అష్టమ స్కంధము : వామనుని భిక్షాగమనము
- ఉపకరణాలు:
హరిహరి; సిరి యురమునఁ గల
హరి హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్.
టీకా:
హరిహరి = అయ్యయ్యో; సిరి = లక్ష్మీదేవి; ఉరమునన్ = వక్షస్థలమున; కల = కలిగిన; హరి = విష్ణుమూర్తి; హరిహయు = ఇంద్రుని; కొఱకున్ = కోసము; దనుజున్ = రాక్షసుని; అడుగన్ = అడుగుటకు; చనియెన్ = బయలుదేరెను; పర = ఇతరులకు; హిత = మేలుచేయుటయందు; రత = ప్రీతికల; మతి = బుద్ధి; యుతుల = కలవారు; అగు = అయిన; దొరల్ = దొడ్డబుద్ధిగలవారల; కున్ = కు; అడుగుటయున్ = యాచించుటకూడ; ఒడలి = దేహ; తొడవు = అలంకారము; అగున్ = అయి ఉండును; పుడమిన్ = లోకమునందు.
భావము:
ఔరా! రొమ్మున లక్ష్మీదేవి కలిగిన మహా సంపన్నుడు విష్ణుమూర్తి. అయినా, అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలుచేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో.
ఈ పద్యంలోని అలంకార వైభవం ఎంతబాగుందో. (1) హరిహరి – అయ్యో, ఔరా వంటి పదం, (2) హరి అంటే విష్ణువు, (3) హరిహయుడు అంటే ఇంద్రుడు.