పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : త్రివిక్రమ స్ఫురణంబు

  •  
  •  
  •  

8-622-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

టీకా:

ఇంతింతై = ఇంత ఇంత చొప్పున పెరుగుతూ; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరింత పెరిగిన వాడు; ఐ = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొంత పెరిగినవాడు; ఐ = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; ఐ = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవతలంత; ఐ = అయ్యి; ప్రభారాశి = వెలుగులరాశి, పాలపుంత; పైన్ = కంటెఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; ఐ = అయ్యి; ధ్రువుని = ధ్రువుడికంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకముకంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకముకంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివరవరకు; సంవర్ధి = నిండాపెరిగినవాడు; ఐ = అయ్యి.

భావము:

బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే
ఇంత పొట్టి బ్రహ్మచారీ, ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.
*గమనిక : ఈ క్రమము ఎక్కడనుండి వచ్చెనో చూద్దము. మరుత్తః వాతస్కంధః ఆకాశస్య భాగవిశేషః (యత్ర వాయుర్వహతి). 1. భూమి నుండీ మేఘాల వరకూ తిరిగే వాయువు - "ఆవహము". 2. మేఘాలనుండీ సూర్యుని వరకూ - "ప్రవహము". 3. సూర్యుని నుండీ చంద్రుని వరకూ - "సంవహము". 4. చంద్రుడు నుంచీ నక్షత్రాల వరకు - "ఉద్వహము". 5. నక్షత్రాల నుండీ గ్రహ మండలం వరకూ - "వివహము". 6. గ్రహ మండలం నుండీ సప్తర్షుల వరకూ - "పరి వహము". 7. సప్తర్షి మందలం నుంచీ ధ్రువ మండలం వరకు - "పరావహము". అను పేర్లు గల సప్త మరుత్తులు. వీటిని "వాతస్కంధములు" అంటారు. ఈ క్రమముననే ఈ 8-622-శా. ఇంతింతై, వటుఁడింతయై పద్యమున పోతనామాత్యుల పేర్కొనిరి.