పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము

  •  
  •  
  •  

6-216-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పూని మనంబునుం దనువు భూతములున్ మఱి యింద్రియంబులుం
బ్రాములున్ వివేక గతిఁ బాయక యన్యముఁ దమ్ము నెమ్మెయిం
గానఁగనేర వా గుణనికాయములం బరికించునట్టి స
ర్వానుగతున్ సమస్తహితు నాదిమపూరుషు నాశ్రయించెదన్.

టీకా:

పూని = తగిలి; మనంబునున్ = మనసు; తనువు = దేహము; భూతములున్ = పంచభూతములు; మఱి = ఇంకా; ఇంద్రియంబులున్ = పంచేంద్రియములు; ప్రాణములున్ = పంచప్రాణములును; వివేకగతిన్ = దేహాత్మాది విభేద జ్ఞానము; పాయక = విడువక; అన్యమున్ = అతీతమైన పరమాత్మను; తమ్మున్ = తాముగా; ఎమ్మెయిన్ = ఏ విధముగను; కానగనేరవు = కనుగొనలేవు; ఆ = ఆ; గుణ = గుణముల; నికాయములన్ = సమూహములను; పరికించు = చూసెడి; అట్టి = అటువంటి; సర్వానుగతున్ = నారాయణుని {సర్వానుగతు - అఖిలమును అనుసరించు వాడు, విష్ణువు}; సమస్తహితున్ = నారాయణుని {సమస్త హితుడు – సమస్త మైన వారికి హితుడు, విష్ణువు}; ఆదిమపూరుషున్ = నారాయణుని {ఆదిమ పూరుషుడు - ఆదిమ (సృష్టికి మూలము యైన) పూరుషుడు (పురుషోత్తముడు), విష్ణువు}; ఆశ్రయించెదన్ = ఆశ్రయించెదను.

భావము:

మనస్సు, దేహం, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు కలిగి ఉన్న జీవులు ఈ దేహమే తాము అనుకుంటున్నారు. ఆ భావంతోనే అంతర్యామిని గుర్తింపలేక ఉన్నారు. వారికి వివేకబుద్ధి ప్రాప్తించినపుడు ఇంద్రియాదులు వేరని, జీవుడు వేరని తెలుసుకుంటున్నారు. ఈ సృష్టి నంతటినీ పరికించేవాడు, సమస్తానికి మూలమైనవాడు విశ్వహితుడు అయిన ఆదిపురుషుని ఆశ్రయిస్తున్నాను.