సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట
- ఉపకరణాలు:
"నరుఁడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుం డింతయున్
వరుసన్ నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముం జేసె మున్;
హరిభక్తాంఘ్రిపరాగ శుద్ధతను లేకాంతుల్ మహాకించనుల్
పరతత్త్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింప నీ జ్ఞానమున్.
టీకా:
నరుడు = నరుడుయనెడి ఋషి; తానునున్ = తను; మైత్రి = స్నేహము; తోన్ = తోటి; మెలగుచున్ = తిరుగుచు; నారాయణుండు = నారాయణుడనెడి ఋషి; ఇంతయున్ = ఇదంతా; వరుసన్ = క్రమముగా; నారద = నారదుడు యనెడి; సంయమి = మునులలో; ఈశ్వరున్ = గొప్పవాని; కున్ = కి; వ్యాఖ్యానమున్ = వివరించి చెప్పుట; చేసెన్ = చేసెను; మున్ = ఇంతకు పూర్వము; హరి = నారాయణ; భక్త = భక్తులయొక్క; అంఘ్రి = పాదముల; పరాగ = ధూళిచేత; శుద్ధ = పరిశుద్ధమైన; తనులు = దేహములు గలవారు; ఏకాంతుల్ = గహనమైన భక్తి గలవారు; మహాకించనుల్ = సర్వసంగవర్జితులు; పరతత్త్వజ్ఞులు = పరతత్త్వము తెలిసినవారు; కాని = తప్పించి ఇతరులు; నేరరు = సమర్థులు కారు; మదిన్ = మనసున; భావింపన్ = ఊహించుటకైనను; ఈ = ఈ; జ్ఞానమున్ = జ్ఞానమును.
భావము:
“పురాతన కాలంలో నరనారాయణులు అవతరించి మైత్రితో భూలోకంలో మెలగుతూ ఉన్నప్పుడు, నారాయణ మహర్షి ఈ జ్ఞానాన్ని నారద మహర్షికి బోధించాడు. హరి భక్తుల పాదధూళితో పవిత్రులు అయిన మహాత్ములూ, ఏకాగ్రచిత్తులూ, నిరాడంబరులూ, పరతత్వం తెలిసిన వాళ్లూ తప్పించి ఈ విషయాన్ని ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు.