పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : పయోభక్షణ వ్రతము

  •  
  •  
  •  

8-477-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భగవంతుం బరముం జనార్దనుఁ గృపాపారీణు సర్వాత్మకున్
జగదీశున్ హరి సేవజేయు మతఁడున్ సంతుష్టినిం బొంది నీ
కగు నిష్టార్థము లెల్ల నిచ్చు; నిఖిలార్థావాప్తి చేకూరెడిన్
భగవత్సేవలఁ బొందరాదె బహుసౌభాగ్యంబులం బ్రేయసీ!"

టీకా:

భగవంతున్ = భగవంతుని; పరమున్ = హరిని {పరముడు - సర్వాతీతమైవాడు, విష్ణువు}; జనార్దనున్ = హరిని {జనార్దనుడు - జనులను రక్షించువాడు, విష్ణువు}; కృపాపారీణున్ = దయాసముద్రుని; సర్వాత్మకున్ = హరిని {సర్వాత్మకుడు - సర్వులయందు వ్యాపించి యుండువాడు, విష్ణువు}; జగదీశున్ = హరిని {జగదీశుడు - లోకములకు ప్రభువు, విష్ణువు}; హరిన్ = హరిని {హరి – భక్తుల హృదయములను ఆకర్షించువాడు, విష్ణువు}; సేవ = ఆరాధన; చేయుము = చేయుము; అతడున్ = అతడు; సంతుష్టినిన్ = సంతోషమును; పొంది = పొంది; నీవు = నీ; కున్ = కు; అగు = ఉన్న; ఇష్టార్థముల్ = కోరికలు; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చున్ = ప్రసాదించును; నిఖిల = సమస్తమైన; అర్థ = ప్రయోజనముల; అవాప్తి = పొందుట; చేకూరెడిన్ = సమకూరును; భగవవత్ = భగవంతుని; సేవలన్ = కొలచుటవలన; పొందరాదె = పొందవలసినది; బహు = అనేకమైన; సౌభాగ్యంబులన్ = శుభములను; ప్రేయసీ = ప్రియురాలా.

భావము:

ప్రియురాలా! అదితీ! విష్ణుమూర్తి భగవంతుడూ, పురుషోత్తముడూ, జనార్దనుడూ, దయాసముద్రుడూ, సర్వాంతర్యామీ, జగదీశ్వరుడూ. కనుక అయనను ఆరాధించు. ఆయన సంతోషిస్తే చాలు. నీ కోరికలు అన్నీ తీరుస్తాడు. అన్ని ప్రయోజనాలూ నెరవేరుతాయి. అతనిని పూజించి సమస్త సంపదలను పొందు.”