పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : వామను డవతరించుట

  •  
  •  
  •  

8-507-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు నద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండునుఁ బిశంగవర్ణవస్త్రుండును. మకరకుండల మండిత గండభాగుండును, శ్రీవత్సవక్షుండును, నళినచక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణికనకాంచిత కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండునుఁ, గమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరణుండునునై యవతరించిన సమయంబున.

టీకా:

మఱియున్ = ఇంకను; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; కమల = పద్మము; కలిత = ధరించిన; చతుః = నాలుగు (4); భుజుండునున్ = చేతులు గలవాడు; పిశంగ = కపిల; వర్ణ = రంగుగల; వస్త్రుండును = బట్టలుధరించినవాడు; మకరకుండల = మకరకుండలములచే {మకరకుండలములు - కర్ణాభరణ విశేషములు}; మండిత = మెరిసెడి; గండభాగుండును = చెక్కిళ్ళు గలవాడు; శ్రీవత్స = శ్రీవత్సము యనెడి మచ్చ; వక్షుండును = వక్షస్థలమున కలవాడు; నళిన = పద్మముల వంటి; చక్షుండును = కన్నులు కలవాడు; నిరంతర = ఎల్లప్పుడును; శ్రీ = సౌభాగ్యముతో; విరాజిత = విరాజిల్లెడి; రోలంబ = తుమ్మెదల; కదంబ = సమూహములుతో కూడిన; ఆలంబిత = ధరింపబడిన; వనమాలికా = వనమాలచే {వనమాల - పువ్వులు ఆకులు కలిపికట్టిన దండ}; పరిష్కృతుండును = అలంకరింపబడినవాడు; మణి = రత్నములు; కనక = బంగారము; అంచిత = పొదగబడిన; కాంచీ = మొలనూలు; వలయ = కడియాలు; అంగద = బాహుపురులు; కిరీట = కిరీటము; హార = హారములు; నూపురా = కాలిఅందెలుచే; అలంకృతుండును = అలంకరింపబడినవాడు; కమనీయ = అందమైన; కంఠ = మెడలో; కౌస్తుభ = కౌస్తుభమణి; ఆభరణుండును = ఆభరణముగా గలవాడు; నిఖిల = సమస్తమైన; జన = వారి; మనస్ = మనసులను; హరణుండును = ఆకర్షించువాడు; ఐ = అయ్యి; అవతరించిన = పుట్టిన; సమయంబున = సమయమునందు.

భావము:

వామనుడు జన్మించినప్పుడు అతనికి నాలుగు చేతులు ఆ చేతులలో శంఖమూ, చక్రమూ, గదా, పద్మమూ; కపిల రంగు వస్త్రమూ, మకరకుండలాలతో మెరిసే చెక్కిళ్ళు; రొమ్ముపై శ్రీవత్సమూ; కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు. తుమ్మెదలు మూగిన అందమైన వనమాల (వైజయంతి మాల) మెడలో వేళ్ళాడుతున్నది. రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణం బాహుపురులూ, కిరీటమూ, హారాలూ, కాలిఅందెలూ, కాంతులు వెదజల్లుతున్నాయి. కమనీయమైన మెడలో కౌస్తుభమణి మెరుస్తున్నది. అతని రూపం అఖిల జనుల మనస్సులను అకర్షిస్తున్నది.