పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : మరుద్గణంబుల జన్మంబు

  •  
  •  
  •  

6-510-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రనాథ! విను తన నందను లందఱు-
మరేంద్రుచే హతు గుచు నుండఁ
గోపశోకంబులఁ గ్రుళ్ళుచుఁ దనలోన-
మండుచు దితి చాల ఱుఁగఁ దొడఁగె;
భ్రాత్రు హంతకుఁ డతి పాతకుం డీ యింద్రుఁ-
జంపక నా కేల సొంపు గలుగు?
వీని భస్మము చేయువానిఁగా నొక సుతుఁ-
డసెద నని చాల ర్తఁ గోరి

6-510.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రియము చేయఁదొడఁగెఁ బెక్కు భావంబుల
భాణముల నధికపోణముల
క్తియుక్తిచేతఁ రిచర్యగతిచేత
నుతులచేత నతుల తులచేత.

టీకా:

నరనాథ = రాజా; విను = వినుము; తన = తన యొక్క; నందనులు = పుత్రులు; అందఱున్ = అందరు; అమరేంద్రున్ = దేవేంద్రుని; చేన్ = చేత; హతులు = మరణించినవారు; అగుచునుండ = అగుచుండగ; కోప = కోపము; శోకంబులన్ = శోకములతో; క్రుళ్ళుచున్ = దుఃఖించుచు; తన = తన మనసు; లోనన్ = అందు మండుచున్ = తపించుచు; దితి = దితి; చాలన్ = మిక్కిలి; మఱుగన్ = దుఃఖించుచుండెను; భ్రాత్రు = సోదరులను; హంతకుండు = సంహరించెడివాడు; అతి = మహా; పాతకుండు = పాపి; ఈ = ఈ; ఇంద్రున్ = ఇంద్రుని; చంపక = సంహరించక; నా = నా; కున్ = కు; ఏల = ఎందులకు; సొంపు = సుఖము; కలుగు = కలుగును; వీనిన్ = వీనిని; భస్మము = నాశనము; చేయు = చేసెడి; వానిగా = వాడిని; ఒక = ఒక; సుతున్ = పుత్రుని; పడసెదను = పొందెదను; అని = అని; చాలన్ = మిక్కిలి; భర్తన్ = భర్తను; కోరి = కోరి;
ప్రియము = ప్రీతి; చేయ = చేయ; తొడగెన్ = సాగెను; పెక్కు = అనేక; భావములన్ = విధములుగ; భాషణములన్ = మాటలతోను; అధిక = మిక్కిలిగా; పోషణములన్ = పోషించుటచేత; భక్తి = భక్తిచేత; యుక్తి = నేర్పుల; చేతన్ = చేత; పరిచర్య = సేవించెడి; గతి = విధముల; చేతన్ = వలన; నుతుల = స్తుతుల; చేతన్ = వలన; అతుల = సాటిలేని; రతుల = సంభోగసుఖముల; చేతన్ = వలన.

భావము:

“రాజా! విను. తన కుమారులైన దైత్యులందరూ ఇంద్రునిచేత సంహరింప బడటం చూచి దితి హృదయం కోపతాపాలతో క్రుళ్ళిపోయి, లోలోపల ఎన్నో విధాలుగా పరితపించింది. “ఈ ఇంద్రుడు సోదర ఘాతకుడైన మహాపాపి. ఇతనిని హతమారిస్తేనే కాని నా హృదయానికి శాంతి లేదు. ఈ పరమ దుర్మార్గుణ్ణి భస్మం చేయగల కొడుకును కనాలి” అని ఆమె నిశ్చయించుకొని, తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని అనేక విధాల హావభావాలు ప్రదర్శిస్తూ, మృదుమధుర భావాలతో, భక్తి ప్రపత్తులతో కూడిన పరిచర్యలతో, పొగడ్తలతో, సరస సంభోగ క్రీడలతో రంజింపసాగింది.