అష్టమ స్కంధము : గజేంద్రుని దీనాలాపములు
- ఉపకరణాలు:
శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి-
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు; ఘోరునకు గూఢునకు గుణధర్మికి-
సౌమ్యున కధిక విజ్ఞాన మయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహు-
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి-
య జ్ఞాపకునకు దుఃఖాంత కృతికి
- ఉపకరణాలు:
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి, మహోత్తరునకు,
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.
టీకా:
శాంతున్ = శాంతి స్వరూపుని; కిన్ = కి; అపవర్గ = మోక్ష మందలి; సౌఖ్య = సౌఖ్యమును; సంవేది = బాగుగా తెలిసినవాని; కిన్ = కి; నిర్వాణ = మోక్షమునకు; భర్త = అధిపతి యైనవాని; కున్ = కి; నిర్ విశేషున్ = తనకు మించిన విశిష్టతలు లేనివాని; కున్ = కి; ఘోరున్ = దుష్టులకు భయంకరుని; కున్ = కి; గూఢున్ = సంసారబద్ధులకు అందరానివాని; కున్ = కు; గుణధర్మి = త్రిగుణముల ధర్మము గలవాని; కిన్ = కి; సౌమ్యున్ = వైషమ్యాదులు లేనివాని; కిన్ = కి; అధిక = విశేషమైన; విజ్ఞానమయున్ = విశిష్ఠ జ్ఞానము గలవాని; కిన్ = కి; అఖిల = సర్వ; ఇంద్రియ = ఇంద్రియ కార్యములను; ద్రష్ట = సాక్షిగా చూచెడివాని; కున్ = కి; అద్యక్షున్ = నిర్వికార అధిపతి; కిన్ = కి; బహు = వివిధము లైన; క్షేత్ర = జీవాత్మలకు; జ్ఞున్ = ఏకైక జ్ఞాత; కున్ = కు; దయ = దయ యనెడి; సింధు = సముద్రమువంటి; మతి = మనసు కలవాని; కిన్ = కి; మూలప్రకృతి = మూలపురుషుని {మూల ప్రకృతి - మూలాధార (ప్రధాన) ప్రకృతి (ఉపాదానభూతము కారణవిశేషము) ఐనవాడు}; కిన్ = కి; అఖిల = సకల; ఇంద్రియ = ఇంద్రియములను; జ్ఞాపకున్ = నడిపించెడివాని; కున్ = కి; దుఃఖ = దుఃఖమును; అంత = నశింపజేయుటలో; కృతి = నేర్పరుని; కిన్ = కి.
నెఱిన్ = చక్కగా; అసత్యము = అసత్యము; అనెడి = అనెడి; నీడ = నీడ; తో = తో; వెలుగుచున్ = ప్రకాశించుతు; ఉండు = ఉండెడి; ఎక్కటి = ఒంటరి; కిన్ = కి; మహోత్తరున్ = మిక్కిలి గొప్పవాని; కున్ = కి; నిఖిల = సమస్తమునకు; కారణున్ = బీజమైనవాని; కున్ = కి; నిష్కారణున్ = తనకి కారణభూతులు లేనివాని; కున్ = కి; నమస్కరింతున్ = నమస్కరించెదను; నన్ను = నన్ను; మనుచు = కాపాడుట; కొఱకు = కోసము.
భావము:
భగవంతుడు శాంతస్వరూపుడు. పరలోక సౌఖ్యప్రదాత. మోక్షానికి అధిపతి. నిర్విశేషుడు. దుష్టులకు భయంకరుడు. సంసారబద్దులకు అందనివాడు. సర్వ గుణ ధర్మాలు కలవాడు. సరళ స్వభావి. విశేషమైన జ్ఞానము కలవాడు. సర్వేంద్రియాల కార్యాలను చూసేవాడు. సమస్తానికి ప్రభువు. బహు క్షేత్రజ్ఞుడు. దయారసానికి సముద్రం వంటివాడు. సర్వానికి ఆది మూల పురుషుడు. ఆత్మకు ఆధారమైనవాడు. సకల ఇంద్రియాలకు నియామకుడు. దుఃఖాన్ని తొలగించేవాడు. మాయ అనే నీడతో ప్రకాశించే బహు నేర్పరి. మిక్కిలి గొప్పవాడు. సమస్తానికి ఆది బీజం అయినవాడు. తనకి మూల కారణం ఏది లేనివాడు. అట్టి ఆ దేవ దేవునికి నన్ను కాపాడ మంటూ నమస్కరిస్తున్నాను.