భాగవతము పారాయణ : ద్వితీయ 257-సంపూర్ణం
భాగవత దశలక్షణంబులు
(257) అవనీశ! నీవు న న్నడిగిన పగిది నా¯ తఁడుఁ దండ్రి నడుగఁ బితామహుండు ¯ భగవంతుఁ డాశ్రితపారిజాతము హరి¯ గృపతోడఁ దన కెఱింగించి నట్టి¯ లోకమంగళ చతుశ్శ్లోక రూపంబును¯ దశలక్షణంబులఁ దనరు భాగ¯ వతము నారదున కున్నతిఁ జెప్పె; నాతఁడు¯ చారు సరస్వతీ తీరమునను (257.1) హరిపదధ్యాన పారీణుఁ డాత్మవేది ¯ ప్రకటతేజస్వి యగు బాదరాయణునకుఁ¯ గోరి యెఱిఁగించె; నమ్మహోదారుఁ డెలమి¯ నాకు నెఱిఁగించె; నెఱిగింతు నీకు నేను. (258) అదియునుంగాక యిపుడు విరాట్పురుషునివలన నీ జగంబు లే వడువునఁ బొడమె ననునవి మొదలయిన ప్రశ్నంబులు గొన్ని నన్నడిగితివి ఏను నన్నిటికి నుత్తరం బగునట్లుగా నిమ్మహాభాగవతం బుపన్యసించెద నాకర్ణింపుము; అమ్మహాపురాణంబు చతుశ్శ్లోక రూపంబును దశలక్షణంబునునై సంకుచిత మార్గంబున నొప్పు; నందు దశలక్షణంబు లెవ్వి యనిన "సర్గంబును, విసర్గంబును, స్థానంబునుఁ, బోషణంబును, నూతులును, మన్వంతరంబులును, నీశానుచరితంబులును, నిరోధంబును, ముక్తియు, నాశ్రయంబును, ననం బది తెఱుంగు లయ్యె; దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు తక్కిన తొమ్మిది లక్షణంబులుఁ జెప్పంబడె నవి యెట్టి వనిన. (259) మహదహంకార పంచ తన్మాత్ర గగన¯ పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి¯ యప్రపంచంబు భగవంతునందు నగుట¯ సర్గ మందురు దీనిని జనవరేణ్య! (260) సరసిజగర్భుండు విరా¯ ట్పురుషునివలనన్ జనించి, భూరితర చరా¯ చర భూత సృష్టిఁ జేయుట ¯ వరువడిని విసర్గ మండ్రు భరతకులేశా! (261) లోకద్రోహినరేంద్రా¯ నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా¯ వైకుంఠనాథు విజయం¯ బాకల్పస్థాన మయ్యె నవనీనాథా! (262) హరి సర్వేశుఁ డనంతుఁడు¯ నిరుపమ శుభమూర్తి సేయు నిజభక్త జనో¯ ద్ధరణము పోషణ మవనీ¯ వర!యూతు లనంగఁ గర్మవాసన లరయన్. (263) జలజనాభ దయాకటాక్షప్రసాద¯ లబ్ధి నఖిలైక లోకపాలక విభూతి¯ మహిమఁ బొందిన వారి ధర్మములు విస్త¯ రమునఁ బలుకుట మన్వంతరములు భూప! (264) వనజోదరునవతార క¯ థనముఁ దదీయానువర్తితతి చారిత్రం¯ బును విస్తరించి పలుకం¯ జను నవి యీశానుకథలు సౌజన్యనిధీ! (265) వసుమతీనాథ! సర్వస్వామి యైన గో¯ విందుండు చిదచిదానందమూర్తి¯ సలలిత స్వోపాధి శక్తిసమేతుఁడై¯ తనరారు నాత్మీయ ధామమందు¯ ఫణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల¯ యోగనిద్రారతి నున్నవేళ¯ నఖిల జీవులు నిజవ్యాపారశూన్యులై¯ యున్నత తేజంబు లురలుకొనఁగ (265.1) జరుగు నయ్యవస్థావిశేషంబు లెల్ల¯ విదితమగునట్లు వలుకుట యది నిరోధ¯ మన నిది యవాంతరప్రళయం బనంగఁ¯ బరఁగు నిఁక ముక్తి గతి విను పార్థివేంద్ర! (266) జీవుండు భగవత్కృపావశంబునఁ జేసి¯ దేహధర్మంబులై ధృతి ననేక¯ జన్మానుచరితదృశ్యము లైన యజ్జరా¯ మరణంబు లాత్మధర్మంబు లయిన ¯ ఘన పుణ్య పాప నికాయ నిర్మోచన¯ స్థితి నొప్పి పూర్వసంచితము లైన ¯ యపహత పాప్మవత్త్వాద్యష్ట తద్గుణ¯ వంతుఁడై తగ భగవచ్ఛరీర (266.1) భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి¯ దివ్య మాల్యానులేపన భవ్య గంధ¯ కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ¯ డగుచు హరిరూప మొందుటే యనఘ! ముక్తి
నారాయణుని వైభవం
(267) మఱియు నుత్పత్తిస్థితిలయంబు లెం దగుచుఁ బ్రకాశింపఁబడు నది "యాశ్రయం"బనంబడు; నదియ పరమాత్మ; బ్రహ్మశబ్దవాచ్యంబు నదియ; ప్రత్యక్షానుభవంబున విదితంబుసేయుకొఱకు నాత్మ యాధ్యాత్మికాది విభాగంబు సెప్పంబడియె; నది యెట్లనిన నాత్మ యాధ్యాత్మి, కాధిదైవి, కాధిభౌతికంబులం ద్రివిధం బయ్యె; నందు నాధ్యాత్మికంబు చక్షురాది గోళకాంతర్వర్తియై యెఱుంగంబడుఁ; జక్షురాది కరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవకుం డనందగుఁ; జక్షురాద్యధిష్ఠానాభిమాన దేవతయై సూర్యాది తేజో విగ్రహుండు నగుచు నెవ్వని యందు నీ యుభయ విభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండును, విరాడ్విగ్రహుండును నగుం; గావున ద్రష్టయు దృక్కును దృశ్యంబు ననందగు నీ మూటి యందు నొకటి లేకున్న నొకటి గానరా దీ త్రితయంబు నెవ్వండెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండై యుండు; నతండె పరమాత్మయును; అమ్మహాత్ముండు లీలార్థంబైన జగత్సర్జనంబు సేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపే క్షించి మొదల శుద్ధంబులగు జలంబుల సృజియించె; స్వతః పరిశుద్ధుండు గావున స్వసృష్టంబై యేకార్ణవాకారంబైన జలరాశియందు శయనంబు సేయుటం జేసి "శ్లో| ఆపోనారా ఇతిప్రోక్తా, ఆపోవై నరసూనవః, తా యదస్యాయనం పూర్వం, తేన నారాయణః స్మృతః;"అను ప్రమాణము చొప్పున నారాయణశబ్దవాచ్యుండు గావున నతని ప్రభావంబు వర్ణింప దుర్లభం; బుపాదానభూతం బయిన ద్రవ్యంబునుఁ ద్రివిధంబయిన కర్మంబును గళాకాష్ఠాద్యుపాధిభిన్నం బయిన కాలంబును, జ్ఞానాదికంబగు జీవస్వభావంబును భోక్త యగు జీవుండును నెవ్వని యనుగ్రహంబునం జేసి వర్తించుచుండు, నెవ్వని యుపేక్షంజేసి వర్తింపకుండు, నట్టి ప్రభావంబుగల సర్వేశ్వరుండు దా నేకమయ్యు ననేకంబు గాఁదలంచి యోగ తల్పంబునం బ్రబుద్ధుండై యుండు; అటమీఁద స్వసంకల్పంబునం జేసి హిరణ్మయంబైన తన విగ్రహంబు నధిదైవతంబును నధ్యాత్మికంబును నధిభూతంబును నను సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజియించె.
శ్రీహరి నిత్యవిభూతి
(268) అట్టి విరాడ్విగ్రహాంత రాకాశంబు¯ వలన నోజస్సహోబలము లయ్యెఁ ¯ బ్రాణంబు సూక్ష్మరూపక్రియాశక్తిచే¯ జనియించి ముఖ్యాసు వనఁగఁ బరఁగె¯ వెలువడి చను జీవి వెనుకొని ప్రాణముల్¯ సనుచుండు నిజనాథు ననుసరించు¯ భటుల చందంబునఁ బాటిల్లు క్షుత్తును¯ భూరి తృష్ణయు మఱి ముఖమువలనఁ (268.1) దాలు జిహ్వాదికంబు లుద్భవము నొందె¯ నందు నుదయించె నానావిధైక రసము ¯ లెనయ నవి యెల్ల జిహ్వచే నెఱుఁగఁబడును¯ మొనసి పలుక నపేక్షించు ముఖమువలన. (269) మఱియు వాగింద్రియంబు వుట్టె; దానికి దేవత యగ్ని, యారెంటి వలన భాషణంబు వొడమె; నా యగ్నికి మహాజల వ్యాప్తం బగు జగంబున నిరోధంబుగలుగటం జేసి యా జలంబె ప్రతిబంధకం బయ్యె; దోదూయమానంబైన మహావాయువువలన ఘ్రాణంబు పుట్టెం; గావున వాయుదేవతాకంబైన ఘ్రాణేంద్రియంబు గంధగ్రహణ సమర్థం బయ్యె; నిరాలోకం బగు నాత్మ నాత్మయందుఁ జూడం గోరి తేజంబువలన నాదిత్యదేవతాకంబై రూపగ్రాహకంబైన యక్షియుగళంబు వుట్టె; ఋషిగణంబులచేత బోధితుం డగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును నైన శ్రోత్రేంద్రియంబు వుట్టించె; సర్జనంబు సేయు పురుషునివలన మృదుత్వ కాఠిన్యంబులును లఘుత్వ గురుత్వంబులును నుష్ణత్వ శీతలత్వంబులునుం జేసెడు త్వగింద్రియాధిష్టానం బగు చర్మంబు వుట్టె; దానివలన రోమంబు లుదయించె వానికి మహీరుహంబు లధిదేవత లయ్యె; నందు నధిగత స్పర్శగుణుండును నంతర్భహిః ప్రదేశంబుల నావృతుండును నగు వాయువువలన బలవంతంబులును, నింద్రదేవతాకంబులును, నాదాన సమర్థంబులును, నానా కర్మకరణదక్షంబులును నగు హస్తంబు లుదయించె; స్వేచ్ఛావిషయగతి సమర్థుండగు నీశ్వరుని వలన విష్ణుదేవతాకంబు లగు పాదంబు లుదయించెఁ; బ్రజానందామృతార్థి యగు భగవంతునివలన ప్రజాపతిదేవతాకంబై, స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు గార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు లుదయించె మిత్రుం డధిదైవతంబుగాఁ గలిగి భుక్తాన్నాద్యసారాంశ త్యాగోపయోగం బగు పాయు వనెడి గుదం బుద్భవించె; దాని కృత్యం బుభయ మలమోచనంబు; దేహంబుననుండి దేహాంతరంబుఁ జేరంగోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనంబగు నాభిద్వారంబు సంభవించె; నట్టి నాభియే ప్రాణాపాన బంధస్థానం బనంబడుఁ; దద్బంధ విశ్లేషంబె మృత్యు వగు; నదియ యూర్థ్వాధోదేహభేదకం బనియునుం జెప్పంబడు; నన్నపానాది ధారణార్థంబుగ నాంత్రకుక్షి నాడీ నిచయంబులు గల్పింపంబడియె; వానికి నదులును సముద్రంబులును నధిదేవత లయ్యె; వానివలనఁ దుష్టిపుష్టులును నుదర భరణరస పరిణామంబులు గలిగియుండు; నాత్మీయ మాయా చింతనంబొనర్చు నపుడు కామసంకల్పాది స్థానం బగు హృదయంబు; గలిగె దాని వలన మనంబును జంద్రుండునుఁ గాముండును సంకల్పంబును నుదయించె; నంతమీఁద జగత్సర్జనంబు సేయు విరాడ్విగ్రహంబున సప్తధాతువులునుఁ, బృథివ్యప్తేజోమయంబు లయిన సప్తప్రాణంబులును, వ్యోమాంబువాయువులచే నుత్పన్నంబులై గుణాత్మకంబు లైన యింద్రియంబులును, నహంకార ప్రభవంబు లైన గుణంబులును, సర్వవికారస్వరూపం బగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియును బుట్టు; వివిధంబగు నిదియంతయు సర్వేశ్వరుని స్థూలవిగ్రహంబు; మఱియును. (270) వరుసఁ బృథివ్యాద్యష్టా¯ వరణావృతమై సమగ్ర వైభవములఁ బం¯ కరుహభవాండాతీత¯ స్ఫురణం జెలువొందు నతివిభూతి దలిర్పన్. (271) పొలుపగు సకల విలక్షణ¯ ములు గల యాద్యంత శూన్యమును నిత్యమునై¯ లలి సూక్ష్మమై మనో వా¯ క్కులకుం దలపోయఁగా నగోచర మగుచున్. (272) అలఘు తేజోమయంబైన రూపం బిది¯ క్షితినాథ! నాచేతఁ జెప్పఁబడియె; ¯ మానిత స్థూల సూక్ష్మస్వరూపంబుల¯ వలన నొప్పెడు భగవత్స్వరూప¯ మమ్మహాత్మకుని మాయాబలంబునఁ జేసి¯ దివ్యమునీంద్రులుఁ దెలియలేరు; ¯ వసుధేశ! వాచ్యమై వాచకంబై నామ ¯ రూపముల్ క్రియలును రూఢిఁ దాల్చి (272.1) యుండు నట్టి యీశ్వరుండు నారాయణుం¯ డఖిలధృత జగన్నియంతయైన¯ చిన్మయాత్మకుండు సృజియించు నీ ప్రజా¯ పతుల ఋషులఁ బితృ వితతుల నెలమి. (273) మఱియును. (274) సుర, సిద్ద, సాధ్య, కిన్నర, వర చారణ, ¯ గరుడ, గంధర్వ, రాక్షస, పిశాచ, ¯ భూత, వేతాళ, కింపురుష, కూశ్మాండ, గు¯ హ్యక, డాకినీ, యక్ష, యాతుధాన, ¯ విద్యాధరాప్సరో, విషధర, గ్రహ, మాతృ¯ గణ, వృక, హరి, ఘృష్టి, ఖగ, మృగాళి, ¯ భల్లూక, రోహిత, పశు, వృక్ష యోనుల¯ వివిధ కర్మంబులు వెలయఁ బుట్టి (274.1) జల నభో భూ తలంబుల సంచరించు¯ జంతు చయముల సత్త్వరజస్తమో గు¯ ణములఁ దిర్యక్సురాసుర నర ధరాది¯ భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర! (275) ఇరవొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబుసు¯ స్థిరతం జేసి, హరిస్వరూపుఁడయి రక్షించున్ సమస్త ప్రజో¯ త్కర సంహారము సేయు నప్పుడు హరాంతర్యామియై యింతయున్ ¯ హరియించుం బవనుండు మేఘముల మాయం జేయు చందంబునన్. (276) ఈ పగిదిని విశ్వము సం¯ స్థాపించును మనుచు నడఁచు ధర్మాత్మకుఁడై¯ దీపిత తిర్యఙ్నర సుర¯ రూపంబులు దాన తాల్చి రూఢి దలిర్పన్. (277) హరి యందు నాకాశ; మాకాశమున వాయు¯ వనిలంబువలన హుతాశనుండు; ¯ హవ్యవాహను నందు నంబువు; లుదకంబు¯ వలన వసుంధర గలిగె; ధాత్రి¯ వలన బహుప్రజావళి యుద్భవం బయ్యె¯ నింతకు మూలమై యెసఁగునట్టి¯ నారాయణుఁడు చిదానంద స్వరూపకుం, ¯ డవ్యయుం, డజుఁడు, ననంతుఁ, డాఢ్యుఁ, (277.1) డాదిమధ్యాంతశూన్యుం, డనాదినిధనుఁ, ¯ డతని వలనను సంభూత మైన యట్టి¯ సృష్టి హేతు ప్రకార మీక్షించి తెలియఁ¯ జాల రెంతటి మునులైన జనవరేణ్య! (278) అదియునుంగాక. (279) ధరణీశోత్తమ! భూత సృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా¯ హరి కర్తృత్వము నొల్ల కాత్మగత మాయారోపితం జేసి తా¯ నిరవద్యుండు నిరంజనుండుఁ బరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్¯ నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వముం బొందెడిన్. (280) బ్రహ్మసంబంధి యగు నీ కల్పప్రకారం బవాంతరకల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున నెఱింగిచింతి; నిట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృత వైకృత కల్పప్రకారంబులునుఁ, దత్పరిమాణంబులును, కాలకల్పలక్షణంబులును, నవాంతరకల్ప మన్వంతరాది భేదవిభాగ స్వరూపంబును నతి విస్తారంబుగ నెఱిగింతు విను; మదియునుం బద్మకల్పం బనందగు"నని భగవంతుండైన శుకుండు బరీక్షిత్తునకు జెప్పె"నని సూతుండు మహర్షులకు నెఱింగిచిన.
శౌనకుడు సూతు నడుగుట
(281) విని శౌనకుండు సూతుం¯ గనుఁగొని యిట్లనియె "సూత !కరుణోపేతా! ¯ జననుత గుణసంఘాతా! ¯ ఘనపుణ్యసమేత! విగతకలుషవ్రాతా! (282) పరమభాగవతోత్తముండైన విదురుండు బంధుమిత్రజాతంబుల విడిచి సకల భువనపావనంబులునుఁ, గీర్తనీయంబులును నైన తీర్థంబులను, నగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులను దర్శించి, క్రమ్మఱవచ్చి, కౌషారవి యగు మైత్రేయుం గని యతనివలన నధ్యాత్మబోధంబు వడసె నని వినంబడు; నది యంతయు నెఱింగింపు"మనిన నతండు యిట్లనియె. (283) "వినుఁ డిపుడు మీరు నన్నడి¯ గిన తెఱఁగున శుకమునీంద్రగేయుఁ బరీక్షి¯ జ్జనపతి యడిగిన నతఁడా¯ తని కెఱిఁగించిన విధంబుఁ దగ నెఱిఁగింతున్. (284) సావధానులరై వినుం"డని.
పూర్ణి
(285) రామ! గుణాభిరామ! దినరాజకులాంబుధిసోమ! తోయద¯ శ్యామ! దశాననప్రబలసైన్యవిరామ! సురారిగోత్రసు¯ త్రామ! సుబాహుబాహుబలదర్ప తమఃపటుతీవ్రధామ! ని¯ ష్కామ! కుభృల్లలామ! కఱకంఠసతీనుతనామ! రాఘవా! (286) అమరేంద్రసుతవిదారణ! ¯ కమలాప్తతనూజరాజ్యకారణ! భవసం¯ తమసదినేశ్వర! రాజో¯ త్తమ! దైవతసార్వభౌమ! దశరథరామా! (287) నిరుపమగుణజాలా! నిర్మలానందలోలా! ¯ దురితఘనసమీరా! దుష్టదైత్యప్రహారా! ¯ శరధిమదవిశోషా! చారుసద్భక్తపోషా! ¯ సరసిజదళనేత్రా! సజ్జనస్తోత్రపాత్రా! (288) ఇది శ్రీపరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజపాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవత పురాణంబు నందు పరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుటయు, భాగవతపురాణ వైభవంబును, ఖట్వాంగు మోక్షప్రకారంబును, ధారఁణాయోగ విషయం బయిన మహావిష్ణుని శ్రీపాదాద్యవయవంబుల సర్వలోకంబులు నున్న తెఱంగును, సత్పురుష వృత్తియు, మోక్షవ్యతిరిక్త సర్వకామ్యఫలప్రదదేవత భజన ప్రకారంబును, మోక్షప్రదుండు శ్రీహరి యనుటయు, హరిభజనవిరహితులైన జనులకు హేయతాపాదనంబును, రాజప్రశ్నంబును, శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుటయు, శ్రీహరి వలన బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచంబు వుట్టుటయు, శ్రీమన్నారాయణ దివ్యలీలావతార పరంపరా వైభవ వృత్తాంతసూచనంబును, భాగవత వైభవంబునుఁ, బరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నంబులును, నందు శ్రీహరి ప్రధానకర్తయని తద్వృత్తాంతంబు సెప్పు టయు, భగవద్భక్తి వైభవంబును, బ్రహ్మ తపశ్చరణంబునకుం బ్రసన్నుండై హరి వైకుంఠనగరంబుతోడఁ బ్రసన్నుండయిన స్తోత్రంబు సేసి తత్ప్రసాదంబునం దన్మహిమంబు వినుటయు, వాసుదేవుం డానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవతపురాణ ప్రధాన దశలక్షణంబు లుపన్యసించుటయు, నారాయణ వైభవంబును, జీవాది తత్త్వసృష్టియు, శ్రీహరి నిత్యవిభూత్యాది వర్ణనంబునుఁ, గల్పప్రకారాది సూచనంబును, శౌనకుండు విదుర మైత్రేయ సంవాదంబు సెప్పు మని సూతు నడుగుటయు, నను కథలు గల ద్వితీయస్కంధము సంపూర్ణము.