అష్టమ స్కంధము : త్రికూట మందలి గజములు
- ఉపకరణాలు:
అన్యాలోకన భీకరంబులు, జితాశానేకపానీకముల్,
వన్యేభంబులు కొన్ని మత్తతనులై, వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరి భూధరదరీ ద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాలిపడి కాసారావగాహార్థమై.
టీకా:
అన్య = ఇతరులకు; ఆలోకన = చూచుటకు; భీకరంబులు = భయముగొల్పునవి; జిత = జయింపబడిన; ఆశా = దిక్కులు గల; అనేకప = ఏనుగుల; అనీకముల్ = గుంపు లందలి; వన్య = అడవి; ఇభంబులు = ఏనుగులు; కొన్ని = కొన్ని; మత్త = మదించిన; తనులు = శరీరములు గలవి; ఐ = అయ్యి; వ్రజ్యా = మందలో; విహార = విహరించుటచే; ఆగత = వచ్చిన; ఉదన్యత్వంబునన్ = దప్పికతో; భూరి = మహాగొప్ప; భూధర = పర్వతముల; దరీ = గుహా; ద్వారంబుల = ద్వారములలో; ఉండి = ఉండి; సౌజన్యక్రీడలన్ = సయ్యాటలలో; నీరుగాలి = నీటిగాలికి; పడి = వశములై; కాసార = చెరువులో; అవగాహ = మునుగుటల; అర్థమై = కోసమై.
భావము:
ఆ అడవిలోని ఏనుగులు ఇతరులు కన్నెత్తి చూడలేనంత భయంకరమైనవి. అవి మదించిన తమ శరీరాలతో దిగ్గజాలను సైతం మించినవి. వాటిలో కొన్ని కొండగుహల నుండి బయలు దేరాయి. చెర్లాటాలు ఆడుతు దప్పి గొన్నాయి. జల క్రీడల కోసం సరస్సులవైపు నీటిగాలి వాలు పట్టి నడిచాయి.
రహస్యార్థం -అభయం అయిన సమాధిలో యోగులు (ద్వైతులు) భయం కల్పించుకొని దుర్ణిరీక్షణం అని చెప్పదగ్గ కూటస్థాది చైతన్య రూప ఏనుగులు. మూలాధారాది గుహల నుండి బయలుదేరి పరాగ్దృష్టులకు భయంకరములై దిగ్దేవతలగు ఇంద్రాదులను జయించునవై సంచరిస్తున్నాయి. కర్మాది, అభాస సుఖాలైన విలాసేచ్ఛలచే క్షుత్పిపాసాది షడూర్ముల స్థానమగు మనస్సు అను కాసారం (సరస్సు) కోసం బయలు దేరాయి. (ఆకలి దప్పులు, శోక మోహములు, జరామరణములు షడూర్ములు)
- ఉపకరణాలు:
అంధకార మెల్ల నద్రిగుహాంతర
వీథులందుఁ బగలు వెఱచి డాఁగి
యెడరు వేచి, సంధ్య నినుఁడు వృద్ధత నున్న
వెడలె ననఁగ గుహలు వెడలెఁ గరులు.
టీకా:
అంధకారము = చీకట్లు; ఎల్లన్ = అన్నియు; అద్రి = కొండ; గుహా = గుహల; అంతర = అందలి; వీథుల్ = వరుసల; అందున్ = లో; పగలు = పగటిపూట; వెఱచి = భయపడి; డాగి = దాక్కొని; ఎడరు = సమయమునకై; వేచి = ఎదురుచూసి; సంధ్యన్ = సాయంకాల సంధ్యకి; ఇనుడు = సూర్యుడు; వృద్ధతన్ = సన్నగిలి; ఉన్నన్ = ఉండగా; వెడలెన్ = బయటపడినవి; అనగన్ = అన్నట్లుగ; గుహలు = గుహలనుండి; వెడలెన్ = బయలుదేరినవి; కరులు = ఏనుగులు.
భావము:
చీకట్ల గుంపులు పగలంతా భయంతో కొండగుహలలో దాక్కొని సాయంకాలం సూర్యుడి శక్తి సన్నగిల్లటం కనిపెట్టి బయటకొచ్చాయా అన్నట్లు ఆ త్రికూటపర్వతం నుండి బయలుదేరిన ఏనుగులు ఉన్నాయి.
రహస్యార్థం- బ్రహ్మజ్ఞానం ప్రకాశించే సమయంలో (పగలు) కనబడని చీకటి అనే అవిద్య కొండ గుహలు అను హృదయ కుహరాలలో దాగి ఉండి, జీవుని వృత్తి బహిర్ముఖమైనప్పుడు ఆవరించినట్లు అజ్ఞానవృత్తులు బయలుదేరాయి.
అందమైన ఉపమాలంకార వైభవం చూడండి. సాయంకాలం సూర్యుడు అస్తమిస్తుంటే అప్పటిదాకా గుహలలో ఉన్న చీకట్లు బైటికి వస్తాయి కదా. గజేంద్రుడు, అతని కోటి ఏనుగులు వెళ్తుంటే అలా ఉందట.
- ఉపకరణాలు:
తలఁగవు కొండలకైనను;
మలఁగవు సింగములకైన మార్కొను కడిమిం;
గలఁగవు పిడుగుల కైనను
నిల బలసంపన్న వృత్తి నేనుఁగు గున్నల్.
టీకా:
తలగవు = తొలగిపోవు; కొండల్ = కొండల; కైనన్ = కి యయినను; మలగవు = తప్పుకొనవు; సింగముల్ = సింహముల; కైనన్ = కి యయినను; మార్కొనున్ = ఎదిరించుచుండును; కడిమిన్ = శౌర్యముతో; కలగవు = కలతచెందవు; పిడుగుల్ = పిడుగుల; కైనను = కి యయినను; ఇలన్ = భూమిపైన; బల = శక్తి; సంపన్న = సమృద్ధిగా నుండుటచే; వృత్తిన్ = వర్తించుటల యందు; ఏనుగుగున్నల్ = గున్న యేనుగులు.
భావము:
ఆ గుంపులోని గున్న ఏనుగులు భూలోకంలో మిక్కిలి బల సంపదతో కొండలను ఢీకొనుటకైన వెనుదీయవు. సింహాలకైన వెనుదీయకుండ ఎదిరించి నిలబడతాయి. చివరకి పిడుగులకు కూడ బెదరవు.
రహస్యార్థం -కొండలంత కష్టాలు వచ్చినా, ధైర్యం విడనాడకుండా, కామాదులను జయించుటకు సింగము వంటి పట్టుదల కలవై ఎదుర్కుంటాయి. పిడుగుల వంటి ఆపదలు మీద పడినా తట్టుకుంటాయి కాని చలించవు. అంతటి అవిద్యావృత పారమార్దిక జీవులు అవి.
- ఉపకరణాలు:
పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁ దూఱు-
ఘోరభల్లూకముల్ గుహలు సొచ్చు;
భూదారములు నేల బొఱియలలో డాఁగు-
హరిదంతముల కేఁగు హరిణచయము;
మడువులఁ జొరఁబాఱు మహిషసంఘంబులు-
గండశైలంబులఁ గపులు ప్రాఁకు;
వల్మీకములు జొచ్చు వనభుజంగంబులు-
నీలకంఠంబులు నింగి కెగయు;
- ఉపకరణాలు:
వెఱచి చమరీమృగంబులు విసరు వాల
చామరంబుల విహరణశ్రమము వాయ,
భయదపరిహేల విహరించు భద్రకరుల
గాలివాఱిన మాత్రాన జాలిఁ బొంది.
టీకా:
పులుల = పులుల యొక్క; మొత్తంబులు = గుంపులు; పొదరిండ్ల = పొదరిళ్ళ; లోన్ = లోనికి; దూఱున్ = దూరిపోతాయి; ఘోర = భయంకరమైన; భల్లూకముల్ = ఎలుగుబంట్లు; గుహలున్ = గుహలలోనికి; చొచ్చున్ = దూరిపోతాయి; భూదారములు = అడవి పందులు; నేల = నేలమీద నున్న; బొఱియల్ = గోతుల; లోన్ = లోపల; డాగున్ = దాక్కొనును; హరిత్ = దిక్కుల; అంతముల్ = కొనల; కిన్ = కు; ఏగున్ = పారిపోవును; హరిణ = లేళ్ళ; చయమున్ = సమూహములు; మడుపులన్ = చెరువులలో; చొరబాఱు = దూరిపోతాయి; మహిష = అడవిదున్నల; సంఘంబులున్ = గుంపులు; గండశైలంబులన్ = పెద్దరాళ్ల కొండలపైకి; కపులు = కోతులు; ప్రాకున్ = పాకుతూ పోతాయి; వల్మీకములున్ = పుట్టలలో; చొచ్చున్ = దూరిపోతాయి; వన = అడవి; భుజంగంబులున్ = పాములు; నీలకంఠంబులున్ = నెమళ్ళు; నింగి = ఆకాశమున; కిన్ = కు; ఎగయు = ఎగురుతాయి.
వెఱచి = భయపడిపోయి; చమరీమృగంబులున్ = చమరీమృగములు; విసరున్ = విసురుతాయి; వాల = తోక లనెడి; చామరంబులన్ = విసనకఱ్ఱలను; విహరణశ్రమమున్ = అలసటలు; వాయన్ = తీరునట్లు; భయద = భయావహముగ; విహరించు = తిరిగెడి; భద్రకరుల = భద్రగజముల యొక్క; గాలి = గాలి; వాఱిన = సోకినంత; మాత్రనన్ = మాత్రముచేతనే; జాలిన్ = భీతి; పొంది = చెంది.
భావము:
ఆ మదపుటేనుగులు భయంకరంగా విహరిస్తున్నాయి. వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి, పులులన్నీ పొదలలో, భీకరమైన ఎలుగుబంట్లు గుహలలో దూరతాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటాయి. జింకలు దిక్కులు పట్టి పోతాయి. అడవిదున్నలు మడుగుల్లో చొరబడతాయి. కోతులుకొండరాళ్ళపైకి ఎగబాకుతాయి. అడవిలోని పాములు పుట్టలలో దూరతాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగురుతాయి. సవరపు మెకాలు తమ తోకకుచ్చుల చామరాలతో ఏనుగుల శ్రమ తీరేలా విసురుతాయి.
రహస్యార్థం -బాహ్యంగా భయంకరంగా విహరించే ఏనుగులను చూసి ఇతర జంతువులు బెదురుతున్నాయి అనే చక్కటి స్వభావాలంకారం అలరిస్తుంది. కాని ఆయా జంతువుల రహస్య సంజ్ఞా భావం తీసుకుంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష్య మున్నగునవి వాటి అధిదేవతల యందు అణగి ఉన్నాయని భావం.
- ఉపకరణాలు:
మదగజ దానామోదముఁ
గదలని తమకములఁ ద్రావి, కడుపులు నిండం
బొదలుచుఁ దుమ్మెదకొదమల
కదుపులు జుం జుమ్మటంచు గానము సేసెన్.
టీకా:
మద = మదించిన; గజ = ఏనుగుల; దాన = కపోలమదజలము; ఆమోదమున్ = పరిమళమువలన; కదలని = స్థిరమైన; తమకములన్ = మోహములతో; త్రావి = తాగి; కడుపులు = కడుపులు; నిండన్ = నిండగా; పొదలుచున్ = పొంగిపోతూ; తుమ్మెద = తుమ్మెదల; కొదమల = పడుచుల; కదుపులు = గుంపులు; జుంజుమ్ము = జుంజుం; అటన్ = అని; అంచున్ = అనుచు; గానము = పాటలు; చేసెన్ = పాడినవి.
భావము:
పడుచు తుమ్మెదల గుంపులు ఆ మదపుటేనుగుల సుగంధాల మదజల ధారలు కమ్మగా కడుపులనిండా తాగి సంతోషంతో జుం జుమ్మని పాడుతున్నాయి.
- ఉపకరణాలు:
తేటి యొకటి యొరు ప్రియకును
మాటికి మాటికిని నాగ మదజల గంధం
బేటి కని, తన్నుఁ బొందెడి
బోటికి నందిచ్చు నిండు బోఁటు దనమునన్.
టీకా:
తేటి = గండు తుమ్మెద; ఒకటి = ఒకటి; ఒరు = ఒక; ప్రియ = ప్రియురాలి; కును = కి; మాటికిమాటికిని = అస్తమాను; నాగ = ఏనుగుల; మదజల = మదజలస్రావముల; గంధంబు = పరిమళములు; ఏటికి = ఎందుకులే; అని = అని; తన్నున్ = తనను; పొందెడి = కూడుతున్న; బోటి = ఆడుదాని; కిన్ = కి; అందిచ్చున్ = అందించును; నిండు = పరిపూర్ణమైన; బోటుదనమునన్ = మగతనముతో.
భావము:
గండుతుమ్మెద ఒకటి తనతో క్రీడిస్తున్న ప్రియురాలైన ఒక ఆడతుమ్మెదకి అస్తమానం ఆ ఏనుగుల మదజలం ఎందుకులే అని నిండుమగతనం అందించింది.
రహస్యార్థం -మనస్సు సమాధి స్థితిలో ఉన్న ఆనందమును మరిగి, జగదాకార వృత్తులను వదలి, సంప్రజ్ఞతా సమాధి యందలి ఆనందమును పొందింది.
- ఉపకరణాలు:
అంగీకృత రంగ న్మా
తంగీ మదగంధ మగుచు దద్దయు వేడ్కన్
సంగీత విశేషంబుల
భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్కిన్.
టీకా:
అంగీకృత = ఆమోదించబడిన; రంగత్ = ప్రకాశించుచున్న; మాతంగి = ఆడు ఏనుగుల; మదగంధము = మదజలము పొందినవి; అగుచున్ = అగుచు; దద్దయు = మిక్కిలి; వేడ్కన్ = ఉత్సాహముతో; సంగీత = పాటల; విశేషంబులన్ = ప్రత్యేకతలతో; భృంగీ = ఆడుతుమ్మెదల; గణము = గుంపులు; ఒప్పెన్ = చక్కగ నున్నవి; మ్రానుపెట్టెడి = కదలనివ్వని; మాడ్కిన్ = విధముగ.
భావము:
తుమ్మెద కదుపులు ఇంపైన మదగజాల మదజలగంధా లెంతో వేడుకతో ఆస్వాదిస్తూ చెవులు గింగిర్లెత్తేలా ఝంకారం చేస్తున్నాయి.
రహస్యార్థం -“తృష్ణా హృత్పద్మషట్పదీ” (హృదయ పద్మంలో ఉండే తుమ్మెద అంటే తృష్ణ). అలా హృదయ పద్మంలో ఉండే సంకల్పాలు అను తుమ్మెదల గుంపు, మాతంగీ అంటే పరాప్రకృతి సంబంధ నిర్వికల్పానందంచే, నిశ్చేష్టముగా ప్రణవనాదం చేశాయి.
- ఉపకరణాలు:
వల్లభలు పాఱి మునుపడ
వల్లభ మని ముసరి రేని వారణదానం
బొల్లక మధుకరవల్లభు
లుల్లంబులఁ బొందిరెల్ల యుల్లాసంబుల్.
టీకా:
వల్లభలు = ఆడు తుమ్మెదలు; పాఱి = ఆత్రముగ పోయి; మునుపడన్ = ముందుగా; వల్లభము = ప్రియమైనది; అని = అని; ముసరి = మూగినట్లు; ఏనిన్ = అయినను; వారణ = ఏనుగుల; దానంబున్ = మదజలములను; ఒల్లక = ఆమోదించక; మధుకరవల్లభుల్ = గండు తుమ్మెదలు; ఉల్లంబులన్ = మనసులలో; పొందిరి = పొందినవి; ఎల్ల = అధికమైన; ఉల్లాసంబువ్ = ఉత్సాహములను.
భావము:
ఆడతుమ్మెదలు ఆత్రంగా పోయి ప్రియులని ముసురు కొన్నాయి. మగ తుమ్మెదలు ఏనుగుల మదజల ధారలకు ఆశపడకుండా నిండుగా తమ మనసులలో సంతోషపడ్డాయి.
రహస్యార్థం: జీవులు, అవిద్యా ఉపాధులతో కూడి పృథక్కుగా ఉండే గజగంధము అను విషానందమును గైకొనక, సహజ ఆనందమును, తాదాత్మ్య ఆనందమును ఆస్వాదిస్తున్నాయి.
- ఉపకరణాలు:
అప్పుడు.
టీకా:
అప్పుడు = ఆ సమయములో.
భావము:
ఆ సమయంలో,
- ఉపకరణాలు:
కలభంబుల్ చెరలాడుఁ బల్వలము లాఘ్రాణించి మట్టాడుచున్
ఫలభూజంబులు రాయుచుం జివురు జొంపంబుల్ వడిన్ మేయుచుం
బులులం గాఱెనుపోతులన్ మృగములం బోనీక శిక్షించుచుం
గొలఁకుల్ జొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్భిళ్ళు గోరాడుచున్.
టీకా:
కలభంబుల్ = ఏనుగు గున్నలు {కలభములలో విశేషములు - 1బాలము 2పోతము 3విక్కము}; చెరలాడున్ = విహరించును; పల్వలముల్ = నీళ్లు గల చిన్నపల్లము; ఆఘ్రాణించి = వాసనచూసి; మట్టాడుచున్ = తొక్కుతూ; ఫలభూజంబులున్ = పండ్లచెట్లను; రాయుచున్ = ఒరసికొనుచు; చివురు = చిగుళ్ళ; జొంపంబుల్ = గుత్తులను; వడిన్ = వేగముగా; మేయుచున్ = తింటూ; పులులన్ = పులులను; కాఱెనుబోతులన్ = అడవిదున్నలను; మృగములన్ = లేళ్ళను; పోనీక = తప్పించుకొనిపోనీకుండ; శిక్షించుచున్ = దండించుచు; కొలకుల్ = నీటిమడుగు లందు; చొచ్చి = దిగి; కలంచుచున్ = కలచువేస్తూ; గిరుల్ = కొండల; పైన్ = మీద; గొబ్బిళ్ళుగోరాడుచున్ = కుప్పిగంతులు వేయుచు {గొబ్బిళ్ళుగోరాడు - గొబ్బిళ్ళు (బాలక్రీడావిశేషము) వలె గోరాడు (ఎగురుకుంటు ఆడు)}.
భావము:
గున్నేనుగులు చెర్లాటలాడుతున్నాయి. పచ్చిక బయళ్ళని వాసన చూసి తొక్కుతున్నాయి. పళ్ళచెట్లని రాసుకు పోతూ చిగుళ్ళు గబగబ మేసేస్తున్నాయి. పులుల్ని, అడవి దున్నలని, జింకల్ని తప్పించుకు పోనీయక నిలిపి శిక్షిస్తున్నాయి. మడుగుల్లో దిగి కలచేస్తున్నాయి. కొండలమీద వినోదంగా విహరిస్తున్నాయి.
రహస్యార్థం -జీవులు జీవన్ముక్తి విహారాలతో ఆనందిస్తూ, మధ్య మధ్య జలభ్రాంతితో ఎండమావులను జలం అని మోసపోతూ, వివేకంతో సంసార పాదపాలను నిర్లక్షిస్తూ, విషయాది అను చివుళ్ళు భక్షిస్తూ, కామాది క్రూరమృగాల ఉద్రేకాలను అణచేస్తున్నారు.
- ఉపకరణాలు:
తొండంబుల మదజలవృత
గండంబులఁ గుంభములను ఘట్టన చేయం
గొండలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్.
టీకా:
తొండంబులన్ = తొండలములతో; మదజల = మదజలముతో; వృత = నిండిన; గండంబులన్ = చెక్కిళ్ళతో; కుంభములను = కుంభస్థలములతో; ఘట్టనన్ = ఢీకొట్టుట; చేయన్ = చేసినచో; కొండలు = కొండలు; తలక్రింద = కిందుమీద; ఐ = అయ్యి; పడున్ = పడిపోవును; బెండుపడున్ = బ్రద్ద లగును; దిశలున్ = దిక్కులు; చూచి = చూసి; బెగడున్ = భయపడును; జగముల్ = లోకములు.
భావము:
తొండాలతో మదజలం నిండిన చెక్కిళ్ళతో కుంభ స్థలాలతో ఆ మదగజాలు ఢీకొంటుంటే కొండలు తలకిందు లౌతాయి, దిక్కులు బద్దలు అవుతాయి, లోకాలు భయపడి పోతాయి. (ఎంత చక్కటి అతిశయోక్తి అలంకారం!)
రహస్యార్థం -జీవుడు అహంభావంతో ఇంద్రియ వ్యాపారాలకు ఆజ్ఞలను ఇచ్చేస్థానం ఆజ్ఞా చక్రం.గండస్థలం అను ఆజ్ఞా చక్రం. అందుండే మదజలం, మదించిన జలం అంటే పట్టుదల. అదే కర్తృత్వకాది అహంభావం. తొండం అంటే ఉచ్వాసం అంటే ప్రాణాయామం. అలా ప్రాణాయామంతో అహంభావాన్ని ఘట్టన అంటే నిరోధం చేస్తుంటే, జగము అంటే శరీరం, గగుర్పాటు పొందింది.