పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

అష్టమ స్కంధము : హరి హర సల్లాపాది

  •  
  •  
  •  

8-391-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"శ్రీకంఠా! నిను నీవ యేమఱకు మీ చిత్తంబు రంజించెదన్;
నాద్వేషుల డాఁగురించుటకునై నాఁ డేను గైకొన్న కాం
తాకారంబు జగద్విమోహనము నీకై చూచెదేఁ జూపెదం;
గైకో నర్హము లండ్రు కాముకులు సంల్పప్రభావంబులన్. "

టీకా:

శ్రీకంఠా = శంకరా; నినున్ = నిన్ను; నీవ = నీవే; ఏమఱకుమీ = పరాకుచెందనీకుము; చిత్తంబున్ = మనసును; రంజించెదన్ = సంతోషింపజేసెదను; నాకద్వేషులన్ = రాక్షసులను; డాగురించుట = మోహింపజేయుట; కున్ = కోసము; ఐ = అయ్యి; నాడున్ = ఆ దినమున; ఏను = నేను; కైకొన్న = స్వీకరించినట్టి; కాంత = స్త్రీ; ఆకారంబున్ = ఆకృతిని; జగత్ = లోకమునందు; విమోహనంబున్ = మిక్కిలి మోహింపజేయునది; నీ = నీ; కై = కోసము; చూచెదు = చూస్తానుఅనిన; ఏని = ఎడల; చూపెదన్ = చూపించెదను; కైకోన్ = అంగీకరించుటకు; అర్హములు = తగినవి; అండ్రు = అనెదరు; కాముకుల్ = కోరికలుగలవారు; సంకల్ప = సంకల్పము యొక్క; ప్రభావంబులన్ = ప్రభావములను.

భావము:

“మహేశ్వరా! క్షీరసాగరం మథన సమయంలో పుట్టిన గరళాన్ని కంఠాన ధరించి లోక క్షేమంకరమైన కంఠం గలవాడవై శ్రీకంఠునిగా ప్రసిద్ధుడైన వాడవు. నీమనస్సుకు సంతోషం కలిగిస్తాను తొందర పడవద్దు ఆనాడు రాక్షసులను మోసగించడం కోసం నేను ధరించిన మోహినీరూపం లోకాన్ని మోహింప జేసేది. దానిని నీవు చూడాలనుకుంటే చూపుతాను. మనసులో సంకల్పంగా పుట్టిన కోరికలు తీర్చుకోదగ్గవే కదా.”