భాగవతము పారాయణ : తృతీయ 349 - 421
చతుర్యుగ పరిమాణంబు
(349) "జననుత కృతయుగ సంఖ్య నాలుగువేలు¯ దివ్యవర్షములు. తదీయ సంధ్య¯ లెనిమిదినూఱేండ్లు. విను త్రేత వత్సర¯ త్రిసహస్రములగు, తదీయ సంధ్య¯ లాఱునూఱేఁడులు నగు. ద్వాపరము రెండు¯ వేల వత్సరముల వెలయు. సంధ్య¯ లోలి నన్నూ ఱేఁడు లొగిఁ, గలియుగము స¯ హస్ర వర్షములు సంధ్యాంశ మరయ (349.1) రెండునూఱేఁడులును నిల్చి యుండుఁ జువ్వె, ¯ యనఘ! సంధ్యాంశ మధ్యంబు నందు ధర్మ¯ మతిశయించును సంధ్యాంశ మందు ధర్మ¯ మల్ప మై కానఁబడుచుండు ననఘచరిత! (350) మఱియు ధర్మదేవత గృతయుగంబున నాలుగు పాదంబులును, ద్రేత యందు మూఁడు పాదంబులును, ద్వాపరంబునం బాద ద్వయంబును, గలియుగంబున నేక పాదంబును గలిగి సంచరించు అట్లగుటం జేసి. (351) పాదవిభేదంబున మ¯ ర్యాదలును దఱుఁగు నధర్మ మాకొలదినె యు¯ త్పాదిల్లి వృద్ధిఁ బొందు ధ¯ రాదివిజులు పాద బుద్ధి రతు లగుదు రిలన్. (352) భూర్భువస్స్వర్లోకములకంటెఁ బొడువునఁ¯ గడు నొప్పు సత్యలోకంబు నందు¯ నుండు బ్రహ్మకుఁ జతుర్యుగ సహస్రము లేగ¯ దిన మొక్కటి యగు, రాత్రియును నిట్ల¯ చన ధాత నిద్రవో జగము లడంగు, మే¯ ల్కని చూడ మరల లోకములు పుట్టుఁ¯ దద్దినమ్మునఁ జతుర్దశ మను లగుదు రం¯ దొక్కొక్క మనువున కొనర దివ్య (352.1) యుగము లోలిని డెబ్బదియొక్క మాఱు¯ సనిన మనుకాల మయ్యె, నమ్మనుకులంబు¯ సురలు మునులును సప్తర్షు లరయ భగవ¯ దంశమునఁ బుట్టి పాలింతు రఖిల జగము. (353) హరి పితృ సుపర్వ తిర్య¯ ఙ్నర రూపములన్ జనించి నయమున మన్వం¯ తరముల నిజ సత్త్వంబునఁ¯ బరిపాలించును జగంబుఁ బౌరుష మొప్పన్. (354) క్రమమునఁ ద్రైవర్గిక స¯ ర్గము సెప్పంబడె సరోజగర్భుఁడు దివసాం¯ తమునఁ దమఃపిహితపరా¯ క్రముఁ డై శయనించు నిద్రఁ గైకొని యంతన్. (355) ఆ రాత్రి భువన త్రయము దమఃపిహితమై¯ భానుచంద్రులతో విలీనమైన¯ సర్వాత్ముఁ డగు హరి శక్తిరూపం బయి¯ కడఁగి వెలుంగు సంకర్షణాగ్ని¯ భువనత్రయంబును దవిలి దహింప న¯ య్యనలకీలలఁ బొడమిన మహోష్మ¯ మలమినఁ గమలి మహర్లోకవాసులు¯ జనలోకమునకును జనుదు రపుడు (355.1) విలయసమయ సముత్కట విపుల చండ¯ వాతధూతోర్మిజాల దుర్వార వార్ధి¯ భువనములు ముంచు నమ్మూడు భువనములను¯ దత్పయోరాశిమీఁదఁ బద్మావిభుండు. (356) చారు పటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా¯ పూర మృణాళహార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికా¯ సార నిభాంగ శోభిత భుజంగమతల్పము నందు యోగని¯ ద్రారతిఁ జెంది యుండు జఠరస్థిత భూర్భువరాది లోకుఁ డై. (357) జనలోక నివాసకు ల¯ ర్థిని వినుతింపంగ నతుల దివ్యప్రభచేఁ¯ దనరుచు మీలిత నిజలో¯ చనుఁడై వసియించు నతఁడు సముచితలీలన్. (358) ఇవ్విధంబున. (359) కైకొని బహువిధ కాలగత్యుపలక్షి¯ తము లై యహోరాత్ర తతులు జరగ¯ శతవత్సరంబులు జనులకుఁ బరమాయు¯ వైన రీతిని బంకజాసనునకుఁ¯ బరమాయు వగు శతాబ్దంబు లందుల సగ¯ మరిగిన నదియ పరార్ధ మండ్రు¯ గాన పూర్వార్ధంబు గడచుటఁ జేసి ద్వి¯ తీయపరార్ధంబు దీని పేరు (359.1) కడఁగి పూర్వపరార్ధాది కాల మందు ¯ బ్రహ్మకల్పాఖ్య నెంతయుఁ బరఁగు నందు ¯ బ్రహ్మ యుదయించుటం జేసి బ్రహ్మకల్ప¯ మనియు శబ్దాత్మకబ్రహ్మ మనియు నెగడె. (360) విను మెన్నఁడు పంకజనా¯ భుని నాభీసరసి యందు భువనాశ్రయ మై¯ తనరిన పద్మము వొడవడు¯ ననఘా యది పద్మకల్ప మన విలసిల్లున్. (361) పూర్వార్ధాదినిం గలిగిన బ్రహ్మకల్పంబుఁ జెప్పితి; ఇంక ద్వితీయ పరార్ధంబు మొదల నెన్నఁ డేని హరి సూకరాకారంబు దాల్చె నది వరాహకల్పం బనం దగు; అట్టి వరాహకల్పం బిపుడు వర్తమానం బగుచున్నది; వెండియు. (362) దీపింపఁ గాలస్వరూపుఁ డైనట్టి ప¯ ద్మాక్షుఁ డనంతుఁ డనాదిపురుషుఁ¯ డఖిలవిశ్వాత్మకుఁ డగు నీశునకుఁ బర¯ మాణ్వాది యుగపరార్ధాంత మగుచు¯ జరుగు నీ కాలంబు చర్చింప నొక్క ని¯ మేష కాలం బయి మెలఁగుచుండుఁ¯ గాని యీశ్వరునకుఁ గర్త గాఁజాల ది¯ క్కాలంబు విను మది గాక దేహ (362.1) మందిరార్థాది కర్మాభిమానశీలు¯ రైనవారికి నాశ్రయం బగుటఁజేసి¯ యరయ హరి తద్గుణవ్యతికరుఁడు గాన¯ కాల మమ్మేటి కెన్నఁడు గర్తగాదు. (363) మఱియు షోడశవికారయుక్తంబై పృథివ్యాది పంచభూత పరివృతం బయి దశావరణంబులుగలిగి పంచశత్కోటి విస్తీర్ణంబై బ్రహ్మాండకోశంబు దనర్చుచుండు. (364) హరి పరమాణురూపమున నందు వసించి విరాజమానుఁడై ¯ సరి వెలుఁగొందు నిమ్ముల నసంఖ్యము లైన మహాండకోశముల్ ¯ నెఱిఁ దన యందు డింద నవనీరజనేత్రుఁ డనంతుఁ డాఢ్యుఁ డ¯ క్షరుఁడు పరాపరుం డఖిలకారణకారణుఁ డప్రమేయుఁ డై. (365) నిరతిశయోజ్జ్వల తేజ¯ స్స్ఫురణం దనరారు పరమపురుషుని విష్ణుం¯ బురుషోత్తము వర్ణింపను¯ సరసిజభవ భవులకైన శక్యమె? చెపుమా." (366) అని మైత్రేయుఁడు విదురుం¯ గనుఁగొని వెండియును బలికెఁ "గాలాహ్వయుఁ డై¯ తనరిన హరి మహిమల నే¯ వినిపించితి; సృష్టిమహిమ విను మెఱిఁగింతున్.
సృష్టి భేదనంబు
(367) పరమేష్టి యీ సృష్ట్యాదిని అహమ్మను దేహాభిమానబుద్ధి గల మోహంబును, నంగనాసంగమ, స్రక్చందనాది గ్రామ్యభోగేచ్ఛలు గల మహామోహంబును, దత్ప్రతిఘాతం బైన క్రోధంబు నందు గలుగు నంధతామిస్రంబును, దన్నాశంబు నందు అహమేవమృతోస్మి యను తామిశ్రంబును, జిత్తవిభ్రమంబును నను నవిద్యా పంచక మిశ్రంబుగా సర్వభూతావలిం బుట్టించి యాత్మీయ చిత్తంబునఁ బాపసృష్టిఁ గల్పించుటకుఁ బశ్చాత్తాపంబు నొంది భగవద్ధ్యానామృత పూతమానసుం డై యూర్థ్వరేతస్కులును, బరమపవిత్రులును నైన సనక సనందన సన త్కుమార సనత్సుజాతు లను మునుల సత్త్వగరిష్ఠుల ధీరజనోత్తముల నార్యుల హరిప్రసన్నులంగా దివ్యదృష్టిం గల్పించి, వారలం జూచి మీమీ యంశంబులం బ్రజలం బుట్టించి ప్రపంచంబు వృద్ధిఁ బొందింపుం డనిన వారలు తద్వచనంబు లపహసించుచుఁ బద్మజుంగని మోక్షధర్ములును నారాయణపారాయణులునునై ప్రపంచ నిర్మాణంబునకుఁ బ్రతికూల వాక్యంబులు పలికిన నుదయించిన క్రోధంబు బుద్ధిచే నిగ్రహింపబడినను నరవిందసంభవుని భ్రూమధ్యంబువలనం గ్రోధస్వరూపంబున నీలలోహితుండు నిఖిల సురాగ్రజుండై యుదయించుచు నాక్రందనం బొనరించె నంత. (368) జననం బందిన నీలలోహితుఁడు గంజాతాసనుం జూచి యి¯ ట్లను నో దేవ! మదాఖ్య లెట్టివి మదీ యావాసముల్ వీఁక నా ¯ కనయంబున్నెఱిఁగింపవే యనుడు నయ్యంభోజగర్భుండు లా ¯ లనముం దోఁపఁ గుమార! నీ జననవేళన్ రోదనం బిచ్చుటన్. (369) రుద్రనామంబు నీకు నిరూఢమయ్యెఁ¯ జంద్ర సూర్యానలానిల సలిల గగన¯ పృథివి ప్రాణ తపోహృదింద్రియము లనఁగఁ¯ గలుగు నేకాదశస్థానముల వసింపు." (370) అని వెండియు "మన్యు మను మహాకాల మహ చ్చివ ఋతధ్వ జోరురేతో భవ కాల వామదేవ ధృతవ్రతు లను నేకాదశ నామంబులు గలిగి ధీర వృ త్త్యశ నోమా నియు త్సర్పి రి లాంబి కేరావతీ సుధా దీక్షా నామ పత్నీ సమేతుండవై పూర్వయుక్తంబు లయిన నామంబులం దత్తన్నివాసంబుల వసియించి ప్రజలం గల్పింపు"మని నిర్దేశించిన భగవంతుం డగు నీలలోహితుండు విశ్వగురుం డైన పితామహునిచే నియుక్తుండై సత్త్వాకృతి స్వభావంబుల నాత్మసము లైన ప్రజలం గల్పించె. (371) రుద్రునిచేత నీగతి నిరూఢమతిన్ సృజియింపఁ బడ్డ యా¯ రుద్రగణంబు లోలి నవరుద్ధత విశ్వము మ్రింగె నమ్మహో¯ పద్రవశాంతి కై యజుఁడు భర్గులఁ జూచి "కుమారులార! మీ¯ రౌద్ర విలోక నానల భరంబునఁ గ్రాఁగె సమస్త లోకముల్. (372) మీ సృష్టి సాలు నింకన్¯ ధీసత్తములార! వినుడు ధృతి మీరు తపో¯ వ్యాసంగచిత్తు లై చనుఁ¯ డా సన్మంగళము లగు దృఢంబుగ మీకున్. (373) భగవంతుం బురుషోత్తమున్ హరిఁ గృపాపాథోధి లక్ష్మీశ్వరున్¯ సుగుణభ్రాజితు నచ్యుతుం బరుఁ బరంజ్యోతిం బ్రభున్ సర్వభూ¯ తగణావాసు నధోక్షజున్ శ్రితజనత్రాణైకపారీణు నా¯ జగదాత్ముం గనుచుందు రార్యులు తపశ్శక్తిన్ స్ఫుటజ్ఞానులై." (374) అనిన విని. (375) కైకొని యిట్లు పంకరుహగర్భనియంత్రితు లైన రుద్రు లు¯ ద్రేకముఁ దక్కి కానలకు ధీమతు లై తపమాచరింప న¯ స్తోక చరిత్రు లేఁగిరి చతుర్ముఖుఁ డంతఁ బ్రపంచకల్పనా¯ లోకనుఁ డై సృజించె జనలోక శరణ్యుల ధీవరేణ్యులన్. (376) వినుము, భగవద్బలాన్విత వినుత గుణులు¯ భువన సంతానహేతు విస్ఫురణ కరులు¯ పద్మసంభవ తుల్య ప్రభావ యుతులు¯ పదురు గొడుకులు పుట్టిరి భవ్యయశులు. (377) అరవింద సంభవు నంగుష్ఠమున దక్షుఁ¯ డూరువువలనను నారదుండు, ¯ నాభిఁ బులహుఁడు, గర్ణములఁ బులస్త్యుండు¯ త్వక్కున భృగువు, హస్తమునఁ గ్రతువు, ¯ నాస్యంబువలన నయ్యంగిరసుఁడు, ప్రాణ¯ మున వసిష్టుఁడు, మనమున మరీచి, ¯ గన్నుల నత్రియుఁ గాఁ బుత్రదశకంబు¯ గలిగిరి వెండియు నలినగర్భు (377.1) దక్షిణస్తనమువలన ధర్మ మొదవె¯ వెన్నువలనను నుదయించె విశ్వభయద¯ మైన మృత్యు, వధర్మంబు నంద కలిగె, ¯ నాత్మఁ గాముండు జననము నందె మఱియు. (378) భ్రూయుగళంబునఁగ్రోధంబు నధరంబు¯ నందు లోభంబు నాస్యమున వాణి¯ యును మేఢ్ర మందుఁ బయోధు లపానంబు¯ నందు నఘాశ్రయుఁ డైన నిరృతి¯ లాలితచ్ఛాయవలన దేవహూతివి¯ భుండు గర్దముఁడును బుట్టి రంత¯ నబ్జజుఁ డాత్మదేహమున జనించిన¯ భారతిఁ జూచి విభ్రాంతిఁ బొరసి (378.1) పంచశరబాణనిర్భిన్నభావుఁ డగుచుఁ¯ గూఁతు రని పాపమునకు సంకోచపడక¯ కవయఁ గోరిన జనకునిఁ గని మరీచి¯ మొదలుగాఁ గల యమ్మునిముఖ్యు లెఱిఁగి. (379) ఇట్లనిరి. (380) "చాలుఁ బురే సరోజభవ! సత్పథవృత్తిఁ దొఱంగి కూఁతు ని¯ ట్లాలరి వై రమింప హృదయంబునఁ గోరుట ధర్మరీతియే¯ బేలరి వైతి నీ తగవుఁ బెద్దతనంబును నేలపాలుగా¯ శీలము వోవఁదట్టి యిటుసేసిన వారలు మున్ను గల్గిరే? (381) నీవు మహానుభావుఁడ వనింద్యచరిత్రుఁడ విట్టిచోట రా¯ జీవభవుండు దా విధినిషేధము లాత్మ నెఱుంగఁ డయ్యె నీ¯ భావభవప్రసూన శర బాధితుఁ డై తన కూఁతుఁ బొందెఁబో¯ వావిదలంపలే కనుచు వారక లోకులు ప్రువ్వఁ దిట్టరే. (382) పాపము దలఁపక నిమిషము¯ లోపలఁ జెడు సౌఖ్యమునకు లోనైతివె యిం¯ తే పో ధారుణిఁ గామా¯ న్ధోపి న పశ్యతి యనంగఁ దొల్లియు వినమే." (383) అని యిబ్భంగి మునీంద్రు లాడిన కఠోరాలాపముల్ వీనుల¯ న్విని లజ్జావనతాననుం డగుచు నా నీరేజగర్భుండు స¯ య్యన దేహంబు విసర్జనీయముగఁ జేయన్ దిక్కు లేతెంచి త¯ త్తనువుం గైకొనఁ బుట్టె దిక్కలితమై 'తామిస్ర నీహారముల్'. (384) అంత. (385) ఉడుగక పంకజాతభవుఁ డొండొక దేహముఁ దాల్చి ధైర్యమున్¯ విడువక సృష్టి పూర్వసమవేతముగన్ సృజియించు నేర్పు దాఁ¯ బొడమమి కాత్మలోనఁ దలపోయుచు నుండఁ జతుర్ముఖంబులన్¯ వెడలె ననూన రూపముల వేదము లంచిత ధర్మ యుక్తితోన్. (386) మఱియు మఖములు మహితకర్మములుఁ దంత్ర¯ ములును నడవళ్లు నాశ్రమములుఁ దదీయ¯ ముఖచతుష్కము నందున పొడమె"ననిన¯ విని మునీంద్రునిఁ జూచి యవ్విదురుఁ డనియె.
స్వాయంభువు జన్మంబు
(387) "తోయజసంభవుఁ డత్తఱి¯ నేయే ముఖమండలమున నేయే సృష్టిన్¯ ధీయుతుఁడై సృజియించెను¯ బాయక యత్తెఱఁగు దెలియఁ బలుకుము నాకున్." (388) అని యిట్లు విదురుం డడిగిన మైత్రేయుం డతనితో నిట్లనియె "ఋగ్యజుస్సామాధర్వంబు లను వేదంబులును, హోతృకర్మంబు లయిన యప్రగీతమంత్రస్తోత్రంబు లగు శస్త్రంబులును, నధ్వర్యుకర్మంబైన యిజ్యయు, సంప్రగీతస్తోత్రం బయిన స్తుతియు, నుద్గాతృ ప్రయోజనం బైన ఋక్సముదాయ రూపం బగు స్తోమంబును, బ్రాయశ్చిత్తం బగు బ్రహ్మకర్మంబును, నాయుర్వేద ధనుర్వేద గాంధర్వ వేదంబులను, నుపవేదంబులును, విశ్వకర్మశాస్త్రం బగు స్థాపత్యంబును, బ్రాగాది ముఖంబుల నుత్పన్నంబు లయ్యె; పంచమవేదం బగు నితిహాస పురాణంబులు సర్వముఖంబులం గలిగె; మఱియుఁ గర్మతంత్రంబు లయిన షోడశ్యుక్థ్యములును, జయనాగ్నిష్టోమంబులును, నాప్తోర్యామాతిరాత్రంబులును, వాజపేయ గోసవంబులును, ధర్మపాదంబు లైన విద్యా దాన తపస్సత్యంబులును, బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ యత్యాశ్రమంబులును గల్గె; వీనికి నొక్కొక్కటికిం జతుర్విధంబు లైన వృత్తులును గలిగి యుండు; అందు సావిత్రం బన బ్రహ్మచర్యంబు యది యుపనయనం బాదిగా దివసత్రయంబు గాయత్రి జపించుటయ; ప్రాజాపత్యం బన వేదవ్రతచతుష్కయంబు యందు బ్రతివ్రతంబును వ్రతులు సంవత్సర పర్యంతంబుగా నాచరింప నగు; బ్రాహ్మంబు వేదగ్రహణాంతంబు నాచరింపం దగు; బృహత్తన నైష్ఠికం బియ్యగునవి బ్రహ్మచారి వృత్తిచతుష్టయంబును; ననిషిద్ధకృష్యాది వృత్తి యగు వార్తయు యజనాది కర్మోపయుక్తం బైన యాజ్ఞాది రూప ధనసంచయంబును, బరుల యాచింపకుండు నయాచితం బగు శాలీనంబును, క్షేత్ర పతిత కణిశ కణ సంగ్రహణరూపం బగు శిలోంఛంబును నను గృహస్తవృత్తులు నాలుగును; నకృష్టపచ్యాహారు లగు వైఖానసులును, నూతనఫలంబు లబ్ధం బైనఁ బూర్వ సంచితపదార్థ త్యాగంబు గల వాలఖిల్యులును, బ్రాతః కాలంబున నే దిక్కు విలోకింతు రద్దిక్కునకుం జని యచ్చట లభించు పదార్థంబుల భుజించి జీవించు నౌదుంబరులును, దమంత ఫలించి తరు పతితంబు లగు ఫలంబులఁ దినుచుండు ఫేనపులును నను చతుర్విధవృత్తులు గల వానప్రస్థులును; స్వాశ్రమవిహిత కర్మంబులం బ్రదానుం డగు కుటీచకుండును, గర్మం బుపసర్జనంబు సేసి జ్ఞానప్రధానుం డయిన బహూదుండును, గేవల జ్ఞానాభ్యాస నిష్ఠుం డగు హంసుండును, బ్రాప్తంబైన పరబ్రహ్మతత్త్వంబు గల నిష్క్రియుండును నను సన్యాసి చతుర్విధ వృత్తులును; మోక్షఫలప్రదం బై యాత్మానాత్మ వివేకవిద్యారూపం బగు నాన్వీక్షకియు, స్వర్గాది ఫలప్రదం బై కర్మవిద్యారూప మగు త్రయియు, జీవనఫల ప్రధానం బై కృష్యాది రూపం బగు వార్తయు, నర్థ సంపాదనైక ప్రయోజనం బగు దండనీతియు, మోక్ష ధర్మకామార్థంబు లైన న్యాయవిద్యా చతుష్కంబును, భూర్భువస్సువ యను వ్యాహృతులును, బూర్వాది ముఖంబులవలన నుదయించె; మఱియు నతని హృదయాకాశంబు వలనం బ్రణవంబును, రోమంబుల వలన నుష్టిక్ఛందంబును, ద్వగింద్రియంబు వలన గాయత్రీఛందంబును, మాంసంబు వలనఁ ద్రిష్టుక్ఛందంబును, స్నాయువు వలన ననుష్టుప్ఛందంబును, నస్థి వలన జగతీచ్ఛందంబును, మజ్జ వలన పంక్తిచ్ఛందంబును, బ్రాణంబు వలన బృహతీఛందంబును, కకారాది పంచ వర్గాత్మకంబు లయిన స్పర్శంబులను, జీవుండును, నకారాది స్వరాత్మకం బైన దేహంబును, నూష్మంబు లను శ ష స హ వర్ణచతుష్టయ రూపంబు లగు నింద్రియంబులును, నంతస్థంబు లగు య ర ల వ యను వర్ణంబులును, షడ్జాది సప్తస్వర రూపంబు నాత్మబలంబు నయిన శబ్దబ్రహ్మంబును, జతుర్ముఖుని లీలావిశేషంబున నుత్పన్నం బయ్యె; వ్యక్తావ్యక్తం బై వైఖరీ ప్రణవాత్మకం బైన శబ్దబ్రహ్మంబు వలనం బరమాత్మ యవ్యక్తాత్మకుం డగుటం జేసి పరిపూర్ణుండును వ్యక్తాత్మకుం డగుటంజేసి యింద్రాది శక్త్యుపబృంహితుండును నై కానంబడు; పదంపడి యజుండు భూరివీర్యవంతు లయిన ఋషిగణంబుల సంతతి యవిస్తృతం బని తలంచి, పూర్వతను పరిగ్రహంబు సాలించి, యనిషిద్ధ కామాసక్తం బైన దేహాంతర పరిగ్రహంబు సేసి, నిత్యంబుఁ బ్రజాసృష్టి యందు వ్యాసక్తుండ నైనం బ్రజ లభివృద్ధి నొందక యుండుట కేమి కారణం బగు నని యచ్చరువొంది; తద్వృద్ధి యగు విధం బాలోచించుచు, దైవం బిచ్చట విఘాతుకంబు గాన తదానుకూల్యం బావశ్యకం బని దాని నెదురుచూచుచు, యథోచిత కృత్య కరణదక్షుం డగుచుండు చతుర్ముఖుని దేహంబు ద్వివిధం బయిన యట్టి రూపద్వయ విభాగంబు స్వరాట్టగు స్వాయంభువ మనువును దన్మహిషి యగు శతరూప యను కన్యకయుంగా మిథునం బయి జనియించె; అమ్మిథునంబు వలన బ్రియవ్రతోత్తానపాదు లను పుత్రద్వయంబు నాకూతి దేవ హూతి ప్రసూతు లను కన్యకా త్రంయంబునుం గలిగిరి; అందు నాకూతిని రుచికునకును, దేవహూతిం గర్దమునకును, బ్రసూతిం దక్షునకును నిచ్చె; వీరల వలనఁ గలుగు ప్రజా సంతతులచేత జగంబులు పరిపూర్ణంబు లయ్యె." (389) అని మైత్రేయుఁడు పలికిన ¯ విని మనమున హర్ష మొదవ విదురుఁడు మునినా¯ థునిఁ జూచి పలికెఁ గ్రమ్మఱ¯ వనజోదర పాదభక్తివశ మానసుఁ డై. (390) "ఘనుఁడు స్వయంభువునకుఁ బ్రియ¯ తనయుఁడు స్వాయంభువుండు దైతేయవిభే¯ దనసేవాచతురుండును¯ జనవినుతుండాదిరాజ్యసత్తముఁడౌటన్ (391) అతని చరిత్రం బవ్యా¯ హత సుఖదము నిఖిల మంగళావహము సమం¯ చితముం గావున బుధసే¯ విత! నా కెఱుఁగంగఁ బలుకవే మునితిలకా! (392) అదియును గాక ముకుందుని¯ పదకమల మరందపాన పరవశులై పెం¯ పొదవినవారి చరిత్రము¯ సదమలమతి వినిన భవము సఫలము గాదే!" (393) అని విదురుండు పల్కిన దయాన్వితుఁ డై మునినాథచంద్రుఁ డి¯ ట్లను ”శ్రుతిశాస్త్రపాఠకలితాత్మకుఁ డైన నరుండు పద్మలో¯ చన చరణారవిందయుగ సంగము గల్గిన సజ్జనుండు వొం¯ దినఫల మొందు భాగవతదివ్యకథాశ్రవణానురక్తిచేన్.” (394) అని చెప్పి మునికులాగ్రణి¯ దనుజారి కథాసుధాప్లుతస్వాతుం డై¯ తనవునఁ బులకాంకురములు¯ మొనయఁగ నానందబాష్పములు జడి గురియన్. (395) వినిపింపఁ దొడఁగె "నా ఘనుఁడు స్వాయంభువుఁ¯ డంగనాయుక్తుఁ డై యబ్జగర్భు¯ నకు మ్రొక్కి వినయవినమితోత్తమాంగుఁ డై¯ హస్తముల్ మొగిచి యిట్లనియె బ్రీతి¯ "జీవరాశులకు రాజీవసంభవ! నీవ¯ జనన రక్షణ వినాశముల కరయ¯ హేతుభూతుఁడవు మా కెద్ది యాచరణీయ¯ మైన కర్మము దాని నానతిమ్ము (395.1) ఎట్టి కర్మంబు సేసిన నెసఁగు నీకు¯ నవహితం బైన సంతోష మాత్మజుండు¯ జనకునకు భక్తిఁ బరిచర్య సలిపి కీర్తి¯ నంది నుతికెక్కి నర్తించు నందు నిందు. (396) కావున నెఱింగింపు మట్టి సత్కర్మంబు." (397) అని పలికిన స్వాయంభువ¯ మను మృదుభాషలకు నలరి మనమునఁ గమలా¯ సనుఁ డనురాగము ముప్పిరి¯ గొనఁ బ్రియతముఁ డైన సుతునకును నిట్లనియెన్. (398) "మునుకొని తండ్రియాజ్ఞఁదలమోచి నిజోచితకృత్యమేమి పం¯ చినఁ దన శక్తియుక్తి నెడసేయక చేయుట పుండరీకలో¯ చన పదసేవ సేయుట ప్రజాపరిపాలనశాలి యౌటయున్¯ జనకునకున్ సుతుండు పరిచర్య లొనర్చుట సువ్వె పుత్రకా! (399) కావున. (400) వివరింపన్ హరి యజ్ఞమూర్తి బరమున్ విష్ణున్ హృషీకేశుఁ గే¯ శవుఁ బద్మాక్షు గుఱించి జన్నములు శశ్వద్భక్తిఁ గావింప మా¯ ధవుఁ డాత్మం బరితోష మొందు నతఁ డుద్యత్ప్రీతిఁ గైకొన్న లో¯ కవితానంబులు దుష్టి నొందు ననఘా! కావింపుమా యజ్ఞముల్. (401) అకుటిల భక్తిఁ గేశవ సమర్పణబుద్ధిఁ గ్రతుక్రియల్ వొన¯ ర్పక విపరీతు లై యుముకురాసులు దంచి ఫలంబు నందఁ గా¯ నక చెడురీతి నూరక ధనవ్యయ మౌటయ కాని మోక్షదా¯ యక మగుచున్నఁ దత్ఫలము నందరు విష్ణుపరాఙ్ముఖక్రియుల్. (402) కావున యజ్ఞముల్ హరి వికారవిదూరు గుఱించి చేయు నీ¯ భావము సూనృతవ్రత శుభస్థితిఁ జెందెడు నీ కుమారులున్¯ నీవును నీ ధరాభరము నెమ్మి వహింపుము సజ్జనావలిం¯ బ్రోవుము ధర్మమార్గమునఁ బుత్రక! దోషలతాలవిత్రకా!"
వరాహావతారంబు
(403) అనవుడు నతనికి నతఁ డి¯ ట్లనియెన్ "భవదీయమైన యానతి యెట్ల¯ ట్లొనరించెద నాకును నా¯ తనయులకు వసించి యుండఁ దగు నెల వెందున్. (404) అరయ లేదు విధాత! యీ యఖిల జంతు¯ జాతముల కెల్ల నాధారభూత మైన¯ ధరణి యిప్పుడు ఘనజలాంతర్నిమగ్న¯ మైన కతమునఁ జోటు లేదంటి దండ్రి! (405) కావున భూమ్యుద్ధరణము¯ గావించు నుపాయ మిపుడు గైకొని నాకున్¯ దేవా నీ వెఱిఁగింపుము¯ నావుడుఁ బద్మజుఁడు దన మనంబునఁ దలఁచెన్. (406) జలమధ్యంబున లీనమొందిన ధరాచక్రంబు నే నేర్పునన్¯ నిలుపన్ వచ్చును బూర్వ మందు జగముల్ నిర్మించు నాఁ డాది న¯ ప్పులఁబుట్టించిన మీఁద నవ్వసుమతిం బుట్టించితిం బుత్ర య¯ ప్పులలోఁగ్రుంకి రసాతలాంతరమునం బొందెం గదా పృథ్వియున్ (407) అఖిల జగత్కల్పనాటోపములకుఁ బా¯ ల్పడిన నాచేత నెబ్బంగి నిపుడు¯ దగిలి విశ్వంభరోద్ధరణంబుఁ గావింప¯ నగు నని సర్వభూతాంతరాత్ముఁ¯ బురుషోత్తముని నవపుండరీకాక్షు ల¯ క్ష్మీపతిఁ దన మనస్థితునిఁ జేసి¯ తలపోయుచున్నఁ బద్మజు నాసికా వివ¯ రమ్మున యజ్ఞవరాహమూర్తి (407.1) యర్థి నంగుష్ఠమాత్ర దేహంబుతోడ ¯ జనన మంది వియత్తల స్థాయి యగుచు ¯ క్షణము లోపల భూరి గజప్రమాణ¯ మయ్యె నచ్చటి జనముల కద్భుతముగ. (408) అంతఁ బ్రజాసర్గ మందు నియుక్తులై¯ నట్టి మరీచ్యాదు లైన మునులు¯ మనుకుమారకులు నమ్మను సహితంబుగ¯ యజ్ఞవరాహంబు నర్థిఁ జూచి¯ "యిట్టి యాశ్చర్య మెట్లెందేని గలదె నా¯ సారంధ్రనిర్గత స్తబ్ధరోమ¯ తోకంబు మనము విలోకింప నంగుష్ఠ¯ మాత్రమై యీ క్షణమాత్రలోన (408.1) మహిమ దీపింప దంతి ప్రమాణమున మ¯ హోన్నతంబైన గండశైలోపమంబు¯ నయ్యె"ననుచు వితర్కించి రబ్జభవుఁడు¯ హర్ష మిగులొత్త నిట్లని యపుడు దలఁచె. (409) "నా మనమునఁ గల దుఃఖవి¯ రామము గావించుకొఱకు రాజీవాక్షుం¯ డీమేర యజ్ఞపోత్రి¯ శ్రీమూర్తి వహించె నిది విచిత్రము దలఁపన్." (410) అని వితర్కించు సమయంబున సూకరాకారుండైన భగవంతుండు. (411) ప్రళయజీమూతసంఘాత భయద భూరి¯ గర్జనాటోపభిన్న దిగ్ఘన గభీర¯ రావ మడరింప నపుడు రాజీవభవుఁడు¯ మునులు నానందమును బొంది రనఘచరిత! (412) అంత మాయామయ వరాహ ఘుర్ఘురారావంబు బ్రహ్మాండ కోటరపరి స్ఫోటనంబుఁ గావింప విని జనస్తప సత్యలోక నివాసు లయిన మునులు ఋగ్యజుస్సామ మంత్రంబుల వినుతించిరి; యజ్ఞవరాహ రూపధరుండ యిన సర్వేశ్వరుండు సత్పురుషపాలనదయాపరుఁడు గావున దిగ్గజేంద్ర లీలావిలోలుండై.
భూమ్యుద్ధరణంబు
(413) కఠిన సటాచ్ఛటోత్కట జాత వాత ని¯ ర్ధూత జీమూత సంఘాత మగుచు ¯ క్షురనిభ సునిశిత ఖురపుటాహత చల¯ త్ఫణిరాజ దిగ్గజ ప్రచయ మగుచుఁ¯ జండ దంష్ట్రోత్థ వైశ్వాన రార్చిస్సవ¯ ద్రజత హేమాద్రి విస్రంభ మగుచు¯ ఘోర గంభీర ఘుర్ఘుర భూరినిస్వన¯ పంకి లాఖిల వార్ధి సంకులముగఁ (413.1) బొరలుఁ గెరలు నటించు నంబరము దెరల¯ రొప్పు నుప్పర మెగయును గొప్పరించు¯ ముట్టె బిగియించు మనమున మూరుకొనుచు¯ నడరు సంరక్షితక్షోణి యజ్ఞఘోణి. (414) మఱియు నయ్యజ్ఞవరాహంబు. (415) తివిరి చతుర్దశ భువనంబులను దొంతు¯ లొరగఁ గొమ్ములఁ జిమ్ము నొక్కమాటు¯ పుత్తడికొండ మూఁపురమును నొరగంట¯ నుఱుముగా రాపాడు నొక్కమాటు¯ ఖురముల సప్తసాగరములఁ రొంపిగా¯ నుక్కించి మట్టాఁడు నొక్కమాటు¯ నాభీల వాలవాతా హతిచే మింటి¯ నొరసి బ్రద్దలుసేయు నొక్కమాటు (415.1) గన్నుఁ గొనలను విస్ఫులింగములుసెదర¯ నురుభయంకర గతిఁ దోఁచు నొక్కమాటు¯ పరమయోగీంద్రజన సేవ్య భవ్యవిభవ¯ యోగ్య మై కానఁగా నగు నొక్కమాటు. (416) ఇట్లు విహరించుచుఁ బ్రాతర్మధ్యందిన తృతీయసవనరూపుం డైన యజ్ఞవరాహమూర్తి యగు సర్వేశ్వరుండు మహాప్రళయంబు నందు యోగనిద్రా వివశుం డై యుండు నవసరంబున నుదకస్థం బైన భూమి రసాతలగతం బైన; దాని నుద్ధరించుటకు సముద్రోదరంబుఁ దరియం జొచ్చు వేగంబు సైరింపంజాలక, సముద్రుం డూర్ము లను భుజంబు లెత్తి వికీర్ణహృదయుం డై యార్తుని పగిది "యజ్ఞవరాహ నన్ను రక్షింపు రక్షింపు"మని యాక్రోశింప; నిశిత కరాళ క్షుర తీక్ష్ణంబు లైన ఖురాగ్రంబుల జలంబులు విచ్ఛిన్నంబులు గావించి యపారం బయిన రసాతలంబుఁ బ్రవేశించి భూమిం బొడగను నవసరంబున. (417) శరనిధిలోన మహోగ్రా¯ మరకంటకుఁ డెదురఁ గాంచె మఖమయగాత్రిన్¯ ఖురవిదళితకులగోత్రిన్ ¯ ధరణికళత్రిన్ గవేషధాత్రిన్ పోత్రిన్. (418) ఇట్లు పొడగని దైత్యుండు రోషభీషణాకారు డై. (419) గద సారించి యసహ్యవిక్రమ సమగ్రస్ఫూర్తిచే వేయఁగా¯ నది దప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాగ్రాహతిం ద్రుంచెఁ బెం¯ పొదవం గ్రోధమదాతిరేక బలశౌర్యోదార విస్తార సం¯ పదఁ బంచాస్యము సామజేంద్రుఁ జల మొప్పం ద్రుంచు చందంబునన్. (420) దితిజాధీశుని నీ గతిం దునిమి యుద్వృత్తిం దదీయాంగ శో¯ ణితపంకాంకిత గండభాగుఁ డగుచున్విష్ణుండు దా నొప్పె వి¯ స్తృత సంధ్యాంబుద ధాతుచిత్రిత సముద్ధీప్తక్షమాభృద్గతిన్¯ క్షితిఁ దంష్ట్రాగ్రమునన్ ధరించి జలరాశిం బాసి యేతేరఁగన్. (421) బాలశీతాంశురేఖా విభాసమాన¯ ధవళ దంష్ట్రాగ్రమున నున్న ధరణి యొప్పె¯ హరికి నిత్యానపాయిని యైన లక్ష్మి¯ నెఱయఁ బూసిన కస్తూరినికర మనఁగ.