అష్టమ స్కంధము : దితి కశ్యపుల సంభాషణ
- ఉపకరణాలు:
ప్రజలకు నెల్లను సముఁడవు
ప్రజలను గడుపారఁ గన్న బ్రహ్మవు నయ్యుం
బ్రజలందు దుష్టమతులను
నిజముగ శిక్షింప వలదె నీవు? మహాత్మా!
టీకా:
ప్రజల్ = సంతానమునకు; ఎల్లను = అందరిపట్లను; సముడవు = సమానంగ చూచువాడవు; ప్రజలను = సంతానమును; కడుపారన్ = కడుపునిండుగా; కన్న = పుట్టించినట్టి; బ్రహ్మవు = ప్రజాపతివి; అయ్యున్ = అగుటచేత; ప్రజల్ = పిల్లల; అందున్ = లో; దుష్ట = చెడు; మతులను = బుద్ధులు గలవారిని; నిజముగన్ = తప్పక; శిక్షింపవలదె = శిక్షించవలెనుకదా; నీవు = నీవు; మహాత్మా = గొప్పవాడా.
భావము:
మహాత్మా! కశ్యపా! బిడ్డలు అందరి ఎడలా నీవు సమానమైన వాడవు. ప్రేమతో బిడ్డలను కన్న ప్రజాపతివి కాబట్టి, నీవు దుర్మార్గులైన బిడ్డలను కనిపెట్టి దండించాలి కదా.