పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట

  •  
  •  
  •  

8-686-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దేవేంద్రుండు వామన భుజపాలితం బగు త్రిభువనసామ్రాజ్య విభవంబు మరల నంగీకరించె; నప్పుడు బ్రహ్మయు, శర్వుండునుఁ, గుమారుండును, భృగు ప్రముఖులయిన మునులునుఁ, బితృదేవతలును, దక్షాది ప్రజాపతులును, సిద్ధులును, వైమానికులును మఱియుం దక్కిన వారలును బరమాద్భుతంబైన విష్ణుని సుమహాకర్మంబులకు నాశ్చర్యంబు నొందుచుఁ, బ్రశంసించుచు, నాడుచుం, బాడుచు, తమతమ నివాసంబులకుం జని;" రని చెప్పి శుకుం డి ట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దేవేంద్రుండు = దేవేంద్రుడు; వామన = వామనునిచే; భుజపాలితంబు = సంపాదించబడినది; అగు = అయిన; త్రిభువన = ముల్లోకముల; సామ్రాజ్య = సామ్రాజ్యముయొక్క; విభవంబున్ = వైభవమును; మరలన్ = మళ్ళీ; అంగీకరించెన్ = స్వీకరించెను; అప్పుడు = అప్పుడు; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; శర్వుండును = శంకరుడు; కుమారుండును = కుమారస్వామి; భృగు = భృగువు; ప్రముఖులు = ముఖ్యమైనవారు; అయిన = ఐన; మునులు = ఋషులు; పితృదేవతలును = పితృదేవతలు; దక్ష = దక్షుడు; ఆది = మున్నగు; ప్రజాపతులును = ప్రజాపతులు; సిద్ధులును = సిద్ధులు; వైమానికులును = దేవతలు {వైమానికులు – విమానమున చరించువారు, దేవతలు}; మఱియున్ = ఇంకను; తక్కిన = మిగిలిన; వారలునున్ = వారు; పరమ = అత్యంత; అద్భుతంబు = అచ్చెరువుగొల్పెడిది; ఐన = అయిన; విష్ణుని = నారాయణుని; సు = మంచి; మహా = గొప్ప; కర్మంబుల్ = పనుల; కున్ = కి; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒందుచున్ = పొందుతు; ప్రశసించుచు = కీర్తించుచు; ఆడుచున్ = ఆడుతూ; పాడుచున్ = పాడుతూ; తమతమ = వారివారి; నివాసంబుల్ = స్వస్థానముల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

అలా వామనుడు సంపాదించి ఇచ్చిన మూడులోకాల సామ్రాజ్య సంపదనూ దేవేంద్రుడు తిరిగి పొందాడు. అటుపిమ్మట బ్రహ్మదేవుడూ, శివుడూ, కుమారస్వామి, భృగువూ మొదలైన మునులూ, పితృదేవతలూ, దక్షుడూ మొదలైన ప్రజాపతులూ, సిద్ధులూ, దేవతలూ ఇంకా తక్కినవారు అందరూ విష్ణుదేవుని లీలావిలాసాలకు ముచ్చట పడుతూ పొగుడుతూ ఆటపాటలతో తమతమ నివాసాలకు వెళ్ళిపోయారు.” అనిచెప్పి శుకుడు ఇలా అన్నాడు.