పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-221-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ప్రసన్నుండయిన సర్వేశ్వరుని సర్వంకషంబును మహాశ్చర్యధుర్యంబును నయి తేజరిల్లు దివ్యరూపంబుఁ గాంచి, భయంబును హర్షంబును విస్మయంబును జిత్తంబున ముప్పిరిగొని చొప్పు దప్పింపం దెప్పఱి, కప్పరపాటునం బుడమిపైఁ జాగిలంబడి, దండ ప్రణామంబు లాచరించి, కరకమలంబులు మొగిడ్చి సెలయేఱుల తొట్టునఁ గొట్టుపడి, యిట్టట్టుఁ బట్టుచాలక నిట్టపొడిచి, మున్నీరుదన్ని నిలచిన పెన్నీరునుం బోలె, సర్వాంగంబులుం దొంగిలింపఁ, జిత్తంబు నాత్మాయత్తంబుజేసి, పిక్కటిల్లిన సంతోషంబుచేత భగవంతుం బలుకను, నత్యంత మంగళ సందోహాపాదకంబు లైన తన్నామంబు లుగ్గడింపను, నతి నిర్మలంబులైన తదీయకర్మంబులు దడవను, విబుధ హర్షకరంబులైన తత్పౌరుషంబులు పొగడను, నాత్మీయ మనోరథంబు వాక్రువ్వను నోపక ప్రజాకాముండై యూరకున్న ప్రజాపతిం జూచి, సర్వజీవ దయాపరుండును, సర్వసత్త్వ హృదంతరస్థుండును, సర్వ జ్ఞుండునుం, గావున నతని భావంబు దెలిసి, జగన్నాథుం డార్తపోషణంబులైన భాషణంబుల నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రసన్నుండు = ప్రత్యక్షమైనవాడు; అయిన = అయిన; సర్వేశ్వరుని = నారాయణుని {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు (భగవంతుడు), విష్ణువు}; సర్వంకషంబును = సమస్తము నందు వ్యాపించినది; మహ = మిక్కిలి; ఆశ్చర్య = అద్భుతములకు; ధుర్యంబున్ = మూలమైనది; అయి = అయ్యి; తేజరిల్లు = ప్రకాశించెడి; దివ్య = దివ్యమైన; రూపంబున్ = స్వరూపమును; కాంచి = దర్శించి; భయంబును = భయమును; హర్షంబును = సంతోషమును; విస్మయంబును = ఆశ్చర్యమును; చిత్తంబున = మనసునందు; ముప్పిరిగొని = ముప్పేటలపెనగొని; చొప్పు = జాడ; తప్పింపన్ = తప్పిపొవునట్లుచేయగా; తెప్పఱి = తెప్పరిల్లి; కప్పరపాటునన్ = తొట్రుపాటుతో; పుడమి = భూమి; పైన్ = మీద; చాగిలంబడి = సాగిలబడి; దండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; కర = చేతులు యనెడి; కమలంబులు = పద్మములు; మొగిడ్చి = ముకుళించి; సెలయేఱుల = సెలయేళ్ళు; తొట్టునన్ = చెరువు కింది పొలములను; కొట్టుపడి = కొట్టుకుపోతూ; ఇట్టట్టు = ఇటు నటు ప్రక్కల; పట్టు = గట్లు; చాలక = సరిపడక; నిట్టపొడిచి = పొంగిపొర్లి; మున్నీరు = సముద్రమునకు; తన్ని = ఎగదన్ని; నిలిచిన = నిలబడిపోయిన; పెన్నీరునున్ = వరదనీరును; పోలె = వలె; సర్వాంగంబులు = సర్వావయవములు; తొంగిలింప = వశము తప్పగా; చిత్తంబున్ = మనసును; ఆత్మాయత్తంబు = తన వశములోనికి తెచ్చుకొనుట; చేసి = చేసికొని; పిక్కటిల్లిన = అతిశయించిన; సంతోషంబు = సంతోషము; చేత = వలన; భగవంతున్ = నారాయణుని; పలుకను = స్తుతించుటకు; అత్యంత = అత్యధికమైన; మంగళ = శుభముల; సందోహ = సమీకరములను; ఉపాదకంబులు = కలిగించునవి; ఐన = అయిన; తత్ = అతని; నామంబులు = నామములను; ఉగ్గడింపన్ = పలుకుటకు; అతి = మిక్కిలి; నిర్మలంబు = స్వచ్ఛము; ఐన = అయిన; తదీయ = అతని; కర్మంబులు = లీలలను; తడవను = అభివర్ణించను; విబుధ = దేవతలకు; హర్షకరంబులు = సంతోషకరములు; ఐన = అయిన; తత్ = అతని; పౌరుషంబులు = పరాక్రమములు; పొగడను = కీర్తించను; ఆత్మీయ = తన యొక్క; మనోరథంబు = మనసులోని కోరికను; వాక్రువ్వను = పలుకుటకు; ఓపక = సమర్థుడు కాకుండగ; ప్రజా = సంతానములను; కాముండు = కోరెడివాడు; ఐ = అయ్యి; ఊరకున్న = ఉరకుండిపోయిన; ప్రజాపతిన్ = ప్రజాపతిని; చూచి = చూసి; సర్వ = అఖిల; జీవ = ప్రాణులకు; దయాపరుండును = కృపావరుండును; సర్వ = అఖిలమైన; సత్త్వ = ప్రాణుల యొక్క; హృద = హృదయముల; అంతరస్థుండును = లోనుండు వాడును; సర్వజ్ఞుండును = సమస్తము తెలిసినవాడు; కావునన్ = కనుక; అతని = అతని యొక్క; భావంబు = ఉద్దేశ్యము; తెలిసి = తెలిసికొని; జగన్నాథుండు = నారాయణుడు {జగన్నాథుడు - జగత్ (భువనములకు) నాథుడు (ప్రభువు), విష్ణువు}; ఆర్త = ఆర్తులను; పోషణంబులు = పాలించెడివి; ఐన = అయిన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా ప్రత్యక్షమైన సర్వేశ్వరుని దివ్యరూపం అన్ని దిక్కులనూ ప్రాకాశింపజేస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. దానిని చూచిన దక్షుని హృదయంలో భయం, ఆనందం, ఆశ్చర్యం ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వం నుంచి తెప్పరిల్లి రెప్పపాటు కాలంలో స్వామికి సాష్టాంగ దండప్రణామం చేసాడు. చేతులు జోడించి నమస్కరించాడు. సెలయేళ్ళ కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహం వలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. పరవశించిన తన హృదయాన్ని ఎలాగో స్వాధీనం చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో మాట్లాడా లనుకున్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్ర నామాలను ఉచ్చరించా లనుకున్నాడు. పరమ పవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించా లనుకున్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని ప్రస్తుతించా లనుకున్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించా లనుకున్నాడు. కాని ఏమీ చేయలేక పోయాడు. ఆ ప్రజాకాముడైన దక్షప్రజాపతిని చూచి సర్వజ్ఞుడు, సర్వప్రాణి హృదయాంతర్యామి అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి ఆర్తజన పరిపోషకాలైన మాటలతో ఇలా అన్నాడు.