అష్టమ స్కంధము : బలియఙ్ఞమును విస్తరించుట
- ఉపకరణాలు:
కమలజుఁడు లోకపాలురు
నమరేంద్రునిఁగూడి దేవయానంబున న
య్యమరావతికిని వామను
నమరం గొనిపోయి రంత నట మీఁద నృపా!
టీకా:
కమలజుడు = బ్రహ్మదేవుడు {కమలజుడు - కమలమున పుట్టినవాడు, బ్రహ్మ}; లోకపాలురున్ = లోకపాలకులును; అమరేంద్రుని = దేవేంద్రునితో; కూడి = కలిసి; దేవయానంబునన్ = ఆకాశగమనమున; ఆ = ఆ; అమరావతి = అమరావతి; కిని = కి; వామనున్ = వామనుని; అమరన్ = ఆదరముతో; కొనిపోయిరి = తీసుకుని వెళ్ళిరి; అంతనటమీద = అటుతరువాత; నృపా = రాజా {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}.
భావము:
పరీక్షన్మహారాజా! అటుపిమ్మట బ్రహ్మదేవుడూ దిక్పాలకులూ దేవేంద్రుడితో కలిసి ఎంతో ఆదరంతో వామనుణ్ణి విమానంపై కూర్చోపెట్టుకుని అమరావతికి తీసుకుని వెళ్లారు.