పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : అంబరీషోపాఖ్యానము

  •  
  •  
  •  

9-96-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లతిథి యై వచ్చిన నమ్మునివల్లభునకుఁ బ్రత్యుత్థానంబు చేసి, కూర్చుండ గద్దియ యిడి పాదంబులు గడిగి పూజించి క్షేమం బరసి తన యింట నన్నంబు గుడువు మని నమస్కరించిన నమ్మహా త్ముండు సంతసించి భోజనంబునకు నంగీకరించి, నిర్మలంబులగు కాళిందీజలంబులం బరమధ్యానంబు చేయుచు, మునింగి లేచి రాక తడవు చేసిన, ముహుర్తార్ధావశిష్ట యగు ద్వాదశి యందుఁ బారణ చేయవలయుటఁ జింతించి బ్రాహ్మణాతిక్రమదోషంబునకు శంకించి విద్వజ్జనంబుల రావించి వారల నుద్దేశించి.

టీకా:

అట్లు = అలా; అతిథి = అతిథి; ఐ = కాగ; వచ్చినన్ = రాగా; ఆ = ఆ; ముని = మునులలో; వల్లభున్ = ప్రభువు; కున్ = కి; ప్రత్యుత్థానంబన్ = లేచి ఎదురువెళ్ళుట; చేసి = చేసి; కూర్చుండన్ = కూర్చొనుటకు; గద్దియ = ఉన్నతాసనము; ఇడి = ఇచ్చి; పాదంబులన్ = కాళ్లు; కడిగి = నీటితోశుభ్రపరచి; పూజించి = పూజచేసి; క్షేమంబున్ = కుశలప్రశ్నలు; అరసి = అడిగి; తన = తనయొక్క; ఇంటన్ = నివాసమునందు; అన్నంబున్ = భోజనము; కుడువుము = తినుము; అని = అని; నమస్కరించినన్ = ప్రార్థించగా; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; సంతసించి = సంతోషించి; భోజనంబున్ = అన్నముతినుట; కున్ = కు; అంగీకరించి = ఒప్పుకొని; నిర్మలంబు = స్వచ్ఛమైనవి; అగు = ఐన; కాళిందీ = కాళిందిమడుగు; జలంబులన్ = నీటిలో; పరమ = అధికమైన; ధ్యానంబున్ = ధ్యానము; చేయుచున్ = చేస్తూ; మునింగి = స్నానముచేయుచు; లేచిరాక = బయటకురాకుండగ; తడవు = ఆలస్యము; చేసినన్ = చేయగా; ముహుర్త = ముహుర్తకాలములో; అర్థ = సగముమాత్రమే; అవశిష్ఠ = మిగిలినది; అగు = అయినట్టి; ద్వాదశి = ద్వాదశితిథి; అందున్ = సమయములోనే; పారణ = పారణ; చేయవలయుటన్ = చేయవలసియుండుటను; చింతించి = ఆలోచించుకొని; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; అతిక్రమ = అలక్ష్యముచేసిన; దోషంబున్ = తప్పున; కున్ = కు; శంకించి = అనుమానపడి; విద్వత్ = జ్ఞానులైన; జనంబులన్ = వారిని; రావించి = పిలిపించి; వారలన్ = వారి; ఉద్దేశించి = తోటి.

భావము:

అలా అతిథిగ వచ్చిన దూర్వాస మునివరునికి ఎదురువెళ్ళి ఉన్నతాసనంపై ఆసీనుని చేసి, కాళ్లు కడిగి, పూజించాడు. కుశలప్రశ్నలు అడిగి తన ఇంట భోజనం చేయమని ప్రార్థించాడు. ఆ మహాత్ముడు సంతోషించి, అంగీకరించాడు. స్నానం చేసి వస్తాను అని, నిర్మల కాళిందీ జలంలో ధ్యాన స్నానాలు చేస్తూ ఉండగా చాలా ఆలస్యం అవుతోంది. పైగా ద్వాదశి ఘడియలు కొద్దిసేపటిలో గడచిపోతాయి. ద్వాదశితిథి ఉండగానే పారణ చేయాలి. అందుచేత, అటు పారణ చేస్తే బ్రాహ్మణ అతిక్రమణ దోషం, ఇటు పారణ చేయకపోతే ఏకాదశవ్రత భంగం ఎలాగ అని శంకించి, సలహా కోసం విద్వజ్జనులను పిలిపించి