పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భాగవత పారాయణ - 2 : నవమ 507 - 641

నహుషుని వృత్తాంతము

(506) అది యట్లుండె; నహుషునకు యతియు, యయాతియును, సంయాతియు, నాయాతియు, వియతియుఁ, గృతియు నన నార్గురు గొడుకులు దేహికి నింద్రియంబుల చందంబున సంభవించి; రందుఁ బెద్దకొడుకగు యతికి రాజ్యం బిచ్చిన నతండు విరక్తుండై. (507) "రాజ్యంబు పాపమూలము¯ రాజ్యముతో నొడలెఱుంగ రాదు సుమతియున్¯ రాజ్యమునఁ బూజ్యు నెఱుఁగడు¯ రాజ్యము గీజ్యమ్ము ముక్తిరతునకు నేలా?" (508) అని పలికి వాఁడు రాజ్యంబునకుం బాసి చనియె. (509) ఆ నహుషుఁడు మఖశతమును¯ మానుగఁ నొనరించి యింద్రమానిని గవయం¯ బూని మునీంద్రులు మోచిన¯ యానముపై నుండి కూలె నహి యై నేలన్.

యయాతి చరిత్రము

(510) అన్నయుఁ దండ్రియుం జన, యయాతి మహీపతి యై చతుర్దిశల్¯ పన్నుగఁ గావఁ దమ్ములకుఁ బాలిడి శుక్రుని కూఁతురున్ సుసం¯ పన్నగుణాభిరామ వృషపర్వుని కూఁతురు నోలి నాండ్రుగా¯ నన్నయశాలి యీ ధరణిచక్రధురంధరుఁ డయ్యెఁ బేర్మితోన్." (511) అనిన విని పరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. (512) "పార్థివుఁడు యయాతి బ్రహ్మర్షి భార్గవుఁ¯ డల్లుఁ డగుట మామ యగుట యెట్లు? ¯ రాజు రాచకూఁతు రతిజేయఁ దగు గాక¯ విప్రకన్య నొంద విహిత మగునె?" (513) అనిన శుకుం డిట్లనియె. (514) "దనుజేంద్రు కూఁతురు తరళాక్షి శర్మిష్ఠ¯ పురములో నొకనాఁడు ప్రొద్దుపోక¯ వేవురుబోటులు వెంటరా గురుసుత¯ యగు దేవయానితో నాట మరిగి¯ పూచిన యెలదోఁట పొంత జొంపముగొన్న¯ క్రొమ్మావి చేరువ కొలఁకుఁ జేరి¯ యందుఁ దమ్ములతేనె లాని చొక్కుచు మ్రోయు¯ నళుల ఝంకృతులకు నదిరిపడుచు (514.1) వలువ లూడ్చి కొలఁకు వడిఁ జొచ్చి తమలోన¯ బెల్లు రేఁగి నీటఁ జల్లులాడ¯ నందినెక్కి మౌళి నిందురోచులు పర్వ¯ శూలి వచ్చెఁ గొండచూలితోడ. (515) మలహరుఁ జూచి సిగ్గుపడి మానిను లందఱు సంభ్రమంబునన్¯ వలువలు గట్టుచో దనుజవల్లభుకూఁతురు దేవయాని దు¯ వ్వలువ ధరించి వేగమున వచ్చినఁ జూచి యెఱింగెఱింగి నా¯ వలు విది యెట్లు కట్టికొనివచ్చిన దానవు యంచుఁ దిట్టుచున్. (516) దేవయాని యిట్లనియె. (517) "ఆ లోకేశుముఖంబునం గలిగె బ్రాహ్మణ్యంబు బ్రహ్మంబునా¯ మేలై వైదికమార్గముల్ దెలుపుచున్; మిన్నంది యందున్ మహా¯ శీలుర్ భార్గవు; లందు శుక్రుఁడు సుధీసేవ్యుండు; నే వానికిం¯ జూలన్ నా వలువెట్లు గట్టితివి రక్షోజాతవై చేటికా! (518) మహిమవతులైన భూసుర¯ మహిళల విత్తమ్ములు పెఱమగువల కగునే? ¯ మహిఁ బసిఁడిగొలుసు లిడినన్¯ విహితములే కుక్కలకు హవిర్భాగంబుల్? (519) మీ తండ్రి మాకు శిష్యుఁడు¯ మా తండ్రి గురుండు గొంతమాత్రం బైనం¯ బ్రీతిం గావింపక పరి¯ భూతం జేయుదువె తులువ పోఁడిమిఁ జెనఁటీ!" (520) అని భర్జించుచున్న దేవయాని పలుకులు విని, కరాళించి, మ్రోగుచున్న భుజంగి చందంబున నిట్టూర్పులు నిగిడించి, పెదవులు గొఱుకుచు శర్మిష్ఠ యిట్లనియె. (521) "బిక్షుండై తమ తండ్రి మా జనకునిన్ బిక్షించినం దన్ను సం¯ రక్షింపం దుది నింత యై మఱపుతో రాజప్రసూనాకృతి¯ న్రక్షోరాజతనూజతో సుగుణతో నాతో సమం బాడెడిం¯ గుక్షిస్ఫోటముగాఁగ దీనిఁ జెలు లీ కూపంబునం ద్రోవరే." (522) అని పలికి (523) బోటిపిండుచేతఁ బొదువంగఁ బట్టించి¯ రాజసమున దైత్యరాజతనయ¯ దొడరి దేవయానిఁ ద్రోపించె వలు వీక ¯ క్రుంకి నూతిలోనఁ గుతిలఁకొనఁగ. (524) ఇట్లు చేసి శర్మిష్ఠ పోయిన వెనుక, యయాతిభూపాలుండు వేఁట మార్గంబున నడవిం దిరుగుచు, దైవయోగంబున నా దేవయాని యున్న నూయి జేరం జనుదెంచి యందు. (525) బంధువుల నెల్లఁ జీరుచు¯ నందు జలామగ్ననగ్న యై వగచుచు ని¯ ర్భంధమునఁ జిక్కి వ్రీడా¯ సింధువున మునింగి యున్న చేడియఁ గనియెన్.

దేవయాని యయాతి వరించుట

(526) కనుంగొని (527) సప్తాంభోనిధిమేఖలావృతమహాసర్వంసహాకన్యకా¯ ప్రాప్తోద్యద్వరదక్షదక్షిణకరప్రాలంబముం జేసి ప్రో¯ త్క్షిప్తం జేసె యయాతి గట్టుకొనఁ బై చేలంబు మున్నిచ్చి ప¯ ర్యాప్తస్వేదజలాంగి నాళిసముదాయస్వర్గవిన్ భార్గవిన్. (528) ఇట్లు నూయి వెడలించిన రాజునకు రాజవదన యిట్లనియె. (529) "ననుఁ బాణిగ్రహణం బొనర్చితికదా నా భర్తవున్ నీవ దై¯ వ నియోగం బిది తప్పదప్పురుషతా వాక్యంబు సిద్ధంబు సౌ¯ ఖ్యనివాసున్ నిను మాని యొండువరునిం గాంక్షింప నే నేర్తునే? ¯ వనజం బానెడి తేఁటి యన్యకుసుమావాసం బపేక్షించునే? (530) అదియునుం గాక. (531) సుగుణాఢ్య! విను నేను శుక్రుని కూఁతుర¯ దేవయానిని దొల్లి దేవమంత్రి¯ తనయుండు కచుఁడు మా తండ్రిచేత మృతసం¯ జీవినిఁ దా నభ్యసించువేళ¯ నతనిఁ గామించిన నత డొల్ల ననవుడు¯ నతఁడు నేర్చిన విద్య యడఁగి పోవ¯ నతని శపించిన నతఁడు నా భర్త బ్రా¯ హ్మణుఁడు గాకుండెడు మని శపించె (531.1) నది నిమిత్తంబు నాకు బ్రాహ్మణుఁడు గాఁడు ¯ ప్రాణనాథుఁడ వీ" వని పడఁతి పలుకఁ¯ దనదు హృదయంబు నెలఁతపైఁ దగులుపడినఁ¯ దమక మొక యింతయును లేక తలఁచి చూచి. (532) దైవయోగముగాక విప్రసుతన్ వరించునె నా మనం¯ బే విధంబున నీశ్వరాజ్ఞయు నిట్టి దంచు వరించె ధా¯ త్రీవరుండును దేవయానిని ధీరబుద్ధులకున్ మనో¯ భావ మొక్కటియే ప్రమాణ మభావ్యభావ్య పరీక్షకున్. (533) ఇట్లు వరించి, యయాతి చనిన వెనుక దేవయాని శుక్రునికడకుం జని, శర్మిష్ఠ చేసిన వృత్తాంతం బంతయు జెప్పి కన్నీరుమున్నీరుగా వగచిన. (534) "క్రూరాత్ముల మందిరములఁ¯ బౌరోహిత్యంబు కంటె పాపం బీ సం¯ సారముకంటె శిలల్ దిని¯ యూరక కాపోతవృత్తి నుండుట యొప్పున్." (535) అని వృషపర్వుకడ నుండుట నిందించుచు శుక్రుం డా కూఁతుం దోడ్కొని పురంబు వెడలి చన; నయ్యసురవల్లభుం డెఱింగి శుక్రుని వలనం దేవతల గెలువఁదలంచి తెరువున కడ్డంబువచ్చి, పాదంబులపైఁ బడి, ప్రార్థించి ప్రసన్నుం జేసిన, నా కోపంబు మాని శుక్రుండు శిష్యున కిట్లనియె. (536) "చెలులు వేవురుఁ దాను నీ సుత చేటికైవడి నా సుతం¯ గొలుచు చుండినఁ దీఱుఁ గోపము గొల్వఁ బెట్టెదవేని నీ¯ వెలఁదిఁ దోడ్కొని వత్తు"నావుడు వేగ రమ్మని భార్గవిం¯ గొలువఁ బెట్టె సురారివర్యుఁడు గూఁతు నెచ్చలిపిండుతోన్. (537) చలమింకేలని తన్నుఁ దండ్రి పనుపన్ శర్మిష్ఠ సన్నిష్ఠతో¯ జలజాతాస్యలు సద్వయస్యలు సహస్రంబున్నజస్రంబుఁ ద¯ న్నలమన్ దాసి సుదాసి యయ్యెఁ బగవాయన్ భూరికోపానలా¯ కలితగ్లానికి దేవయానికి మహాగర్వోద్యమస్థానికిన్. (538) అంత. (539) ఆతతమైన వేడ్క దనుజాధిపమంత్రి సురారినందనో¯ పేతఁ దనూభవం బిలిచి పెండ్లి యొనర్చె మహావిభూతికిం¯ బ్రీతి మహోగ్రజాతికి నభీతికి సాధువినీతికిన్ సిత¯ ఖ్యాతికి భిన్నదుఃఖబహుకార్యభియాతికి నయ్యయాతికిన్. (540) ఇట్లు యయాతికి దేవయాని నిచ్చి శుక్రుండు శర్మిష్ఠాసంగమంబు చేయకు మని యతని నియమించి పనిచె; పిదప దేవయానియు న య్యయాతివలన యదు తుర్వసులను కుమారులం గనియెను; ఒక్క రేయి చెఱంగుమాసి, దేవయాని వెలుపలనున్నయెడ శర్మిష్ఠ యెడరు వేచి యేకాంతంబున యయాతి కడకుం జని, చెఱకువింటి జోదు పువ్వుటంపఱ కోహటించి తన తలంపు జెప్పిన.

యయాతి శాపము

(541) ఆ జవరాలిఁ జూచి మన మాఁపగ లేక మనోభవార్తుఁడై¯ యా జనభర్త మున్ను కవి యాడిన మాట దలంచి యైనఁ జే¯ తోజసుఖంబులం దనిపెఁ ద్రోవఁగవచ్చునె దైవయోగముల్¯ రాజఁట సద్రహస్యమఁట రాజకుమారిని మాన నేర్చునే? (542) ఇట్లు యయాతివలన శర్మిష్ఠ గర్భంబై క్రమంబున ద్రుహ్మ్యుండు, ననువుఁ, బూరువు నన మువ్వురు తనయులం గాంచె; నంత దేవ యాని తద్వృత్తాంతంబంతయు నెఱింగి, కోపించి, శుక్రుకడకుం జని క్రోధమూర్ఛిత యై యున్న సమయంబున యయాతి వెంట జని, యిట్లనియె. (543) "మామకేల చెప్ప మాను సరోజాక్షి¯ దనుజతనయఁ బొంది తప్పుపడితిఁ¯ గామినయిన నన్నుఁ గరుణింపు పతిమాట¯ తండ్రిమాటకంటెఁ దగును సతికి." (544) అని పలికి పాదంబుల కెఱిఁగిన నయ్యింతి యొడంబడక యుండె; నంత నది యెఱింగి శుక్రుం డిట్లనియె. (545) "నామాటఁ ద్రోచి దానవ¯ భామను బొందితివి ధరణిపాలక! తగవే? ¯ యేమాట యేది రూపము¯ కాముకులకు లోలుపులకుఁ గలవే నిజముల్." (546) అని పలికి “నిన్ను వనితాజనహేయంబయిన ముదిమి పొందెడు” మని శపియించిన యయాతి యిట్లనియె. (547) "మామా నా పైఁ గోపము¯ మామా నీ పుత్రియందు మానవు నాకుం¯ గామోపభోగవాంఛలు ¯ ప్రేమన్ రమియించి ముదిమిఁ బిదపం దాల్తున్" (548) అని పలికి యనుజ్ఞగొని, దేవయానిందోడ్కొని పురంబునకుం జని, పెద్దకొడుకగు యదువుం బిలిచి యయాతి యిట్లనియె. (549) "నీ తల్లిం గనినట్టి శుక్రువలనన్ నేఁడీ జరంబొందితిన్; ¯ నా తండ్రీ యదునామధేయ! తనయా! నా వృద్ధతం దాల్పవే; ¯ నీ తారుణ్యము నాకు నీవె; తనివో నిండార గొన్నాళ్ళు నేఁ¯ జేతోజాతసుఖంబులం దిరిగెదన్ శృంగారినై పుత్రకా! " (550) అనిన విని తండ్రికి యదుం డిట్లనియె. (551) "కాంతాహేయము దుర్వికారము దురాకండూతి మిశ్రంబు హృ¯ చ్చింతామూలము పీనసాన్వితము ప్రస్వేదవ్రణాకంపన¯ శ్రాంతిస్ఫోటకయుక్త మీ ముదిమి వాంఛం దాల్చి నానాసుఖో¯ పాంతంబైన వయోనిధానమిది యయ్యా! తేర యీ వచ్చునే?"

పూరువు వృత్తాంతము

(552) అని యదుం డొడంబడకున్న యయాతి దుర్వసు ద్రుహ్యాదుల నడిగిన వారును యదువు పలికినట్ల పలికినఁ గడగొట్టు కుమారుండైన పూరువున కిట్లనియె. (553) "పిన్నవుగాని నీవు కడుఁబెద్దవు బుద్ధుల యందు; రమ్ము నా¯ యన్న! మదాజ్ఞ దాఁటవుగ దన్న! వినీతుఁడ వన్న! నీవు నీ¯ యన్నలు చెప్పినట్లు పరిహారము చెప్పకు మన్న! నా జరన్¯ మన్నన దాల్చి నీ తరుణిమం బొనగూర్చుము నాకుఁ బుత్రకా!" (554) అనిన విని గురుభక్తిగుణాధారుండయిన పూరుం డిట్లనియె. (555) "అయ్యా! నన్నిటు వేఁడనేల? భవదీయాజ్ఞాసముల్లంఘనం¯ బయ్యుండం బరిహారమున్నొడువ నే నన్యాయినే? నీ జరన్¯ నెయ్యం బొప్పగఁ దాల్చి, నా తరుణిమన్ నీకిచ్చెదం, బంపినం¯ గయ్యం బాడెడి పుత్రకుండు క్రిమిసంకాశుండు గాకుండునే? (556) అదియునుం గాక. (557) మునివృత్తి డయ్య నేఁటికి¯ జనపాలక! సుగతిఁ గోరు సత్పురుషులకుం¯ దనుఁ గన్న తండ్రిజెప్పిన¯ పని చేసిన సుగతి గొంగుపసిఁడియ కాదే? (558) పనుపక చేయుదు రధికులు¯ పనిచిన మధ్యములు పొందుపఱతురు తండ్రుల్¯ పని చెప్పి కోరి పనిచిన¯ ననిశము మాఱాడు పుత్రు లధములు దండ్రీ!" (559) అని పలికి పూరుండు ముదిమి చేకొని తన లేబ్రాయంబు యయాతి కిచ్చె; న య్యయాతియుం దరుణుండై. (560) ఏడౌ ద్వీపము లేడు వాడలుగ సర్వేలాతలంబెల్లఁ బె¯ న్వీడై పోఁడిమి నేలుచుం బ్రజల నన్వేషించి రక్షించుచుం¯ దోడన్ భార్గవి రా మనోజసుఖసంతోషంబులం దేలుచుం¯ గ్రీడించెన్ నియతేంద్రియుం డగుచు నా క్రీడాతిరేకంబులన్. (561) మర్మంబుల నతిసాధ్వీ¯ ధర్మంబుల దేవయాని దన ప్రాణేశున్¯ నర్మముల మనోవాక్తను¯ కర్మంబుల నొండులేక కడు మెప్పించెన్. (562) ఆకాశంబున మేఘబృందము ఘనంబై సన్నమై దీర్ఘమై¯ యేకంబై బహురూపమై యడఁగు నట్లేదేవుగర్భంబులో¯ లోకశ్రేణి జనించుచున్ మెలఁగుచున్ లోపించు నా దేవు సు¯ శ్రీకాంతున్ హరిఁగూర్చి యాగములు చేసెన్ నాహషుం డిమ్ములన్. (563) మఱియును. (564) చెలికాండ్రం గరులన్ రథమ్ముల భటశ్రేణిం దురంగంబులం¯ గలలోఁగన్న ధనావళిన్ సమములంగాఁ జూచుచున్ భార్యతో¯ బలు వేలేండ్లు మనోజభోగలహరీపర్యాప్తుఁడై తేలియున్¯ బలుతృష్ణం గడఁగాన కెంతయు మహాబంధంబులన్ స్రుక్కుచున్.

యయాతి బస్తోపాఖ్యానము

(565) ఒక్క దినంబున నాత్మజ్ఞానంబునంజేసి కాంతానిమిత్తంబున మోసపోవుట యెఱింగి యయాతి యతివిషాదంబునొంది దేవయాని కిట్లనియె. (566) "మన చారిత్రమువంటిది¯ విను మితిహాసంబు గలదు; వృద్ధజనములున్¯ మునులును మెత్తురు; నీవును¯ మనమున నంగీకరింపు మంజులవాణీ! (567) అది యెట్టిదనిన. (568) అజ మొకం డడవిలో నరుగుచుం దాఁ గర్మ¯ ఫలమున నూతిలోపలికి జాఱి¯ లోఁగెడి ఛాగి నాలోకించి కామి యై¯ కొమ్మున దరిఁ గొంత గూలఁ ద్రోచి¯ వెడలింపనచ్ఛాగి విభునిఁగాఁ గోరిన¯ నగుఁగాక యని తాను నదియుఁ దిరుగ¯ నెన్నియేనిని దన్ను నెంత కామించిన¯ నన్నిటికిని భర్త యై తనర్చి (568.1) వాని నే ప్రొద్దు రతులకు వశలఁ జేసి¯ సొరిదిఁ గ్రీడించి క్రీడించి చొక్కిచొక్కి¯ కాముఁ డనియెడి దుస్సహగ్రహముకతన¯ జిత్త మేమఱి మత్తిల్లి చెల్లఁ జిక్కి. (569) వెడ విలుతుకేళిఁ జిగురా¯ కడిదపు వ్రేటునకు లోఁగి యతి మోహితుఁడై¯ విడువక సతులం దగిలెడు¯ జడునకు నెక్కడివి బుద్ధిచాతుర్యంబుల్? (570) అంత నచ్ఛాగంబు దన పిదపం దగిలిన ఛాగినీనివహంబు లోపలం జూడనొప్పెడి ఛాగి యందుఁ దగిలి క్రీడింపం గని, నూతిలోపలంబడి వెలువడిన ఛాగి, తన పతివలని నెయ్యంబు లేకుండుటకు విన్ననై తన మనంబున. (571) "పలికినఁ బలుకులు పలుకఁడు¯ కలఁచున్ నవకాంతఁ జూచి కడు సంచలుఁడై¯ నిలిచిన చోటన్ నిలువఁడు¯ నిలువెల్లను గల్ల కామి నిజమరి గలఁడే." (572) అని పలికి విడిచి చనిన నయ్యజవల్లభుండు సురతపరతంత్రుండై, మిసిమిసి యను శబ్దంబుచేయుచుఁ, దచ్ఛాగి వెంటంజని, యొడంబఱుపంజాలకుండె; నంత దానికిఁ గర్త యైన బ్రాహ్మణుండు రోషంబున రతిసమర్థంబు గాకుండ నల్లాడుచుండ ఛాగవృషణంబులు ద్రెంచివేసిన, నచ్ఛాగంబు గ్రిందఁబడి వేడుకొనినఁ, బ్రయోజనంబు పొడగని యోగవిదుండు గావున బ్రాహ్మణోత్తముండు గ్రమ్మఱ నయ్యజవృషణంబులు సంధించిన. (573) వృషణములు మరలఁ గలిగిన¯ సుషముండై ఛాగవిభుఁడు సుందరితోడన్¯ విషయసుఖంబులఁ బొందుచుఁ¯ దృష తుదిఁ గనఁ డయ్యెఁ బెక్కు దివసము లయ్యున్." (574) అని యివ్విధంబున యయాతి దేవయానికి నిజవృత్తాంతంబు గథారూపంబున నెఱింగించి యిట్లనియె. (575) "అబలా! నీ నిబిడాతిదుర్జయ సలజ్జాపాంగభల్లంబులం¯ బ్రబలంబైన మనంబు భగ్నముగ నా ప్రావీణ్యముం గోలుపో¯ యి బలిష్ఠుండగు కాముబారిఁ బడి నే నెట్లోర్తునే బందిక¯ త్తె బడిం బాపపుఁ దృష్ణ యిప్పు డకటా! దీర్ఘాకృతిన్ రొప్పెడిన్. (576) అదలదు ప్రాణము లదలినఁ¯ గదలదు సర్వాంగకములుఁ గదలుచు నుండన్¯ వదలదు బిగువులు వదలినఁ¯ దుదిలే దీ తృష్ణ దీనిఁ ద్రుంపఁగవలయున్. (577) వెయ్యేం డ్లయ్యెను నీతోఁ¯ గ్రయ్యంబడి యున్నవాఁడఁ గామసుఖములం¯ గ్రుయ్య దొక యించుకైన¯ న్డయ్యదు కొనలిడియెఁ దృష్ణ నవపద్మముఖీ! (578) ముదిసెను దంతావళియును¯ ముదిసెను గేశములు దనువు ముదిసెం దనకున్¯ ముదియ నివి రెండు చిక్కెను ¯ బ్రదికెడి తీపియును విషయపక్ష స్పృహయున్. (579) కడలే దాశాలతకుం¯ గడఁ జూడఁగఁ గానరాదు కడఁ గనిరేనిన్¯ గడు ముదమున సంసారము¯ గడఁ గందురు తత్త్వవిదులు గమలదళాక్షీ! (580) మండన హాటక పశు వే¯ దండాశ్వ వధూ దుకూల ధాన్యాదులు పె¯ క్కుండియు నాశాపాశము¯ ఖండింపఁగ లేవు మఱియుఁ గడమయ చుమ్మీ. (581) కామోపభోగసుఖములు¯ వేమాఱును బురుషుఁ డనుభవించుచు నున్నం¯ గామంబు శాంతిఁ బొందదు¯ ధూమధ్వజుఁ డాజ్యవృష్టిఁ ద్రుంగుడు పడునే? (582) అక్క తల్లి చెల్లె లాత్మజ యెక్కిన¯ పాను పెక్కఁ జనదు పద్మనయన! ¯ పరమయోగికైన బలిమిని నింద్రియ¯ గ్రామ మధికపీడఁ గలుగఁ జేయు. (583) వెంగలివిత్తయి తిరుగుచుఁ¯ గంగారై చెడక ముక్తిఁ గాంక్షించు నతం¯ డంగనలతోడ విడువని¯ సంగడములు వదలవలయు జలజాతముఖీ! (584) అదిగావున నేఁడు మొదలు తృష్ణాఖండనంబు చేసి, నిర్విషయుండనయి, యహంకారంబు విడిచి, మృగంబులం గలసి, వనంబున సంచరించెద; పరబ్రహ్మంబునందుఁ జిత్తంబుజేర్చెద; బ్రహ్మనిష్ఠ మనుష్యులకు నాశానివారిణి యగుటం జేసి యే నందుఁ దత్పరుండనై యాహారనిద్రాదియోగంబులం బరిహరించెద; నాత్మవిదుండై సంసార నాశంబులఁ దలంచినవాఁడె విద్వాంసుఁ” డని పలికి, పూరుని యౌవనం బతని కిచ్చి ముదిమి దాను గైకొని విగతలోభుండై, నిజ భుజ శక్తిపాలితం బగు భూమండలంబు విభాగించి, ద్రుహ్యునకుఁ బూర్వభాగంబును, యదువునకు దక్షిణభాగంబును, దుర్వసునకుఁ బశ్చిమదిగ్భాగంబును, ననువునకు నుత్తరదిగ్భాగంబును సంరక్షింపుండని యిచ్చి వారల సమక్షంబున. (585) నాలుగుచెఱగుల నేలయుఁ¯ బాలింపుం డనుచు నగ్రభవులను బంచెన్¯ భూలోక మేలు మనుచును¯ బాలార్కోదారుఁ బూరుఁ బట్టము గట్టెన్. (586) ఇట్లు పూరునికి రాజ్యంబిచ్చి పెక్కువర్షంబులందు ననుభూతంబు లయిన యింద్రియసుఖంబులు వర్జించి. (587) మిక్కలి సుజ్ఞానంబునఁ¯ జక్కగఁ దెగనడచి వైరిషడ్వర్గంబున్¯ ఱెక్కలు వచ్చిన విహగము ¯ గ్రక్కున నీడంబు విడుచు కరణి నుదితుఁడై. (588) కారుణికోత్తముఁడగు హరి¯ కారుణ్యముకతన నతఁడు ఘనుఁడై గెలిచెం¯ గ్రూరములగు విషయంబుల¯ నూరక గెలువంగ శక్తుఁ డొక్కఁడు గలఁడే? (589) మఱియు నిర్మూలితసకలసంగుండై సత్త్వరజస్తమోగుణంబుల దిగనాడి నిర్మలంబయి, పరమంబయిన వాసుదేవాభిధానబ్రహ్మంబునందు యయాతిభూపాలుండు స్వతస్సిద్ధయయిన భాగవతగతిం జెందెను; అంత. (590) ప్రాణేశుఁ డాడిన పలుకులు నగవులు¯ గాఁ జూడ కంతరంగమున నిలిపి¯ పథికులై పోవుచుఁ బానీయశాలలఁ¯ జల్లగా నుండెడి జనుల యట్ల¯ సంసారమునఁ గర్మసంబంధులై వచ్చి¯ యాలు బిడ్డలు మగం డనుచుఁ గూడి¯ యుండుట గాని సంయోగంబు నిత్యంబు¯ గా దీశమాయాప్రకల్పితంబు (590.1) దీని విడుచుట దగ వని తెగువ మెఱసి¯ నిద్రచాలించి మేల్కొన్న నేర్పు చాల¯ గలిగి భార్గవి సర్వసంగముల విడిచి¯ హరిపరాధీన యై ముక్తి కరిగె నధిప!" (591) అని యిట్లు యయాతిచరితంబు చెప్పి “భగవంతుండును సర్వభూతనివాసుండును, శాంతుండును, వేదమయుండును నైన వాసుదేవునికి నమస్కరించెద” నని శుకుం డిట్లనియె.

పూరుని చరిత్ర

(592) "భారత! నీవు జనించిన¯ పూరుని వంశంబునందుఁ బుట్టినవారిం¯ జారు యశోలంకారుల¯ ధీరుల వినిపింతు నధిక తేజోధనులన్. (593) పూరునకు జనమేజయుండు, జనమేజయునకుఁ బ్రాచీన్వాంసుండు, నా ప్రాచీన్వాంసునకుఁ బ్రవిరోధనమన్యువు, నతనికిఁ జారువుఁ బుట్టి; రా చారువునకు సుద్యువు, సుద్యువునకు బహుగతుండును, బహుగతునకు శర్యాతియు, శర్యాతికి సంయాతియు, సంయాతికి రౌద్రాశ్వుండును, రౌద్రాశ్వునకు ఘృతాచి యను నచ్చరలేమ యందు ఋతేపువుఁ, గక్షేపువు, స్థలేపువుఁ, గృతేపువు, జలేపువు, సన్నతేపువు, సత్యేపువు, ధర్మేపువు, వ్రతేపువు, వనేపువు నను వారు జగదాత్మభూతుండైన ప్రాణునకు నింద్రియంబుల చందంబునఁ బదుగురు గొడుకులు జన్మించి; రందు ఋతేపువునకు నంతిసారుండును, నంతిసారునకు సుమతియు, ధ్రువుండు, నప్రతిరథుండునన మువ్వురు పుట్టి; రందు నప్రతిరథునికిఁ గణ్వుండును, గణ్వునికి మేధాతిథియు, నతనికి బ్రస్కందుండు మొదలగు బ్రాహ్మణులును జన్మించి; రా సుమతికి రైభ్యుండు పుట్టె; రైభ్యునకు దుష్యంతుడు పుట్టె.

దుష్యంతుని చరిత్రము

(594) పారావారపరీతో¯ దార ధరాభారదక్ష దక్షిణహస్త¯ శ్రీ రాజిల్లఁగ నొకనాఁ¯ డా రాజేంద్రుండు వేఁటయం దభిరతుఁడై. (595) గండక కంఠీరవ భే¯ రుండ శశవ్యాళ కోల రోహిష రురు వే¯ దండవ్యాఘ్ర మృగాదన¯ చండ శరభ శల్య భల్ల చమరాటవులన్. (596) చప్పుడు చేయుచు మృగముల¯ రొప్పుచు నీరముల యందు రోయుచు వలలం¯ ద్రిప్పుకొని పడఁగఁ బోవుచుఁ¯ దప్పక వ్రేయుచును వేఁటతమకం బొప్పన్. (597) మృగయూథంబుల వెంటను¯ మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుఁడై¯ మృగయులు గొందఱు గొలువఁగ¯ మృగరాజపరాక్రమంబు మెఱయఁగ వచ్చెన్. (598) ఇట్లు వచ్చివచ్చి దైవయోగంబునఁ గణ్వమహాముని తపోవనంబు చేరం జని. (599) ఉరుతర శ్రాంతాహి యుగళంబులకుఁ బింఛ¯ ముల విసరెడి కేకిముఖ్యములను¯ గరుణతో మదయుక్త కలభంబులకు మేఁత¯ లిడుచు ముద్దాడు మృగేంద్రములును¯ ఘనమృగాదనములు గాపుగా లేళ్ళతో¯ రతులు సాగించు సారంగములను¯ నునుపుగా హోమధేనువుల కంఠంబులు¯ దువ్వుచు నాడు శార్దూలములను (599.1) దార కలహించు నుందురు దంపతులకు¯ మైత్రి నంకించు మార్జాలమల్లములను¯ మతిని జాతివైరంబులు మాని యిట్లు¯ గలసి క్రీడించు మృగములఁ గాంచె నతఁడు. (600) "ఇత్తెఱఁగున మృగజాతుల¯ పొత్తులు మే మెఱుఁగ"మనుచు భూవల్లభుఁడుం¯ జిత్తములోపల నా ముని¯ సత్తము సద్వృత్తమునకు సంతసపడుచున్. (601) హల్లక బిసురుహ సరసీ¯ కల్లోలోత్ఫుల్ల యూథికా గిరిమల్లీ¯ మల్లీ మరువక కురువక¯ సల్లలితానిలమువలన సంతుష్టుండై (602) దుష్యంతుండు వచ్చు నవసరంబున. (603) ఇందిందిరాతిసుందరి¯ యిందిందిరచికుర యున్న దిందింద; శుభం¯ బిం దిందువంశ; యను క్రియ¯ నిందీవరవీథి మ్రోసె నిందిందిరముల్. (604) మా కందర్పుని శరములు¯ మాకందము లగుటఁ జేసి మా కందంబుల్¯ మాకందము లను కైవడి¯ మాకందాగ్రములఁ బికసమాజము లులిసెన్. (605) అంత. (606) ఇందున్న కణ్వమునికిని¯ వందన మొనరించి తిరిగి వచ్చెద ననుచుం¯ బొందుగ ననుచరులను దా¯ నందఱ నందంద నిలిపి యటఁ జని మ్రోలన్. (607) ఆ కణ్వాశ్రమమందు నీరజనివాసాంతప్రదేశంబులన్¯ మాకందంబులనీడఁ గల్పలతికా మధ్యంబులన్ మంజు రం¯ భాకాండాంచితశాలలోఁ గుసుమ సంపన్నస్థలిం జూచె నా¯ భూకాంతుండు శకుంతలన్ నవనటద్భ్రూపర్యటత్కుంతలన్. (608) దట్టపుఁ దుఱుమును మీఁదికి¯ మిట్టించిన చన్నుఁగవయు మిఱుమిఱు చూడ్కుల్¯ నట్టాడునడుముఁ దేనియ¯ లుట్టెడు మోవియును మనము నూరింపంగన్. (609) అంతనా రాజకుమారుం డలరుటమ్ములవిలుకాని వెడవింట ఘణఘణాయమానలయి మ్రోయు ఘంటలకుం బంటించి, తన మనంబున. (610) "వన్యాహారములన్ జితేంద్రియత నావాసించు నా కణ్వుఁ డీ¯ కన్యారత్నము నే గతిం గనియెడిం; గా దీ కురంగాక్షి రా¯ జన్యాపత్యముగాఁగనోపు; నభిలాషం బయ్యెఁ; గాదేని నే¯ యన్యాయక్రియలందుఁ బౌరవుల కెం దాశించునే చిత్తముల్? (611) అడిగిన నృపసుతుఁ గానని¯ నొడివెడినో యిది మనంబు నొవ్వ"నని విభుం¯ డుడురాజవదన నడుగక¯ తడుమన యొక కొంత ప్రొద్దు దడఁబడ జొచ్చెన్. (612) మఱియు నెట్టకేలకుఁ దన చిత్తసంచారంబు సత్యంబుగాఁ దలంచి యిట్లనియె. (613) "భూపాలక కన్యక వని¯ నీ పయిఁ జిత్తంబు నాఁటె; నీవా రేరీ? ¯ నీ పేరెవ్వరు? నిర్జన¯ భూపర్యటనంబు దగవె? పూర్ణేందుముఖీ!" (614) అని పలుకుచున్న రాజకుమారుని వదనచంద్రికారసంబు నేత్ర చకోరంబులవలనం ద్రావుచు, నయ్యువిద విభ్రాంతయై యున్న సమయంబున. (615) కంఠేకాలునిచేతం¯ గుంఠితుఁడగు టెట్లు మరుఁడు? కుసుమాస్త్రంబుల్¯ లుంఠించి గుణనినాదము¯ ఠంఠమ్మన బాల నేసె ఠవఠవ గదురన్. (616) ఇట్లు వలరాచవాని క్రొవ్విరికోలలవేఁడిమిఁ దాలిమిపోఁడిమి చెడి, యా వాలుఁగంటి యిట్లనియె. (617) "అనివార్యప్రభ మున్ను మేనకయు విశ్వామిత్రభూభర్తయుం¯ గని; రా మేనక డించిపోయెనడవిం; గణ్వుండు నన్నింతగా¯ మనిచెన్; సర్వము నామునీంద్రుఁ డెఱుఁగున్; మద్భాగధేయంబునన్¯ నినుఁగంటిం బిదపం గృతార్థ నగుచున్ నేఁడీ వనాంతంబునన్. (618) నీ వారము ప్రజలేమును¯ నీవారము పూజగొనుము నిలువుము నీవున్¯ నీవారును మా యింటను¯ నీవారాన్నంబుగొనుఁడు నేఁడు నరేంద్రా! " (619) అని పలికిన, దుష్యంతుండు మెచ్చి, మచ్చెకంటి యిచ్చ యెఱింగి యిట్లనియె. (620) "రాజతనయ వగుదు రాజీవదళనేత్ర! ¯ మాట నిజము లోనిమాటలేదు¯ తనకు సదృశుఁడయిన తరుణునిఁ గైకొంట¯ రాజసుతకుఁ దగవు రాజవదన! " (621) అని మఱియుఁ దియ్యని నెయ్యంపుఁ బలుకులవలన నయ్యువిద నియ్యకొలిపి. (622) బంధురయశుఁడు జగన్నుత¯ సంధుఁడు దుష్యంతుఁ డుచిత సమయజ్ఞుండై¯ గంధగజగమన నప్పుడు¯ గాంధర్వవిధిన్ వరించె గహనాంతమునన్.

భరతుని చరిత్ర

(623) ఇవ్విధంబున నమోఘవీర్యుండగు నా రాచపట్టి, దపసిరాచూలికిఁ జూలు నెక్కొలిపి, మఱునాఁడు తన వీటికిం జనియె; నయ్యింతియుఁ గొంతకాలంబునకుఁ గొడుకుం గనినఁ గణ్వమునీంద్రుం డా రాచపట్టికి జాతకర్మాది మంగళాచారంబు లొనర్చె; నా డింభకుండును దినదినంబునకు బాలచంద్రుఁడునుం బోలె నెదుగుచు. (624) కుంఠితుఁడుగాక వాఁడు¯ త్కంఠం దన పిన్ననాఁడె కణ్వవనచర¯ త్కంఠీరవ ముఖ్యంబుల¯ కంఠములం బట్టి యడుచుఁ; గట్టున్; విడుచున్. (625) అంత నా కణ్వమునీంద్రుండు బాలకుం జూచి శకుంతల కిట్లనియె. (626) "పట్టపురాజు నీ మగఁడు; పాపఁడు నన్నిట నెక్కు డంతకుం; ¯ బట్టపుదేవివై గఱువ! బాగున నుండక పాఱువారితో¯ గట్టువనంబులో నవయఁగాఁ బనిలే దిటఁ దర్లిపోఁగదే¯ పుట్టిన యిండ్ల మానినులు పోరచిగా ననిశంబు నుందురే? " (627) అనిన నియ్యకొని. (628) "ఆ పిన్నవాని నతుల¯ వ్యాపారు నుదారు వైష్ణవాంశోద్భవునిం¯ జూపెద"నంచు శకుంతల¯ భూపాలునికడకు వచ్చెఁ బుత్రుని గొనుచున్. (629) వచ్చి దుష్యంతుండున్న సభామండపంబునకుం జని నిలిచి యున్న యెడ. (630) వల కేలన్ గురుచక్రరేఖయుఁ బదద్వంద్వంబునం బద్మరే¯ ఖలు నొప్పారఁగ నందు వచ్చిన రమాకాంతుండు నాఁ గాంతి న¯ గ్గలమై యున్న కుమారు మారసదృశాకారున్ విలోకించి తాఁ¯ బలుకం డయ్యె విభం డెఱింగి సతి విభ్రాంతాత్మ యై యుండగన్. (631) ఆ సమయంబున. (632) "అదె నీ వల్లభ; వాఁడు నీ సుతుఁడు; భార్యాపుత్రులం బాత్రులన్¯ వదలంగా; దలనాఁటి కణ్వవనికా వైవాహికారంభముల్¯ మది నూహింపు; శకుంతలావచనముల్ మాన్యంబుగా భూవరేం¯ ద్ర! దయం జేకొను"మంచు మ్రోసెను వియద్వాణీవధూవాక్యముల్. (633) ఇట్లశరీరవాణి సర్వభూతంబులకుఁ దేటపడ భరింపు మని పలికిన, నా కుమారుండు భరతుండయ్యె; నంత నా రాజు రాజవదన నంగీకరించి తనూభవుం జేకొని కొంతకాలంబు రాజ్యంబుజేసి పరలోకంబునకుం జనియె; తదనంతరంబ. (634) రెండవహరి క్రియ ధరణీ¯ మండలభారంబు నిజసమంచితబాహా¯ దండమున నిలిపి తనకును¯ భండనమున నెదురులేక భరతుం డొప్పెన్. (635) మఱియునా దౌష్యంతి, యమునాతటంబున దీర్ఘతపుండు పురోహితుండుగా డెబ్బదియెనిమిదియును, గంగాతీరంబున నేఁబది యయిదును, నిట్లు నూటముప్పదిమూఁడశ్వమేధయాగంబులు సదక్షిణంబులుగా నొనర్చి; దేవేంద్రవిభవంబున నతిశయించి, పదుమూఁడువేలునెనుబదినాలుగు కదుపుధేనువులుగలయది ద్వంద్వంబనం బరఁగు, నట్టి వేయి ద్వంద్వంబుల పాఁడిమొదవులఁ గ్రేపులతోడ నలంకారసహితలం జేసి వేవురు బ్రాహ్మణుల కిచ్చి, మష్కార తీర్థకూలంబున విప్రముఖ్యులకుఁ బుణ్యదినంబున గనక భూషణ శోభితంబులయి ధవళదంతంబులు గల నల్లని యేనుంగులం బదునాలుగులక్షల నొసంగె; దిగ్విజయకాలంబున శక, శబర, బర్బర, కష, కిరాతక, హూణ, మ్లేచ్ఛ దేశంబుల రాజులఁ బీచంబడంచి, రసాతలంబున రాక్షస కారాగృహంబులందున్న వేల్పుల గరితలం బెక్కండ్ర విడిపించి తెచ్చి, వారల వల్లభులం గూర్చె; త్రిపురదానవుల జయించి; నిర్జరుల నిజమందిరంబుల నునిచె; నతని రాజ్యంబున గగన ధరణీతలంబులు ప్రజలుగోరిన కోరిక లిచ్చుచుండె; నివ్విధంబున. (636) సత్యచరితమందుఁ జలమందు బలమందు¯ భాగ్యమందు లోకపతులకంటె¯ నెక్కుడైన పేర్మి నిరువదియేడువే¯ లేండ్లు ధరణి భరతుఁ డేలె నధిప! (637) అర్థపతికంటెఁ గలిమిఁ గృ¯ తార్థుండై యతుల శౌర్య మలవడియు నతం¯ డర్థములను బ్రాణములను ¯ వ్యర్థము లని తలఁచి శాంతుఁ డయ్యె నరేంద్రా! (638) భరతుని భార్యలు మువ్వురు¯ వరుసం బుత్రకులఁ గాంచి వల్లభుతోడన్¯ సరిగారని తోడ్తోడను¯ శిరములు దునుమాడి రాత్మ శిశువుల నధిపా! (639) ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువులం జంపిన భరతుం డపుత్రకుండై మరుత్ స్తోమంబను యాగంబు పుత్రార్థియై చేసి, దేవతల మెప్పించె; నయ్యవసరంబున. (640) అన్న యిల్లాలిఁ జూలాలిని మమతాఖ్యఁ¯ జూచి బృహస్పతి సురతమునకుఁ¯ దొరఁకొని పైబడ్డఁ దొల్లి గర్భంబున¯ నున్న బాలుఁడు భయం బొదవి వలదు¯ తగదని మొఱజేయఁదమకంబుతో వాని¯ నంధుండ వగుమన్న నలిగి వాఁడు¯ యోనిలోపలి వీర్య మూడఁ దన్నిన నేలఁ¯ బడి బిడ్డఁడై యున్నఁ బాయ లేక (640.1) నితని పెంపు; కొడుకు లిరువురు జన్మించి¯ రనుచు వెలయఁ జేయు మనిన మమతఁ¯ బెంపఁజాల; నీవ పెంపు; భరింపు; మీ¯ ద్వాజు ననుచుఁ జనియె దాని విడిచి. (641) ఇట్లు చథ్యుని భార్య యగు మమతయు బృహస్పతియు శిశువుం గని, ద్వాజుండైన వీని నీవ నీవ భరింపుమని, వదినె మఱఁదులు దమలో నొండొరువులం బలికిన కారణంబున వాఁడు భరద్వాజుండయ్యె; గర్భస్థుండయిన వాఁడు బృహస్పతి శాపంబున దీర్ఘతముండయ్యె; నంత నా బృహస్పతియు మమతయు నుదయించిన వాని విడిచి నిజేచ్ఛం జనిన, మరుత్తులు వానిం బోషించి పుత్రార్థి యయిన భరతున కిచ్చిరి; భరతుండు వానిం జేకొనియె; వితథంబయిన భరతవంశంబునకు నా భరద్వాజుండు వంశకర్త యగుటం జేసి వితథుండనం బరఁగె నా వితథునికి మన్యువు, మన్యువునకు బృహత్క్షత్త్ర జయ మహావీర్య నర గర్గు లను వారేవురు సంభవించి; రందు నరునికి సంకృతి, సంకృతికి గురుండు, రంతిదేవుం డన నిరువురు జన్మించిరి; అందు.