షష్ఠ స్కంధము : అజామిళోపాఖ్యానము
- ఉపకరణాలు:
ఆ లీలావతి గండపాళికలపై హాసప్రసాదంబు పై
నాలోలాలక పంక్తి పై నళికపై నాకర్ణ దృగ్భూతి పై
హేలాపాది కుచద్వ యోరు కటిపై నిచ్చల్ పిసాళింపఁగా
జాలిం బొందుచు నాత్మఁ గుందుచు మనోజాతానలోపేతుఁడై.
టీకా:
ఆ = ఆ; లీలావతి = విలాసవతి యొక్క; గండపాళికల = నిండు చెక్కిళ్ళ; పైన్ = మీద; హాసప్రసాదంబు = చిరునవ్వు చిలకరింపు; పైన్ = మీద; ఆలోల = ఊగుతున్న; అలక = ముంగురులు; పంక్తి = వరుసల; పైన్ = మీద; అళిక = నుదురు; పైన్ = మీద; ఆకర్ణ = చెవులవరకు సాగిన; దృక్ = కన్నుల; భూతి = వైభవము; పై = మీద; హేల = విలాసములు; ఆపాది =కలిగించు; కుచ = స్తనముల; ద్వయ = జంట; ఊరు = తొడలు; కటి = కటిప్రదేశముల; పై = మీద; ఇచ్చల్ = కోరికలు; పిసాళింపగా = చెలరేగుతుండగా; జాలిన్ = జాలిని; పొందుచు = చెందుతూ; ఆత్మన్ = మనసున; కుందుచున్ = కుంగిపోతూ; మనస్ = మనసున; జాత = పుట్టిన; అనల = అగ్ని; ఉపేతుడు = కలవాడు; ఐ = అయ్యి.
భావము:
అప్పటినుండి అజామిళుడు ఆమె చిక్కని చెక్కిళ్ళను, చక్కని చిరునవ్వును, కదులుతున్న ముంగురులను, నున్నని నుదురును, చెవులదాకా వ్యాపించిన వాల్గన్నులను, బిగువైన కుచాలను, విశాలమైన కటి ప్రదేశాన్ని మాటిమాటికి స్మరింపసాగాడు. అతని మనస్సులో ఆమెను పొందాలనే కోరిక చెలరేగింది. దిగులుతో క్రుంగిపోయాడు. విచారించాడు. కామావేశానికి లోనయ్యాడు.