షష్ఠ స్కంధము : హంసగుహ్య స్తవరాజము
- ఉపకరణాలు:
"పరమునికి వందన మొనర్తుఁ బరిఢవించి
మున్నవితథానుభూతికి మ్రొక్కికొందు;
మెఱయు గుణములఁ దేలు నిమిత్తమాత్ర
బంధువై నట్టి వానికిఁ బ్రణతు లిడుదు.
టీకా:
పరముని = నారాయణుని {పరముడు - సర్వమునకు అతీతమైన వాడు, విష్ణువు}; కి = కి; వందనము = నమస్కారము; ఒనర్తు = చేసెదను; పరిఢవించి = విశేషించి; మున్న = ముందుగా; అవితథానుభూతి = పరమాత్మ {అవితథానుభూతి - అవితథ (అసత్యము కాని, యథార్థమైన, వ్యర్థము కాని) అనుభూతి యైన వాడు, ఆత్మానుభూతి యైన వాడు)}; కి = కి; మ్రొక్కికొందు = కొలిచెదను; మెఱయు = ప్రకాశించెడి; గుణములన్ = గుణములలో; తేలు = తేలుచుండెడి; నిమిత్తమాత్ర = నామమాత్రపు; బంధువు = బంధువు; ఐనట్టి = అయినట్టి; వాని = వాని; కిన్ = కి; ప్రణతులు = నమస్కారములు; ఇడుదు = చేసెదను.
భావము:
“ముందుగా పరమేశ్వరునికి విశేషించి నమస్కరిస్తున్నాను. అనుభూతియే ఆకారమైన వానికి మ్రొక్కుతున్నాను. గుణవంతుడై విరాజిల్లుతూ నిమిత్తమాత్రంగా బంధురూపంలో ఉన్నవానికి ప్రణామాలు చేస్తున్నాను.