సప్తమ స్కంధము : బ్రహ్మవరము లిచ్చుట
- ఉపకరణాలు:
అట్టళ్ళతోడఁ గోటలఁ
గట్టలుకం గూలఁ ద్రోచి క్రవ్యాదులతోఁ
జుట్టు విడిసి దిక్పాలుర
పట్టణములు గొనియె; నతఁడు బలమున నధిపా!
{అష్ట దిక్పాలకులు}
టీకా:
అట్టళ్ళ = బురుజుల; తోడన్ = తోటి; కోటలన్ = కోటలను; కట్ట = నిండు; అలుకన్ = కోపముతో; కూలద్రోచి = కూలగొట్టి; క్రవ్యాదుల = రాక్షసుల {క్రవ్యాదులు - క్రవ్యము (మాంసము) ఆదులు (భుజించువారు), రాక్షసులు}; తోన్ = తోటి; చుట్టువిడిసి = చుట్టుముట్టి; దిక్పాలుర = దిక్పాలకుల; పట్టణములున్ = పట్టణములను; కొనియెన్ = తీసుకొనెను; అతడు = అతడు; బలమునన్ = శక్తిసామర్థ్యములతో; అధిపా = రాజా.
భావము:
ధర్మరాజా! ఆ హిరణ్యకశిపుడు మితిమీరిన బలంతో, రాక్షసులను వెంటబెట్టుకొని బయలుదేరాడు. దిక్పాలకుల పట్టణాలమీద దాడిచేసాడు. వారి కోటలు, బురుజులు కూలగొట్టి ఆక్రమించుకొన్నాడు.