై యుండియున్ దూరమై తోఁచు నీ పాదపద్మంబు లర్చింతు; మో దేవ! బాహ్యేంద్రియవ్యాప్తి నుద్వృత్తు లైనట్టి మూఢాత్ము లధ్యాత్మ తత్త్వప్రభావాఢ్యులై నీ పదాబ్జాత విన్యాస లక్ష్మీకళావాసముం గన్న యయ్యుత్తమశ్లోకులం గానఁగాఁజాల రప్పుణ్యు లా దుష్టులం జూడఁగా నొల్లరంభోధిరాట్కన్యకాకాంత వేదాంత శుద్ధాంత సిద్ధాంతమై యొప్పు నీ సత్కథాసార చంచత్సుధాసార పూరంబులం గ్రోలి సౌఖ్యోన్నతిన్ సోలి ధీయుక్తులై వ్రాలి తాపంబులం దోలి మోదంబులం దేలి సంపన్నులై మన్న నిత్యప్రసన్నుల్ మహోత్కంఠతం బేర్చి వైకుంఠధామంబు నల్పక్రియాలోలురై కాంతు రద్దివ్యవాసైక సంప్రాప్తికిం గోరుచున్నార; మో దేవ! వైరాగ్యవిజ్ఞాన భోధాత్మ యోగక్రియా రూఢి నంతర్బహిర్వ్యాప్తిఁ జాలించి శుద్ధాంతరంగంబుఁ గావించి హృత్పద్మ వాసుండ వై చిన్మయాకారమై యున్న నీ యున్న తానంత తేజో విలాసోల్లసన్మూర్తిఁ జిత్తంబు లం జేర్చి యానంద లోలాత్మతం బొల్చు యోగీశ్వరశ్రేణికిం దావకీ నానుకంపానులబ్ధస్ఫుటజ్ఞానముం గల్గుటం జేసి యాయాసముం జెంద; రో దేవతాచక్రవర్తీ! సదానందమూర్తీ! జగద్గీతకీర్తీ! లసద్భూతవర్తీ! భవద్దాసు లైనట్టి మమ్మున్ జగత్కల్పనాసక్త చిత్తుండవై నీవు త్రైగుణ్య విస్ఫూర్తిఁ బుట్టించినం బుట్టుటేకాక నీ దివ్య లీలానుమేయంబుగా సృష్టి నిర్మాణముం జేయ నేమెంతవారౌదు మీ శక్తి యుక్తిన్ భవత్పూజ గావింతు; మట్లుండె నీ సత్కళాజాతు లైనట్టి మమ్మెన్నఁగా నేల నధ్యాత్మ తత్త్వంబ వన్నం బరం జ్యోతి వన్నం బ్రపంచంబ వన్న న్నధిష్ఠాత వన్నన్ సదాసాక్షి వన్నన్ గుణాతీత! నీవే కదా పద్మపత్రాక్ష! సత్వాది త్రైగుణ్య మూలంబునా నొప్పు మాయాగుణం బందు నుద్యన్మహా తత్త్వ మైనట్టి నీ వీర్యముం బెట్టుటం జేసి నీ వింతకుం గారణం బౌదు; నాయాయి కాలంబులన్నీకు సౌఖ్యంబు లేమెట్లు గావింతు; మేరీతి నన్నంబు భక్షింతు; మెబ్భంగి వర్తింతు; మే నిల్కడన్నుందు; మీ జీవలోకంబె యాధారమై యుండి భోగంబులం బొందుచున్నున్న యిక్కార్య సంధాను లైనట్టి మాకుం జగత్కల్పనా శక్తికిన్ దేవ! నీ శక్తిఁ దోడ్పాటు గావించి విజ్ఞానముం జూపి కారుణ్య సంధాయివై మమ్ము రక్షింపు లక్ష్మీమనః పల్వలక్రోడ! యోగీంద్ర చేతస్సరో హంస! దేవాదిదేవా! నమస్తే! నమస్తే! నమః!

విరాడ్విగ్రహ ప్రకారంబు

(204) అనినఁ బ్రసన్నుఁడై హరి మహదాదుల¯ కన్యోన్యమిత్రత్వ మందకున్న¯ కతమున నిఖిల జగత్కల్పనాశక్తి¯ వొడమకుండుటఁ దన బుద్ధి నెఱిఁగి¯ కైకొని కాలవేగమున నుద్రేకంబు¯ నొందిన ప్రకృతితోఁ బొంది నిజబ¯ లము నిల్పి తా నురుక్రముఁ డన సప్తవిం¯ శతితత్త్వముల యందు సమత నొక్క (204.1) పరి ప్రవేశించి యాతత్త్వభవ్యగుణము¯ నందు జ్యేష్ఠానురూపంబు లలరఁ జెంది¯ యొకటి నొకటినిఁ గలయక యుండి విశ్వ¯ రచన నెఱుఁగని యాతత్త్వనిచయమునకు. (205) ఇట్లు విశ్వనిర్మాణనిపుణత్వంబు నెఱుంగం జూపుచు నన్నింటికి నన్యోన్యతం గల్పించి తన యనుగ్రహంబునం బ్రేరితంబై కానంబడి క్రియాసామర్థ్యంబునం జెన్నొందిన తత్త్వవితానంబు దేవప్రేరితంబయి స్వకీయంబులగు నంశంబులచేతం బుట్టించిన విరాడ్విగ్రహంబై తత్త్వవితతి దమ యందుఁ జెందిన పుండరీకాక్షుని కళాంశంబున నొకటి కొకటికి నైక్యంబు వాటిల్లి పరిణతంబై రూపాంతరంబునుం జెందె; నే తత్త్వంబునఁ జరాచరలోక పుంజంబులు నిండి యుండు, నా హిరణ్మయంబైన విరాడ్విగ్రహంబు నొందిన పురుషుండు సర్వజీవసమేతుండై యుండె; అంత. (206) జలములలోపల నిమ్ముల¯ జలరుహజాతాండ మందు సాహస్రాబ్దం¯ బులు నిలిచెఁ గార్యరూపా¯ కలితం బగు నవ్విరాట్సుగర్భము వరుసన్. (207) దైవకర్మాత్మశక్తి వితానములను¯ దగిలి తనచేతఁ దనుఁదాన దైవశక్తి¯ యగుచు వెలుగొందుచునుఁ బ్రకారాంతరమునఁ¯ దనువు వితతంబుగాని చైతన్య మొంది. (208) రూపసంసక్తిఁ జేసి నిరూఢకర్మ¯ శక్తియును వృత్తిభేదసంసక్తి దశ వి¯ ధముల గలిగిన ప్రాణరూపమున నాత్మ¯ శక్తి బోధత్వ మగుచున్న శక్తి గలిగి. (209) త్రివిధం బగుచును నాధ్యా¯ త్మ్య విభేదంబులనుఁ బాపి మఱి యధిభూతా¯ త్మ విరాడ్రూపమ్మగు నిది¯ వివిధప్రాణులకు నాత్మవిధమై మఱియున్. (210) జీవంబై పరమాత్మకుఁ¯ దావలమై యాదిమావతారం బగు న¯ ద్దేవుని గర్భంబున భూ¯ తావలితోడం బ్రపంచ మర్థిం దోఁచెన్. (211) ఇట్లు దోఁచిన విరాట్పురుషుం డాధ్యాత్మి కాధిదైవి కాధిభౌతికంబు లను భేదంబులచేఁ బూర్వోక్తక్రమంబున వెలుగొందు"ననుచు విదురునకు మైత్రేయుం డెఱింగించె"నని చెప్పి; వెండియు నిట్లనియె. (212) "హరి పరమాత్ముఁ డీశుఁ డజుఁ డాఢ్యుఁ డనంతుఁ డనంతమూర్తి సా¯ గరతనయాహృదీశుఁడు వికారవిదూరుఁడు నిత్యమంగళా¯ కరుఁడు గృపాపయోనిధి యకల్మషచిత్తుఁడు సర్వశక్తి దా¯ మరసవిలోచనుండు బుధమాన్యచరిత్రపవిత్రుఁ డిమ్ములన్. (213) ఇత్తెఱంగున నీశుం డగు నధోక్షజుండు మహదాదితత్త్వంబుల మనంబుల ఘనంబులగు తలంపులు దానెఱింగి యట్టి తత్త్వంబుల వివిధ వృత్తిలాభంబునకై స్వకీయచిచ్ఛక్తిచే నిటు లొనర్తు నని చింతించి నిజకళాకలితం బగు విరాడ్విగ్రహంబు నందు నగ్ని ప్రముఖం బగు దేవతావళి కెల్ల నివాసం బగుచుఁ గానంబడిన వైరాజపురుషుని యాస్యాద్యవయవంబుల వినిపింతు దత్తావధానుండవై వినుము. (214) నరనుత! యా దివ్యపురుషోత్తముని పృథ¯ గ్భావంబు నొంది ముఖంబువలన¯ భువనపాలకుఁడైన పవమానసఖుఁ డంత¯ రాత్ముఁ డీశ్వరునంశమైనవాని¯ కనయంబు ననుకూల మగుచు నిజస్థాన¯ మునఁ బ్రవేశించిన ముఖము నందుఁ¯ బరఁగు జీవుండు శబ్దము నుచ్చరించుఁ బృ¯ థగ్భావములను నేత్రముల నినుఁడు (214.1) చక్షురింద్రియ యుక్తుఁడై సరవిఁజెంది¯ రూపవిజ్ఞాన మహిమ నిరూఢి నొందు¯ మఱియుఁ జర్మంబునను బవమానుఁ డీశ్వ¯ రాంశమై తత్తగింద్రియ మందుఁ గూడి. (215) నిజవాసంబు నాశ్రయించి జీవుండు స్పర్శేంద్రియగతుండై పృథగ్భావం బయ్యె; శ్రోత్రంబుల దిక్కు లచ్యుత కళాంశంబు లగు శ్రవణేంద్రియ యుక్తంబులై నిజస్థానంబునం బొంది జీవుండు శబ్దజ్ఞానగతుం డగు; వెండియుఁ దాలువు నిర్భిన్నంబయిన లోకపాలుఁ డగు వరుణుం డందుఁ బ్రవేశించి రసనేంద్రియంబుచేఁ బ్రకాశించినం బ్రాణి రసంబులం గ్రహించె; పరమేశ్వరుని నాసికేంద్రియంబు పృథగ్భావంబు నొంది యాశ్వినేయాధిష్ఠానంబై ఘ్రాణాంశంబు నొందిన జంతువు గంధగ్రహణ సమర్థం బయ్యె; వెండియు భిన్నంబయిన చర్మంబున నోషధులునుఁ బరమపురుషాంశంబు లయిన కేశంబులం గూడి నిజనివాసంబు నొందిన జీవుండు కండూయమానుం డగు; భిన్నభూతంబైన మేఢ్రంబునం బ్రజాపతి రేతంబున నిజస్థానంబు నొంది జీవుం డానందంబునం బొరయు; భిన్నభావం బైన గుదంబున మిత్రుం డచ్యుతాంశంబును బొంది పాయువుం గూడి నిజాస్థానంబు నొందుచు జీవుండు విసర్గంబుఁ జెందు; వేఱువేఱైన బాహువులం ద్రిదశాధీశ్వరుం డయిన పురంధరుండు క్రయవిక్రయాది శక్తియుక్తుం డగుచు నిజస్థానంబు నొంది జీవుండు వానిచేత జీవికం బొందు; మఱియుఁ బాదంబులు నిర్భిన్నంబు లయిన విష్ణుండు స్వావాసంబు గైకొని గతిశక్తిం బొందిన జీవుండు గమనాగమ నార్హుండయ్యె; వెండియు భిన్నభావం బయిన హృదయంబు మనంబుతోడం గలిసి నిజాధిష్ఠానంబునం జంద్రుండు ప్రవేశించిన జీవుండు శరీరసంకల్పాది రూపం బగు వికారంబునుం బొందు; భిన్నభావంబైన యహంకారంబున నహంకృతి యుక్తుండై రుద్రుండు నిజస్థానంబుగా వసియించు; నా యహంకృతిచే శరీరకర్తవ్యంబులు నడపు బుద్ధి వాగీశ్వరావాసంబై హృదయంబుతోడం గలసి నిజాధిష్ఠానంబున బోధాంశంబుచే వెలింగిన శరీరి బోద్ధవ్యతం బొందు; భిన్నంబైన చిత్తంబు బ్రహ్మావాసంబై చేతనాంశంబు నొందినఁ బ్రాణి విజ్ఞానంబునుం బొందు; నట్టి విరాట్పురుషుని శీర్షంబున స్వర్గంబునుఁ, జరణంబుల వసుమతియు, నాభి యందు గగనంబునుఁ గలిగె సత్త్వాదిగుణ పరిణామంబుల నమరు లైరి; ఊర్జిత సత్త్వగుణంబున నద్దేవతలు త్రిదివంబునుఁ బొందిరి; రజోగుణంబున మనుజులును, గవాదులును ధరణిం బొందిరి; తామసంబున భూతాదులైన రుద్రపారిషదులు ద్యావాపృథివ్యంతరం బగు వియత్తలంబునుం బొందిరి ముఖంబువలన నామ్నాయంబు లుత్పన్నంబయ్యె; వెండియు. (216) ధరణీదివిజులు శ్రుతులును¯ నరవర యమ్మేటి ముఖమునం బొడముట భూ¯ సురుఁ డఖిల వర్ణములకున్¯ గురుఁడున్ ముఖ్యుండు నయ్యె గుణరత్ననిధీ! (217) ధరఁ బ్రాహ్మణాదికముఁ ద¯ స్కరబాధలఁ బొందకుండఁ గైకొని కావం¯ బురుషోత్తము బాహువులన్¯ నరనాథకులంబు పుట్టె నయతత్త్వనిధీ! (218) గణుతింపఁగఁ గృషి గోర¯ క్షణ వాణిజ్యాది కర్మకలితంబుగ నా¯ గుణనిధి యూరువు లందుం¯ బ్రణుతింపగ వైశ్యజాతి ప్రభవం బయ్యెన్. (219) తివిరి సేవకధర్ములై దేవదేవు¯ పదములను శూద్రసంతతు లుదయ మైరి¯ వీర లందఱుఁ దమతమ విహితకర్మ¯ మలరఁ జేయుచు జనకుండు నాత్మ గురుఁడు. (220) అగు సర్వేశుఁ బరాత్పరు¯ జగదేకప్రభుని పాదజలజాతంబుల్¯ తగిలి భజింతురు సతతము¯ నిగమోక్తిన్ భక్తియోగనిపుణాత్మకులై. (221) మహిమ దీపింపఁ గాల కర్మస్వభావ¯ శక్తి సంయుక్తుఁ డగు పరేశ్వరుని భూరి¯ యోగమాయావిజృంభణోద్యోగ మెవ్వఁ¯ డెఱిఁగి నుతియింపఁగా నోపు నిద్ధచరిత! (222) అన్యకథానులాపము లహర్నిశముం బఠియించి చాల మా¯ లిన్యము నాత్మశోభన విలీనత నొందు మదీయ జిహ్వ సౌ¯ జన్యముతోడఁ గ్రోలు హరి సద్గుణ దివ్యకథామృతంబు స¯ న్మాన్యచరిత్రమై నెగడు మద్గురువాక్యపదంబుఁ జెందఁగన్. (223) హరినామాంకిత సత్కథామృత రసవ్యాలోలుఁ డైనట్టి స¯ త్పురుషశ్రేష్ఠు డసత్కథాలవణవాఃపూరంబుఁ దాఁ గ్రోలునే? ¯ వరమందార మరందపాన కుతుకస్వాంతద్విరేఫంబు స¯ త్వరమై పోవునె చేఁదు వేములకుఁ దద్గంధానుమోదాత్మమై. (224) హరిమహిమముఁ దన్నాభీ¯ సరసిజసంజాతుఁ డైన చతురాననుఁడుం¯ బరికించి యెఱుఁగఁ డన్న ని¯ తర మనుజులఁ జెప్పనేల తత్త్వజ్ఞనిధీ! (225) శ్రుతులు దమలోన వివరించి చూచి పుండ¯ రీకలోచను నుత్తమశ్లోకచరితు¯ నమరగణవంద్యమానపాదాబ్జయుగళు¯ వెదకి కనుఁగొనలే వండ్రు విమలమతులు. (226) హరియుం దన మాయాగతిఁ¯ బరికించియుఁ గానడయ్యె పరిమితి లేమిన్¯ మఱి మాయా వినిమోహిత¯ చరితముఁ గనుఁగొందు రెట్లు చతురాస్యాదుల్. (227) ఆ దివిజాధీశుఁడు మహ¯ దాదులు దిక్పతులుఁ బంకజాసనుఁడున్ గౌ¯ రీదయితుఁడు గనఁజాలని ¯ శ్రీదేవుని పదయుగంబుఁ జింతింతు మదిన్." (228) అని మైత్రేయుం డవ్విదు¯ రున కెఱిఁగించిన తెఱంగు రుచిరముగా న¯ ర్జునపౌత్రునకుఁ బరాశర¯ మునిమనుమం డెఱుఁగజెప్పె ముదము దలిర్పన్. (229) వెండియు నిట్లనియె. (230) "భూమీశ్వర! మైత్రేయ మ¯ హాముని విదురునకు నట్లు హరిగుణ శుభలీ¯ లామాహాత్మ్యముఁ జెప్పిన¯ నా మైత్రేయునకు విదురుఁ డనియెన్ మఱియున్. (231) "అగుణున కవికారునకున్¯ జగదవనోద్భవ వినాశ సత్కర్మములుం¯ దగులీలఁ బెట్టు లాతఁడు¯ సగుణుండై యుండు టెట్టు సౌజన్యనిధీ!" (232) అని యర్భకునిగతి యనుకొని మైత్రేయ¯ మునిఁ జూచి విదురుఁ డిట్లనియె మరల¯ "బాలుఁడు క్రీడావిలోలమానసమున¯ దీపించు లీలానురూపుఁ డగుచుఁ¯ గానిచోఁ గామానుగతుఁడై రమించును¯ నర్భకుఁ డర్థి వస్త్వంతరమున¯ నర్భకాంతరమున నైనను బాలకే¯ ళీసంగుఁ డగుచు నోలినిఁ జరించు (232.1) హరియు నెపుడు నివృత్తుఁ డత్యంతతృప్తుఁ¯ డగుట వర్తించు టెట్లు క్రీడాదు లందు¯ మఱియుఁ ద్రిగుణాత్మకంబైన మాయఁ గూడి¯ యఖిల జగములఁ గల్పించె ననుట యెట్లు? (233) అమ్మాయచేత నీ యఖిలంబు సృజియించి¯ పాలించి పొలియించి పరమపురుషు¯ డనఘాత్మ! దేశకాలావస్థ లందును¯ నితరుల యందునహీనమైన ¯ జ్ఞానస్వభావంబుఁ బూని యాప్రకృతితో¯ నెబ్భంగిఁ గలసెఁ దానేక మయ్యుఁ¯ గోరి సమస్తశరీరంబు లందును¯ జీవరూపమున వసించి యున్న (233.1) జీవునకు దుర్భరక్లేశసిద్ధి యెట్టి¯ కర్మమున సంభవించెను? గడఁగి నాదు¯ చిత్త మజ్ఞాన దుర్గమస్థితిఁ గలంగి¯ యధికఖేదంబు నొందెడు ననఘచరిత! (234) అదిగావున సూరిజనోత్తముండ వైన నీవు మదీయ మానసిక సంశ యంబులఁ దొలగింప నర్హుండవు"అని విదురుండు మైత్రేయమునీంద్రు నడిగెను"అని బాదరాయఁతనూభవుం డభిమన్యునందనున కిట్లనియె (235) "సరసిరుహోదరు మంగళ¯ చరితామృతపానకుతుక సంగంబున ని¯ ర్భరుఁ డగు విదురునకు మునీ¯ శ్వరుఁ డగు మైత్రేయుఁ డనియె సజ్జనతిలకా! (236) వినుము వితర్కవాదములు విష్ణుని ఫుల్లసరోజపత్రనే¯ త్రుని ఘనమాయ నెప్పుడు విరోధముసేయుఁ బరేశు నిత్యశో¯ భనయుతు బంధనాధిక విపద్దశలుం గృపణత్వ మెప్పుడే¯ ననయముఁ బొందలేవు విభుఁ డాద్యుఁ డనంతుఁడు నిత్యుఁ డౌటచేన్. (237) మఱియును. (238) పురుషుఁడు నిద్రవోఁ గలల బొందు సమస్త సుఖంబు లాత్మసం¯ హరణ శిరోవిఖండనము లాదిగ జీవునికిం బ్రబోధమం¯ దరయఁగఁ దోఁచుచున్నగతి నాదిఁ బరేశుఁడు బంధనాదులం¯ బొరయక తక్కు టెట్లనుచు? బుద్ధిని సంశయ మందెదేనియున్. (239) అవ్విధం బతనికిం గలుగనేరదు; అది యెట్లంటేని. (240) లలిత విలోల నిర్మలజలప్రతిబింబిత పూర్ణచంద్రమం¯ డలము దదంబుచాలన విడంబనహేతువు నొందియున్ వియ¯ త్తలమునఁ గంపమొందని విధంబున సర్వశరీరధర్మముల్¯ కలిగి రమించు నీశునకుఁ గల్గఁగ నేరవు కర్మబంధముల్. (241) కావున జీవునకు నవిద్యామహిమం జేసి కర్మబంధనాదికంబు సంప్రాప్తం బగు గాని సర్వభూతాంతర్యామి యైన యీశ్వరునకు బ్రాప్తంబు గానేర; దని. (242) నరునకు నాత్మదేహజ గుణంబులఁ బాపఁగనోపు పంకజో¯ దరచరణారవింద మహితస్ఫుటభక్తియ యింద్రియంబు లీ¯ శ్వర విషయంబు లైన మది సంచిత నిశ్చలతత్త్వమైనచో¯ సరసిజనేత్రుకీర్తనమె చాలు విపద్దశలన్ జయింపఁగన్. (243) హరిచరణారవిందయుగళార్చన సన్నుతి భక్తియోగముల్¯ నిరతము గల్గువారు భవ నీరజగర్భుల కందరాని భా¯ సురపద మందుఁ జేరుదురు సూరిజనస్తవనీయ! యట్టి స¯ త్పురుషుల పూర్వజన్మఫలమున్ గణుతింపఁ దరంబె యేరికిన్." (244) అని చెప్పిన విదురుండు మైత్రేయుం గనుంగొని ముకుళిత హస్తుండును వినమిత మస్తకుండును నగుచుఁ దన మనంబున శ్రీహరిం దలంచుచు వినయవచనరచనుండై యిట్లనియె "మునీంద్రా! భవదీయ వాక్యములచేత నామనంబున నారాయణుండు లోకైకనాథుం డెట్లయ్యె ననియు, శరీరధారి యైన జీవునికిఁ గర్మబంధంబు లేరీతి సంభవించె ననియునుం బొడమిన సంశయంబు నేఁడు నివృత్తం బయ్యె; ఎట్లనిన లోకంబున కీశ్వరుండు హరి యనియు, జీవుండు పరతంత్రుం డనియునుఁ దలంపుదు; నారాయణ భక్తి ప్రభావంబు ప్రాణిగోచరం బైన యవిద్యకు నాశనకారణం బనం దనరుచుండు; నారాయణుండు దనకు నాధారంబు లేక సమస్తంబునకుం దాన యాధారభూతుం డై విశ్వంబుం బొదివి యందుఁ దా నుండు తెఱం గెట్లు; శరీరాభిమానంబును బొంది యెవ్వఁడు మూఢతముం డై సంసారప్రవర్తకుం డగు; నెవ్వండు భక్తిమార్గంబునఁ బరమాత్ముం డైన పుండరీకాక్షునిఁ జెందు; వీర లిద్దఱును సంశయ క్లేశంబులు లేమింజేసి సుఖానంద పరిపూర్ణులై యభివృద్ధి నొందువార లగుదురు; ఎవ్వండు సుఖదుఃఖాను సంధానంబుచే లోకానుగతుం డగుచుం బ్రమోద వేదనంబుల నొందు నతండు దుఃఖాశ్రయుండగు; నారాయణభజనంబున సమస్త దుఃఖనివారణం బగు నని భవదీయచరణసేవా నిమిత్తంబునం గంటి; ప్రపంచంబు ప్రతీతి మాత్రంబు గలిగియున్న దైన నందులకుఁ గారణంబు లేకుండుటంజేసి తెలియని వాడనై వర్తింతు"నని వెండియు. (245) "లలి నా మదిఁ దలఁపుదు సుమ¯ తులు గొనియాడంగఁ దగిన తోయజనాభుం¯ డలవడఁ డల్ప తపోనిర¯ తుల తలపోఁతలకు మిగుల దుర్లభుఁ డనియున్. (246) ఇంద్రియంబులతోడ నెలమి నొప్పెడి మహ¯ దాదుల నితరేతరానుషంగ¯ ముగఁ జేసి వానియం దొగి విరాడ్దేహంబు¯ పుట్టించి యందుఁ జేపట్టి తాను¯ వసియించు నాతఁడు వరుస సహస్రసం¯ ఖ్యాకంబులగు మస్తకాంఘ్రి బాహు¯ కలిత సత్పురుషునిఁగా బ్రహ్మవాదులు¯ పలుకుదు రా విరాట్ప్రభువు నందు (246.1) భువన జాలంబు లలజడి బొరయకుండుఁ ¯ బ్రాణదశకంబు నింద్రియార్థములు నింద్రి¯ యాధిదైవతములుఁ గూడ ననఘ త్రివిధ¯ మగుచు విప్రాది వర్ణము లయ్యె నందు. (247) ఇలఁ బుత్రపౌత్రసంపద¯ గలిగిన వంశములతోడఁ గడుఁ జోద్యముగా¯ లలిఁ బ్రజ లేగతిఁ గలిగిరి¯ కలిగిన యా ప్రజలచే జగము లెట్లుండెన్? (248) చతురత దీపింపఁ బ్రజా¯ పతులకుఁ బతి యనఁగ వెలయు పద్మాపతి యే¯ గతిఁ బుట్టించెను? స్రష్టృ¯ ప్రతతులచే నవవిధప్రపంచము మఱియున్. (249) వానిభేదంబులును మనువంశములును¯ మనుకులాధీశ్వరులునుఁ దన్మనుకులాను¯ చరితములునే విభూతినే జాడ దీని¯ నింతయును బుట్టఁజేసె? నా కెఱుఁగఁ బలుకు. (250) సరవింగ్రిందన్ మీఁదం¯ ధరణికిఁ గల లోకములను దత్తత్థ్సితులన్¯ వరుసం బరిమాణంబుల¯ నెఱిఁగింపగదయ్య నాకు నిద్ధచరిత్రా! (251) సుర తిర్యఙ్నర రాక్షస¯ గరుడోరగ సిద్ధసాధ్య గంధర్వ నభ¯ శ్చరముఖ భవములు మునికుం¯ జర! గర్భస్వేదజాండజముల తెఱంగున్. (252) త్రిగుణప్రధానకంబులు¯ నగునవతారములఁ బూర్ణమై వెలసిన యా¯ జగదుత్పత్తిస్థితిలయ¯ నిగమముల విధంబు వాని నిలుకడలుఁ దగన్. (253) చక్రాయుధు సౌందర్య ప¯ రాక్రమముఖ గుణములును ధరామరముఖ వ¯ ర్ణక్రమములు నాశ్రమధ¯ ర్మక్రియలును శీలవృత్తమతభావములున్. (254) యోగవిస్తార మహిమలు యాగములును ¯ జ్ఞానమార్గంబులునుఁ బరిజ్ఞానసాధ¯ నములు నై యొప్పు సాంఖ్యయోగములు వికచ¯ జలజనయనకృతంబు లౌ శాస్త్రములును. (255) పాషాండధర్మంబుఁ బ్రతిలోమకులవిభా¯ గములు జీవుల గుణకర్మములునుఁ¯ బలుకులగతులునుఁ గలిగెడి ధర్మమో¯ క్షముల యందలి పరస్పరవిరోధ¯ ములు లేని సాధనమును భూమిపాలక¯ నీతివార్తలు దండనీతిజాడ¯ యునుఁ బృథగ్భావంబులును విధానములునుఁ¯ బితృమేధములునుఁ దత్పితృ విసర్గ (255.1) గతులుఁ దారాగ్రహంబులుఁ గాలచక్ర¯ మున వసించిన నిలుకడలును దపములు¯ దానములుఁ దత్ఫలంబులఁ దనరు ప్రబల¯ ధర్మములుఁ బ్రజ లొనరించు కర్మములును (256) వదలక భూజనావళికి వచ్చు విపద్దశధర్మముల్ సరో¯ జదళనిభాక్షుఁ డేగతిని సంతసమందెడు నెట్టివారి మే¯ ల్వదలక కానవచ్చు గురులం బ్రియశిష్యులు గొల్వ వారు స¯ మ్మదమునఁ గోరునర్థములు మానుగ నెట్లెఱిఁగింతు రిమ్ములన్. (257) విలయాది భేదముల న¯ య్యలఘునిఁ బరమేశు నెవ్వ రంచితభక్తిం¯ గొలుతు రదెవ్వరిలో ను¯ త్కలికన్ సుఖియించు జీవతత్త్వము మఱియున్. (258) గోవిందుని రూపంబున¯ జీవబ్రహ్మలకు నైక్యసిద్దియు నెటులౌ¯ భావన నుపనిషదర్థం¯ బై వెలసెడి జ్ఞాన మెట్టి దార్యస్తుత్యా! (259) ఉచిత మగు నట్టి శిష్యప్రయోజనములు¯ సజ్జనులచేత విజ్ఞానసాధనములు¯ నేమి పలుకంగఁబడు వాని నెల్ల మఱియుఁ¯ బొలుచు వైరాగ్యమునఁ దగు పురుషభక్తి. (260) ఇన్నియుఁ దెలియనానతి యిచ్చి నన్ను¯ నర్థి రక్షింపు యజ్ఞదానాది పుణ్య¯ ఫలము వేదంబు సదివిన ఫలము నార్త¯ జనులఁ గాచిన ఫలముతో సమముగావు." (261) అని విదురుఁడు మైత్రేయుని¯ వినయంబునఁ దెలియ నడుగు విధ మెల్లను వ్యా¯ సునిసుతుఁ డభిమన్యునినం¯ దనున కెఱింగించి మఱియుఁ దగ నిట్లనియెన్. (262) "ఇలఁ గల మానవావళికి నెల్ల నుతింప భజింప యోగ్యమై¯ వెలసిన పూరువంశము పవిత్రముసేయఁగఁ బుట్టి సద్గుణా¯ కలిత యశఃప్రసూనలతికాతతికిం బ్రతివాసరంబుఁ బెం¯ పలరఁగ బ్రోదివెట్టుదు గదయ్య ముకుందకథామృతంబునన్. (263) అల్పతరమైన సుఖముల నందుచున్న¯ జనుల దుఃఖంబు మాన్పంగఁ జాలునట్టి¯ పుండరీకాక్షు గుణకథా ప్రోతమైన¯ వితత నిగమార్థ మగు భాగవతము నీకు (264) ఎఱింగింతు విను"మని యిట్లనియె. (265) "అమ్మహాభాగవతామ్నాయ మొకనాఁడు¯ గైకొని పాతాళలోక మందు¯ నప్రతీకజ్ఞానియై వాసుదేవాఖ్యఁ¯ బొలుచు సంకర్షణమూర్తి దివ్య¯ పురుషుండు దనుఁదాన బుద్ధిలోఁ జూచుచు¯ సలలితధ్యాన ముకుళితనేత్రుఁ¯ డై సనందాభ్యుదయార్థంబు గనువిచ్చి¯ చూచిన వారు సంస్తుతు లొనర్ప (265.1) నమర గంగావగాహనులై యహీంద్ర¯ కన్య లార్ధ్రజటాబంధకలిత లగుచు¯ భర్తృ వాంఛానుబుద్ధి నప్పరమపురుషుఁ¯ గదియ నేతెంచి తత్పాదకమలయుగము. (266) సేవించి భక్తితో నా¯ నావిధ పూజోపహార నతి నుతులను నా¯ దేవుని హృదయము వడసిరి¯ యా వేళ సనందనాదు లమ్మహితాత్మున్. (267) ఘన సాహస్ర కిరీటరత్న విలసత్కాంతప్రసిద్ధప్రభా¯ జనితోదగ్ర రుచిప్రకాశిత ఫణాసాహస్రుఁ డౌ దేవతా¯ వనరక్షాచణు రూపకృత్యము లొగిన్ వాంఛం బ్రశంసించి వా¯ రనురాగస్ఖలితోక్తు లొప్ప నడుగన్ హర్షించి యా దేవుడున్. (268) భూరి నిగమార్థసార విచార మగుచుఁ¯ దనరు నీ భాగవతము సాదరతఁ బలికె¯ నలినభవసూతి యైన సనత్కుమార¯ కునకు నెఱిఁగించె సాంఖ్యాయనునకు నతఁడు. (269) పరఁగ నతం డంతఁ బరా¯ శరునకు నుపదేశమిచ్చె; సన్మతి నతఁడున్¯ సురగురున కొసఁగె; నాతఁడు¯ గరమరుదుగ నాకుఁ జెప్పఁ గైకొని యేనున్. (270) నీ కిప్పుడు వివరించెద¯ నాకర్ణింపుము సరోరుహాక్షుండగు సు¯ శ్లోకుని చరితామృతపరి¯ షేకుఁడ వై ముదము గదురఁ జెలగుము విదురా!