భాగవతము పారాయణ : తృతీయ స్కంధము 1-76
పోతన తెలుగు భాగవతం
తృతీయ స్కంధము
ఉపోద్ఘాతము
(1) శ్రీమహిత వినుత దివిజ¯ స్తోమ! యశస్సీమ! రాజసోమ! సుమేరు¯ స్థేమ! వినిర్జితభార్గవ ¯ రామ! దశాననవిరామ! రఘుకులరామా!(2) మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిలపురాణ వ్యాఖ్యాన వైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె: "అట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.
విదురుని తీర్థాగమనంబు
(3) "పాండునృపాల నందనులు బాహుబలంబున ధార్తరాష్ట్రులన్¯ భండనభూమిలో గెలిచి పాండుర శారదచంద్రచంద్రి కా¯ ఖండయశః ప్రసూన కలికావళిఁ గౌరవరాజ్యలక్ష్మి నొం¯ డొండ యలంకరింపుచు జయోన్నతి రాజ్యము సేయుచుండగన్.(4) మనుజేంద్ర! విదురుఁ డంతకు¯ మును వనమున కేఁగి యచట మునిజనగేయున్¯ వినుత తపోధౌరేయున్¯ ఘను ననుపమ గుణవిధేయుఁ గనె మైత్రేయున్.(5) కనుఁగొని తత్పాదంబులు¯ దన ఫాలము సోక మ్రొక్కి తగ నిట్లనియెన్¯ "మునివర! సకల జగత్పా¯ వనచరితుఁడు గృష్ణుఁ డఖిల వంద్యుం డెలమిన్.(6) మండితతేజోనిధి యై¯ పాండవ హితమతిని దూతభావంబున వే¯ దండపురి కేగి కురుకుల¯ మండనుఁ డగు ధార్తరాష్ట్రు మందిరమునకున్.(7) చనఁగ నొల్లక మద్గృహంబునకు భక్త¯ వత్సలుం డగు కృష్ణుండు వచ్చు టేమి¯ కతము? నా కది యెఱిఁగింపు కరుణతోడ"¯ ననుచు విదురుండు మైత్రేయు నడిగె"ననిన.(8) విని వెఱఁగంది పరీక్షి¯ న్మనుజవరేణ్యుండు విమలమతి నిస్తంద్రున్¯ మునికుల జలనిధి చంద్రున్¯ సునిశిత హరిభక్తిసాంద్రు శుకయోగీంద్రున్.(9) కని యిట్లనె "మైత్రేయుని¯ ననఘుండగు విదురుఁడే రహస్యము లడిగెన్? ¯ ముని యేమి చెప్పె? నే పగి¯ దినిఁ దీర్థములాడె? నెచటఁ దిరుగుచు నుండెన్?(10) ఇన్నిదెలియంగ నానతి యిచ్చి నన్ను¯ నర్థి రక్షింపవే విమలాంతరంగ! ¯ ఘనదయాపాంగ! హరిపాదకమలభృంగ! ¯ మహితగుణసంగ! పాపతమఃపతంగ!"(11) అనవుడు బాదరాయణి ధరాధిపుతో ననుఁ "బూరువంశ వ¯ ర్థన! విను కష్టుఁడైన ధృతరాష్ట్ర నృపాలుఁడు పెంపుతో సుయో¯ ధనముఖ పుత్రులం గడు ముదంబునఁ బెంపుచుఁ బాండురాజు ద¯ ప్పిన పిదపం దదాత్మజులు పెల్కుఱి తన్నని చేర వచ్చినన్.(12) ఇట్లువచ్చిన పాండవుల యెడ నసూయా నిమగ్నులై సుయోధనాదులు.(13) పెట్టిరి విషాన్న; మంటం¯ గట్టిరి ఘనపాశములను; గంగానదిలో¯ నెట్టిరి; రాజ్యము వెడలం¯ గొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై.(14) క్రూరాత్ము లగుచు లాక్షా¯ గారంబున వారు నిద్ర గైకొని యుండన్¯ దారుణ శిఖిఁ దరికొలిపిరి¯ మారణకర్మముల కప్రమత్తులు నగుచున్.(15) సూరిజనగేయ మగు రాజసూయ యజ్ఞ¯ విలస దవభృథస్నాన పవిత్రమైన¯ దౌపదీ చారు వేణీభరంబు పట్టి¯ కొలువులోపల నీడ్చిరి కుత్సితమున.(16) కావున వారల కపకృతిఁ¯ గావింపని దొక దినంబు గలుగదు, తమ జ¯ న్మావధి నిజ నందనులను¯ వావిరి నయ్యంధనృపతి వలదనఁ డయ్యెన్.(17) మాయజూదంబు పన్ని దుర్మార్గవృత్తిఁ¯ బుడమిఁ గొని యడవులకుఁ బో నడువ నచటఁ¯ దిరిగి వారలు సమయంబు దీర్చి యేఁగు¯ దెంచి తమ యంశ మడిగినఁ బంచి యిడక.(18) ఉన్నయెడ.(19) సకల నియంత యైన హరి సర్వశరణ్యుఁడు మాధవుండు సే¯ వక నవ కల్పకంబు భగవంతుఁ డనంతుఁ డనంతశక్తి నం¯ దకధరుఁ డబ్జలోచనుఁడు ధర్మతనూభవుచే నియుక్తుఁడై¯ యకుటిల భక్తి యోగమహితాత్మకుఁడై ధృతరాష్ట్రు పాలికిన్.(20) చని యచట భీష్మ గురు త¯ త్తనయ కృపాచార్య నిఖిల ధాత్రీపతులున్¯ విని యనుమోదింపఁగ ని¯ ట్లనియెన్ ధృతరాష్ట్రుతోడ నవనీనాథా!(21) "కౌరవ పాండవు లిరువురు¯ నారయ నీ కొక్క సమమ యవనీవర! నీ¯ వే రీతి నైన బాండుకు¯ మారుల పాలొసఁగి తేని మను నుభయంబున్."(22) అని ధర్మ బోధమునఁ బలి¯ కిన మాటలు చెవుల నిడమి గృష్ణుఁడు విదురున్¯ ఘన నీతిమంతుఁ బిలువం¯ బనిచినఁ జనుదెంచెఁ గురుసభాస్థలమునకున్.(23) చనుదెంచి యచటి జనంబులచేత నుపస్థితంబైన కార్యంబు దెలుపంబడినవాఁడై ధృతరాష్ట్రు నుద్దేశించి యిట్లనియె.(24) "ధరణీనాయక! పాండుభూవిభుఁడు నీ తమ్ముండు; దత్పుత్రులం¯ బరిరక్షించిన ధర్మముం దగవునుం బాటిల్లు; వంశంబు సు¯ స్థిరసౌఖ్యోన్నతిఁ జెందు శత్రుజయముం జేకూరు; గోపాల శే¯ ఖరు చిత్తంబును వచ్చు నట్లగుట యౌఁ గౌరవ్యవంశాగ్రణీ!(25) వారితండ్రి పాలు వారికి నొసఁగి నీ¯ పాలు సుతుల కెల్లఁ బంచియిచ్చి¯ చలము విడిచి ధర్మ మలవడ నీ బుద్ధిఁ¯ జొనుపవయ్య! కులము మనుపవయ్య!(26) వినుము; నృపాల నా పలుకు వేయును నేల సమీరసూతి నీ¯ తనయుల పేరు విన్నఁ బదతాడిత దుష్టభుజంగమంబు చా¯ డ్పునఁ గనలొందు; నింతయును మున్నునుఁ జెప్పితిఁ గాదె వానిచే¯ తన భవదీయ పుత్రులకుఁ దప్పదు మృత్యు వదెన్ని భంగులన్.(27) అదియునుంగాక.(28) నీపుత్రుల శౌర్యంబునుఁ¯ జాపాచార్యాపగాత్మజాత కృపభుజా¯ టోపంబునుఁ గర్ణు దురా¯ లాపంబులు నిజముగాఁ దలంతె మనమునన్.(29) అట్లేని వినుము.(30) ఏ పరమేశుచే జగము లీ సచరాచరకోటితో సము¯ ద్దీపితమయ్యె; నే విభుని దివ్యకళాంశజు లబ్జగర్భ గౌ¯ రీపతి ముఖ్య దేవ ముని బృందము; లెవ్వఁ డనంతుఁ డచ్యుతుం¯ డా పురుషోత్తముండు గరుణాంబుధి గృష్ణుఁడు పో నరేశ్వరా!(31) అట్టి జగన్నివాసుఁడు మురాసురభేది పరాపరుండు చే¯ పట్టి సఖుండు, వియ్యమును, బాంధవుఁడున్, గురుఁడున్, విభుండునై¯ యిట్టలమైన ప్రేమమున నెప్పుడుఁ దోడ్పడుచుండు వారలం¯ జుట్టన వ్రేల నెవ్వరికిఁ జూపఁగ వచ్చునె? పార్థివోత్తమా!(32) కావునఁ బాండునందనులఁ గాఱియ వెట్టక రాజ్యభాగమున్¯ వావిరి నిచ్చి రాజ్యమును వంశముఁ బుత్రుల బంధువర్గముం¯ గావుము; కాక లోభి యగు కష్ట సుయోధను మాట వింటివే¯ భూవర! నీ యుపేక్ష నగుఁ బో కులనాశము బంధునాశమున్.(33) ఒకనికై యిట్లు కుల మెల్ల నుక్కడింప¯ నెత్తికొనఁ జూచె దిది నీతియే నృపాల! ¯ వినుము; నామాట; నీ సుయోధనుని విడిచి¯ కులము రాజ్యంబుఁ దేజంబు నిలుపవయ్య."(34) అని యిట్లుఁ దఱిమి చెప్పిన¯ విని దుర్యోధనుఁడు రోషవివశుండై తా¯ నినతనయ శకుని దుశ్శా¯ సనుల నిరీక్షించి తామసంబునఁ బలికెన్.(35) "దాసీపుత్రుని మీరలుఁ¯ దాసీనుం జేయ కిటకుఁ దగునె పిలువఁగా? ¯ నాసీనుండై ప్రేలెడు ¯ గాసిలి చెడిపోవ వెడలఁగా నడువుఁ డిఁకన్.
యుద్ధవ దర్శనంబు
(36) అని యిట్లు దుర్యోధనుం డాడిన దురాలాపంబులు దనకు మనస్తాపంబు సేయం గార్యంబు విచారించి ధైర్యం బవలంబించి యొండు వలుకనొల్లక శరశరాసనంబులు విడిచి క్రోధంబు నడంచి విదురుండు వనంబునకుం జని, యందు.(37) విష్ణుస్వయంవ్యక్త విమలభూములనుఁ బ¯ విత్రంబులగు హరిక్షేత్రములను ¯ నెలకొని దేవతానిర్మిత హరిదివ్య¯ భూముల గంగాది పుణ్యనదుల¯ సిద్ధపురాణప్రసిద్ధ పుణ్యాశ్రమ¯ స్థలముల నుపవనస్థలము లందు¯ గంధమాధన ముఖక్ష్మాభృత్తటంబుల¯ మంజులగిరి కుంజ పుంజములను(37.1) వికచకైరవ పద్మ హల్లక మరంద¯ పాన పరవశ మధుకర గాన బుద్ధ¯ రాజహంస విలాస విరాజమాన¯ మగుచుఁ జెలువొందు పంకేరుహాకరముల.(38) మఱియును ఋష్యాశ్రమ వన¯ సరి దుపవన నద పుళింద జనపద గిరి గ¯ హ్వర గోష్ట యజ్ఞశాలా¯ పుర దేవాయతన పుణ్యభూముల యందున్.(39) కూరలుఁ గాయలు నీళ్ళా¯ హారముగాఁ గొనుచు నియమ మలవడఁగ నసం¯ స్కారశరీరుం డగుచు ను¯ దారత నవధూతవేషధరుఁడై వరుసన్.(40) హర్షము గదురఁగ భారత¯ వర్షమునం గలుగు పుణ్యవరతీర్థము లు¯ త్కర్షం జూచుచు విగతా¯ మర్షుండై సంచరించె మనుజవరేణ్యా!(41) ఇట్లు సంచరించుచుఁ బ్రభాసతీర్థముకు వచ్చునప్పుడు.(42) అరుగుచు దైత్యభేదన దయాపరిలబ్ధ సమస్త మేదినీ¯ భరణధురందరుం డగుచుఁ బాండుసుతాగ్రజుఁ డొప్పుచుండ భూ¯ వర! విదురుండుఁ దన్నికటవర్య తమాల రసాల మాధవీ¯ కురవక మాలతీ వకుళ కుంజ లసత్తట మందు నున్నెడన్.(43) నరవర! వేణుజానలవినష్ట మహాటవిమాడ్కిఁ బాండు భూ¯ వర ధృతరాష్ట్ర సూను లనివార్య నిరూఢ విరోధ మెత్తి యొం¯ డొరుల జయింపఁ గోరి కదనోర్విఁ గురుక్షితిపాలముఖ్యు లం¯ దఱు మృతు లౌటయున్ విని ఘనంబుగ శోకనిమగ్నచిత్తుఁడై.(44) ఆ యెడఁ గాలు దన్నక రయంబున నేఁగి సరస్వతీనదీ¯ తోయములందుఁ గ్రుంకి మునితుల్యుఁడు వే చనియెం దనూనపా¯ త్తోయరుహాప్త భార్గవ పృథుత్రిత సోమ సుదాస శక్తి భృ¯ ద్వాయు యమాభిధానయుత వాహినులం దనురక్తిఁ గ్రుంకుచున్.(45) వెండియుఁ బుణ్యభూములఁ బవిత్రసరిత్తులఁ జూచుచున్ రమా¯ మండనుఁ డుండు దివ్యరుచిమన్మణిచారుకవాట గేహళీ¯ మండిత సౌధగోపుర విమానము లున్నత భక్తిఁ జూచుచున్¯ నిండిన వేడ్కఁ గృష్ణు పద నీరజ చింతనుఁ డై క్రమంబునన్.(46) చని చని తొంటి మత్స్యకురుజాంగలభూము లతిక్రమించి చ¯ య్యన యమునానదిం గదిసి యచ్చట భాగవతున్ సరోజలో¯ చన దృఢభక్తు సద్గుణవిశారదు శాంతుని దేవమంత్రి శి¯ ష్యుని మహితప్రసిద్ధుఁ బరిశోషితదోషుఁ బ్రబుద్ధు నుద్ధవున్.(47) కని యనురాగ వికాసము¯ దన మనమునఁ దొంగిలింపఁ దగ గాఢాలిం¯ గన మాచరించి నెయ్యం¯ బునఁ గుశలప్రశ్న సేసి ముదమునఁ బలికెన్.(48) "హరిభక్తులు పుణ్యాత్ములు¯ దురితవిదూరులు విరోధిదుర్దమబలులుం¯ గురుకులతిలకులు కుంతీ¯ వరసూనులు గుశలులే యవారిత భక్తిన్. (49) హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ¯ శ్వరుఁ డతిభక్తి వేడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై¯ పరఁగ జనించి భూభరముఁ బాపిన భవ్యులు రేవతీందిరా¯ వరులట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే?(50) కురుకులు లాదరింపఁగ సఖుండును నాప్తుఁడునై తనర్చి సో¯ దర తరుణీజనంబులనుఁ దత్పతులం గడు గారవంబునం¯ గరుణ దలిర్ప నాత్మజులకంటెఁ బ్రియోన్నతిఁ బ్రోచువాడు సు¯ స్థిరమతి నున్నవాఁడె వసుదేవుఁడు వృష్ణికులప్రదీపకా!(51) కందర్పాంశమునం దనూజుఁ బడయం గామించి భూదేవతా¯ బృందంబున్ భజియించి తత్కరుణ దీపింపం బ్రభావంబు పెం¯ పొందన్ రుక్మిణి గన్ననందనుఁడు ప్రద్యుమ్నుండు భాస్వచ్ఛమూ¯ సందోహంబులు దన్నుఁ గొల్వ మహితోత్సాహంబునన్ మించునే.(52) సరసిజలోచన కరుణా¯ పరిలబ్ధ సమస్త ధరణిపాలన మహిమం¯ బరమప్రీతి సుఖించునె¯ చిరవిభవోదారుఁ డుగ్రసేనుఁడు జగతిన్.(53) లలిత పతివ్రతామణి విలాసవతీతిలకంబు పార్వతీ¯ లలన గుమారుఁ గన్నటు సులక్షణ జాంబవతీ లలామ ని¯ ర్మల గతిఁ గన్న పట్టి సుకుమారతనుండు విరోధిభంజనో¯ త్కలిక సుఖించునే గుణకదంబుఁడు సాంబుఁడు వృష్ణిపుంగవా!(54) హరిపదసేవకుఁ డరి భీ¯ కరుఁ డర్జును వలన మిగులఁ గార్ముక విద్యల్¯ దిరముగఁ గఱచిన సాత్యకి¯ వరసుఖ విభవముల నున్నవాఁడె ధరిత్రిన్?(55) జలజాతాంకుశ చక్ర చాప కులిశచ్ఛత్రాది రేఖాంకితో¯ జ్జ్వల గోవింద పదాబ్జ లక్షిత విరాజన్మార్గ ధూళిచ్ఛటా¯ కలితాంగుండు విధూతకల్మషుఁడు నిష్కామైక ధర్ముండు స¯ త్కులజాతుండన నొప్పు నట్టి ఘనుఁ డక్రూరుండు భద్రాత్ముఁడే?(56) శ్రుతులునుఁ గ్రతుజాతము స¯ మ్మతిఁ దాల్చినయట్టి వేదమాతగతిన్ శ్రీ¯ పతిఁ దనగర్భంబున ర¯ క్షితుఁ జేసిన గరిత దేవకీసతి సుఖమే.(57) మఱియు, మహాత్మా! మహితోపాసకులగువారల కోర్కులు నిండింపజాలిన పరమేశ్వరుండు శబ్దశాస్త్రంబునకుం గారణంబని తన్ను నఖిల దేవతాజనంబు లగ్గింపంగలమేటి యగుటంజేసి మనోమయుండును సకలజీవచతుర్విధాంతఃకరణంబు లైన చిత్తాహంకార బుద్ధి మనంబులకుం గ్రమంబున వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నానిరుద్ధు లధిదేవతంబు లగుదు; రట్టి చతుర్విధతత్త్వంబులకుఁ దుర్యంబైన తత్త్వంబును నైన యనిరుద్ధకుమారుండు సంతోషచిత్తుండగునే"యని.(58) "ఇతరారాధన మాని కృష్ణుఁ గమలాధీశుం బయోజాసనా¯ ర్చితు భక్తిన్ నిజనాథుఁగా సతతమున్ సేవించు పుణ్యుల్ జగ¯ న్నుతు లధ్యాత్మ విదుల్మహాభుజులు మాన్యుల్ ధర్మమార్గుల్సము¯ న్నతి సత్యాత్మజ చారుదేష్ణ గదు లానందాత్ములే యుద్ధవా!(59) క్రోధమాత్సర్యధనుఁడు సుయోధనుండు¯ వొలుచు నెవ్వనిసభఁ జూచి కలుష మొదవి¯ మనములోన నసూయానిమగ్నుఁ డయ్యె¯ నట్టి ధర్మజుఁ డున్నాడె? యనఘచరిత!(60) ఘనగదాభ్యాస చిత్ర సంగతుల మెఱసి¯ కురుకుమారుల భూరి సంగరము లోన¯ హతులఁ గావించి వెలసినయట్టి జెట్టి¯ వాయుతనయుండు గుశలియై వఱలునయ్య?(61) హరికరుణాతరంగిత కటాక్ష నిరీక్షణ లబ్ధ శౌర్య వి¯ స్ఫురణఁ దనర్చి తన్ను నని బోయగతిన్ గిరిశుం డెదర్చినం ¯ పరవశ మొప్పఁగా గెలిచి పాశుపతాస్త్రముఁ గొన్న శత్రు భీ¯ కరుఁడు ధనంజయుండు సుభగస్థితి మోదము నొందుచుండునే?(62) తెఱఁగొప్పన్ జననీవియోగమునఁ గుంతీస్తన్యపానంబు సో¯ దర సంరక్షయుఁ గల్గి దేవవిభు వక్త్రస్థామృతంబున్ ఖగే¯ శ్వరుఁ డర్థిం గయికొన్న మాడ్కిఁ గురువంశశ్రేణి నిర్జించి త¯ ద్ధరణీరాజ్యముఁ గొన్న మాద్రికొడుకుల్ ధన్యాత్ములే? యుద్ధవా!(63) పాండుభూమీశ్వరుండు సంప్రాప్తమరణుఁ¯ డైన శిశువులఁ బ్రోచుటకై నిజేశుఁ¯ గూడి చనకున్న యట్టి యా కుంతిభోజ¯ తనయ జీవించునే నేఁడు? మనుచరిత్ర!"(64) అని వెండియు.(65) "అనుజాతుండగు పాండుభూవిభుఁడు నిర్యాణంబునుంబొందనా¯ తనిపుత్రుల్ తనుఁ జేరవచ్చినను మాధ్యస్థ్యంబుఁబోఁదట్టి యె¯ గ్గొనరించెన్ ధృతరాష్ట్రభూమివిభుఁ డట్లూహింపఁగా నెగ్గుసే¯ సినవాఁడే యగుగాక మేలుగలదే చింతింపఁగా నుద్ధవా!(66) అనుజుఁడు వీఁడనకయ తన¯ తనయులు నను వెడలనడువఁ దానూరకయుం¯ డిన ధృతరాష్ట్రుఁడు నరకం¯ బునఁబడు నాదైన దుఃఖమున ననఘాత్మా!(67) అదియునుంగాక పరమశాంతుండవైన నీ మనంబున దుఃఖంబు కర్తవ్యంబుగాదంటేని.(68) నరలోకవిడంబనమున¯ హరి పరమపరుండు మానవాకృతితో ని¯ ద్ధరఁబుట్టి యాత్మమాయా¯ స్ఫురణన్ మోహింపఁజేయు భూజనకోటిన్.(69) కావున నమ్మహాత్ముని వికారవిదూరుని సర్వమోహమా¯ యావిలమానసుండ నగునప్పుడు సంసృతిదుఃఖినౌదు న¯ ద్ధేవుని సత్కృపామహిమఁ దేలినవేళ సుఖింతు నేనకా¯ దా విధిశంకరప్రభృతు లవ్విభుమాయఁ దరింపనేర్తురే.(70) అయిన నమ్మహాత్ముని కరుణాతరంగితాపాంగ పరిలబ్ధ విజ్ఞాన దీపాంకుర నిరస్త సమస్తదోషాంధకారుండ నగుటంజేసి మదీయ చిత్తంబు హరిపరాయత్తంబయిన కారణంబుననుఁ, దత్త్వంబు సతతంబు నిరీక్షించుచు నుండుదు; మఱియును.(71) అట్టి సరోజాక్షుఁ డాత్మీయపదభక్తు¯ లడవుల నిడుమలఁ గుడుచుచుండ¯ దౌత్యంబుసేయఁ గొందఱు విరోధులు హరి¯ బద్ధునిఁజేయ సన్నద్ధులైన¯ బలహీనుమాడ్కి మార్పడలేఁడ యసమర్థుఁ¯ డని తలంచెదవేని నచ్యుతుండు¯ పరుల జయింప నోపక కాదు విద్యాభి¯ జాత్యధనంబుల జగతిఁ బెక్కు(71.1) బాధలనలంచు దుష్టభూపతులనెల్ల¯ సైన్యయుక్తంబుగా నని సంహరించు¯ కొఱకు సభలోన నప్పుడా కురుకుమారు¯ లాడు దుర్భాషణములకు నలుగఁడయ్యె.(72) జననంబందుటలేని యీశ్వరుఁడు దా జన్మించుటెల్లన్ విరో¯ ధినిరాసార్థము వీతకర్ముఁడగు నద్దేవుండు గర్మప్రవ¯ ర్తనుఁ డౌటెల్లఁ జరాచరప్రకటభూతశ్రేణులం గర్మవ¯ ర్తనులం జేయఁదలంచి కాక కలవే దైత్యారికింగర్మముల్.(73) హరి నరులకెల్లఁ బూజ్యుఁడు¯ హరి లీలామనుజుఁడును గుణాతీతుఁడునై¯ పరఁగిన భవకర్మంబులఁ¯ బొఁరయండఁట హరికిఁ గర్మములు లీలలగున్.(74) మదిఁ దనశాసనమిడి నిజ¯ పదములు సేవించు లోకపాలాదుల పెం¯ పొదవింప యదుకులంబున¯ నుదయించెను భువిని బలసహోదరుఁడగుచున్.(75) చలనమందక భూరి సంసరణతరణ¯ మైనసత్కీర్తి దిక్కుల నతిశయిల్లి¯ వఱల సమమతియై యున్నవాఁడె కృష్ణుఁ"¯ డనుచు నుద్దవుని విదురుఁ డడుగుటయును.(76) అట్టియెడ నయ్యుద్ధవుండు.