పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట

  •  
  •  
  •  

8-609-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నీరధారఁ బడఁగ నీక యడ్డంబుగాఁ
గలశరంధ్ర మాఁపగాను దెలిసి
హరియుఁ గావ్యు నేత్ర మటఁ గుశాగ్రంబున
నడువ నేకనేత్రుఁ డయ్యె నతఁడు.

టీకా:

నీరన్ = నీటిని; ధారన్ = ధారగా; పడనీక = పడనీయకుండ; అడ్డంబుగాన్ = అడ్డముగా; కలశ = కలశముయొక్క; రంధ్రమున్ = కన్నమును; ఆపగాను = ఆపివేయగా; తెలిసి = తెలిసికొని; హరియున్ = విష్ణువు; కావ్యు = శుక్రాచార్యుని {కావ్యుడు - కవియొక్కపుత్రుడు, శుక్రుడు}; నేత్రమున్ = కంటిని; అటన్ = అక్కడ; కుశ = దర్భ; అగ్రమునన్ = కొనతో; నడువన్ = పొడువగా; ఏకనేత్రుడు = ఒంటికన్నువాడు; అయ్యెన్ = అయ్యెను; అతడు = అతను.

భావము:

నీళ్ళధార పడకుండా శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడి ఆపేసాడు. సాక్షాత్తు విష్ణువు అయిన వామనుడు ఆ సంగతి తెలుసుకుని దర్భకొనతో పొడిచాడు. దానివలన శుక్రుడు ఒంటి కన్ను వాడు అయ్యాడు.