అష్టమ స్కంధము : వామనునికి దాన మిచ్చుట
- ఉపకరణాలు:
సురలోక సముద్ధరణము
నిరతశ్రీకరణ మఖిల నిగమాంతాలం
కరణము భవసంహరణము
హరిచరణము నీఁటఁ గడిగె నసురోత్తముడున్.
టీకా:
సురలోక = దేవతలు అందఱిని; సముద్ధరణమున్ = చక్కగా కాపాడెడిది; నిరత = కలకాలము; శ్రీకరణ = మేలుకలిగించెడిది; అఖిల = సర్వ; నిగమాంత = వేదాంతములకు; అలంకరణమున్ = అలంకారమైనది; భవ = పునర్జన్మప్రాప్తి; హరణమున్ = పోగొట్టునది; హరి = విష్ణునియొక్క; చరణమున్ = పాదమును; నీటన్ = నీటితో; కడిగెన్ = శుభ్రపరచెను; అసుర = రాక్షసులలో; ఉత్తముడున్ = శ్రేష్ఠుడు.
భావము:
దేవతలను కష్టాలనుండి కాపాడేది, కలకాలమూ మేలుకలిగించేది, సమస్త ఉపనిషత్తులకూ అలంకారం అయినది, భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చెడిది, అయిన వామనావతారుడు విష్ణువు యొక్క కుడిపాదమును బలిచక్రవర్తి నీటితో కడిగాడు.