పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-517-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నబ్బాలునకు సంతసంబున మహర్షులు కశ్యపప్రజాపతిం బురస్కరించుకొని సముచితోపనయనకర్మ కలాపంబులు చేయించిరి; సవిత సావిత్రి నుపదేశించె, బృహస్పతి యజ్ఞోపవీతధారణంబునుఁ, గశ్యపుండు ముంజియుఁ, గౌపీనం బదితియు, ధరణి కృష్ణాజినంబును, దండంబు వనస్పతి యగు సోముండును, గగనాధిష్ఠానదేవత ఛత్రంబునుఁ, గమండలువు బ్రహ్మయు, సరస్వతి యక్షమాలికయు, సప్తర్షులు కుశపవిత్రంబులు నిచ్చిరి; మఱియును.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; బాలున్ = పిల్లవాని; కున్ = కి; సంతసంబునన్ = సంతోషముతో; మహర్షులు = మునీంద్రులు; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతిన్ = బ్రహ్మను; పురస్కరించుకొని = ముందుంచుకొని; సముచిత = తగినవిధముగ; ఉపనయన = వడుగు; కర్మకలాపంబులు = కార్యక్రమములు; చేయించిరి = జరిపించిరి; సవిత = సూర్యుడు; సావిత్రిన్ = గాయత్రీమంత్రమును; ఉపదేశించెన్ = ఉపదేశించెను {ఉపదేశము - అధికారదత్తపూర్వకముగ నేర్పుట}; బృహస్పతి = బృహస్పతి; యజ్ఞోపవీత = జంధ్యమును; ధారణంబును = ధరింపజేయుట; కశ్యపుండు = కశ్యపుడు; ముంజియున్ = ముంజిదర్భలు; కౌపీనంబున్ = గోచీని; అదితి = అదితి; ధరణి = భూదేవి; కృష్ణాజినంబును = నల్లజింకచర్మమును; దండంబు = దండమును; వనస్పతి = అడవికి అధిష్ఠానదేవత; అగు = అయిన; సోముండును = సోముడు; గగన = ఆకాశమునకు; అధిష్ఠానదేవత = అధికారి; ఛత్రంబును = గొడుగు; కమండలువున్ = కమండలమును; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; సరస్వతి = సరస్వతీదేవి; అక్షమాలిక = జపమాల; సప్తర్షులు = సప్తర్షులు; కుశపవిత్రంబులు = పవిత్రమైనదర్భలు; ఇచ్చిరి = ఇచ్చిరి; మఱియున్ = ఇంకను.

భావము:

అటు పిమ్మట, వామనుడికి వడుగు చేయడంకోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్నీ; కశ్యపుడు ముంజ (దర్భల మొలత్రాడునూ); అదితి కౌపీనాన్నీ (గోచీని); భూదేవి నల్లని జింకచర్మాన్నీ; చంద్రుడు దండాన్నీ; ఆకాశం గొడుగునూ; బ్రహ్మ కమండలాన్ని; సరస్వతీదేవి జపమాలనూ; సప్తఋషులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చారు.