పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

భూమిక : గ్రంథం - పీఠిక

ఓం శ్రీరామ

తెలుగుభాగవతం.ఆర్గ్ అవతారిక

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

గ్రంథం

పోతన భాగవతంలోని పద్యాలు కొన్నిటిని అయినా మననం చేస్తుండటం చాలా మంచిది. మంచి జరుగుతుంది. పిల్లల చేత చదివిస్తుంటే ఎంతో మంచిది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు బాగా వచ్చి వంట పడుతుంది. అందుకే – “చదువుకుందాం భాగవతం - బాగుపడదాం మనం అందరం” అని పెద్దలు గురువులు అంటారు. అంతటి గొప్ప గ్రంథమిది. అట్టి పోతన భాగవతంలోని “శ్రీ కృష్ణా యదు భూషణా”, “అమ్మలగన్న యమ్మ”, “మందార మకరందమున దేలు”, “ఇంతింతై” . . . లాంటి అద్భుతమైన పద్యాలు కొన్నిటిని అయినా తెలియని వాడు తెలుగు వాడే కాదు అంటారు. ఇది పెద్దల మాట; గురువుల మాట; మహర్షుల మాట. ఎవరు హైందవ ధర్మంలో ఏ ఆధ్యాత్మిక ప్రవచనం తెలుగులో చేయాలన్నా పోతన పద్యం స్మరించక తప్పదు అన్నది ప్రతీతి.

ట్టి పోతన విరచిత భాగవతం సమగ్రంగా, సంపూర్ణంగా, సటీక టిప్పణాదులతో తెలుగుభాగవతం.ఆర్గ్ అందిస్తున్నది; విశ్వ వ్యాప్తంగా ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ కావాలన్నా సిద్దంగా అందిస్తున్నది. పెద్ద తరం వారికి, యువ తరానికి, నవ తరానికి మరియు రాబోయే తరతరాలకు కూడ అనుకూలంగా ఉండేలా చేయబడింది. ససంపూర్ణంగా ప్రతి పద్యం వినటానికి ఉంది. సమగ్రంగా తెలుగుభాగవతానికి చెందిన సమస్తం, ఒక విజ్ఞానసర్వస్వంలా (ఎన్ సైక్లోపీడియాలా) ఒకే చోట (సింగిలు విండో విధానంలా) ఉచితంగా అందిస్తోంది మన తెలుగుభాగవతం.ఆర్గ్. అంతేకాదు మంత్రాలు, వ్రతాలు, విగ్రహాలు, వేదవిద్యలు వంటివి కొనుక్కోదగ్గవి కావు, గురువులు పెద్దలు అనుగ్రహంతో ప్రసాదిస్తే, అందుకొని తరించ దగ్గవి అని శాస్త్రం చెపుతోంది అంటారు.

మూల భాగవతం

రి ఈ ఉద్గంథానికి మూలం సంస్కృత భాగవత పురాణం. మూలం ఎంత గట్టిదైతే చెట్టు అంత గొప్పది అవుతుంది కదా; అంత మంచి ఫలాలను ఇస్తుంది కదా. అలాంటి ఈ తెలుగు భాగవత కల్పవృక్షం బహు అద్భుతమైన ఫలాలను వందల ఏళ్ళ నుండి మన తెలుగులకు అందిస్తోంది. ఈ కల్పవృక్షం మూలం గురించి కొద్దిగా తొంగి చూద్దాం.

శ్రీమద్భాగవతమును పంచమ వేదం అంటారు. అష్టాదశ పురాణాలు లోనూ ముఖ్యమైనది. మూల కర్త వ్యాస మహర్షి. వీరిని, వేదాలను విభాగించిన మహర్షి కనుక, వేద వ్యాసుల వారు అంటారు. వీరు ద్వాపరయుగం చివరి కాలంలోని వారు. అనగా, సుమారు కీ. పూ. 3,000 ప్రాంతం వారు అన్నమాట. అంతటి మహానుభావుడు; మహాభారతంతో పాటు అష్టాదశ పురాణాల కర్త అయినవాడు; ఒకానొక సందర్భంలో ఇన్ని ఉత్కృష్టమైన ధర్మ గ్రంథాలు వ్రాసినా మనసు శాంతి పొందలేదు అని బాధపడుతున్నాడు. దేవర్షి, త్రికాలజ్ఞుడు, పరమ భాగవతోత్తమ శ్రేష్ఠుడు అయిన నారదుల వారు విచ్చేసి, భాగవత పురాణం చేపట్టు, నీ పట్టులన్నీ విడిపోతాయి; ఆ భాగవతం వలన నువ్వు బాగుపడతావు; మానవజాతికి బాగుపడే మార్గం దొరుకుతుంది; చేపట్టు అని ఆ మహర్షిని ఆజ్ఞాపించాడు. అంతటి గట్టి మూలం ఉన్నది మన ఆంధ్రుల పాలిటి అమృత భాండం అన దగ్గ మన తెలుగు భాగవతం.

రచన

మ్మెర పోతనామాత్యుల వారు తెలుగులకు అందించిన అద్భుత వరప్రసాదంగా అ మ్మహా పురాణాన్ని "పోతన భాగవతం" అని ప్రస్తుతిస్తారు. కాని నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పోతన భాగవతంలో, కారణాలు ఏవైతేనేం కొన్ని పూరణలు, కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. బమ్మెరవారు సంపూర్ణంగా వ్రాసారు కాని శ్రీరాముడికి తప్ప ఇతరులకు అంకితం ఇవ్వనన్న ప్రపత్తితో ఉండటంతో. అప్పటి పాలకుడైన సింగరాజు భూపతి కోపంతో మొత్తం తాళపత్ర కట్టలు అన్నీ భూస్థాపితం చేసాడని, తరువాత బయటకు తీసేసరికి కొవ్ని పత్రాలు చెదలు తిని నష్టపోయాయనీ; పోతన కాలధర్మం చేసాకా కొంతకాలానికి వారి కొడుకు పూజామందిరంలో ఈ ఉద్గ్రంథాన్ని కనుగొన్నాడు. పోతన శిష్యుడు, తన సహాధ్యాయి అయిన గంగనతో కలిసి కాల ప్రభావం వలన నష్టపోయిన భాగాలు పూరింప జేసారు అనీ, ఇలా రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. స్థూలంగా చెప్పుకోవాలంటే 1, 2, 3, 4, 7, 8, 9, 10 (రెండు భాగాల) స్కంధాలు (7949 పద్యగద్యలు) పోతనామాత్యుల వనీ; 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన వారి రచన అనీ; 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ రచన అనీ; 11 మరియు 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉన్నది. దానినే ప్రమాణంగా తీసుకొని తెలుగుభాగవతం చేపట్టటం జరిగింది. ఇవే కాకుండా 21వ శతాబ్దం వచ్చేసరికి, ఈ ఆరు వందల ఏళ్ళలో కాల ప్రభావం వలన కొన్ని ప్రక్షిప్తాలు కూడా చోటుచేసుకున్నాయి. పై ముగ్గురిలో నారయ ఒక్కరే తన కృతిలో పోతన శిష్యుడను అని ధృవీకరించి చెప్పారు. వీరిలో సింగయ ఒక్కరే తన స్కంధానికి, స్వతంత్ర కావ్యానికి అనుసరించే అప్పటి ప్రమాణాలు అయిన కృతిపతి నిర్ణయం, షష్ఠ్యంతాలు మున్నగునవి వ్రాసారు.

పోతనామాత్యులు

హజ కవి అయిన పోతనామాత్యుల వారు వ్యాసుని అపరావతారం. వారు పుట్టుకతోనే స్వభావరీత్యా కవి రత్నం. వారి తల్లిదండ్రులు, గురువుదేవులు, స్వంత సాధనలు అనే సానలమీద సానపెట్టబడిన జాతి రత్నం లాంటి పండితుడు. వీరు జీవించిన కాలం గురించి ఇప్పటి వరకు ఏదీ నిర్దుష్టంగా నిరూపితం కాలేదు. కాని, స్థూలంగా కీ. శ. 15వ శతాబ్దం వారు అని చెప్పవచ్చు అంటారు. అసంఖ్యాక గ్రంధాల సారం ఒడిసిపట్టిన మేటి. గంటం పట్టి గ్రంధ రచనా వ్యవసాయం నడిపిన మహా పండితుడు; హలం పట్టి పొలం పని నడిపిన కృషీవలుడు; పండిత పామరులను మెప్పిస్తూ కథనం నడిపిన కవీశ్వరుడు; నిగర్వ నియోగి; వర శైవ కుటుంబంలో పుట్టి, పెరిగి, వైష్ణవం వంటబట్టించుకుని, శ్రీరామచంద్రుని ఆజ్ఞను శిరసావహించి, భాగవత రచన సాగించిన మహానుభావుడు. పరమ అద్వైత సిద్దాంతి అని శ్రీధరుల వంటి మహా పండిత విమర్శాగ్రేసరులు అంటారు. విశిష్ఠ విశిష్ఠాధ్వైతి అని రామానుజార్యుల మంతం వారు అంటారు. వీరి శైలి బహు మృదుమధురం. పంచదార పాకం. జన సామాన్యం నుండి పండిత వరేణ్యుల వరకు అందరిని అలరిస్తుంది. ఇది మంత్రాలలో గాయత్రి వలె బాగా ప్రభావవంతమైనదిగా కాలపరీక్షకు నెగ్గినది అని పెద్దలు ఎప్పటినుంచో అంటున్నారు. అవును అందుకే, కల్యాణం ఆలస్యం అవుతుంటే రుక్మిణీ కల్యాణ పారాయణ; కష్టాలు చుట్టుముడుతుంటే నారాయణ కవచం ప్రయోగించట వంటివి ముందు నుంచీ ఉన్నవే.

పోతనప్రణీతమైన ఆంధ్రమహాభాగవతమును అనేక మహాపండితులు ప్రసిద్ధ సంస్థలు పుస్తక రూపంలో ముద్రించాయి. అయితే ప్రస్తుత కాలానికి అనువైన అంతర్జాలం, కంప్యూటర్లలలో చదువు కొనుటకు వీలుగా అందిస్తున్నాము. విండోస్ ఉండి ఎమ్ ఎస్ ఆఫీసు లో యూనికోడ్ లిపితో కావలసిన భాగం సులువుగా చదువుకొనుటకు వీలుగా చేసాము. ఈ మహాగ్రంథంలో 31 రకాల ఛందోప్రక్రియలలో మొత్తం 9048 పద్యగద్యలతో విస్తారమైనది. సీసంక్రింద వాడిన తేటగీతి, ఆటవెలది పద్యాలను కూడ లెక్కలోకి తీసుకుంటే మొత్తం 1061 పద్యగద్యలు. ఛందోప్రక్రియ వారి వీటి గణన కూడ చేయబడ్డాయి.(ఛందోప్రక్రియవారీ గణన). ఏ భాగంకావాలంటే అది కాపీ-పేస్టు, వెదుకుటలకు వీలుగా ఉండేలా చేసారు ఊలపల్లి సాంబశివ రావు.

సంకలన కర్త

తూర్పు గోదావరి జిల్లా, ఊలపల్లి గ్రామస్థులు చిట్టిరాజుగారి కుమారుడు అచ్యుతరామయ్యగారు మఱియు విశాఖపట్నం జిల్లా శ్రీరామపురం గ్రామస్థులు సాంబశివ రావుగారి కుమార్తె వేంకట రత్నంగారు దంపతులు బహు సాత్వికులు ఉన్నత సంస్కారులు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు లక్ష్మీ నారాయణ దేవ్ మఱియు సాంబశివ రావు, ఇద్దరు కూతుళ్లు శేష కుమారి, లక్ష్మి. రెండవ కుమారుడు సాంబశివ రావు విరోధి నామ సంవత్సరంలో (క్రీ.శ. 1949) జన్మించాడు. ఆ బాలుడుని తల్లిదండ్రులు, అన్నగారు ఎంతో గారాబంగా పెంచారు. ఆటపాటలలోనే కాదు చదువులలో కూడా ముందుండే అతనిని, అనుగ్రహించి రాయవరం గ్రామస్థులు పూజారి తాతగారు పురాణ, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం పరిచయంచేసారు. ఆ సాంబశివరావు దంపతులకు ఫణి కిరణ్, భాస్కర కిరణ్ అనే ఉత్తములు కలిగారు. ఈ ఊలపల్లి సాంబశివ రావు వృత్తిరీత్యా విద్యుత్తు ఇంజనీరుగా క్రీ.శ. 2007లో పదవీవిరమణ చేసాక, భాగవత గణనధ్యాయం చేప్పట్టారు. గణనాధ్యాయంలో భాగంగా ఈ తెలుగుభాగవతం.ఆర్గ్ నిర్మాణం చేసి అంతర్జాలంలో అందిస్తున్నారు.

కృతజ్ఞతలు

తెలుగుభాగవతం.ఆర్గ్ ఇలా మనకి ఉచితంగా సర్వ సిద్ధంగా వ్యాపారాత్మక రహితంగా అందుతోంది అంటే; ఈ కృషికి వలసిన పుస్తకముల రచయితలకు, ప్రచురణకర్తలకు, అంతర్జాల సంస్థలకు, ఈ పని ఆరంభించినప్పుడు ప్రోత్సహించి “ఇది నలుగురికి అందుబాటులోకి రావాలి సుమా” అని సహకారం అందించిన సత్యనారాయణ మాష్టారు, తొలి పరిచయం నుండి ఆత్మీయంగా ప్రోత్సహిస్తున్న తెలుగు విశ్వ విద్యాలయ ఆచార్యులు ఎ. ఉషాదేవి గారు, ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారు, ఆచార్యవరేణ్యులు ఎల్చూరి మురళీధరరావు గారు, జాలికలో చూసి ఆత్మీయులైన కవి, అష్టావధాని, జాలజనులు చింతా రామకృష్ణా రావు గారు, ఆత్మీయ మిత్రులు తెలుగుభాగవతం.కం ప్రారంభించడానికి మూల కారకులు జాలజనులు ఛార్టర్డు ఎకౌంటెటు వేంకట కణాద గారు, జాలగూడు పునర్నిర్మాణ నిర్వాహణ బాధ్యతలు చేపట్టిన చిరంజివి మోపూరు ఉమా మహేశ్ ఇలా సహకరించిన ప్రోత్సాహించిన మిత్రులు పేరు పేరునా అందరకు,ఇక్కడ ఒక మరువలేని జ్ఞాపకం మీతో పంచుకుంటాను. ఈ ప్రయత్నారంభంలో చాలా ఇబ్బంది పడుతుంటే, మా వెలుదండ నిత్యానందరావు గారు ఎక్కిరాల కృష్ణమాచార్యులు మాష్టారు వారి భాగవతప్రకాశముతీసుకోమని ఉత్తి మాటలతో వత్తిడి చేయకుండా పుస్తకాల షాఫుయజమాని సాంబశివరావు గారికి చెప్పిమాఇంటికి సెట్టు పంపించేలా చేసారు.ఆ మేలు జన్మజన్మలు మరువలేను. ఇంకా మా తెలుగుభాగవతం అంతర్జాల జాలగూడు ఆదులను నిర్మించుట నిర్వహించుట మున్నగు వాటికి అమూల్య సహాయ సహకారాలు అందించిన వారికి అందరికి కృతజ్ఞతలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థ ఇచ్చే పదవీవిరమణ భృతి లేకపోతే ఈ కార్యం చేపట్టే ధైర్యం ఉండేదే కాదు. ఆ మాతృ సంస్థ, దీనినుండి విడివడిన విద్యుత్తు ప్రసార సంస్థకు కృతజ్ఞతా సహస్రాలు. అంతులేని సహకారం అందించిన కుటుంబ సభ్యులు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.

లా ఇందరి శ్రమకోర్చి చేసిన సేవా ఫలితమైన ఈ తెలుగుభాగవతం.ఆర్గ్ గణని (గణక యంత్రం, కంప్యూటరు), టాబ్ (టాబ్లెట్టు), సంచారిణి (మొబైలు ఫోను), ఐపోను, ఐపాడ్ మున్నగు సకల పరికరాల లోను అందుబాటులో ఉంటుంది. మనదే ఆలస్యం రండి చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం.


రండి అందుకోండి తెలుగు భాగవతాన్ని; ఆస్వాదించండి; ఆనందించండి; తరించండి:


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


ఈ ఉద్గ్రంథంలో 12 స్కంధాలు ఉన్నాయి. పంచమ (5), దశమ స్కంధాలు రెండేసి భాగాలుగా ఉన్నాయి. ఈ పద్యాలుగింటి గురించి చిరు పరిచయం చూద్దాం. మరిన్ని వివరాలు ఆయా స్కంధాల భూమికలలో చూడగలరు.

ప్రథమ స్కంధము

ఓం శ్రీరామ

ప్రథమ స్కంధం పురాణం దశ లక్షణాలలోని ప్రథమ లక్షణం "సర్గ" కు ప్రతీక అంటారు. ఈ స్కంధం గ్రంధానికి పరిచయం లాంటిది, ఆవిష్కరణ లాంటిది. అసలు ఎత్తుగడలోనే “శ్రీ కైవల్య పదంబు జేరుటకునై” అనే ప్రార్థన పద్యంలో భాగవతం మొత్తం సూచించారు. పలికెడిడిది భాగవత మట అనిన భక్తి ప్రపత్తి, అందరిని మెప్పించెద కృతుల అన్న ఆత్మ విశ్వాసం మన పోతన్నది.

శ్రీ కృష్ణ నిర్యాణం ఈ ఆరంభ స్కంధంలో సూచించబడింది. భాగవతానికి శ్రోత పరీక్షిత్తు మహారాజు జననం, ప్రయోక్త శుక ముని ప్రవేశం పరిచయం చెప్పబడ్డాయి. వేద కల్ప వృక్ష విగలిత మై అని భాగవతాన్ని నిర్వచించినది ఈ స్కంధంలోనే.

భీష్మ స్తుతి, కుంతి స్తుతి వంటి అత్యద్భుతమైన వేద సార భరితాలు ఇక్కడ అందించారు. శ్రీ కృష్ణా యదు భూషణా, గురు భీష్మాదులు గూడి వంటి అమృతగుళికలు లాంటి పద్యాలు రుచి ఇక్కడ ఆస్వాదించగలము.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ద్వితీయ స్కంధము

ఓం శ్రీరామ

ద్వితీయ స్కంధంలో పోతనగారి తెలుగు సేతలో యోగ, భక్తి తత్వాలు, భగవత్తత్త్వం, ప్రపంచోద్భవం, వివిధ ధర్మాలు, పురాణ లక్షణాలు వగైరా వివరించబడ్డాయి. విష్ణుమూర్తి 24 అవతారాలు వర్ణించబడ్డాయి. హరి మయము, కమనీయ భూమి భాగములు, అణువో కాక మున్నగు ముత్యాల లాంటి పద్యాలు ఇక్కడ ఆస్వాదిద్దాం రండి రసిక హృదయులారా!

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

తృతీయ స్కంధము

ఓం శ్రీరామ

తృతీయ స్కంధంలో పోతనామాత్యులు విశ్వ స్వరూప, కాల స్వరూప వివరణలు, కృష్ణ భక్తి తత్వం, వరాహావతార వర్ణన, దేవహూతి కపిల సంవాదం పేరుతో సాంఖ్య యోగ తత్వం వివరించారు. శ్రీ కృష్ణ నిర్యాణం వివరించారు. వారి తండ్రి పాలు, ఒకని కై యిట్లు, కంటి గంటి, బొరలు గెరలు, దేవ జితం, హవ రూపివి, వర వైకుంఠము వంటి మణిపూసల లాంటి పద్యాల నెలవు ఈ స్కంధం.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

చతుర్థ స్కంధము

ఓం శ్రీరామ

తుర్థ స్కంధంలో భక్తుల భక్తి తత్వాలు వర్ణించబడ్డాయి. అనయంబు శివ యను, నీలగళాపరధి, అభ్రం లిహా దభ్ర, దూర్వాంకురంబుల, ధరను విరులు మున్నగు చక్కటి పద్య రాజాలు ఈ స్కంధలోవే. దక్ష యజ్ఞం, సతీ దేవి దేహ త్యాగం, ధృవోపాఖ్యానం, పృథు చరిత్ర, ప్రచేతసుల విషయం మున్నగునవి బమ్మెర పోతన గారు తేనెలో ముంచిన గంటంతో గీసి గీసి వివరించారు ఈ స్కంధంలో.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

పంచమ స్కంధము - ప్రథమాశ్వాశం

ఓం శ్రీరామ

పంచమ స్కంధం గంగన తెలుగు సేత. చిన్న స్కంధం. ఏక ఖండంగా రెండు భాగాలుగా లభ్యం అవుతున్నది. రెండు ఆశ్వాసాలుగా చేయబడిన గంగన తెలుగు సేత పోతన భాగవతంలో స్థానం పొందగలిగిందిగా పండితులచే అంగీకరించబడింది. పంచమ స్కంధ ప్రథమ ఆశ్వాసంలో మనువుల చరిత్రలు, భరతోపాఖ్యానం మున్నగునవి వివరించబడ్డాయి.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

పంచమ స్కంధము - ద్వితీయాశ్వాశం

ఓం శ్రీరామ

పంచమ స్కంధం గంగన తెలుగు సేత. పోతన భాగవతంలో ఇది లుప్తం కావటం లేదా నష్టం కావటం వలన గంగనచే రచించబడింది. ఇది చిన్న స్కంధం అయినా ఏక ఖండంగా రెండు భాగాలుగా లభ్యం అవుతోంది. రెండు ఆశ్వాసాలుగా చేయబడిన గంగన తెలుగు సేత పోతన భాగవతంలో స్థానం పొందినదిగా పండితులచే అంగీకరించబడింది. పంచమ స్కంధ ద్వితీయ ఆశ్వాసంలో సృష్ణి, ప్రళయాల వర్ణన, గ్రహాదుల గురించిన భగణం, నరకాది లోకాల వర్ణన ఉన్నాయి

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

షష్ఠ స్కంధము

ఓం శ్రీరామ

ష్ఠ స్కంధం సింగయ చేత ఆంధ్రీకరించబడి, పోతన భాగవతంలో స్థానం పొందే గౌరవం దక్కించుకుంది. అయినా స్వతంత్ర గ్రంథం వలె అప్పటి సంప్రదాయాల ప్రకారం ప్రార్థన, కృతి పతి నిర్ణయం, వంటివి ఉన్నాయి. సింగయ తన కృతిలో అనేక ఛందోప్రక్రియలు ప్రయోగించి విద్వత్తు ప్రదర్శించారు. అజామిళోపాఖ్యానం, నారాయణ కవచం, వృత్రాసుర సంహారం, చిత్రకేతోపాఖ్యానం, పుంసవన వ్రతం, మరుత్తుల జన్మ రహస్యం మున్నగు హరి కథలు వివరించబడ్డాయి. ఈ స్కంధ లోని కాళికి బహు సన్నుత, దూరమున నాడు, నీకు వాడెవ్వడు, సతులెవ్వరు, హరి వరదుండయిన వంటి పద్య రత్నాలు అనేకం ఉన్నాయి, ఆస్వాదిద్దాం రండి.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

సప్తమ స్కంధము

ఓం శ్రీరామ

ప్తమ స్కంధం బమ్మెర వారిచే అద్భుతంగా ఆంధ్రీకరించబడింది. బహుళ ప్రఖ్యాతి పొందిన పరమ భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుని చరిత్ర వివరించబడింది. భక్తి తత్వంతో పాటు వివిధ ధర్మాలు, వివిధ వర్ణాలు వర్ణించబడ్డాయి. అలుక నైన, కీటకము దెచ్చి, ఱెక్కలు రావు, చదవని వా డజ్ఞుం, చదివించిరి నను, కమలాక్షు నర్చించు, ఇందు గల డందు, నరమూర్తి కాదు, శరియై, లేదని యెవ్వరిని, వంటి అనేక అమృతోపమేయ పద్యాలతో విరాజిల్లు స్కంధం ఇది.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

అష్టమ స్కంధము

ఓం శ్రీరామ

ష్టమ అష్టమస్కంధం పురాణ దశలక్షణాలలో "మన్వంతరాలకు" ప్రతీక అంటారు. ఈ స్కంధంలో చతుర్దశ మనువుల చరితాలు వర్ణించబడ్డాయి. భిల్లీ భిల్ల, ఎవ్వని చే జనించు, కల డందురు, లావొక్కింతయు లేదు, అల వైకుంఠ పురంబులో, సిరికిం జెప్పడు, హార కిరీట, స్వచ్ఛమైన ఫణంబు, మింగెడి వాడు, హరి సూచిన, నన్ను గన్న తండ్రీ, గొడుగో, వారిజాక్షులందు, ఇంతింతై, రవి బింబ వంటి అత్యద్భుతమైన ఆణిముత్యాలు ఎన్నో అష్టమ స్కంధ పాల కడలిలో ఏరుకుందాం రండి. రండి. భాగవత ప్రియులారా! ఎంతో ప్రసిద్ధమైన గజేంద్ర మోక్షం, వామన చరిత్ర, బలిచక్రవర్తి కథ, క్షీర సాగర మథనం, కూర్మావతార వర్ణన ఘట్టాలను బమ్మెర పోతనామాత్యులు వారు స్వానుభవ పూర్వకంగా గంటం తేనెలో ముంచి, పంచదారలో అద్ది, తాళ పత్రాలపై గీసి ఇక్కడ అందించారు. రండి గ్రోలుదాం ఈ అమృతధారలను

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

నవమ స్కంధము

ఓం శ్రీరామ

వమ స్కంధం "ఈశాను కథలు" అనే దశలక్షణాలలోని లక్షణానికి ప్రతీక అంటారు. ఈ స్కంధంలో పోతన్న గారు అద్భుతంగా ఆంధ్రీకరించారు. దీనిలో ప్రస్తుత వైవస్వత మన్వంతరంలో జరిగిన సూర్య వంశ చంద్ర వంశాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇక్కడి రామాయణం చెప్పిన తీరు ఎంతో బాగుంది. చిన్ని యన్నలారా పద్య రత్నం దీని లోనిదే. చంద్ర వంశం శ్రీ కృష్ణుని తల్లిదండ్రుల వరకు వర్ణించబడింది. చిత్తంబు మధురిపు, హరి యని, కుఱ్ఱము గొనిపో, అలవాటు కలిమి, చిన్న యన్న లారా, లాంటి పద్య రత్నాలు ఎన్నో ఉన్నాయి ఈ స్కంధంలో. రండి ఆస్వాదిద్దాం

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

దశమ స్కంధము - పూర్వ భాగము

ఓం శ్రీరామ

శమ స్కంధంలో పూర్వభాగం తెలుగుభాగవతంలో కెల్లా సుమారు 1800 పద్యాలతో మిక్కిలి పెద్దది, మధురాతి మధురమైనది. మధురాధిపతే రఖిలం మధురం అన్నట్లుగా గోపాల కృష్ణుని జన్మం, శైశవం, బాల్యం, కౌమారం, యౌవనం సహజ కవి పోతనామాత్యునిచే మధురంగా వర్ణించబడ్డాయి. ఓ యమ్మా నీ కుమారుడు, కల యో వైష్ణవ మాయ యో, భూసురు డేగెనో, వంటి అనేక పద్య రత్నాల గని, కృష్ణ లీలలు, గోపికా వృత్తాంతాలు, కాళియ మర్దనం, భ్రమర గీతాలు మున్నగు ఘట్టాలనే భక్తి శృంగారాల సమ్మిళితం ఈ స్కంధం. ఈ స్కంధాంతం లోని రుక్మిణీ కల్యాణం జగత్ప్రసిద్ధమైన మంత్ర రాజం. ఇందు లోని పద్య మాణిక్యాలలో మచ్చుకు కొన్ని :- శ్రీకంఠ చాప ఖండన, వావిం జెల్లెలు, గురు పాఠీనమ వై, చను నీకు గుడుప, తడవాడిరి, బాలురకు బాలు లేవని, ఓ యమ్మా నీ కుమారుడు, అమ్మా మన్ను దినంగ, ఱోలను కట్టుబడియు, తీపు గల కజ్జ, కర్ణాలంబిత, బాలుం డీతడు, కర్ణావతంసిత, నల్లని వాడు, భూషణములుసెవులకు, ప్రాణేశా నీ మంజుభాషలు, లగ్నం బెల్లి . . . ఈ కృష్ణ కథామృతంలో ఓలలాడదాం రండి భాగవత ప్రియులారా, సాహిత్యాభిమానులారా, భక్తవరేణ్యులారా రండి

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

దశమ స్కంధము - ఉత్తర భాగము

ఓం శ్రీరామ

శమ స్కంధంలో ఉత్తరభాగం సుమారు 1300 పద్యాల పెద్ద స్కంధం. పోతన్న గారు యౌవ్వన, ప్రౌఢ కృష్ణుని కథలు, శ్రీ కృష్ణుని సంతాన వివరాలు మున్నగునవి కమ్మగా వర్ణించారు. ఉషాప్రద్యుమ్నుల కథ, శమంతక మణి కథ, జాంబవతీ పరిణయం, నరకాసుర వధ మున్నగు కథలతో రసవంతమైనది ఈ స్కంధం. పరు జూచున్, కొమ్మా, హార కిరీట, సకలార్థ సంవేది, పర్వత ద్వంద్వంబు వంటి పద్య రత్నాలతో ఒప్పి ఉంటుంది ఈ స్కంధం. రండి ఈ శ్రీకృష్ణామృత పానంతో తరిద్దాం రండి సుజనులారా రండి

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఏకాదశ స్కంధము

ఓం శ్రీరామ

కాదశ స్కంధంలో ప్రధానంగా యదు వంశ నాశనము, శ్రీకృష్ణ నిర్యాణము, ఉద్ధవ గీత వివరించబడ్డాయి. ఒక విధంగా భాగవత కథకు ఉపసంహారంగా చెప్పవచ్చు. అద్భుతమైన వేదాంత విషయాలు అనేకం ఇవ్వబడ్డాయి. ప్రసిద్ధమైన అవధూత లక్షణాలు, 24 గురువులు మొదలైనవి వర్ణించబడ్డాయి. పరబ్రహ్మ మనంగా వంటి చక్కటి పద్యాలు ఉన్నాయి ఈ స్కంధంలో. నవ వికచ సరసిరుహ అనే సర్వలఘు సీస పద్యమునకు ఉదాహరణ పద్యంగా కూడ బహుళ ప్రసిద్ధమైనది. పరవిద్యా సంబంధి అయిన ఈ స్కంధాన్ని అద్భుతంగా బమ్మెర పోతనామాత్యుల వారి శిష్యులు బొప్పనామాత్యుల కుమారుడు గంగన వారు తెలుగు చేసి అనుగ్రహించారు.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ద్వాదశ స్కంధము

ఓం శ్రీరామ

ద్వాదశ స్కంధం తెలుగు భాగవతానికి ఉపసంహారం లాంటిది. 54 పద్యాలతో తెలుగు భాగవతంలో మిక్కిలి చిన్న స్కంధం. పోతన భాగవతంలోని ఇతర ముగ్గరు రచయితలలో, వెలిగందల నారయ మాత్రమే పోతన ప్రియ శిష్యుడను అని గర్వంగా స్కంధాంత గద్యంలో ప్రకటించారు. భవిష్యత్తు రాజుల వివరాలు, కలి యుగ వర్ణన, పరీక్షిత్తు దేహ త్యాగం, మార్కండేయ చరిత్ర, ద్వాదశ ఆదిత్యుల వివరాలు చెప్పబడ్డాయి. గజ తురగాది అనే కంద పద్యంలో భాగవత భక్తి తత్వాన్ని కూర్చిన విధం గొప్పది. ఏను మృతుండ నౌదు నని ఆణి ముత్యం లాంటి పద్యం దీనిలోనిదే. భాగవత పురాణ సారం ఇమిడ్చి బమ్మెర పోతనామాత్యుల వారి శిష్యులు గంగనార్యుల వారు తెలుగు చేసి అనుగ్రహించారు.

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఊలపల్లి సాంబశివ రావు, భాగవత గణనాధ్యాయి.
తెలుగుభాగవతం.ఆర్గ్

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం. ఓం. ఓం
ఓం శాంతి. శాంతి. శాంతిః
సర్వే జనాః సుఖినో భవంతు.
- x - - x - - x -