సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము
- ఉపకరణాలు:
"అచ్చపుఁ జీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్టులై
చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁ జర్వితచర్వణు లైన వారికిం
జెచ్చరఁ బుట్టునే పరులు చెప్పిన నైన నిజేచ్ఛ నైన నే
మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరిప్రబోధముల్.
టీకా:
అచ్చపుజీకటిన్ = గాఢాంధకారము నందు; పడి = పడిపోయి; గృహవ్రతులు = గృహస్థులు; ఐన = అయినట్టి; విషయ = ఇంద్రియార్థములలో; ప్రవిష్టులు = లోలురు; ఐ = అయ్యి; చచ్చుచున్ = చనిపోతూ; పుట్టుచున్ = పుడుతూ; మరల = మరల; చర్వితచర్వణులు = తిరిగిచేయువారు {చర్వితచర్వణము - తిన్నదే మరల తినుట}; ఐన = అయిన; వారి = వారి; కిన్ = కి; చెచ్చెఱన్ = శ్రీఘ్రమే; పుట్టునే = కలుగునా ఏమి, కలుగదు; పరులు = ఇతరులు; చెప్పినన్ = చెప్పిన; ఐనన్ = ఐనప్పటికి; నిజేచ్ఛన్ = తనంతట తను; ఐనన్ = అయినను; ఏమి = ఏది; ఇచ్చినన్ = ఇచ్చిన; ఐనన్ = అయినను; కానల = అడవుల; కున్ = కి; ఏగినన్ = వెళ్ళిన; ఐనన్ = అప్పటికిని; హరి = నారాయణుని; ప్రభోదముల్ = జ్ఞానములు.
భావము:
“అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి, దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు, కోరికల వలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు. చస్తూ, పుడుతూ, మరల చస్తూ, పుడుతూ ఇలా ఈ సంసారచక్రంలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి విష్ణుభక్తి అంత సులువుగా పుట్టదు. ఇంకొకరు బోధించినా కలగదు; ఏమి ఆశ చూపించినా, ఎంతటి దానాలు చేసినా అంటదు; ఆఖరుకి అడవులలోకి పోయినా ఫలితం ఉండదు; అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా? చెప్పు. హరిభక్తి లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు ఫలించాలి.