అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట
- ఉపకరణాలు:
అమరారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభః కణశ్రేణికిం
గమలాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌకస్స్వామిజిన్మస్తముం
గమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్
విమలశ్రీ కుచశాత చూచుక తటీవిన్యస్తమున్ హస్తమున్.
టీకా:
అమరారాతి = బలిచక్రవర్తి {అమర + అరాతి (సవర్ణదీర్ఘ సంధి) - దేవతల శత్రువు (బలి)}; కరా = చేతిలోని; అక్షత = క్షయము లేకుండా (ఆటంకము లేకుండా); ఉజ్జిత = విడువబడిన; పవిత్ర = పవిత్రమైన; అంభః = నీటి; కణ = బిందువుల; శ్రేణి = వరుస; కిన్ = కు; కమలాధీశుడు = విష్ణువు {కమలాధీశుడు - కమలా (లక్ష్మీదేవి) అధీశుడు (భర్త), విష్ణువు}; ఒడ్డె = పట్టెను; ఖండిత = తెగగొట్టబడిన; దివౌకస్స్వామి = ఇంద్రుని {దివౌకః+స్వామి - దివౌకః (స్వర్గవాసుల) స్వామి (ప్రభువు), ఇంద్రుడు}; జిత్ = జయించువాని; మస్తమున్ = తల కలదానిని; కమల = లక్ష్మీదేవిని; ఆకర్షణ = ఆకర్షించుటలో; సుప్రశస్తమున్ = మిక్కిలి ప్రసిద్ధమైనదానిని; రమాకాంత = లక్ష్మీదేవి; కచ = శిరోజములకు; ఉపాస్తమున్ = ఉపాస్తి (సేవ) చేయుదానిని; విమల = నిర్మలమైన; శ్రీ = లక్ష్మీదేవి; కుచ = స్తనముల; చూచుక = అగ్రముల; తటీ = ప్రదేశమున; విన్యస్తమున్ = కదలెడి దానిని; హస్తమున్ = చేతిని.
భావము:
ఆటంకం లేకుండా దైవవిద్వేషి బలిచక్రవర్తి చేతిలోనుండి నిరాటంకంగా పవిత్రమైన జలం ధారపోసాడు. పవిత్రమైన ఆ నీటిబిందువులకు ఆ లక్ష్మీపతి వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి ఎలాంటిది అంటే. రాక్షసుల శిరస్సులు ఖండించునది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది. లక్ష్మీదేవి శిరోజాలను సేవించునది. నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది.