అష్టమ స్కంధము : ఉపోద్ఘాతము
- ఉపకరణాలు:

^
శ్రీమన్నామ! పయోద
శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా!
రామాజనకామ! మహో
ద్ధామ! గుణస్తోమధామ! దశరథరామా!
టీకా:
శ్రీమన్నామ = శ్రీరామ {శ్రీమన్నాముడు - శ్రీమత్ (మంగళవంతమైన) నామ (పేరు గలవాడు), రాముడు}; పయోదశ్యామ = శ్రీరామ {పయోద శ్యాముడు - పయోద (మేఘము వంటి) శ్యామ (నల్లనివాడు), రాముడు}; ధరాభృల్లలామ = శ్రీరామ {ధరాభృ ల్లలాముడు - ధరాభృత్ (రాజులలో) లలాముడు (శ్రేష్ఠమైనవాడు), రాముడు}; జగదభిరామ = శ్రీరామ {జగ దభిరాముడు - జగత్ (లోకములకు) అభి (మిక్కిలి) రాముడు (అందమైనవాడు), రాముడు}; రామాజనకామ = శ్రీరామ {రామాజన కాముడు - రామా (రమించునట్టి వారైన, స్త్రీ జన (జనులకు) కాముడు (మన్మథుని వంటివాడు, కోరబడు వాడు), రాముడు}; మహోద్ధామ = శ్రీరామ {మహోద్ధాముడు - మహా (గొప్ప) ఉద్ధాముడు (ఉద్ధరించెడివాడు), రాముడు}; గుణస్తోమధామ = శ్రీరామ {గుణస్తోమ ధాముడు - గుణస్తోమ (సుగుణములకు) ధాముడు (నెలవైనవాడు), రాముడు}; దశరథరామా = శ్రీరామ {దశరథ రాముడు - దశరథుని యొక్క కుమారుడైన రాముడు (ఆనందింప జేయువాడు), రాముడు}.
భావము:
మంగళకరమైన పేరు కలవాడా! మేఘం వంటి కాంతివంతమైన దేహం కలవాడా! రాజులలో బహు గొప్ప వాడా! ఆఖిలలోకాలలో అందమైన వాడా! స్త్రీలకు మన్మథుని వంటివాడా! బహుగంభీరమైన వాడా! సుగుణాలనే సంపదలకు నిలయమైన వాడా! దశరథకుమారుడైన శ్రీ రామచంద్రా! అవధరించు!