పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-508-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చింతం బాసిరి యక్ష తార్క్ష్య సుమనస్సిద్ధోరగాధీశ్వరుల్
సంతోషించిరి సాధ్య చారణ మునీబ్రహ్మ విద్యాధరుల్
గాంతిం జెందిరి భానుచంద్రములు; రంద్గీత వాద్యంబులన్
గంతుల్ వైచిరి మింటఁ గింపురుషులున్ గంధర్వులుం గిన్నరుల్.

టీకా:

చింతన్ = శోకములను; పాసిరి = విడిచితిరి; యక్ష = యక్షులు; తార్క్ష్య = గరుడులు; సుమన = దేవతలు; సిద్ధ = సిద్ధులు; ఉరగ = నాగులు; అధీశ్వరులు = ప్రభువులు; సంతోషించిరి = సంతోషించిరి; సాధ్య = సాధ్యులు; చారణ = చారణులు; మునీశ = మునీశ్వరులు; బ్రహ్మ = ఋత్విజులు; విద్యాధరుల్ = విద్యాధరులు; కాంతిన్ = వికాశమును; చెందిరి = పొందిరి; భాను = సూర్యుడు; చంద్రములు = చంద్రుడు; రంగత్ = ఆనందపు; గీత = గీతములతోను; వాద్యంబులన్ = వాద్యములతోను; గంతుల్ = నాట్యములు; వైచిరి = చేసిరి; మింటన్ = ఆకాశమునందు; కింపురుషులున్ = కింపురుషులు; గంధర్వులున్ = గంధర్వులు; కిన్నరుల్ = కిన్నరలు.

భావము:

వామనుడు పుట్టటంతో యక్షులూ, గరుడులూ, దేవతలూ, సిద్ధులూ, నాగులూ తమ చింతలు అన్నీ విడిచిపెట్టారు. సాధ్యులూ, చారణులూ, ఋషులూ, ఋత్విజులూ, విద్యాధరులూ సంతోషించారు. సూర్య చంద్రులు మిక్కిలి ప్రకాశవంతులు అయ్యి కాంతులు విరజిమ్మారు. గంధర్వులూ, కిన్నరులూ, కింపురుషులూ వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు.