పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవతము పారాయణ : ద్వితీయ 172 - 256

కృష్ణావతారంబు

(172) అట్టి శ్రీరామావతారంబు జగత్పావనంబును నస్మత్ప్రసాద కారణంబును నై నుతికెక్కె; నింకఁ గృష్ణావతారంబు వివరించెద వినుము. (173) తాపసోత్తమ! విను దైత్యాంశములఁ బుట్టి¯ నరనాథు లతుల సేనాసమేతు¯ లగుచు ధర్మేతరులై ధాత్రిఁ బెక్కు బా¯ ధల నలంచుటఁ జేసి ధరణి వగలఁ¯ బొందుచు వాపోవ భూభార ముడుపుట¯ కై హరి పరుఁడు నారాయణుండు¯ చెచ్చెరఁ దన సితాసిత కేశయుగమున¯ బలరామ కృష్ణ రూపములఁ దనరి (173.1) యదుకులంబున లీలమై నుదయ మయ్యె¯ భవ్యయశుఁ డగు వసుదేవు భార్యలైన¯ రోహిణియు దేవకియు నను రూపవతుల¯ యందు నున్మత్తదైత్య సంహారి యగుచు. (174) ఇట్లు పుండరీకాక్షుం డగు నారాయణుండు సమస్త భూభార నివారణంబు సేయం దన మేనికేశద్వయంబ చాలునని యాత్మ ప్రభావంబు దెలుపుకొఱకు నిజకళాసంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేతకృష్ణం బని నిర్దేశించుకొఱకు సితాసితకేశద్వయ వ్యాజంబున రామకృష్ణాఖ్యల నలరి యవతరించె నందు భగవంతుడును సాక్షాద్విష్ణుండును నైన కృష్ణుండు జనమార్గవర్తి యయ్యును నతిమానుష్యకర్మంబుల నాచరించుటం జేసి కేవల పరమేశ్వరుం డయ్యె; నమ్మహాత్ముం డాచరించు కార్యంబులు లెక్కపెట్ట నెవ్వరికి నలవిగాదు అయినను నాకు గోచరించిన యంత యెఱింగించెద వినుము. (175) నూతన గరళస్తని యగు¯ పూతనఁ బురిటింటిలోనఁ బొత్తుల శిశువై¯ చేతనముల హరియించి ప¯ రేతనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్. (176) వికటముగ నిజపదాహతిఁ ¯ బ్రకటముగా మూఁడు నెలల బాలకుఁడై యా¯ శకటనిశాటుని నంతక¯ నికటస్థునిఁ జేసె భక్తనికరావనుఁడై. (177) ముద్దుల కొమరుని వ్రేతల¯ రద్దులకై తల్లి ఱోల రజ్జులఁ గట్టం¯ బద్దులకు మిన్నుముట్టిన¯ మద్దుల వడిఁ గూల్చె జనసమాజము వొగడన్. (178) మదిఁ గృష్ణుండు యశోదబిడ్డఁ డని నమ్మంజాల యోగీంద్ర త¯ ద్వదనాంభోజములోఁ జరాచర సమస్తప్రాణిజాతాటవీ¯ నద నద్యద్రి పయోధి యుక్త మగు నానా లోకజాలంబు భా¯ స్వ దనూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లఁగన్. (179) వర యమునానదీ హ్రద నివాసకుఁడై నిజ వక్త్ర నిర్గత¯ స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిఁ బొందఁ జేయు భీ¯ కర గరళద్విజిహ్వుఁ డగు కాళియ పన్నగు నా హ్రదంబుఁ జె¯ చ్చెర వెడలించి కాచె యదుసింహుఁడు గోపకగోగణంబులన్. (180) తనయా గోపకు లొక్క రేయితఱి, నిద్రం జెందఁ గార్చిచ్చు వ¯ చ్చినఁ గృష్ణా మము నగ్నిపీడితుల రక్షింపం దగుం గావవే¯ యనినం గన్నులు మీరు మోడ్వుఁ డిదె దావాగ్నిన్ వెసన్నార్తు నే¯ నన వారట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ బద్మాక్షుండు లీలా గతిన్. (181) మందుని గతి యము నాంబువు¯ లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా¯ నందుని వరుణుని బంధన¯ మందు నివృత్తునిగఁ జేసె హరి సదయుండై. (182) మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృద్గుహా¯ శ్రయులంగా నొనరించి తత్పథము నీరంధ్రంబు గావించినన్¯ రయ మొప్పం గుటిలాసురాధమునిఁ బోరం ద్రుంచి గోపావళిన్¯ దయతోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేతన్మాత్రమే తాపసా! (183) దివిజేంద్రప్రీతిగ వ¯ ల్లవజను లేఁటేఁటఁ జేయు లాలిత సవనో¯ త్సవము హరి మానిపిన గో¯ పవరులు గావింపకున్న బలరిపుఁ డలుకన్. (184) మంద గొందల మంద నమందవృష్టిఁ ¯ గ్రందుకొనుఁ డంచు నింద్రుండు మందలింపఁ¯ జండపవన సముద్ధూత చటుల విలయ ¯ సమయ సంవర్త కాభీల జలధరములు. (185) సప్తస్కంధ శిఖా కలాప రుచిమత్సౌదామనీవల్లికా¯ దీప్తోదగ్రముహుస్తమః పిహితధాత్రీ భాగనీరంధ్రమై¯ సప్తాశ్వస్ఫుర దిందు మండల నభస్సంఛాదితాశాంతర¯ వ్యాప్తాంభోద నిరర్గళస్ఫుట శిలావాః పూరధారాళమై. (186) కురియు వానజల్లు పెల్లున రిమ్మలుగొని సొమ్మలు వోయి గోకులం బాకులంబయి "కృష్ణ! కృష్ణ! రక్షింపు"మని యార్తింబొంది కుయ్యిడ నయ్యఖండ కరుణారస సముద్రుండును భక్తజన సురద్రుముండును నైన పుండరీకాక్షుండు.

గోవర్థనగిరి ధారణంబు

(187) సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజాస్తంభంబునన్ లీలమై¯ సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం¯ గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలకవ్రాతమున్¯ సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్. (188) సాంద్రశరచ్చంద్ర చంద్రికా ధవళిత¯ విమల బృందావన వీథియందు¯ రాసకేళీ మహోల్లాసుఁడై యుత్ఫుల్ల¯ జలజాక్షుఁ డొక నిశాసమయమునను¯ దనరారు మంద్ర మధ్యమ తారముల నింపు¯ దళుకొత్త రాగభేదములఁ జెలఁగి¯ ధైవత ఋషభ గాంధార నిషాద పం¯ చమ షడ్జ మధ్యమ స్వరము లోలిఁ (188.1) గళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణు¯ నాళ వివరాంగుళన్యాస లాలనమున¯ మహితగతిఁ బాడె నవ్యక్త మధురముగను¯ పంకజాక్షుండు దారువు లంకురింప. (189) హరివేణూద్గత మంజులస్వరనినాదాహూతలై గోప సుం¯ దరు లేతేర ధనాధిపానుచరగంధర్వుండు గొంపోవఁ ద¯ త్తరుణుల్ గుయ్యిడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తాఁ¯ బరిరక్షించిన యట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే యేరికిన్? (190) నరక మురప్రలంబ యవనద్విప ముష్టికమల్ల కంసశం¯ బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్త్ర వా¯ నర ఖర సాల్వ వత్స బక నాగ విదూరథ రుక్మి కేశి ద¯ ర్దుర వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్. (191) మఱియును. (192) బలభీమార్జున ముఖ్య చాపధర రూపవ్యాజతం గ్రూరులన్¯ ఖలులన్ దుష్టధరాతలేశ్వరుల సంగ్రామైక పారీణ దో¯ ర్బలకేళిం దునుమాడి సర్వధరణీభారంబు మాయించి సా¯ ధుల రక్షించిన యట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్. (193) అట్టి లోకోత్కృష్టుండైన కృష్ణుని యవతారమహాత్యం బెఱింగించితి నింక వ్యాసావతారంబు వినుము. (194) ప్రతియుగమందు సంకుచితభావులు నల్పతరాయువుల్ సుదు¯ ర్గతికులునైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా¯ శ్వతములునైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స¯ న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్. (195) మఱియు బుద్ధావతారంబు వినుము. (196) అతిలోలాత్ములు సూనృతేతరులు భేదాచార సంశీలురు¯ ద్ధత పాషాండమ తౌపధర్మ్యులు జగత్సంహారు లైనట్టి యా¯ దితి సంజాతు లధర్మవాసనల వర్తింపం దదాచార సం¯ హతి మాయించి హరించె దానవులఁ బద్మాక్షుండు బుద్ధాకృతిన్. (197) మఱియుం గల్క్యవతారంబు వినుము. (198) వనజాక్షస్తవశూన్యులై మఱి వషట్స్వాహాస్వధావాక్య శో¯ భనరాహిత్యులు, సూనృతేతరులునుం, బాషండులున్నైన వి¯ ప్రనికాయంబును శూద్రభూపులుఁ గలింబాటిల్లినం గల్కియై¯ జననంబంది యధర్మమున్నడఁచు సంస్థాపించు ధర్మం బిలన్." (199) అని మఱియుఁ బితామహుండు నారదున కిట్లనియె "మునీంద్రా! పుండరీకాక్షుం డంగీకరించిన లీలావతార కథావృత్తాంతంబు నేను నీకు నెఱింగించు నింతకు మున్న హరి వరాహాద్యవతారంబు లంగీకరించి తత్ప్రయోజనంబులఁ దీర్చె; మన్వంతరావతారంబు లంగీకరించినవియు నంగీపరింపఁగలవియునై యున్నయవి; వర్తమానంబున ధన్వంతరి పరశురామావతారంబులు దాల్చి యున్నవాడు; భావికాలంబున శ్రీరామాద్యవతారంబుల నంగీకరింపం గలవాఁ; డమ్మహాత్ముండు సృష్ట్యాది కార్యభేదంబులకొఱకు మాయా గుణావతారంబు లందు బహుశక్తి ధారణుండైన భగవంతుఁడు సర్గాదినిఁ దపస్సులును, నేనును, ఋషిగణంబులును, నవప్రజాపతులునునై యవతరించి విశ్వోత్పాదనంబు గావించుచుండు; ధర్మంబును విష్ణుండును యజ్ఞంబులును మనువులును నింద్రాది దేవగణంబులును ధాత్రీపతులును నయి యవతరించి జగంబుల రక్షించుచుండు; నధర్మంబును రుద్రుండును మహోరగంబులును రాక్షసానీకంబులునునై యవతరించి విలయంబు నొందించుచుండు; ని త్తెఱంగునం బరమేశ్వరుండును సర్వాత్మకుండును నైన హరి విశ్వోత్పత్తి స్థితి లయ హేతుభూతుండై విలసిల్లు; ధరణీరేణువుల నయిన గణుతింప నలవి యగుంగాని యమ్మహాత్ముని లీలావతారాద్భుతకర్మంబులు లెక్కవెట్ట నెవ్వరికి నశక్యంబై యుండు; నీకు సంక్షేపరూపంబున నుపన్యసించితి సవిస్తారంబుగా నెఱింగింప నాకుం దరంబు గాదనిన నన్యులం జెప్పనేల? వినుము. (200) అమరఁ ద్రివిక్రమస్ఫురణ నందిన యమ్మహితాత్ముపాద వే¯ గమున హతంబులైన త్రిజగంబుల కావల వెల్గు సత్యలో¯ కము చలియించినం గరుణఁ గైకొని కాచి ధరించు పాదప¯ ద్మము తుది నున్న యప్రతిహతం బగు శక్తి గణింప శక్యమే?

భాగవత వైభవంబు

(201) హరి మాయా బల మే నెఱుంగ నఁట శక్యంబే సనందాది స¯ త్పురుషవ్రాతము కైన, బుద్ధి నితరంబున్ మాని సేవాధిక¯ స్ఫురణం దచ్ఛరితానురాగగుణవిస్ఫూర్తిన్ సహస్రాస్య సుం¯ దరతం బొల్పగు శేషుఁడుం దెలియఁ డన్నం జెప్ప నే లొండొరున్. (202) ఇతరముమాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా¯ శ్రితజన సేవితాంఘ్రి సరసీరుహుఁడైన సరోజనాభుఁ డం¯ చితదయతోడ నిష్కపటచిత్తమునం గరుణించు; నట్టివా¯ రతుల దురంతమై తనరు నవ్విభు మాయఁ దరింతు రెప్పుడున్. (203) మఱియును సంసారమగ్నులయి దివసంబులు ద్రోఁచియు నంతంబున శునక సృగాల భక్షణంబులైన కాయంబులందు మమత్వంబు సేయక భగవదర్పణంబు సేసిన పుణ్యాత్ములుం గొందఱు గల రెఱింగింతు; వినుము; నేను నీ బ్రహ్మత్వంబునం జెందు రాజసంబు విడిచి యమ్మహాత్ముని పాదారవిందంబుల భక్తినిష్ఠుండ నయి శరణాగతత్వంబున భజియించు నప్పుడు దెలియుదు రాజసగుణుండనై యున్న వేళం దెలియంజాలఁ; గావున శాస్త్రంబులు ప్రపంచింపక కేవల భక్తిజ్ఞానయోగంబున సేవింతు; మఱియు సనకాదులగు మీరును, భగవంతుండైన రుద్రుండును, దైత్యపతియైన ప్రహ్లాదుండును, స్వాయంభువమనువును, నతని పత్ని యగు శతరూపయుఁ, దత్పుత్రులగు ప్రియవ్రతోత్తానపాదులునుం, దత్పుత్రికలగు దేవహూత్యాదులునుం, బ్రాచీనబర్హియు, ఋభువును, వేనజనకుం డగు నంగుండును, ధ్రువుండును గడవంజాలుదురు వెండియు. (204) గాధి, గయాదు; లిక్ష్వాకు, దిలీప, మాం¯ ధాతలు; భీష్మ, యయాతి, సగర, ¯ రఘు, ముచుకుందైళ, రంతిదేవోద్ధవ, ¯ సారస్వతోదంక, భూరిషేణ, ¯ శ్రుతదేవ, మారుతి, శతధన్వ, పిప్పల, ¯ బలి, విభీషణ, శిబి, పార్థ, విదురు;¯ లంబరీష, పరాశరాలర్క, దేవల, ¯ సౌభరి, మిథిలేశ్వరాభిమన్యు, (204.1) లార్ష్ణిషేణాదులైన మహాత్ము లెలమిఁ¯ దవిలి యద్దేవు భక్తిఁ జిత్తముల నిల్పి¯ తత్పరాయణు లౌట దుర్దాంతమైన¯ విష్ణుమాయఁ దరింతురు విమలమతులు. (205) అనఘా! వీరల నెన్ననేమిటికిఁ; దిర్యగ్జంతుసంతాన ప¯ క్షి నిశాటాటవికాఘ జీవనివహస్త్రీ శూద్ర హూణాదులై¯ నను నారాయణభక్తి యోగమహితానందాత్ములై రేని వా¯ రనయంబుం దరియింతు రవ్విభుని మాయావైభవాంభోనిధిన్. (206) కావున. (207) శశ్వత్ప్రశాంతు నభయుని¯ విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్¯ శాశ్వతు సము సదసత్పరు¯ నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా! (208) అట్లయిన నప్పుణ్యాత్ముల ననవద్యశీలుర నవిద్య లజ్జావనత వదనయై పొందంజాలక వైముఖ్యంబున దవ్వుదవ్వులం దలంగిపోవు మఱియును. (209) హరిఁ బరమాత్ము నచ్యుతు ననంతునిఁ జిత్తములం దలంచి సు¯ స్థిరత విశోక సౌఖ్యములఁ జెందిన ధీనిధు లన్యకృత్యము¯ ల్మఱచియుఁ జేయనొల్లరు ;తలంచిన నట్టిదయౌ; సురేంద్రుఁడుం¯ బరువడి నుయ్యి; ద్రవ్వునె పిపాసితుఁడై సలిలాభిలాషితన్? (210) సర్వఫలప్రదాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున్, ¯ సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగతుం డగు చక్రపాణి యీ¯ సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై¯ పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్. (211) కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె¯ వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో¯ దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం¯ జేరవు చిత్తముల్ ప్రకృతిఁ జెందని నిర్గుణమైన బ్రహ్మమున్. (212) నిగమార్థప్రతిపాదకప్రకటమై; నిర్వాణ సంధాయిగా¯ భగవంతుండు రచింప భాగవతకల్పక్ష్మాజమై శాస్త్ర రా¯ జి గరిష్ఠంబగు నీ పురాణ కథ సంక్షేపంబునం జెప్పితిన్; ¯ జగతిన్ నీవు రచింపు దాని నతివిస్తారంబుగాఁ బుత్రకా! (213) పురుషభవంబునొందుట యపూర్వము జన్మము లందు; నందు భూ¯ సుర కుల మందుఁ పుట్టు టతిచోద్యము; నిట్లగుటన్ మనుష్యుల¯ స్థిర మగు కార్య దుర్దశలచేత నశింపక విష్ణు సేవనా¯ పరతఁ దనర్చి నిత్యమగు భవ్యపథంబును బొందు టొప్పదే? (214) ఉపవాసవ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా¯ జప దానాధ్యయ నాది కర్మముల మోక్షప్రాప్తిసేకూర; ద¯ చ్చపుభక్తిన్ హరిఁ బుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమా¯ ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్. (215) వనజాక్షు మహిమ నిత్యము¯ వినుతించుచు; నొరులు వొగడ వినుచున్; మదిలో¯ ననుమోదించుచు నుండెడు¯ జనములు దన్మోహవశతఁ జనరు మునీంద్రా!" (216) అని వాణీశుఁడు నారద ¯ మునివరునకుఁ జెప్పినట్టి ముఖ్యకథా సూ¯ చన మతిభక్తిఁ బరీక్షి¯ జ్జనపాలునితోడ యోగిచంద్రుఁడు నుడివెన్.

ప్రపంచాది ప్రశ్నంబు

(217) "విను శుకయోగికి మనుజేశుఁ డిట్లను¯ మునినాథ! దేవదర్శనము గలుగ¯ నారదమునికిఁ బంకేరుహభవుఁ డెఱిం¯ గించిన తెఱఁగు సత్కృప దలిర్ప¯ గణుతింప సత్వాదిగుణశూన్యుఁ డగు హరి¯ కమలాక్షు లోకమంగళము లైన¯ కథలు నా కెఱిఁగింపు; కైకొని నిస్సంగ¯ మైన నా హృదయాబ్జ మందుఁ గృష్ణు (217.1) భవ్యచరితుని నాద్యంతభావశూన్యుఁ¯ జిన్మయాకారు ననఘు లక్ష్మీసమేతు¯ నిలిపి, యస్థిరవిభవంబు నిఖిల హేయ¯ భాజనంబైన యీ కళేబరము విడుతు. (218) అదియునుంగాక, యెవ్వండేని శ్రద్ధాభక్తియుక్తుండై కృష్ణగుణకీర్తనంబులు వినుచుం బలుకుచు నుండు నట్టివాని హృదయపద్మంబు నందుఁ గర్ణరంధ్ర మార్గంబులం బ్రవేశించి కృష్ణుండు విశ్రమించి సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున నాత్మగతంబైన మాలిన్యంబు నపకర్షించుఁ గావున. (219) భరితోదగ్రనిదాఘతప్తు డగు నప్పాంథుం డరణ్యాది సం¯ చరణక్లేశసముద్భవం బగు పిపాసం జెంది యాత్మీయ మం¯ దిరముం జేరి గతశ్రముం డగుచు నెందేనిం జనంబోని భం¯ గి రమాధీశుపదారవిందయుగ సంగీభూతుఁడై మానునే? (220) అదియునుంగాక సకలభూతసంసర్గశూన్యంబైన యాత్మకు భూతసంసర్గం బే ప్రకారంబునం గలిగె; నది నిర్నిమిత్తత్వంబునం జేసియో కర్మంబునం జేసియో యాక్రమంబు నా కెఱింగింపుము. (221) ఎవ్వని నాభియం దెల్ల లోకాంగ సం¯ స్థానకారణపంకజంబు వొడమె¯ నం దుదయించి సర్వావయవస్ఫూర్తిఁ¯ దనరారునట్టి పితామహుండు¯ గడఁగి యెవ్వని యనుగ్రహమున నిఖిల భూ¯ తముల సృజించె నుత్కంఠతోడ¯ నట్టి విధాత యే యనువున సర్వేశు¯ రూపంబు గనుఁగొనె రుచిర భంగి (221.1) నా పరంజ్యోతి యైన పద్మాక్షునకును¯ నలినజునకుఁ బ్రతీకవిన్యాసభావ¯ గతులవలనను భేదంబు గలదె? చెపుమ; ¯ యతిదయాసాంద్ర! యోగికులాబ్ధిచంద్ర! (222) మఱియును భూతేశ్వరుం డయిన సర్వేశ్వరుం డుత్పత్తిస్థితి లయకారణంబైన తన మాయను విడిచి మాయానియామకుండై యేయే ప్రదేశంబుల శయనంబు సేసె; నదియునుంగాక పురుషావయవంబులచేఁ బూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబు లెత్తఱంగునం గల్పితంబు లయ్యె; నదియునుంగాక మహా కల్పంబులును, నవాంతర కల్పంబులును, భూతభవిష్యద్వర్తమాన కాలంబులును, దేహాభిమానులై జనియించిన దేవ పితృ మనుష్యాదులకుం గలుగు నాయుః ప్రమాణంబులును, బృహత్సూక్ష్మ కాలానువర్తనంబులును, యే యే కర్మంబులంజేసి జీవు లేయే లోకంబుల నొందుదురు? మఱియు నేయే కర్మంబులం జేసి దేవాది శరీరంబులం బ్రాపింతు రట్టి కర్మమార్గ ప్రకారంబును సత్త్వాది గుణంబుల పరిణామంబులగు దేవాది రూపంబులం గోరు జీవులకు నేయే కర్మసముదాయం బెట్టు సేయందగు నెవ్వనికి నర్పింపం దగు? నవి యెవ్వనిచేత గ్రహింపంబడు? భూ పాతాళ కకుబ్వ్యోమ గ్రహ నక్షత్ర పర్వతంబులును సరిత్సముద్రంబులును ద్వీపంబులును నే ప్రకారంబున సంభవించె? నా యా స్థానంబులగల వారి సంభవంబు లేలాటివి వియత్బాహ్యాభ్యంతరంబులం గలుగు బ్రహ్మాండప్రమాణం బెంత? మహాత్ముల చరిత్రంబు లెట్టివి వర్ణాశ్రమ వినిశ్చయంబులును, ననుగతంబులై యాశ్చర్యావహంబు లగు హరియవతార చరిత్రంబులును, యుగంబులును, యుగ ప్రమాణంబులును, యుగ ధర్మంబులునుఁ, బ్రతియుగంబునందును మనుష్యుల కేయే ధర్మంబు లాచరణీయంబు లట్టి సాధారణధర్మంబులును, విశేషధర్మంబులును, జాతివిశేషధర్మంబులును రాజర్షిధర్మంబులును, నాపత్కాల జీవన సాధన భూతంబు లగు ధర్మంబులును, మహదాది తత్త్వంబుల సంఖ్యయును, సంఖ్యాలక్షణంబును, నా తత్త్వంబులకు హేతుభూతలక్షణంబులును, భగవత్సమారాధన విధంబును, అష్టాంగయోగ క్రమంబును, యోగీశ్వరుల యణిమాద్యైశ్వర్య ప్రకారంబును, వారల యర్చిరాదిగతులును, లింగశరీరభంగంబులును, ఋగ్యజుస్సామాథర్వ వేదంబులును, నుపవేదంబులైన యాయుర్వేదాదులును, ధర్మశాస్త్రంబులును, నితిహాస పురాణంబుల సంభవంబును, సర్వ భూతంబుల యవాంతరప్రళయంబును, మహాప్రళయంబును, నిష్ఠాపూర్తంబులును, యాగాది వైదిక కర్మ జాలంబును, వాపీకూప తటాక దేవాలయాది నిర్మాణంబులును, నన్నదానం బారామ ప్రతిష్ట మొదలగు స్మార్తకర్మంబులును, కామ్యంబులైన యగ్ని హోత్రంబుల యనుష్ఠాన ప్రకారంబును, జీవసృష్టియు, ధర్మార్థ కామంబు లనియెడు త్రివర్గంబుల యాచరణ ప్రకారంబును, మలినోపాధిక పాషండ సంభవంబును, జీవాత్మ బంధమోక్ష ప్రకారంబును, స్వరూపావస్థాన విధంబును, సర్వస్వతంత్రుండైన యీశ్వరుం డాత్మమాయం జేసి సర్వకర్మసాక్షి యయ్యు, నమ్మాయ నెడఁ బాసి యుదాసీనగతిని విభుండై క్రీడించు తెఱంగును, గ్రమంబునఁ బ్రపన్నుండ నైన నాకు నెఱింగింపుము; బ్రాహ్మణశాపంబునం జేసి శోకవ్యాకుల చిత్తుండవై యనశన వ్రతుండవైన నీవు వినుట యెట్లని సందేహింప వలదు; త్వదీయ ముఖారవింద వినిస్స్రుత నారాయణ కథామృత పాన కుతూహలి నైన నాకు నింద్రియంబులు వశంబులై యుండు; నదిగావున నే నడిగిన ప్రశ్నంబులకు నుత్తరంబులు సవిస్తరంబులుగా నానతిచ్చి కృతార్థునిం జేయఁ బరమేష్టితుల్యుండవగు నీవ పూర్వసంప్రదాయానురోధంబున నర్హుండ వగుదు వని విష్ణురాతుండయిన పరీక్షిన్నరేంద్రుండు బ్రహ్మరాతుండైన శుకయోగి నడిగిన నతండు బ్రహ్మనారద సంవాదంబును నేక సంప్రదాయానుగతంబును గతానుగతిక ప్రకారంబునునై తొల్లి సర్వేశ్వరుండు బ్రహ్మకల్పంబున బ్రహ్మ కుపదేశించిన భాగవతపురాణంబు వేదతుల్యంబు నీ కెఱింగింతు విను"మని చెప్పె” నని సూతుండు శౌనకాది మహామునులకుం జెప్పి; "నట్లు శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె.

శ్రీహరి ప్రధానకర్త

(223) "భూపాలకోత్తమ భూతహితుండు సు¯ జ్ఞానస్వరూపకుఁ డైనయట్టి ¯ ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న¯ మహి నొప్పు నీశ్వరమాయ లేక¯ కలుగదు; నిద్రలోఁ గలలోనఁ దోఁచిన¯ దేహబంధంబుల తెఱఁగువలెను¯ హరియోగ మాయా మహత్త్వంబునం బాంచ¯ భౌతిక దేహసంబంధుఁ డగుచు (223.1) నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి¯ బాల్య కౌమార యౌవన భావములను¯ నర సుపర్వాది మూర్తులఁ బొరసి యేను¯ నాయదిది యను సంసారమాయఁ దగిలి. (224) వర్తించుచు నిట్లున్న జీవునికి భగవద్భక్తియోగంబున ముక్తి సంభవించుట యెట్లన్న నెప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీతం బయిన బ్రహ్మస్వరూపంబు నందు మహితధ్యాన నిష్ఠుండగు నప్పుడు విగతమోహుండై యహంకార మమకారాత్మకం బయిన సంసరణంబు దొఱంగి ముక్తుండయి యుండు; మఱియు జీవేశ్వరులకు దేహ సంబంధంబులు గానంబడుచుండు; నట్టి దేహధారి యైన భగవంతు నందలి భక్తిం జేసి జీవునకు ముక్తి యెత్తెఱంగునం గలుగు నని యడిగితివి; జీవుం డవిద్యా మహిమం జేసి కర్మానుగతం బయిన మిథ్యారూపదేహ సంబంధుండు; భగవంతుండు నిజ యోగ మాయా మహిమంబునంజేసి స్వేచ్ఛాపరికల్పిత చిద్ఘన లీలావిగ్రహుండు; కావున భగవంతుండైన యీశ్వరుండు స్వభజనంబు ముక్తిసాధన జ్ఞానార్థంబు కల్పితం"బని చతుర్ముఖునకు దదీయ నిష్కపట తపశ్చర్యాది సేవితుండయి నిజజ్ఞానానందఘనం బయిన స్వరూపంబు సూపుచు నానతిచ్చె; నదిగావున జీవునికి భగవద్భక్తి మోక్షప్రదాయకంబగు; నిందులకు నొక్క యితిహాసంబు గల దెఱింగింతు నాకర్ణింపుము; దాన భవదీయ సంశయనివృత్తి యయ్యెడు"నని శుకయోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె. (225) "హరిపాదభక్తి రహస్యోపదేష్టయు¯ నఖిల దేవతలకు నధివిభుండు¯ నైన విధాత గల్పాదియందును నిజా¯ శ్రయ పద్మమున కధిష్ఠాన మరయ¯ నర్థించి జలముల నన్వేషణము సేసి¯ నలినంబు మొదలు గానంగలేక¯ విసివి క్రమ్మఱను దద్బిసరుహాసీనుఁడై¯ సృష్టినిర్మాణేచ్ఛఁ జిత్తమందుఁ (225.1) జాల నూహించి తత్పరిజ్ఞానమహిమ¯ సరణి మనమునఁ దోపఁక జడనుపడుచు¯ లోకజాలంబుఁ బుట్టింపలేక మోహి¯ తాత్ముఁడై చింత నొందు నయ్యవసరమున. (226) జలమధ్యంబుననుండి యక్షర సమామ్నాయంబున స్పర్శంబు లందు షోడశాక్షరంబును మఱియు నేకవింశాక్షరంబును నైన యియ్యక్షర ద్వయంబు వలన నగుచు మహామునిజనధనం బయిన "తప"యను శబ్దం బినుమాఱుచ్చరింపంబడి వినంబడిన నట్టి శబ్దంబు వలికిన యప్పురుషుని వీక్షింప గోరి నలుదిక్కులకుం జని వెదకి యెందునుం గానక మరలివచ్చి నిజస్థానంబైన పద్మంబునం దాసీనుండై యొక్కింత చింతించి; యట్టి శబ్దంబు దన్నుఁ దపంబు సేయుమని నియమించుటగాఁ దలంచి ప్రాణాయామ పరాయణుండై జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి యేకాగ్రచిత్తుండై, సకలలోక సంతాపహేతువగు తపంబు వేయి దివ్యవత్సరంబులు గావింప, నీశ్వరుండు ప్రసన్నుండై పొడసూపిన నక్కమలసంభవుండు తత్క్షణంబ రాజసతామసమిశ్రసత్త్వ గుణాతీతంబును, శుద్ధ సత్త్వగుణావాసంబును, నకాలవిక్రమంబును, సర్వలోకోన్నతంబును, సకల సురగణ స్తుత్యంబును, లోభ మోహభయ విరహితంబును, నపునరావృత్తి మార్గంబును, ననంత తేజోవిరాజితంబు నైన వైకుంఠపురంబుం బొడగని; యందు.

వైకుంఠపుర వర్ణనంబు

(227) సూర్యచంద్రానలస్ఫురణలఁ జొరనీక¯ నిజదీధితిస్ఫూర్తి నివ్వటిల్ల¯ దివ్యమణిప్రభా దీపిత సౌధ వి¯ మాన గోపుర హర్మ్య మండపములుఁ ¯ బ్రసవ గుచ్ఛస్వచ్ఛభరిత కామిత ఫల¯ సంతాన పాదప సముదయములుఁ¯ గాంచన దండ సంగత మారుతోద్ధూత¯ తరళ విచిత్ర కేతనచయములు (227.1) వికచకైరవ దళదరవింద గత మ¯ రందరసపాన మోదితేందిందిరప్ర¯ భూత మంజుల నినదప్రబుద్ధ రాజ¯ హంసశోభిత వరకమలాకరములు. (228) వల నొప్పగా న దైవం కేశవాత్పర¯ మ్మని పల్కు రాజకీరావళియును¯ మహిమ జగద్విష్ణుమయ మఖిలమ్మని¯ చదివెడు శారికాసముదయంబు¯ నేపారఁగా జితం తే పుండరీకాక్ష¯ యని లీలఁబాడు పికావళియును¯ లలిమీఱఁగా మంగళం మధుసూదన¯ యనుచుఁ బల్కెడు మయూరావళియునుఁ (228.1) దవిలి శ్రౌషడ్వషట్స్వధే త్యాది శబ్ద¯ కలితముగ మ్రోయు మధుప నికాయములునుఁ¯ గలిగి యఖిలైక దివ్య మంగళ విలాస¯ మహిమఁ జెన్నొందు వైకుంఠమందిరంబు. (229) మఱియుం బయోధరావళీ విభాసితనభంబునుం బోలె వెలుంగుచున్న య ద్ధివ్యధామంబు నందు. (230) సలలితేందీవరశ్యామాయమానోజ్జ్వ¯ లాంగులు నవ్యపీతాంబరులును¯ ధవళారవిందసుందరపత్రనేత్రులు¯ సుకుమారతనులు భాసుర వినూత్న¯ రత్న విభూషణ గ్రైవేయ కంకణ¯ హార కేయూర మంజీర ధరులు¯ నిత్యయౌవనులు వినిర్మలచరితులు¯ రోచిష్ణులును హరిరూపధరులు (230.1) నగు సునందుండు నందుండు నర్హణుండుఁ ¯ బ్రబలుఁడును నాది యగు నిజపార్శ్వచరులు¯ మఱియు వైడూర్య విద్రుమామల మృణాళ¯ తుల్యగాత్రులు దను భక్తితో భజింప. (231) క్షాళితాఖిలకల్మషవ్రజామరనదీ¯ జనక కోమల పదాబ్జముల వాని, ¯ నఖిల సంపత్కారణాపాంగ లక్ష్మీ వి¯ లాసిత వక్షఃస్థలంబువానిఁ, ¯ బద్మమిత్రామిత్ర భాసిత కరుణాత¯ రంగిత చారునేత్రములవాని, ¯ భువననిర్మాణ నైపుణ భవ్య నిజ జన్మ¯ కారణ నాభిపంకజము వాని, (231.1) నహి హితాహిత శయన వాహముల వాని, ¯ సేవి తామర తాపస శ్రేణివాని, ¯ నఖిలలోకంబులకుఁ గురుఁడైనవాని¯ గాంచె; బరమేష్టి గన్నుల కఱవు దీఱ. (232) కమనీయ రూపరేఖా¯ రమణీయతఁ జాల నొప్పు రమణీమణి య¯ క్కమలాలయ దన మృదు కర¯ కమలంబుల విభుని పాదకమలము లొత్తెన్. (233) వెండియు. (234) శ్రీకాంతాతిలకంబు రత్నరుచిరాజిప్రేంఖితస్వర్ణడో¯ లాకేళిన్ విలసిల్లి తత్కచభరాలంకార స్రగ్గంధలో¯ భాకీర్ణప్రచరన్మధువ్రత మనోజ్ఞాలోలనాదంబు ల¯ స్తోకానుస్వర లీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్. (235) అట్టి నిత్యవిభూతి యందు. (236) సతతజ్ఞానరమా యశో బల మహైశ్వర్యాది యుక్తున్ జగ¯ త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళత్పంకేరుహాక్షున్ శ్రియః¯ పతి నాద్యంతవికారదూరుఁ గరుణాపాథోనిధిన్ సాత్వతాం¯ పతి వర్థిష్ణు సహిష్ణు విష్ణు గుణవిభ్రాజిష్ణు రోచిష్ణునిన్. (237) దరహాసామృత పూరితాస్యు నిజభక్తత్రాణ పారాయణు¯ న్నరుణాంభోరుహపత్ర లోచనునిఁ బీతావాసుఁ ద్రైలోక్యసుం¯ దరు మంజీర కిరీట కుండల ముఖోద్యద్భూషు యోగీశ్వరే¯ శ్వరు లక్ష్మీయుతవక్షుఁ జిన్మయు దయాసాంద్రుం జతుర్భాహునిన్. (238) మఱియు ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండును సునంద నంద కుముదాది సేవితుండును బ్రకృతి పురుష మహదహంకారంబులను చతుశ్శక్తులును గర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనో మహాభూతంబులను షోడశశక్తులును బంచతన్మాత్రంబులునుం బరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయుండును నై స్వస్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానందకందళిత హృదయారవిందుండును, రోమాంచకంచుకిత శరీరుండును, ఆనందబాష్పధారాసిక్త కపోలుండును నగుచు. (239) వర పరమహంస గమ్య¯ స్ఫురణం దనరారు పరమపురుషుని పదపం¯ కరుహములకు నజుఁడు చతు¯ శ్శిరములు సోఁకంగ నతులు సేసిన హరియున్.

బ్రహ్మకు ప్రసన్ను డగుట

(240) ప్రియుఁడగు బొడ్డుఁదమ్మి తొలిబిడ్డఁడు వేలుపుఁబెద్ద భూతసం¯ చయములఁజేయుకర్త నిజశాసనపాత్రుఁడు ధాత మ్రొక్కినన్¯ దయ దళుకొత్తఁ బల్కెఁ బ్రమదస్మితచారుముఖారవిందుఁడై¯ నయమునఁ బాణిపంకజమునన్ హరి యాతనిదేహమంటుచున్. (241) "కపట మునులకెంత కాలమునకు నైన¯ సంతసింప నేను జలజగర్భ! ¯ చిరతపస్సమాధిఁ జెంది విసర్గేచ్ఛ¯ మెలఁగు నిన్నుఁ బరిణమింతుఁ గాని. (242) భద్రమగుఁగాక! నీకు నో! పద్మగర్భ! ¯ వరము నిపు డిత్తు నెఱిఁగింపు వాంఛితంబు; ¯ దేవదేవుఁడ నగు నస్మదీయ పాద¯ దర్శనం బవధి విపత్తిదశల కనఘ! (243) సరసిజగర్భ! నీ యెడఁ బ్రసన్నత నొంది మదీయలోక మే¯ నిరవుగఁ జూపుటెల్లను నహేతుక భూరి దయా కటాక్ష వి¯ స్ఫురణన కాని, నీ దగు తపోవిభవంబునఁ గాదు; నీ తప¯ శ్చరణము నాదు వాక్యముల సంగతిఁ గాదె సరోజసంభవా! (244) తప మనఁగ మత్స్వరూపము¯ తపమను తరువునకు ఫలవితానము నే నా¯ తపముననే జననస్థి¯ త్యుపసంహరణము లొనర్చుచుండుదుఁ దనయా! (245) కావున మద్భక్తికిఁ దప¯ మేవిధమున మూలధనము నిది నీ మది రా¯ జీవభవ! యెఱిఁగి తప మిటు¯ గావించుట విగతమోహకర్ముఁడ వింకన్." (246) అని యానతిచ్చి “కమలజ! ¯ యెనయఁగ భవదీయమానసేప్సిత మేమై¯ నను నిత్తు; వేఁడు మనినను¯ వనరుహసంభవుఁడు వికచవదనుం డగుచున్. (247) హరివచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁ "డో! ¯ పరమపదేశ! యోగిజనభావన! యీ నిఖిలోర్వి యందు నీ¯ యరయని యట్టి యర్థ మొకఁడైననుఁ గల్గునె? యైన నా మదిన్¯ బెరసిన కోర్కి దేవ! వినిపింతు దయామతిఁ జిత్తగింపవే. (248) దేవా! సర్వభూతాంతర్యామివై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయవాంఛితంబు విన్నవించెద నవధరింపు; మవ్యక్తరూపంబులై వెలుంగు భవదీయ స్థూలసూక్ష్మ రూపంబులును నానా శక్త్యుపబృంహితంబులైన బ్రహ్మాది రూపంబులును నీ యంత నీవే ధరించి జగదుత్పత్తిస్థితిలయంబులం దంతుకీటకంబునుం బోలెఁ గావించుచు నమోఘ సంకల్పుండవై లీలావిభూతిం గ్రీడించు మహిమంబు దెలియునట్టి పరిజ్ఞానంబుఁ గృప సేయుము; భవదీయశాసనంబున జగన్నిర్మాణంబు గావించు నపుడు బ్రహ్మాభిమానంబునం జేసి యవశ్యంబును మహదహంకారంబులు నామదిం బొడముం గావునఁ దత్పరిహారార్థంబు వేడెద; నన్నుం గరుణార్ద్రదృష్టి విలోకించి దయసేయు;"మని విన్నవించిన నాలించి పుండరీకాక్షుం డతని కిట్లనియె. (249) "వారిజభవ శాస్త్రార్థ వి¯ చారజ్ఞానమును భక్తి సమధికసాక్షా¯ త్కారములను నీ మూఁడు ను¯ దారత నీ మనమునందు ధరియింపనగున్. (250) పరికింప మత్స్వరూపస్వభావములును¯ మహిమావతార కర్మములుఁ దెలియు¯ తత్త్వవిజ్ఞానంబు దలకొని మత్ప్రసా¯ దమునఁ గల్గెడి నీకుఁ గమలగర్భ! ¯ సృష్టిపూర్వమునఁ జర్చింప నే నొకరుండఁ¯ గలిగి యుండుదు వీతకర్మి నగుచు¯ సమధిక స్థూల సూక్ష్మస్వరూపములుఁ ద¯ త్కారణ ప్రకృతియుఁ దగ మదంశ (250.1) మందు లీనమైన నద్వితీయుండనై¯ యుండు నాకు నన్య మొకటి లేదు¯ సృష్టికాలమందు సృజ్యమానం బగు¯ జగము మత్స్వరూప మగును వత్స! (251) అరయఁగఁ గల్పప్రళయాం¯ తరమున నాద్యంత విరహితక్రియతోడం¯ బరిపూర్ణ నిత్య మహిమం¯ బరమాత్ముఁడనై సరోజభవ యే నుందున్.

మాయా ప్రకారంబు

(252) అదియునుంగాక నీవు నన్నడిగిన యీజగన్నిర్మాణ మాయా ప్రకారం బెఱింగింతు; లేని యర్థంబు శుక్తిరజతభ్రాంతియుంబోలె నేమిటి మహిమం దోఁచి క్రమ్మఱఁ దోఁపకమాను నదియె మదీయ మాయావిశేషం బని యెఱుంగు; మదియునుంగాక లేని యర్థంబు దృశ్యమానం బగుటకును, గల యర్థంబు దర్శనగోచరంబు గాకుండుటకును, ద్విచంద్రాదికంబును దమఃప్రభాసంబును దృష్టాంతంబులుగాఁ దెలియు మే ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబు లయిన ఘటపటాదులందుఁ బ్రవేశించి యుండు నా ప్రకారంబున నేను నీ భూతభౌతికంబులయిన సర్వకార్యంబు లందు సత్త్వాది రూపంబులం బ్రవేశించి యుందు; భౌతికంబులు భూతంబు లందుం గారణావస్థం బొందు చందంబున భూత భౌతికంబులు గారణావస్థం బొంది నా యందు నభివ్యక్తంబులై యుండవు; సర్వదేశంబుల యందును, సర్వకాలంబుల యందును నేది బోధితంబై యుండు నట్టిదియ పరబ్రహ్మస్వరూపంబు; తత్త్వంబెఱుంగ నిచ్ఛించిన మిము బోఁటి వారలకు నీ చెప్పిన మదీయతత్త్వాత్మకంబైన యర్థంబ యర్థం బని యెఱుంగుదురు; ఈ యర్థం బుత్కృష్టం బయినయది యేకాగ్రచిత్తుండవై, యాకర్ణించి భవదీయచిత్తంబున ధరియించిన నీకు సర్గాది కర్మంబు లందు మోహంబు సెందకుండెడి;"నని భగవంతుండయిన పరమేశ్వరుండు చతుర్ముఖున కానతిచ్చి నిజలోకంబుతో నంతర్థానంబు నొందె;"నని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె. (253) "అవనీశ! బ్రహ్మ యిట్లంతర్హితుండైనఁ¯ బుండరీకాక్షుని బుద్ధినిలిపి¯ యానందమునఁ బొంది యంజలి గావించి¯ తత్పరిగ్రహమునఁ దనదు బుద్ధిఁ¯ గైకొని పూర్వప్రకారంబునను సమ¯ స్తప్రపంచంబును దగ సృజించి¯ మఱియొక నాఁడు ధర్మప్రవర్తకుఁ డౌచు¯ నఖిల ప్రజాపతియైన కమల (253.1) గర్భుఁ డాత్మహితార్థమై కాక సకల¯ భువనహితబుద్ధి నున్నత స్ఫురణ మెఱసి¯ మానితంబైన యమ నియమములు రెంటి¯ నాచరించెను సమ్మోదితాత్ముఁ డగుచు. (254) అయ్యవసరంబున. (255) ఆ నలినాసన నందను¯ లైన సనందాది మునుల కగ్రేసరుఁడున్¯ మానుగఁ బ్రియతముఁడును నగు¯ నా నారదుఁ డేగుదెంచె నబ్జజు కడకున్. (256) చనుదెంచి తండ్రికిం బ్రియ¯ మొనరఁగ శుశ్రూషణంబు లొనరిచి యతఁడుం¯ దన దెసఁ బ్రసన్నుఁ డగుటయుఁ¯ గని భగవన్మాయ దెలియఁగా నుత్సుకుఁడై.