పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

9-1-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  శ్రీరాజిత! మునిపూజిత!
వారిధి గర్వాతిరేక వారణ బాణా!
సూరిత్రాణ! మహోజ్జ్వల
సాయశస్సాంద్ర! రామచంద్ర నరేంద్రా!

టీకా:

శ్రీరాజిత = రామా {శ్రీరాజితుడు - శ్రీ (లక్ష్మీదేవి)చేత రాజితుడు (ప్రకాశించెడి వాడు), రాముడు}; మునిపూజిత = రామా {ముని పూజితుడు - మునులచే పూజింపబడువాడు, రాముడు}; వారిధి గర్వాతిరేక వారణ బాణా = రామా {వారిధి గర్వాతిరేక వారణ బాణుడు - వారిధి (సముద్రుని) గర్వాతిరేక(గర్వాతిశయమును) వారణ (వారించిన) బాణుడు (బాణముగలవాడు), రాముడు}; సూరిత్రాణ = రామా {సూరిత్రాణుడు - సూరి (పండితులను) త్రాణుడు (కాపాడెడివాడు), రాముడు}; మహోజ్జ్వలసారయశస్సాంద్ర = రామా {మహోజ్జ్వలసారయశస్సాంద్రుడు - మహా (గొప్ప) ఉజ్జ్వల (ప్రకాశవంతమైన) సార (చేవగలిగిన) యశస్ (కీర్తి) సాంద్రుడు (దట్టముగాగలవాడు), రాముడు}; రామచంద్రనరేంద్రా = రామా {రామచంద్రనరేంద్రుడు - రాముడనెడి చంద్రునివంటివాడైన నరేంద్రుడు (రాజు), రాముడు}.

భావము:

లక్ష్మిగలిగి ప్రకాశించే వాడా! మునులు పూజించు వాడా! సముద్రుడి గర్వం సర్వం పోగొట్టిన బాణం గల వాడా! పండితులను కాపాడే వాడా! బహు ప్రకాశవంతమైన గొప్పకీర్తి గల వాడా! శ్రీరామచంద్ర ప్రభూ! అవధరించు.