అష్టమ స్కంధము : పూర్ణి
- ఉపకరణాలు:
దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!
భువనభరనివారీ! పుణ్యరక్షానుసారీ!
ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషప్రవర్తీ!
ధవళబహుళకీర్తీ! ధర్మనిత్యానువర్తీ!
టీకా:
దివిజరిపువిదారీ = శ్రీరామా {దివిజరిపు విదారుడు - దివిజరిపు (రాక్షసు)లను విదారుడు (సంహరించినవాడు), శ్రీరాముడు}; దేవలోకోపకారీ = శ్రీరామా {దేవలో కోపకారుడు - దేవలోక (దేవత లందరికి) ఉపకారుడు (ఉపకారము చేయువాడు), శ్రీరాముడు}; భువనభరనివారీ = శ్రీరామా {భువనభర నివారుడు - భూభారమును నివారించెడివాడు, శ్రీరాముడు}; పుణ్యరక్షానుసారీ = శ్రీరామా {పుణ్య రక్షానుసారుడు - పుణ్యాత్ములను కాపాడెడివాడు, శ్రీరాముడు}; ప్రవిమలశుభమూర్తీ = శ్రీరామా {ప్రవిమల శుభమూర్తి - మిక్కిలి నిర్మలమైన శుభకరమైన రూపము కలవాడు, శ్రీరాముడు}; బంధుపోషప్రవర్తీ = శ్రీరామా {బంధు పోష ప్రవర్తి - ఆత్మీయులను పోషించెడి వాడు, శ్రీరాముడు}; ధవళబహుళకీర్తీ = శ్రీరామా {ధవళ బహుళకీర్తి - స్వచ్ఛమైన గొప్ప కీర్తి కలవాడు, శ్రీరాముడు}; ధర్మనిత్యానువర్తీ = శ్రీరామా {ధర్మ నిత్యానువర్తి - ధర్మమును ఎల్లప్పుడు ఆచరించు వాడు, శ్రీరాముడు}.
భావము:
దేవతల శత్రువులు అయిన రాక్షసులను తెగటార్చినవాడా! దేవతలకు మేలుచేసినవాడా! భూభారమును నివారించినవాడా! పుణ్యాత్ములను రక్షించేవాడా! నిర్మలమైన శుభకరమైన రూపంకలవాడా! ఆత్మీయులను పోషించేవాడా! స్వచ్ఛమైన గొప్పకీర్తి కలవాడా! ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆదరించేవాడా! శ్రీరామా!