భాగవతము పారాయణ : ద్వితీయ 80 - 171
బ్రహ్మ అధిపత్యం బొడయుట
(80) "రారా బుధులు; విరక్తులు¯ గారా; యీ రీతి నడుగఁగా నేరరు; వి¯ స్మేరావహము భవన్మత¯ మౌరా! నా విభుని మర్మమడిగితి వత్సా! (81) నానా స్థావరజంగమప్రకరముల్ నా యంత నిర్మింప వి¯ జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వానుసం¯ ధానారంభ విచక్షణత్వము మహోదారంబు గా నిచ్చె ము¯ న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగముల్ నిర్మింప శక్తుండనే? (82) అనఘా! విశ్వము నెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే? ¯ యిన చంద్రానల తారకా గ్రహగణం బే రీతి నా రీతి నె¯ వ్వని దీప్తిం బ్రతిదీప్తమయ్యె భువనవ్రాతంబు దద్ధీప్తిచే¯ ననుదీప్తం బగునట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్. (83) వినుమీ; యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి¯ గ్గున సంకోచము నొందు మాయవలనం గుంఠీభవత్ప్రజ్ఞచే¯ నను లోకేశ్వరుఁ డంచు మ్రొక్కు మతిహీనవ్రాతముం జూచి నే¯ ననిశంబున్ నగి ధిక్కరింతు హరిమాయాకృత్య మంచున్ సుతా! (84) మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును జన్మనిమిత్తంబులైన కర్మంబులునుఁ, గర్మక్షోభకంబైన కాలంబునుఁ, గాలపరిణామ హేతువైన స్వభావంబును, భోక్త యైన జీవుండును, వాసుదేవుండ కా నెఱుంగుము; వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు; సిద్ధంబు నారాయణ నియమ్యంబులు లోకంబులు దేవతలు నారాయణశరీరసంభూతులు; వేద యాగ తపోయోగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు జ్ఞానసాధ్యం బగు ఫలంబు నారాయణు నధీనంబు; కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయు నయిన యీశ్వరుని కటాక్ష విశేషంబున సృజియింపంబడి ప్రేరితుండనై సృజ్యంబైన ప్రపంచంబు సృజించుచుండుదు; నిర్గుణుండైన యీశ్వరుని వలన రజస్సత్త్వతమోగుణంబులు ప్రభూతంబులై యుత్పత్తి స్థితిలయంబులకుం బాలుపడి కార్య కారణ కర్తృత్వ భావంబు లందు ద్రవ్యంబులైన మహాభూతంబులును జ్ఞానమూర్తు లయిన దేవతలును గ్రియారూపంబు లయిన యింద్రియంబులును నాశ్రయంబులుగా నిత్యముక్తుం డయ్యును మాయాసమన్వితుండైన జీవుని బంధించు; జీవునకు నావరణంబులయి యుపాధిభూతంబు లయిన మూఁడు లింగంబులు సేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబుగల యీశ్వరుం డివ్విధంబున గ్రీడించుచుండు. (85) ఆ యీశుఁడ నంతుఁడు హరి¯ నాయకుఁ డీ భువనములకు, నాకున్, నీకున్, ¯ మాయకుఁ బ్రాణివ్రాతము¯ కీ యెడలన్ లేద యీశ్వరేతరము సుతా! (86) వినుము మాయావిభుండైన యీశ్వరుండు దన మాయం జేసి దైవయోగంబునం బ్రాప్తంబులయిన కాలజీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి కైకొనియె; నీశ్వరాధిష్ఠితం బైన మహత్తత్త్వంబు వలన నగు కాలంబున గుణవ్యతికరంబును స్వభావంబునఁ బరిణామంబును జీవాదృష్టభూతంబయిన కర్మంబున జన్మంబును నయ్యె; రజస్సత్త్వంబులచే నుపబృంహితంబై వికారంబు నొందిన మహత్తత్త్వంబు వలనం దమఃప్రధానంబై ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె; నదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తి యైన తామసంబునుఁ గ్రియాశక్తి యైన రాజసంబును జ్ఞానశక్తి యైన సాత్వికంబును నన మూఁడు విధంబు లయ్యె; నందు భూతాది యైన తామసాహంకారంబు వలన నభంబు కలిగె; నభంబునకు సూక్ష్మరూపంబు ద్రష్టృదృశ్యములకు బోధకంబైన శబ్దంబు గుణంబగు; నభంబువలన వాయువు గలిగె; వాయువునకుం బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగి యుండు; నది దేహంబు లం దుండుటం జేసి ప్రాణరూపంబై యింద్రియ మనశ్శరీరపాటవంబునై యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు; వాయువు వలన రూప స్పర్శ శబ్దంబు లనియెడు గుణంబులుఁ మూఁటితోడఁ తేజంబుఁ గలిగె; దేజంబు వలన రస రూప స్పర్శ శబ్దంబు లనియెడి నాలుగు గుణంబులతోడ జలంబు గలిగె; జలంబు వలన గంధ రస రూప స్పర్శ శబ్దంబు లనియెడు గుణంబు లయిదింటితోడం బృథివి గలిగె; వైకారికంబైన సాత్త్వికాహంకారంబు వలనఁ జంద్రదైవతంబయిన మనంబు గలిగె; మఱియు దిక్కులును వాయువును నర్కుండును బ్రచేతసుండును నాశ్వినులును వహ్నియు నింద్రుండు నుపేంద్రుండును మిత్రుండునుఁ బ్రజాపతియు ననియెడి దశదేవతలు గలిగిరి; తైజసంబైన రాజసాహంకారంబు వలన దిగ్దైవతంబైన శ్రవణేంద్రియంబును, వాయుదైవతంబైన త్వగింద్రియంబును, సూర్యదైవతంబైన నయనేంద్రియంబును, ప్రచేతోదైవతంబైన రసనేంద్రియంబును, నశ్విదైవతంబైన ఘ్రాణేంద్రియంబును, వహ్నిదైవతంబైన వాగింద్రియంబును, ఇంద్రదైవతంబైన హస్తేంద్రియంబును నుపేంద్రదైవతంబైన పాదేంద్రియంబును, మిత్రదైవతంబైన గుదేంద్రియంబును బ్రజాపతి దైవతంబైన గుహ్యేంద్రియంబును ననియెడి దశేంద్రియంబులును బోధజనకాంతఃకరణైక భాగంబయిన బుద్ధియుఁ గ్రియాజనకాంతఃకరణంబయిన ప్రాణంబునుం గలిగె; నిట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతోఁ గూడిన భూతేంద్రియ మనో గుణంబులు వేర్వేఱుగఁ బ్రహ్మాండ శరీరనిర్మాణంబునం దసమర్థంబు లగునపుడు గృహ నిర్మాణంబునకుం బెక్కు పదార్థంబులు సంపాదించినంగాని చాలని చందంబున భూతేంద్రియ మనోగుణంబుల వలన గృహంబు కైవడి భగవచ్ఛక్తి ప్రేరితంబులగుచు నేకీభవించిన సమిష్టి వ్యష్టాత్మకత్వంబు నంగీకరించి చేతనాచేతనంబులం గల బ్రహ్మాండంబు కల్పితం బయ్యె; నట్టి యండంబు వర్షాయుత సహస్రాంతంబు దనుక జలంబు నందుండెఁ; గాల కర్మ స్వభావంబులం దగులువడక సమస్తంబును జీవయుక్తంబుగఁ జేయు నీశ్వరుం డచేతనంబును సచేతనంబునుగ నొనర్చె; నంతఁ గాల కర్మ స్వభావ ప్రేరకుండయిన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్య స్థితంబయిన బ్రహ్మాండంబులోను సొచ్చి సవిస్తారంబు గావించి యట్టి యండంబు భేదించి నిర్గమించె; నెట్లంటేని.
లోకంబులు పుట్టుట
(87) భువనాత్మకుఁ డా యీశుఁడు¯ భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్¯ వివరముతోఁ బదునాలుఁగు¯ వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్ (88) బహు పా దోరు భు జాన నేక్షణ శిరఃఫాలశ్రవోయుక్తుఁడై¯ విహరించున్ బహుదేహి దేహగతుఁడై; విద్వాంసు లూహించి త¯ ద్బహురూపావయవంబులన్ భువనసంపత్తిన్ విచారింతు; రా¯ మహనీయాద్భుతమూర్తి యోగిజన హృన్మాన్యుండు మేధానిధీ! (89) వినుము; చతుర్దశ లోకంబులందు మీఁది యేడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటి ప్రదేశంబున నుండి యూర్ధ్వదేహమనియునుఁ, గ్రింది యేడు లోకంబులు జఘనంబునుండి యధోదేహ మనియునుం, బలుకుదురు; ప్రపంచశరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మకులంబును, బాహువులవలన క్షత్రియకులంబును, నూరువులవలన వైశ్యకులంబునుఁ, బాదంబులవలన శూద్రకులంబును, జనియించె నని చెప్పుదురు; భూలోకంబు గటిప్రదేశంబు; భువర్లోకంబు నాభి; సువర్లోకంబు హృదయంబు; మహర్లోకంబు వక్షంబు; జనలోకంబు గ్రీవంబు; తపోలోకంబు స్తనద్వయంబు; సనాతనంబును బ్రహ్మనివాసంబునునైన సత్య లోకంబు శిరంబు; జఘనప్రదేశం బతలంబు; తొడలు విత లంబు; జానువులు సుతలంబు; జంఘలు తలాతలంబు; గుల్ఫంబులు మహాతలంబు; పాదాగ్రంబులు రసాతలంబు; పాదతలంబు పాతాళంబు నని లోకమయుంగా భావింతురు; కొందఱు మఱియుం బాదతలంబువలన భూలోకంబును నాభివలన భువర్లోకంబును; శిరంబున స్వర్లోకంబును; గలిగె నని లోకకల్పనంబు నెన్నుదురు; పురుషోత్తముని ముఖంబు వలన సర్వ జంతు వాచాజాలంబును, తదధిష్ఠాత యగు వహ్నియు నుదయించె; చర్మరక్తమాంసమేదశ్శల్యమజ్జాశుక్లంబులు సప్తధాతువు లని యందురు; పక్షాంతరంబున రోమ త్వఙ్మాంసాస్థి స్నాయు మజ్జా ప్రాణంబును సప్తధాతువు లని యందురు. అందు రోమంబు లుష్టి క్ఛందం బనియుఁ, ద్వక్కు ధాత్రీ ఛందం బనియు, మాంసంబు త్రిష్టు ప్ఛందం బనియు, స్నాయు వనుష్టు చ్ఛందం బనియు, నస్థి జగతీ ఛందంబనియు, మజ్జ పంక్తి చ్ఛందం బనియుఁ, బ్రాణంబు బృహతీ ఛందం బనియు, నాదేశింతురు; హవ్య కవ్యామృతాన్నంబులకు మధురాది షడ్రసంబులకు రసనేంద్రియంబునకు రసాధీశ్వరుండైన వరుణునికిని హరి రసనేంద్రియంబు జన్మస్థానంబు; సర్వ ప్రాణాదులకు వాయువునకు విష్ణునాసికా వివరంబు నివాసంబు; సమీప దూర వ్యాపి గంధంబులకు నోషధులకు నశ్విదేవతలకు భగవంతుని ఘ్రాణేంద్రియంబు నివాసంబు; దేవలోక సత్యలోకంబులకుఁ దేజంబునకు సూర్యునకు సకల చక్షువులకు లోకలోచనుని చక్షురింద్రియంబు స్థానంబు; దిశలకు నాకాశంబునకు శ్రుతి భూతంబులైన యంశంబులకు శబ్దంబునకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మస్థానంబు; వస్తుసారంబులకు వర్ణనీయసౌభాగ్యంబులకుఁ బరమపురుషుని గాత్రంబు భాజనంబు; స్పర్శంబునకు వాయువునకు సకల స్నిగ్ధత్వంబునకు దివ్యదేహుని దేహేంద్రియంబు గేహంబు; యూప ప్రముఖ యజ్ఞోపకరణసాధనంబులగు తరుగుల్మలతాదులకుఁ బురుషోత్తముని రోమంబులు మూలంబులు; శిలాలోహంబులు సర్వమయుని నఖంబులు; మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు; మెఱుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు; భూర్భువస్సువర్లోక రక్షకు లైన లోకపాలకుల పరాక్రమంబులకు భూరాదిలోకంబుల క్షేమంబునకు శరణంబునకు నారాయణుని విక్రమంబులు నికేతనంబులు; సర్వకామంబులకు నుత్తమంబులైన వరంబులకుఁ దీర్థపాదుని పాదారవిందంబు లాస్పదంబులు; జలంబులకు శుక్లంబునకుఁ బర్జన్యునకుఁ బ్రజాపతి సర్గంబునకు సర్వేశ్వరుని మేఢ్రంబు సంభవనిలయంబు; సంతానమునకుఁ గామాది పురుషార్థంబులకుఁ జిత్తసౌఖ్యరూపంబు లగు నానందంబులకు శరీరసౌఖ్యంబునకు నచ్యుతుని యుపస్థేంద్రియంబు స్థానంబు; యమునికి మిత్రునికి మలవిసర్గంబునకు భగవంతుని పాయ్వింద్రియంబు భవనంబు; హింసకు నిరృతికి మృత్యువునకు నిరయంబునకు నిఖిలరూపకుని గుదంబు నివాసంబు; పరాభవంబునకు నధర్మంబునకు నవిద్యకు నంధకారంబునకు ననంతుని పృష్ఠభాగంబు సదనంబు; నదనదీ నివహంబునకు నీశ్వరుని నాడీ సందోహంబు జన్మమందిరంబు; పర్వతంబులకు నధోక్షజుని శల్యంబులు జనకస్థలంబులు; ప్రధానంబునకు నన్నరసంబునకు సముద్రంబులకు భూతలయంబునకు బ్రహ్మాండ గర్భుని యుదరంబు నివేశంబు; మనోవ్యాపారరూపంబగు లింగశరీరంబునకు మహామహిముని హృదయంబు సర్గభూమి యగు మఱియును. (90) నీలకంధరునకు నీకు నాకు సనత్కు¯ మార ముఖ్య సుతసమాజమునకు¯ ధర్మ సత్త్వ బుద్ధి తత్త్వములకు నీశ్వ¯ రాత్మ వినుము పరమమైన నెలవు. (91) నర సురాసుర పితృ నాగ కుంజర మృగ¯ గంధర్వ యక్ష రాక్షస మహీజ¯ సిద్ధ విద్యాధర జీమూత చారణ¯ గ్రహ తారకాప్సరోగణ విహంగ¯ భూత తటిద్వస్తు పుంజంబులును నీవు¯ ముక్కంటియును మహామునులు నేను¯ సలిలనభస్థ్సలచరములు మొదలైన¯ వివిధ జీవులతోడి విశ్వమెల్ల¯ (91.1) విష్ణుమయము పుత్ర! వేయేల బ్రహ్మాండ¯ మతని జేనలోన నడఁగి యుండు; ¯ బుద్ధి నెఱుఁగరాదు భూతభవద్భవ్య¯ లోకమెల్ల విష్ణులోన నుండు. (92) మండలములోన భాస్కరుఁ¯ డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ బ్ర¯ హ్మాండములోపల నచ్యుతుఁ¯ డుండుచు బహిరంతరముల నొగి వెలిఁగించున్.
నారయ కృతి ఆరంభంబు
(93) అట్టి యనంతశక్తి జగదాత్ముని నాభిసరోజమందుఁ నేఁ¯ బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞపదార్థజాతముల్¯ నెట్టన కానరామికి వినిర్మల మైన తదీయ రూపమున్ ¯ గట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నా మనంబునన్. (94) పశు యజ్ఞ వాట యూపస్తంభ పాత్ర మృ¯ ద్ఘట శరావ వసంత కాలములును ¯ స్నేహౌషధీ బహు లోహ చాతుర్హోత్ర¯ మత నామధేయ సన్మంత్రములును¯ సంకల్ప ఋగ్యజుస్సామ నియుక్త వ¯ షట్కారమంత్రానుచరణములును¯ దక్షిణల్ దేవతాధ్యాన తదనుగత¯ తంత్ర వ్రతోద్ధేశ ధరణిసురులు (94.1) నర్పణంబులు బోధాయనాది కర్మ¯ సరణి మొదలగు యజ్ఞోపకరణసమితి¯ యంతయును నమ్మహాత్ముని యవయవములు¯ గాఁగఁ గల్పించి విధివత్ప్రకారమునను. (95) యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు¯ యజ్ఞేశుఁడు యజ్ఞకర్తయగు భగవంతున్¯ యజ్ఞపురుషుఁగా మానస¯ యజ్ఞముఁ గావించితిం దదర్పణ బుద్ధిన్. (96) అప్పుడు బ్రహ్మలు దమలోఁ¯ దప్పక ననుఁ జూచి సముచితక్రియు లగుచు¯ న్నప్పరమేశున కభిమత¯ మొప్పఁగఁదగు సప్తతంతు వొగిఁ గావింపన్. (97) మనువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి, దా¯ రనయము వారివారికిఁ బ్రియంబగు దేవతలన్ భజించుచున్¯ ఘనతర నిష్ఠ యజ్ఞములఁ గైకొని చేసిరి; తత్ఫలంబుల¯ య్యనుపమమూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందఁగన్. (98) సువ్యక్త తంత్రరూపకుఁ¯ డవ్యక్తుఁ డనంతుఁ డభవుఁ డచ్యుతుఁ డీశుం¯ డవ్యయుఁడగు హరి సురగణ¯ సేవ్యుఁడు క్రతుఫలదుఁ డగుటఁ జేసిరి మఖముల్. (99) అగుణుండగు పరమేశుఁడు¯ జగములఁ గల్పించుకొఱకుఁ జతురత మాయా¯ సగుణుం డగుఁ గావున హరి¯ భగవంతుం డనఁగఁ బరఁగె భవ్యచరిత్రా! (100) విశ్వాత్ముఁడు, విశ్వేశుఁడు, ¯ విశ్వమయుం, డఖిలనేత, విష్ణుఁ, డజుం, డీ¯ విశ్వములోఁ దా నుండును¯ విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు నుండన్. (101) అతని నియుక్తిఁ జెంది సచరాచర భూతసమేతసృష్టి నే¯ వితతముగా సృజింతుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ¯ పతి లయమొందఁ జేయు; హరి పంకరుహోదరుఁ డాదిమూర్తి య¯ చ్యుతుఁడు త్రిశక్తియుక్తుఁ డగుచుండును నింతకుఁ దానమూలమై. (102) విను వత్స! నీవు నన్నడి¯ గిన ప్రశ్నకు నుత్తరంబు కేవలపరమం¯ బును బ్రహ్మంబీ యఖిలం¯ బున కగు నాధార హేతుభూతము సుమ్మీ. (103) హరి భగవంతుఁ డనంతుఁడు¯ కరుణాంబుధి సృష్టికార్యకారణహేతు¯ స్ఫురణుం డవ్విభుకంటెం¯ బరుఁ డెవ్వఁడు లేడు తండ్రి! పరికింపంగన్. (104) ఇది యంతయును నిక్క మే బొంక నుత్కంఠ¯ మతిఁ దద్గుణధ్యానమహిమఁ జేసి¯ పరికింప నే నేమి పలికిన నది యెల్ల¯ సత్యంబ యగు బుధస్తుత్య! వినుము; ¯ ధీయుక్త! మామకేంద్రియములు మఱచియుఁ¯ బొరయ వసత్యవిస్ఫురణ మెందు; ¯ నదిగాక మత్తను వామ్నాయ తుల్యంబు¯ నమరేంద్ర వందనీయంబు నయ్యెఁ; (104.1) దవిలి యా దేవదేవుని భవమహాబ్ధి¯ తారణంబును మంగళకారణంబు¯ నఖిల సంపత్కరంబునై యలరు పాద¯ వనజమున కే నొనర్చెద వందనములు. (105) ఆ నళినాక్షు నందనుఁడ నయ్యుఁ, బ్రజాపతి నయ్యు, యోగ వి¯ ద్యా నిపుణుండ నయ్యునుఁ, బదంపడి మజ్జననప్రకారమే¯ యేను నెఱుంగ, నవ్విభుని యిద్ధమహత్త్వ మెఱుంగ నేర్తునే? ¯ కానఁబడున్ రమేశపరికల్పితవిశ్వము గొంతకొంతయున్. (106) విను వేయేటికిఁ; దాపసప్రవర! యివ్విశ్వాత్ముఁ డీశుండు దాఁ¯ దన మాయామహిమాంతముం దెలియఁగాఁ దథ్యంబుగాఁ జాలడ¯ న్నను, నే నైనను మీరలైన సురలైనన్ వామదేవుండు నై¯ నను నిక్కం బెఱుఁగంగఁ జాలుదుమె జ్ఞానప్రక్రియాయుక్తులన్. (107) అ మ్మహాత్ముం డైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుం డంటేని. (108) గగనము దన కడపలఁ దాఁ¯ దగ నెఱుగని కరణి విభుఁడు దా నెఱుఁగఁ డనన్¯ గగనప్రసవము లే దన¯ నగునే సర్వజ్ఞతకును హాని దలంపన్.
పరమాత్ముని లీలలు
(109) తలకొని యమ్మహాత్మకుఁడు దాల్చిన యయ్యవతారకర్మముల్¯ వెలయఁగ నస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు; మ¯ య్యలఘు ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరుం¯ దెలియఁగ నేర్తుమే తవిలి; దివ్యచరిత్రున కేను మ్రొక్కెదన్. (110) పరమాత్ముం డజుఁ డీ జగంబుఁ బ్రతికల్పంబందుఁ గల్పించు దాఁ¯ బరిరక్షించును ద్రుంచు నట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ¯ ద్భరితుం గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ¯ శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁ జింతించెదన్. (111) సరసగతిన్ మునీంద్రులు ప్రసన్నశరీరహృషీకమానస¯ స్ఫురణ గలప్పు డవ్విభుని భూరికళాకలితస్వరూపముం¯ దరమిడి చూతు; రెప్పుడుఁ గుతర్క తమోహతిచేత నజ్ఞతం¯ బొరసిన యప్పు డవ్విభునిమూర్తిఁ గనుంగొనలేరు నారదా!" (112) అని వెండియు నిట్లను "ననఘా! యమ్మహనీయతేజోనిధి మొదలి యవతారంబు సహస్ర శీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకం బగు నాదిపురుషు రూపంబగు; నందుఁ గాలస్వభావంబు లను శక్తు లుదయించె; నందుఁ గార్యకారణరూపం బయిన ప్రకృతి జనించెఁ; బ్రకృతివలన మహత్తత్త్వంబును దానివలన నహంకారత్రయంబునుఁ బుట్టె నందు రాజసాహంకారంబువలన నింద్రియంబులును, సాత్వికాహంకారంబువలన నింద్రియగుణ ప్రధానంబు లైన యధిదేవతలునుఁ, దామసాహంకారంబువలన భూతకారణంబు లయిన శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రంబులునుం బొడమెఁ; బంచతన్మాత్రంబులవలన గగనానిల వహ్ని సలిల ధరాదికంబైన భూతపంచకంబు గలిగె; నందు జ్ఞానేంద్రియంబు లయిన త్వక్చక్షు శ్శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులునుఁ గర్మేంద్రియంబులైన వాక్పాణి పాదపాయూపస్థంబులును మనంబును జనియించె; నన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె; నతని వలన స్వయంప్రకాశుండయిన స్వరాట్టు సంభవించె; నందుఁ జరాచర రూపంబుల స్థావరజంగమాత్మకంబయిన జగత్తు; గలిగె నందు సత్వరజస్తమోగుణాత్మకుల మయిన విష్ణుండును హిరణ్యగర్భుడ నయిన యేనును రుద్రుండునుఁ గలిగితి; మందు సృష్టిజననకారణుం డయిన చతుర్ముఖుండు పుట్టె; వాని వలన దక్షాదులగు ప్రజాపతులు దొమ్మండ్రు గలిగిరి; అందు భవత్ప్రముఖులైన సనకసనందనాది యోగీంద్రులును, నాకలోక నివాసు లయిన వాసవాదులును, ఖగలోకపాలకులగు గరుడాదులును, నృలోకపాలకులగు మను మాంధాతృ ప్రముఖులును, రసాతలలోకపాలకు లగు ననంత వాసుకి ప్రభృతులును, గంధర్వ సిద్ధ విద్యా ధర చారణ సాధ్య రక్షోయక్షోరగ నాగలోకపాలురును మఱియు ఋషులునుఁ, బితృదేవతలును, దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూష్మాండ పశు మృగాదులును, నుద్భవించిరి; ఇట్టి జగత్ప్రథమోద్భవంబు మహత్తత్త్వసృష్టి యనంబడు; ద్వితీయం బండసంస్థితం బనం దగుఁ; దృతీయంబు సర్వభూతస్థం బన నొప్పు; నందైశ్వర్య తేజో బల సంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని యంశసంభవులుగా నెఱుంగుము; అప్పుండరీకాక్షుని లీలావతారంబు లనంతంబులు; దత్కర్మంబులు లెక్కపెట్ట నెవ్వరికిని నలవిగాదు; అయినను నాకుం దోఁచి నంత నీ కెఱింగించెద; వినుము.
అవతారంబుల వైభవంబు
(113) అన్య కథానులాపము లహర్నిశమున్ వినునట్టి సత్క్రియా¯ శూన్యములైన కర్ణముల సూరిజనస్తుత సర్వలోక స¯ మ్మాన్యమునై తనర్చు హరిమంగళదివ్యకథామృతంబు సౌ¯ జన్యతఁ గ్రోలవయ్య బుధసత్తమ! యే వివరించి చెప్పెదన్." (114) అని పలికి నారదుం జూచి మఱియు నిట్లనియె. (115) "కనకాక్షుండు భుజావిజృంభణమునన్ క్ష్మాచక్రముం జాపఁ జు¯ ట్టిన మాడ్కిం గొనిపోవ, యజ్ఞమయ దంష్ట్రిస్వాకృతిం దాల్చి య¯ ద్దనుజాధీశ్వరుఁ దాఁకి యబ్ధి నడుమన్ దంష్ట్రాహతిం ద్రుంప ధా¯ త్రిని గూలెం గులిశాహతింబడు మహాద్రిం బోలి యత్యుగ్రతన్. (116) మఱియు సుయజ్ఞావతారంబు విను"మని యిట్లనియె. (117) "ప్రకట రుచిప్రజాపతికిని స్వాయంభు¯ వుని కూఁతు రాకూతి యను లతాంగి¯ కర్థి జన్మించి సుయజ్ఞుండు నానొప్పు¯ నతఁడు దక్షిణ యను నతివయందు¯ సుయమ నా మామరస్తోమంబుఁ బుట్టించి¯ యింద్రుఁడై వెలసి యుపేంద్ర లీల¯ నఖిల లోకంబుల యార్తి హరించిన¯ నతని మాతామహుండైన మనువు (117.1) తన మనంబునఁ దచ్చరిత్రమున కలరి¯ పరమపుణ్యుండు హరి యని పలికెఁ గాన¯ నంచితజ్ఞాననిధి యై సుయజ్ఞుఁ డెలమిఁ¯ దాపసోత్తమ! హరి యవతారమయ్యె." (118) అని చెప్పి సాంఖ్యయోగ ప్రవర్తకాచార్యవర్యుం డగు కపిలుని యవతారంబు విను"మని యిట్లనియె. (119) "ధృతమతి దేవహూతికిని దివ్యవిభుండగు కర్దమప్రజా¯ పతికిఁ బ్రమోద మొప్ప నవభామలతోఁ గపిలాఖ్యఁ బుట్టి యే¯ గతి హరి పొందునట్టి సుభగంబగు సాంఖ్యము దల్లి కిచ్చి దు¯ ష్కృతములువాపి చూపె మునిసేవితమై తనరారు మోక్షమున్. (120) మఱియు దత్తాత్రేయావతారంబు వినుము (121) తాపసోత్తముఁ డత్రి తనయునిఁ గోరి ర¯ మేశు వేఁడిన హరి యేను నీకు¯ ననఘ దత్తుడనైతి నని పల్కు కతమున¯ నతఁడు దత్తాత్రేయుఁడై జనించె¯ నమ్మహాత్ముని చరణాబ్జ పరాగ సం¯ దోహంబుచేఁ బూతదేహు లగుచు¯ హైహయ యదు వంశ్యు లైహికాముష్మిక¯ ఫలరూప మగు యోగబలము వడసి (121.1) సంచితజ్ఞానఫల సుఖైశ్వర్య శక్తి¯ శౌర్యములఁ బొంది తమ కీర్తి చదల వెలుఁగ¯ నిందు నందును వాసికి నెక్కి; రట్టి¯ దివ్యతర మూర్తి విష్ణు నుతింపఁ దరమె? (122) వెండియు సనకాద్యవతారంబు వినుము (123) అనఘాత్మ! యేను గల్పాదిని విశ్వంబు¯ సృజియింపఁ దలఁచి యంచిత తపంబు¯ నర్థిఁ జేయుచు సన యని పల్కుటయు నది¯ కారణంబుగ సనాఖ్యలనుగల స¯ నందన సనక సనత్కుమార సనత్సు¯ జాతులు నల్వురు సంభవించి¯ మానసపుత్రులై మహి నుతికెక్కిరి¯ పోయిన కల్పాంతమున నశించి (123.1) నట్టి యాత్మీయతత్త్వంబు వుట్టఁ జేసి¯ సంప్రదాయక భంగిని జగతి నెల్ల¯ గలుగఁ జేసిరి యవ్విష్ణుకళలఁ దనరి¯ నలువు రయ్యును నొక్కఁడ నయచరిత్ర!
నరనారాయణావతారంబు
(124) మఱియు నరనారాయణావతారంబు వినుము (125) గణుతింపఁగ నరనారా¯ యణు లన ధర్మునకు నుదయ మందిరి; దాక్షా¯ యణియైన మూర్తి వలనం¯ బ్రణుతగుణోత్తరులు పరమపావనమూర్తుల్. (126) అనఘులు బదరీవనమున¯ వినుత తపోవృత్తి నుండ, విబుధాధిపుఁడున్¯ మనమున నిజపదహానికి¯ ఘనముగఁ జింతించి దివిజకాంతామణులన్. (127) రావించి తపోవిఘ్నముఁ¯ గావింపుం డనుచు బనుపఁ గడు వేడుకతో¯ భావభవానీకిను లనఁ¯ గా వనితలు సనిరి బదరికావనమునకున్. (128) అందు. (129) నరనారాయణు లున్న చోటికి మరున్నారీ సమూహంబు భా¯ స్వరలీలం జని రూప విభ్రమ కళా చాతుర్య మేపారఁగాఁ¯ బరిహాసోక్తుల నాటపాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్¯ భరితధ్యాన తపః ప్రభావ నిరతిం బాటించి నిష్కాములై. (130) క్రోధము దమ తపములకును ¯ బాధక మగు టెఱిఁగి దివిజభామలపై న¯ మ్మేధాత్మకు లొక యింతయు ¯ క్రోధముఁ దేరైరి సత్వగుణయుతు లగుటన్. (131) నారాయణుఁ డప్పుడు దన¯ యూరువు వెసఁ జీఱ నందు నుదయించెను, బెం¯ పారంగ నూర్వశీ ముఖ¯ నారీజనకోటి దివిజనారులు మెచ్చన్. (132) ఊరువులందు జనించిన¯ కారణమున నూర్వశి యన ఘనతకు నెక్కెన్¯ వారల రూప విలాస వి¯ హారములకు నోడి రంత నమరీజనముల్. (133) అంతం దాము నరనారాయణుల తపోవిఘ్నంబు గావింపంబూని చేయు విలాసంబులు, మానసికసంకల్ప మాత్రంబున సృష్టి స్థితి సంహారంబు లొనర్పంజాలు నమ్మహాత్ముల దెసం బనికిరాక కృతఘ్నునకుం జేఁయు నుపకృతులుంబోలె నిష్ఫలంబులైన సిగ్గునఁ గుందుచు, నూర్వశిం దమకు ముఖ్యురాలింగాఁ గైకొని తమ వచ్చిన జాడన మరలి చని రంత. (134) కాముని దహించెఁ గ్రోధమ¯ హామహిమను రుద్రుఁ; డట్టి యతికోపము నా¯ ధీమంతులు గెలిచి రనం; ¯ గామము గెలుచుటలు సెప్పఁగా నేమిటికిన్. (135) అట్టి నరనారాయణావతారంబు జగత్పావనంబై విలసిల్లె; వెండియు ధ్రువావతారంబు వివరించెద వినుము. (136) మానిత చరితుఁ డుత్తానపాదుం డను¯ భూవరేణ్యునకు సత్పుత్రుఁ డనగ¯ నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున¯ జనకుని కడనుండి సవితితల్లి¯ దను నాడు వాక్యాస్త్రతతిఁ గుంది మహిత త¯ పంబు గావించి కాయంబుతోడఁ¯ జని మింట ధ్రువపదస్థాయి యై యటమీఁద¯ నర్థి వర్తించు భృగ్వాది మునులుఁ (136.1) జతురగతి గ్రింద వర్తించు సప్తఋషులుఁ¯ బెంపు దీపింపఁ దన్ను నుతింప వెలసి ¯ ధ్రువుఁడు నా నొప్పి యవ్విష్ణుతుల్యుఁ డగుచు¯ నున్న పుణ్యాత్ముఁ డిప్పుడు నున్నవాఁడు. (137) మఱియుఁ బృథుని యవతారంబు వినుము (138) వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుత భాగ్యపౌరుషుం¯ డై నిరయంబునం బడిన నాత్మ తనూభవుఁడై పృథుండు నాఁ¯ బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె; మేదినిన్¯ థేనువుఁ జేసి వస్తువితతిం బితికెన్ హరి సత్కళాంశుఁడై." (139) అని మఱియు "వృషభావతారంబు నెఱిఁగింతు; వినుము; ఆగ్నీంధ్రుండను వానికి "నాభి"యనువాఁ డుదయించె; నతనికి మేరుదేవి యను నామాంతరంబు గల "సుదేవి"యందు హరి వృషభావతారంబు నొంది జడస్వభావంబైన యోగంబు దాల్చి ప్రశాంతాంతఃకరణుండును, బరిముక్త సంగుండునునై పరమహంసాభిగమ్యం బయిన పదం బిది యని మహర్షులు వలుకుచుండం జరించె; మఱియు హయగ్రీవావతారంబు సెప్పెద వినుము. (140) అనఘచరిత్ర! మన్మఖము నందు జనించె హయాననాఖ్యతన్¯ వినుత సువర్ణ వర్ణుఁడును వేదమయుం డఖిలాంతరాత్మకుం¯ డనుపమ యజ్ఞపూరుషుఁడునై భగవంతుఁడు దత్సమస్త పా¯ వనమగు నాసికాశ్వసనవర్గములం దుదయించె వేదముల్.
మత్స్యావతారంబు
(141) మఱియు మత్స్యావతారంబు వినుము (142) ఘనుఁడు వైవస్వతమనువుకు దృష్టమై¯ యరుదెంచునట్టి యుగాంత సమయ¯ మందు విచిత్రమత్స్యావతారము దాల్చి¯ యఖిలావనీమయం బగుచుఁ జాల¯ సర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే¯ కార్ణవంబైన తోయముల నడుమ¯ మన్ముఖశ్లథ వేదమార్గంబులను జిక్కు¯ వడకుండ శాఖ లేర్పడఁగఁ జేసి (142.1) దివ్యు లర్థింప నా కర్థిఁ దెచ్చి యిచ్చి¯ మనువు నెక్కించి పెన్నావ వనధి నడుమ¯ మునుఁగకుండంగ నరసిన యనిమిషావ¯ తార మేరికి నుతియింపఁ దరమె? వత్స! (143) మఱియుఁ గూర్మావతారంబు వినుము. (144) అమృతోత్పాదన యత్నులై విబుధ దైత్యానీకముల్, మందరా¯ గముఁ గవ్వంబుగఁ జేసి యబ్ధిదఱువంగాఁ గవ్వపుంగొండ వా¯ ర్థి మునుంగన్ హరి కూర్మరూపమున నద్రిం దాల్చెఁ దత్పర్వత¯ భ్రమణవ్యాజత వీఁపుఁదీట శమియింపం జేయఁగా నారదా! (145) వెండియు నృసింహావతారంబు వినుము. (146) సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా¯ ధరుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రా కరాళస్య వి¯ స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ¯ కరభాస్వన్నఖరాజిఁ ద్రుంచె ద్రిజగత్కల్యాణసంధాయియై. (147) ఇంక నాదిమూలావతారంబు సెప్పెద వినుము. (148) కరినాథుండు జలగ్రహగ్రహణ దుఃఖాక్రాంతుఁడై వేయి వ¯ త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్¯ హరి నీవే శరణంబు నా కనినఁ గుయ్యాలించి వేవేగ వా¯ శ్చరముం ద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా! (149) మఱియును వామనావతారంబు వినుము. (150) యజ్ఞేశ్వరుండగు హరి విష్ణుఁ డదితి సం¯ తానంబునకు నెల్లఁ దమ్ముఁ డయ్యుఁ¯ బెంపారు గుణములఁ బెద్ద యై వామన¯ మూర్తితో బలిచక్రవర్తిఁ జేరి ¯ తద్భూమి మూడు పాదమ్ము లనడిగి ప¯ దత్రయంబునను జగత్త్రయంబు¯ వంచించి కొనియును వాసవునకు రాజ్య¯ మందింప నీశ్వరుండయ్యు మొఱఁగి (150.1) యర్థిరూపంబు గైకొని యడుగ వలసె¯ ధార్మికుల సొమ్ము వినయోచితముగఁ గాని¯ వెడఁగుఁదనమున నూరక విగ్రహించి¯ చలనమందింపరాదు నిశ్చయము పుత్ర! (151) బలి నిజమౌళి నవ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము¯ త్కలిక ధరించి, తన్నును జగత్త్రయమున్ హరికిచ్చి, కీర్తులన్¯ నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వహానికిం¯ దలఁకక శుక్రు మాటల కుఁదారక భూరివదాన్యశీలుఁడై. (152) మఱియు న ప్పరమేశ్వరుండు నారదా! హంసావతారంబు నొంది యతిశయ భక్తియోగంబున సంతుష్టాంతరంగుం డగుచు నీకు నాత్మతత్త్వప్రదీపకంబగు భాగవతమహాపురాణం బుపదేశించె; మన్వవతారంబు నొంది స్వకీయ తేజఃప్రభావంబున నప్రతిహతంబైన చక్రంబు ధరియించి దుష్టవర్తనులైన రాజుల దండించుచు శిష్ట పరిపాలనంబు సేయుచు నాత్మీయ కీర్తిచంద్రికలు సత్యలోకంబున వెలింగించె; మఱియు ధన్వంతరి యన నవతరించి తన నామస్మరణంబున భూజనంబునకు సకలరోగ నివారణంబు సేయుచు నాయుర్వేదంబుఁ గల్పించె నింకఁ బరశురామావతారంబు వినుము. (153) ధరణీ కంటకులైన హైహయనరేంద్రవ్రాతమున్ భూరివి¯ స్ఫురితోదారకుఠారధారఁ గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం¯ బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ¯ జిర కీర్తిన్ జమదగ్నిరాముఁ డన మించెం దాపసేంద్రోత్తమా!
రామావతారంబు
(154) మఱియు శ్రీరామావతారంబు సెప్పెద వినుము. (155) తోయజహిత వంశ దుగ్ధ పారావార¯ రాకా విహార కైరవహితుండు¯ కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ¯ శుక్తి సంపుట లసన్మౌక్తికంబు¯ నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధ¯ కార విస్ఫురిత పంకరుహసఖుఁడు¯ దశరథేశ్వర కృతాధ్వరవాటికా ప్రాంగ¯ ణాకర దేవతానోకహంబు (155.1) చటుల దానవ గహన వైశ్వానరుండు¯ రావణాటోప శైల పురందరుండు¯ నగుచు లోకోపకారార్థ మవతరించె¯ రాముఁడై చక్రి లోకాభిరాముఁ డగుచు. (156) చిత్రముగ భరత లక్ష్మణ¯ శత్రుఘ్నుల కర్థి నగ్రజన్ముం డగుచున్¯ ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ¯ విత్రుఁడు దుష్కృత లతా లవిత్రుం డగుచున్. (157) అంత. (158) కిసలయ ఖండేందు బిస కుంద పద్మాబ్జ¯ పద ఫాల భుజ రద పాణి నేత్రఁ¯ గాహళ కరభ చక్ర వియత్పులిన శంఖ¯ జంఘోరు కుచ మధ్య జఘన కంఠ¯ ముకుర చందన బింబ శుక గజ శ్రీకార¯ గండ గంధోష్ఠ వాగ్గమన కర్ణఁ¯ జంపకేందుస్వర్ణ శఫర ధనుర్నీల¯ నాసికాస్యాంగ దృగ్భ్రూ శిరోజ (158.1) నళి సుధావర్త కుంతల హాస నాభి¯ కలిత జనకావనీ పాల కన్యకా ల¯ లామఁ బరిణయ మయ్యె లలాటనేత్ర¯ కార్ముకధ్వంస ముంకువ గాఁగ నతఁడు. (159) అంత. (160) రామున్ మేచకజలద¯ శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవసు¯ త్రామున్ దుష్టనిశాటవి¯ రాముం బొమ్మనియెఁ బంక్తిరథుఁ డడవులకున్. (161) ఇట్లు పంచిన. (162) అరుదుగ లక్ష్మణుండు జనకాత్మజయుం దనతోడ నేఁగుదే¯ నరిగి రఘూత్తముండు ముదమారఁగ జొచ్చెఁ దరక్షు సింహ సూ¯ కర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్ల కా¯ సర ముఖ వన్యసత్త్వచయ చండతరాటవి దండకాటవిన్. (163) ఆ వనమున వసియించి నృ¯ పావననయశాలి యిచ్చె నభయములు జగ¯ త్పావన మునిసంతతికిఁ గృ¯ పావననిధి యైన రామభద్రుం డెలమిన్. (164) ఖరకర కుల జలనిధి హిమ ¯ కరుఁ డగు రఘురామవిభుఁడు గఱకఱితోడన్¯ ఖరుని వధించెను ఘనభీ¯ కర శరముల నఖిల జనులుఁ గర మరుదందన్. (165) హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని¯ హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్; ¯ హరివిభునకు హరిమధ్యను¯ హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై. (166) అంత సీతా నిమిత్తంబునం ద్రిలోకకంటకుం డగు దశకంఠుం దునుమాడుటకునై కపిసేనాసమేతుండయి చనిచని ముందట నతి దుర్గమంబయిన సముద్రంబు పేర్చి తెరువు సూపకున్న నలిగి. (167) వికటభ్రూకుటిఫాలభాగుఁ డగుచున్ వీరుండు క్రోధారుణాం¯ బకుడై చూచిన యంతమాత్రమున నప్పాథోధి సంతప్తతో¯ యకణగ్రాహ తిమింగిలప్లవ ఢులీ వ్యాళప్రవాళోర్మికా¯ బక కారండవ చక్ర ముఖ్య జలసత్వశ్రేణితో నింకినన్. (168) అయ్యవసరంబున సముద్రుండు కరుణాసముద్రుం డగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి యెప్పటి యట్ల నిలిపి నలునిచే సేతువు బంధింపించి తన్మార్గంబునం జని. (169) పురముల్ మూఁడును నొక్కబాణమున నిర్మూలంబు గావించు శం¯ కరు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధగో¯ పుర శాలాంగణ హర్మ్య రాజభవనప్రోద్యత్ప్రతోళీ కవా¯ ట రథాశ్వద్విప శస్త్ర మందిర నిశాటశ్రేణితో వ్రేల్మిడిన్. (170) రావణు నఖిల జగద్వి¯ ద్రావణుఁ బరిమార్చి నిలిపె రక్షోవిభుఁగా¯ రావణుననుజన్ముని నై¯ రావణసితకీర్తి మెఱసి రాఘవుఁ డెలమిన్. (171) ధర్మ సంరక్షకత్వప్రభావుం డయ్యు¯ ధర్మవిధ్వంసకత్వమునఁ బొదలి¯ ఖరదండనాభిముఖ్యముఁ బొంద కుండియు¯ ఖరదండ నాభిముఖ్యమున మెఱసి¯ బుణ్యజనావన స్ఫూర్తిఁ బెంపొందియుఁ¯ పుణ్యజఁనాంతక స్ఫురణఁ దనరి¯ సంతతాశ్రిత విభీషణుఁడు గాకుండియు¯ సంతతాశ్రిత విభీషణత నొప్పి (171.1) మించెఁ దనకీర్తిచేత వాసించె దిశలు; ¯ దరమె నుతియింప జగతి నెవ్వరికినైనఁ¯ జారుతరమూర్తి నవనీశచక్రవర్తిఁ ¯ బ్రకటగుణసాంద్రు దశరథరామచంద్రు.