నవమ స్కంధము : పాండవ కౌరవుల కథ
- ఉపకరణాలు:
యయాతికొడు కనువునకు సభానరుండుఁ, జక్షువుఁ, బరోక్షుండు నను వారు మువ్వురు పుట్టి; రందు సభానరునికిఁ గాలనాథుండు, గాలనాథునకు సృంజయుండు, సృంజయనకుఁ బురంజయుండు, పురంజయునకు జనమేజయుండు, జనమేజయునకు మహాశాలుండు, మహాశాలునికి మహామనసుండు, మహామనసునకు సుశీనరుండు తితిక్షువన నిరువురు జన్మించి; రందు సుశీనరునకు శిబి వన క్రిమి దర్పు లన నలువురు జన్మించి; రందు శిబికి వృషదర్ప సువీర మద్ర కేకయులు నలువురు పుట్టిరి; తితిక్షునకు రుశద్రథుండు, రుశద్రథునకు హేముండు, హేమునకు సుతపుండు, సుతపునకు బలియుఁ, బుట్టి; రా బలివలన నంగ వంగ కళింగ సింహ పుండ్రాంధ్రులను పేర్లుగలవా రార్వురు కుమారులు పుట్టిరి; వారలు దూర్పు దేశంబులకు రాజులయి దేశంబులకుఁ దమ తమ నామ ధేయంబు లిడి, యేలిరి; సువీరునకు సత్యరథుండు సత్యరథునికి దివిరథుండు, దివిరథునికి ధర్మరథుఁడు, ధర్మరథునకుఁ జిత్రరథుండుఁ బుట్టి; రా చిత్రరథుండు రోమపాదుండు నాఁ బరఁగె.
టీకా:
యయాతి = యయాతి యొక్క; కొడుకు = పుత్రుడు; అనువున్ = అనువున; కున్ = కు; సభానరుండున్ = సభానరుడు; చక్షువున్ = చక్షువు; పరోక్షుండున్ = పరోక్షుడు; అను = అనెడి; వారు = వారు; మువ్వురు = ముగ్గురు (3); పుట్టిరి = జనించిరి; అందున్ = వారిలో; సభానరుని = సభానరుని; కాలనాథుండున్ = కాలనాథుడు; కాలనాథున్ = కాలనాథున; కున్ = కు; సృంజయుండున్ = సృంజయుడు; సృంజయున్ = సృంజయున; కున్ = కు; పురంజయుండున్ = పురంజయుడు; పురంజయున్ = పురంజయున; కున్ = కు; జనమేజయుండున్ = జనమేజయుడు; జనమేజయున్ = జనమేజయున; కున్ = కు; మహాశాలుండు = మహాశాలు; మహాశాలుని = మహాశాలుని; కిన్ = కి; మహామనసుండున్ = మహామనసుడు; మహామనసున్ = మహామనసున; కున్ = కు; సుశీనరుండున్ = సుశీనరుడు; తితిక్షువు = తితిక్షువు; అనన్ = అనెడి; ఇరువురు = ఇద్దరు (2); జన్మించిరి = పుట్టరి; అందున్ = వారిలో; సుశీనరున్ = సుశీనరున; కున్ = కు; శిబి = శిబి; వన = వనుడు; క్రిమి = క్రిమి; దర్పులు = దర్పుడు; అననన్ = అనగా; నలువురు = నలుగురు (4); జన్మించిరి = పుట్టిరి; శిబి = శిబి; కిన్ = కి; వృషదర్ప = వృషదర్పుడు; సువీర = సువీరుడు; మద్ర = మద్రుడు; కేకయులున్ = కేకయుడు; నలువురు = నలుగురు (4); పుట్టిరి = జన్మించిరి; తితిక్షువున్ = తితిక్షువున; కున్ = కు; రుశద్రథుండు = రుశద్రథుడు; రుశద్రథున్ = రుశద్రథున; కున్ = కు; హేముండున్ = హేముండును; హేమున్ = హేమున; కున్ = కు; సుతపుండున్ = సుతపుడు; సుతపున్ = సుతపున; కున్ = కు; బలియుని = బలి; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; బలి = బలి; వలనన్ = వలన; అంగ = అంగుడు; వంగ = వంగుడు; కళింగ = కళింగుడు; సింహ = సింహుడు; పుండ్ర = పుండ్రుడు; ఆంధ్రులు = ఆంధ్రుడు; అను = అనెడి; పేర్లు = నామములు; కల = కలిగిన; వారు = వారు; ఆర్వురున్ = ఆరుగురు (6); కుమారులు = పుత్రులు; పుట్టిరి = జన్మించిరి; వారలు = వారు; తూర్పు = తూర్పు దిక్కునగల; దేశంబుల్ = రాజ్యముల; కున్ = కు; రాజులు = రాజులు; అయి = ఐ; దేశంబుల్ = రాజ్యముల; కున్ = కు; తమతమ = వారివారి; నామధేయంబులు = పేర్లు; ఇడి = పెట్టి; ఏలిరి = పరిపాలించిరి; సువీరున్ = సువీరున; కున్ = కు; సత్యరథుండున్ = సత్యరథుడు; సత్యరథుని = సత్యరథున; కిన్ = కు; దివిరథుండున్ = దివిరథుడు; దివిరథుని = దివిరథుని; కిన్ = కి; ధర్మరథుండున్ = ధర్మరథుడు; ధర్మరథున్ = ధర్మరథున; కున్ = కు; చిత్రరథుండున్ = చిత్రరథుడు; పుట్టిరి = జన్మించిరి; ఆ = ఆ; చిత్రరథుండు = చిత్రరథుడు; రోమపాదుండున్ = రోమపాదుడు; నాన్ = అని; పరగె = ప్రసిద్ధుడాయెను.
భావము:
యయాతి కొడుకు అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అని ముగ్గురు పుట్టారు. వారిలో సభానరునికి కాలనాథుడు; కాలనాథునకు సృంజయుడు; సృంజయునకు పురంజయుడు; పురంజయునకు జనమేజయుడు; జనమేజయునకు మహాశాలుడు; మహాశాలునికి మహామనసుడు; మహామనసునకు సుశీనరుడు, తితిక్షువు అని ఇద్దరు పుట్టారు. వారిలో సుశీనరునకు శిబి, వనుడు, క్రిమి, దర్పుడు అని నలుగురు కలిగారు. శిబికి వృషదర్పుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అని నలుగురు జన్మించారు. తితిక్షువునకు రుశద్రథుడు; రుశద్రథునకు హేముండు; హేమునకు సుతపుడు; సుతపునకు బలి జన్మించారు. ఆ బలికి అంగుడు, వంగుడు, కళింగుడు, సింహుడు, పుండ్రుడు, ఆంధ్రుడు అని ఆరుగురు పుత్రులు పుట్టారు. వారు తూర్పు రాజ్యాలకు రాజులు అయి, ఆయా రాజ్యాలకు వారివారి పేర్లు పెట్టి పరిపాలించారు. సువీరునకు సత్యరథుడు; సత్యరథునకు దివిరథుడు; దివిరథునికి ధర్మరథుడు; ధర్మరథునకు చిత్రరథుడు పుట్టారు. ఆ చిత్రరథుడు రోమపాదుడు అని ప్రసిద్ధి పొందాడు.