నవమ స్కంధము : యయాతి శాపము
- ఉపకరణాలు:
ఇట్లు యయాతివలన శర్మిష్ఠ గర్భంబై క్రమంబున ద్రుహ్మ్యుండు, ననువుఁ, బూరువు నన మువ్వురు తనయులం గాంచె; నంత దేవ యాని తద్వృత్తాంతంబంతయు నెఱింగి, కోపించి, శుక్రుకడకుం జని క్రోధమూర్ఛిత యై యున్న సమయంబున యయాతి వెంట జని, యిట్లనియె.
టీకా:
ఇట్లు = ఇట్లు; యయాతి = యయాతి; వలన = వలన; శర్మిష్ఠ = శర్మిష్ఠ; గర్భంబు = గర్భము ధరించినామె; ఐ = అయ్యి; క్రమంబున్ = వరుసగా; ద్రుహ్యుండున్ = ద్రుహ్యుడు; అనువున్ = అనువు; పూరువున్ = పూరువు; అనన్ = అనెడి; మువ్వురు = ముగ్గురు (3); తనయులన్ = కొడుకులను; కాంచెన్ = కనెను; అంతన్ = అంతట; దేవయాని = దేవయాని; తత్ = ఆ; వృత్తాంతంబు = సంగతి; అంతయున్ = అంతా; ఎఱింగి = తెలిసి; కోపించి = కోపగించి; శుక్రున్ = శుక్రుని; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్లి; క్రోధ = కోపముతో; మూర్ఛిత = వివశురాలు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయము నందు; యయాతి = యయాతి; వెంటన్ = కూడ; చని = వెళ్లి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
ఇలా యయాతి వలన శర్మిష్ఠ వరుసగా ద్రుహ్యుడు, అనువు, పూరువు అని ముగ్గురు కొడుకులను కన్నది. అంతట దేవయాని ఆ సంగతి అంతా తెలిసి కోపగించి తండ్రికి చెబ్దామని శుక్రుని వద్దకు వెళ్లింది. కోపంతో వివశురాలు అయ్యి ఉన్న ఆమె వెంట యయాతి కూడ వెళ్లి ఈ విధంగా బతిమాలాడాడు.