అష్టమ స్కంధము : వామనుని విప్రుల సంభాషణ
- ఉపకరణాలు:
"కలరున్ దాతలు; నిత్తురున్ ధనములుం; గామ్యార్థముల్ గొంచు వి
ప్రులు నేతెంతురు; గాని యీవిని బలిం బోలన్ వదాన్యుండు లేఁ
డలఘుండై యొనరించె నధ్వరశతం బా భార్గవానుజ్ఞచే;
బలి వేఁడం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామనా! "
టీకా:
కలరున్ = ఉన్నారు; దాతలున్ = దాతలు; ఇత్తురున్ = ఇచ్చెదరు; ధనములున్ = సంపదలను; కామ్య = కోరిన; అర్థముల్ = సంపదలను; కొంచున్ = తీసుకొనుచు; విప్రులు = బ్రాహ్మణులు; ఏతెంతురు = వస్తుంటారు; కాని = కాని; ఈవిని = దానమిచ్చుగుణమున; బలిన్ = బలిచక్రవర్తితో; పోలన్ = సరిపోలగల; వదాన్యుండు = దాత; లేడు = లేడు; అలఘుండు = గొప్పవాడు; ఐ = అయ్యి; ఒనరించెన్ = చేసెను; అధ్వర = యాగములు; శతంబున్ = నూరింటిని (100); ఆ = ఆ; భార్గవ = శుక్రాచార్యుని {భార్గవుడు - భర్గుని వంశము వాడు, శుక్రుడు}; అనుజ్ఞ = అనుమతి; చేన్ = తో; బలిన్ = బలిని; వేడన్ = యాచించినచో; పడయంగవచ్చున్ = పొందవచ్చును; బహు = అనేకమైన; సంపత్ = సంపదలు; లాభముల్ = లభించుటను; వామనా = వామనుడా.
భావము:
“ఓ! వామనుడా! ధనమిచ్చేదాతలు అనేకులు ఉన్నారు. బ్రాహ్మణులు కోరిన సంపదలను పొందుతున్నారు. కానీ ఆ దాతలలో బలిచక్రవర్తితో సమానమైన మహాదాత లేడు. అతను శుక్రాచార్యుని అనుమతితో గొప్ప యాగాలు నూరు చేసాడు. అతనిని అడిగితే నీవు గొప్ప సంపద సంపాదించుకోవచ్చు.”